1,2,3,4,5,6,7,8,9 వంటి ప్రతి సింగిల్ అంకెకు ఓ లక్షణం ఉంటుందని వాహనదారుల విశ్వాసం. ఉదాహరణకు ‘1’ నాయకత్వానికి, ‘2’ శాంత స్వభావానికి నిదర్శనం. గురుగ్రహంతో పోల్చే ‘3’ వల్ల చక్కటి తెలివి తేటలు, జ్ఞానం లభిస్తాయని నమ్మకం. ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తారు. ఈ సంఖ్య వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం. ఇక ప్రతి ఒక్కరూ ఇష్టపడే అంకె ‘9’. కుజగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. జీవితంలో విజేతలుగా, తిరుగులేని నాయకులుగా ఎదగాలని కోరుకునేవాళ్లు, పోటీమనస్తత్వం, పోరాడే తత్వం ఉన్నవాళ్లు ఈ నంబర్‌ను ఇష్టపడతారు.
సాక్షి, హైదరాబాద్: ‘టీఎస్ 09 ఎఫ్‌ఆర్ 9999’.. కోవిడ్ కాలంలోనూ తాజాగా ఈ సంఖ్య కోసం చాలామంది పోటీపడ్డారు. చివరకు ఓ వాహనదారు రూ.7.6 లక్షలతో సొంతం చేసుకున్నారు. ఆల్‌నైన్ నంబర్ మరోసారి ఆల్‌టైమ్స్ రికార్డును సొంతం చేసుకుంది. సాధారణంగా అయితే ఈ సంఖ్య కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. గతంలో రూ. 9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు కూడా వేలంలో పోటీపడ్డ సందర్భాలూ ఉన్నాయి. ‘టీఎస్09ఎఫ్‌ఎస్ 0009’ అనే మరో సంఖ్యకు సైతం లాక్‌డౌన్ తర్వాత మొదటిసారి అనూహ్యమైన డిమాండ్ లభించింది. మేఘా ఇంజినీరింగ్ సంస్థ రూ.6.5 లక్షలకుపైగా వేలంలో పోటీ పడి నంబర్‌ను దక్కించుకోవడం గమనార్హం.
తాజాగా నిర్వహించిన వేలంలో రవాణా శాఖకు ప్రత్యేక అంకెలపై ఒక్క రోజే సుమారు రూ.30 లక్షల మేర ఆదాయం లభించింది. కరోనా కారణంగా నగరంలో హై ఎండ్ వాహనాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో సహజంగానే ప్రత్యేక సంఖ్యలకు డిమాండ్ కూడా తగ్గింది. చాలా రోజుల తర్వాత ప్రత్యేక అంకెల కోసం పోటీ పెరిగిందని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు.
పోటీ ఆన్‌లైన్‌లోనే..
వాహనాల నంబర్ల కోసం రెండేళ్ల క్రితం ఆన్‌లైన్ పోటీలను ప్రవేశపెట్టారు. వాహనదారులు నేరుగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే వేలంలో పాల్గొనవచ్చు. నంబర్ దక్కించుకోలేని వాహనదారులు చెల్లించిన డబ్బులు వారం రోజుల్లో తిరిగి వాళ్ల ఖాతాల్లో జమ అవుతాయి. దీంతో ఆన్‌లైన్ పోటీలకు సైతం క్రమంగా డిమాండ్ పెరిగింది. మొదటి సంవత్సరం గ్రేటర్‌లో సుమారు రూ.50 కోట్లకు పైగా ఆదాయం లభించింది. గతేడాది నుంచి కోవిడ్ విజృంభించడంతో ప్రత్యేక నంబర్లకు డిమాండ్ తగ్గింది. ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. తిరిగి వాహనాల కొనుగోళ్లు పెరగడంతో నచి్చన నంబర్ల కోసం వాహనదారులు ఆసక్తిగా ముందుకొస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
అదే క్రేజ్..
► ఆల్‌నైన్ నంబర్‌కే కాదు.నాలుగైదేళ్ల క్రితం పెద్దగా ఆదరణ లేని నంబర్లకు సైతం ఇప్పుడు అనూహ్యమైన డిమాండ్ కనిపిస్తోంది.
►‘టీఎస్ 09 ఎఫ్‌సీ 0001’ నంబర్ కోసం ఒక సంస్థ గతంలో ఏకంగా రూ.6.66 లక్షలు చెల్లించింది. ‘టీఎస్ 09 ఎఫ్‌సీ 0005’ నంబర్ కోసం మరో సంస్థ రూ.5.06 లక్షలు చెల్లించి గెలుచుకుంది.
► సంఖ్యాశాస్త్రం, జ్యోతిషంపై ఉండే విశ్వాసం, కొన్ని నంబర్ల వల్ల అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకం వాహనదారుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ నంబర్లలంటే ఎంతో ఇష్టం..
► 9, 1, 999, 9999, 786, 6, 666, 1111 వంటి అంకెలకు ఎక్కువ డిమాండ్ ఉంది. బీఎండబ్ల్యూ, ల్యాండ్‌రోవర్, ల్యాండ్ క్రూజర్, ఆడి వంటి ఖరీదైన వాహనాలే కాదు, బైక్‌ల కోసం కూడా వాహనదారులు పోటీకి దిగుతున్నారు. అదృష్ట జాతకంగా భావించే నంబరల కోసం కొందరు పోటీకి దిగితే సామాజిక హోదా కోసం, పేరు ప్రతిష్టల కోసం మరికొందరు ఫ్యాన్సీ నంబర్లకు పోటీ పడుతున్నారు. కేవలం ఫ్యాన్సీ కోసం కాకుండా కొన్ని సంఖ్యల వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుందనే నమ్మకం కూడా ఈ క్రేజీకి కారణమే.
నంబర్లే బహుమతులు..
► కొంతమంది తమ కుటుంబ సభ్యులకు వాహనాలను బహుమానంగా అందజేయడమే కాదు. వారి పుట్టిన రోజు కలిసొచ్చేలా రిజిస్ట్రేషన్ నంబర్లను ఎంపిక చేసుకొంటున్నారు.
► ‘1313’ (తేరా తేరా) అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీనిని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు.
► ‘5121’ నంబర్‌ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు.
► ‘143’, ‘214’, ‘8045’ వంటి వాటికీ ఎంతో క్రేజీ ఉంది.
ప్రత్యేక నంబర్లకు అదే డిమాండ్..
కోవిడ్ కారణంగా కొంత స్తబ్ధత వచ్చినా ప్రత్యేక అంకెలకు డిమాండ్ అలాగే ఉంది. ప్రత్యేకించి ‘9’ తో మొదలయ్యే ఖైరతాబాద్ పరిధిలో చాలామంది వాహనదారులు నచ్చిన నంబర్ల కోసం పోటీ పడతారు. ఇటీవల కాలంలో నగర శివార్లలోనూ డిమాండ్ పెరిగింది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఒకే రోజు ప్రత్యేక నంబర్లపై రూ.30 లక్షల వరకు ఆదాయం లభించింది.
– పాండురంగ్ నాయక్, జేటీసీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment