
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల నగారా మోగనుందనే సంకేతాల నేపథ్యంలో ప్రధాని మోదీ.. ఈ నెల 15న మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించాలని భావిస్తున్న భారతీయ జనతాపార్టీ..మల్కాజ్‌గిరి స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది.
సిట్టింగ్ సికింద్రాబాద్ స్థానం సహా మల్కాజ్‌గిరి, చేవెళ్ల, హైదరాబాద్ స్థానాలపై ఫోకస్ పెట్టిన కమలదళం..ప్రచారపర్వంలోకి జాతీయ నేతలను రంగంలోకి దించుతోంది. రెండు రోజుల క్రితం హోం మంత్రి అమిత్‌షా నగరంలో పర్యటించగా..పది రోజుల వ్యవధిలోనే ప్రధాని రెండోసారి రాష్ట్రానికి వస్తుండడం గమనార్హం. ఇటీవల నగర శివార్లలోని పటాన్‌చెరులో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నగర ఓటర్లను ఆకట్టుకునేందుకు రోడ్‌షోలు నిర్వహిస్తోంది. మల్కాజ్‌గిరిలో సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించింది.
పీఎం పర్యటన నేపథ్యంలో ఆంక్షలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈ నెల 15న మల్కాజ్‌గిరిలో జరగనున్న సభలో మోదీ పాల్గొననున్నారు. దీంతో మీర్జాల్‌గూడ నుంచి మల్కాజ్‌గిరి క్రాస్ రోడ్ వరకు 5 కి.మీ. మేర పారా గ్‌లైడర్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్‌లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎగరవేయడానికి అనుమతి లేదని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188, 121, 121 (ఏ), 287, 336, 337, 338 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్
► రేపు సాయంత్రం 4.55కి బేగంపేట విమానాశ్రయంకు చేరుకోనున్న ప్రధాని
► సాయంత్రం 5.15 నుంచి 6.15 వరకు మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టే రోడ్ షోలో పాల్గొననున్నారు.
► 6.40 గంటలకు రాజ్ భవన్ చేరుకోనున్న ప్రధాని.. రాజ్‌భవన్‌లో బస.
► ఈ నెల 16న ఉదయం 10.45 గంటలకు రాజ్ భవన్ నుంచి బయలుదేరనున్న ప్రధాని
► 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి నాగర్ కర్నూల్ వెళ్లనున్న మోదీ
► 11.45 నుంచి 12.45 వరకు నాగర్ కర్నూల్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ
►ఒంటి గంటకు నాగర్ కర్నూల్ నుంచి గుల్బర్గా వెళ్లనున్న ప్రధాని.
Comments
Please login to add a commentAdd a comment