
త్వరలో ఆసక్తిగల సంస్థల నుంచి దరఖాస్తుల స్వీకరణ
సెప్టెంబర్ నాటికి సమగ్ర మాస్టర్ ప్లాన్ ముసాయిదా
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరిస్తూ మాస్టర్‌ప్లాన్
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధి విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో సమగ్రమైన మాస్టర్‌ప్లాన్ రూపకల్పన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వచ్చే సెప్టెంబర్ నాటికి మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను విడుదల చేసే దిశగా హెచ్‌ఎండీఏ (HMDA) కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు కొత్తగా విస్తరించనన్న పరిధికి అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ కోసం మరో వారం, పది రోజుల్లో ఆసక్తి వ్యక్తీరణ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్) దరఖాస్తులను స్వీకరించేందుకు నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్‌లో చేర్చాల్సిన అంశాలపై కసరత్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో రూపొందించిన హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్ – 2031లో దొర్లిన లోపాలు పునరావృతం కాకుండా పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేయనున్నట్లు ఒక అధికారి వివరించారు.
2050 వరకు హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, టౌన్‌షిప్పులు, రహదారులు, ప్రజారవాణా సదుపాయాలు, పచ్చదనం, నీటివనరులు, తదితర అంశాలను సమగ్రంగా ప్రతిపాదించేలా మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు ఆసక్తి గల అంతర్జాతీయ కన్సార్షియంల నుంచి దరఖాస్తులను కోరనున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఉన్న అన్ని మాస్టర్‌పాల్‌న్‌లను ఈ బృహత్తర మాస్టర్‌ప్లాన్‌లో విలీనం చేయనున్నారు. ఎంసీహెచ్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, సైబరాబాద్, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మాస్టర్‌ప్లాన్‌లు విలీనం కానున్నాయి.
రీజినల్ రింగ్‌రోడ్డు వెలుపల 2 కిలోమీటర్ల వరకు...
హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు రీజనల్ రింగ్‌రోడ్డుకు వెలుపల 2 కిలోమీటర్ల వరకు మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తారు. ట్రిపుల్ ఆర్ తరువాత ఒక కిలోమీటర్‌ను బఫర్‌జోన్‌గా పరిగణిస్తారు. ఆ కిలోమీటర్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం 7,527 చదరపు కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధి కొత్తగా 10,560 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది. మొత్తం 104 మండలాలు, 1,355 గ్రామాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయి.
చదవండి: హైదరాబాద్‌కు దీటుగా ప్యూచర్ సిటీ!
ఇప్పుడు ఉన్న 7 జిల్లాలకు తోడు నల్గొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్ కొత్తగా చేరడంతో హెచ్‌ఎండీఏ పరిధిలోని జిలాల సంఖ్య 11కు చేరనుంది. అలాగే 41 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లు కూడా హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయి. కొత్తగా 3 మున్సిపాలిటీలు చేరనున్నాయి. ఔటర్ లోపల 28 మున్సిపాలిటీలు, ఔటర్ వెలుపల 12 మున్సిపాలిటీలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment