
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా విస్తరణకనుగుణంగా కార్యకలాపాలను సైతం విస్తరించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. ట్రిపుల్ ఆర్ వరకు పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్, ప్లానింగ్ తదితర విభాగాలను బలోపేతం చేసేందుకు దృష్టిసారించింది. హెచ్‌ఎండీఏ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయించడంతో భవన నిర్మాణాలు, లే అవుట్‌లు, ఆక్యుపెన్సీలు తదితర నిర్మాణ రంగానికి చెందిన అనుమతుల ప్రక్రియలు డీటీసీపీ నుంచి హెచ్‌ఎండీఏకు బదిలీ అయ్యాయి. అలాగే ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యకలాపాలు కూడా హెచ్‌ఎండీఏ (HMDA) పరిధిలోకి వచ్చాయి. దీంతో వివిధ విభాగాల్లో అవసమైన అధికారులు, సిబ్బందిని నియమించి సంస్థాగతంగా బలోపేతం చేయవలసి ఉన్నదని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు వివరించారు. ఈ దిశగా దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నారు.
‘ప్రస్తుతం జోనల్ అధికారులు రీజనల్ రింగ్‌రోడ్డు (Regional Ring Road) వరకు విధులు నిర్వహించడం టెక్నికల్‌గా కూడా సాధ్యం కాదు. కొత్తగా మరిన్ని జోన్‌లు ఏర్పాటు చేస్తే తప్ప సకాలంలో విధులు నిర్వహించడం సాధ్యం కాదు’ అని చెప్పారు. హైదరాబాద్ మహానగర పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడంతో హెచ్‌ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472.723 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. హైదరాబాద్ చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలో నిర్మించనున్న రీజనల్‌రింగ్ రోడ్డు వరకు నిర్మాణ అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల విస్తరణ వంటి పనులను చేపట్టివలసి ఉంది.
ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలతో పాటు కొత్తగా నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలతో కలుపుకొని మొత్తం 11 జిల్లాల పరిధిలో హెచ్‌ఎండీఏ కార్యకలాపాలను కొనసాగించవలసి ఉంది. ఇలా భారీగా పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా మరో 4 జోన్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.
గతంలో మేడ్చల్, శంకర్‌పల్లి, ఘట్‌కేసర్, శంషాబాద్ (Shamshabad) నాలుగు జోన్‌లు మాత్రమే ఉండగా, శంకర్‌పల్లి, మేడ్చల్ జోన్‌లలో అదనంగా ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. దీంతో హెచ్‌ఎండీఏ జోన్‌ల సంఖ్య 4 నుంచి 6 కు పెరిగింది. ఇప్పుడు తాజాగా ట్రిపుల్ ఆర్ (RRR) వరకు పరిధి పెరగడం వల్ల కొత్తగా మరో 4 జోన్‌లను ఏర్పాటు చేసి మొత్తం 10 జోన్‌లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో మొత్తం 1355 గ్రామాలు ఉన్నాయి. పరిధిని పెంచడం వల్ల 11 జిల్లాల్లోని 104 మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. రీజనల్ రింగ్‌రోడ్డు తరువాత 2 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా నిర్ణయించారు. రీజనల్ రింగ్‌రోడ్డు తరువాత కనీసం 5 కిలోమీటర్ల వరకు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలనే ప్రతిపాదన ఉంది. ఈ మేరకు జోన్ల విస్తరణ అనివార్యం అయింది.
చదవండి: 111 జీవో స్థలాలను క్రమబద్ధీకరిస్తారా?
ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం రావిర్యాల (Raviryal) నుంచి ఆమన్‌గల్ వరకు 41 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు తరహాలోనే రీజనల్ రింగ్‌రోడ్డుకు, ఔటర్‌రింగ్‌రోడ్డుకు సుమారు 40 చోట్ల రహదారుల నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. కొత్తగా రూపొందించనున్న మాస్టర్‌ప్లాన్–2050లో రహదారులు, శాటిలైట్ టౌన్‌షిప్పులు, ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారు. ‘హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్‌సిటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది.ఈ మేరకు హెచ్‌ఎండీఏ కార్యాచరణను పటిష్టం చేయవలసి ఉంది’ అని ఒక అధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment