Hyderabad: మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో స్థలాలు | HMDA to E Auction Plots in Thorrur, Bahadurpally, Turkayamjal, Kurmalguda Areas | Sakshi
Sakshi News home page

సర్కారు భూముల వేలానికి హెచ్‌ఎండీఏ సన్నాహాలు

Published Tue, Nov 8 2022 4:55 PM | Last Updated on Tue, Nov 8 2022 4:55 PM

HMDA to E Auction Plots in Thorrur, Bahadurpally, Turkayamjal, Kurmalguda Areas - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సర్కారు భూముల వేలానికి సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రీబిడ్‌ సమావేశాలకు ఆసక్తిగల కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో ప్లాట్‌లను ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ సన్నద్ధమైంది. 

హెచ్‌ఎండీఏ పరిధిలోని బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ, తుర్కయంజాల్, తొర్రూరులతో పాటు, మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని  అమిస్తాపూర్‌లో ప్రభుత్వ స్థలాలను ఈ– వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో గతంలో నిర్వహించిన ఈ– వేలం ద్వారా కొన్ని ప్లాట్‌లను విక్రయించగా మిగిలిన వాటిని రెండో దశలో విక్రయించేందుకు అధికారులు తాజాగా చర్యలు చేపట్టారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఉన్న  స్థలాలు కావడంతో  సాధారణ, మధ్యతరగతి వర్గాల నుంచి రియల్టర్లు, బడా బిల్డర్ల వరకు కూడా ప్రభుత్వ స్థలాల కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతున్నారు. 

సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకొనే మధ్యతరగతి వర్గాలకు బహదూర్‌పల్లి, తొర్రూరులలో 197 చదరపు గజాల నుంచి 267 చదరపు గజాల విస్తీర్ణం వరకు కూడా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే  బహదూర్‌పల్లి, తుర్కయంజాల్, కుర్మల్‌గూడ, తొర్రూరు, తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల కోసం 325 చదరపు గజాల నుంచి గరిష్టంగా 1,145 చదరపు గజాల వరకూ గరిష్ట విస్తీర్ణంలో కొన్ని ప్లాట్‌లు ఉన్నట్లు అధికారులు  తెలిపారు. ఈ నెల  14 నుంచి 23 వరకు ప్లాట్‌లకు ఈ– వేలం   నిర్వహించనున్నారు.  

ఆదాయ మార్గాల అన్వేషణలో..  
► ఆదాయ సముపార్జన కోసం  ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో  ఉన్న  ప్రభుత్వ స్థలాల విక్రయానికి చర్యలు చేపట్టింది. హెచ్‌ఎండీఏ  పరిధిలోని  స్థలాల  విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఈసారి సుమారు రూ.500 కోట్లకు  పైగా  ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు  అంచనా. కుర్మల్‌గూడ, తొర్రూర్‌లలో చదరపు గజానికి రూ.10 వేల చొప్పున కనీస ధర నిర్ణయించగా, తుర్కయంజాల్‌లో కనీస ధర రూ.40 వేలుగా నిర్ణయింంచారు. బహదూర్‌పల్లిలో  కనీస ధర రూ.25వేల చొప్పున ఉంటుంది. అన్నిచోట్లా ఈసారి భారీ  డిమాండ్‌  ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.  

► ఒకవైపు భూముల విక్రయం ద్వారా ఆదాయం కోసం చర్యలు  తీసుకొంటూనే మరోవైపు గతంలో నిలిచిపోయిన లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ ద్వారా కూడా ఫీజుల రూపంలో ఖజానా నింపుకొనేందుకు ప్రభుత్వం  సన్నాహాలు చేస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని సుమారు 633 వెంచర్‌లను అధికారులు గుర్తించారు. వీటికి ఎల్‌ఆర్‌ఎస్‌ జారీ చేస్తే మరో రూ.500 కోట్ల వరకు ఫీజుల రూపంలో  లభించే అవకాశం ఉంది. (క్లిక్ చేయండి: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్‌.. ఎయిర్‌పోర్ట్‌కు సాఫీగా జర్నీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement