సాక్షి, సిటీబ్యూరో: హెచ్‌ఎండీఏ పంట పండింది. ఉప్పల్ భగాయత్ ప్లాట్‌లకు అనూహ్య ధర లభించింది. ఆన్‌లైన్ వేలంలో గజానికి అత్యధికంగా రూ.73,900... అత్యల్పంగా రూ.57,000 పలికింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ల ఆన్‌లైన్ వేలం ఆదివారం నిర్వహించారు. మొత్తం రెండు సెషన్లలో 18 చొప్పున ఉదయం, మధ్యాహ్నం 36 ప్లాట్లను వేలం వేశారు. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ గజానికి రూ.28వేలు ధర నిర్ణయించగా... అనూహ్యంగా రూ.73,900 అత్యధిక ధర దక్కింది. ఈ లెక్కన నిర్ధారిత ధరతో పోల్చితే ఇది రెండు రెట్లు ఎక్కువ. దీంతో హెచ్‌ఎండీఏ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఉదయం వేలం వేసిన 18 ప్లాట్లకు రూ.64.54 కోట్లు, మధ్యాహ్నం నిర్వహించిన మరో 18 ప్లాట్లకు రూ.138 కోట్లు వచ్చాయి. మొత్తంగా హెచ్‌ఎండీఏకు రూ.202 కోట్ల ఆదాయం వచ్చింది.
తొలి సెషన్ @ రూ.64 కోట్లు
ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 492.77 నుంచి 853.34 గజాల లోపున్న 18 ప్లాట్లకు ఆన్‌లైన్ వేలం నిర్వహించాల్సి ఉండగా... బిడ్డర్ల పోటాపోటీగా ధరలు కోట్ చేయడంతో సాయంత్రం 4గంటల వరకు వేలం కొనసాగింది. గజానికి రూ.28వేల నిర్ధారిత ధరతో మొదలైన ఈ–వేలంలో నార్త్‌వెస్ట్ ప్లాట్‌ను అత్యధికంగా గజానికి రూ.73,900... అత్యల్పంగా రూ.60,900 ధరకు బిడ్డర్లు దక్కించుకున్నారు. 18 ప్లాట్‌లలో తొమ్మిదింటికి గజానికి రూ.60,900 నుంచి రూ.68,400 వరకు ధర కోట్ చేశారు. మిగిలిన తొమ్మిది ప్లాట్‌లకు గజానికి రూ.70,100 నుంచి రూ.73,900 వరకు ధర పలికిందని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. వాస్తవానికి తొలి సెషన్ వేలం మధ్యాహ్నం 12గంటలకే ముగియాల్సి ఉండగా.. ప్రతి 8నిమిషాలకు రేటు పెంచుతూ బిడ్డర్లు పోటీపడడంతో సాయంత్రం 4గంటల వరకు నిర్వహించాల్సి వచ్చింది. ఉదయం వేలం వేసిన 18 ప్లాట్‌లకు మొత్తం రూ.64,54,61,586 ఆదాయం వచ్చింది.
రెండో సెషన్ @ రూ.138 కోట్లు
మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ ఈ–వేలం జరగాల్సింది. అయితే తొలి సెషన్ ఆలస్యం కావడంతో రెండో సెషన్ సాయంత్రం మొదలై రాత్రి 8:15 గంటల వరకు కొనసాగింది. 900 గజాల నుంచి 1200 గజాలున్న 18 ప్లాట్‌లను వేలం వేశారు. ఈ సెషన్‌లో అత్యధికంగా గజానికి రూ.67,500... అత్యల్పంగా రూ.57,000 ధర పలికింది. మొత్తంగా ఈ 18 ప్లాట్‌లకు రూ.138 కోట్ల ఆదాయం వచ్చింది. గజానికి రూ.60వేల నుంచి రూ.62వేల మధ్యనే ఎక్కువ ప్లాట్‌లు విక్రయమయ్యాయని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.
సమస్యల్లేకుండా...
గతేడాది సెప్టెంబర్ ఆఖరులో ఈ–వేలానికి గుజరాత్‌కు చెందిన ఈ–ప్రొక్యూర్‌మెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఆర్థిక లావాదేవీల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ సహకారం తీసుకున్నారు. అయితే ఈ–వేలంలో 120కి మించి బిడ్డర్లు పాల్గొనకపోవడం, ఈ–వేలం సమయంలో సాంకేతిక సమస్యలు రావడంతో.. అప్పటి హెచ్‌ఎండీఏ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి వేలం రద్దు చేసిన విషయం విదితమే. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా, వేలం సాఫీగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్‌టీసీకి ఆన్‌లైన్ వేలం బాధ్యతలు అప్పగించారు. తొలిరోజు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా ఈ–వేలం జరిగింది. రెండోరోజు కూడా ఇదే తరహాలో వేలం సాగుతుందని హెచ్‌ఎండీఏ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
నేడూ ఈ–వేలం
ఆదివారం విక్రయించిన 36 ప్లాట్లు పోనూ మిగిలిన 31 ప్లాట్‌లకు సోమవారం ఈ–వేలం నిర్వహించనున్నారు. 1200 గజాల నుంచి 2,600 గజాలున్న 17 ప్లాట్‌లకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు... 2,600 నుంచి 8,400 గజాలున్న 14 ప్లాట్‌లకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుందని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. తొలిరోజు లెక్కలను బట్టి చూసుకుంటే రెండోరోజు రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment