vehicle numbers
-
ఆర్టీఏ ఆన్లైన్ బిడ్డింగ్‌లో గందరగోళం
► ఇటీవల నగరంలోని ఓ ఆర్టీఏ కేంద్రం పరిధిలో కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ఓ వాహనదారు తనకు నచ్చిన నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం వేలం నిర్వహించే సమయానికి మొబైల్ ఫోన్‌కు ఎలాంటి సమాచారం అందకపోవడంతో పోటీలో పాల్గొనలేకపోయారు. దీంతో నచ్చిన నంబర్‌ను కోల్పోయారు. ► బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన మరో వాహనదారుకు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రధానంగా ‘9999’, ‘9’, ‘1111’, ‘6666’, ‘1234’ వంటి నంబర్లకు ఎంతో డిమాండ్ ఉంటుంది. గతంలో ఆల్‌నైన్స్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో ఏకంగా రూ.10 లక్షల వరకు వేలంలో పోటీపడి సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ పార్టీలకు చెందిన నేతలు నచ్చిన నంబర్లను సొంతం చేసుకొనేందుకు పెద్ద మొత్తంలోనే చెల్లించేందుకు సిద్ధపడతారు. కానీ ఆన్లైన్ బిడ్డింగ్‌లో పోటీ తగ్గుముఖం పట్టినట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ ప్రత్యేక నంబర్లపై నిర్వహించే ఆన్లైన్ బిడ్డింగ్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బిడ్డింగ్‌లో ప్రదర్శించే నంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోటీలో పాల్గొనలేకపోతున్నట్లు వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని నంబర్లపై ఎలాంటి పోటీలు కూడా నిర్వహించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాహనదారులు తమకిష్టమైన నంబర్ల కోసం రూ.లక్షలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆన్లైన్లో సరైన సమాచారం లేకపోవడంతో ఇందులో పాల్గొనలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: మెట్రో రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్) అప్పుడలా.. ► మూడేళ్ల క్రితం అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రత్యేక నంబర్లకు ప్రత్యక్షంగా వేలం నిర్వహించేవారు. వాహనదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి మధ్యాహ్నం 3 గంటలకు పోటీ నిర్వహించేవారు. ఈ పోటీలో వాహనదారులంతా స్వయంగా పాల్గొనేందుకు అవకాశం ఉండడంతో ఏ వాహనదారు ఎంత మొత్తానికి బిడ్డింగ్‌లో పాల్గొని నంబర్‌ను సొంతం చేసుకున్నాడనేది స్పష్టంగా తెలిసిపోయేది. (చదవండి: అ‘ధర’హో.. గజం రూ.1.01 లక్షలు) ► మరోవైపు నంబర్ల బిడ్డింగ్ నిర్వహణలో పారదర్శకత కోసం అధికారులు సైతం ఎలాంటి దాపరికానికి తావు లేకుండా బహిరంగంగా వేలం నిర్వహించేవారు. దీంతో ప్రత్యేక నంబర్లపైనే రవాణా శాఖకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం లభించింది. నంబర్ల సీరిస్‌లో ‘9’ అంకెతో మొదలయ్యే ఖైరతాబాద్ ఆర్టీఏలో ప్రతి ప్రత్యేక నంబర్‌కు భారీ డిమాండ్ ఉంటుంది. రూ.30 వేల ఫీజు ఉన్న నంబర్లకు పోటీలో రూ.5 లక్షలు డిమాండ్ ఉండేది. సింగిల్ నైన్, ఆల్‌నైన్స్ కోసం ప్రతి సిరీస్‌లో కనీసం 10 మంది వాహనదారులు పోటీపడేవారు. (చదవండి: ఐఐటీ హైదరాబాద్.. నియామకాల్లో జోరు) ఇప్పుడిలా.. ► ప్రత్యేక నంబర్లపై నిర్వహించే బిడ్డింగ్‌ను మూడేళ్ల క్రితం ఆన్‌లైన్‌లోకి మార్చారు. మొదట హైదరాబాద్ ఆర్టీఏలో అమలు చేసి ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు విస్తరించారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది. ► సాంకేతిక వైఫల్యాల కారణంగా వాహనదారులకు సకాలంలో సరైన సమాచారం లభించడం లేదు. దీంతో ఎక్కువ మంది పోటీలో పాల్గొనలేకపోతున్నారు. దీనిపై కొంతమంది వాహనదారులు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. -
‘వైట్’పై ఎల్లో జర్నీ.. ఏమిటీ వైట్ ప్లేట్..?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కొన్ని ట్యాక్సీ వాహనాలు, క్యాబ్‌లు మోటారు వాహన నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతున్నాయి. పన్నులు ఎగవేసేందుకు ఎల్లో నెంబర్ ప్లేట్ స్థానంలో వైట్ నెంబర్ ప్లేట్ ఉపయోగిస్తున్నాయి. ఆర్టీఏలో వ్యక్తిగత వాహనాలుగా నమోదు చేసుకొని..ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా త్రైమాసిక పన్నులు, రాష్ట్రాల సరిహద్దులు దాటినప్పుడు అంతర్రాష్ట్ర పన్నులు చెల్లించి తిరిగే రవాణా వాహనాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇప్పటికే కోవిడ్ కారణంగా ట్రావెల్స్ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా ఈ తరహా ఉల్లంఘనల వల్ల మరింత నష్టపోవలసి వస్తోందని ట్రావెల్స్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 10 వేల వాహనాలు ఇలా వ్యక్తిగత వాహనాలుగా నమోదు చేసుకొని తిరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని వాహనాలు రవాణా రంగానికి చెందినవిగానే నమోదు చేసుకున్నప్పటికీ అంతర్రాష్ట్ర పన్నుల ఎగవేత కోసం వైట్ నెంబర్ ప్లేట్‌ను వినియోగిస్తున్నాయి. కోవిడ్‌తో సంక్షోభం... గత 16 నెలలుగా రవాణా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పర్యాటక, ఐటీ రంగాలు పూర్తిగా స్తంభించడం, ఇప్పటికీ పునరుద్ధరణకు నోచకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రవాణా కోసం వినియోగించే అన్ని రకాల ట్యాక్సీలు, క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీబస్సులు, తదితర వాహనాల నిర్వాహకులు త్రైమాసిక పన్నుల నుంచి మినహాయింపు కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈఎంఐలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న తాము పన్నులు కట్టలేమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రవాణాశాఖ త్రైమాసిక పన్ను చెల్లింపు నుంచి మినహాయింపునిచి్చనట్లుగానే ఈ ఏడాది కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవైపు ట్రావెల్స్ సంస్థల ఆందోళన ఇలా కొనసాగుతుండగా కొంతమంది మాత్రం మోటారు వాహన నిబంధనలను ఉల్లంఘించి వైట్ నెంబర్ ప్లేట్‌పై తిరగడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీఏ నిర్లక్ష్యం... ఎల్లో నెంబర్ ప్లేట్‌పైన తిరగవలసిన వాహనాలు అందుకు విరుద్దంగా వైట్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకొని ప్రయాణికులను తరలిస్తున్నాయి.హైదరాబాద్ నుంచి ఏపీకి రాకపోకలు సాగించే వేలాది వాహనాలు ఇలా తిరుగుతున్నప్పటికీ ఆర్టీఏ అధికారులు మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం గమనార్హం. ఏమిటీ వైట్ ప్లేట్... వ్యక్తిగత వాహనాల కోసం రవాణాశాఖ వైట్ నెంబర్ ప్లేట్‌ను కేటాయించింది. దీనిపైన నలుపు రంగులో వాహనం నెంబర్ నమోదై ఉంటుంది. ఈ వాహనాలపైన ఒకేసారి జీవితకాల పన్ను రూపంలో చెల్లిస్తారు. ప్రయాణికుల వాహనాలు, సరుకు రవాణా వాహనాలు మాత్రం వాణిజ్య వాహనాలుగా నమోదై ఉంటాయి. వీటికి పసుపు రంగు నెంబర్‌ప్లేట్ (ఎల్లో ప్లేట్)పైన నలుపు రంగంలో నెంబర్లు నమోదై ఉంటాయి. ఈ వాహనాలు ప్రతి 3 నెలలకు ఒకసారి పన్ను చెల్లించాలి. సీట్ల సామర్థ్యాన్ని బట్టి ఈ పన్ను మొత్తం ఉంటుంది. -
క్రేజీ..ఇక ఆన్లైన్
సాక్షి,సిటీబ్యూరో: రవాణాశాఖ రిజర్వేషన్ నంబర్లకు ఇంత వరకు వాహనదారుల సమక్షంలో నిర్వహిస్తున్న వేలానికి త్వరలో స్వస్తి పలకనున్నారు. దీనికి బదులు ఆన్లైన్ వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 54 రకాల పౌర సేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన రవాణాశాఖ.. ప్రస్తుతం రిజర్వేషన్ నంబర్లపై దృష్టి సారించింది. ఈ పద్ధతి అమల్లోకి వస్తే వాహనదారులు ఇంటి నుంచే నేరుగా పోటీలో పాల్గొని తమకు నచ్చిన నంబర్‌ను దళారుల జోక్యం లేకుండా సొంతంచేసుకోవచ్చు. మరోవైపు నంబర్ల కేటాయింపుల్లోనూ పూర్తి పారదర్శకతసాధ్యమవుతుందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో వాహనాల రిజర్వేషన్ నంబర్లలోనూ దళారుల దందా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులే స్వయంగా ఈ దందాను ప్రోత్సహిస్తున్నారన్న తీవ్రమైన ఆరోపణలు సైతం ఉన్నాయి. దీంతో నిజమైన నంబర్ కోసం ఎంత మొత్తమైనావెచ్చించేందుకు సిద్ధంగా ఉన్న వినియోగదారులు తమకు కావాల్సిన నంబర్లను పొందలేకపోవడంతో పాటు రవాణాశాఖ ఆదాయానికి గండి పడుతోంది. డిమాండ్ బాగా ఉన్న నంబర్లను కూడా తరచుగా ఎలాంటి వేలం లేకుండా నిర్ణీత ఫీజుల్లోనే కేటాయించడం వల్ల ఆ నంబర్లపై వచ్చే ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోంది. ‘ఆన్లైన్ బిడ్డింగ్’ విధానం అమల్లోకి వస్తే ఇలాంటి అక్రమాలకు కళ్లెం పడుతుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, విధి విధానాలపై దృష్టి సారించినట్లు రవాణాశాఖ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుందని, ఎలాంటి జాప్యానికి తావు లేకుండా నిర్ణీత వ్యవధిలోపు ఆన్లైన్ బిడ్డింగ్‌ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్ వేలం ఎలా అంటే.. ప్రస్తుతం లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్, బదిలీలు, చిరునామా మార్పు, తదితర పౌరసేవల కోసం వాహనదారులు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లోనే ఫీజు చెల్లిస్తున్నారు. అనంతరం ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లి తమకు అవసరమైన సేవలను పొందుతున్నారు. కానీ రిజర్వేషన్ నంబర్ల ఆన్లైన్ టెండర్లో వినియోగదారులు నేరుగా కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. మధ్యాహ్నం 1 గంట లోపు తమ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న నంబర్లలో నచ్చిన నంబర్ పైన క్లిక్ చేసి స్లాట్ నమోదు చేసుకోవచ్చు. ఆ సమయంలోనే వాహనం తాత్కాలిక రిజిస్ట్రేషన్ వివరాలను అప్లోడ్ చేసి, నిర్ణీత ఫీజు చెల్లించాలి. ఒక నంబర్‌పై ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్లైన్ వేలం నిర్వహిస్తారు. ఎక్కువ మొత్తంలో నగదు చెల్లించిన వారికి ఆ నంబర్ కేటాయిస్తారు. ఇందులో ఎక్కడా ఎలాంటి లోపాలకు, దళారులు, అధికారుల ప్రమేయానికి అవకాశం లేకుండా పూర్తిగా ఆన్లైన్ బిడ్డింగ్ జరుగుతుంది. ప్రత్యేక నంబర్లకు డిమాండ్ రవాణావాఖ నుంచి ‘‘9, 1, 999, 9999, 786, 6,666, 1111, 1234’’ వంటి నంబర్లకు వాహనదారుల్లో ఎంతో క్రేజ్ ఉంది. ఆల్ నైన్స్(9999) కోసం రూ.10 లక్షలకు పైగా వేలంలో పోటీపడడం సాధారణంగా మారింది. అంతే కాకుండా ఫ్యాన్సీ నంబర్లు, అదృష్ట సంఖ్యలు, రైజింగ్ నంబర్లుగా భావించే కొన్ని రకాల వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం అనూహ్యమైన పోటీ ఉంటుంది. బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్, ల్యాండ్ క్రూజర్, ఆడీ వంటి లగ్జరీ వాహనాలే గాక, బైక్‌లకు ఫ్యాన్సీ నంబర్లకు కూడా వాహనదారులు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 70 వేల నుంచి 80 వేల నంబర్లకు ప్రస్తుతం వేలం నిర్వహిస్తున్నారు. ఈ నంబర్ల పైన రవాణాశాఖకు ఏటా రూ.50 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఇందులో సగానికి పైగా గ్రేటర్ హైదరాబాద్ నుంచే వస్తుందంటే.. నగరంలో ఫ్యాన్సీ, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్లపై ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. వాహనదారులు ఎంతో ముచ్చటపడే ‘9’తో మొదలయ్యే నంబర్లను కేటాయించే ఖైరతాబాద్ కార్యాలయానికే ఏటా రూ.15 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుండడం విశేషం. -
కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ
మన రాష్ట్రం.. మన విధానాలు.. మన నిర్ణయాలు.. అనుకుంటూ ఎడాపెడా జీవోలు ఇచ్చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వరుసపెట్టి రెండు ఎదురుదెబ్బలు ఒకేసారి తగిలాయి. ఎప్పటినుంచో వివాదాస్పదంగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ గురించి హైకోర్టు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో 1956 నుంచి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే ఫీజులు ఇచ్చేలా 'ఫాస్ట్' అనే పథకాన్ని రూపొందించిన తెలంగాణ సర్కారుతీరును హైకోర్టు తప్పుబట్టింది. మరోవైపు రాష్ట్రంలో ఉన్న వాహనాలన్నింటి నెంబర్ల సిరీస్‌ను 'ఏపీ' నుంచి 'టీఎస్'కు మార్చాలన్న ఉత్తర్వులపైనా మండిపడింది. వాస్తవానికి నెంబర్ ప్లేట్ల విషయంలో ప్రజల నుంచి మరీ అంత ఎక్కువ స్థాయిలో వ్యతిరేకత రాకపోయినా.. 'ఫాస్ట్' పథకం విషయంపై మాత్రం విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి గట్టిగానే నిరసన వ్యక్తమైంది. తెలంగాణ స్థానికత అంటూ కొంతమంది విద్యార్థులకు ఫీజులు ఇచ్చేది లేదని చెప్పడం సరికాదని చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందినవారే అయినా.. 1956 నుంచి స్థానికత అంటే అందుకు ఆధారాలు తేవడం కష్టమని చెప్పారు. ఇలాంటి వాటివల్ల అందరికీ ఇబ్బంది అవుతుందన్నారు. అయినా టీఆర్ఎస్ సర్కారు మాత్రం.. తాను అనుకున్నట్లే దీనిమీద నిర్ణయం తీసేసుకుంది. దీన్ని కొంతమంది హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగంలోని 19వ అధికరణకు విరుద్ధంగా ఉన్నాయని, ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు విధానాలు రూపొందించుకుంటూ పోతే... మరి ఇతర రాష్ట్రాలు కూడా చెల్లించిన పన్నుల్లో కేంద్రం నుంచి వాటా ఎలా అడుగుతారని ప్రశ్నించింది. మీ విధానం ద్వారా మీరు ఒక వర్గం విద్యార్థులకు రాజ్యాంగపరంగా సమకూరాల్సిన ప్రయోజనాలను కాలరాస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మాట్లాడే విద్యార్థులందరూ కూడా ఆ రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితే ఎదుర్కొంటే మీకు ఎలా ఉంటుందని నిలదీసింది. మరోవైపు వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలోనూ ఇదే తరహాలో ఘాటుగా వ్యాఖ్యానించింది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొన్న వాహనాలను 'టీఎస్' సిరీస్‌లో రిజిస్టర్ చేయడమంటే అందులో అర్థం ఉంది గానీ.. ఉమ్మడి రాష్ట్రంలోని వాహనాలను కూడా తిరిగి రిజిస్టర్ చేసుకోవాలంటే ఎలాగని ధర్మాసనం ప్రశ్నించింది. సర్కారు నిర్ణయాలు ఎంత మాత్రం హేతుబద్ధంగా లేవని, దీనర్థం తెలంగాణ ప్రజలు మాత్రమే రాష్ట్ర ప్రజలని కాదు. రాష్ట్రంలో ఉన్న వారంతా కూడా రాష్ట్ర ప్రజలే అవుతారని తెలిపింది. -
వాహన రిజిస్ట్రేషన్ వివాదానికి తెర