సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ప్రధానంగా ఐదు రకాల నేర పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది నమోదైన నేరాల్లో 16శాతం సైబర్ నేరాలే ఉన్నాయి. ఇటీవల తెలంగాణ పోలీస్ వార్షిక నివేదికలో ఈ వివరాలు పొందుపరించారు. జాతీయ స్థాయిలో నమోదవుతున్న సైబర్‌నేరాల్లో తెలంగాణలోనే 2.5 శాతం మేర ఉన్నాయి.
ఈ సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సైబర్‌నేరగాళ్లవిగా గుర్తించిన మొత్తం 28,610 సిమ్‌కార్డులనుపోలీసులు బ్లాక్ చేశారు. సైబర్‌నేరగాళ్లకు సంబంధించిన 58446 క్రైం లింక్‌లను తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసులతో పంచుకున్నారు. దీంతో ఒకే తరహా మోసాలు పలు రాష్ట్రాల్లో చేస్తున్న సైబర్‌నేరగాళ్ల గుర్తింపులో ఇది కీలకంగా మారింది.
ఫెడ్‌ఎక్స్ కొరియర్
సైబర్‌నేరగాళ్లు ఫెడ్‌ఎక్స్ ఉద్యోగుల పేరిట, పోలీసులు, కస్టమ్స్ అధికారుల పేరిట ముందుగా ఫేక్ ఫోన్‌కాల్స్ చేస్తారు. మీ పేరిట వచ్చిన పార్సిల్‌లో డ్రగ్స్, ఇతర అనుమతి లేని పదార్థాలు ఉన్నాయని, మీపై కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బు ఇవ్వాలని అమాయకులను డిమాండ్ చేస్తారు. ఇలాంటి ఫేక్‌కాల్స్‌కు స్పందించకూడదు. మెసేజ్‌లలో ఉండే లింక్‌లపై కూడా క్లిక్ చేయవద్దు.
అడ్వర్టయిజ్‌మెంట్ పోర్టల్
ఆన్‌లైన్‌లో పలు రకాల వస్తువుల సేల్స్, ఆఫర్ల పేరిట ఇచ్చే యాడ్స్‌లో మోసపూరితమైనవి ఉంటాయన్నది గ్రహించాలి. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లను ప్రస్తావించి సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలు చేస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే వివరాలు తెలుసుకోవాలి. మోసపూరిత లింక్‌లపై క్లిక్ చేయవద్దు.
బిజినెస్‌లో పెట్టుబడుల పేరిట
తక్కువ పెట్టుబడి, అతి తక్కువ సమయంలోనే అత్యధిక లాభాలు అని ఊదరగొడుతున్నారంటే అది మోసపూరితమైనదే అని అనుమానించాలి. అసాధారణమైన హామీలు ఇస్తున్నారంటే వెంటనే వివరాలు తప్పక పరిశీలించాలి. ఎక్కువగా రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు, క్రిప్టోకరెన్సీ సంబంధిత పెట్టుబడులు, పిరమిడ్ స్కీంలు, మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు ఈ తరహావే.
ఆన్‌లైన్ లోన్లు
ఆర్థిక అవసరాలే బలహీనతగా ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే ఆన్‌లైన్‌లో రుణాలు ఇస్తామంటూ మోసం చేస్తారు. వ్యక్తిగత, బ్యాంకు వివరాలు తీసుకొని ఆర్థిక మోసాలు ఒక తరహావి అయితే, ఆన్‌లైన్ యాప్‌లలో రుణాలు ఇచ్చి తర్వాత అత్యధిక వడ్డీల కోసం వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఉంటున్నాయి. వీలైనంత వరకు ఆన్‌లైన్ రుణ యాప్‌ల జోలికి వెళ్లవద్దు. ఆర్‌బీఐ అనుమతి ఉందా లేదా అని తప్పకచూడాలి.
క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాల సేకరణ
బ్యాంకు అధికారులుగా చెబుతూ కేవైసీ అప్‌డేషన్, మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు బ్లాక్ అయ్యిందంటూ.. సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి మోసాలకు పాల్పడతారు. మన నుంచే బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు తెలుసుకొని ఆన్‌లైన్‌లో డబ్బు కొల్లగొడతారు. బ్యాంకు అధికారులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఖాతాదారులకు ఫోన్ చేసి వివరాలు అడగరనేది అందరూ గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment