సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు లీజు టెండర్లలో అక్రమాలపైన ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. సీబీఐ లేదా అదేస్థాయి సంస్థలతో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించడంతో ఔటర్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఔటర్ టోల్ లీజులో అక్రమాలకు బాధ్యులైన అధికారురులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
మరోవైపు ఔటర్ లీజు వ్యవహారంపైన పూర్తి వివరాలను అందజేయాలని హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ముఖ్యమంత్రి ఆదేశించారు. 158 కిలోమీటర్ల మార్గంలో టోల్ వసూలు ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించిపెట్టే ఔటర్ రింగ్‌రోడ్డును గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ఐఆర్‌బీ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
బీజేపీతో పాటు, పీసీసీ చీఫ్‌గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. కనీస ధర వెల్లడించకపోవడంతో ఔటర్‌లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఆరోపణలపైన అప్పటి హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ఆయనపైన పరువునష్టం దావా కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పదంగా మారిన ఔటర్ లీజు అంశాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సీరియస్‌గా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే సమగ్రమైన విచారణ చేపట్టాలని ఆయన హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
టీఓటీ పద్ధతిలో ఔటర్ లీజు...
కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన టీఓటీ (టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో ఔటర్ రింగ్‌రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు 2022 ఆగస్టు11వ తేదీన గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదే సంవత్సరం నవంబర్ 9వ తేదీన అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్‌ఎండీఏ టెండర్లను ఆహా్వనించింది. గత సంవత్సరం మార్చి 31వ తేదీ నాటికి 11 బిడ్డర్‌లు ఆసక్తిని ప్రదర్శించారు. బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా మూడుసార్లు బిడ్ గడువును పొడిగించారు. 30 ఏళ్ల లీజుపైన బేస్ ప్రైస్ కంటే ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ.7380 కోట్లతో ఎక్కువ మొత్తంలో బిడ్ చేసినట్లు అప్పటి హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ వెల్లడించారు.
కానీ ప్రభుత్వం నిర్ణయించిన బేస్‌ప్రైస్‌పైన మాత్రం గోప్యతను పాటించడంతో ఈ లీజు వ్యవహారం వివాదాస్పదమైంది. మొదట్లో 11 సంస్థలు పోటీ చేయగా, చివరకు 4 సంస్థలు మాత్రమే పోటీలో మిగిలాయి. ఆ నాలుగింటిలోనూ ఐఆర్‌బీ ఎక్కువమొత్తంలో బిడ్ వేసి లీజును దక్కించుకుంది. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు మార్గంలో ప్రతి రోజు 1.5 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అప్పట్లో గత ప్రభుత్వం నిర్దేశించిన అంచనాల కంటే ఎక్కువ మొత్తంలో ఐఆర్‌బీ సంస్థకు టోల్ ఆదాయం లభిస్తున్నట్లు అధికారవర్గాల అంచనా. మరోవైపు ఏటా సుమారు రూ.550 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించి పెట్టే కామధేనువు వంటి ఔటర్‌ను ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేయడం పట్ల ఇంజనీరింగ్ నిపుణులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
గడువు కంటే ముందే రూ.7380 కోట్లు చెల్లించిన ఐఆర్‌బీ...
ఇలా వివాదాల నడుమ ఔటర్ టెండర్‌ను దక్కించుకున్న ఐఆర్‌బీ సంస్థ నిర్ణీత 120 రోజుల గడువు కంటే ముందే రూ.7380 కోట్ల లీజు మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించింది..దీంతో 2008 నుంచి 2023 వరకు వరకు సుమారు 15 సంవత్సరాల పాటు హెచ్‌ఎండీఏ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డు మొట్టమొదటిసారి ప్రైవేట్ సంస్థ నిర్వహణలోకి వెళ్లిపోయింది. నిబంధనల మేరకు రానున్న 30 ఏళ్ల పాటు ఈ లీజు కొనసాగవలసి ఉంటుంది.
8 వరుస లేన్‌లతో (1264 లేన్ కి.మీలు) కూడిన 158 కి.మీల ఔటర్ రింగ్‌రోడ్డుపైన ఉన్న సుమారు 120కి పైగా టోల్‌గేట్ల వద్ద ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థ టోల్ వసూళ్లను కొనసాగిస్తోంది. ఔటర్ రింగురోడ్డు నుంచి టోల్ వసూలు చేయడంతో పాటు రహదారుల నిర్వహణ, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, తదితర ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) బాధ్యతలను కూడా గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే చేపట్టవలసి ఉంటుంది. హెచ్‌జీసీఎల్ ఔటర్‌ను ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్లు, ఔటర్ మాస్టర్‌ప్లాన్ అమలు, పచ్చదనం పరిరక్షణ వంటి బాధ్యతలకు పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment