సాక్షి,సిటీబ్యూరో: రవాణాశాఖ రిజర్వేషన్ నంబర్లకు ఇంత వరకు వాహనదారుల సమక్షంలో నిర్వహిస్తున్న వేలానికి త్వరలో స్వస్తి పలకనున్నారు. దీనికి బదులు ఆన్‌లైన్ వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 54 రకాల పౌర సేవలను ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన రవాణాశాఖ.. ప్రస్తుతం రిజర్వేషన్ నంబర్లపై దృష్టి సారించింది. ఈ పద్ధతి అమల్లోకి వస్తే వాహనదారులు ఇంటి నుంచే నేరుగా పోటీలో పాల్గొని తమకు నచ్చిన నంబర్‌ను దళారుల జోక్యం లేకుండా సొంతంచేసుకోవచ్చు. మరోవైపు నంబర్ల కేటాయింపుల్లోనూ పూర్తి పారదర్శకతసాధ్యమవుతుందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో వాహనాల రిజర్వేషన్ నంబర్లలోనూ దళారుల దందా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులే స్వయంగా ఈ దందాను ప్రోత్సహిస్తున్నారన్న తీవ్రమైన ఆరోపణలు సైతం ఉన్నాయి.
దీంతో నిజమైన నంబర్ కోసం ఎంత మొత్తమైనావెచ్చించేందుకు సిద్ధంగా ఉన్న వినియోగదారులు తమకు కావాల్సిన నంబర్లను పొందలేకపోవడంతో పాటు రవాణాశాఖ ఆదాయానికి గండి పడుతోంది. డిమాండ్ బాగా ఉన్న నంబర్లను కూడా తరచుగా ఎలాంటి వేలం లేకుండా నిర్ణీత ఫీజుల్లోనే కేటాయించడం వల్ల ఆ నంబర్లపై వచ్చే ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోంది. ‘ఆన్‌లైన్ బిడ్డింగ్’ విధానం అమల్లోకి వస్తే ఇలాంటి అక్రమాలకు కళ్లెం పడుతుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, విధి విధానాలపై దృష్టి సారించినట్లు రవాణాశాఖ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుందని, ఎలాంటి జాప్యానికి తావు లేకుండా నిర్ణీత వ్యవధిలోపు ఆన్‌లైన్ బిడ్డింగ్‌ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఆన్‌లైన్ వేలం ఎలా అంటే..
ప్రస్తుతం లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్, బదిలీలు, చిరునామా మార్పు, తదితర పౌరసేవల కోసం వాహనదారులు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకొని ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లిస్తున్నారు. అనంతరం ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లి తమకు అవసరమైన సేవలను పొందుతున్నారు. కానీ రిజర్వేషన్ నంబర్ల ఆన్‌లైన్ టెండర్‌లో వినియోగదారులు నేరుగా కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. మధ్యాహ్నం 1 గంట లోపు తమ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న నంబర్లలో నచ్చిన నంబర్ పైన క్లిక్ చేసి స్లాట్ నమోదు చేసుకోవచ్చు. ఆ సమయంలోనే వాహనం తాత్కాలిక రిజిస్ట్రేషన్ వివరాలను అప్‌లోడ్ చేసి, నిర్ణీత ఫీజు చెల్లించాలి. ఒక నంబర్‌పై ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తారు. ఎక్కువ మొత్తంలో నగదు చెల్లించిన వారికి ఆ నంబర్ కేటాయిస్తారు. ఇందులో ఎక్కడా ఎలాంటి లోపాలకు, దళారులు, అధికారుల ప్రమేయానికి అవకాశం లేకుండా పూర్తిగా ఆన్‌లైన్ బిడ్డింగ్ జరుగుతుంది.
ప్రత్యేక నంబర్లకు డిమాండ్
రవాణావాఖ నుంచి ‘‘9, 1, 999, 9999, 786, 6,666, 1111, 1234’’ వంటి నంబర్లకు వాహనదారుల్లో ఎంతో క్రేజ్ ఉంది. ఆల్ నైన్స్(9999) కోసం రూ.10 లక్షలకు పైగా వేలంలో పోటీపడడం సాధారణంగా మారింది. అంతే కాకుండా ఫ్యాన్సీ నంబర్లు, అదృష్ట సంఖ్యలు, రైజింగ్ నంబర్లుగా భావించే కొన్ని రకాల వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం అనూహ్యమైన పోటీ ఉంటుంది. బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్, ల్యాండ్ క్రూజర్, ఆడీ వంటి లగ్జరీ వాహనాలే గాక, బైక్‌లకు ఫ్యాన్సీ నంబర్లకు కూడా వాహనదారులు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 70 వేల నుంచి 80 వేల నంబర్లకు ప్రస్తుతం వేలం నిర్వహిస్తున్నారు. ఈ నంబర్ల పైన రవాణాశాఖకు ఏటా రూ.50 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఇందులో సగానికి పైగా గ్రేటర్ హైదరాబాద్ నుంచే వస్తుందంటే.. నగరంలో ఫ్యాన్సీ, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్లపై ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. వాహనదారులు ఎంతో ముచ్చటపడే ‘9’తో మొదలయ్యే నంబర్లను కేటాయించే ఖైరతాబాద్ కార్యాలయానికే ఏటా రూ.15 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment