cybercriminals
-
రష్యన్ సైబర్ నేరస్తుడిని విడుదల చేసిన అమెరికా
వాషింగ్టన్: రష్యాతో సంబంధాలను పునరుద్ధరించడానికి, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఖైదీల మార్పిడిలో భాగంగా బుధవారం రష్యాకు చెందిన సైబర్ నేరస్థుడు అలెగ్జాండర్ విన్నిక్ను అమెరికా విడుదల చేసింది. అమెరికన్ ఉపాధ్యాయుడు మార్క్ ఫోగెల్ను రష్యా విడుదల చేసినందుకు ప్రతిగా విన్నిక్ను విడుదలచేసినట్లు తెలుస్తోంది. విన్నిక్ మనీలాండరింగ్ ఆరోపణలపై 2017లో గ్రీస్‌లో అరెస్టయ్యారు. ఆయనను గ్రీస్ 2022లో అమెరికాకు అప్పగించింది. తన క్రిప్టోకరెన్సీ ఎక్సే్ఛంజ్ బీటీసీ–ఈ ద్వారా రాన్సమ్వేర్ దాడులు, ఐడీ చోరీ, మాదకద్రవ్యాల ముఠాలతో సంబంధాలు, ఇతర నేరాల ద్వారా 4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నందుకు మనీలాండరింగ్ చట్టాల కింద విన్నిక్పై కేసులు నమోదయ్యాయి. ఈ నేరాలను విన్నిక్ 2024 మేలో అంగీకరించాడు. అప్పటినుంచి జైలులో ఉన్నారు. మొత్తం 11 మంది విడుదల ఫోగెల్ విడుదల ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి తాము సరైన దిశలో వెళ్తున్నామనడానికి సంకేతమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్టŠజ్ అన్నారు. ఖైదీల మార్పిడి అమెరికా, రష్యాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పడానికి సహాయపడిందని రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. ఇవి పరస్పర నమ్మకాన్ని పెంపొందించే చర్యలే తప్ప ఉక్రెయిన్ కోణంలో చేస్తున్న పనులు కావని ఆయన స్పష్టంచేశారు. రష్యాకు సన్నిహిత మిత్రదేశమైన బెలారస్లో జైలు శిక్ష అనుభవిస్తున్న మరో అమెరికా పౌరుడిని కూడా విడుదల చేసినట్లు అమెరికా అధ్యక్షభవనం బుధవారం ప్రకటించింది. బెలారస్లో అన్యాయంగా నిర్బంధించబడిన ఒక అమెరికన్‌ను, ఇద్దరు రాజకీయ ఖైదీలు విడుదల అయ్యారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇతర దేశాల్లోని అమెరికా పౌరుల విడుదలకు కృషిచేస్తున్నామని రూబియో చెప్పారు. ఇవి ట్రంప్ మధ్యవర్తిత్వ సామర్థ్యానికి నిదర్శనమని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. గత నెలాఖరులో ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విదేశ కారాగారాల నుంచి ఇప్పటిదాకా 11 మంది అమెరికన్లు విడుదలయ్యారు. -
వృద్ధుడైనా వణకలేదు!
బంజారాహిల్స్ (హైదరాబాద్): సైబర్ నేరగాళ్లు బెదిరిస్తే చదువుకున్నవాళ్లు, ఐటీ ఉద్యోగులు, యువతే బెదిరిపోయి వారి వలలో ఇరుక్కుని లక్షల్లో నష్టపోతున్నారు. అయితే ఓ 80 ఏళ్ల వృద్ధుడు మాత్రం వాళ్ల మోసాన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా, భారీ ఆర్థిక నష్టం నుంచి తప్పించుకున్నాడు. వివరాలు...బంజారాహిల్స్ రోడ్డునంబర్ 12లో నివాసం ఉండే పెంచికల రఘునందన్‌రెడ్డి (80)ని శంకర్‌కుమార్ అనే వ్యక్తి సంప్రదించాడు. ప్రోస్టేట్ కేన్సర్‌కు ఆయుర్వేద చికిత్స గురించి తెలియజేస్తూ, తన తండ్రికి పూర్తిగా నయమైందంటూ నమ్మబలికాడు. ఆ తర్వాత అశోక్ యాదవ్ అనే వ్యక్తి 4వ తేదీన రఘునందన్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. మీ గురించి శంకర్‌కుమార్ చెప్పాడని, ఇంట్లో ఆయుర్వేద కషాయాన్ని తయారుచేయమని వృద్ధుడిని బలవంతం చేశాడు. అనంతరం రఘునందన్‌రెడ్డిని వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఓ ఆయుర్వేద దుకాణానికి తీసుకువెళ్లాడు. అక్కడ మనోజ్ అనే వ్యక్తి వివిధ మూలికలతో కూడిన మందుల ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఆ మొత్తం దాదాపు రూ.9,26,820 కాగా, అడ్వాన్స్‌గా రూ.76,800ల నగదు, రూ.7,50,000లకు చెక్కును రఘునందన్‌రెడ్డి ఇచ్చాడు. అయితే శంకర్‌కుమార్ తన తండ్రి చికిత్సకు రూ.40 వేలు మాత్రమే ఖర్చయ్యాయని చెప్పిన విషయం రఘునందన్‌రెడ్డికి గుర్తుకువచ్చి తనను మోసం చేశారని గ్రహించాడు. దీంతో బ్యాంకుకు వెళ్లి చెక్కు చెల్లింపులను నిలిపివేయించాడు.లైన్లోకి సైబర్ నేరగాళ్లు..దీంతో నిందితులు ఇచ్చిన సమాచారంతో ఆ తర్వాత నుంచి ఢిల్లీ పోలీసులమని, సీబీఐ అధికారినంటూ కొందరు రఘునందన్‌రెడ్డికి ఫోన్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. నీపై మనీ లాండరింగ్ యాక్ట్ కేసు నమోదైందని, వెంటనే రూ.25 లక్షలు పంపించకపోతే డిజిటల్ అరెస్టు చేస్తామంటూ బెదిరించారు. వీడియో కాల్లో సైబర్ నేరస్తుడు పోలీసు ఆఫీసర్ డ్రెస్‌లో బెదిరించి దడదడలాడించినా రఘునందన్‌రెడ్డి తొణకలేదు. ఇలా గంట, రెండు గంటలు కాదు..ఏకంగా ఐదున్నర గంటల పాటు వృద్ధుడిని ఇబ్బంది పెట్టారు. ఇదంతా సైబర్ మోసగాళ్ల పనిగా గ్రహించిన వృద్ధుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేన్సర్‌కు ఆయుర్వేద మందు పేరుతో తనను మోసగించిన వ్యక్తులే తన నుంచి పూర్తి వివరాలు రాబట్టి సైబర్ మోసగాళ్లకు సమాచారం ఇచ్చి లక్షలు లాక్కోవాలని పథకం వేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు శంకర్‌కుమార్, అశోక్‌యాదవ్, మనోజ్‌లతో పాటు రాపిడో ఏజెంట్‌పై కేసు నమోదు చేశారు. -
ఓటీపీ లేకుండానే నగదు మాయం చేశారు!
సాక్షి, హైదరాబాద్: ఇదో చిత్రమైన సైబర్ కేసు. బాధితురాలి బ్యాంకు ఖాతా నుంచి డబ్బు ఎలా మాయమైందో ఆమెకే కాదు... సైబర్ క్రైమ్ పోలీసులకూ అంతుచిక్కట్లేదు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. అసలేం జరిగిందంటే.. నగరానికి చెందిన ఓ గృహిణిని (59) ఫేస్‌బుక్‌లోని ప్రకటన ఆకర్షించింది. మహిళలకు సంబంధించిన వస్త్రాలను తక్కువ ధరలకు విక్రయిస్తున్నామనేది దాని సారాంశం. ఆ వ్రస్తాలు ఖరీదు చేయడానికి ఆసక్తిచూపిన ఆమె, ప్రకటన ఇచ్చిన వారిని సంప్రదించారు. తన కావాల్సినవి ఆర్డర్ ఇవ్వడంతో పాటు రూ.1.5 లక్షలు చెల్లించారు. ఆపై ఆ గృహిణికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు డెలివరీ చేయాల్సిన బాయ్ అనారోగ్యానికి గురయ్యాడని, ఫలితంగా సరుకు అందించలేకపోతున్నామని వివరణ ఇచ్చారు. ఈ కారణంగా మీరు చెల్లించిన మొత్తం రిఫండ్ చేస్తున్నామని అన్నారు. దానికోసం బ్యాంకు ఖాతాను సరిచూసుకోవాల్సి ఉందంటూ రెండు దఫాల్లో రూ.1, రూ.10 బదిలీ చేశారు. ఆ మొత్తం చేరిందా? లేదా? అనేది ఆమెను సంప్రదించి ఖరారు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా... ఆ తరువాత బాధితురాలి ఖాతాలో ఉండాల్సిన రూ.1,38,171 మాయమయ్యాయి. తనకు ఎలాంటి ఓటీపీ రాలేదని, అయినప్పటికీ డబ్బు పోయిందంటూ ఆమె శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. ఈ స్కామ్ ఎలా జరిగిందో అర్థంకాక తలలు పట్టుకుంటున్న పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. సైబర్ నేరాల అవగాహనకు ‘మూడు కోతులు’సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ‘డిజిటల్ ఏజ్ త్రీ మంకీస్’ను తెరపైకి తెచ్చారు. నాటి మూడు కోతులు ‘చెడు మాట్లాడ వద్దు–చెడు చూడవద్దు–చెడు వినవద్దు’అంటే.. నేటి ఈ ‘డిజిటల్ కోతులు ‘ఎవరికీ ఓటీపీ చెప్పవద్దు–తెలియని లింకులు తెరవద్దు–నకిలీ ఫోన్ కాల్స్ వినవద్దు’అంటున్నట్లుగా రూపొందించారు. దీన్ని తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా విçస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. -
జినెస్మెన్ అలర్ట్!
సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు..వ్యాపారవేత్తలు, సంస్థలను కూడా తరచూ టార్గెట్ చేస్తున్నారు. వారి సర్వర్లలోకి చొరబడి విలువైన డేటాను తస్కరించడంతోపాటు ర్యాన్సమ్వేర్ ఎటాక్స్‌తో అందినకాడికి దోచుకుంటున్నారు. బిజినెస్ ఈ–మెయిల్స్‌ను కాంప్రమైజ్ (బీఈసీ) చేయడం ద్వారా ఈ నేరాలకు బీజం పడుతోందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులుచెబుతున్నారు. ఈ నేరాలను ఎలా కనిపెట్టాలనే అంశంపై కీలకసూచనలు చేస్తూ మంగళవారం బుక్‌లెట్‌ను విడుదల చేశారు. - సాక్షి, హైదరాబాద్1. ఇటీవల పలువురికి సైబర్ నేరగాళ్ల నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నట్లుచెప్తున్న సైబర్ నేరగాళ్లు.. అసాంఘికకార్యకలాపాల్లో మీ పేరుతో ఉన్ననంబర్ల వినియోగం జరిగిందని? కొన్నిగంటల్లోనే అన్ని నంబర్లు బ్లాక్ చేస్తున్నామని చెప్తున్నారు.ఆయా సెల్‌ఫోన్ నంబర్లు,హ్యాండ్ సెట్లకు సంబంధించినఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫికేషన్ (ఐఎంఈఐ) నంబర్లను పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీల సూచనలతో బ్లాక్ చేస్తుంటారు. ఈ పని ట్రాయ్ చేయదు.. ఆయా సర్వీస్ ప్రొవైడర్లు చేస్తుంటారు. 2 కస్టమ్స్, కొరియర్ సంస్థల పేరుతోనూ ఫోన్లు వస్తున్నాయి. మీ పేరుతో వస్తున్న పార్శిల్లోనిషేధిత వస్తువులు, డ్రగ్స్ ఉన్నాయని.. వెంటనే నిర్ణీతమొత్తం చెల్లించకుంటే కేసుఅవుతుందని బెదిరిస్తున్నారు. మీరు ఏ వస్తువునూ ఎక్కడకీపంపనప్పుడు భయపడాల్సిన పని లేదు. నిషేధిత వస్తువులు, డ్రగ్స్‌తో ముడిపడి ఉన్న కేసుల్లో జరిమానా చెల్లిస్తే బయటపడటం జరగదు. కస్టమ్స్ సహా ఏ ఏజెన్సీ కూడా ఇలా ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేయదు. 3 మీ బంధువులు మనీ లాండరింగ్, డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్నారని, వారిని అరెస్టు చేస్తున్నామని ఫోన్లు చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. డబ్బు డిమాండ్ చేస్తున్నారు. వీడియో కాల్ చేసి, ఆ మొత్తం చెల్లించే వరకు డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు చెప్తుంటారు.దేశంలోని ఏ పోలీసు, ఏజెన్సీ డిజిటల్ అరెస్టు చేయదు. ఇప్పటివరకు అమలులోకి వచ్చిన, అమలులో ఉన్న ఏ చట్టంలోనూ దీని ప్రస్తావన లేదు. ఇలాంటి కాల్స్ వస్తే నమ్మొద్దు.4బ్యాంకు అధికారులు, ఏజెంట్లుగా చెప్పుకుంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. కేవైసీ అప్డేట్, రివార్డ్ పాయింట్స్ రీడీమ్ అంటూ వ్యక్తిగత వివరాలు తీసుకుని బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తుంటారు.బ్యాంకులు, ఆర్థికసంస్థలు ఫోన్లు చేసి కేవైసీలు అడగవు. వ్యక్తిగతంగాసంబంధిత శాఖకు వచ్చి ఇవ్వమని చెప్తారు. బీఈసీ సంకేతాలు ఏంటి?» కొత్త ఈ–మెయిల్ ఐడీ నుంచి మెయిల్స్ రావడం. » బిజినెస్ ఈ–మెయిల్స్ పాస్వర్డ్స్ వ్యాపారులు,» ఆయా సంస్థల ప్రమేయం లేకుండా మారిపోవడం. » అనుమానిత సమయాలు, అనుమానాస్పద ప్రాంతాల నుంచి బిజినెస్ ఈ–మెయిల్స్‌లోకి లాగిన్ కావడానికి ప్రయత్నాలు జరగడం. » గుర్తుతెలియని వ్యక్తులు కంపెనీ డేటాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించడం.ఈ–మెయిల్స్ కాంప్రమైజ్ అయినట్లు గుర్తించడం ఎలా?సాధారణంగా బీఈసీ కోసం వాడే వైరస్‌తో ఈ–మెయిల్స్‌ను నేరగాళ్లు అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారుజామున(ఆడ్ అవర్స్) పంపిస్తూ ఉంటారు. ఆయా వేళల్లో అసాధారణ ఈ–మెయిల్ ఐడీలనుంచి మెయిల్స్ వస్తే అనుమానించాల్సిందే.ఒకేసారి కొత్త ఈ–మెయిల్ ఐడీలకు భారీగా డేటా బదిలీ కావడం, సున్నిత అంశాలతో కూడిన ఫైల్స్ వేళకాని వేళల్లో అధికారిక మెయిల్ ద్వారా బయటకు వెళితే అనుమానించాలి. పరిశీలించాల్సిన అంశాలు ఏంటి?» ఒకేసారి హఠాత్తుగా పెద్ద సంఖ్యలో ఈ–మెయిల్స్ వస్తుంటే బీఈసీని అనుమానించాల్సిందే. ఆ ఈ–మెయిల్స్‌లోని ప్రతి అక్షరాన్నీ నిశితంగా పరిశీలించాలి. » ‘వైర్ ట్రాన్స్ఫర్’, ’అర్జంట్ పేమెంట్’, ‘బ్యాంక్ అకౌంట్ చేంజ్డ్’తదితర పదాలతో వచ్చే ఈ–మెయిల్స్ విషయంలో మరింతఅప్రమత్తంగా ఉండాలి. వ్యాపారుల ఖాతాలకు బదులు తమ బ్యాంకు ఖాతాల వివరాలు పంపే సైబర్ నేరగాళ్లు చేసేఈ నేరాలను అకౌంట్ టేకోవర్ ఫ్రాడ్స్ అంటారు. కంప్యూటర్లలో బీఈసీ జరిగితే ఏం చేయాలి?» మాల్వేర్, వైరస్‌తో కూడిన ఈ–మెయిల్ ద్వారా బీఈసీ అయిన కంప్యూటర్ను ఇంటర్నల్ ల్యాన్ లేదా వీపీఎన్ నుంచి డిస్కనెక్ట్ చేయాలి. » అనుమానాస్పద ఐడీ అడ్రస్‌లు, ఈ–మెయిల్ ఐడీలను తక్షణం బ్లాక్ చేయాలి. కాంప్రమైజ్ అయినట్లు అనుమానిస్తున్న ఈ–మెయిల్ ఖాతాలను డిజేబుల్ చేయాలి. యాక్సెస్కంట్రోల్స్ను పెంచడంతో పాటు ఫోరెన్సిక్ ఆధారాల కోసం సదరు కంప్యూటర్, ఈ–మెయిల్లోని ఆధారాలను భద్రపరచాలి. -
మనీ‘ముల్లు’!
చిరువ్యాపారులకు గుచ్చుకుంటున్నఏపీలోని కాకినాడ జిల్లా గొల్లల మాడిడాడకు చెందిన ఓ చిరువ్యాపారి బ్యాంక్ ఖాతాను రాచకొండ పరిధిలోని మేడిపల్లి పోలీసులు ఫ్రీజ్ చేశారు. అదే రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన ఓ సెల్‌ఫోన్ వ్యాపారి బ్యాంకు ఖాతాను చెన్నైకి చెందిన సైబర్ క్రైం అధికారులు ఫ్రీజ్ చేశారు. - సాక్షి, హైదరాబాద్ఈ రెండే కాదు... అనేక సందర్భాల్లో ఇలాంటి చిన్నచిన్న వ్యాపారస్తులు ఇబ్బందులు పడటానికి మనీమ్యూల్స్, వారు సాగిస్తున్న లావాదేవీలే కారణం అవుతున్నాయి. సైబర్ నేరాలకు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలు జరిగిన ఖాతాల ఫ్రీజింగ్, డీ–ఫ్రీజింగ్ విషయంలో స్పష్టత లేకపోవడం, దీన్ని ఆర్బీఐ పట్టించుకోకపోవడం, ప్రతి వ్యాపారికీ కోర్టుకెళ్లి న్యాయ పోరాటం చేసే అవకాశం లేకపోవడమే ఈ ఇబ్బందులకు కారణం అవుతోంది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ (ఎన్సీఎస్సార్సీ) సైతం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్‌తో (ఐ4సీ) కలిసి పనిచేస్తోంది.ఎవరీ మనీమ్యూల్స్ఏ సైబర్ నేరంలో అయినా సైబర్ నేరగాళ్ల ప్రధాన లక్ష్యం బాధితుల నుంచి అందినకాడికి దండుకోవడమే. ఇటీవల కాలంలో ఎక్కువగా సైబర్ నేరాలన్నీ విదేశాల నుంచే జరుగుతున్నాయి. అయితే కొల్లగొట్టిన సొమ్మును తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నా లేదా వాటితో లింకై ఉన్న ఫోన్ నంబర్లకు బదిలీ చేయించుకున్నా పోలీసులకు ఆధారాలు లభిస్తాయి. దీంతో సైబర్ నేరగాళ్లకు స్థానికంగా ఉండే కరెంట్ బ్యాంకు ఖాతాల అవసరం ఏర్పడుతోంది. ఇందుకోసం సైబర్ నేరస్తులు కమీషన్ ఆశచూపి స్థానికంగా ఉండే కరెంట్ బ్యాంకు ఖాతాలున్న చిన్న, మధ్యతరహా సంస్థల వ్యాపారులను ట్రాప్ చేస్తున్నారు. ఇలా తెలిసో, తెలియకో బ్యాంకు ఖాతాల వివరాలను సైబర్ నేరగాళ్లకు అందించి కమీషన్‌ను పొందే వారిని మనీమ్యూల్స్ అంటారు. మనీమ్యూల్స్‌కు అడ్వాన్స్‌గా రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ముట్టజెబుతున్న సైబర్ నేరస్తులు తమ ‘పని’కానిచ్చాక 10 నుంచి 15 శాతం కమీషన్‌ను మనీమ్యూల్స్‌కు సంబంధించిన ఇతర ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. కమీషన్ ఖర్చు చేయడానికి కొత్త మార్గాలు మనీమ్యూల్స్ సైతం కమీషన్‌గా తమకు ముట్టే నగదును ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ మొత్తం పడే బ్యాంకు ఖాతాలను బోగస్ వివరాలతో తెరుస్తున్నారు. అలాగే తమ పేర్లతో లేని సిమ్‌కార్డుల ఆధారంగా పనిచేసే ఫోన్ నంబర్లతోపాటు సెకండ్ హ్యాండ్ ఫోన్లలో యూపీఐ యాప్స్‌ను యాక్టివేట్ చేసుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వాటిల్లో పడే మొత్తాలను సైతం తమ స్వస్థలాల్లో ఖర్చు చేయకుండా... హైవేలు, ప్రధాన రహదారుల్లో ఉన్న చిన్నచిన్న దుకాణాలను ఎంచుకుంటున్నారు. చిరువ్యాపారులకు కమీషన్ ఆశచూపుతూ ఆన్లైన్లో డబ్బు బదిలీ చేసి నగదు తీసుకోవడం లేదా మరికొన్ని చోట్ల సెల్ఫోన్ల వంటి వస్తువులు కొంటున్నారు. ఇలా పరోక్షంగా సైబర్ నేరాలకు సంబంధించిన సొమ్ము ఆయా వ్యాపారుల ఖాతాల్లోకి వెళ్తోంది. బాధితుల ఫిర్యాదుతో ఖాతాల నిలుపుదల సైబర్ బాధితుల ఫిర్యాదుతో కేసుల దర్యాప్తు చేస్తున్న పోలీసులు మనీమ్యూల్స్ ఖాతాలతోపాటు తెలియకుండా ఈ ఉచ్చులో చిక్కుకుంటున్న చిరువ్యాపారుల ఖాతాలను సైతం ఫ్రీజ్ చేస్తున్నారు. దీంతో ఆయా వ్యాపారులు వాటిని డీ–ఫ్రీజ్ చేయించుకోవడం కోసం నానాతిప్పలు పడాల్సి వస్తోంది. సాధారణంగా మనీమ్యూల్ లేదా అతడి ఏజెంట్ ఎంత మొత్తాన్ని చిరు వ్యాపారి ఖాతాలోకి బదిలీ చేశాడో అంతే సొమ్ము ఫ్రీజ్ చేసే అవకాశం ఉండగా పోలీసులు మాత్రం ఖాతా మొత్తాన్ని ఫ్రీజ్ చేస్తూ చిరువ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సమగ్ర విధానంపై కేంద్రం కసరత్తు చేస్తోందిఇండియన్ సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4.5 లక్షల మనీమ్యూల్స్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. వాటిలో అత్యధికంగా దాదాపు 40 వేల ఖాతాలు ఎస్బీఐకి సంబంధించినవి ఉన్నాయి. ఎయిర్టెల్ మనీ పేమెంట్ యాప్‌కు సంబంధించిన ఖాతాలు 5 వేల వరకు ఫ్రీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని అమాయకులైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారులవి సైతం ఉన్నాయి. తమ ప్రమేయం లేకుండా సైబర్ నేరగాళ్లు, మనీమ్యూల్స్ చేసిన వ్యవహారాలతో ఇబ్బందులు పడుతున్న చిరువ్యాపారుల అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్, డీ–ఫ్రీజింగ్‌కు సంబంధించి సమగ్ర విధానం రూపొందించడానికి కసరత్తు చేస్తోంది.– డాక్టర్ ఇ.కాళిరాజ్ నాయుడు, డైరెక్టర్, ఎన్సీఎస్సార్సీ -
సైబర్ కేటుగాళ్ల కొత్త ఎత్తు.. వాట్సాప్ హ్యాకింగ్!
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా ఆన్లైన్ ద్వారా అందినకాడికి దండుకొనే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు పంథా మార్చుకుంటున్నారు. తాజాగా వారు వేస్తున్న ఎత్తుగడే ‘వాట్సాప్ హ్యాకింగ్’. దీనికి చిత్తవుతున్న అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నట్లు ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ (ఎన్సీఎస్సార్సీ) గుర్తించింది. దాదాపు నెల నుంచి జోరుగా సాగుతున్న ఈ మోసాల బారినపడకుండా ఉండాలంటే వాట్సాప్ వినియోగదారులు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్సీఎస్సార్సీ డైరెక్టర్ డాక్టర్ ఇ.కాళీరాజ్ నాయుడు స్పష్టం చేశారు. కేరళలో మొదలైన ఈ తరహా నేరాలు తమిళనాడు, తెలంగాణకు సైతం విస్తరించాయని చెప్పారు. ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన వాట్సాప్ హ్యాకింగ్ జరుగుతున్న తీరుతెన్నులు, ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.సైబర్ మోసాలు చేసేది ఇలా.. » దేశవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నంబర్లను సైబర్ నేరగాళ్లకు డార్క్ వెబ్ ద్వారా కొని వాటి ఆధారంగా ప్రధానంగా వృద్ధులు, గృహిణులనే టార్గెట్‌గా చేసుకొని స్కామ్‌లకు పాల్పడుతున్నారు. » ఓ వినియోగదారుడి ఫోన్లో ఉన్న వాట్సాప్ మరో ఫోన్లో యాక్టివేట్ కావాలంటే యాక్టివేషన్ కోడ్‌గా పిలిచే ఓటీపీ తప్పనిసరి. టార్గెట్ చేసిన వ్యక్తుల వాట్సాప్‌ను తమ ఫోన్లలో యాక్టివేట్ చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు పక్కా పథకం ప్రకారం కథ నడుపుతున్నారు. » తొలుత తమ వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీన్ని యాక్టివేట్ చేస్తూ టార్గెట్ చేసిన వ్యక్తుల మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తున్నారు. వాట్సాప్ యాప్ నుంచి యాక్టివేషన్ ఓటీపీ అసలైన వినియోగదారుడి ఫోన్ నంబర్‌కు వెళ్లగానే కేటుగాళ్లు ఆ నంబర్‌కు కాల్ చేస్తున్నారు. తాము ఓ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పొరపాటున మీ నెంబర్ ఎంటర్ చేశామని.. అందువల్ల తమకు రావాల్సిన ఓటీపీ మీ నంబర్‌కు వచ్చినందున దాన్ని చెప్పాలని కోరుతున్నారు. ఇందులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకపోవడంతో తేలిగ్గా నమ్ముతున్న బాధితులు ఎదుటివారు ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో ఆ ఓటీపీ చెప్పేస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు అప్పటికే సిద్ధం చేసుకున్న వాట్సాప్ యాప్‌లో ఎంటర్ చేస్తున్నారు. » ఈ పరిణామంతో బాధితుడి నంబర్‌తో పనిచేసే వాట్సాప్ అతని/ఆమె ఫోన్ నుంచి సైబర్ నేరగాడి ఫోన్లో యాక్టివేట్ అయిపోతోంది. ఆ వెంటనే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘టూ స్టెప్ వెరిఫికేషన్’కు సైబర్ క్రమినిల్స్ మార్చేస్తున్నారు. దీనివల్ల బాధితుల వాట్సాప్ సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోతోంది. అనంతరం వాట్సాప్ బ్యాకప్ నుంచి బాధితుడి కాంటాక్ట్స్, ఇతర వివరాలను తమ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. » వాట్సాప్ కాంటాక్ట్స్ ఆధారంగా స్నేహితులు, సన్ని హితులను గుర్తించి వారికి బాధితులు పంపినట్లే సందేశం పంపుతూ వైద్య అవసరాల పేరిట డబ్బు డిమాండ్ చేస్తున్నారు. బ్యాకప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేయడం ద్వారా ఆయా వ్యక్తులు ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నట్లు చూపిస్తున్నారు. » ఇలా సందేశాలు అందుకున్న వాళ్లు డీపీ, ఫోన్ నంబర్ చూసి తమ వారే ఆపదలో ఉన్నారని భావించి వీలైనంత మొత్తం బదిలీ చేస్తున్నారు. » కొన్ని కాంటాక్ట్స్‌కు వాట్సాప్ క్యూఆర్ కోడ్ పంపి స్కాన్ చేయించి వాట్సాప్‌ను అ«దీనంలోకి తీసుకుంటున్న సైబర్ నేరస్తులు.. ఆ తర్వాత అప్పటికే సంగ్రహించిన బాధితుడి వాయిస్ ఆధారంగా ఏఐ సాంకేతికతను వినియోగించి వారి పరిచయస్తులు, బంధువులకు ఫోన్ చేసి ఆస్పత్రిలో ఉన్నామని చెప్పి డబ్బు గుంజుతున్నారు. » కొన్ని సందర్భాల్లో బాధితుడికి సంబంధించిన వ్య క్తిగత, సున్నిత సమాచారాన్ని అడ్డం పెట్టుకొని దా న్ని ఆన్లైన్లో పెడతామని భయపెట్టి వీలైనంత మేర దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. » సైబర్ నేరస్తులు కాజేసేవి చిన్న మొత్తాలే కావడంతో అనేక మంది ఫిర్యాదు చేయట్లేదు.వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..» వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అందులో ‘టూ స్టెప్ వెరిఫికేషన్’ను యాక్టివేట్ చేసుకోవాలి. దీనివల్ల ఒకవేళ ఆ నంబర్‌తో కూడిన వాట్సాప్‌ను సైబర్ నేరస్తులు మరో ఫోన్లో యాక్టివేట్ చేసేందుకు మాయమాటలతో ఓటీపీ తెలుసుకున్నా.. వినియోగదారులు ముందే క్రియేట్ చేసి పెట్టుకున్న 6 అంకెల యాక్టివేషన్ పిన్ నంబర్ వారికి తెలియనందున మరో ఫోన్లో వాట్సాప్ యాక్టివేట్ కాదు. » డీపీలు, స్టేటస్‌లను ‘ఓన్లీ కాంటాక్ట్స్’కు మాత్రమే కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.» వీలైనంత వరకు చాట్ బ్యాకప్‌ను తగ్గించుకోవాలి. అందుక వాట్సాప్ సెట్టింగ్స్‌లో డౌన్లోడ్ ఆప్షన్‌ను ‘నన్’అని ఎంపిక చేసుకొని యాక్టివేట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటో డౌన్లోడ్ ఎంచుకోవద్దు. ఆటో డౌన్లోడ్ ఆప్షన్ వల్ల ఒకవేళ సైబర్ నేరస్తులు ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను మాల్వేర్ రూపంలో పంపితే వినియోగదారుడి ప్రమేయం లేకుండా ఆ వైరస్ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యే ప్రమాదముంది. -
డిజిటల్ అరెస్ట్..బీ అలెర్ట్!
‘‘చట్టంలో డిజిటల్ అరెస్టు అనే వ్యవస్థే లేదు.. డిజిటల్ అరెస్టు చేయడమనేది పూర్తిగా అబద్ధం. క్రిమినల్ గ్యాంగులు, మోసగాళ్లు, ఆన్లైన్ దొంగలు చేసే పనే ఈ డిజిటల్ అరెస్టు’’ – 115వ మన్‌కీబాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కేస్–1ఆయన పేరు ఎల్ఎస్ ఆనంద్..వయసు 72 ఏళ్లు..కర్ణాటకలోని శివమొగ్గ నగరం గోపాళ లేఅవుట్లో నివాసం.. ఒకరోజు హఠాత్తుగా ఆయనకు సీబీఐ అధికారినంటూ ఒక వీడియో కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డు నంబర్లో పెద్ద మొత్తంలో డబ్బులు అక్రమ బదిలీ జరిగింది. దీంతో మీపై ఫిర్యాదు అందింది.. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ ఆనంద్‌ను భయపెట్టారు. ఆ తర్వాత ఆనంద్‌ను భయపెట్టి రూ.41 లక్షలను దోచుకున్నారు. డబ్బులు కోల్పోయిన తర్వాత శివమొగ్గ సైబర్ పోలీస్‌స్టేషన్‌ను ఆనంద్ ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ అహ్మద్ (45), అభిషేక్ షేఖ్ (27) అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేస్–2 తుమకూరు నగరం విద్యానగరకు చెందిన జి.విజయాదిత్య పాటిల్ ఇంజినీర్. నవంబర్ 13న ఆయనకు ముంబై ఫెడెక్స్ కొరియర్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నట్లు కాల్ వచ్చింది. అదే రోజు సాయంత్రం ముంబై సైబర్ సెల్ నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించారు. మీరు ముంబై నుంచి ఇరాన్‌కు పంపిస్తున్న పార్సిల్లో 5 పాస్‌పోర్టులు, ఎండీఎంఏ అనే డ్రగ్స్ ఉన్నట్లు విజయాదిత్యను భయపెట్టారు. విచారణ నిమిత్తం స్కైప్లోకి రావాలని పిలిచారు. ఆ మరుసటి రోజు డిజిటల్ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించి రూ.33.99 లక్షలను బాధితుడి నుంచి బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత గూగుల్‌లో ముంబై సైబర్ సెల్ సమాచారాన్ని సేకరించి కాల్ చేయగా, తాను మోసపోయానని విజయాదిత్య గ్రహించాడు. కేస్–3సీబీఐ అధికారి అంటూ ఫోన్ కాల్లో బెదిరించడమే కాకుండా డిజిటల్ అరెస్టు ద్వారా లక్షలాది రూపాయలను మోసం చేసిన నిందితుడిని కావూరు పోలీసులు అరెస్టు చేశారు. కేరళ ఎర్నాకులం జిల్లా ఆలువా తాలూకాకు చెందిన నిసార్ అనే నిందితుడు డిజిటల్ అరెస్టు ద్వారా రూ. 68 లక్షలను దోచుకున్నట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు.సాక్షి, బెంగళూరు: డిజిటల్ సాంకేతికతలు పెరుగుతున్నట్లే అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. దైనందిన జీవితంలో సమాచార సాంకేతికతను ఎంతగా వినియోగిస్తున్నామో అంతే స్థాయిలో వాటి వల్ల ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో సామాన్య ప్రజలను చాలా సులభంగా డిజిటల్ అరెస్టు ద్వారా సైబర్ నేరస్తులు మోసం చేస్తున్నారు. ఇలాంటి తరహా కేసులు ప్రభుత్వాలకు సవాలుగా మారాయి.ఎలాంటి శ్రమ లేకుండా ఆదాయం ఆర్జింజే మార్గాల్లో డిజిటల్ అరెస్టు ఒకటిగా సైబర్ మోసగాళ్లు మార్చుకున్నారు. సైబర్ మోసగాళ్లు అత్యాధునికతను ఉపయోగించుకుని తమ వరŠుచ్యవల్ మార్కెట్‌ను విస్తరించుకుంటున్నారు. ప్రారంభంలో క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారం, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు తదితర వాటి ద్వారా ప్రజలు మోసం చేసేవారు. తాజాగా డిజిటల్ అరెస్ట్ ద్వారా కొత్తగా దోపిడీ మార్గాన్ని ఎన్నుకున్నారు. కర్ణాటకలో ప్రస్తుతం డిజిటల్ అరెస్టు మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ సైబర్ మోసాలు రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా సంతరించుకున్న రూపమే డిజిటల్ అరెస్ట్. ఈ తరహా సైబర్ మోసానికి గురై చాలా మంది లక్షలాది రూపాయలను కోల్పోతున్నారు. ఈ పద్ధతిపై ఇటీవల జరిగిన మన్‌కీ బాత్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను అప్రమత్తం చేశారు. కర్ణాటకలో జరిగిన ఒక కేసును ఉటంకిస్తూ ప్రజలను హెచ్చరించారు. ముంబై పోలీసుల పేరిట కర్ణాటక విజయపుర సంతోష్ చౌధురి అనే వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసేందుకు యత్నించిన ఘటనను ప్రధాని ప్రస్తావించి డిజిటల్ అరెస్ట్‌పై హెచ్చరించారు. ఈ సైబర్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండి, తమ ఆధార్, ఓటీపీ, బ్యాంక్ అకౌంట్ నంబర్ తదితర వివరాలను గోప్యంగా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.ఏంటీ డిజిటల్ అరెస్ట్..??సామాన్య అర్థంలో డిజిటల్ అరెస్టు అంటే సైబర్ మోసగాళ్లు.. అమాయకులను లక్ష్యంగా చేసుకుని తాము పోలీసులు, ఈడీ, సీబీఐ, ఐటీ, ఆర్బీఐ, నార్కోటిక్స్, కస్టమ్స్ అధికారులమంటూ చెప్పుకుని మోసం చేయడమే. ప్రజలకు అధికారులమంటూ కాల్ చేసి, వారిని నకిలీ గుర్తింపు కార్డుల ద్వారా నమ్మించి, నకిలీ అరెస్టు వారెంట్లు చూపించి, కూర్చొన్న చోట నుంచే వీడియో, ఆడియో కాల్స్ చేసి డబ్బును దోచుకుంటున్నారు. ‘మీరు సీరియస్ నేరానికి పాల్పడ్డారు. కొన్నేళ్ల పాటు శిక్ష పడుతుంది. న్యాయ ప్రక్రియ ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అంటూ ప్రజలను బెదిరించి, భయపెట్టి డబ్బులను దోచుకుంటున్నారు.ఎలా జరుగుతుంది??డిజిటల్ అరెస్ట్ కేసుల్లో నిందితులు అధికారుల రూపంలో ఆడియో, వీడియో కాల్స్ చేస్తారు. వాట్సాప్, స్కైప్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వీడియో కాల్స్ చేస్తున్నారు. బాధితులకు డిజిటల్ అరెస్ట్ వారంట్లను జారీ చేస్తారు. నిధుల దుర్వినియోగం, పన్నుల మోసాలు, ఇతరత్రా చట్ట ఉల్లంఘనలను వివిధ కారణాల చూపిస్తూ బాధితులను భయపెడతారు. కొన్ని సందర్భాల్లో ఈ మోసగాళ్లు ఈ ఫోన్ కాల్స్ నిజమేనని నమ్మించడానికి పోలీసు స్టేషన్లు తరహాలో సెట్లను కూడా తయారు చేసుకుంటారు. విచారణలో సహకరిస్తామని, కేసులో పేరు లేకుండా చేస్తామని, రిఫండబుల్ డబ్బులు చెల్లించాలని నమ్మబలికి తమ బ్యాంకు ఖాతాలకు లేదా యూపీఐ ఐడీలకు అమౌంట్ బదిలీ చేయించుకుంటారు. ఒక్కసారి వారి మాటలను నమ్మి డబ్బులు చెల్లించిన తర్వాత మళ్లీ స్కామర్లు కనిపించరు.ఈ మోసాన్ని ఎలా తప్పించుకోవాలంటే?⇒ నిజమైన అధికారులు ఎప్పటికీ డబ్బులు చెల్లించాలని, బ్యాంకింగ్ వివరాలు ఇవ్వాలని అడగరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ⇒ సైబర్ మోసగాళ్లు డబ్బుల కోసం త్వరపెడుతుంటారు. వారి చర్యలను వేగంగా నిర్వహిస్తారు. కాల్స్ చేస్తూ డబ్బుల కోసం డిమాండ్ చేస్తుంటారు. ⇒ స్కామర్లపై అనుమానం కలిగిన వెంటనే సంబంధిత ఏజెన్సీకి నేరుగా సంప్రదించి వారి గుర్తింపును నిర్థారించుకోవాలి. ⇒ వ్యక్తిగత సమాచారాన్ని, ఆర్థిక అంశాలు, వివరాలను ఎప్పటికీ ఎవ్వరికీ బహిర్గతం చేయకూడదు. ⇒ ప్రభుత్వ ఏజెన్సీలు అధికారిక సంప్రదింపుల కోసం వాట్సాప్, స్కైప్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించరు. ⇒ మీరు మోసానికి గురవుతున్నారని అనుమానం వచ్చిన వెంటనే పోలీస్‌స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మోసపోయిన తర్వాత ఇలా చేయాలి..⇒ ఆన్లైన్ మోసానికి గురై డబ్బులు కోల్పోతే వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించి ఖాతాను ఫ్రీజ్ చేయాలి. ⇒ జాతీయ సైబర్ నేరాల పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. ⇒ మోసపోయిన తర్వాత నిందితుల వివరాలను మీ వద్దే ఉంచుకోండి. అంటే ఫోన్ కాల్స్ వివరాలు, లావాదేవీలు, సందేశాలు తదితర వాటిని సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. ⇒ అవసరమైతే న్యాయవాదుల సహాయం పొందాలి. -
సైబర్ నేరగాళ్ల ‘పెళ్లి పిలుపులు’!
సాక్షి, హైదరాబాద్: సీజన్‌కు అనుగుణంగా సైబర్ కేటుగాళ్లు కొత్త పంథాలో మోసాలకు తెరదీస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇదే అంశాన్ని వారికి అనుగుణంగా మల్చుకుని కొత్త దందా మొదలుపెట్టారు. వాట్సాప్ మెసేజ్‌లలో పెళ్లి పత్రికల పేరుతో ఏపీకే (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ) ఫైల్స్‌ను క్రియేట్ చేసి పంపుతున్నట్టు పోలీసులు హెచ్చరించారు. తెలియని ఫోన్ నంబర్ల నుంచి ఆహ్వాన పత్రికల పేరిట ఇలాంటి మెసేజ్‌లు వస్తే వాటిలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దని వారు సూచిస్తున్నారు. ఇలాంటి ఫైల్ ఓపెన్ చేయగానే సైబర్ నేరగాళ్లకు చెందిన సాఫ్ట్వేర్ మన ఫోన్లో ఇన్స్టాల్ అవడంతోపాటు మన వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, కాంటాక్ట్ నంబర్ల జాబితా సైబర్ నేరగాళ్లకు చేరుతుంది. దీంతో ఫోన్‌ను హ్యాక్ చేసి వారి చేతుల్లోకి తీసుకుంటారని, తర్వాత మన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొట్టడం..డబ్బుల కోసం డిమాండ్ చేయడం వంటి ప్రమాదాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. వాట్సాప్‌తోపాటు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల ఖాతాల నుంచి వచ్చే ఆహ్వాన పత్రికలు, వీడియోలు, డాక్యుమెంట్లు, లింకులు, ఏపీకే ఫైల్స్ వేటిపైనా క్లిక్ చేయవద్దని సూచించారు. ఒక వేళ పొరపాటున క్లిక్ చేస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు. -
ట్రంప్, వాన్స్ లక్ష్యంగాచైనా సైబర్ దాడి
వాషింగ్టన్: చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు , మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ఆయన రన్నింగ్ మేట్ జేడీ వాన్స్‌లు వాడే ఫోన్లు, నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకున్నారని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ట్రంప్–వాన్స్‌ల ఎన్నికల ప్రచార బృందాన్ని అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, ఆమె రన్నింగ్ మేట్ వాల్జ్ ఎన్నికల ప్రచారాన్ని కూడా చైనా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారని బీబీసీ పేర్కొంది. అదే నిజమైతే, ఏ మేరకు సమాచారం నేరగాళ్ల చేతికి చిక్కి ఉంటుందనే విషయం స్పష్టత రాలేదు. అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు సైబర్ నేరగాళ్లకు లక్ష్యమయ్యారా అనే ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్‌బీఐలు నిరాకరిస్తున్నాయి. చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు దేశంలోని వాణిజ్య టెలీకమ్యూనికేషన్స్ వ్యవస్థల్లోకి దొంగచాటుగా ప్రవేశించిన విషయమై అమెరికా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని ఎఫ్‌బీఐ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఐఎస్ఏ) ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. అయితే, నేరగాళ్లు చేసిన ప్రయత్నాలను తాము గుర్తించామని తెలిపాయి. ఆ వెంటనే సంబంధిత సంస్థలను అప్రమత్తం చేయడంతోపాటు ఇతర బాధితులను అలెర్ట్ చేసి, అవసరమైన సహాయ సహకారాలు అందించామని ఆ ప్రకటనలో వివరించాయి. కమర్షియల్ కమ్యూనికేషన్స్ రంగంలో సైబర్ రక్షణలను బలోపేతం చేసేందుకు, దాడులను ఎదుర్కొనేందుకు సంబంధిత విభాగాలను సమన్వయం చేస్తున్నామని ఎఫ్‌బీఐ, సీఐఎస్ఏ తెలిపాయి. అయితే, దీనిని ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేసేలా సైబర్ దాడికి జరిగిన యత్నంగా కాకుండా, గూఢచర్యంగాభావిస్తున్నామని న్యాయ విభాగం తెలిపింది.ఈ పరిణామంపై ట్రంప్ ప్రచార బృందం తీవ్రంగా స్పందించింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవకుండా చేసే కుట్రగా అభివర్ణించింది. ఈ నెల మొదట్లో కూడా హ్యాకర్లు ట్రంప్, వాన్స్‌లే లక్ష్యంగా సైబర్ దాడికి పాల్పడ్డారని సంబంధిత వెరిజోన్ అనే టెలీ కమ్యూనికేషన్ సంస్థ ఆరోపించింది. సెపె్టంబర్లో ఇరాన్‌కు చెందిన ముగ్గురు హ్యాకర్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోక్యం చేసుకునేందుకు ప్రయతి్నంచినట్లు అమెరికా ప్రభుత్వం ఆరోపించడం తెలిసిందే. -
వాట్సాప్ కాల్లో 6 గంటలకు పైగా విచారణ
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ పార్శిల్ పంపించారంటూ బాధితుడిని భయభ్రాంతులకు గురి చేస్తూ సైబర్ నేరస్తులు వాట్సాప్ వీడియో కాల్లో 6 గంటల పాటు విచారణ చేశారు. కేటుగాళ్ల చేతికి చిక్కిన సికింద్రాబాద్‌కు చెందిన 62 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి రూ.24.58 లక్షలు మోసపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్ నేరగాడు ఫెడెక్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అంటూ బాధితుడికి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. 20 కిలోల మధుమేహం మందులతో పాటు 100 గ్రాముల ఎండీఎంఏ మాదక ద్రవ్యాలతో కూడిన పార్శిల్‌ను కొరియర్ ద్వారా ఇరాన్‌లోని డాక్టర్ అర్మాన్ అలీకి పంపినట్లు తెలిపాడు. దీంతో బాధితుడు తాను అలాంటి పార్శిల్ ఏమీ పంపలేదని, ఆ డాక్డర్ ఎవరో కూడా తనకు తెలియదని బదులిచ్చాడు. ఇప్పటికే ఈ కొరియర్ లావాదేవీ గురించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి సమాచారం అందించామని, దీంతో ఎన్సీబీ/ఎంయూఎం/2024–23/624 ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. దీంతో ఎన్సీబీ అధికారుల వేషంలో మోసగాళ్లే బాధితుడిని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా విచారించారు. కాస్త తెలివిగా వ్యవహరించి బాధితుడు వాట్సాప్ కాల్లో సంబంధిత అధికారుల గుర్తింపు కార్డులు, ఇతరత్రా ఆధారాలను కోరాడు. దీంతో మోసగాళ్లు నకిలీ ఐడీ కార్డులు, ఎఫ్ఐఆర్ కాపీలను పంపించారు. విచారణ సమయంలో వివిధ బ్యాంక్‌ల్లోని పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ)ల సమాచారాన్ని తెలపాలని బాధితుడిని ఒత్తిడి చేశారు. అకౌంట్లలోని రూ.24.58 లక్షల సొమ్మును ‘ఆర్బీఐ ఖాతా’కు బదిలీ చేయాలని, ధ్రువీకరణ తర్వాత 10 నిమిషాల్లో సొమ్ము తిరిగి పంపిస్తామని నమ్మించారు. లేకపోతే మాదక ద్రవ్యాల చట్టం కింద అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని, అరెస్టు చేయకుండా ఉండాలంటే ఎఫ్‌డీలోని సొమ్మును బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు మోసగాళ్లు సూచించిన ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాకు సొమ్ము మొత్తాన్ని బదిలీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హాయ్, నేను సీజేఐని... క్యాబ్‌కు రూ.500 పంపండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా వదలడం లేదు. సీజేఐ పేరిట ఒక వ్యక్తిని రూ.500 అడిగారు! సదరు స్కామర్ తనను తాను సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌గా చెప్పుకున్నాడు. ‘‘హలో! నేను సీజేఐని. కొలీజియం అత్యవసర భేటీకి వెళ్లాల్సి ఉంది. కన్నాట్ ప్లేస్‌లో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం రూ.500 పంపగలరా! కోర్టుకు చేరగానే తిరిగి పంపిస్తా’’ అంటూ మెసేజ్ చేశాడు. అది నిజమైందేనని నమ్మించడానికి ఐ పాడ్ నుంచి పంపుతున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. అయితే దాన్నిండా స్పెల్లింగ్, వ్యాకరణ దోషాలే ఉండటం విశేషం! ఈ నకిలీ మెసేజ్ వైరల్‌గా మారింది. దాన్ని కైలాశ్ మేఘ్వాల్ అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఫ్రెండ్స్, ఏం చేద్దాం మరి!’ అంటూ కామెంట్ చేశారు. ఈ వైరల్ పోస్టును సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీజేఐ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్‌కు ఫిర్యాదు చేసింది. -
సరికొత్త ముప్పు సైబర్ టెర్రరిజం
సైబర్ నేరగాళ్లు.. లక్షలు, కోట్లలో డబ్బులు వ్యక్తిగత ఖాతాల్లోంచి కొల్లగొట్టడమే కాదు..సైబర్ టెర్రరిజానికి తెరతీస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాద ముప్పు క్రమంగా కొత్తరూపు సంతరించుకుంటోంది.. ఇది భవిష్యత్తులో జడలువిప్పుకుని సైబర్టెర్రరిజంగా మారి మానవాళికి ముప్పుగా మారబోతోందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు సైబర్ టెర్రరిజం అంటే ఏంటి? దీంతో ప్రపంచ దేశాలకు వచ్చే ముప్పు ఏంటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అన్న విషయాలపై ‘సాక్షి ’ప్రత్యేక కథనం. మచ్చుకు కొన్ని ఘటనలను చూస్తే.. సైబర్ టెర్రరిజం వేళ్లూనుకుంటుందనడానికి ఇటీవలి కొన్ని పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. హ్యాకర్లు సోనీ అంతర్జాతీయ సంస్థపై సైబర్ దాడి చేసి గోప్యమైన సమాచారాన్ని హ్యాక్ చేసి సంస్థ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి డేటాపై ర్యామ్సన్వేర్ఎటాక్ జరగడం, హైదరాబాద్లోఏపీ మహేశ్కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు హ్యాకింగ్ ఘటన, తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడం కూడా ఇలాంటి కోవలోనివే. సాక్షి, హైదరాబాద్ : రోజువారీ జీవితంలో సాంకేతికతపై ఆధారపడటం విపరీతంగా పెరిగింది. అదే సమయంలో సాంకేతికంగా అభివృద్ధి చెందిన తీవ్రవాదులు వారి ప్రయోజనాల కోసం ఇందులో ఉన్న లొసుగులను ఉపయోగించుకొనే అవకాశం కూడా పెరుగుతోంది. జనజీవనాన్ని స్తంభింపజేసి, వ్యవస్థలను గందరగోళపర్చి తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు డిజిటల్ సాధనాలు, సాంకేతికతను ఉపయోగించడాన్ని సైబర్ టెర్రరిజంగా చెబుతున్నారు సైబర్ భద్రత నిపు ణులు. తరచుగా హింసపై ఆధారపడే సంప్రదాయక ఉగ్రవాద రూపాల్లా కాకుండా సైబర్ ఉగ్రవాదులు తమ లక్ష్యాలను సాధించడానికి ఇంటర్నెట్ను ఉపయోగించుకుని వర్చువల్‌గా పనిచేస్తారు. సైబర్ దాడులతో ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలను హ్యాక్ చేయడం, మౌలిక సదుపాయాలకు అంతరాయాన్ని కలిగించడం, సోషల్ మీడియా ద్వారా దు్రష్పచారం చేయడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం సైబర్ ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యాలు. నాలుగు రకాలుగా హానిసైద్ధాంతిక ఉగ్రవాదం: సైబర్ ఉగ్రవాదులు తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి, అనుచరులను నియమించుకోవడానికి, ప్రత్యర్థులపై హింసను ప్రేరేపించడానికి సైబర్‌స్పేస్‌ను ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. భౌగోళిక, రాజకీయ లక్ష్యాలు: ప్రత్యర్థి ప్రభుత్వాలను అణగదొక్కడం, రహస్యమైన సమాచారాన్ని దొంగిలించడం, శత్రు భూభాగంలో కీలకమైన అవసరాలకు అంతరాయం కలిగించడం లాంటివి చేస్తారు. ఆర్థిక లాభం: సైబర్ టెర్రరిజం లక్ష్యం సైతం ఆర్థిక వ్యవస్థల్ని దోచుకోవడమే. ఉగ్ర సంస్థలు లేదా హ్యాకర్లు ర్యామ్సన్వేర్ దాడులు, ఆర్థిక మోసాలతో డబ్బులు కొల్లగొడుతారు. అవసరమైన డేటాను ఎన్‌క్రిప్‌్ట, డిక్రీప్ట్ చేయడానికి భారీగా డబ్బును డిమాండ్ చేస్తారు. సైకలాజికల్ వార్ఫేర్: భయం, అనిశ్చితి, అపనమ్మకాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో ప్రజల మానసిక స్థితిపై ప్రభావం చూపేలా ప్రభుత్వరంగ సంస్థలను హ్యాక్ చేస్తుంటారు. ఎలా చేస్తారు?మాల్వేర్: వైరస్లు, ట్రోజన్లు, ర్యాన్సమ్వేర్ వంటి హానికర సాఫ్ట్వేర్లను సైబర్ ఉగ్రవాదులు ఎక్కువగా వాడుతున్నారు. ఫిషింగ్: వీటిని సోషల్ ఇంజనీరింగ్ ఎటాక్‌గా చెప్పొచ్చు. లక్ష్యంగా ఎంచుకున్న సంస్థల నెట్‌వర్క్‌లు, సంస్థలు, వ్యక్తులకు మోసపూరిత ఈ– మెయిల్లు, ఎస్ఎంఎస్లలో లింకులు పెట్టి పంపుతారు. దీని ద్వారా హాక్ చేస్తే కలిగే నష్టం ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ డినైయల్ ఆఫ్ సర్వీస్: వీటినే డీడీఓఎస్ దాడులు అంటారు. టార్గెట్ చేసిన నెట్‌వర్క్‌కు విపరీతమైన ట్రాఫిక్ ఉండేలా చేసి వాటిని వినియోగదారులకు అందుబాటులో లేకుండా చేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక సంస్థలు లేదా ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు ఉపయోగిస్తారు. ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో గందరగోళం సృష్టించడం ఈ దాడి లక్ష్యం. సాఫ్ట్వేర్ వల్నరబిలిటీ ఎటాక్: సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ ప్రోటోకాల్‌లోని చిన్నపాటి లోపాలను ఆసరాగా తీసుకుని దాడులు చేస్తారు. సప్లై చైన్ అటాక్స్: కస్టమర్లు లేదా క్లయింట్ల నెట్‌వర్క్‌లలోకి చొరబడేందుకు థర్డ్ పార్టీ విక్రేతలుగా చేరి నెట్‌వర్క్‌కు హానికల్గిస్తారు.సైబర్ టెర్రరిజానికి గురవుతున్న ప్రధాన రంగాలు.. సైబర్ఉగ్రవాదులు ప్రభుత్వరంగసంస్థలు, పవర్ గ్రిడ్లు, రవాణానెట్వర్క్లు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలకు అంతరాయంసృష్టించి ప్రజా భద్రత, సంక్షేమానికి ఆటంకాలుకలిగిస్తారు. ప్రతికూల పరిస్థితులను సృష్టించిసామాజిక జీవనాన్ని బలహీనపర్చడం వీరిలక్ష్యం. సోషల్ మీడియా, ఆన్లైన్ ఫోరమ్‌ల ద్వారా తీవ్రవాద భావజాల వ్యాప్తికి, హింసనుప్రేరేపించేందుకు సైబర్ టెర్రరిజాన్ని వాడుతున్నారు. సైబర్ టెర్రరిజాన్ని ఇలా ఎదుర్కోవచ్చు సైబర్ సెక్యూరిటీ చర్యలుసైబర్ టెర్రరిస్ట్‌ల నుంచి డిజిటల్ మౌలిక సదుపాయాలను కాపాడుకునేందుకు సైబర్ సెక్యూరిటీ సాంకేతికతను, సైబర్ దాడులను అడ్డుకోవడానికి బలమైన ఫైర్‌వాల్స్‌ను ఏర్పాటుచేసుకోవాలి. చొరబాట్లను గుర్తించే వ్యవస్థలు, ఎన్క్రిప్షన్ మెకానిజమ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. వీటి కోసం ప్రభుత్వం అదనంగా పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు పరస్పర సహకారంతో సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసేలా ఉమ్మడి ప్రణాళికలు అమలు చేయాలి. అంతర్జాతీయసహకారంసైబర్ ఉగ్రవాదం ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, సైబర్నేరగాళ్లను పట్టుకోవడానికి ఆయా దేశాలు ద్వైపాక్షిక, బహుపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలి. గుర్తించకపోతే అనర్థాలుసాంకేతికత వినియోగం పెరిగేకొద్దీ సైబర్ టెర్రరిజం ముప్పు కూడా పెరుగుతోంది. ఇది అనేక రంగాలకు విస్తరించే ప్రమాదం ఉంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు అన్ని స్థాయిల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు చర్యలు ప్రారంభించాలి. భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే సైబర్ టెర్రరిజం ముప్పును గుర్తించకపోతే అనర్థాలు తప్పవు. –అద్వైత్ కంభం, సైబర్ సెక్యూరిటీ ట్రైనర్ ప్రజల్లో అవగాహన పెంచాలి ఫిషింగ్ స్కామ్‌లు, మాల్వేర్ బెదిరింపులు ఇతర సైబర్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థలు, సైబర్ సెక్యూరిటీ సంస్థలు శిక్షణ, వర్క్‌షాప్‌లు, అవగాహన కార్యక్రమాలను విరివిగా నిర్వహించాలి. -
మ్యూల్ సిమ్‌కార్డుల ముఠాగుట్టు రట్టు
భవానీపురం (విజయవాడపశ్చిమ): సైబర్ నేరగాళ్లకు మ్యూల్ సిమ్‌కార్డులు సరఫరా చేస్తున్న ముఠాగుట్టును విజయవాడ సైబర్ పోలీసులు రట్టుచేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశా రు. నిందితుడి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. కోటిని స్తంభింపజేశారు. సైబర్ మోసంతో సీని యర్ సిటిజన్ పోగొట్టుకున్న రూ.30,37,627 ఆయనకు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా సీపీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. గతనెల 24వ తేదీన విజ యవాడ సూర్యారావుపేటకు చెందిన సీనియర్ సిటిజన్ తాను సైబర్ నేరానికి గురైనట్లు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. తనకు వాట్సప్ ద్వారా వీడియో కాల్ చేసి ముంబై సైబర్ క్రైమ్ డీసీపీగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. తన పేరుమీద ముంబయిలో రెండు సిమ్‌కార్డులు, రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, ముంబయిలో పలు కేసుల్లో నిందితుడైన రాజ్ కుంద్రా నిత్యం తనతో ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ముంబయిలో కేసు నమోదు అయిందంటూ ఎఫ్ఐఆర్, అరెస్ట్ వారెంట్ పత్రాలను వాట్స ప్లో పంపించాడని తెలిపారు. అతడి బెదిరింపులకు భయపడిన తాను అతడు చెప్పిన ఖాతాకు రూ.30,37,627 జమచేసినట్లు తెలిపారు. అయినా ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాఖలో తీసుకున్న సిమ్‌కార్డుల వినియోగం ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.డి.తేజేశ్వరరావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ కోమాకుల శివా జి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉపయోగించిన సిమ్ కార్డులు విశాఖపట్నంలో తీసుకున్నట్లు గుర్తించి ఎస్ఐ ఆర్.ఎస్.సీహెచ్.మూర్తి ఆధ్వర్యంలో ఒక బృందం విశాఖపట్నంలో దర్యాప్తు చేసింది. సిమ్‌కార్డులు అమ్మే ఎగ్జిక్యూటివ్‌లు.. వినియోగదారుల బొటనవేలి ముద్రలను ఉపయోగించి మరో మ్యూల్ సిమ్‌కార్డు తీసుకుని యాక్టివేట్ చేసి సంఘవ్యతిరేక శక్తులకు అమ్ముకుంటున్నట్లు గుర్తించారు. సైబర్ నేరస్తులకు మ్యూల్ సిమ్‌కార్డులు విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టుచేసి వా రి వద్ద నుంచి 998 సిమ్‌కార్డులు, బయోమెట్రిక్ మెషిన్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన రేపాక రాంజీ, నంబాల నితిన్, బండి నారాయణమూర్తి అలియాస్ రవి, విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన తేలు ప్రణయ్‌కుమార్, నంద రూపేష్, కాగితాల సింహాద్రి, నిడమర్రు ఎండీఎల్ సూరయ్యగూడేనికి చెందిన పందిరి సత్యనారాయణలను అరెస్టు చేశారు. బాధితుడు డబ్బు జమచేసిన బ్యాంకు ఖాతాను గుర్తించి 1930 పోర్టల్ ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదించి ఆ ఖాతాలో ఉన్న రూ.1,21,73,156.98ని నిలుపుదల చేశారు. బా ధితుడు పోగొట్టుకున్న రూ.30,37,627ను కోర్టు ద్వారా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరస్తులు కాంబోడియా నుంచి ఈ మోసానికి పా ల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని సీపీ తె లిపారు.దోషుల్ని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. -
Apple: స్పైవేర్ దాడులు జరగొచ్చు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మద్దతున్న సైబర్ నేరగాళ్లు మీ ఐఫోన్ తదితర యాపిల్ ఉత్పత్తులపై సైబర్‌దాడులు చేయొచ్చని గతంలో హెచ్చరించి తీవ్ర చర్చకు తెరలేపిన యాపిల్ సంస్థ తాజాగా మరోమారు అలాంటి హెచ్చరికనే చేసింది. పెగాసస్ తరహా అత్యంత అధునాతనమైన స్పైవేర్ దాడులు కీలకమైన పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరగొచ్చని యాపిల్ ఏప్రిల్ పదో తేదీ ఒక ‘థ్రెట్’ నోటిఫికేషన్లో పేర్కొంది. ‘‘కొనుగోలుచేసిన అధునాతన స్పైవేర్‌తో సైబర్ దాడులు జరిగే అవకాశాలను ముందే పసిగట్టి యూజర్లకు సమాచారం ఇవ్వడం, వారిని అప్రమత్తం చేయడం కోసం థ్రెట్ నోటిఫికేషన్లను రూపొందించాం. సాధారణ సైబర్‌నేరాల కంటే ఈ దాడులు చాలా సంక్షిష్టమైనవి. అత్యంత తక్కువ మందినే లక్ష్యంగా చేసుకుంటారు కాబట్టి ఎవరిపై, ఎందుకు దాడి చేస్తారో చెప్పడం కష్టం. అయితే దాడి జరిగే అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా అంచనావేసి ముందే యూజర్లను అప్రమత్తం చేస్తాం’’ అని థ్రెట్ నోటిఫికేషన్లో యాపిల్ హెచ్చరించింది. సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధమవుతున్న భారత్‌సహా 60 దేశాల్లోని యూజర్లకు యాపిల్ ఈ నోటిఫికేషన్లు పంపించింది. ఇజ్రాయెల్ తయారీ పెగాసస్ స్పైవేర్ సాయంతో మొబైల్ ఫోన్‌కు వాట్సాప్ ద్వారా మిస్డ్‌కాల్ ఇచ్చి కూడా ఆ ఫోన్‌ను సైబర్‌నేరగాళ్లు తమ నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ‘‘ఎవరైనా యూజర్‌ను సైబర్‌నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటే ముందే గుర్తించి ఆ యూజర్‌ను హెచ్చరిస్తాం. ఐఫోన్‌ను సైబర్‌భూతం నుంచి కాపాడాలంటే దానిని లాక్డౌన్ మోడ్‌లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ ఫోన్లో ఫింగర్‌ఫ్రింట్ సెన్సార్, ఫేఫియల్ రికగ్నీషన్, వాయిస్ రిగ్నీషన్ ఏవీ పనిచేయవు. ఒకవేళ మనమే మళ్లీ వాడుకోవాలంటే పిన్ లేదా పాస్‌కోడ్ లేదా ప్యాట్రన్ సాయంతోనే మళ్లీ ఫోన్‌ను పనిచేసేలా చేయొచ్చు’’ అని యాపిల్ సూచించింది. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 49 శాతం సంస్థలు తమ ఉద్యోగుల డివైజ్‌లపై సైబర్ దాడులు/ ఉల్లంఘన ఉదంతాలను పసిగట్ట లేకపోతు న్నాయి. భారత్‌లో లెక్కిస్తే మొబైల్ మాల్వే ర్ సాయంతో సగటు వారానికి 4.3 శాతం సంస్థలపై సైబర్ దాడులు జరుగుతు న్నాయి. అదే ఆసియాపసిఫిక్ ప్రాంతంలో అయితే గత ఆరు నెలల్లో సగటును 2.6 శాతం సంస్థలపై సైబర్ దాడులు చోటుచేసుకున్నాయి. -
ట్రేడింగ్ పేరుతో రూ.20లక్షలు స్వాహా
హిమాయత్‌నగర్: ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి 60 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. నగర సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన మేరకు.. నగరానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి వాట్సాప్‌లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఓ లింక్ వచి్చంది. ఆన్లైన్ ట్రేడింగ్, ఐపీఓలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో బాధితుడు తన ఆధార్, పాన్ కార్డ్ వివరాలతో ట్రేడింగ్ అకౌంట్‌ను తెరిచాడు. మొదటగా సైబర్ కేటుగాళ్లు చెప్పిన విధంగా రూ.50,000 డిపాజిట్ చేశాడు. నకిలీ ట్రేడింగ్ ఖాతాలో లాభాలు వచి్చనట్లు చూపించారు. అది నమ్మిన బాధితుడు బల్క్ ట్రేడింగ్‌లో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. 30 రోజులు స్టాక్స్ కలిగి ఉంటే, మంచి లాభాలు వస్తాయని మరోసారి నమ్మించారు. 30 రోజుల అనంతరం బాధితుడు లాభాలు కలిపి మొత్తం రూ.79 లక్షలు చూపించారు. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునే ప్రయత్నం చేయడంతో సాధ్యం కాలేదు.విత్ డ్రా చేసుకోవాలంటే మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని, కమీషన్ ఇతర చార్జీల పేరుతో మరింత డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి చేశారు. అప్పటికే బాధితుడు మొత్తం రూ.20,75,000 పంపిచడంతో ఇంకా డబ్బు పంపిచడం వీలుకాదని తేల్చిచెప్పడంతో కేటుగాళ్లు బాధితుడి ట్రేడింగ్ ఖాతాను కూడా బ్లాక్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించి బాధితుడు నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు. -
అయోధ్య ప్రసాదం.. వీఐపీ దర్శనం!
సాక్షి, హైదరాబాద్: అయోధ్య రామమందిరం పేరును సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు ఉపయోగించుకుంటున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) హెచ్చరించింది. అయోధ్య ప్రసాదం పంపిణీ పేరిట, విరాళాల సేకరణ పేరిట, వీఐపీ దర్శనం టికెట్ల విక్రయం పేరిట సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లలో సందేశాలు పంపుతున్నట్లు పేర్కొంది. అయోధ్య రామమందిరం పేరుతో సైబర్ నేరస్తులు పంపే క్యూఆర్ కోడ్లు, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ (ఏపీకే) ఫైల్స్‌ను నమ్మి మోసపోవద్దని టీఎస్‌సీఎస్‌బీ డైరెక్టర్ షికా గోయల్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రామమందిరం పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు సృష్టించినట్లు తమ దృష్టికి వచ్చి నట్లు చెప్పారు. డబ్బు పంపాలంటూ వాట్సాప్ సందేశాల్లో నకిలీ లింక్‌లు పంపుతున్నారని, ఆ లింక్‌లు క్లిక్ చేసిన వారి నుంచి బ్యాంకుల వివరాలు, ఫోన్‌నంబర్లను సేకరిస్తున్నారని తెలిపారు. అలాగే వివిధ మొబైల్ యాప్‌లను డౌన్లోడ్ చేసి ఓటీపీలు చెప్పాలని కోరుతున్నారని, అలా చేస్తే ఫోన్ల పనితీరు సైబర్ నేరగాళ్ల అ«దీనంలోకి వెళ్తుందని హెచ్చరించారు. ఈ డిజిటల్ ముప్పును ఎదుర్కోవడానికి వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని షికా గోయల్ సూచించారు. ఈ తరహా మెసేజ్‌లు వస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. అదేవిధంగా www. cybercrime. gov. in ద్వారా లేదా వాట్సాప్‌లో సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ నంబర్ 87126 72222కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాత నాణేలిస్తే లక్షలిస్తామని బురిడీ పాత నాణేలు తమకు ఇస్తే బదులుగా రూ. లక్షలు చెల్లిస్తామంటూ సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్నారని... ఇందిరా గాంధీ, భారతదేశ మ్యాప్ చిత్రాలున్న పాత రూ. 2 లేదా రూ. 5 నాణేలు పంపిస్తే రూ. లక్షల్లో ఆదాయం వస్తుందని మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సైబర్ నేరగాళ్ల మాయలో చిక్కే అమాయకులకు డబ్బు చెల్లిస్తామని... అందుకోసం ముందుగా టీడీఎస్, సర్విస్ చార్జీలు చెల్లించాలంటూ కేటుగాళ్లు డబ్బు దండుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మోసాలపట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. -
సైబర్ క్రైమ్ @ 5
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ప్రధానంగా ఐదు రకాల నేర పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది నమోదైన నేరాల్లో 16శాతం సైబర్ నేరాలే ఉన్నాయి. ఇటీవల తెలంగాణ పోలీస్ వార్షిక నివేదికలో ఈ వివరాలు పొందుపరించారు. జాతీయ స్థాయిలో నమోదవుతున్న సైబర్‌నేరాల్లో తెలంగాణలోనే 2.5 శాతం మేర ఉన్నాయి. ఈ సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సైబర్‌నేరగాళ్లవిగా గుర్తించిన మొత్తం 28,610 సిమ్‌కార్డులనుపోలీసులు బ్లాక్ చేశారు. సైబర్‌నేరగాళ్లకు సంబంధించిన 58446 క్రైం లింక్‌లను తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసులతో పంచుకున్నారు. దీంతో ఒకే తరహా మోసాలు పలు రాష్ట్రాల్లో చేస్తున్న సైబర్‌నేరగాళ్ల గుర్తింపులో ఇది కీలకంగా మారింది. ఫెడ్ఎక్స్ కొరియర్ సైబర్‌నేరగాళ్లు ఫెడ్ఎక్స్ ఉద్యోగుల పేరిట, పోలీసులు, కస్టమ్స్ అధికారుల పేరిట ముందుగా ఫేక్ ఫోన్‌కాల్స్ చేస్తారు. మీ పేరిట వచ్చిన పార్సిల్లో డ్రగ్స్, ఇతర అనుమతి లేని పదార్థాలు ఉన్నాయని, మీపై కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బు ఇవ్వాలని అమాయకులను డిమాండ్ చేస్తారు. ఇలాంటి ఫేక్‌కాల్స్‌కు స్పందించకూడదు. మెసేజ్‌లలో ఉండే లింక్‌లపై కూడా క్లిక్ చేయవద్దు. అడ్వర్టయిజ్మెంట్ పోర్టల్ ఆన్లైన్లో పలు రకాల వస్తువుల సేల్స్, ఆఫర్ల పేరిట ఇచ్చే యాడ్స్‌లో మోసపూరితమైనవి ఉంటాయన్నది గ్రహించాలి. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లను ప్రస్తావించి సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలు చేస్తున్నారు. అధికారిక వెబ్సైట్లలో మాత్రమే వివరాలు తెలుసుకోవాలి. మోసపూరిత లింక్‌లపై క్లిక్ చేయవద్దు. బిజినెస్‌లో పెట్టుబడుల పేరిట తక్కువ పెట్టుబడి, అతి తక్కువ సమయంలోనే అత్యధిక లాభాలు అని ఊదరగొడుతున్నారంటే అది మోసపూరితమైనదే అని అనుమానించాలి. అసాధారణమైన హామీలు ఇస్తున్నారంటే వెంటనే వివరాలు తప్పక పరిశీలించాలి. ఎక్కువగా రియల్ఎస్టేట్లో పెట్టుబడులు, క్రిప్టోకరెన్సీ సంబంధిత పెట్టుబడులు, పిరమిడ్ స్కీంలు, మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు ఈ తరహావే. ఆన్లైన్ లోన్లు ఆర్థిక అవసరాలే బలహీనతగా ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే ఆన్లైన్లో రుణాలు ఇస్తామంటూ మోసం చేస్తారు. వ్యక్తిగత, బ్యాంకు వివరాలు తీసుకొని ఆర్థిక మోసాలు ఒక తరహావి అయితే, ఆన్లైన్ యాప్‌లలో రుణాలు ఇచ్చి తర్వాత అత్యధిక వడ్డీల కోసం వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఉంటున్నాయి. వీలైనంత వరకు ఆన్లైన్ రుణ యాప్‌ల జోలికి వెళ్లవద్దు. ఆర్బీఐ అనుమతి ఉందా లేదా అని తప్పకచూడాలి. క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాల సేకరణ బ్యాంకు అధికారులుగా చెబుతూ కేవైసీ అప్డేషన్, మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు బ్లాక్ అయ్యిందంటూ.. సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి మోసాలకు పాల్పడతారు. మన నుంచే బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు తెలుసుకొని ఆన్లైన్లో డబ్బు కొల్లగొడతారు. బ్యాంకు అధికారులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఖాతాదారులకు ఫోన్ చేసి వివరాలు అడగరనేది అందరూ గుర్తించాలి. -
‘పార్సిల్ స్కాం పసిగట్టండి ఇలా..’
సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయని వస్తువుల పేరుతో పార్సిల్ వచ్చిదంటూ అమాయకులకు ఫోన్లు చేసి డబ్బు గుంజుతున్నారని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వివిధ మార్గాల్లో సేకరించి ఆ వివరాలతో వారికి పార్సిల్ వచ్చిందంటూ మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. ఇలా అపరిచిత వ్యక్తులు పంపే పార్సిళ్లలో కొన్ని అక్రమ పదార్థాలు, వస్తువులు ఉంటున్నాయని... అడిగినంత డబ్బు పంపకపోతే అరెస్టు తప్పదని బ్లాక్మెయిల్ చేస్తూ వీలైనంత డబ్బు గుంజుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలా గుర్తించాలంటే... ♦ ఆటోమేటెడ్ వాయిస్ మెసేజ్ ద్వారా వచ్చే అనుమానాస్పద వివరాలను, ఆర్డర్ చేయని వస్తువులు పార్సిల్‌గా వచ్చాయంటూ వచ్చే ఫోన్స్‌కాల్స్‌ను నమ్మొద్దు. ♦ మీకు పార్సిల్స్ వచ్చాయంటూ వచ్చే ఈ–మెయిల్స్‌లో పార్సిల్ పంపిన వారి అడ్రస్, ఫోన్ నంబర్లు పరిశీలించాలి. అనుమానాస్పద నంబర్ల నుంచి పార్సిళ్లకు సంబంధించిన మెసేజ్‌లు వస్తే అవి నకిలీవని గుర్తించాలి. మెసేజ్‌లు, ఈ–మెయిల్స్‌లో అక్షర దోషాలు, అచ్చు తప్పులను గుర్తించాలి. అలాంటివి నకిలీవని గుర్తుంచుకోవాలి. ♦ మీరు ఆర్డర్ చేయని పార్సిళ్లకు, మీ పేరిట వచ్చిన పార్సిల్లో ఏవైనా అక్రమ వస్తువులు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడి డబ్బు డిమాండ్ చేసినా డబ్బు పంపొద్దు. వెంటనే పోలీసులకు ఈ సమాచారాన్ని ఇచ్చి ఫిర్యాదు చేయాలి. -
నకిలీ వెబ్సైట్ పట్ల అప్రమత్తంగా ఉండండి
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టువెబ్సైట్ను కూడా వదిలిపెట్టలేదు. నకిలీ వెబ్సైట్ రూపొందించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యాయవాదులను, కక్షిదారులను గురువారం సూచనలు జారీ చేశారు. నకిలీ వెబ్సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సుప్రీంకోర్టు సైతం పబ్లిక్ నోటీసు జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వెబ్సైట్ లింక్‌లపై క్లిక్ చేయొద్దని, షేర్ చేయొద్దని వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు రూపొందించారని, యూఆర్ఎల్లో అందుబాటులో ఉంచారని తెలిపింది. ఈ వెబ్సైట్ ద్వారా వ్యక్తిగత, రహస్య సమాచారం సేకరించి, మోసగించే ప్రమాదం ఉందన్నారు. లాయర్ల, కక్షిదారుల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని, ఆర్థిక లావాదేవీల వివరాలను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎప్పుడూ కోరదని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. ఠీఠీఠీ.టఛిజీ.జౌఠి.జీn అనే వెబ్సైట్ మాత్రమే అసలైనదని స్పష్టం చేసింది. ఒకవేళ సైబర్ దాడి బారినపడితే బ్యాంకు ఆన్లైన్ ఖాతాల పాస్వర్డ్లు వెంటనే మార్చుకోవాలని, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. -
బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బునలా కాజేస్తున్నారు!
కడప అర్బన్: ఆధార్ కార్డుకు అనుసంధానమైన వేలి ముద్రలను డూప్లికేట్ చేసి వారి బ్యాంక్ అకౌంట్లలోంచి నగదు కాజేస్తున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ప్రకాశం జిల్లాకు చెందిన నల్లగళ్ల వెంకటే‹Ù, గుంటూరుకు చెందిన మాల్యాద్రి మల్లఅజయ్, గంటా కళ్యాణ్, పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన షేక్ జానీ, పసుపులేటి గోపి ఉన్నారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ బుధవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో కడప నగరానికి చెందిన శంకరయ్య తన ఎస్బీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.5,500 విత్ డ్రా అయినట్టు కడప సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేయడంతో నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఈ ఫిర్యాదు నమోదైంది. కాగా, ఈ నెల 15న ఓ వ్యక్తి వాట్సాప్, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా శంకరయ్యకు ఫోన్ చేసి ‘నువ్వు ఫిర్యాదు చేయడం వల్ల నా అకౌంట్ ఫ్రీజ్ చేశారు. రేపటిలోగా నా అకౌంట్‌ను అన్‌ఫ్రీజ్ చేయించకుంటే చంపేస్తాం’ అంటూ బెదిరించాడు. దీనిపై బాధితుడు కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ తుషార్‌డూడీ ఆధ్వర్యంలో స్పెషల్ టీంలను నియమించి విచారణ చేపట్టారు. అలా వారి ఖాతాలకు నగదు బదిలీ ఈ నేరం ఆధార్ ఎనేబుల్ సిస్టం(ఏఈపీఎస్)ద్వారా ఫిర్యాది బయోమెట్రిక్(వేలిముద్రలు)లను నకిలీవి సృష్టించి వాటి సాయంతో కస్టమర్ సరీ్వస్ పాయింట్స్(బిజినెస్ కరస్పాండెంట్స్)లోని బయోమెట్రిక్ డివైస్‌లో స్కాన్ చేసి ఫిర్యాది ఆధార్ కార్డు లింక్ చేసి ఉన్న బ్యాంకు అకౌంట్ నుంచి రూ.5,500 విత్‌డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నగదు విత్‌డ్రా జరిగిన ప్రదేశం కడప పట్టణంలో ఉందని గుర్తించారు. అలాగే అనుమానితుల ఫోన్ నంబర్లను ట్రాక్ చేసి కడప ఓల్డ్ బైపాస్ వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో వెంకటేష్(బిజినెస్ కరెస్పాండెంట్) బ్లాక్ మార్కెట్ ద్వారా ఏపీ, తెలంగాణ ప్రజల వేలిముద్రలు, ఆధార్‌కార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి, నిందితుల సాయంతో బాధితుల బ్యాంక్ ఖాతాల నుంచి నగదును తమ ఖాతాలకు బదిలీ చేసేవారు. నిందితుల నుంచి కారు, నాలుగు సెల్ఫోన్లు, నేరాలకు ఉపయోగించే డివైస్‌లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులపై 4 ఎఫ్ఐఆర్లు, 412(నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్) ఎన్సీఆర్పీ పిటిషన్లు నమోదైనట్లు, దేశంలో మొత్తం 416 మంది బాధితులను గుర్తించారు. -
మూడున్నరేళ్లు..రూ. 258 కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో/హిమాయత్‌నగర్: రోజుకు రూ.20 లక్షలు.. వారానికి రూ.1.41 కోట్లు.. నెలకు రూ.6.06 కోట్లు... ఏడాదికి రూ.73.7 కోట్లు.. నగర వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు కాజేసిన మొత్తం సరాసరీ ఇది. 2020 జనవరి 1–2023 జూన్ 30 మధ్య నగర వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.258 కోట్లు స్వాహా చేశారు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసులు వెల్లడిస్తున్న గణాంకాలివి. పరువు, మర్యాద, సమయం లేకపోవడం... ఇలా అనేక కారణాల వల్ల పోలీసుల వరకు రాని కేసుల్లో నçష్టపోయింది దీనికి రెట్టింపు ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. దర్యాప్తు అత్యంత జటిలం.. చాలా మందిలో అత్యాశ, తేలిగ్గా వచ్చే డబ్బుపై మక్కువే సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఈ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో.. కేసుల దర్యాప్తు, నేరగాళ్లను పట్టుకోవడం, అభియోగపత్రాల దాఖలు అంత కష్టం. కోవిడ్ కాలంలో ఉత్తరాదికి చెందిన వారిలో అనేక మంది జీవనోపాధి కోల్పోయారు. వీరిలో అత్యధికులు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సైబర్ మోసాలకు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, పార్ట్ టైం ఉద్యోగాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, గిఫ్ట్‌లు, లాటరీ, కేబీసీ, ఓటీపీ, మాట్రిమోనియల్, ఆన్లైన్ సూడో పోలీసు, కేవైసీ అప్డేట్, కరెంట్ బిల్లులు చెల్లింపు, వర్క్ ఫ్రమ్ హోమ్, జాబ్ ఫ్రాడ్స్, పార్ట్‌టైహ్ జాబ్స్.. ఇలా వివిధ పంథాల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆ లింకులు క్లిక్ చేస్తే ముప్పే.. రాజస్థాన్, బిహార్, యూపీ, ఢిల్లీ, ఝార్ఖండ్ సహా ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాలకు చెందిన వారు వ్యవస్థీకృతంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. బాధితుల ప్రమేయం లేకుండానే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్‌లో యాడ్ చేసి ‘మైండ్ గేమ్’ ఆడుతున్నారు. వీరికి నమ్మకం కలిగించేందుకు నలుగురైదుగురితో తాము ఇప్పుడే రూ.లక్షల లాభాలు ఆర్జించామని, ఆ మొత్తం డ్రా చేసినట్లు చాటింగ్ చేయిస్తున్నారు. ఇలా తమ వలలో పడిన వారికి ప్రత్యేక లింకులు పంపుతూ ఉచ్చులోకి దింపుతున్నారు. కొన్ని రకాల ప్రత్యేక లింకుల ద్వారా మాల్వేర్స్ పంపిస్తున్నారు. ఇలా వీరి సెల్‌ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు తమ అదీనంలోకి తీసుకుంటున్నారు. ఆపై నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీలు, పాస్వర్డ్స్ తస్కరించి అందినకాడికి దండుకుంటున్నారు. పట్టుకోవడం కష్టం.. రికవరీ అసాధ్యం.. సైబర్ మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు ఎక్కడా తమ ఉనికి బయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులు సహా ఏ ఒక్కటీ తమ పేరుపై లేకుండా కథ నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కేసుల్లో నేరగాళ్లను పట్టుకోవడం కష్టసాధ్యం, కాలయాపనతో కూడింది అవుతోంది. ఈలోపు వారి చేతుల్లోకి వెళ్లిన డబ్బు మరో చోటకు చేరడమో, ఖర్చు కావడమో జరిగిపోతోంది. ఫలితంగా నిందితులు దొరికినా రికవరీలు మాత్రం అసాధ్యమవుతున్నాయి. ఈ కేసుల దర్యాప్తు పూర్తి చేసి, కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయడానికీ సమయం పడుతోంది. కంప్యూటర్లు, సెల్ఫోన్లు, హార్డ్ డిస్క్‌లు తదితరాలను విశ్లేíÙంచి, రిపోర్టు ఇవ్వడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ వద్ద కాలయాపన జరుగుతోంది. ఫలితంగా అభియోగపత్రాల దాఖలు కు చాలా సమయం పడుతోంది. -
సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తు.. ‘పింక్ వాట్సాప్’!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ద్వారా ప్రజల నుంచి భారీగా డబ్బు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త మార్గాలను తెరపైకి తెస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల వినియోగదారుల్లో అత్యధికం మంది ఉపయోగించే వాట్సాప్ ద్వారా మాల్వేర్లను చొప్పించే ప్రణాళికను ఇటీవల కాలంలో అమలు చేస్తున్నారు. ఆకుపచ్చ రంగులో కనిపించే వాట్సాప్... సరికొత్త ఫీచర్లతో గులాబీ రంగులో (పింక్) వచ్చిందంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇందుకోసం వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోవాలంటూ సైబర్ నేరగాళ్లు లింక్‌లు పంపుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాధారణ ఎస్ఎంఎస్లతోపాటు వాట్సాప్ మెసేజ్‌ల రూపంలో ఈ లింక్‌లు పంపుతున్నట్లు తెలిపారు. ఎవరైనా ఈ లింక్‌లను క్లిక్ చేసి అది అడిగే అప్డేట్ కోసం ఫోన్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేస్తే ఫోన్లోని ఫొటోలు, కాంటాక్ట్ నంబర్లు, బ్యాంకుల పాస్‌వర్డ్‌ల వంటి వివరాలన్నీ సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఆయా వ్యక్తులు సభ్యులుగా ఉండే వాట్సాప్ గ్రూప్లలోకి ఆటోమేటిక్‌గా పింక్ వాట్సాప్ పేరిట లింక్‌లు షేర్ అవుతాయని పేర్కొన్నారు. కీబోర్డ్ ఆధారిత మాల్వేర్లను పింక్ వాట్సాప్‌లోకి చొప్పించడం ద్వారా బ్యాంకు పాస్‌వర్డ్‌లను తస్కరించి సైబర్ నేరగాళ్లు డబ్బు కొట్టేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పింక్ వాట్సాప్ పేరిట వచ్చిన లింక్‌లను ఓపెన్ చేసి ఎవరైనా ఇన్స్టాల్ చేసుకొని ఉంటే వాటిని వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలని సూచిస్తు న్నారు. అన్ఇన్స్టాల్ చేస్తేనే ఆ నకిలీ లింక్‌లను షేర్ కాకుండా ఆపగలుగుతామని చెబుతున్నారు. ఒకవేళ మనకు తెలిసిన వారి నుంచి ఇలా పింక్ వాట్సాప్ పేరిట ఏవైనా మెసేజ్‌లు వస్తే వారిని వెంటనే అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. -
ఢిల్లీలో భారీ సైబర్ క్రైం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర నార్కోటిక్స్ డివిజన్ అధికారులమంటూ ఢిల్లీకి చెందిన ఓ వైద్యురాలి(34) నుంచి సుమారు రూ.4.50 కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఢిల్లీలో ఇంత భారీ స్థాయిలో జరిగిన ఈ తరహా సైబర్ నేరం ఇదేనంటున్నారు పోలీసులు. ఫెడ్ఎక్స్ కొరియర్ సర్వీస్ ద్వారా ఆమె పేరుతో ముంబై నుంచి తైవాన్ వెళ్లాల్సిన పార్సిల్లో ఇతర వస్తువులతోపాటు డ్రగ్స్ ఉన్నాయంటూ నేరగాళ్లు మే 5న సదరు బాధితురాలికి ఫోన్ చేశారు. అది మొదలుకొని అంధేరి పోలీస్ స్టేషన్, ముంబై డీసీపీ, ఆర్బీఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ అధికారుల పేరుతో పలువురు స్కైప్ ద్వారా మాట్లాడుతూ ఆమెకు మాయమాటలు చెప్పారు. ఈ విషయాలను భర్త సహా ఎవరికీ చెప్పొద్దంటూ నమ్మించారు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్‌గా ఉన్న రూ.4.47 కోట్లను డ్రా చేయించి, ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేయించుకున్నారు. స్కైప్ ద్వారా జరిగిన సంభాషణలను డిలీట్ చేయించారు. డబ్బును తిరిగి ఇస్తామన్న మోసగాళ్లు ఎంతకీ ఇవ్వకపోవడంతో బాధితురాలు మోసం గ్రహించి, పోలీసులను ఆశ్రయించారు. -
సైబర్ వలలో మహిళలు!
సాక్షి, సిటీబ్యూరో: ‘వేసవి సెలవులు వచ్చాయి..మా పిల్లలకు యోగా నేర్పించాలని అనుకుంటున్నాం’ అంటూ గచ్చిబౌలికి చెందిన ఓ యోగా శిక్షకురాలికి ఫోన్ వచ్చింది. సరే అని ఆమె సమయం, ఫీజు తదితర వివరాలు తెలిపింది. అడ్వాన్స్ చెల్లిస్తామని శిక్షకురాలి బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్ కార్డు వివరాలను సైబర్ నేరస్తులు తీసుకున్నారు. ఫోన్ పే ద్వారా తాము పంపిన లింక్‌కు రూ.10 చెల్లించండి, మీ ఖాతా అని నిర్ధారించుకున్న తర్వాత అడ్వాన్స్ పంపిస్తామని కేటుగాళ్లు సూచించారు. నిజమేనని నమ్మిన ఆమె నగదు బదిలీ చేయగానే క్షణాల్లో ఆమె ఖాతాలోని డబ్బు ఖాళీ అయిపోయింది. లింక్‌లు పంపించి బురిడీ.. ఇంట్లోనూ ఉంటూ నెలకు రూ.లక్షల్లో సంపాదించుకోండి’ అంటూ సైబర్ నేరస్తులు వల విసురుతున్నారు. నిజమేనని నమ్మి గృహిణులు చేతిలోని సొమ్ము, బ్యాంకు ఖాతాలో ఉన్న నగదునూ పోగొట్టుకుంటున్నారు. మహిళలు ఎక్కువగా ఉద్యోగం, వివాహం, ఆన్లైన్ ట్రేడింగ్ వంటి సైబర్ మోసాల బారిన పడుతున్నారని, సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లలో ఈ తరహా కేసులు పెరిగిపోతున్నాయని పోలీసులు చెబుతున్నారు. నగరంలో జీవన వ్యయం పెరిగింది. భార్యభర్తలిద్దరూ సంపాదిస్తే తప్ప గడవని పరిస్థితి. తమ చదువు, విజ్ఞానానికి అనుగుణంగా గృహిణులు టైలరింగ్, బ్యూటీషియన్, బేకింగ్ వంటి ఉపాధి అంశాలను ఎంచుకోవటం సాధారణం. ఆన్లైన్ లావాదేవీలు పెరిగాక ఈ రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ట్యూషన్లు, సంగీతం, యోగా, నృత్యం, డిజిటల్ ప్రకటనలు, పెట్టుబడులు తదితర అంశాలను నగర మహిళలు ఉపాధిగా మలుచుకుంటున్నారు. ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకూ సంపాదిస్తున్నారు. ఈ వెసులుబాటును సైబర్ నేరస్తులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్లతో.. ప్రముఖ సంస్థల పేర్లతో నకిలీ వెబ్సైట్లు రూపొందించి గృహిణులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అదనపు సంపాదన కోసం మేమిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ ఆశ చూపిస్తున్నారు. మాయగాళ్ల వలకు చిక్కి రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు వస్తాయని మోసగాళ్ల ప్రకటనను నమ్మిన ఓ యువతి ఒంటి మీద బంగారం అమ్మి మరీ పెట్టుబడి పెట్టడం ఇందుకు ఉదాహరణ. కుటుంబానికి అండగా నిలవాలన్న ఆలోచన మంచిదే కానీ.. ఆన్లైన్ ద్వారా వచ్చే సందేశాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రకటనలు తేలిగ్గా నమ్మకూడదు. వాటిలో ఎంత వరకు నిజమో నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. -
ఈ–కామర్స్ సైట్ల నుంచే డేటా లీక్.. ఇంటి దొంగల పనే ఇదంతా..!
ఈ రోజుల్లో సరుకులు, కూరగాయల నుంచి దుస్తుల వరకూ ప్రతీది ఆన్లైన్లో కొనేయడం అలవాటైపోయింది. అయితే ఆన్లైన్ షాపింగ్‌లో కస్టమర్ల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోయింది. కస్టమర్ల పేరు, చిరునామా, క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, కొనుగోలు చేసిన వస్తువులు.. ఇలా ప్రతీ ఒక్కటీ బహిరంగ మార్కెట్లోకి అలవోకగా వచ్చేస్తున్నాయి. భద్రంగా ఉండాల్సిన కస్టమర్ల వ్యక్తిగత వివరాలు అంగట్లో సరుకులుగా విక్రయిస్తున్నట్లు ఇటీవలసైబరాబాద్ పోలీసులు డేటాలీక్, విక్రయం కేసు విచారణలో గుర్తించారు. అమెజాన్, బిగ్‌బాస్కెట్, జొమాటో వంటి పదుల సంఖ్యలోని ఈ–కామర్స్ సైట్లలోని కస్టమర్ల డేటాను నేరస్తులు అమ్మకానికి పెట్టారు. – సాక్షి, హైదరాబాద్ ఇంటి దొంగల పనే.. ఆయా ఈ–కామర్స్ వెబ్సైట్లలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు సైబర్ నేరగాళ్లు డబ్బులు చెల్లించి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఆర్డర్ చేసిన వస్తువులతోపాటు కస్టమర్ల డేటా కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ప్రముఖ ఈ–కామర్స్ సైట్లలో డేటాను డెలివరీ పాయింట్స్ నుంచి సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేస్తున్నారు. తర్వాత టెలికాలర్స్తో కస్టమర్లకు ఫోన్ చేయిస్తున్నారు. ఫలానా సైట్ ద్వారా మీరు వస్తువు కొనుగోలు చేశారు.. కంపెనీ తీసిన లక్కీడీప్‌లో మీరు ఖరీదైన కారు, అందుకు సమానమైన నగదు బహుమతి గెలుచుకున్నారంటూ ఫోన్లో నమ్మిస్తున్నారు. జీఎస్టీ, ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్ ఇలా రకరకాల చార్జీలు చెల్లించాలని, అవన్నీ తిరిగి రీఫండ్ చేస్తామంటూ బురిడీ కొట్టించి లక్షల రూపాయలు కాజేసి ఫోన్లు స్విచాఫ్ చేస్తున్నారు. ఇలా సైబర్ నేరస్తులు దేశవ్యాప్తంగా వందలాది మందిని మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అప్రమత్తత అవసరం నిందితులు విక్రయానికి పెట్టిన వాటిలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్‌పే, బిగ్ బాస్కెట్, బుక్‌మై షో, ఇన్‌స్ట్రాగామ్, జొమాటో, పాలసీ బజార్, ఓఎల్ఎక్స్, బైజూస్, వేదాంతు వంటి సంస్థల వినియోగదారుల డేటా కూడా ఉంది. యూజర్ల సెన్సిటివ్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ (ఎస్పీడీఐ)ను గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ఈ–కామర్స్ సంస్థలదే. కానీ, ఆయా సంస్థలు ఐటీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో వ్యక్తిగత వివరాల నమోదు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. -
నంబర్ ఇక్కడ..వాట్సాప్ అక్కడ!
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ డీపీలతో టోపీ వేస్తున్న సైబర్ నేరగాళ్లు కొత్త పంథా అనుసరిస్తున్నారు. బేసిక్ ఫోన్లలో ఉన్న సెల్ నంబర్లను గుర్తించి వాటికి సంబంధించిన వాట్సాప్‌ను తమ స్మార్ట్ఫోన్లలో యాక్టివేట్ చేసుకుంటున్నారు. వైఫై ద్వారా కథ నడుపుతూ డబ్బు, గిఫ్ట్ వోచర్ల పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. ‘డీపీ ఫ్రాడ్స్’పై అధ్యయనం చేసిన హైదరాబాద్ సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు.. రెండు రకాలుగా ఇతరుల వాట్సాప్‌లు సైబర్ నేరగాళ్ల వద్దకు వెళ్తున్నాయని గుర్తించారు. కొన్నాళ్లకు వినియోగించడం మానేసి.. ఒకరి పేరుతో ఉన్న సెల్ నంబర్‌కు సంబంధించిన వాట్సాప్‌ను వినియోగించుకోవడానికి సైబర్ నేరగాళ్లు వ్యహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.నకిలీ పత్రాలతో గ్రామీణ ప్రాంతాల్లో సిమ్‌కార్డులు కొని వాటి ద్వారా వాట్సాప్‌ను యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఆపై కొన్నిరోజులకు ఆ నంబర్‌ను నేరుగా వాడటం మానేసి కేవలం వైఫై ద్వారానే వాట్సాప్ వాడుతున్నారు. దీంతో నిర్ణీతకాలం తర్వాత సర్విస్ ప్రొవైడర్లు ఆ నంబర్‌ను మరొకరికి కేటాయిస్తున్నారు. ఇలా తీసుకున్న వాళ్లు ఈ నంబర్‌తో వాట్సాప్ యాక్టివేట్ చేసుకోకున్నా లేదా బేసిక్ ఫోన్లు వాడుతున్నా వాట్సాప్ నంబర్ పాత యజమాని వద్దే ఉండిపోతోంది. సాధారణ ఫోన్లలో ఉన్నవి గుర్తిస్తూ.. సైబర్ నేరాల కోసం మరొకరి వాట్సాప్‌ను తమ స్వాధీనంలోకి తీసుకోవడానికి సైబర్ నేరగాళ్లు మరో విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓ సిరీస్‌లోని నంబర్లను తమ స్మార్ట్ఫోన్లలో వేర్వేరు పేర్లతో సేవ్ చేసుకొని వాటిల్లో వాట్సాప్ యాక్టివేట్ అయిందో లేదో తెలుసుకుంటున్నారు. యాక్టివేట్ కాని వాటిని వైఫై ద్వారా వాడే తమ స్మార్ట్ఫోన్లలో వాడటానికి ఓటీపీ అవసరం. దీంతో సేల్స్, కాల్‌సెంటర్ల పేర్లతో వారికి ఫోన్లుచేసి ఓటీపీ తెలుసుకుంటున్నారు. ఇది ఎంటర్ చేయడంతోనే అవతలి వారి నంబర్‌తో వాట్సాప్ వీరి ఫోన్లలో యాక్టివేట్ అవుతోంది. విషయం ఫోన్‌నంబర్ వాడే వారికి తెలియట్లేదు. కష్టసాధ్యంగా దర్యాప్తు.. ఈ వాట్సాప్‌లను వాడి ప్రముఖులు, అధికారుల ఫొటోలు డీపీలుగా పెడుతున్న సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్ ద్వారా వారి సంబందీకుల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. వాళ్లకు వారి బాస్‌లు, ప్రముఖుల మాదిరిగా వాట్సాప్ సందేశాలు పంపి డబ్బు, గిఫ్ట్ వోచర్లు డిమాండ్ చేసి కాజేస్తున్నారు. దీనిపై కేసులు నమోదవుతున్నా వాట్సాప్‌కు సంబంధించిన ఫోన్ నంబరే దర్యాప్తునకు ఆధారంగా మారుతోంది. అలా ముందుకు వెళుతున్న అధికారులకు దాని యజమానుల ఆచూకీ లభిస్తోంది తప్ప వాట్సాప్ యాక్టివేట్ చేసుకొని వినియోగిస్తున్న వారు పట్టుబడట్లేదు. వారిని కనిపెట్టడం కూడా కష్టంగా మారడంతో దర్యాప్తులు జటిలంగా మారుతున్నాయి. ఆన్లైన్లో నగదు కాజేసిన కేసుల్లో నిందితులు దొరకడం అరుదు కాగా.. గిఫ్ట్ వోచర్ల రూపంలో కొల్లగొట్టిన వాళ్లు చిక్కడం దుర్లభమవుతోంది. నేరుగా సంప్రదించడం ఉత్తమం.. వాట్సాప్ మోసాల బారినపడకుండా ప్రతి ఒక్కరూ కనీ స జాగ్రత్తలు తీసుకోవాలి. సందేశం వచ్చిన వెంటనే కేవలం డీపీ ఆధారంగా కాకుండా ఫోన్‌నంబర్ చూశా కే ఎదుటి వ్యక్తి ఎవరన్నది ఖరారు చేసుకోవాలి. అవసరమైతే ఫోన్ చేసి లేదా నేరుగా సంప్రదించాకే లావాదేవీలు చేయాలి. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ -
ఐటీ అధికారులకూ ‘సైబర్’ స్ట్రోక్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సైబర్ నేరగాళ్లు ఎవర్నీ వదలటం లేదు. ఆదాయ పన్ను శాఖ అధికారులకు రూ.1.10 లక్షలకు టోకరా వేశారు. విశాఖపట్నానికి చెందిన ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఉన్నతాధికారి పేరిట అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపాలంటూ మెసేజ్ పంపిన సైబర్ నేరగాళ్లు.. వచ్చిన గిఫ్ట్‌కార్డు నుంచి ఆ మొత్తాన్ని వెంటనే తమ ఖాతాలోకి జమ చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ నుంచి నడిపిన ఈ వ్యవహారంపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసిన విశాఖ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాట్సాప్ డీపీతో బోల్తా ఢిల్లీ కేంద్రంగా విధులు నిర్వర్తించే ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పంపినట్టుగా విశాఖలోని ఐటీ శాఖ అధికారికి ఇటీవల వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. సదరు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఫొటో డీపీగా ఉన్న ఫోన్ నంబరు నుంచి.. అమెజాన్ గిఫ్ట్ కూపన్ల రూపంలో రూ.1.10 లక్షలను తనకు అత్యవసరంగా పంపాలని ఆ మెసేజ్‌లో ఉంది. ఆ మొత్తాన్ని త్వరలో తిరిగి ఇస్తానని కూడా మెసేజ్ చేశారు. ఈ సమాచారాన్ని అందుకున్న అసిస్టెంట్ కమిషనర్.. వెంటనే ఆ మొత్తాన్ని ఉన్నతాధికారికి పంపాలంటూ డిప్యూటీ కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు సదరు అధికారి రూ.1.10 లక్షల విలువ చేసే అమెజాన్ గిఫ్ట్ కూపన్లు కొనుగోలు చేసి ఆ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా ఆ నంబర్‌కు పంపారు. సదరు సైబర్ నేరగాడు వెంటనే ఆ కూపన్లను రెడీమ్ చేసుకున్నారు. తాము మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విశాఖ పోలీసులు విచారణ చేపట్టారు. సమాచారం పంపిన ఫోన్ నంబరు రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ ప్రాంతం నుంచి వచ్చిందని ప్రాథమికంగా తేల్చారు. ప్రత్యేక టీమ్‌తో విచారణ సైబర్ నేరగాళ్లు అందరినీ లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకీ ఈ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. దీనిని కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇలాంటి నేరాలపై విచారణ కూడా వేగవంతం చేస్తున్నాం. విశాఖ ఆదాయ పన్ను శాఖ అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. ఒక టీమ్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నాం. – శ్రీకాంత్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ -
ఆ వీడియో కాల్ ఎత్తారో..బతుకు బస్టాండే
సాక్షి, హైదరాబాద్: ‘నార్సింగికి చెందిన వ్యక్తికి గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే అటువైపు స్క్రీన్‌పై ఎలాంటి ఆడియో, వీడియో లేదు. తెర బ్లాక్‌గా కనిపించింది. కాల్ కట్ అయిన కొన్ని నిమిషాల తర్వాత.. తనకొచ్చిన మెసేజ్ చూసి బాధితుడు షాకయ్యాడు. తన ముఖాన్ని మార్ఫింగ్ చేసిన న్యూడ్ వీడియో అది! అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే ఈ వీడియోను కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న స్నేహితులు, బంధువులకు పంపిస్తామని సైబర్ నేరస్తులు బెదిరించారు. దీంతో ఏం చేయాలో తోచని బాధితుడు మొదట రూ.5 వేలు ఆన్లైన్లో చెల్లించి, దాని స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు. మరోసారి ఫోన్ చేసిన నిందితులు రూ.30 వేలు డిమాండ్ చేశారు. భయపడిపోయిన బాధితుడు మళ్లీ సమర్పించుకున్నాడు. ఈసారికి రూ.20 వేలు పంపించాలని బెదిరించడంతో అలాగే పంపాడు. అయినా వారి నుంచి బెదిరింపులు ఆగకపోవటంతో పోలీసులను ఆశ్రయించాడు.’ ఇప్పటివరకు సైబర్ నేరస్తులు అమ్మాయిలుగా బాధితులకు ఫోన్ చేసేవారు. చదవండి: (Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తున్నారా.. అయితే ఇక కష్టమే..) కొద్ది సేపు మాట్లాడిన తర్వాత నగ్నంగా వీడియో కాల్ చేసుకుందామని నమ్మించేవారు. బాధితుడికి అవతలి వైపున కనిపించే న్యూడ్ అమ్మాయి నిజమేనని భావిస్తాడు. వాస్తవానికి అక్కడ ప్లే అయ్యేది అశ్లీల వీడియో మాత్రమే. ఈ విషయం తెలియని బాధితుడు అవతలి వ్యక్తి సూచించినట్లుగా న్యూడ్‌గా మారతాడు. ఈ తతంగమంతా సైబర్ నేరస్తులు రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత కొద్ది సేపటికి బాధితుడికి ఫోన్ చేసి తన న్యూడ్ వీడియోను పంపించి, బ్లాక్ మెయిల్ చేస్తారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కాల్ లిస్ట్‌లో ఉన్న స్నేహితులు, బంధువులకు ఈ వీడియో పంపిస్తామని బెదిరించేవారు. కానీ, తాజాగా నార్సింగి పీఎస్‌లో నమోదైన వాట్సాప్ వీడియో కాల్లో.. నేరస్తుల తరుఫున ఆడియో గానీ వీడియో గానీ ప్లే అవ్వలేదు. కేవలం బాధితుడి వీడియోను రికార్డ్ చేసి, ఆపై దాన్ని న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి బెదిరించి అందినకాడికి దోచుకున్నారు. బాధితుల నంబర్లు ఎక్కడివి? సాధారణంగా సైబర్ నేరస్తులు బాధితుల ఫోన్ నంబర్లను సోషల్ మీడియా ఖాతాల నుంచి సేకరిస్తుంటారు. మరికొంత మంది నేరస్తులు జాబ్ పోర్టల్స్, షాపింగ్ వెబ్సైట్లలో నమోదయిన ఫోన్ నంబర్లను థర్డ్ పార్టీ నుంచి కొనుగోలు చేస్తుంటారని ఓ సైబర్ క్రైమ్ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఈ కేసులో బాధితుడి నంబర్ నేరస్తుల చేతికి ఎలా చిక్కిందనేది ఇంకా తేలలేదని తెలిపారు. -
మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మహేష్ కో–ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్‌పై సైబర్ నేరగాళ్లు దాడి చేశారు. బ్యాంకు అధికారుల ప్రమేయం లేకుండానే ఇటీవల తెరిచిన మూడు కరెంట్ ఖాతాల్లోకి బ్యాంకు చెస్ట్ ఖాతా నుంచి రూ.12.4 కోట్లు మళ్లించారు. ఈ విషయం గుర్తించిన బ్యాంకు అధికారులు సోమవారం సిటీ సైబర్ క్రై మ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శని, ఆదివారాల్లో పని కానిచ్చేశారు బషీర్‌బాగ్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న మహేష్ బ్యాంకుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖలు ఉన్నాయి. వీటి ఖాతాల నిర్వహణకు సంబంధించిన ప్రధాన సర్వర్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రై వేట్ కార్యాలయం కేంద్రంగా పని చేస్తుంటుంది. అయితే గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు దీన్ని హ్యాక్ చేశారు. దీని ద్వారా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన సూపర్ అడ్మిన్‌యూజర్ ఐడీ, పాస్వర్డ్ సంగ్రహించారు. దీనికి ముందే కొందరు స్థానికుల సహకారంతో నగరంలోని సిద్ధిఅంబర్‌బజార్, అత్తాపూర్‌ల్లో ఉన్న మహేష్ బ్యాంకుల్లో ఇటీవల మూడు కరెంట్ ఖాతాలు తెరిచారు. శని, ఆదివారాల్లో బ్యాంకు పని చేయని నేపథ్యంలో అదును చూసుకున్న సైబర్ నేరగాళ్లు సూపర్ అడ్మిన్‌యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఆధారంగా లాగిన్అయి, బ్యాంకు చెస్ట్ ఖాతాలోని నగదు రూ.12.4 కోట్లను ఆ మూడు ఖాతాల్లోకి మళ్లించారు. ఆ మూడు ఖాతాల్లోకి వచ్చిన డబ్బును ఉత్తరాదితో పాటు త్రిపుర, అసోం, సిక్కింల్లోని వివిధ బ్యాంకుల్లో తెరిచిన 127 ఖాతాల్లోకి మళ్లించుకుని చాలా వరకు డ్రా చేసేశారు. ఇతర పనుల నిమిత్తం ఆదివారం సాయంత్రం బ్యాంక్‌కు వచ్చిన అధికారులు విషయం తెలుసుకుని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హ్యాకింగ్‌లో నైజీరియన్ల పాత్ర ఉన్నట్టు భావించి ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఖాతాలు తెరిచిన వ్యక్తులను సైబర్ క్రై మ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తూ సూత్రధారులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నగదు చేరిన ఖాతాల్లో కొన్నింటిని ఫ్రీజ్ చేయించారు. వాటిలో రూ.2 కోట్ల వరకు ఉన్నట్లు తెలిసింది. -
జీఎస్టీ పేరుతో విడతల వారీగా రూ.5.90 లక్షలు కాజేశారు
గూడూరు: పెద్ద మొత్తంలో నగదు గెలుచుకున్నారని ఆశపెట్టి గిరిజన దంపతులను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. రెక్కలుముక్కలు చేసుకొని ఇంటి కోసమని కూడబెట్టుకున్న సొమ్మును దోచేశారు. రూ.12.80 లక్షలు గెల్చుకున్నారని మభ్యపెట్టి.. రూ.5.90 లక్షలు కాజేశారు. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. గూడూరు మండలం పురిటిపాళెంకు చెందిన కమ్మంపాటి మహేష్, లక్ష్మీదేవి.. కొలనుకుదురులో రొయ్యల చెరువుల వద్ద కాపలా ఉంటున్నారు. వారి పెద్ద కుమారుడు చెంచయ్య వరి కోత మిషన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబమంతా కలిసి ఇల్లు నిర్మించుకునేందుకని రూ.2.50 లక్షలు పొదుపు చేసుకున్నారు. ఈ క్రమంలో గతేడాది వినాయక చవితికి ముందు లక్ష్మీదేవికి ఓ ఉత్తరం వచ్చింది. అందులో రూ.12.80 లక్షలు గెల్చుకున్నట్లు ఉంది. ఆ కార్డులో ఉన్న నంబర్‌కు మహేష్, లక్ష్మీదేవి ఫోన్ చేయగా.. అవతలి వ్యక్తి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కంపెనీ ద్వారా కూపన్లు తీస్తామని.. తాజాగా తీసిన లక్కీ డ్రాలో మీకు రూ.12.80 లక్షలు వచ్చాయని చెíప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ అదే నంబర్‌కు ఫోన్ చేయగా.. ఆ మొత్తం మీ అకౌంట్లో జమ చేయాలంటే ఆధార్, పాన్‌కార్డు నంబర్లతో పాటు అకౌంట్ వివరాలు వాట్సాప్ చేయాలని సూచించాడు. అనంతరం ఆదాయ పన్ను కింద రూ.20 వేలు తమ అకౌంట్లో వేయాలని చెప్పాడు. దీనిపై మహేష్, లక్ష్మీ ప్రశ్నించగా.. ఆదాయ పన్ను చెల్లించకపోతే అధికారులు, పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారని నమ్మబలికాడు. దాంతో వారిద్దరూ ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్లో డబ్బులు వేశారు. ఈసారి జీఎస్టీ, ఇతర ఖర్చులకు డబ్బులు కావాలని చెప్పాడు. మా వద్ద డబ్బులేదని ఆ గిరిజన దంపతులు మొత్తుకున్నా.. వినకుండా ఫోన్ పెట్టేశాడు. దీంతో వారు చేసేదిలేక తమ వద్ద ఉన్న రూ.2.50 లక్షలతో పాటు అప్పు చేసి మరో రూ.3.40 లక్షలు ఇచ్చారు. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో వారు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మోసగాళ్లు 7585049583, 9831371553 ఈ నంబర్ల నుంచి ఫోన్ చేశారని గిరిజన దంపతులు తెలపగా.. ఇవి కోల్‌కతాకు చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి పేరున ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆదేశాలతో గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్ మోసానికి గురయ్యారా? వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేయండి
పాత వస్తువులను అమ్మకానికి పెట్టాలన్నా... చవగ్గా కొనాలన్నా ఇప్పుడు ఆన్లైన్ పద్ధతినే చాలా మంది ఎంచుకుంటున్నారు. ఇది సులువైన ప్రక్రియ కావడం కూడా ఇందుకు కారణం. ఇటీవల ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ ఓఎల్ఎక్స్లో తమ పాత మనీ కౌంటింగ్ మిషన్‌ను రూ.5000కు అమ్మకానికి పెట్టింది శ్రీజ(పేరు మార్చడమైనది). ఇమేజ్ అప్లోడ్ చేసిన గంట లోపు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తనను తాను పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తాను, తన అడ్రస్‌కు కొరియర్ చేయమని సూచించాడు. అందుకు సరే అంది శ్రీజ. అతను తనకు ఆర్మీ అకౌంట్ ఉందని, ముందుగా డబ్బు ట్రాన్స్ఫర్ చేయలేనని, శ్రీజ నే రూ.100 లు ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. సరే అనుకున్న శ్రీజ అతను చెప్పిన అకౌంట్‌కు ఆన్లైన్ పే యాప్స్ ద్వారా రూ.100 ట్రాన్స్ఫర్ చేసింది. అతను తిరిగి రూ.200 ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత తన ఖాతా నుంచి డబ్బు సెండ్ అవడం లేదని, ఇతరుల నుంచి డబ్బు తన ఖాతాకు రావడం లేదని మరోసారి శ్రీజ నే కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. అలా ఫోన్ మాట్లాడుతూనే అతను చెప్పిన సూచనలతో తనకు తెలియకుండానే డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది శ్రీజ. ఆ తర్వాత ఫోన్ కట్ అయ్యింది. ట్రాన్సాక్షన్స్ మెసేజ్‌లు చూసుకున్నాక శ్రీజకు దిమ్మతిరిగిపోయింది. తన అకౌంట్ జీరో బ్యాలెన్స్ చూపిస్తోంది. తిరిగి ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే, స్విచ్డాఫ్ వస్తోంది. చివరకు తను మోసపోయానని అర్ధమైంది. ఆన్లైన్ మోసం.. హెల్ప్‌లైన్ కరోనా కారణంగా ఆన్లైన్ షాపింగ్‌లు కూడా ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. అలాగే, ఆన్లైన్ మోసాలు కూడా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ఏదో ఒక మార్గంలో వినియోగదారులు/అమ్మకందారుల ఆశను ఎరగా చేసుకొని స్మూత్‌గా డబ్బు దోపిడీకి పాల్పడుతున్నారు. ఆన్లైన్ చీటింగ్ కేసుల్లో మోసపోయిన వ్యక్తులకు సాయం అందించడానికి 155260 హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంది. ఈ నెంబర్‌కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేస్తే బాధితులు సత్వర న్యాయం పొందే అవకాశం ఉంటుంది. ► ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే ఈ హెల్ప్‌లైన్ ఆన్లైన్, ఆఫ్‌లైన్... రెండు విధాలా సేవలు అందిస్తుంది. ► సూచించిన పోర్టల్‌లో .. మోసం లావాదేవీ వివరాలు (ఖాతా నంబర్, వాలెట్, యుపిఐ, లావాదేవీ జరిపిన ఐడీ, తేదీ, డెబటి/క్రెడిట్ కార్డ్ నంబర్లు.. మొదలైనవి), వ్యక్తిగత ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయాలి. ► బాధితుల బ్యాంక్ లేదా మోసం చేసి డబ్బు జమ అయిన బ్యాంక్/వాలెట్.. వంటివి నోట్ చేయాలి. ► మోసానికి సంబంధించిన పూర్తి వివరాలను పోర్టల్‌లో 24 గంటల్లోగా ఉంచాలి. ఆ వెంటనే బాధితుడు నమోదు చేసిన ఫోన్ నెంబర్‌కి మెసేజ్ వస్తుంది. ► పోర్టల్‌లో సంబంధిత బ్యాంక్, అంతర్గత సిస్టమ్‌ల వివరాలను తనిఖీ చేస్తుంది. ► బాధితుడి డబ్బు ఏ ఖాతాకు బదిలీ అయ్యిందో చూసి, ఆ డబ్బును హోల్డ్‌లో ఉంచుతుంది. అంటే, మోసగాడు ఆ డబ్బును పొందలేడు. మోసగాళ్ల చేతికి డబ్బు చేరకుండా తిరిగి పొందేంతవరకు ఈ ప్రక్రియ పునరావృతం అవుతూనే ఉంటుంది. ► సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సూచించిన అనేక బ్యాంకుల ఖాతాల నుంచి డబ్బు విత్‌డ్రా చేసినట్లయితే, తదుపరి ప్రక్రియ కోసం సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. భద్రతా సూచనలు... ► ఫోన్ సంభాషణల్లో ఉన్నప్పుడు ఎలాంటి బ్యాంకింగ్ లావాదేవీలు చేయకూడదు. ► క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా ఓటీపీ, యుపీఐఎన్, బ్యాంక్ కార్డ్ సీవీవీ నంబర్లు షేర్ చేయడం అంటే మీ ఖాతా నుండి డబ్బును మీరే వదులుకుంటున్నారని అర్ధం. ► కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్ ఇంజిన్లలో ఎప్పుడూ శోధించవచ్చు. సరైన కస్టమర్ కేర్ నంబర్ కోసం సంబంధిత యాప్ లేదా అప్లికేషన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, తెలుసుకోవాలి. ► అన్ని ఇ–మెయిల్, సోషల్ మీడియా ఖాతాల కోసం రెండు రకాల ఫోన్ నంబర్లు వాడటం శ్రేయస్కరం. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఆ యాప్‌ను ‘ఫాలో’ అయ్యారో ఫూల్స్ అయినట్టే.. ఎందుకంటే?
సాక్షి, అమరావతి: ‘లింక్ క్లిక్ చేసి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లను ఫాలో కండి. వాటిలో పోస్టులను లైక్ కొట్టి స్క్రీన్‌షాట్ తీసి అప్లోడ్ చేయండి. రోజుకు రూ.300 నుంచి రూ.30 వేల వరకు సంపాదించండి. ఇందుకోసం కొంత మొత్తాన్ని మీరు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన మొత్తాన్ని 20 రోజుల్లో తిరిగి పొందొచ్చు. ఆ తర్వాత రోజువారీ వచ్చే డబ్బంతా లాభమే’ అంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ అందినకాడికి దండుకున్నారు. (చదవండి: దీపావళికి ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..) ఇటీవల ‘నెట్‌ఫ్లిక్స్ ఫాలో’ అనే యాప్‌లో సభ్యులుగా చేరి రెండు తెలుగు రాష్ట్రాలు సహా వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది నిండా మునిగారు. అక్టోబర్ 22 నుంచి యాప్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో డబ్బు కట్టినవారు లబోదిబోమంటున్నారు. బాధితుల్లో అత్యధికులు, మెడిసిన్, డిగ్రీ విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులే. కొందరు పోలీసులు సైతం మోసపోయినవారిలో ఉండటం గమనార్హం. (చదవండి: AP: ఆర్టీసీలో ఇ–బస్సులకు లైన్‌క్లియర్) ఏంటీ ఫాలో యాప్.. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆయా ఖాతాలను ఫాలో అవుతూ.. అందులో పోస్టులకు లైక్‌లు కొడితే వేతనాలు పొందొచ్చు అంటూ ఫాలో యాప్‌ను కొద్ది నెలల క్రితం సైబర్ నేరగాళ్లు తీసుకువచ్చారు. ఇందులో రెగ్యులర్ స్టాఫ్, మేనేజర్, డైరెక్టర్, జనరల్ మేనేజర్, బాస్, సీఈవో, సీఎంవో ఇలా వివిధ హోదాలను పేర్కొన్నారు. ఈ హోదాల్లో యాప్‌లో చేరడానికి రెగ్యులర్ స్టాఫ్ రూ.3 వేలు, మేనేజర్ రూ.6 వేలు, డైరెక్టర్ రూ.15 వేలు, జనరల్ మేనేజర్ రూ.45 వేలు, బాస్ రూ.90 వేలు, సీఈవో రూ.2.70 లక్షలు, సీఎంవో రూ.6 లక్షలు చెల్లించాలని నిబంధన పెట్టారు. రోజువారీ టాస్క్‌లు ఫాలో యాప్‌లో సభ్యులకు సామాజిక మాధ్యమాల ఖాతాలను సబ్‌స్క్రైబ్ చేసి, అందులో పోస్టులకు లైక్ కొట్టే రోజువారీ టాస్క్ ఇస్తారు. హోదాను బట్టి రోజుకు 6 నుంచి 30 టాస్కులు చేయాల్సి ఉంటుంది. టాస్కులు చేసిన వెంటనే యాప్‌లో డబ్బు జమవుతాయి. టాస్కులతోపాటు తమ కింద కొత్తగా సభ్యుడిని చేర్పించినవారికి కమీషన్ల రూపంలో డబ్బులు ఇస్తూ వచ్చారు. మొదటి మూడుసార్లు రూ. వెయ్యి దాటిన వెంటనే డబ్బు బ్యాంక్ ఖాతాలోకి జమ చేసుకునేలా వీలు కల్పించారు. నాలుగోసారి నుంచి రూ.5 వేలు దాటితే నగదు బదిలీకి అవకాశమిచ్చారు. దీంతో సభ్యులుగా ఉన్నవారు ఇబ్బడిముబ్బడిగా బంధువులు, స్నేహితులను యాప్‌లో చేర్పించారు. ఫాలో యాప్‌లో సభ్యులుగా ఉన్నవారితో టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటయ్యాయి. టెలిగ్రామ్‌లో ఏర్పాటు చేసిన గ్రూప్‌లో ఏకంగా 40 వేల మందికి పైగా ఉన్నారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ మంది బాధితులు ఉన్నట్టు సమాచారం. రోజుకో ట్విస్ట్ ఈ నెల 14 వరకు టాస్కులు పూర్తి చేసి, నగదు బదిలీకి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బు జమవుతూ వచ్చాయి. ఆ తర్వాతి రోజు నుంచి నగదు బదిలీలు నిలిచిపోయాయి. బ్యాంకులకు వరుస సెలవులు ఉండటం వల్ల నగదు బదిలీలు నిలిచిపోయాయని యాప్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అనంతరం రోజుకో ట్విస్ట్‌తో ఈ నెల 22న యాప్‌ను నిలిపివేస్తున్నట్టు యాప్ ప్రతినిధులు ప్రకటించారు. గురువారం టెలిగ్రామ్‌లోని గ్రూప్‌ను కూడా తొలగించారు. స్వల్ప మార్పులతో కొత్త యాప్ ఫాలో యాప్ పేరుతో వేల మందిని బురిడీ కొట్టించి రూ. కోట్లలో కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్ల ముఠా ఇంకో కొత్త మోసానికి తెరతీసింది. ఫాలో యాప్‌కే స్వల్ప మార్పులు చేసి పేరు మార్చి కొత్తగా ప్యూర్ హార్ట్, టూబెస్ట్ అనే యాప్‌లను తాజాగా వాడుకలోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్లలో అందుబాటులో ఉండవు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో అడ్మిన్లు పంపే లింక్‌ల ద్వారానే ఈ యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.2 లక్షలు నష్టపోయా.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. నా సహ ఉద్యోగి సలహా మేరకు రూ.90 వేలు కట్టి బాస్‌గా చేరాను. నేను చెల్లించిన డబ్బు 20 రోజుల్లో వచ్చేసింది. అప్పు చేసి మరీ రూ.2.70 లక్షలు చెల్లించి సీఈవోగా రెండో అకౌంట్ తీసుకున్నాను. అకౌంట్ తీసుకున్న వారానికే యాప్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రూ.2 లక్షలు నష్టపోయాను. నా స్నేహితులు కూడా రూ.లక్షల్లో నష్టపోయారు. – రవితేజ, బాధితుడు అనంతపురం జిల్లా ప్రజలు అప్రమత్తతతో ఉండాలి మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, మనుషుల ఆలోచన సరళికి అనువుగా సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈ తరహా గొలుసుకట్టు మోసాలు అనేకం వెలుగు చూశాయి. బాధితులు పోలీసులను సంప్రదిస్తే న్యాయం చేస్తాం. ప్రజలు అప్రమత్తతతో వ్యవహరిస్తే సైబర్ నేరాల కట్టడి సాధ్యం. – రాధిక, ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ అమ్మ బంగారు గొలుసు తాకట్టు పెట్టి చేరాను నేను ప్రైవేట్ విద్యా సంస్థలో చిరుద్యోగిని. మా అమ్మ బంగారు గొలుసు తాకట్టు పెట్టి రూ.90 వేలు కట్టి సభ్యుడిగా చేరా. చేరిన నాలుగు రోజులకే యాప్ నిలిచిపోయింది. రూ.80 వేలు నష్టపోయాను. – హర్ష, బాధితుడు, కృష్ణా జిల్లా -
ఓరి దేవుడా..! హ్యాకర్లు తెలివి మీరారు..ప్రమాదంలో యూట్యూబ్ క్రియేటర్లు
యూట్యూబ్ క్రియేటర్లకు సెర్చ్ ఇంజిన్ గూగుల్ హెచ్చరికలు జారీ చేసింది. ఫిషింగ్ (ఒరిజినల్‌గా ఉండే ఫేక్ వెబ్‌సైట్స్) పేజెస్ తో పాటు, హానికరమైన ఫైల్స్‌తో హ్యాకర్స్ దాడి చేస్తున్నారని తెలిపింది. హ్యాక్ చేసిన ఒక్కో యూట్యూబ్ ఛానల్స్‌ను 4వేల డాలర్లకు అమ్ముకుంటున్నట్లు నిర్ధారించింది. కరోనా దెబ్బ కరోనా కారణంగా ఆర్ధిక మాధ్యం తలెత్తెతింది. దీంతో హ్యాకర్స్ సొమ్ము చేసుకునేందుకు మాల్వేర్లతో వరుస దాడులు చేస్తూ పేట్రేగిపోతున్నారు. అయితే ఈ తరహా దాడలు ఈ మధ్య కాలంలో ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఇటీవల గూగుల్‌కు చెందిన థ్రెట్ ఎనాలసిస్ గ్రూప్ హ్యాకింగ్ గురించి హైలెట్ చేస్తూ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం హ్యాకింగ్‌కు గురైన 4వేల యూట్యూబ్ అకౌంట్లను పునరుద్ధరించినట్లు ఆ రిపోర్ట్‌లో పేర్కొంది. వీటితో పాటు 62,000 ఫిషింగ్ పేజీలు,2,400 హానికరమైన ఫైల్స్‌ను బ్లాక్ చేసినట్లు స్పష్టం చేసింది. తెలివి మీరిన హ్యాకర్స్ ఇక యూట్యూబ్ ఛాన్సల్ను హ్యాక్ చేయడంలో హ్యాకర్స్ తెలివి మీరినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ అఫిషియల్ మెయిల్ పేరుతో ఫేక్ ఈమెయిల్ క్రియేట్ చేశారని, ఆ మెయిల్స్ క్రియేటర్లకు వెరిఫికేషన్ కోసం పంపించినట్లు థ్రెట్ ఎనాలసిస్ గుర్తించింది. దీంతో యూట్యూబ్ క్రియేటర్లు తమకు యూట్యూబ్ నుంచి అఫియల్స్ మెయిల్ వచ్చిందని,వెంటనే వెరిఫికేషన్ కోసం ప్రయత్నించడం వల్ల హ్యాక్ అయినట్లు అనుమానం వ్యక్తం చేసింది. వెరిఫికేషన్ కోసం పంపిన మెయిల్స్‌ను క్లిక్ చేయడం వల్ల క్రియేటర్ ఛానల్ హ్యాకింగ్ గురవ్వడంతో పాటు పర్సనల్ డేటాను సేకరించినట్లు తేలింది. అంతేకాదు హ్యాక్ చేసిన ఒక్కో యూట్యూబ్ ఛానల్‌ను 4వేల డాలర్లకు అమ్ముకున్నట్లు గూగుల్‌కు చెందిన థ్రెట్ ఎనాలసిస్ గ్రూప్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇక మే 2021 నుండి జీమెయిల్లో ఫిషింగ్ ఇమెయిల్‌ల వాల్యూమ్‌ను 99.6 శాతం తగ్గించినట్లు గూగుల్ తెలిపింది. చదవండి: మొండి గూగుల్.. ఆ ఫోన్లలో కరెక్ట్ పాస్వర్డ్ కొట్టినా వేస్టే! ఎందుకంటే.. -
‘మేకింగ్ మనీ యాప్’ పేరిట మోసం
కడప అర్బన్: ఇంట్లోనే ఉంటూ సులువుగా డబ్బులు సంపాదించండి అంటూ.. ఆర్సీసీ మేకింగ్ మనీ యాప్ పేరిట సెల్ఫోన్లకు లింకులు పంపి అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుని మోసాలకు తెగబడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు సంబంధించిన 23 బ్యాంకు ఖాతాలను గుర్తించి, అందులోని రూ.62.5 కోట్ల మొత్తాన్ని స్తంభింప (ఫ్రీజ్) చేశారు. కడప వన్‌టౌన్, చాపాడు, మైదుకూరు, దువ్వూరు పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన నాలుగు కేసుల్లో దాదాపు 100 మంది బాధితులకు రూ.11 కోట్ల మేరకు నిందితులు కుచ్చుటోపీ పెట్టారు. ఈ నేరానికి సంబంధించిన వివరాలను వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నేరం ఇలా చేస్తారు.. ► మేకింగ్ మనీ, ఆర్సీసీ, ఇతర యాప్‌ల పేరిట బల్క్ ఎస్ఎంఎస్ల ద్వారా లింకులు పంపుతారు. ఈ లింకులను క్లిక్ చేసి.. పెట్టుబడి పెడితే కమీషన్ ద్వారా అధిక మొత్తంలో ఆదాయం పొందవచ్చని ఊరిస్తారు. ► రిజిస్టర్ చేసుకుని, యాప్ ఓపెన్ చేసిన తర్వాత ట్రేడింగ్ టాస్క్ పేరిట వస్తువును ఆన్లైన్లో కొనేందుకు టాస్క్‌ను బట్టి పెట్టుబడి పెట్టాలని చెబుతారు. టాస్క్‌లో పాల్గొని అధిక మొత్తంలో డబ్బులు కమీషన్ రూపంలో సంపాదించాలనే ఆశతో బాధితులు నమ్మి డబ్బులు పెట్టుబడిగా పెడతారు. ► తొలుత కమీషన్ రూపంలో కొంత మొత్తాన్ని పంపిస్తారు. ఇలా డబ్బులు నిజంగా వస్తాయేమోనన్న ఆశతో మరింత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా చేస్తారు. వాట్సాప్ ద్వారా చాట్ చేస్తూ మోసాన్ని కొనసాగిస్తారు. ► టాస్క్ అతి సులువుగా ఉండటంతో చాలా మంది తమ సన్నిహితులతో పెట్టుబడి పెట్టిస్తారు. వర్చువల్ పేమెంట్ అడ్రస్ (వీపీఏ ఐడీ) ద్వారా డబ్బును సైబర్ నేరగాళ్ల ఖాతాలకు డిపాజిట్ చేయించుకుంటారు. ► ఆర్సీసీ, మనీ మేకింగ్, ఇతర యాప్‌లలో బాధితుల ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్లు యాప్‌లో కనిపిస్తుంటుంది. అయితే అదంతా ఫేక్ డిస్ప్లే. అప్పటికే బాధితుల మొత్తాన్ని ఇతర ఖాతాలకు తరలించి సైబర్ నేరగాళ్లు దానిని క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చుకుంటారు. ఇలా పట్టుబడ్డారు.. ► కడపలోని ఎర్రముక్కపల్లెకు చెందిన గౌస్‌బాషా ఫిర్యాదుతో నిఘా పెట్టి, తమిళనాడులోని నామక్కల్‌కు చెందిన గోకుల్ వెందన్ (28), ఈరోడ్‌కు చెందిన మురుగానందన్ (50)లే నిందితులుగా గుర్తించారు. వీరు ఎంతో మందిని మోసం చేశారు. అయితే ఇదే తరహా నేరం చేసిన ఘటనలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడి పోలీసులు పీటీ వారెంట్ ద్వారా వారిని కడపకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరు పరిచి, కస్టడీలోకి తీసుకున్నారు. ► బాధితుడు గౌస్‌బాషా స్నేహితుడు దండు నాగచైతన్య కూడా రూ.99,980 మోసపోయాడు. ఇకపై ఎవరూ ఇలాంటి లింకులను క్లిక్ చేయొద్దు. ఎవరైనా మోసపోయి ఉంటే పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. -
ఐటీ ‘రిటర్న్స్’ విషయంలో జర జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను శాఖ నుంచి పన్ను చెల్లింపుదారులకు తిరిగి రావాల్సిన మొత్తాలను సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. నగరానికి చెందిన ఓ చార్టెడ్ అకౌంటెంట్(సీఏ) గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగుచూసింది.(చదవండి: WhatsApp: ఎడిట్ ఫొటోల్ని, జిఫ్ ఫైల్స్‌ను పంపుతున్నారా?) సిటీ కేంద్రంగా ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్న చార్టెడ్ అకౌంటెంట్‌కు దేశ వ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. వారిద్వారా మహారాష్ట్ర పుణేకు చెందిన ప్రవాస భారతీయుడు(ఎన్నారై) పరిచయమయ్యారు. కాలిఫోర్నియాలో ఉండే ఆయన తన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలనడంతో సీఏ అంగీకరించారు. ఎన్నారైకి ఆదాయపు పన్ను శాఖ నుంచి రావాల్సిన రూ. 21 లక్షలను పుణేలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలోకి పంపాలంటూ వాటిలో పొందుపరిచారు. సదరు ఖాతా నంబర్ ఐటీ రికార్డుల్లోనూ ఉంది. నిర్ణీత గడువు ముగిసినా తనకు రావాల్సిన డబ్బు రాలేదని సీఏ దృష్టికి ఎన్నారై తీసుకెళ్లారు. సీఏ ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన అధికారులు సదరు ఎన్నారైకి రావాల్సిన రూ. 21 లక్షలను కొన్ని నెలల క్రితమే చెల్లించామంటూ సమాధానం ఇచ్చారు. అవాక్కైన సీఏ ఆ డబ్బు పంపిన ఖాతా వివరాలు తెలపాల్సిందిగా ఐటీ కాల్ సెంటర్‌ను సంప్రదించారు. వారందించిన వివరాల మేరకు విశాఖ పట్నం ద్వారకానగర్‌లోని ఇండస్ ఇండ్ బ్యాంకును సీఏ సంప్రదించారు. ఆ ఖాతాలోకి ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 21 లక్షలు జమయ్యాయని, ఆ మొత్తాన్ని ఖాతాదారుడు డ్రా చేసేసినట్లు బ్యాంకర్లు వెల్లడించారు. ఆ ఖాతాను సైబర్ నేరగాళ్లు కాలిఫోర్నియాలో ఎన్నారై పేరు, వివరాలతోనే ఓపెన్ చేసి.. ఆదాయపు పన్ను శాఖ రికార్డుల్లోకీ జొప్పించారు. ఫలితంగానే రిటర్న్స్‌కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ శాఖ అందులోకి బదిలీ చేసింది. ‘చార్టెడ్ అకౌంటెంట్ ఈ సైబర్ నేరానికి సంబంధించిన ప్రాథమిక వివరాలు అందిస్తూ ఫిర్యాదు చేశారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు లిఖిత పూర్వకంగా కోరాం’ అని ఏసీపీ కేవీఎం ప్రసాద్ వివరించారు. -
సైబర్ వలలో విలవిల
నగరంలో ఓ బ్యాంకు మేనేజర్‌కు సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. మాటల్లో పెట్టి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకున్నారు. రెండు రోజుల తరువాత తన ఖాతా నుంచి రూ.10 లక్షలు ఎవరో డ్రా చేసుకున్నట్లు గుర్తించాడు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని నగరంలోని ఓ లెక్చరర్‌కు ఫోన్ కాల్ వచ్చింది. పనిలో బిజీగా ఉన్న ఆ లెక్చరర్ నిజంగా బ్యాంకు వారే కాల్ చేశారనుకుని వారు అడిగిన అన్ని వివరాలు చెప్పేశాడు. ఫోన్ పెట్టేయగానే, రూ.80 వేలు డ్రా చేసుకున్నారు. సాక్షి, హైదరాబాద్: దేశంలో సైబర్ నేరాలు జోరుగా సాగుతున్నాయి. లాక్డౌన్ దెబ్బకు లక్షలాదిమంది ఉద్యోగులు రోడ్డునపడ్డ వేళ.. సైబర్ నేరగాళ్లు లేనిపోని ఆశలు చూపి దోచుకుంటున్నారు. ఇందుకోసం క్రెడిట్ కార్డు లిమిట్ అనే ఆయుధాన్ని వాడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది పీజీలు, పీహెచ్‌డీలు చేసి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు కావడం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. సైబర్ మోసాలపై అవగాహన కల్పించేలా వివిధ బ్యాంకులు పంపుతున్న సందేశాలను చాలామంది పట్టించుకోవడం లేదు. అందుకే అధిక వడ్డీ, పెట్టుబడులు, ఇంటి అద్దె, కేవైసీ అప్డేట్, క్రెడిట్‌కార్డు లిమిట్, ఓఎల్ఎక్స్ యాడ్స్ ఇలా ఏదో వంకతో బ్యాంకు, ఏటీఎం, క్రెడిట్‌కార్డు వివరాలు తెలుసుకుని ప్రతీరోజూ రూ.లక్షలాది కొల్లగొడుతున్నారు. తెలంగాణ నంబర్ 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చిరునామాగా ఉన్న తెలంగాణలో సైబర్ నేరాలు అధికంగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే పరిణామం. దేశవ్యాప్తంగా గత 23 నెలల్లో అంటే 2018 ఆగస్టు1 నుంచి 2021 జూన్ 1 వరకు 66,905 సైబర్ నేరాలు నమోదయ్యాయి. రూ.79.68 కోట్లను సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలో వేసుకున్నారని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నడిచే ‘సైబర్ సేఫ్’వెబ్సైట్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇందులో అధికశాతం డబ్బును సైబర్ నేరగాళ్లు మన రాష్ట్రం నుంచే కొల్లగొట్టడం గమనార్హం. బాధితుల్లో గ్రేటర్ దేశంలోనే టాప్ సంఖ్యాపరంగా అత్యధికంగా సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణది రెండోస్థానం. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు దోచుకున్న దాదాపు రూ.80 కోట్లలో రూ.19 కోట్లపైచిలుకు సొమ్ము మన రాష్ట్రం నుంచే కొల్లగొట్టారు. ఈ సైబర్కాల్స్కు మోసపోతున్న వారిని సైబర్‌సేఫ్ జిల్లాల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా విభజించింది. వీటిలో టాప్–5 జిల్లాల్లో గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఫిర్యాదుల్లోనూ మనమే టాప్.. బాధితుల్లో దాదాపు 40 శాతం మంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదు. మోసపోయిన విషయాన్ని బయటికి చెప్పుకునేందుకు చాలామంది ముందుకు రాకపోవడంతో సైబర్ నేరగాళ్లు మరింత చెలరేగుతున్నారు. కానీ, తెలంగాణ నుంచే ఫిర్యాదులు అధికంగా ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల పోలీసులు నేరం జరుగుతున్న విధానం, నిందితులు వినియోగించిన 55,943 ఫోన్‌నంబర్లు,7,600 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. ఈ మొత్తం మోసాలకు సైబర్ నేరగాళ్లు ఫోన్కాల్స్నే ఆయుధంగా చేసుకున్నట్లు తేలింది. ఆశచూపితే నమ్మొద్దు ఉచిత పథకాలు, బహుమతులు, అధికవడ్డీ అంటూ సైబర్ నేరగాళ్లు ప్రతీరోజూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాల బారిన పడుతున్న వారిలో అధికశాతం విద్యావంతులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఏ బ్యాంకు సిబ్బంది కూడా ఫోన్ చేసి కార్డుల వివరాలు అడగరు. ప్రభుత్వాలు నడిపే బ్యాంకులే రోజురోజుకు వడ్డీ తగ్గిస్తుంటే.. ఎవరో అనామకుడు ఫోన్ చేసి అధికవడ్డీ ఆశచూపితే మోసపోకండి. అత్యాశకు పోతే కష్టార్జితం దొంగల పాలవుతుంది. – సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ -
ఉద్యోగానికి డబ్బులు ఎదురివ్వాలా?!
‘‘మేడమ్, మా కంపెనీ లో మీకు జాబ్ కన్ఫర్మ్ కావాలంటే మా నిబంధనలన్నీ పాటించాలి. మీకు కొన్ని పేపర్స్ పంపిస్తాం. వాటి మీద మీరు సంతకాలు చేయాలి. అలాగే, మీ జాబ్ కన్ఫర్మ్ అనడానికి మీరు మా కంపెనీ అకౌంట్లో పదివేల రూపాయలు డిపాజిట్ చేయాలి. మీ వర్క్ పట్ల మా కంపెనీ పూర్తి సంతృప్తికరంగా ఉంటే మీకు పదిహేను రోజుల్లో మీరు చేసిన డిపాజిట్ నుంచి 50 శాతం తిరిగి మీ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేస్తాం’’ అంటూ వచ్చిన ఫోన్‌కాల్‌తో ఆలోచనల్లో పడిపోయింది కల్పన. కల్పనకు పెళ్లయ్యి మూడేళ్లు. భర్త వంశీతోపాటు తనూ జాబ్ చేస్తోంది. కరోనా వల్ల ఇద్దరి ఉద్యోగాలు పోయాయి. ఇంతలో... ‘వర్క్‌ఫ్రమ్ హోమ్.. ఇంటి వద్ద ఉంటూనే నెలకు రూ.50,000 వరకు సంపాదించవచ్చు’ అని వచ్చిన ఆన్లైన్ లింక్ కల్పనను ఆకట్టుకుంది. ఇది తనకు వచ్చిన పనే. ఇంటినుంచే చేయవచ్చు. డబ్బు బాగానే వస్తుంది. కానీ, తన వర్క్ వాళ్లకు నచ్చుతుందో లేదో అని ఆలోచిస్తూనే.. లింక్ ఓపెన్ చేసి, తన వివరాలన్నీ ఇచ్చింది. మరుసటిరోజే కంపెనీ నుంచి ఫోన్..! నమ్మకంగా రిటర్న్ ఇంకేమీ ఆలోచించకుండా పదివేలు వారు చెప్పిన అకౌంట్‌కు ఆన్లైన్లో పే చేసి, జాబ్‌లో చేరిపోయింది. సదరు కంపెనీవారు చెప్పినట్టుగా లాప్టాప్ ఏర్పాటు చేసుకుంది. కంపెనీ లింక్ నుంచే ఫైల్స్ వస్తున్నాయి. రోజూ రెండు ఫైళ్లు. వాటిని రీ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలి. పెద్ద పనేమీ కాదు. రోజుకు మూణ్ణాలుగు గంటలు కేటాయిస్తే చాలు. పదిహేను రోజులైంది. కల్పన అకౌంట్‌కు వర్క్ చేస్తున్న కంపెనీ నుంచి రూ.5000 రిటర్న్ రావడంతో ‘కంపెనీ నమ్మకమైంది, అనవసరంగా నేనే డౌట్ పడ్డాను’ అనుకుంది కల్పన. మరింత జాగ్రత్తగా కంపెనీ చెప్పిన మేరకు పనులు చేస్తూ ఉంది. తప్పులకు చెల్లించిన మూల్యం ఇంకో పది రోజుల్లో నెల జీతం వస్తుందనగా కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. ‘మేడమ్, మీరు కంపెనీకి రూ.40,000 చెల్లించాల్సి ఉంటుంది’ ఫోన్ సారాంశం వినగానే డీలా పడిపోయింది కల్పన. తను చేసిన టైపింగ్‌లో వచ్చిన మిస్టేక్స్‌కి చెల్లించే మూల్యం అది. మిస్టేక్స్ జరిగితే రీ పే చేయాలని ముందే మాట్లాడుకున్నారు. అలా అని తను సంతకం కూడా చేసింది. ఎంత జాగ్రత్తగా చేసినా అలా ఎలా జరిగిందో అర్ధం కాలేదు. కల్పన పంపిన ఫైల్స్‌లో మార్క్ చేసి, కంపెనీ నిర్వాహకులు తిరిగి పంపిన ఫైల్స్‌లో మిస్టేక్స్ నిజమే. ముందే చేసుకున్న ఒప్పందం. లేదంటే లాయర్ నోటీసులు తప్పవు’ అని హెచ్చరికలు వస్తున్నాయి. కల్పనకు భయం వేసి ఆ నంబర్‌ను బ్లాక్ చేసింది. కాసేపటికి ఇంటర్నేషనల్ కాల్. ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న కల్పనకు ‘అగ్రిమెంట్ ప్రకారం నడుచుకోనందుకు మీ మీద కేసు ఫైల్ అయ్యింది. లాయర్ నుంచి నోటీస్ ఇష్యూ అయ్యింది’అని. కల్పనకు ఏం చేయాలో అర్ధం కాలేదు. కోర్టులు, లాయర్లు, కేసులు.. అంటూ నిలువెల్లా భయం ఆవరించింది. ‘ఆ కంపెనీ వారితో నే రాజీ కుదుర్చుతా.. లేదంటే అనవసర సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఎంత త్వరగా పరిష్కరించుకుంటే మీకే అంత లాభం’ అనడంతో కల్పన బెంబేలెత్తిపోయింది. ఒక్కరోజు టైమ్ ఇస్తే డబ్బు చెల్లిస్తానని మాట ఇచ్చి, భర్తకు తెలియకుండా బంగారం తాకట్టు పెట్టి, ఆ డబ్బులను సదురు అకౌంట్‌కు సెండ్ చేసింది. ∙ వాట్సప్‌లోనే బెదిరింపు అంతా! సైబర్ నేరగాళ్లు తక్కువ మొత్తం నుంచే ఎక్కువ మంది దగ్గర డబ్బులు కొట్టేయడానికి ఇలా ఎత్తుగడ వేస్తున్నారు. ఉద్యోగం కోసం అంటూ ఇచ్చే లింక్స్‌లో వివరాలన్నీ తీసుకొని, మరో కొత్త నేరానికి పాల్పడే అవకాశాలూ ఉంటాయి. ఫ్రాడ్ చేసేవారు దాదాపుగా వాట్సప్ ఫోన్లు చేస్తారు. అంతర్జాతీయ ఫోన్ నెంబర్లు వాడుతుంటారు. వర్క్‌లో ఎర్రర్స్, మిస్టేక్స్ వారే సృష్టిస్తారు. ఏ తరహా ఆన్లైన్ ఉద్యోగాల్లో చేరాలనుకున్నా పేరున్న కంపెనీ, అది రిజిస్టర్ అయిన సంవత్సరం.. వంటి వివరాలన్నీ తెలుసుకోవడం మంచిది. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ క్రెడిబులిటీ ముఖ్యం మా దగ్గర ఇలాంటి కేసులు ఫైల్ కాలేదు. కానీ, ఏ మార్గాల్లో డబ్బులు రాబట్టాలనే విషయమ్మీదే సైబర్ నేరగాళ్ల ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అప్రమత్తత అవసరం. ఇంటి వద్ద ఉండి ఆన్లైన్ వర్క్ చేసినా సదరు కంపెనీకి పని చేసినట్టు ఆధారాలు ఉండాలి. ఆ కంపెనీ గురించి తెలిసినవారి ద్వారా పూర్తి వివరాలు సేకరించుకోవాలి. జాబ్ కాంట్రాక్ట్ ఫైల్ తీసుకోవాలి. అలా ఇవ్వలేదంటే అది ఫేక్. కేసు ఫైల్ చేశామనో, ఫలానా చోట నుంచి ఫోన్ చేస్తున్నామనో బెదిరింపుల ద్వారా డబ్బులు లాగడం, ఇతర వేధింపులకు గురిచేస్తున్నారనిఅనిపిస్తే.. వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో కేసు ఫైల్ చేయాలి. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
ఆన్లైన్ మోసాలపై హెల్ప్‌లైన్ అస్త్రం
న్యూఢిల్లీ: మీరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారా? వారి మాయమాటలు నమ్మి, సొమ్ము బదిలీ చేశారా? ఓటీపీలు, క్రెడిట్‌కార్డుల వివరాలు చెప్పేశారా? సాధారణంగా మీరు సైబర్‌క్రైమ్ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసే లోపే నేరగాళ్లు డబ్బును తమ ఖాతాల నుంచి ఉపసంహరించేసుకుంటారు. ఇలాంటి మోసాలను ఆపి నేరగాళ్ల అకౌంట్లను స్తంభింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించింది. మోసాన్ని గుర్తించి (మీ అకౌంట్ల నుంచి డబ్బు పోయినట్లు గుర్తించగానే) వెంటనే ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంశాఖ హెల్ప్‌లైన్ నంబర్ 155260 అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్‌లో నంబర్‌ను ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులోకొచ్చింది. ఆర్బీఐసహా అన్ని ప్రధాన బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, వ్యాలెట్లు, ఆన్లైన్ వాణిజ్య సంస్థ సహకారంతో ఈ హెల్ప్‌లైన్‌ను హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి) నిర్వహిస్తోంది. ఈ మేరకు సిటిజెన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్, మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్) హెల్ప్‌లైన్ అమల్లో ఉంది. డబ్బును ఆన్లైన్ ద్వారా బదిలీ చేసిన తర్వాత త్వరగా ఫిర్యాదు చేస్తే వెనక్కి రప్పించడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సదరు డబ్బు డిజిటల్ ఎకోసిస్టమ్ నుంచి బయటకు వెళ్లక ముందే అప్రమత్తమైతే చాలావరకు వెనక్కి వస్తుందని అంటున్నారు. అమాయకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును సైబర్ నేరస్తులు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు.. ఇలా ఐదు బ్యాంకుల ఖాతాల్లోకి మార్చినప్పటికీ సిటిజెన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్, మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అధికారులు వెనక్కి రప్పించగలిగారు. -
రిటైర్డు డీజీపీ మెయిల్ నుంచి మెసేజ్ రావడంతో..
బనశంకరి(కర్ణాటక): సైబర్ నేరగాళ్లు ఐటీ సిటీలో చెలరేగిపోతున్నారు. పోలీస్ పెద్దలను కూడా విడిచిపెట్టడం లేదు. విశ్రాంత డీజీపీ శంకరబిదిరి ఈమెయిల్‌ను హ్యాక్ చేసి డబ్బు పంపాలని స్నేహితులకు మెసేజ్ పంపి డబ్బులు కొల్లగొట్టిన నాగాల్యాండ్ కు చెందిన ముగ్గురిని బుధవారం సీఇఎన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 4 మొబైల్స్, 13 పాన్ కార్డులు, 6 ఆధార్ కార్డులు, 2 ఏటీఎం కార్డులు సుమారు 20 కి పైగా బ్యాంకుల్లో ఉన్న రూ. 2 లక్షల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దియా, సరోపా, ఇస్పర్ కోన్సాక్. ఇటీవల బిదరి ఈమెయిల్‌ను హ్యాక్ చేసి ఆయన స్నేహితులకు డబ్బు పంపాలని మెయిల్ పంపారు. బిదరినే పంపారేమోనని ఒకరు రూ.25 వేలు ఖాతాలో వేశారు. తరువాత నిజం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల క్రితం నాగాల్యాండ్ నుంచి బెంగళూరుకు వచ్చిన నిందితులు బ్యూటీపార్లర్, మాల్స్‌లో పనిచేసేవారు. నాగాల్యాండ్ కు చెందిన నిరుద్యోగ యువకులకు డబ్బు ఆశ చూపించి వారి పాన్, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకుని నగదును ఆ ఖాతాల్లోకి వేయించేవారు. చదవండి: చంపి అయినా ‘పరువు’ కాపాడుకోవాలనుకుని.. బిర్యానీ ప్యాకెట్లలో బంగారు ముక్కు పుడకలు -
పోలీసులనూ వదలని సైబర్ నేరగాళ్లు..
తణుకు(పశ్చిమగోదావరి): తణుకు రూరల్ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు పేరు మీద కేటుగాళ్లు ఫేక్ అకౌంట్ తెరిచారు. ఆయన ఖాతాలోని స్నేహితులందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. అయితే దీనిని గుర్తించిన ఆయన ఇది ఫేక్ అకౌంట్ అంటూ తెలిసిన వాళ్లందరికీ మెసేజ్‌లు పెట్టి అప్రమత్తం చేశారు. తణుకు పట్టణానికి చెందిన రమేష్ అనే వ్యక్తి పేరు మీద నకిలీ అకౌంట్ తెరిచిన సైబర్ నేరగాళ్లు అతని ఫ్రెండ్స్‌కు రిక్వస్టులు పెట్టారు. అంతేకాకుండా కొందరు మిత్రులకు మెసేజ్‌లు పెట్టి అర్జంటుగా డబ్బులు కావాలని అడుగుతున్నారు. దీనిని పసిగట్టిన మిత్రులు రమేష్‌కు సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యారు. ఇటీవల ఈ తరహా మోసాలు జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. కొందరి ఫేస్బుక్ అకౌంట్లను హ్యాక్ చేయడంతో పాటు నకిలీ అకౌంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన కల్పించే పనిలో వారు నిమగ్నమయ్యారు. కేవలం మెసేజ్‌లతోనే.. ఇటీవల సోషల్ మీడియాలో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన ఫేస్‌బుక్‌పై సైబర్ నేరగాళ్లు దృష్టి పెడుతున్నారు. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నా.. ఎక్కువ లైక్‌లు వస్తున్నా... అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. పోలీసులు, డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, విద్యావంతులను ఎంచుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నానని.. వైద్యం కోసం నగదు అత్యవసరం అంటూ.. డబ్బులు పంపించాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇది నిజమని నమ్మి కొందరు డబ్బులు పంపించి తర్వాత విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు. అయితే ఫేస్బుక్ ద్వారా డబ్బులు కావాలని మెసేజ్‌లు పంపే సమయంలో సైబర్ నేరగాళ్లు తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు అడిగితే అనుమానం వస్తుందని భావించి కేవలం రూ.5 వేల నుంచి నగదు అభ్యర్థనలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా మోసాలు అత్యధికంగా రాజస్థాన్ నుంచి జరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పలువురు నగదు బదిలీ చేయించుకున్న ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు రాజస్థాన్‌కు చెందినవి కావడం విశేషం. జాగ్రత్తలు తప్పనిసరి ఫేస్బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసి నగదు బదిలీ చేయించుకుంటున్న వారి బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మన ఫేస్బుక్ అకౌంట్ నుంచి నగదు బదిలీల కోసం రిక్వెస్ట్‌లు వెళుతున్నాయా అనేది ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. అనుమతి లేకుండా స్నేహితులకు క్షేమసమాచారాలు కోరే అభ్యర్థనలపై దృష్టి పెట్టాలి. మీ పేరు, ఫొటోతో నకిలీ ప్రొఫైల్ తెరిచినట్లు అనుమానం వస్తే వెంటనే ‘నా ఫేస్బుక్ హ్యాక్ అయ్యింది... నా పేరు మీద ఎవరైనా డబ్బులు అడిగినా... ఇతర సమాచారం అడిగినా స్పందిచవద్దు’ అని మెసేజ్ పెట్టాలి. మీ ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్‌లో పెట్టుకోవడంతోపాటు స్నేహితులకు తప్ప ఇతరులకు అనుమతులు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నకిలీ ఖాతా అయితే ప్రొఫైల్ సెట్టింగులోకి వెళ్లి ‘ప్రీటెండ్ టు బి సమ్ వన్’ అని నొక్కాలి. అక్కడ ‘మి’ అని ప్రెస్ చేసి తర్వాత రిపోర్టులో కన్ఫర్మేషన్ క్లిక్ చేయాలి. తర్వాత రిపోర్టు, తర్వాత నెక్ట్స్, తర్వాత డన్ చేయాలి. అప్రమత్తం చేస్తున్నాం నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. నకిలీ ప్రొఫైల్స్ గుర్తించి సైబర్ విభాగానికి అందజేస్తున్నాం. ఐడీల ద్వారా ఎక్కడి నుంచి మెసేజ్‌లు వస్తున్నాయో గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఇలాంటి సైబర్ నేరాలపై దృష్టి సారించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – బి.శ్రీనాథ్, డీఎస్పీ, కొవ్వూరు చదవండి: ఏమైందో ఏమో.. పాపం పండుటాకులు.. ఎమ్మెల్యే గద్దె స్వగ్రామంలో టీడీపీకి ఆశాభంగం -
హ్యాకర్ల.. వాట్సాప్ చీట్!
సాక్షి, అమరావతి: సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసాలతో హడలెత్తిస్తున్నారు. కరోనా సమయంలో విస్తృతమైన ఇంటర్నెట్ వాడకాన్ని ఆసరాగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖులు, వృత్తి నిపుణుల వాట్సాప్, సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో వందల మంది వాట్సాప్‌లు హ్యాకింగ్ కారణంగా క్రాష్ కావడం, వీరిలో పలువురు ప్రముఖులు ఉండటం కలకలం రేకెత్తిస్తోంది. హ్యాకింగ్ ఇలా: సైబర్ నేరగాళ్లు తొలుత ఎంపిక చేసుకున్న కొందరికి ‘అర్జంట్ హెల్ప్’ అని ఆరు డిజిట్ల కోడ్లతో వాట్సాప్ మెస్సేజ్ పంపిస్తారు. బాధితుడు పొరపాటున దీన్ని క్లిక్ చేసినా, తిరిగి సమాధానం ఇచ్చినా వెంటనే వాట్సాప్ ఖాతాను హ్యాక్ చేసి ఆ కాంటాక్ట్‌లోని పలువురికి తిరిగి ఆరు డిజిట్ల కోడ్ మెస్సేజ్ పంపిస్తారు. ఆ వెంటనే ‘సారీ...పొరపాటున మెస్సేజ్ పంపించా. దాన్ని నాకు తిరిగి పంపించండి’ అని కోరతారు. ఆ మెస్సేజ్‌ను తిరిగి పంపినా, సంబంధిత లింక్ మీద క్లిక్చేసినా వెంటనే వారి వాట్సాప్ హ్యాక్ అవుతుంది. అందులోని సమాచారాన్ని తస్కరిస్తారు. “ఓటీపీ’ పరమ రహస్యమే – హ్యాకింగ్, సైబర్‌నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలను సీఐడీ విభాగం సూచించింది. – ఓటీపీ నంబర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పొద్దు. – తెలిసినవారి నంబర్ నుంచి ఫోన్ వచ్చినా సరే, ఎవరు అడిగినా, మెస్సేజ్ పెట్టినా ఓటీపీ నంబర్ వెల్లడించకూడదు. ఒక్కోసారి వారికి తెలియకుండానే హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి ఓటీపీని చెప్పకూడదు. – ఓటీపీ నంబర్ కేవలం 10 నిముషాలపాటే చెల్లుబాటులో ఉంటుంది కాబట్టి ఆ కొద్దిసేపు కాలయాపన చేస్తే మోసాల బారి నుంచి కాపాడుకోవచ్చు. – తెలియని లింక్‌లను క్లిక్ చేయొద్దు 2 స్టెప్ వెరిఫికేషన్ – వాట్సాప్ హ్యాక్ కాకుండా ఉండేందుకు అదనపు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం స్మార్ట్ఫోన్లలో ఉన్న ‘2 స్టెప్ వెరిఫికేషన్’ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలి. వాట్సాప్‌లో అకౌంట్ సెక్షన్లోకి వెళితే ‘2 స్టెప్ వెరిఫికేషన్’ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవాలి. అనంతరం పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా హ్యాకర్ వాట్సాప్‌ను హ్యాక్ చేయాలని ప్రయత్నిస్తే కోడ్ అడుగుతుంది. అప్రమత్తతతో రక్షణ.. – పీవీ సునీల్ కుమార్, అదనపు డీజీ, సీఐడీ విభాగం ‘అప్రమత్తతే సైబర్‌నేరాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఎవరైనా ఓటీపీ నంబర్ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు. ఒక్కోసారి బాగా చదువుకున్న వారు కూడా ఓటీపీ నంబర్ బహిర్గతం చేసి మోసపోతున్నారు. ఓటీపీ చెప్పకపోతే సైబర్ నేరగాళ్లు చాలా వరకూ ఏమీ చేయలేరు. ఎవరైనా మోసపోయామని గుర్తిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ నేరగాళ్ల ఫోన్లలోకి బాధితుల వాట్సాప్ – సైబర్ క్రిమినల్స్ తమ ఫోన్లో వాట్సాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని ఎంపిక చేసుకున్న ఓ ఫోన్ నంబర్‌ను వెరిఫికేషన్ కోసం ఎంటర్ చేస్తున్నారు. దీంతో వెరిఫికేషన్ కోడ్ ఆ నెంబర్‌కు వెళుతుంది. ఆ వెంటనే సదరు నంబర్‌కు ఫోన్ చేస్తున్న కేటుగాళ్లు పొరపాటున మీ ఫోన్‌కు వచ్చిందని, దయచేసి ఆ వివరాలు చెప్పాలని నమ్మబలుకుతున్నారు. ఆ వివరాలు చెప్పగానే బాధితుడి వాట్సాప్ క్రాష్ అవుతుంది. ఆ వాట్సాప్ ఖాతా సైబర్ నేరగాడి ఫోన్లోకి మారిపోతుంది. అనంతరం వాట్సాప్‌ను యాక్సెస్ చేసి సెట్టింగ్స్‌ను మారేస్తున్నారు. వెరిఫికేషన్ కోడ్‌తోపాటు హింట్ ప్రశ్నను చేర్చడంతో బాధితులు మరోసారి ఇన్స్టాల్ చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమవుతున్నారు. -
మైండ్ ‘బ్లాక్’!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కొత్త తరహా సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. బ్యాంకు ఖాతాలతో ముడిపడి ఉన్న సిమ్‌కార్డుల్ని బ్లాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు వాటిని ఖాళీ చేస్తున్నారు. పది రోజుల వ్యవధిలోనే సికింద్రాబాద్, అమీర్‌పేట ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తల ఖాతాల నుంచి సైబర్ క్రిమినల్స్ రూ.88 లక్షలకు పైగా కాజేయడం కలకలం రేపింది. ఇలాంటి ‘నయా’ వంచనకు పాల్పడుతున్న వారిలో నైజీరియన్లతో పాటు ఉత్తరాదికి చెందిన కొన్ని ముఠాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులపై ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ‘బ్లాక్’తో డమ్మీవి తీసుకుంటున్నారు... ఉత్తరాదికి చెందిన కొందరు యువకుల్ని వివిధ నగరాలకు పంపి కరెంట్ ఖాతాలు తెరిపిస్తున్న సూత్రధారులు బ్యాంకుల పేర్లను పోలి ఉండే యూఆర్‌ఎల్స్‌తో వెబ్‌సైట్స్ రూపొందిస్తున్నారు. వీటి ద్వారా వల వేసి వినియోగదారుడి ఖాతాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు ఆ తరవాతే అసలు అంకం ప్రారంభిస్తున్నారు. తమ వల్లో పడిన బాధితుల సిమ్‌కార్డుల్ని చాకచక్యంగా బ్లాక్ చేయిస్తున్నారని తేలింది. దీనికోసం అతడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడో అక్క డ లేదా మరో ప్రాంతంలో సర్వీస్ ప్రొవైడర్లను వారి (బాధితుడి) మాదిరిగానే ఆశ్రయిస్తున్నారు. అప్పటికే ఖాతాదారుడికి సంబంధించిన పూర్తి సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు వెబ్సైట్ ద్వారా వీరి వద్దకు చేరి ఉంటోంది. ఈ వివరాలతో బోగస్ ధ్రువీకరణలు తయారు చేసి వాటిని జత చేస్తూ తమ సిమ్‌కార్డు పోయింద ని, మరోటి ఇ ప్పించమంటూ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ అందిస్తున్నారు. సెల్ కంపెనీల వారు వివరాలు సరిచూడకుండానే ఆ నంబర్‌తో పని చేస్తున్న సిమ్‌ను బ్లాక్ చేసి మరోటి ఈ నేరగాళ్లకు అందచేస్తున్నారు. ఓటీజీఎస్ పద్ధతిలో భారీ మొత్తం స్వాహా... ఆ సిమ్‌ను వినియోగించి బ్యాంకుకు కాల్ చేస్తున్న నేరగాళ్లు... ఓ సంస్థకు రియల్–టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) పద్ధతిలో భారీ మొత్తాన్ని బదిలీ చేయనున్నామని, దీనికోసం ఓటీపీ పంపాల్సిందిగా కోరుతున్నారు. ఖాతాదారుడి నంబర్ నుంచే ఫోన్ రావడం, వారు అడిగిన వివరాలు చెప్పడంతో బ్యాంకు సిబ్బంది ఓటీపీ ఇచ్చేస్తున్నా రు. ఇలా సమస్తం తమ చేతికి వచ్చిన తరవాత టార్గెట్ చేసిన ఖాతా ను ఆన్లైన్ ద్వారా యాక్సిస్ చేసి బోగస్ కరెంట్ ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తు న్నారు. వెంటనే దీన్ని డ్రా చేసుకుని ఖాతా మూసేస్తున్నారు. సేవింగ్స్ ఖాతాలనూ ఇదే పంథాలో ద్వారా ఖాళీ చేస్తున్నారు. మైక్రో సిమ్‌కార్డుల ఆధారంగా మరోలా... ఇటీవల అన్ని సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు మైక్రో సిమ్‌కార్డుల్ని అందిస్తున్నారు. సెల్ఫోన్లన్నీ ఇవి పట్టేలా డిజైన్ అవుతుండటంతో పెద్దగా ఉన్న పాత వాటిని ‘రీ–ప్లేస్’చేసుకునే అవకాశం ఇస్తున్నారు. దీన్ని సైతం నేరగాళ్లు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సిమ్ బ్లాకింగ్ కోసం మైక్రోకార్డు ‘విధానాన్ని’అవలంభిస్తున్నారు. ఈ మార్పిడి కోసం ఎమ్టీ మైక్రో సిమ్‌కార్డుల్ని తీసుకునే వినియోగదారులు దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ సిమ్ ఐడెంటిటీ (ఐసీఐడీ) నంబర్‌ను పాత పెద్ద సిమ్ నుంచి సర్వీస్ ప్రొవైడర్‌కు ఎస్సెమ్మెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే తమ తెలివి తేటలు ప్రదర్శిస్తున్న సైబర్ నేరగాళ్లు మైక్రో సిమ్ తీసుకుంటున్నారు. వినియోగదారుల్ని సర్వీసు ప్రొవైడర్ల మాదిరిగా సంప్రదించి తెలివిగా ఐసీఐడీని సంగ్రహించి మైక్రోసిమ్ యాక్టివేట్ చేస్తున్నారు. వినియోగదారులు మేల్కొనే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ తరహా నేరాలు ఇటీవల భారీగా పెరిగాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబు తున్నారు. ఎవరిదైనా సిమ్‌కార్డు హఠాత్తుగా బ్లాక్ అయితే వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తు న్నారు. ముందుగా బ్యాంకు ఖాతాను భద్రం చేసుకోవడంతో పాటు సెలవు దినమైనప్పటికీ అధికారుల్ని ఆశ్రయించాలని స్పష్టం చేస్తున్నారు. మనీమ్యూల్స్ సాయంతో స్వాహా సైబర్ నేరగాళ్లు ఈ కరెంట్, సేవింగ్స్ ఖాతాలను తమ అధీనంలోకి తీసుకుంటూ వాటిలోని నగదును ‘మనీమ్యూల్స్’ఖాతాల్లోకి మళ్లిస్తుంటారు. ఉత్తరాదికి చెందిన అనేక మంది నిరుద్యోగుల్ని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా బోగస్ ధ్రువీకరణలు తయారు చేయించి, వీటి ఆధారంగా ఖాతాలు తెరిపిస్తున్నారు. నగదు ట్రాన్స్ఫర్ పూర్తికాగానే వారి ద్వారా తక్షణం డ్రా చేయించేస్తున్నారు. సాంకేతికంగా మనీమ్యూల్స్‌గా పిలిచే వీరికి స్వాహా చేసిన సొమ్ములో 10 నుంచి 30 శాతం కమీషన్ ఇస్తున్నారు. ఎప్పుడైనా విషయం పోలీసుల వరకు వెళ్లి, వారు దర్యాప్తు చేస్తూ వచ్చినా ఈ మనీమ్యూల్స్ మాత్రమే చిక్కుతారు తప్ప అసలు సూత్రధారులు వెలుగులోకిరారు. బాధితులు నగదు బదిలీ విషయాన్ని గుర్తించేలోపే నేరగాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. కేంద్రం గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలతో నగదు విత్‌డ్రాపై ఆంక్షలు వచ్చాయి. దీంతో సైబర్ నేరగాళ్లు నగదు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, డ్రా చేయడం తగ్గించారు. అయినా ఆన్లైన్లో విలువైన వస్తువులు ఖరీదు చేసి, బోగస్ చిరునామాల్లోనే, కొరియర్ వారిని తప్పుదోవ పట్టించో తమ ఉనికి బయటకు రాకుండా వాటిని తీసుకునే ఆస్కారం లేకపోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
రుణాల మారటోరియం మోసాలతో జాగ్రత్త
న్యూఢిల్లీ: రుణాల నెలవారీ వాయిదాల చెల్లింపుల (ఈఎంఐ)పై మారటోరియం అమలు నేపథ్యంలో మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులను బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఈఎంఐ మారటోరియం మోసాల గురించి అవగాహన పెంచుతున్నాయి. కీలకమైన ఓటీపీ, పిన్ నంబర్ల వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని సూచిస్తున్నాయి. ఖాతాల వివరాలను చోరీ చేసేందుకు సైబర్ క్రిమినల్స్, మోసగాళ్లు అనుసరిస్తున్న కొంగొత్త విధానాల గురించి అవగాహన కల్పించే దిశగా యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు గత కొద్ది రోజులుగా ఖాతాదారులకు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపిస్తున్నాయి. ఈఎంఐల మారటోరియంపై సహకరిస్తామనే పేరుతో మోసగాళ్లు .. ఓటీపీ, సీవీవీ, పాస్వర్డ్ లేదా పిన్ నంబర్ల వివరాలను ఇవ్వాలంటూ ఫోన్లు చేసే అవకాశాలు ఉన్నాయని బ్యాంకులు తెలిపాయి. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అటు కరోనా వైరస్ బాధితులకు తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించి ప్రధాని ప్రారంభించిన పీఎం–కేర్స్ నిధికి చందాల సేకరణ పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయని, వీటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాయి. ఎన్బీఎఫ్సీలకూ మారటోరియం... రుణాలపై మూడు నెలల మారటోరియం వెసులుబాటును నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) కూడా వర్తింపచేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) పరిధిలోని బ్యాంకులు యోచిస్తున్నాయి. తద్వారా కరోనా వైరస్ సంక్షోభం నుంచి అవి గట్టెక్కేందుకు తోడ్పాటు అందించాలని భావిస్తున్నాయి. తాము కూడా రుణగ్రహీతల కోవలోకే వస్తాం కాబట్టి తమకు కూడా మారటోరియం ఇవ్వాలంటూ ఎన్బీఎఫ్సీలు డిమాండ్ చేస్తున్నాయి. వివిధ వర్గాలకు రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీలు ప్రధానంగా నిధుల కోసం బ్యాంకులపైనే ఆధారపడుతుంటాయి. డిజిటల్ చెల్లింపులపై ప్రచారం... కరోనా వైరస్ కల్లోలాన్ని కట్టడి చేయడానికి కేంద్రం విధించిన లాక్డౌన్ సమయంలో డిజిటల్ చెల్లింపులను అనుసరించాలని ప్రజలను ఆర్బీఐ కోరింది. ఈ మేరకు అమితాబ్ బచ్చన్‌తో ట్విట్టర్ ప్రచారాన్ని ఆర్బీఐ ప్రారంభించింది. కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి సామాజిక దూరం పాటించడం సరైన చర్య అని ఆర్బీఐ తెలిపింది. -
మిలీనియల్సే టాప్
ఆన్లైన్ మోసాల గురించి మనం తరచూ వింటుంటాం. అయినా సరే.. షాపింగ్ యాప్ లేదా వెబ్సైట్ తెరిచి కొనుగోళ్లు మాత్రం ఆపం. బిల్లులు కట్టేందుకూ, బ్యాంకు లావాదేవీలు నడిపేందుకు అస్సలు వెనుకాడం. ఇంటిపట్టున ఉంటూ పనులన్నీ చక్కబెట్టే వెసులుబాటు, సౌకర్యం ఉండటం, సమయం ఆదా అవుతోందన్నది దీనికి కారణం. ఇలాంటి లాభాలన్నీ ఉన్నాయని ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఖాతాల్లో డబ్బులు ఖాళీ అయిపోవచ్చు. మీకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఇతరులకు చేరనూ వచ్చు. ఇంతకీ దేశంలో పురుషులు, మహిళలు, ఈతరం, వెనుకటి తరం ఆ ముందు తరాల ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్ వ్యవహారాల తీరుతెన్నులెలా ఉన్నాయి? ఇంటర్నెట్ భద్రత సంస్థ ఈ విషయాన్ని కనుక్కునేందుకు డిజిటల్ వెల్నెస్ సర్వే ఒకటి నిర్వహించింది. ‘ఆన్లైన్’ మిలీనియల్స్ (25– 34 మధ్య వయస్కులు) టాప్‌లో ఉన్నారు. 83 శాతం ఆన్లైన్ బ్యాంకింగ్‌లో ఆర్థిక మోసాలు, సమాచార చోరీ అన్నవి రెండు పెద్ద ప్రమాదాలని తెలిసిన వారు ఇవీ జాగ్రత్తలు... - వేర్వేరు వెబ్సైట్లకు వేర్వేరు పాస్వర్డ్లు వాడటం మేలు. అంకెలు, గుర్తులు, అక్షరాలు కలిసి పాస్వర్డ్ ఉండాలి. - సైబర్ నేరగాళ్లు ఎక్కువగా దృష్టి పెట్టేది సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలపైనే. కాబట్టి సాఫ్ట్వేర్ లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. - షాపింగ్ వెబ్సైట్ ‘హెచ్‌టీటీపీఎస్’తో మొదలవుతోందా? లేదా చూసుకోండి. బ్రౌజర్ బార్లో ఒకవైపు తాళం కప్ప వేసిన గుర్తు అది కూడా పచ్చ రంగులో ఉంటే ఆయా వెబ్సైట్ల సమాచారం ఎన్క్రిప్షన్ (రహస్య సంకేతాలతో కూడిన భాష)ను ఉపయోగిస్తుందని అర్థం. ఇలాంటి వెబ్సైట్లలోకి చొరబడటం హ్యాకర్లకు కష్టం. - గుర్తుతెలియని వ్యక్తులు/కంపెనీల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయకపోవడం మంచిది. ఇలాంటివి మిమ్మల్ని ఏదో ఒక వెబ్‌సైట్‌కు తీసుకెళ్లి వ్యక్తిగత వివరాలు రాబట్టుకునే చాన్స్ ఉంది. - ఫేక్ వెబ్సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వెబ్సైట్ యూఆర్ఎల్లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఫేక్ వెబ్సైట్లను సృష్టిస్తుం టారు హ్యాకర్లు. ఇంటర్నెట్ సెక్యూరిటీ కోసం పూర్తిస్థాయి సూట్‌ను వాడటం మేలు. ఇందుకు వెచ్చించే మొత్తం మీకు మాల్వేర్, ర్యాన్సమ్వేర్, వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. సర్వే నిర్వహణ ఇలా... దేశం మొత్తమ్మీద సుమారు 1,572 మందిని నార్టన్ లైఫ్‌లాక్ సంస్థ సర్వే చేసింది. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ను ఉపయోగించే వారు, 18 ఏళ్లకంటే ఎక్కువ వయసున్న వారిని ఎంపిక చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 8 – 16 తేదీల్లో జరిగిన ఈ సర్వేలో విద్యార్హతలు, ఆదాయం అంశాల ఆధారంగా విభజించిన ఇళ్లలోని వ్యక్తులను ప్రశ్నించారు. -
ఆన్ లైన్ డేటింగ్.. చిక్కితే తిప్పలే!
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. అయితే నో ప్రాబ్లమ్. స్మార్ట్ ఫోన్ ద్వారా గేమ్స్ ఆడటం, ఆన్ లైన్ లో బిల్లులు చెల్లించడం, ఇతర లావాదేవీలు చేయడం వరకూ ఎలాంటి సమస్య లేదు. కానీ ఆన్ లైన్ యూజర్లు ముఖ్యంగా డేటింగ్ సర్వీసును అందించే యాప్స్ వాడుతున్న భారతీయులు సమస్యలు ఎదుర్కొంటున్నారట. ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ వాడే ప్రతి ఐదుగురు భారతీయులలో ముగ్గురికి(దాదాపు 60శాతం యూజర్లు) కచ్చితంగా సెక్యూరిటీ ఇబ్బందులు తప్పడం లేదట. తాజాగా బుధవారం విడుదలైన ఓ సర్వేలో ఈ విషయాలు బహిర్గమయ్యాయి. భారత్ లో దాదాపు 38 శాతం యూజర్లు ఆన్ లైన్ డేటింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. 8 శాతం మహిళలు, 13 శాతం పురుషులు తమ స్మార్ట్ ఫోన్లలో డేటింగ్ సర్వీస్ యాప్స్ వాడుతున్నారు. 16 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న 1005 మంది ఇండియన్ స్మార్ట్ యూజర్లపై సర్వే చేసినట్లు మార్టన్ మొబైల్ సర్వే వారు తెలిపారు. 64శాతం మంది మహిళలు తమ డేటింగ్ భాగస్వాములతో పాటు వైరస్ ప్రొగామ్స్ ద్వారా సమస్యలు ఎదుర్కొంటున్నారని, అదే విధంగా పురుషులు కూడా సైబర్ క్రైమ్ నేరాలలో చిక్కుకుంటున్నారు. వైరస్ వల్ల 23శాతం, యాడ్స్ వల్ల 13శాతం, సైబర్ క్రైమ్స్ 9శాతం, ప్రీమియం సర్వీసులు 9శాతం, ఐడెండిటీ చోరీ సమస్యలు 6శాతం, ప్రతీకార సెక్స్ క్రైమ్ 4శాతం మంది యూజర్లు ఆయా విభాగాల వారీగా సమస్యలతో బాధపడుతున్నారు. నగరాల వారీగా చూస్తే.. న్యూఢిల్లీలో 51శాతం, చెన్నైలో 39శాతం, కోల్ కతాలో 36శాతం, ముంబై, అహ్మదాబాద్ లో 35శాతం యూజర్లు కనీసం ఓసారి డేటింగ్ యాప్స్ వినియోగించినట్లు సర్వేలో వెల్లడైంది. దక్షిణాది నగరాలైన చెన్నైలో 20శాతం యూజర్లు, హైదరాబాద్ యూజర్లలో 21శాతం మంది ఈ యాప్స్ కారణంగా సమస్యలలో ఇరుక్కుంటున్నట్లు సర్వే బృందం తెలిపింది. సైబర్ నేరాలు, ఇతర భద్రతాపరమైన సమస్యల వలయంలో బాధితుడు/బాధితురాలు కాకూడదంటే ఇలాంటి ఆన్ లైన్ డేటింగ్ యాప్స్, అదే తరహాలో ఉండే మరిన్ని యాప్స్ ను వినియోగించరాదని సర్వే చేసిన నార్టన్ మొబైల్ సర్వే సభ్యులు సూచించారు. -
మోస్ట్ వాంటెడ్ సైబర్ క్రిమినల్స్ అరెస్ట్
కరాచీ: ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ సైబర్ క్రిమినల్స్ నూర్ అజీజ్, ఫర్హన్ హర్షద్‌ను కరాచీలోని ఉత్తర ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు ఆ దేశ ఎఫ్‌బీఐ ఉన్నతాధికారి ఎంఎం జబ్బార్ వెల్లడించారు. వీరితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వీరి విచారణలో పలు అసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. యూఎస్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతూ పలు కంపెనీలకు తీవ్ర నష్టం కల్పించారని జబ్బార్ పేర్కొన్నారు. వీరి వల్ల సదరు కంపెనీలకు దాదాపు రూ. 50 మిలియన్ డాలర్లకుపైగా నష్టం వాటిల్లిందని చెప్పారు. దీంతో పలు కంపెనీలు పోలీసులను ఆశ్రయించగా... కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పోలీసులు... ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. ఆ క్రమంలో మోస్ట్ వాంటెడ్ సైబర్ నేరగాళ్ల జాబితాను ఎఫ్‌బీఐ పలు దేశాలలో విడుదల చేసింది. ఆ క్రమంలో వీరు పాక్ ఎఫ్‌బీఐ అధికారులకు శనివారం చిక్కారు. అయితే తమ జాబితాలోని మోస్ట్ వాంటెడ్ సైబర్ నేరగాళ్లకు సంబంధించిన సమాచారం అందిస్తే రూ. 5 వేల డాలర్లు నజరానా అందిస్తామని ఇప్పటికే ఎఫ్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.