ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 51 గ్రామాలు విలీనం | Telangana Govt Has Issued Gazette Merge 51 Villages Orr With Nearest Municipalities | Sakshi
Sakshi News home page

ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 51 గ్రామాలు విలీనం

Published Sat, Dec 7 2024 6:00 PM | Last Updated on Sat, Dec 7 2024 6:13 PM

Telangana Govt Has Issued Gazette Merge 51 Villages Orr With Nearest Municipalities

సాక్షి,హైదరాబాద్‌: రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలోని 51 పంచాయితీలు సమీప మున్సిపాలిటీల్లో వీలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాల్‌ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్లను ఇప్పటికే హైకోర్టు కొట్టేవేయడంతో పంచాయ‌తీల విలీనానికి మార్గం సుగమమైంది. దీంతో గవర్నర్ అమోదంతో గెజిట్ జారీ అయ్యింది.

ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న మొత్తం 51 గ్రామ పంచాయతీలను విలీనానికి మంత్రివర్గం సబ్ కమిటీ సిఫారసు చేయగా, సెప్టెంబర్ 3న ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీల విలీనంతో ఔటర్ రింగు రోడ్డు పరిధి మొత్తం పూర్తి పట్టణ ప్రాంతంగా మారనుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాలను 4 మున్సిపాలిటీల్లో కలపగా అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 28 గ్రామాలను 7 మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 11 గ్రామాలను అక్కడి రెండు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం విలీనం చేసింది.

కాగా, హైదరాబాద్‌ చుట్టూ ఉన్న 51 గ్రామ పంచాయతీలను పరిసర మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ 3 సబబేనని తేల్చిచెప్పింది. విలీనాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలంలోని రాంపల్లి దాయార, కీసర, బోగారం, యాద్గారపల్లి గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

ఆయా గ్రామాలను మున్సిపాలిటీల నుంచి తొలగించి పంచాయతీలుగానే కొనసాగించాలని రాంపల్లి దాయారకు చెందిన మాజీ వార్డు మెంబర్‌ ముక్క మహేందర్‌, మాజీ సర్పంచ్‌ గంగి మల్లేశ్‌, మాజీ ఉప సర్పంచ్‌ కందాడి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఆయా గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది పూస మల్లేశ్‌, బి. హనుమంతు, మొల్గర నర్సింహ వాదనలు వినిపించారు.

పైన పేర్కొన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో కలుపుతూ సెప్టెంబర్‌ 2, 2024న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.3ను వెంటనే రద్దు చేసి.. ఆ గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడమంటే భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం నిబంధనలోని పార్ట్‌–9ని ఉల్లంఘించటమేనని వాదించారు. అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి ఈ వాదనలను తప్పుబట్టారు. విలీనానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లలో మెరిట్స్‌ లేవంటూ కొట్టివేసింది.

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement