Online Auction
-
అది మెస్సీ క్రేజ్.. జెర్సీల విలువ 64 కోట్ల పై మాటే..!
ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవ్యాప్తంగా ఈ స్టార్ ఫుట్‌బాలర్‌కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మెస్సీ ప్రపంచంలో ఏ మూలలో ఫుట్‌బాల్ ఆడినా ఇసకేస్తే రాలనంత మంది జనాలు స్టేడియాలకు తరలి వస్తారు. అతను ధరించే బ్రాండ్లు, అతని ఎండార్స్మెంట్ల రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. తాజాగా మెస్సీ ధరించిన జెర్సీలను ఆన్లైన్లో వేలానికి పెట్టగా కళ్లు బైర్లు కమ్మే మొత్తానికి అవి అమ్ముడుపోయాయి. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను న్యూయార్క్‌లో ఆన్లైన్ వేలానికి పెట్టగా.. ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 78 లక్షల డాలర్లకు (రూ. 64 కోట్ల 86 లక్షలు) ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో ఓ వ్యక్తి ధరించిన జెర్సీలు అమ్ముడుపోవడం క్రీడల చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యుంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి, మూడోసారి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో మెస్సీ రెండు గోల్స్ సాధించి అర్జెంటీనాను ఒంటిచేత్తో గెలిపించాడు. -
RTO Bandlaguda: ఆన్లైన్ బిడ్డింగ్‌లో క్రేజీ నంబర్స్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపైన వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. శుక్రవారం బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో 29 ప్రత్యేక నెంబర్లపైన రూ.8,40,167 ఆదాయం లభించినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు. ‘టీఎస్12ఈడబ్ల్యూ 0001’ నెంబర్ కోసం ఒక వాహనదారుడు రూ.2,82,786 చెల్లించి సొంతం చేసుకున్నారు. ‘టీఎస్12ఈడబ్ల్యూ 0009’ నెంబర్ కోసం మరో వాహనదారుడు రూ.1,69,999 చెల్లించినట్లు జేటీసీ పేర్కొన్నారు. రవాణాశాఖ దక్షిణమండలం జోన్ అయిన బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలోనూ ప్రత్యేక నెంబర్లపైన పోటీ కనిపించడం విశేషం. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో టీఎస్09 ఎఫ్యూ 9999 నంబరును రూ.10,49,999కు కోట్ చేసి గిరిధారి కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. టీఎస్ 09 ఎఫ్‌వీ 0001 నంబరుకు రేజర్ గేమింగ్ సంస్థ రూ.3,50,000 చెల్లించింది. (క్లిక్ చేయండి: ఆర్టీసీపై మళ్లీ కోర్టుకెక్కిన సీసీఎస్) -
Hyderabad: మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో స్థలాలు
సాక్షి, సిటీబ్యూరో: సర్కారు భూముల వేలానికి సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రీబిడ్ సమావేశాలకు ఆసక్తిగల కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమైంది. హెచ్ఎండీఏ పరిధిలోని బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ, తుర్కయంజాల్, తొర్రూరులతో పాటు, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని అమిస్తాపూర్‌లో ప్రభుత్వ స్థలాలను ఈ– వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో గతంలో నిర్వహించిన ఈ– వేలం ద్వారా కొన్ని ప్లాట్లను విక్రయించగా మిగిలిన వాటిని రెండో దశలో విక్రయించేందుకు అధికారులు తాజాగా చర్యలు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న స్థలాలు కావడంతో సాధారణ, మధ్యతరగతి వర్గాల నుంచి రియల్టర్లు, బడా బిల్డర్ల వరకు కూడా ప్రభుత్వ స్థలాల కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకొనే మధ్యతరగతి వర్గాలకు బహదూర్‌పల్లి, తొర్రూరులలో 197 చదరపు గజాల నుంచి 267 చదరపు గజాల విస్తీర్ణం వరకు కూడా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బహదూర్‌పల్లి, తుర్కయంజాల్, కుర్మల్‌గూడ, తొర్రూరు, తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల కోసం 325 చదరపు గజాల నుంచి గరిష్టంగా 1,145 చదరపు గజాల వరకూ గరిష్ట విస్తీర్ణంలో కొన్ని ప్లాట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి 23 వరకు ప్లాట్లకు ఈ– వేలం నిర్వహించనున్నారు. ఆదాయ మార్గాల అన్వేషణలో.. ► ఆదాయ సముపార్జన కోసం ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల విక్రయానికి చర్యలు చేపట్టింది. హెచ్ఎండీఏ పరిధిలోని స్థలాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఈసారి సుమారు రూ.500 కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు అంచనా. కుర్మల్‌గూడ, తొర్రూర్‌లలో చదరపు గజానికి రూ.10 వేల చొప్పున కనీస ధర నిర్ణయించగా, తుర్కయంజాల్‌లో కనీస ధర రూ.40 వేలుగా నిర్ణయింంచారు. బహదూర్‌పల్లిలో కనీస ధర రూ.25వేల చొప్పున ఉంటుంది. అన్నిచోట్లా ఈసారి భారీ డిమాండ్ ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ► ఒకవైపు భూముల విక్రయం ద్వారా ఆదాయం కోసం చర్యలు తీసుకొంటూనే మరోవైపు గతంలో నిలిచిపోయిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా కూడా ఫీజుల రూపంలో ఖజానా నింపుకొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని సుమారు 633 వెంచర్లను అధికారులు గుర్తించారు. వీటికి ఎల్ఆర్ఎస్ జారీ చేస్తే మరో రూ.500 కోట్ల వరకు ఫీజుల రూపంలో లభించే అవకాశం ఉంది. (క్లిక్ చేయండి: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్.. ఎయిర్‌పోర్ట్‌కు సాఫీగా జర్నీ) -
ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ.. నిర్మల్‌లో ఇదే మేటి!
నిర్మల్ చైన్‌గేట్: ఇష్టమైన వాహనాలు కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు, రూ.కోట్లు వెచ్చిస్తుంటారు. చాలామంది ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ పడుతుంటారు. ఎన్ని డబ్బులైనా వెచ్చించి సొంతం చేసుకుంటారు. నిర్మల్ రవాణా కార్యాలయంలో కూడా ఓ వాహనదారుడు ఫ్యాన్సీ నంబర్ కోసం గురువారం రూ.4.80 లక్షలు వేలంపాడి దక్కించుకున్నాడు. టీఎస్18–జీ 9999 ఫ్యాన్సీ నంబర్‌కు నిర్మల్ ఆర్టీవో అజయ్‌రెడ్డి సమక్షంలో ఆన్లైన్లో వేలం నిర్వహించారు. శ్రీపతి సంతోష్‌కుమార్ రూ.4,80,000కు దక్కించుకున్నాడు. జిల్లాలో ఫ్యాన్సీ నంబర్ కోసం ఇంత మొత్తం వెచ్చించడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. అలాగే టీఎస్18–హెచ్ 0009 నంబర్‌ను వెంకట సత్యశ్రీధర్ వర్మ రూ.3,15,999కి దక్కించుకున్నాడు. టీఎస్18–హెచ్ 0001 నంబర్‌ను తడ్క నాగజ్యోతి రూ.2,02,000కు, 0002 నంబర్‌ను విజయ్ భాస్కర్‌రెడ్డి రూ.1,05,000కు, 0008ను కొంతం ప్రణయ్‌రెడ్డి రూ.12,124కు, 0007ను పూర్ణమ్మ రూ.55,678కు, 0004 ను తుంగెన ధర్మారావు రూ.16,434కు పొందారు. (క్లిక్: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ) -
క్రేజీ..ఇక ఆన్లైన్
సాక్షి,సిటీబ్యూరో: రవాణాశాఖ రిజర్వేషన్ నంబర్లకు ఇంత వరకు వాహనదారుల సమక్షంలో నిర్వహిస్తున్న వేలానికి త్వరలో స్వస్తి పలకనున్నారు. దీనికి బదులు ఆన్లైన్ వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 54 రకాల పౌర సేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన రవాణాశాఖ.. ప్రస్తుతం రిజర్వేషన్ నంబర్లపై దృష్టి సారించింది. ఈ పద్ధతి అమల్లోకి వస్తే వాహనదారులు ఇంటి నుంచే నేరుగా పోటీలో పాల్గొని తమకు నచ్చిన నంబర్‌ను దళారుల జోక్యం లేకుండా సొంతంచేసుకోవచ్చు. మరోవైపు నంబర్ల కేటాయింపుల్లోనూ పూర్తి పారదర్శకతసాధ్యమవుతుందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో వాహనాల రిజర్వేషన్ నంబర్లలోనూ దళారుల దందా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులే స్వయంగా ఈ దందాను ప్రోత్సహిస్తున్నారన్న తీవ్రమైన ఆరోపణలు సైతం ఉన్నాయి. దీంతో నిజమైన నంబర్ కోసం ఎంత మొత్తమైనావెచ్చించేందుకు సిద్ధంగా ఉన్న వినియోగదారులు తమకు కావాల్సిన నంబర్లను పొందలేకపోవడంతో పాటు రవాణాశాఖ ఆదాయానికి గండి పడుతోంది. డిమాండ్ బాగా ఉన్న నంబర్లను కూడా తరచుగా ఎలాంటి వేలం లేకుండా నిర్ణీత ఫీజుల్లోనే కేటాయించడం వల్ల ఆ నంబర్లపై వచ్చే ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోంది. ‘ఆన్లైన్ బిడ్డింగ్’ విధానం అమల్లోకి వస్తే ఇలాంటి అక్రమాలకు కళ్లెం పడుతుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, విధి విధానాలపై దృష్టి సారించినట్లు రవాణాశాఖ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుందని, ఎలాంటి జాప్యానికి తావు లేకుండా నిర్ణీత వ్యవధిలోపు ఆన్లైన్ బిడ్డింగ్‌ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్ వేలం ఎలా అంటే.. ప్రస్తుతం లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్, బదిలీలు, చిరునామా మార్పు, తదితర పౌరసేవల కోసం వాహనదారులు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లోనే ఫీజు చెల్లిస్తున్నారు. అనంతరం ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లి తమకు అవసరమైన సేవలను పొందుతున్నారు. కానీ రిజర్వేషన్ నంబర్ల ఆన్లైన్ టెండర్లో వినియోగదారులు నేరుగా కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. మధ్యాహ్నం 1 గంట లోపు తమ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న నంబర్లలో నచ్చిన నంబర్ పైన క్లిక్ చేసి స్లాట్ నమోదు చేసుకోవచ్చు. ఆ సమయంలోనే వాహనం తాత్కాలిక రిజిస్ట్రేషన్ వివరాలను అప్లోడ్ చేసి, నిర్ణీత ఫీజు చెల్లించాలి. ఒక నంబర్‌పై ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్లైన్ వేలం నిర్వహిస్తారు. ఎక్కువ మొత్తంలో నగదు చెల్లించిన వారికి ఆ నంబర్ కేటాయిస్తారు. ఇందులో ఎక్కడా ఎలాంటి లోపాలకు, దళారులు, అధికారుల ప్రమేయానికి అవకాశం లేకుండా పూర్తిగా ఆన్లైన్ బిడ్డింగ్ జరుగుతుంది. ప్రత్యేక నంబర్లకు డిమాండ్ రవాణావాఖ నుంచి ‘‘9, 1, 999, 9999, 786, 6,666, 1111, 1234’’ వంటి నంబర్లకు వాహనదారుల్లో ఎంతో క్రేజ్ ఉంది. ఆల్ నైన్స్(9999) కోసం రూ.10 లక్షలకు పైగా వేలంలో పోటీపడడం సాధారణంగా మారింది. అంతే కాకుండా ఫ్యాన్సీ నంబర్లు, అదృష్ట సంఖ్యలు, రైజింగ్ నంబర్లుగా భావించే కొన్ని రకాల వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం అనూహ్యమైన పోటీ ఉంటుంది. బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్, ల్యాండ్ క్రూజర్, ఆడీ వంటి లగ్జరీ వాహనాలే గాక, బైక్‌లకు ఫ్యాన్సీ నంబర్లకు కూడా వాహనదారులు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 70 వేల నుంచి 80 వేల నంబర్లకు ప్రస్తుతం వేలం నిర్వహిస్తున్నారు. ఈ నంబర్ల పైన రవాణాశాఖకు ఏటా రూ.50 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఇందులో సగానికి పైగా గ్రేటర్ హైదరాబాద్ నుంచే వస్తుందంటే.. నగరంలో ఫ్యాన్సీ, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్లపై ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. వాహనదారులు ఎంతో ముచ్చటపడే ‘9’తో మొదలయ్యే నంబర్లను కేటాయించే ఖైరతాబాద్ కార్యాలయానికే ఏటా రూ.15 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుండడం విశేషం. -
గజం రూ.73,900
సాక్షి, సిటీబ్యూరో: హెచ్ఎండీఏ పంట పండింది. ఉప్పల్ భగాయత్ ప్లాట్లకు అనూహ్య ధర లభించింది. ఆన్లైన్ వేలంలో గజానికి అత్యధికంగా రూ.73,900... అత్యల్పంగా రూ.57,000 పలికింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన ఈ ప్లాట్ల ఆన్లైన్ వేలం ఆదివారం నిర్వహించారు. మొత్తం రెండు సెషన్లలో 18 చొప్పున ఉదయం, మధ్యాహ్నం 36 ప్లాట్లను వేలం వేశారు. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ గజానికి రూ.28వేలు ధర నిర్ణయించగా... అనూహ్యంగా రూ.73,900 అత్యధిక ధర దక్కింది. ఈ లెక్కన నిర్ధారిత ధరతో పోల్చితే ఇది రెండు రెట్లు ఎక్కువ. దీంతో హెచ్ఎండీఏ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఉదయం వేలం వేసిన 18 ప్లాట్లకు రూ.64.54 కోట్లు, మధ్యాహ్నం నిర్వహించిన మరో 18 ప్లాట్లకు రూ.138 కోట్లు వచ్చాయి. మొత్తంగా హెచ్ఎండీఏకు రూ.202 కోట్ల ఆదాయం వచ్చింది. తొలి సెషన్ @ రూ.64 కోట్లు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 492.77 నుంచి 853.34 గజాల లోపున్న 18 ప్లాట్లకు ఆన్లైన్ వేలం నిర్వహించాల్సి ఉండగా... బిడ్డర్ల పోటాపోటీగా ధరలు కోట్ చేయడంతో సాయంత్రం 4గంటల వరకు వేలం కొనసాగింది. గజానికి రూ.28వేల నిర్ధారిత ధరతో మొదలైన ఈ–వేలంలో నార్త్‌వెస్ట్ ప్లాట్‌ను అత్యధికంగా గజానికి రూ.73,900... అత్యల్పంగా రూ.60,900 ధరకు బిడ్డర్లు దక్కించుకున్నారు. 18 ప్లాట్లలో తొమ్మిదింటికి గజానికి రూ.60,900 నుంచి రూ.68,400 వరకు ధర కోట్ చేశారు. మిగిలిన తొమ్మిది ప్లాట్లకు గజానికి రూ.70,100 నుంచి రూ.73,900 వరకు ధర పలికిందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. వాస్తవానికి తొలి సెషన్ వేలం మధ్యాహ్నం 12గంటలకే ముగియాల్సి ఉండగా.. ప్రతి 8నిమిషాలకు రేటు పెంచుతూ బిడ్డర్లు పోటీపడడంతో సాయంత్రం 4గంటల వరకు నిర్వహించాల్సి వచ్చింది. ఉదయం వేలం వేసిన 18 ప్లాట్లకు మొత్తం రూ.64,54,61,586 ఆదాయం వచ్చింది. రెండో సెషన్ @ రూ.138 కోట్లు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ ఈ–వేలం జరగాల్సింది. అయితే తొలి సెషన్ ఆలస్యం కావడంతో రెండో సెషన్ సాయంత్రం మొదలై రాత్రి 8:15 గంటల వరకు కొనసాగింది. 900 గజాల నుంచి 1200 గజాలున్న 18 ప్లాట్లను వేలం వేశారు. ఈ సెషన్లో అత్యధికంగా గజానికి రూ.67,500... అత్యల్పంగా రూ.57,000 ధర పలికింది. మొత్తంగా ఈ 18 ప్లాట్లకు రూ.138 కోట్ల ఆదాయం వచ్చింది. గజానికి రూ.60వేల నుంచి రూ.62వేల మధ్యనే ఎక్కువ ప్లాట్లు విక్రయమయ్యాయని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. సమస్యల్లేకుండా... గతేడాది సెప్టెంబర్ ఆఖరులో ఈ–వేలానికి గుజరాత్‌కు చెందిన ఈ–ప్రొక్యూర్మెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఆర్థిక లావాదేవీల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ సహకారం తీసుకున్నారు. అయితే ఈ–వేలంలో 120కి మించి బిడ్డర్లు పాల్గొనకపోవడం, ఈ–వేలం సమయంలో సాంకేతిక సమస్యలు రావడంతో.. అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి వేలం రద్దు చేసిన విషయం విదితమే. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా, వేలం సాఫీగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్‌టీసీకి ఆన్లైన్ వేలం బాధ్యతలు అప్పగించారు. తొలిరోజు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా ఈ–వేలం జరిగింది. రెండోరోజు కూడా ఇదే తరహాలో వేలం సాగుతుందని హెచ్ఎండీఏ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. నేడూ ఈ–వేలం ఆదివారం విక్రయించిన 36 ప్లాట్లు పోనూ మిగిలిన 31 ప్లాట్లకు సోమవారం ఈ–వేలం నిర్వహించనున్నారు. 1200 గజాల నుంచి 2,600 గజాలున్న 17 ప్లాట్లకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు... 2,600 నుంచి 8,400 గజాలున్న 14 ప్లాట్లకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. తొలిరోజు లెక్కలను బట్టి చూసుకుంటే రెండోరోజు రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. -
ఈ–వేలం పై వివాదం
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులను పక్కవాడి జేబులో నింపేందుకు హెచ్ఎండీఏ తాపత్రయపడుతోంది. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ ప్లాట్లను ఏప్రిల్ 7, 8 తేదీల్లో ఈ–వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయించిన అధికారులు... ఆ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించడంపై వివాదం నెలకొంది. ఏడాదిన్నర క్రితమే ఈ కంపెనీకి ఈ–టెండర్, ఈ–వేలం అప్పగించే గడువు ముగిసినప్పటికీ హెచ్ఎండీఏ అధికారులు తిరిగి అదే కంపెనీకి బాధ్యతలు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వానికి చెందిన ఈ–ఆక్షన్ వెబ్సైట్ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆన్లైన్ వేలం నిర్వహిస్తే బిడ్డర్లు రిజిస్ట్రేషన్, సర్వీస్ చార్జీల కోసం చెల్లించే రూ.1,000 ప్రభుత్వ ఖజానాలో చేరేవని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులకు చిరాకు తెప్పించేలా హెచ్ఎండీఏ వ్యవహారం ఉందని సచివాలయంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ముగిసిన ఒప్పందం... ఆన్లైన్లో టెండర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు ఎంఎస్టీసీ సేవలందించాలని మూడేళ్ల క్రితం జీఓ జారీఅయింది. ఒకవేళ మూడేళ్ల కంటే ముందే ప్రభుత్వ టెండర్ల వెబ్సైట్ అందుబాటులోకి వస్తే ఎంఎస్టీసీ ఒప్పందం రద్దవుతుందని జీవో నంబర్.16లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. 2017 అక్టోబర్ 3 నుంచి ప్రభుత్వ టెండర్ల నిర్వహణ వెబ్సైట్ అందుబాటులోకి రాగా... అప్పటి నుంచి అన్ని ప్రభుత్వ టెండర్లు కూడా ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ నుంచే నిర్వహిస్తున్నారు. అధికారికంగా ఎంఎస్టీసీ ఎలాంటి ఈ–టెండర్ల నిర్వహణ చేపట్టరాదని జీవో నంబర్ 14, 11లలో ఐటీ శాఖ స్పష్టంగా పేర్కొంది. ఐటీ శాఖ ఆరా... రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు టెండర్లను ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా నిర్వహిస్తుంటే... హెచ్ఎండీఏ గడువు ముగిసిన ఎంఎస్‌టీసీకి బాధ్యతలు అప్పగించడం వెనకున్న రహస్యం ఏమిటని ఐటీ శాఖ ఆరా తీస్తోంది. ఎంఎస్టీసీ ద్వారా టెండర్లకు వెళ్లడంతో కంపెనీలకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.10 వేలు అవుతోంది. అయితే హెచ్ఎండీఏ ప్లాట్లకున్న క్రేజీ దృష్ట్యా ఆ సంస్థ రిజిస్ట్రేషన్ ఫీజును రూ.1,000గా నిర్ధారించారు. ఆ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సి ఉండగా... ఇతర సంస్థలకు మళ్లించడంపై ప్రభుత్వం పెద్దలు గుర్రుగా ఉన్నారు. అదే ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా అయితే వేలానికి కంపెనీలు వెళ్లినా, వ్యక్తులు వెళ్లిన కేవలం రూ.1000 మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటున్నారు. దీన్ని వదిలి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకి ఆన్లైన్ వేలం నిర్వహణ అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని ఐటీ శాఖ పేర్కొంటోంది. అసలు దీని వెనుక ఏం జరిగిందనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు కూపీ లాగనున్నట్లు తెలిసింది. హెచ్ఎండీఏ అధికారులు ఎవరైనా చేతివాటం ప్రదర్శించారా? అనే దిశగా విచారణ నిర్వహించనున్నట్లు తెలిసింది. సమర్థులనే అప్పగించాం.. ఏడాది క్రితం హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లు, గిఫ్ట్ డీడ్ ప్లాట్ల ఆన్లైన్ వేలాన్ని ఎంఎస్‌టీసీకి అప్పగించాం. వారు సమర్థంగా నిర్వహించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ–వేలం పూర్తయింది. అయితే గతేడాది నవంబర్‌లో ఉప్పల్ భగాయత్ ప్లాట్ల ఆన్లైన్ వేలాన్ని ఐసీఐసీఐ ఈ–ఆక్షన్ టైగర్.నెట్‌కు అప్పగించగా సాంకేతిక కారణాలతో రద్దయింది. అందుకే ఈసారి కూడా ఎంఎస్‌టీసీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. – రాంకిషన్, హెచ్ఎండీఏ కార్యదర్శి -
12న ఎస్బీఐ మెగా ఈ-వేలం
ముంబై: మొండిబకాయిలుగా మారిన నివాస, వాణిజ్య ఆస్తులను జూన్ 12న ఆన్లైన్లో వేలం వేయనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 14 తర్వాత ఎస్బీఐ ఇలా ఈ-వేలం నిర్వహించడం ఇది రెండోసారి. అప్పట్లో బ్యాంకు రూ. 1,200 కోట్లు విలువ చేసే 300 నివాస, వాణిజ్య ఆస్తులను వేలానికి ఉంచింది. అయితే, కేవలం సుమారు రూ. 100 కోట్లు విలువ చేసే 130 ప్రాపర్టీలను మాత్రమే విక్రయించగలిగింది. వీటిలో ఎక్కువగా నివాస ఆస్తులే ఉన్నాయి. తాజాగా జూన్ 12 నిర్వహించబోయే ఈ-వేలంలో సుమారు 40 నగరాల్లో మొండిబకాయిలుగా మారిన ఆఫీసులు, షాప్‌లు, అపార్ట్మెంట్లు, ఫ్యాక్టరీ బిల్డింగులు మొదలైన వాటిని ఎస్బీఐ విక్రయించనుంది. మార్చి క్వార్టర్లో ఎస్బీఐ స్థూల నిరర్థక ఆస్తులు 4.95 శాతం నుంచి 4.25 శాతం స్థాయికి మెరుగుపడ్డాయి. అలాగే నికర ఎన్పీఏలు కూడా 2.57 శాతం నుంచి 2.12 శాతం స్థాయికి తగ్గాయి. -
ఏదో ఒక రోజు జనం తిరగబడటం ఖాయం : దాసరి
‘‘ప్రతి థియేటర్లో ఒకే సినిమా ఆడాలా? ఒకే సినిమాను ఎన్ని థియేటర్లలో చూస్తామని జనాలు అడగరా? ఈ దుశ్చర్యపై ఏదో ఒకరోజు జనం తిరగబడటం ఖాయం’’ అని ఆవేశంగా అన్నారు ప్రముఖ దర్శక - నిర్మాత దాసరి నారాయణరావు. మంచు విష్ణు కథానాయకుడిగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుక్షణం’ చిత్రానికి సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డా.మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని ఆన్లైన్ వేలం పాట ద్వారా బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 13న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రదర్శన హక్కుల్ని ఆన్లైన్ వేలం ద్వారా కొనుగోలు చేసిన 80 మంది పంపిణీదారుల సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దాసరి మాట్లాడుతూ, ‘‘విష్ణు ఈ ఆలోచన చెప్పినప్పుడు భయపడ్డాను. కానీ... వర్మ ఆలోచనలపై నాకు గురి ఎక్కువ. అందుకే నమ్మాను. స్పందన చూశాక మరింత నమ్మకం కుదిరింది. ఓ కొత్త ఆలోచన అప్పటికి ఫెయిల్ అవ్వొచ్చు కానీ, ప్రతిసారీ ఫెయిల్ కాదు. తొమ్మిదేళ్ల క్రితం డిజిటల్ విధానం లేని రోజుల్లో... శాటిలైట్ ద్వారా 52 సినిమాలను వారానికి ఒకటి చొప్పున విడుదల చేసే పద్ధతిలో ఒక కాన్సెప్ట్ ఆలోచించాను. నా ఆలోచన విని ప్రతి ఒక్కరూ నవ్వారు. ‘వీడియో సినిమానా?’ అని గేలి చేశారు. ఈ రోజు దేశం మొత్తానికీ ఆ విధానమే గతి అయ్యింది. ఏ ఆలోచన అయినా... విజయం సాధించడానికి టైమ్ పడుతుంది. రానున్న మా ‘ఎర్రబస్సు’ సినిమాను కూడా ఇదే పద్ధతిలో విడుదల చేయాలని ఉంది. పెద్ద పెద్ద కోటల్లో ఉన్నవారు కూడా ముందు ముందు ఇదే విధానాన్ని కబ్జా చేస్తారు. వర్మ శక్తిమంతమైన దర్శకుడు. వంద కోట్లతో సినిమా తీయడం గొప్ప కాదు. అయిదు లక్షల్లో సినిమా తీసి, నిర్మాతకు ఎంత మిగిల్చావు అనేది గొప్ప’’ అన్నారు. వర్మ మాట్లాడుతూ, ‘‘ఓ సైకో కిల్లర్ సిటీకొస్తే ఏమవుతుంది అన్నదే కథ. సిటీలో నిజంగా ఇలా జరుగుతుందా? అనే ఫీల్ కలిగిస్తుందీ సినిమా’’ అని చెప్పారు. రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టే సినిమా ఇదనీ, అందరూ ఇదే ఒరవడిలో ముందుకెళ్లాలనీ మోహన్‌బాబు సూచించారు. విష్ణు మాట్లాడుతూ -‘‘దాసరిగారినీ, నాన్నను ఎలా ఒప్పించాలో తెలీక భయపడ్డాను. కానీ కాన్సెప్ట్ విని ధైర్యంగా ముందుకెళ్లమని భుజం తట్టారు. ఇది అందరూ అనుకుంటున్నట్లు మూడు రోజుల్లో, ఏడు లక్షల్లో చేసిన సినిమా కాదు. ఎక్కువే ఖర్చుపెట్టా’’ అని తెలిపారు. నటులు శ్రావణ్, సుప్రీత్, ‘శాంతా బయోటిక్స్’ అధినేత వరప్రసాద్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. -
ఫ్యాన్సీ నంబర్ల కోసం ఆన్లైన్ ఆక్షన్
న్యూఢిల్లీ: ఫ్యాన్సీ నంబర్లంటే మోజున్నవారు వాటి కోసం ఇకపై ఆన్లైన్లో నిర్వహించే ఆక్షన్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు కోసం ఢిల్లీ ప్రభుత్వం సరికొత్త విధానంతో ముందుకొచ్చింది. ఢిల్లీ మోటారు వాహానాల చట్టం, 1993లో కొన్ని సవరణలు చేసి, ఫ్యాన్సీ నంబర్ల కోసం ఆన్లైన్ ఆక్షన్ నిర్వహించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. 0001 నంబర్‌ను అత్యంత డిమాండ్ ఉన్న నంబర్‌గా భావించి దీని ఖరీదును రూ. 5 లక్షలుగా ఖరారు చేసింది. ఆ తర్వాత అధికంగా డిమాండ్ ఉండే నంబర్లుగా భావించే 0002 నుంచి 0009 వరకు రూ. 3 లక్షల నుంచి ఆక్షన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత డిమాండ్ ఉండే నంబర్లుగా భావిస్తున్న 0010, 0099, 0786, 1000, 1111, 7777, 9999 నంబర్ల కోసం రూ. 2 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. నాలుగో విభాగంలో డిమాండ్ ఉన్న నంబర్లుగా భావించే 0100, 0111, 0200, 0222, 0300, 0333, 0400, 0444, 0500, 0555 0600, 0666, 0700, 0777, 0800, 0888, 0900, 0999, 2000, 2222 3000, 3333, 4000, 4444, 5000, 5555, 6000, 6666, 7000, 8000 8888, 9000, 0101, 0108, 1008, 1313 వాటి కోసం లక్ష రూపాయల నుంచి ఆక్షన్ నిర్వహించనున్నారు. రవాణా విభాగం అధికారులు తెలిపినదాని ప్రకారం మరో 15 రోజుల్లో ఈ ఆక్షన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ప్రస్తుతం సాంకేతికపరమైన ప్రయోగాలు చేస్తున్నారని, అవి పూర్తయితే అధికారికంగా ఆక్షన్ నిర్వహిస్తారని చెప్పారు. ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపులో చోటుచేసుకుంటున్న అవినీతికి చెక్ పెట్టేందుకే ఈ విధానాన్ని అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశముందని చెప్పారు. మొత్తం 140 ఫ్యాన్సీ నంబర్లకుగాను ఆక్షన్ నిర్వహిస్తామని, వారంపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఆక్షన్‌లో పాల్గొన్న అభ్యర్థి నుంచి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో సొమ్మును తీసుకుంటామన్నారు. డీడీ చెల్లించిన వ్యక్తులు మాత్రమే ఆక్షన్‌లో పాల్గొనేందుకు అర్హులని, ఆక్షన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాట పాడిన సొమ్మును చెల్లించగానే వారికి నంబర్ కేటాయిస్తామన్నారు.