HMDA Master Plan: అంతులేని పొర‘పాట్లు’ | Errors HMDA master plan | Sakshi
Sakshi News home page

HMDA Master Plan: అంతులేని పొర‘పాట్లు’

Published Wed, Oct 23 2024 8:01 AM | Last Updated on Wed, Oct 23 2024 6:50 PM

 Errors HMDA master plan

వెంటాడుతున్న హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ తప్పులు 

ఏళ్లు గడిచినా సవరణకు నోచుకోని వైనం 

బృహత్‌ ప్రణాళికలో అంతులేని జాప్యం 

తీవ్రంగా నష్టపోతున్నామంటున్న బాధితులు

సాక్షి, హైదరాబాద్‌: 
👉‘నాగోల్‌ నుంచి కుంట్లూర్‌ వరకు రెండువందల అడుగుల వెడల్పుతో రోడ్డు ఉన్నట్లు మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. కానీ.. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. చుట్టుపక్కల పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. రోడ్డు వస్తుందో, రాదో తెలియదు కానీ మా స్థలం రోడ్డు మధ్యలో ఉన్నట్లు చెప్పి ఎల్‌ఆర్‌ఎస్‌ నిరాకరించారు. ఏళ్లు గడిచాయి. అక్కడ రోడ్డు నిర్మించలేదు. అలాగని మాస్టర్‌ప్లాన్‌ సవరించలేదు. నాతో పాటు ఎంతోమంది  తీవ్రంగా నష్టపోయాను’ నాగోల్‌కు చెందిన రాంరెడ్డి ఆందోళన ఇది. తప్పుల తడకలాంటి హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌ కారణంగా ఆ స్థలాన్ని అమ్ముకోలేక, ఎలాంటి నిర్మాణం చేపట్టలేక మానసికంగా ఎంతో ఆవేదన గురవుతున్నారాయన.  

👉‘తుర్కయంజాల్‌ సమీపంలో ఒక వ్యక్తి  గతంలో 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ ప్రాంతంలో 150 ఫీట్ల రోడ్డు పోతున్నట్లుగా మాస్టర్‌ప్లాన్‌లో ఉందన్నారు. కానీ.. ఆ ప్లాట్‌ పక్కనే ఉన్న మరో ప్లాట్‌కు ఎల్‌ఆర్‌ఎస్‌ ఇచ్చారు. ఇదే అంశంపై సదరు బాధితుడు హెచ్‌ఎండీఏ అధికారులను సంప్రదించగా ‘మాస్టర్‌ప్లాన్‌ ఒక్కటే తమకు ప్రామాణికం’ అని సెలవిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనికి ఎలాంటి పరిష్కారం లభించలేదు.

వేలాది తప్పులు.. 
హైదరాబాద్‌ మహానగర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం 2031 నాటి  అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2013 బృహత్‌ ప్రణాళికను రూపొందించిన సంగతి తెలిసిందే. జీహెచ్‌ఎంసీ, ఎంసీహెచ్, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ, సైబరాబాద్‌ అథారిటీ, హెచ్‌ఎండీఏ ప్రణాళాకలన్నింటినీ కలిపి బృహత్‌ ప్రణాళికను తయారు చేశారు. కానీ.. అప్పట్లో దీనిపై ఎలాంటి శాస్త్రీయమైన అధ్యయనం చేయకపోవడంతో అంతులేని తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. రోడ్లు, చెరువులు, కుంటలు, నాలాలు లేని చోట ఉన్నట్లు, ఉన్న చోట లేనట్లు మాస్టర్‌ ప్లాన్‌లో నమోదైంది. మరోవైపు హెచ్‌ఎండీఏ పరిధిలోని వందలాది గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లు, ఊళ్లు మాయమైనట్లుగా కూడా గుర్తించారు. అయిదు మాస్టర్‌ప్లాన్‌లను సమన్వయం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. సుమారు 3000కు పైగా తప్పులు ఉన్నట్లు అప్పట్లోనే గుర్తించారు. దీంతో  50 వేల మందికి పైగా బాధితులు  ఎల్‌ఆర్‌ఎస్‌ను  తీసుకొనే అవకాశం కోల్పోయారు. ఆ తప్పులు ఇప్పటికీ తమను వెంటాడుతూనే ఉన్నాయని వివిధ ప్రాంతాలకు చెందిన  బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

మిగిలింది నిరాశే.. 
సమగ్ర మాస్టర్‌ప్లాన్‌  అమల్లోకి వచ్చిన తర్వాత రెండు మూడుసార్లు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికీ మాస్టర్‌ప్లాన్‌లో తప్పుల కారణంగా నష్టపోయిన బాధితులకు  ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. ‘ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని, మాస్టర్‌ప్లాన్‌లో తప్పులను సవరిస్తారని అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ నిరాశా నిస్పృహలే  మిగులుతున్నాయి’అని బీఎన్‌రెడ్డి నగర్‌కు  చెందిన చంద్రశేఖర్‌ తెలిపారు. 

మరోవైపు  2031 మాస్టర్‌ ప్లాన్‌ను సవరించి కొత్తది రూపొందించేందుకు అయిదారేళ్లుగా ప్రతిపాదనలు చేస్తూనే ఉన్నారు. మాస్టర్‌ప్లాన్‌–2041 రానుందన్నారు. ఆ తర్వాత ట్రిపుల్‌ వన్‌ జీఓలోని ప్రాంతాలన్నింటినీ కలిసి హెచ్‌ఎండీఏ పరిధిలోని 7,200 చ.కి.మీలకు వర్తించేలా మహా మెగా మాస్టర్‌ప్లాన్‌ అన్నారు. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి  ట్రిపుల్‌ ఆర్‌ వరకు వర్తించేలా సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని భావిస్తోంది. మాస్టర్‌ప్లాన్‌– 31 కారణంగా నష్టపోయిన బాధితులు దశాబ్ద కాలంగా  ఎలాంటి పరిష్కారం లభించక పడిగాపులు కాస్తూనే ఉండటం గమనార్హం.  

ప్రస్తుతం 2050 బృహత్‌ ప్రణాళిక..  
తెలంగాణ మూడు భాగాలుగా విభజించి 2050 వరకు దశలవారీగా చేపట్టాల్సిన అభివృద్ధిపై బృహత్‌ ప్రణాళికను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని అర్బన్‌గా, ఔటర్‌రింగ్‌ రోడ్డు నుంచి రీజినల్‌ రింగ్‌రోడ్డు వరకు ఉన్న భూభాగాన్ని సబర్బన్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. రీజినల్‌ రింగ్‌రోడ్డు నుంచి ఉండే మిగతా తెలంగాణ ప్రాంతాన్ని రూరల్‌గా పరిగణిస్తారు. ఇందుకనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను  చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 

దీంతో హెచ్‌ఎండీఏ పరిధి ప్రస్తుతం ఉన్న 7,200 చ.కి.మీ నుంచి సుమారు 10 వేల చదరపు కి.మీ వరకు పెరగనుంది. ఈ మొత్తం భూభాగానికి వర్తించేవిధంగా ‘మెగా మాస్టర్‌ ప్లాన్‌ –2050’ని రూపొందిస్తారు. ఇందులో ఓఆర్‌ఆర్‌ నుంచి ట్రిపుల్‌ ఆర్‌ వరకు సమగ్ర ప్రజా రవాణా సదుపాయాల ప్రణాళిక (కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌) ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక, బ్లూ అండ్‌ గ్రీన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రణాళికలు ఉంటాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి మెగా మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆ దిశగా ఎలాంటి పురోగతి లేకుండాపోయింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement