ఆర్టీఏ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో గందరగోళం | RTA Fancy Numbers Online Bidding: No Transparency Complaints | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో గందరగోళం

Published Fri, Dec 3 2021 6:55 PM | Last Updated on Fri, Dec 3 2021 6:55 PM

RTA Fancy Numbers Online Bidding: No Transparency Complaints - Sakshi

ఆర్టీఏ ప్రత్యేక నంబర్లపై నిర్వహించే ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

► ఇటీవల నగరంలోని ఓ ఆర్టీఏ కేంద్రం పరిధిలో కూకట్‌పల్లి  ప్రాంతానికి చెందిన ఓ వాహనదారు తనకు నచ్చిన నంబర్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం వేలం నిర్వహించే సమయానికి మొబైల్‌ ఫోన్‌కు  ఎలాంటి సమాచారం అందకపోవడంతో పోటీలో పాల్గొనలేకపోయారు. దీంతో నచ్చిన నంబర్‌ను 
కోల్పోయారు. 

► బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన మరో వాహనదారుకు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రధానంగా ‘9999’, ‘9’, ‘1111’, ‘6666’, ‘1234’ వంటి నంబర్లకు ఎంతో డిమాండ్‌ ఉంటుంది. గతంలో ఆల్‌నైన్స్‌ కోసం ఖైరతాబాద్‌ ఆర్టీఏ పరిధిలో ఏకంగా రూ.10 లక్షల వరకు వేలంలో పోటీపడి సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, రాజకీయ పార్టీలకు చెందిన నేతలు నచ్చిన నంబర్లను సొంతం చేసుకొనేందుకు పెద్ద మొత్తంలోనే చెల్లించేందుకు సిద్ధపడతారు. కానీ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో పోటీ తగ్గుముఖం పట్టినట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీఏ ప్రత్యేక నంబర్లపై నిర్వహించే ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బిడ్డింగ్‌లో ప్రదర్శించే నంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోటీలో పాల్గొనలేకపోతున్నట్లు వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని నంబర్లపై ఎలాంటి పోటీలు కూడా నిర్వహించడం లేదనే ఆరోపణలు  వ్యక్తమవుతున్నాయి. వాహనదారులు తమకిష్టమైన నంబర్ల కోసం రూ.లక్షలు  వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో సరైన సమాచారం లేకపోవడంతో ఇందులో పాల్గొనలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: మెట్రో రైల్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌)

అప్పుడలా..  
► మూడేళ్ల  క్రితం అన్ని ఆర్టీఏ  కార్యాలయాల్లో ప్రత్యేక నంబర్లకు ప్రత్యక్షంగా వేలం నిర్వహించేవారు. వాహనదారుల నుంచి  దరఖాస్తులను స్వీకరించి మధ్యాహ్నం 3 గంటలకు పోటీ నిర్వహించేవారు. ఈ పోటీలో  వాహనదారులంతా స్వయంగా పాల్గొనేందుకు అవకాశం ఉండడంతో ఏ వాహనదారు ఎంత మొత్తానికి బిడ్డింగ్‌లో పాల్గొని నంబర్‌ను సొంతం చేసుకున్నాడనేది స్పష్టంగా తెలిసిపోయేది. (చదవండి: అ‘ధర’హో.. గజం రూ.1.01 లక్షలు)
 
► మరోవైపు నంబర్ల బిడ్డింగ్‌ నిర్వహణలో పారదర్శకత కోసం అధికారులు సైతం ఎలాంటి దాపరికానికి తావు లేకుండా బహిరంగంగా వేలం నిర్వహించేవారు. దీంతో ప్రత్యేక నంబర్లపైనే రవాణా శాఖకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం లభించింది. నంబర్ల సీరిస్‌లో ‘9’ అంకెతో మొదలయ్యే ఖైరతాబాద్‌ ఆర్టీఏలో ప్రతి  ప్రత్యేక నంబర్‌కు భారీ డిమాండ్‌ ఉంటుంది. రూ.30 వేల ఫీజు ఉన్న నంబర్లకు  పోటీలో రూ.5 లక్షలు డిమాండ్‌ ఉండేది.  సింగిల్‌ నైన్, ఆల్‌నైన్స్‌ కోసం ప్రతి సిరీస్‌లో కనీసం 10 మంది వాహనదారులు పోటీపడేవారు.  (చదవండి: ఐఐటీ హైదరాబాద్‌.. నియామకాల్లో జోరు)

ఇప్పుడిలా..  
► ప్రత్యేక నంబర్లపై నిర్వహించే బిడ్డింగ్‌ను మూడేళ్ల  క్రితం  ఆన్‌లైన్‌లోకి మార్చారు. మొదట  హైదరాబాద్‌ ఆర్టీఏలో అమలు చేసి ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు విస్తరించారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది. 

► సాంకేతిక వైఫల్యాల కారణంగా వాహనదారులకు సకాలంలో సరైన సమాచారం లభించడం లేదు. దీంతో ఎక్కువ మంది పోటీలో పాల్గొనలేకపోతున్నారు. దీనిపై కొంతమంది వాహనదారులు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement