Transport Department
-
అలైన్మెంట్లో టింక‘రింగ్’!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగాన్ని ఓపక్క రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, మరోపక్క ఉత్తర భాగం అలైన్మెంటులో మార్పులు చేయాలనే ఒత్తిడి మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజల వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని కొందరు నేతలు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రజలకు మద్దతు ముసుగులో తమకు అనుకూలమైనవారి కోసం పావులు కదుపుతున్నారు. ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడుపుతున్నారు. ఉత్తర భాగానికి సంబంధించి అన్ని రకాల గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయి, భూ పరిహారానికి అవార్డులు పాస్ చేసే సమయంలో ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అలైన్‌మెంటు ఖరారై, టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నందున మార్పులు సాధ్యం కాదని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతుండగా, కొందరు నేతలు ఈ విషయమై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఒత్తిడి పెంచుతుండటం గమనార్హం. ఎక్కడెక్కడ మార్పులు – సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద ట్రిపుల్ ఆర్ ప్రారంభమవుతుంది. ఇక్కడ జాతీయ రహదారి మీద భారీ ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు నిరాకరిస్తున్నారు. గతంలో పబ్లిక్ హియరింగ్, సర్వే జరగకుండా అడ్డుకున్నారు. ఇదే ప్రాంతంలో దక్షిణ రింగు ప్రారంభం కావాల్సి ఉంటుంది. దాన్ని ఉత్తర రింగులో భాగంగా నిర్మించే ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్‌తో అనుసంధానించాల్సి ఉంది. దక్షిణ రింగును మరింత దూరంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో, కొందరు నేతలు దీన్ని ఆసరా చేసుకుని ఉత్తర రింగు కూడలిని మరోచోట నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. రైతుల వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తమకు అనుకూల ప్రాంతానికి చేరువగా రింగురోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో కొందరు నేతలు మార్పు కోరుతుండగా, ప్రస్తుత అలైన్‌మెంటు తమకు చెందినవారి భూముల్లోంచి ఉండటంతో వాటిని కాపాడే ప్రయత్నంలో భాగంగా కొందరు మార్పు కోరుతున్నారు. – యాదాద్రి జిల్లాలో రింగురోడ్డు విషయంలో స్థానికుల వ్యతిరేకత ఎక్కువగా ఉంది. గతంలో జాతీయ రహదారి కోసం కొందరు, సాగునీటి ప్రాజెక్టు కాలువల కోసం కొందరు.. ఇలా పలు సందర్భాల్లో భూములు కోల్పోయారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కోసం మరోసారి భూసేకరణ జరగటాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ కొందరు వ్యాపారుల భూములు కూడా అలైన్‌మెంటు పరిధిలో ఉన్నాయి. దీంతో వారు బడా నేతలను ఆశ్రయించారు. స్థానికుల అభ్యర్థనలను ఆసరాగా తీసుకుని అలైన్‌మెంటును మార్చాలని నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్ రాయగిరి హైవే వద్ద కాకుండా ఎగువన నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. – ఉత్తర రింగు చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది. చౌటుప్పల్ పట్టణ శివారులోనే ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది. ఇది పట్టణానికి మరీ చేరువగా ఉందని, దీనివల్ల విలువైన భూములును స్థానికులు కోల్పోవాల్సి వస్తుందని, పరిహారంగా వారికి న్యాయమైన మొత్తం దక్కదంటూ కొందరు నేతలు వకాల్తా పుచ్చుకుని గడ్కరీ కార్యాలయంలో ఒత్తిడి పెంచారు. పట్టణానికి దూరంగా ఉండేలా అలైన్‌మెంటు మార్చాలని కోరుతున్నారు. ఇతర ప్రాంతాల రైతుల్లో ఆందోళన అలైన్‌మెంటు మారుస్తున్నారంటూ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రచారం ప్రారంభమైంది. ఉన్నతస్థాయిలో ఒత్తిళ్ల వల్ల రింగురోడ్డును ప్రస్తుత ప్రాంతానికి దూరంగా మారుస్తున్నారంటూ స్థానికుల్లో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇతర ప్రాంతాల్లోని రైతుల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. తమ భూములకు ఎక్కడ ఇబ్బంది కలుతుందోనన్న భయంతో ఎన్హెచ్ఏఐ అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని అధికారులు చెబుతుండటంతో ..ఏది నిజమో తెలియని అయోమయంలో ఉన్నారు. చిన్న మార్పుతో భారీ తేడా! రింగురోడ్డు అలైన్మెంటులో ఓ ప్రాంతంలో చిన్న మార్పు చేస్తే దాని ప్రభావం ఇటు రెండు కిలోమీటర్లు, అటు రెండు కిలోమీటర్ల మేర ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇది ఎక్స్‌ప్రెస్ వే అయినందున ఉన్నఫళంగా రోడ్డును మలుపు తిప్పే వీలుండదు. రెండు కిలోమీటర్ల దూరం నుంచి మొదలుపెట్టి క్రమంగా మలుపు తిప్పాల్సి ఉంటుంది. ఇక మార్పు ఎక్కువగా ఉంటే, అలైన్మెంటులో కూడా భారీ మార్పు చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం ఊరికి ఒకవైపు ఉందనుకుంటే, మార్పు వల్ల మరో వైపునకు మారే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ప్రజల్లో తీవ్ర అలజడికి కారణమవుతుంది. కాబట్టి ఇలాంటి మార్పులకు అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారు. అయితే నేతలు మాత్రం ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. -
రవాణాలో భారీగా రామప్రసాదం
‘అయ్యవారికి చాలు ఐదు వరహాలు..! పిల్లలకు చాలు పప్పు బెల్లాలు..!’ అంటూ దసరా పాట ఒకప్పుడు వినిపించేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకున్నా రవాణా శాఖలో కొత్త పాట వినిపిస్తోంది. ‘అయ్యగారికి చాలు 10 కోట్ల రూపాయలు..!’ అని అంటున్నారు!! అన్నట్టుగానే బదిలీలకు ముడుపులు వసూలు చేసి కీలక నేతకు సమర్పించారు. రవాణా శాఖ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా కీలక నేతే స్వయంగా ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి మరీ మీ పోస్టులు ఉండాలంటే ముడుపులు చెల్లించాలని హుకుం జారీ చేయడం.. వసూళ్ల కోసం ఏకంగా ముగ్గురు అధికారులను వినియోగించడం విభ్రాంతి కలిగిస్తోంది. – సాక్షి, అమరావతిపోస్టు ఉండాలంటే ముడుపులు చెల్లించాల్సిందే రవాణా శాఖలో ఉన్నతాధికారుల బదిలీల్లో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రధానంగా జిల్లా రవాణా శాఖ అధికారులు (డీటీసీ), ఆర్టీవోల బదిలీల్లో భారీ దందా సాగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రవాణా శాఖలో కీలక నేత ఉన్నతాధికారుల బదిలీల పేరిట హైడ్రామాకు తెరతీశారు. ప్రాధాన్యమున్న కేంద్రాల్లో పోస్టులు కావాలంటే భారీగా సమర్పించుకోవాలని తేల్చి చెప్పారు.ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో కొనసాగాలన్నా... ప్రాధాన్యత పోస్టులకు బదిలీ కావాలన్నా పేషీకి ముడుపులు సమర్పించుకోవల్సిందేనని.. లేదంటే శంకరగిరి మాన్యాలు తప్పవని సెలవిచ్చారు. అందుకోసం రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలోని ముగ్గురు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. పోస్టింగ్ కేంద్రాన్ని బట్టి డీటీసీ పోస్టుకు రూ.25 లక్షలు, ఆర్టీవో పోస్టుకు రూ.10 లక్షల చొప్పున వసూలు చేసి మొత్తంగా రూ.10 కోట్లు వరకు కీలక నేత పేషీకి సమర్పించారు. ముడుపులు ఇవ్వని ముగ్గురిపై వేటు కీలక నేత పేషీ నుంచి ఫోన్లు చేసినా ముగ్గురు డీటీసీలు ముడుపులు ఇచ్చేందుకు నిరాకరించారు. తమకు ఎక్కడ పోస్టింగు ఇచ్చినా విధులు నిర్వహిస్తామని, ముడుపులు ఇవ్వలేమని డీటీసీలు పురేంద్ర, రాజారత్నం, మీరా ప్రసాద్ చెప్పినట్టు సమాచారం. దాంతో ఆ ముగ్గురిపై బదిలీ వేటు వేశారు. వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేయడం గమనార్హం. సీనియర్ అధికారిపై కక్ష సాధింపు.. రవాణా శాఖలో కమిషనర్ తరువాత అత్యంత కీలకమైన అదనపు కమిషనర్ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. నిబంధనల ప్రకారం సీనియారిటీలో మొదటి స్థానంలో ఉన్న జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(జేటీసీ) రమాశ్రీకి ఆ పోస్టు ఇవ్వాలి. సర్వీసు రికార్డులో ఆమెపై ఎలాంటి ఫిర్యాదులు కూడా లేవు. అయితే ఆమెను అదనపు కమిషనర్‌గా నియమించేందుకు మంత్రి పేషీ ససేమిరా అంది. నిబంధనల మేరకు వ్యవహరించే ఆమె కీలక స్థానంలో ఉంటే తమ అక్రమాలకు సాగవని భావించింది. ఈ నేపథ్యంలో రమాశ్రీని హఠాత్తుగా విశాఖ జేటీసీగా బదిలీ చేసి ఆమె కంటే జూనియర్ అధికారి వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశించడం గమనార్హం. భారీ అవినీతికి రంగం సిద్ధం చేస్తున్న కీలక నేత అందుకు వత్తాసు పలికే అధికారులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటున్నారని రవాణా శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
స్క్రాప్ స్వచ్ఛందమే: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదిహేనేళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ‘వలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. వాహనాన్ని తుక్కుగా మార్చాలా, వద్దా అన్నదానిపై యజమానులే నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుని, గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి మరో ఐదేళ్లపాటు వినియోగించుకునే ప్రస్తుత విధానం కొనసాగుతుందని ప్రకటించింది. అయితే ఎవరైనా తమ వాహనాన్ని తుక్కుగా మార్చి, అదే కోవకు చెందిన కొత్త వాహనాన్ని కొంటే.. జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)లో కొంతమొత్తం రాయితీగా ఇస్తామని తెలిపింది. కొన్నినెలల పాటు వివిధ రాష్ట్రాల్లోని వెహికల్ స్క్రాపింగ్ పాలసీలను అధ్యయనం చేశాక.. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను మిళితం చేసి అధికారులు ఈ విధానాన్ని రూపొందించారు. మంగళవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ శాఖ అధికారులతో కలసి ఈ వివరాలను వెల్లడించారు. ఏ వాహనాలకు ఏ విధానం? ఎవరైనా 15 ఏళ్లు దాటిన తమ వాహనాన్ని తుక్కుగా మార్చాలని భావిస్తే.. దీనిపై రవాణా శాఖకు సమాచారమిచ్చి, అదీకృత తుక్కు కేంద్రానికి వెళ్లి స్క్రాప్ చేయించుకోవాలి. ఆ కేంద్రం సంబంధిత వాహనానికి నిర్ధారిత స్క్రాప్ విలువను చెల్లిస్తుంది. ఈ మేరకు సర్టిఫికెట్ ఇస్తుంది. యజమానులు అదే కేటగిరీకి చెందిన కొత్త వాహనం కొన్నప్పుడు.. ఈ సర్టిఫికెట్ చూపితే కొత్త వాహనానికి సంబంధించిన జీవితకాల పన్నులో నిర్ధారిత మొత్తాన్ని రాయితీగా తగ్గిస్తారు.రవాణా వాహనాలను ఎనిమిదేళ్లకే స్క్రాప్‌కు ఇవ్వవచ్చు. వీటికి సంబంధించి ఎంపీ ట్యాక్స్‌లో 10% రాయితీ ఉంటుంది. మిగతా నిబంధనలు నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల తరహాలోనే వర్తిస్తాయి. – ప్రభుత్వ వాహనాల విషయంలో మాత్రం నిర్బంధ స్క్రాప్ విధానమే వర్తిస్తుంది. పదిహేనేళ్లు దాటిన ప్రతి ప్రభుత్వ వాహనాన్ని ఈ–ఆక్షన్ పద్ధతిలో తుక్కు కింద తొలగించాల్సిందే. అవి రోడ్డెక్కడానికి వీలు లేదు. – ఏ కేటగిరీ వాహనాన్ని స్క్రాప్‌గా మారిస్తే.. అదే కేటగిరీ కొత్త వాహనంపై మాత్రమే రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ద్విచక్రవాహనాన్ని తుక్కుగా మారిస్తే.. మళ్లీ ద్విచక్రవాహనం కొంటేనే రాయితీ వర్తిస్తుంది. అంతేకాదు వాహనాన్ని తుక్కుగా మార్చిన రెండేళ్లలోపే ఈ రాయితీ పొందాల్సి ఉంటుంది. కేంద్రం చట్టం చేసిన మూడేళ్ల తర్వాత.. దేశవ్యాప్తంగా వాహన కాలుష్యం పెరుగుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ చేసింది. 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలన్న విధాన నిర్ణయం తీసుకుంది. దీనిపై 2021లో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ చట్టం అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించింది. చాలా రాష్ట్రాలు దశలవారీగా దీని అమలు ప్రారంభించాయి. కానీ నిర్బంధంగా తుక్కు చేయకుండా.. స్వచ్ఛంద విధానానికే మొగ్గు చూపాయి. తెలంగాణలో మూడేళ్ల తర్వాత ఇప్పుడు పాలసీని అమల్లోకి తెచ్చారు. – ‘రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్వీఎ‹స్ఎఫ్)’ కేంద్రాల్లో వాహనాలను తుక్కుగా మారుస్తారు. ఈ కేంద్రాల ఏర్పాటు కోసం గత ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేయగా.. మహీంద్రా కంపెనీ సహా నాలుగు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆ కేంద్రాలు నిబంధనల ప్రకారం ఉన్నాయా, లేదా అన్నది పరిశీలించి అనుమతిస్తారు. యజమానులు ఈ కేంద్రాల్లోనే వాహనాలను అప్పగించి, సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాహనాల ‘ఫిట్నెస్’ పక్కాగా తేల్చేందుకు... 15 ఏళ్లు దాటిన వాహనాలను మరికొంతకాలం నడుపుకొనేందుకు ఫిట్నెస్ తనిఖీ తప్పనిసరి. ఇప్పటివరకు మ్యాన్యువల్‌గానే టెస్ట్ చేసి సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇది సరిగా జరగడం లేదని, అవినీతి చోటుచేసుకుంటోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. ఆటోమేటెడ్ స్టేషన్లలో కంప్యూటరైజ్డ్ పద్ధతిలో ఫిట్నెస్ టెస్టులు చేయించాలని కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు రూ.293 కోట్లు అవుతాయని అంచనా వేశారు. అందులో కేంద్రం రూ.133 కోట్లను భరించనుంది. ఇక వాహనాల విక్రయానికి సంబంధించిన ఎన్ఓసీలు, లైసెన్సులు ఇతర సేవలను అన్ని రాష్ట్రాలతో అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం వాహన్, సారథి పోర్టల్‌లను ఏర్పాటు చేసింది. చాలా రాష్ట్రాలు వీటితో అనుసంధానమయ్యాయి. తాజాగా తెలంగాణ కూడా అందులో చేరుతున్నట్టు ప్రకటించింది. దీనిని తొలుత సికింద్రాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో ప్రారంభిస్తున్నారు. భద్రతపై దృష్టి సారించాం దేశవ్యాప్తంగా ఏటా 1.6 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. తెలంగాణలో కూడా ఆ సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై దృష్టి సారించాం. నిబంధనల విషయంలో కచ్చితంగా ఉండాలని నిర్ణయించాం. రవాణా శాఖకు సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు వాహనాల తుక్కు విధానం లేదు. దాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో పరిశీలించి మంచి విధానాన్ని తెచ్చాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలతో రవాణాశాఖకు సంబంధించిన సమాచార మార్పిడికి వీలుగా సారథి, వాహన్ పోర్టల్‌లో తెలంగాణ చేరాలని నిర్ణయించింది. ఏడాదిలో అన్ని విభాగాలను అనుసంధానం చేస్తాం. – రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్‌ట్యాక్స్ మాఫీ..15 ఏళ్లుదాటిన వాహనాలు ఇంకా ఫిట్‌గా ఉన్నాయని భావిస్తే, వాటిని ఇక ముందు కూడా నడుపుకోవచ్చు. రూ.5 వేల గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి తదుపరి ఐదేళ్లు, ఆ తర్వాత రూ.10 వేలు చెల్లించి మరో ఐదేళ్లు నడు పుకొనే వెసులుబాటు ఉంది. అయితే ఇప్ప టికే 15ఏళ్లు దాటేసిన వాహనాలను తుక్కుగా మార్పిస్తే.. వాటికి గ్రీన్‌ట్యాక్స్ బకాయి ఉన్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది. దీంతో కొత్త పాలసీలో ఆ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా స్క్రాప్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అదే వాణిజ్య వాహనాలకు త్రైమాసిక పన్ను వంటి బకాయిలు ఉంటే.. ఆ బకాయిలపై పెనాల్టిని మాఫీ చేస్తారు. -
రవాణాశాఖ సేవలకు ఇక ‘వాహన్ సారథి’
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ అందజేసే వివిధ రకాల పౌరసేవలు మరింత పారదర్శకం కానున్నాయి. ఇప్పటికే ఆన్లైన్లో స్లాట్ నమోదు ద్వారా కొన్ని సేవలు నేరుగా, మరికొన్ని పరోక్షంగా లభిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్‌ల రెన్యువల్స్, వాహనాల నమోదు బదిలీ వంటి పౌరసేవలను వాహన వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఆర్టీఏ సన్నాహాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా రవాణా సేవలన్నింటిపైన ఏకీకృత విధానాన్ని అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన వాహన్ సారథిని గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రస్తుతం టీ–యాప్ ఫొలియో వంటి మొబైల్ యాప్‌ల ద్వారా ప్రత్యక్ష సేవలను పొందేందుకు అవకాశం ఉండగా త్వరలో వాహన్ సారథిని వినియోగించుకొనే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు వాహనాల వివరాలన్నింటినీ వాహన్లోనూ, వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌ల వివరాలను సారథిలోనూ నిక్షిప్తం చేయనున్నాయి. కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ సమాచారం కేంద్రం (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ) ద్వారా ఈ వివరాలన్నింటినీ నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొదట లైసెన్స్‌ల డేటా నమోదు సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయం నుంచి త్వరలోనే సారథి సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా సారథి కార్యకలాపాలు సాగిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన డ్రైవింగ్ లైసెన్స్‌ల వివరాలు సారథిలో నమోదయ్యాయి. ఇటీవల తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరింది. దీంతో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకొనే అభ్యర్థులు మినహాయించి పాతవి రెన్యువల్స్ చేసుకోవడం, చిరునామా బదిలీ చేసుకోవడం వంటి సేవలను సారథి నుంచి పొందవచ్చు. ప్రస్తుతం ఉద్యోగ, వ్యాపార అవసరాల రీత్యా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు లేదా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌లను బదిలీ చేసుకోవాలంటే సంబంధిత ఆర్టీఏ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రాన్ని (ఎన్ఓసీ) పొందాల్సి ఉంటుంది. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన సారథి వల్ల ఆ ఇబ్బంది ఉండదు. లైసెన్స్‌ల మొత్తం డేటా సారథిలో నిక్షిప్తమై ఉంటుంది. దీంతో వాహనదారులు తమ డేటాను ఎక్కడి నుంచి ఎక్కడికైనా మార్చుకోవచ్చు. ఆన్లైన్లోనే ఈ సర్విసులను పొందే అవకాశం ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ, ఆమోదంతోనే సర్విసుల బదిలీ సదుపాయం లభించనుంది. ఇందుకోసం ఆన్లైన్లోనే నిరీ్ణత ఫీజు చెల్లించి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతంగ్రేటర్ హైదరాబాద్‌లోని 3 జిల్లాల పరిధిలో 62,7056 లైసెన్స్‌లు ఉన్నాయి. సుమారు 83 లక్షల వాహనాలు నమోదై ఉన్నాయి. వాహనాల నమోదుకు ‘వాహన్’ ఇప్పటికే దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు వాహనాల వివరాలను ‘వాహన్’లో నమోదు చేశాయి. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ‘వాహన్’లో ఇటీవల తెలంగాణ కూడా చేరేందుకు చర్యలు చేపట్టింది. మొత్తం వాహనాల డేటాను వాహన్‌లో నిక్షిప్తం చేయనున్నారు. దీనిద్వారా వాహనం కొనుగోలు చేసిన వెంటనే షోరూమ్‌లలో శాశ్వత రిజి్రస్టేషన్ సదుపాయం లభించనుంది. ప్రస్తుతం ఆటోమొబైల్ డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలను (టీఆర్) ఇస్తున్నారు. అనంతరం ఆర్టీఏ అధికారులు శాశ్వత రిజిస్ట్రేషన్ (ఆర్సీ) చేస్తున్నారు. మరోవైపు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనాన్ని బదిలీ చేసేందుకు ఎన్ఓసీల అవసరం ఉండదు. సదరు వాహనం వివరాలను ‘వాహన్’లో ధ్రువీకరించుకుని బదిలీ చేయవచ్చు. అలాగే ప్రమాద బీమా సదుపాయం కూడా తేలిగ్గా లభిస్తుందని అధికారులు చెప్పారు. వాహనాల సామర్థ్య పరీక్షలను కూడా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా నిర్వహించడంతో పాటు ఆటోమేటిక్ డ్రైవింగ్ ట్రాక్‌లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లోనే లెరి్నంగ్ పరీక్షలు ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలను కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో ఈ తరహా పద్ధతి విజయవంతంగా అమలవుతున్న దృష్ట్యా హైదరాబాద్‌లోనూ ఆన్లైన్ టెస్టింగ్ పద్ధతిని అమలు చేయాలనే రవాణా అధికారులు ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల విని యోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవస రం ఉండదు. ఇంటి నుంచి ఎల్ఎల్ఆర్ (లెర్నింగ్ లైసె న్స్) పొందవచ్చు. ఇది 6 నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మరో నెల వరకు పొడిగించుకొనే సదుపాయం ఉంటుంది. లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న నెల రోజుల నుంచి 6 నెలల్లోపు అందజేసే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం మాత్రం టెస్ట్ట్రాక్లలో అధికారులు నిర్వ హించే ప్రత్యక్ష పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. -
డ్రైవింగ్.. ట్రాక్‌లో పడేలా
డ్రైవింగ్ లైసెన్స్ కావాలి.. మొదట లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నారు..ఏదో డ్రైవింగ్ స్కూల్లో చేరి కొన్ని రోజులు నేర్చుకున్నారు.. డ్రైవింగ్ టెస్టులో పాసయ్యేంత నైపుణ్యం లేకున్నా..ఎవరో ఏజెంట్నో, దళారీనో పట్టుకుని లైసెన్స్ సంపాదించేశారు. ఇదంతా బాగానే ఉంది..మరి వచ్చిరాని డ్రైవింగ్‌తో బండి వేసుకుని రోడ్డెక్కితే? ఏదైనా ప్రమాదానికి కారణమైతే? ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. సిటీలోని నాగోల్‌లో ఆధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకుని, ట్రాక్‌పై నిరీ్ణత ప్రమాణాల మేరకు నడిపితేనే.. లైసెన్స్ చేతికి వస్తుంది. లేకుంటే ఫెయిలే మరి.సాక్షి, హైదరాబాద్డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం వచ్చేవారికి రవాణా శాఖ తనిఖీ అధికారులే పరీక్షలు నిర్వహించి లైసెన్స్‌లను అందజేసే పద్ధతి చాలాకాలం నుంచి కొనసాగుతోంది. మాన్యువల్‌గా సాగుతున్న ఈ పద్ధతికి స్వస్తి చెప్పి.. మోటారు వాహన చట్టం నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ఆధునీకరణకు రవాణాశాఖ సిద్ధమైంది. ఆటోమేటిక్ పద్ధతిలో ట్రాక్‌ల నిర్వహణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో నిరీ్ణత ప్రమాణాల మేరకు వాహనం నడిపితేనే డ్రైవింగ్ లైసెన్స్ లభించనుంది. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్టుకు వచ్చేవారు ఎలాంటి దొడ్డిదారి మార్గాలను అన్వేíÙంచకుండా.. బాగా శిక్షణ తీసుకుని డ్రైవింగ్‌లో నైపుణ్యం సంపాదించాలని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి.రమేశ్ స్పష్టం చేస్తున్నారు. వాహనాల వినియోగం పెరుగుతూ.. ఇప్పుడు చాలా మందికి బైక్ లేదా కారు నిత్యావసరంగా మారింది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, మహిళలు అన్ని వర్గాల వారు వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తున్నారు. ఏటా వేలాది మంది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుని, వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. రవాణా రంగంలో డ్రైవర్లుగా చేరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత మూడేళ్లలో సుమారు 62 లక్షల మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకోవడం విశేషం. అయితే చాలా మంది ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా వచ్చేస్తే బాగుంటుందని భావిస్తుంటారు. ఇందుకోసం ఏజెంట్లను, మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. సరిగా నేర్చుకోకుండా, టెస్టుకు హాజరుకాకుండా తప్పుడు పద్ధతుల్లో లైసెన్సు తీసుకుని.. అరకొర అనుభవంతో బండి నడిపితే ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది.⇒ ఇన్నాళ్లూ కొనసాగిన మొక్కుబడి డ్రైవింగ్ టెస్టులకు చెల్లుచీటీ ⇒ రహదారులపై ఉండే ఇబ్బందులను తలపించేలా ట్రాక్‌లో ఏర్పాట్లు ⇒ లైసెన్స్ కోసం వచ్చేవారు ఎలా నడపగలుగుతున్నారో పరిశీలన ⇒ఆటోమేటిక్ పద్ధతిలో ట్రాక్‌ల నిర్వహణ⇒ టెస్ట్ వివరాలన్నీ కంఫ్యూటర్లో నిక్షిప్తం ⇒ ప్రమాణాల మేరకు డ్రైవింగ్ చేయకుంటే ఫెయిలేట్రాక్లో టెస్టు ఇలా..వాహనదారుల డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షించేందుకు రకరకాల ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. కారు నడిపేవారు ఈ అన్ని ట్రాక్‌లలో తమ నైపుణ్యాన్ని చూపాల్సి ఉంటుంది. అలాగే ద్విచక్ర వాహన దారులు, భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు కూడా ప్రత్యేక ట్రాక్‌లు ఉన్నాయి.ట్రాక్ ‘హెచ్’: వాహనం ముందుకు వెళ్లిన తరువాత రివర్స్ చేయాల్సి వస్తే.. ఎలా తీసుకొంటారో తెలుసుకొనేందుకే ఈ ట్రాక్. ట్రాక్ ‘ఎస్’: ఒక మూల నుంచి మరో మూలకు టర్న్ చేయాల్సి వచి్చనప్పుడు ఎలాంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారో ఈ ట్రాక్‌లో తెలుస్తుంది. ట్రాక్ ‘8’: బాగా మలుపులున్న రోడ్డుపై ఎలా ముందుకు వెళ్తున్నారో తెలుసుకొనేందుకు ఇది దోహదం చేస్తుంది. ఎత్తుపల్లాల ట్రాక్:⇒ ఎత్తైన ప్రదేశాలు, చిన్న లోయ వంటి ప్రాంతాల్లో ఎలా నడపగలరో పరిశీలించేందుకు ఇవి ఏర్పాటు చేశారు. ⇒చివరగా బండి పార్కింగ్ చేసే పద్ధతిని కూడా పరీక్షిస్తారు. ⇒టెస్ట్‌కు హాజరయ్యే సమయంలో ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్,ద్విచక్రవాహనమైతే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. లేకుంటే ఫెయిల్ చేస్తారు. ⇒ ట్రాక్‌లలో నడిపేటప్పుడు ఎలాంటి తప్పిదాలు చేసినా ఫెయిల్ అయినట్టుగా నిర్ధారిస్తారు. ఇలా ఫెయిలైన వారు మరోనెల పాటుశిక్షణ తీసుకొని హాజరుకావాల్సి ఉంటుంది.రోజూ వందలాది మందికి డ్రైవింగ్ టెస్టులు..గ్రేటర్ హైదరాబాద్‌లో నాగోల్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, బండ్లగూడలలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ద్వారా రవాణా శాఖ డ్రైవింగ్ పరీక్షలను నిర్వహిస్తోంది. రోజూ వందలాది మంది ఈ టెస్టులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో దేశంలోనే అత్యాధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను నాగోల్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న 12 ట్రాక్‌లలో రోజూ వందల మందికి డ్రైవింగ్ టెస్టు చేస్తున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు నడిపేందుకు వేర్వేరు ట్రాక్‌లు ఉన్నాయి. అలాగే బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలను నడిపేవారికి టెస్టుల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. అనంతరం దశలవారీగా కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్ తదితర ఆర్టీఏలలోనూ ట్రాక్‌లను విస్తరించారు. నెలరోజులకే ‘టెస్టు’కు వస్తూ.. : అభ్యర్థులు తొలుత లెర్నింగ్ లైసెన్సు తీసుకుని డ్రైవింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెల రోజుల నుంచి 6 నెలలలోపు ఎప్పుడైనా డ్రైవింగ్ టెస్టు పాసై.. హాజరై శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు పొందవచ్చు. డ్రైవింగ్‌లో పట్టుసాధించాకే లైసెన్సు అందేలా ఈ నిబంధన అమలవుతోంది. కానీ చాలా మంది తూతూమంత్రంగా డ్రైవింగ్ నేర్చుకుని.. నెల రోజులకే టెస్టుకు హాజరవుతున్నారు. డ్రైవింగ్ పూర్తిగా రాకపోయినా, అడ్డదారిలో లైసెన్స్ పొందేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇకపై అలాంటి వాళ్లు టెస్టులో చిక్కులు ఎదుర్కోక తప్పదని నాగోల్ ప్రాంతీయ రవాణా అధికారి రవీందర్ తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాలని.. ఆ టెస్ట్ వివరాలను కంఫ్యూటర్లో నమోదు చేసి, ఉత్తీర్ణులుగా నిర్ధారణ అయితేనే లైసెన్స్ ఇస్తారని వెల్లడించారు.నైపుణ్యం ఉంటే కష్టమేమీ కాదు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వాహనం తప్పనిసరి అవసరంగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, వాహనం నడపడంలో కచి్చతమైన నైపుణ్యం కలిగి ఉండాలి. డ్రైవింగ్‌లో ప్రావీణ్యం ఉన్నవారు ఆర్టీఏ టెస్ట్ ట్రాక్‌లలో నిర్వహించే పరీక్షల్లో తేలిగ్గా ఉత్తీర్ణులవుతారు. డ్రైవింగ్ ఎంతో కీలకమైంది. నాణ్యమైన శిక్షణ తీసుకొని, పూర్తి నమ్మకం కలిగాకే.. డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాలి. మొక్కుబడిగా నేర్చుకుని లైసెన్సుల కోసం రావడం వల్ల ప్రయోజనం ఉండదు. టెస్ట్‌కు రావడానికి ముందే ఒకసారి ట్రాక్‌పైన అవగాహన పెంచుకోవడం మంచిది. – సి.రమేశ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, హైదరాబాద్పూర్తిగా నేర్చుకుని వచ్చాను సాధారణంగా డ్రైవింగ్ స్కూల్లో నెల రోజులు మాత్రమే శిక్షణ ఇస్తారు. నైపుణ్యం పెంచుకునేందుకు అది ఏ మాత్రం చాలదు. కనీసం3 నెలల పాటు డ్రైవింగ్ మెళకువలు నేర్చుకోవాలి. ఎలాంటి రోడ్లపై అయినా సరే బండి నడపగలమనే ధైర్యం, నమ్మకం వచి్చన తర్వాత టెస్ట్‌కు రావడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఈజీగా పాస్ కావొచ్చు. – పూరి్ణమ, టెస్ట్‌కు హాజరైన మహిళరోడ్లపై నడిపినట్లుగానే ఉంది ఈ ట్రాక్‌లో రోడ్డు మీద నడిపినట్టుగానే ఉంది. మూల మలుపులు, ఎత్తుపల్లాలు, స్పీడ్ బ్రేకర్లు అన్నీ ఉన్నాయి. బండి నడిపే సమయంలో ఏ రోడ్డుపైన ఎలా నడపాలోస్పష్టమైన అవగాహన ఉంటేనే ఇక్కడ టెస్ట్‌ను ఎదుర్కోగలుగుతాం. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నడిపితే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో నిర్వహించే పరీక్షలు ఏ మాత్రం ఇబ్బంది కాదు. – శ్రీధర్, టెస్ట్‌కు హాజరైన యువకుడు -
టీడీపీ ఎంపీగారి బస్సులా.. అయితే ఓకే!
సాక్షి, అమరావతి: ఆయనో టీడీపీ ఎంపీ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యా సంస్థల టైకూన్‌గా గుర్తింపు పొందారు. అంతకంటే అర్హత ఏముంటుందని రవాణా శాఖ అధికారులు భావించారు. అందుకే ఆయన విద్యా సంస్థకు చెందిన వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాల కోసం విద్యార్థుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 2023లో చేసిన మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను ఏమాత్రం పాటించకపోయినా సరే నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల భద్రతతో ముడిపడిన వ్యవహారం అయినప్పటికీ ఎంపీ ఒత్తిడికి తలొగ్గి ఆయన చెప్పినట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కేంద్ర మోటారు వాహనాల చట్టం ఏం చెబుతోందంటే..విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రత్యేక చట్టం రూపొందించింది. ప్రధానంగా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు.. పొరపాటున అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టేందుకు స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించింది. ఫైర్ డిటెక్షన్, అలార్మ్ సిస్టం, ఫైర్ సప్రెషన్ సిస్టం, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టంలకు సంబంధించిన పరికరాలు, ఉపకరణాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.రూల్స్, గీల్స్ ఏమీలేవు..ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదేళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన కుటుంబం దశాబ్దాలుగా ఉన్నత విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఆ విద్యా సంస్థ కోసం ఇటీవల కొత్తగా 50 బస్సులను కొనుగోలు చేశారు. అందుకోసం చెన్నై నుంచి వాహనాల ఛాసీస్‌లను కొనుగోలు చేసి బస్సుల బాడీ బిల్డింగ్ పనులు చేయించారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన మోటారు వాహనాల చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అగ్నిమాపక పరికరాలు, ఉపకరణాలు ఏర్పాటు చేయలేదు. కానీ తమ విద్యా సంస్థల ట్రస్ట్ తరఫున కొనుగోలు చేసిన ఆ బస్సులను రిజిస్ట్రేషన్ చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక పరికరాలు పొందుపరచలేదని కొందరు అధికారులు చెప్పినా సరే ఆ ప్రజాప్రతినిధి పట్టించుకోలేదు. ‘మా బస్సులను రిజిస్ట్రేషన్ చేయండి.. మిగిలిన విషయాలు ఎత్తొద్దు.. 40 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నాం.. మాకు కొత్తగా రూల్స్ చెప్పొద్దు’ అని ఆయన గదమాయించారు. దాంతో రవాణా శాఖ అధికారులు గప్‌చుప్‌గా ఆ విద్యా సంస్థ బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో 17 బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసినట్టు సమాచారం. మిగిలిన బస్సులకు కూడా త్వరగా రిజిస్ట్రేషన్లు చేసేయడానికి అధికారులు దస్త్రాలు వేగంగా కదుపుతున్నారని తెలిసింది. -
రేపే ‘సాక్షి’ని మూసేయిస్తా
అనంతపురం క్రైం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మరోసారి నోటికి పనిచెప్పారు. బుధవారం మీడియా సమక్షంలో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఆయన.. ఆ వార్తను ప్రచురించిన, ప్రసారం చేసిన ‘సాక్షి’ మీడియాపై గురువారం నోరుపారేసుకున్నారు. సాక్షి ఆఫీసుకు రేపు ఉదయం 10 గంటలకు మూతేయకపోతే చూడండ్రా.. ఎవరూ అడ్డుకోలేరంటూ బెదిరించారు. గురువారం అనంతపురంలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశం పేరిట కొందరు పాత్రికేయులను పిలిపించి సాక్షిపై అక్కసు వెళ్లగక్కారు. ‘వాళ్లని, వీళ్లని కాదు. మిమ్మల్నే (సాక్షి) బెదిరిస్తున్నా. ఏం పీకుతారు’ అంటూ బరితెగించి మాట్లాడారు. బ్రేక్ ఇన్స్పెక్టర్లను కాదు.. నేరుగా మీకే చెబుతున్నా.. సాక్షిని మూతేయిస్తా. నేను బంద్ చేయించేందుకు వస్తే పోలీసులు కూడా అడ్డుకోలేరు’ అంటూ బెదిరింపులకు దిగారు. ‘మీ కార్యాలయంపై దాడి చేస్తే దిక్కొచ్చే వారెవరున్నారు? నోరు మూసుకుని ఉండాలి. దర్బేష్.. నా కొ.. ల్లారా’ అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ ఊగిపోయారు. ‘ఆయమ్మను బెదిరించాడు.. ఈయమ్మను బెదిరించాడు అన్నారు కదా.. ఇప్పుడు మిమ్మల్నే అంటున్నా.. మీకెవరు దిక్కున్నారు? మీ సీతారామాంజనేయులు, మీ పేర్ని నాని, మా ఎమ్మెల్యే (పెద్దారెడ్డి) వస్తారా? వాళ్లెవరూ రారు. నేను ఎవరికీ భయపడను. అంతకు ముందు కూడా నేను ‘సాక్షి’ ముందే కూర్చున్నా. మీకు వెనకాల, ముందు ఏముంది? నేను అనుకుంటే అనంతపురం సాక్షి ఆఫీసు మూసేయిస్తా’ అంటూ రెచ్చిపోయారు. ‘వాన్నీ.. వీన్ని బెదిరించను. నేరుగా మిమ్మల్నే బెదిరిస్తున్నా. అప్పట్లో మాకు ఎవరూ ప్రొటెక్షన్ రాలేదు. ఈ రోజు మీపైకి వస్తే మీకు అండగా ఎవరూ రారు. మేమొస్తే ఎవడూ అడ్డుకోలేరు. లక్షలాది మంది జనం మీ కార్యాలయంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మీకు ఎవడూ లేడు. నాకు జన బలం ఉంది’ అంటూ బెదిరించారు. -
నా కొ..ల్లారా.. నరుకుతా..
అనంతపురం క్రైం: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి అధికారులపై విరుచుకుపడ్డారు. ‘నా కొ..ల్లారా.. ఒక్కొక్కరినీ నరుకుతా’ అంటూ బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే బండబూతులతో చెలరేగిపోయారు. రవాణా శాఖ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు తాడిపత్రి మునిసిపల్ అధికారులకు, పోలీసులకు, వైఎస్సార్సీపీ నేతలకు బహిరంగంగానే వారి్నంగ్ ఇచ్చారు. ప్రధానంగా గతంలో రవాణా శాఖ కమిషనర్‌గా చేసిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులుతో పాటు అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, డీటీసీ శివరాంప్రసాద్, మహిళా అధికారిణి అత్తికానాజ్లను దుర్భాషలాడారు. ‘మీరెక్కడ దాక్కున్నా వదలను. గత ప్రభుత్వ హయాంలో నా బస్సులు, లారీలను అన్యాయంగా సీజ్ చేశారు. మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించారు. నన్ను, నా కొడుకును జైలుకు పంపారు. నిబంధనల మేరకే మేము బీఎస్–4 వాహనాలు కొన్నాం. బీఎస్–4 వాహనాలు అమ్మిన వాళ్లదే తప్పు అని సుప్రీం కోర్టు చెప్పింది. పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమ్మిన వాహనాలను సరెండర్ చేశారు. అక్కడ రిజి్రస్టేషన్ చేసిన అధికారుల ఉద్యోగాలు పోయాయి. ఏపీలో మాత్రం వాహనాలు కొన్న మాపై కేసులు పెట్టారు. జైళ్లకు కూడా పంపారు. అందరిపై ప్రతీకారం తీర్చుకుంటా. సీజ్ చేసిన మా బస్సులు, లారీలన్నీ తుప్పు పట్టిపోయాయి. వాటిని మీరే (అధికారులే) రిపేరు చేయించి తిరిగి రోడ్డుపైకి తేవాలి. ఇందుకు పది రోజులు గడువిస్తున్నా. లేదంటే భార్య, పిల్లలతో కలసి డీటీసీ, ఎస్పీ కార్యాలయాల ముందు నిరాహార దీక్ష చేస్తా. తాడిపత్రి మునిసిపల్ ఆఫీసులో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. రేయ్.. కమిషనర్లూ మిమ్మల్ని వదలను. ‘నా కొ..ల్లారా నరికేస్తా. ఏమవుతుంది మీతో’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారులను దుర్భాషలాడారు. ‘నా ఫ్యామిలీకి 620 ఏళ్ల చరిత్ర ఉంది. నా గడ్డం ఎందుకు వదిలాననుకుంటున్నారు? చంద్రబాబు సీఎం కావాలని వదల్లేదు. ఒక్కో వెంట్రుకకు ఒక్కో కథ ఉంది. అత్తికానాజ్ ఆడదంట.. ఏమ్మా అన్నా వినలేదు. ఇంట్లో తను ఎలా ఉంటుందో తెలుసా?’ అంటూ రాయలేని భాషలో దూషించారు. వైఎస్సార్సీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నానీలను కూడా దూషించారు. బస్సులు, లారీల వ్యవహారం పూర్తిగా తన వ్యక్తిగత సమస్య అని, చంద్రబాబుకు, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. తాను సొంతంగానే పరిష్కరించుకుంటానన్నారు. అవసరమైతే పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. తాను ఊ అంటే చాలు తనకున్న జనం మరెవరికీ లేరని అన్నారు. -
ఆర్టీఏ 2 శాతం దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఒక వ్యక్తి అప్పటికే ఓ కారును కలిగి ఉండి మరో కారును కొనుగోలు చేసినప్పుడు మాత్రమే 2 శాతం పన్ను రవాణాశాఖకు అదనంగా చెల్లించాలి. అంటే కొత్త వాహనంపై విధించే 18 శాతం పన్నుతో పాటు మొదటి కారుపై 2 శాతం వసూలు చేయాలనేది నిబంధన. కానీ ఆర్టీఏ అధికారులు ద్విచక్రవాహనం ఉన్నప్పటికీ రెండు శాతం పన్ను విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కార్లకే ఆ నిబంధన కానీ.. సాధారణంగా ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబ అవసరాలకు ఒక కారు సరిపోతుందనే భావనతో ఈ అదనపు పన్ను నిబంధనను అప్పట్లో తెరపైకి తెచ్చారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ కార్లను కలిగి ఉండడం వల్ల రహదారులపై భారం పెరుగుతుందని, అదనపు వాహనాలపై పన్నులు విధిస్తే ఆ కొనుగోళ్లను ఒకింత తగ్గించాలని భావించి గతంలో రవాణాశాఖ అధికారులు ఆ నిబంధనను అమలు చేస్తూ వచ్చారు. కానీ.. దీన్ని కేవలం కార్లకు మాత్రమే పరిమితం చేయాల్సి ఉండగా.. ద్విచక్ర వాహనాలను కూడా ఈ నిబంధన పరిధిలోకి తేవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ద్విచక్ర వాహనం కలిగిన వ్యక్తి కొత్తగా కారును కొనుగోలు చేస్తే ఆ కారు ధరలో 18 శాతం జీవితకాల పన్నుతో పాటు మరో 2 శాతం అదనంగా చెల్లించాలని పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్విచక్ర వాహనంఉన్నవారు కారు కొనుగోలు చేస్తే రూ.వేలల్లో అదనపు పన్ను చెల్లించాల్సివస్తోంది. ఈ అడ్డగోలు నిబంధన వల్ల 2010 నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది నష్టపోయారు. పైగా.. కాలం చెల్లి, తుప్పు పట్టి, వినియోగానికి పనికి రాని వాహనాలపై, చోరీకి గురైన వాహనాలపైనా రవాణాశాఖ నిర్దాక్షిణ్యంగా అదనపు పన్ను వసూళ్లకు పాల్పడడం గమనార్హం. కారు.. బైక్ ఒకటేనా? నలుగురు ప్రయాణం చేసే కారును.. ఇద్దరు మాత్రమే వెళ్లగలిగే బైక్‌ను ఒకే రకమైన వాహనంగా ముద్రవేసి పన్ను విధించడం వివాదాస్పదమవుతోంది. ‘2010లో రెండో వాహనంపై 2 శాతం అదనపు పన్ను విధించాలనే ప్రతిపాదన వచ్చింది. ఇది కార్లకే పరిమితం చేయాలని నిర్ణయించాం. కానీ నిబంధనల్లో ఈ విషయం స్పష్టంగా లేకపోవడం వల్ల ద్విక్ర వాహనాలకు కూడా అమలవుతోంది’అని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పుకొచ్చారు. ఏపీలో ఎత్తేసినా.. ఇక్కడ మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి తెచి్చన రెండు శాతం అదనపు పన్ను నిబంధనను గత ఏపీ ప్రభుత్వం తొలగించింది. ‘రెండో వాహనం’తో నిమిత్తం లేకుండా కొత్త వాహనాలపై 18 శాతం జీవితకాల పన్ను వసూలు చేస్తోంది. 2021లోనే ఈ రెండో వాహనం నిబంధనను తొలగించడంతో లక్షలాది మంది వాహనదారులకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చినట్లయింది. మరోవైపు వాహనం శాశ్వత రిజి్రస్టేషన్ కోసం వాహన యజమానులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా షోరూమ్‌ల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించారు. అంటే కొత్తగా బైక్, కారు తదితర వాహనాలను కొనుగోలు చేసిన వారు వాటి నమోదు కోసం ప్రత్యేకంగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నంబర్ ప్లేట్‌తో సహా షోరూమ్‌లోనే అన్ని పనులు పూర్తవుతాయి.‘బాదుడు’కథనంపై చర్చ.. ‘బండి ఉన్నా లేకున్నా బాదుడే’అనే శీర్షికన రెండు రోజుల క్రితం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన కథనం రవాణా శాఖలో చర్చకు తెరలేపింది. వినియోగంలో లేని వాహనాలను సైతం రెండో బండిగా పరిగణించి వాహనదారులపై అదనపు భారం మోపడంపై ఈ కథనంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఒక వాహనదారు తన బండి చోరీకి గురైందని పేర్కొంటూ పోలీసుల ధ్రువీకరణతో సహా ఆర్టీఏకు సమర్పించినప్పటికీ దాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలు నిబంధనలతో అదనపు వడ్డనకు పాల్పడుతున్న వైనాన్ని ఆ కథనంలో ప్రస్తావించడంతో చర్చ జరుగుతోంది. రెండో వాహనం కొనుగోలు చేసినప్పుడు జీవితకాల పన్నుపై మినహాయింపునివ్వాలని, ఈ మేరకు ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. -
‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
గోపాలపట్నం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల ఉద్యోగులకు మాత్రమే వర్తించే బీహెచ్ రిజిస్ట్రేషన్ వాహనాల అమ్మకాల్లో పలువురు డీలర్లు మోసాలకు పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది. ఇటీవల లైఫ్ టాక్స్ కట్టాల్సిన వాహనాల వివరాలు సేకరించే క్రమంలో ఇది బయటపడింది. విశాఖలో వాహనాలు కొనుగోలు చేసి అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుని లైఫ్ టాక్స్ ఎగ్గొట్టేందుకు చేసిన ప్రయత్నాలు బయటపడ్డాయి. ఇందులో ప్రధానంగా కార్లు ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ఉద్యోగులమంటూ పలువురు ఫేక్ డాక్యుమెంట్లతో కార్లు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖలో 16 మంది కార్ల డీలర్లు 400పైగా కార్లను ఈ విధంగా అమ్మినట్లు తెలుస్తోంది. దీని వల్ల రవాణా శాఖకు సుమారు రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ఈ అమ్మకాల్లో కొన్ని నిజమైనవి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయో పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అదే అదనుగా.. గతంలో అమ్మకాలపై రవాణా శాఖకు నిరంతరం సమాచారం ఉండేది. కానీ ఇప్పుడు డీలర్ల రిజిస్ట్రేషన్ వల్ల వాటిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో డీలర్లు ఇష్టానుసారంగా మోసాలకు పాల్పడుతున్నారు. నెలలో ఎన్ని వాహనాలు అమ్ముతున్నారు? ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి? లైఫ్ టాక్స్‌లు ఎన్ని వస్తున్నాయన్న సమాచారం అధికారులకు ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి మోసాలకు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. కాగా, పలు రాష్ట్రాల్లో పని చేసే ఉద్యోగులకు వెసులుబాటు కలిగించేందుకు భారత్ రిజిస్ట్రేషన్ సదుపాయం కలిగించింది.అయితే అందుకు తగిన పత్రాలు అందించాలి. కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తూ ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్లే వారికి, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగులు, బదిలీలపై వెళ్లే వారికి భారత్ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ వాహనాలు ఏ రాష్ట్రంలోనైనా తిరగొచ్చు. రాష్ట్రం మారాక ఆ రాష్ట్రంలో మళ్లీ రిజిస్ట్రేషన్ మార్చుకునే పని ఉండదు. దీని ద్వారా లైఫ్ ట్యాక్స్ తగ్గుతుంది. ఇది అదునుగా చేసుకుని కొందరు డీలర్లు బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఇక్కడ వాహనాలను అమ్మి, అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దీంతో ఇక్కడి కొనుగోలు చేసిన వాహనాలకు ఇక్కడి లైఫ్ ట్యాక్స్‌లు కట్టే పరిస్థితి లేకపోయింది. నలుగురు డీలర్లపై చర్యలు, 10 మందికి నోటీసులు400 కార్ల బీహెచ్ రిజిస్ట్రేషన్‌పై ఉప రవాణా కమిషనర్ రాజారత్నం చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజులుగా బీహెచ్ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి అందులో జరిగిన అవకతవకలను గుర్తించారు. లైఫ్ ట్యాక్స్‌లు తగిన స్థాయిలో రాక పోవడం వల్ల అనుమానాలకు దారి తీసిందన్నారు. ఫేక్ ధ్రువపత్రాలతో బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు నలుగురు డీలర్ల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు ఉండడంతో వీరిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మరో 10 మంది డీలర్లకు నోటీసులిచ్చామన్నారు. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
కొత్తగా దక్షిణ ‘రింగ్’!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డులో దక్షిణ భాగాన్ని కూడా పూర్తి కొత్తగా నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న రోడ్ల అనుసంధానం, విస్తరణ వంటివేమీ లేకుండా.. మొత్తంగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా రూపుదిద్దుకోనుంది. దీనితో ముందు భావించిన దానికన్నా రోడ్డు పొడవు పెరిగి.. 189.4 కిలోమీటర్ల నిడివికి చేరనుంది. సంగారెడ్డి నుంచి ఆమన్‌గల్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మితం కానుంది. ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు సమర్పించిన ఈ అలైన్మెంటుకు.. జూన్‌లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. ఆ వెంటనే భూసేకరణ సర్వే పనులు మొదలవుతాయి. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం 158.65 కిలోమీటర్ల రోడ్డుకు ఇప్పటికే భూసేకరణ కూడా జరుగుతోంది. త్వరలోనే దక్షిణ భాగంపై స్పష్టత రానుంది. తొలుత కొన్ని పాతరోడ్లతో కలపాలనుకున్నా.. సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ నుంచి గజ్వేల్ మీదుగా చౌటుప్పల్ వరకు ఉత్తర భాగానికి కేంద్రం మూడేళ్ల క్రితమే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉత్తర భాగాన్ని పూర్తి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తున్నారు. దక్షిణ భాగాన్ని మాత్రం ఇప్పటికే ఉన్న కొన్ని పాత రోడ్లను అనుసంధానిస్తూ నిర్మించాలని తొలుత భావించారు. ఉత్తర భాగంలోని ప్రాంతాలతో పోలిస్తే.. దక్షిణ భాగంలోని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తక్కువగా ఉన్నాయని కేంద్రం గుర్తించింది. అలాంటప్పుడు భారీ వ్యయంతో నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించాల్సిన అవసరం ఉందా? అన్న సందేహం వ్యక్తం చేసింది. ఉత్తర భాగాన్ని నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించి.. దక్షిణ భాగాన్ని ప్రస్తుత రోడ్ల అనుసంధానంతో సాధారణ హైవేగా నిర్మిస్తే సరిపోతుందని భావించింది. కానీ రింగు రోడ్డుగా పూర్తి రూపం రావాలంటే.. దక్షిణ భాగాన్ని కూడా నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్ హైవేగా నిర్మించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరటంతో.. చివరికి కేంద్రం సరేనంది. ఆలోపే కన్సల్టెన్సీ సంస్థ మూడు అలైన్మెంట్లను రూపొందించింది. అందులో రెండు అలైన్మెంట్లు ప్రస్తుత రోడ్లను అనుసంధానిస్తూ రూపొందించగా.. ఒకదాన్ని పూర్తి కొత్త రోడ్డుగా ప్రతిపాదించారు. ఈ మూడో అలైన్‌మెంట్‌నే ఖరారు చేయాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ ఒక్క రోడ్డును కలుపుదామనుకున్నా.. షాద్‌నగర్ నుంచి చేవెళ్ల, శంకర్పల్లి మీదుగా కంది వరకు ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన రోడ్డును.. దక్షిణ ‘రింగ్’ అలైన్మెంట్లో భాగం చేయాలని తొలుత భావించారు. కానీ ఆ రోడ్డు కొనసాగే ప్రాంతాల్లో వాణిజ్యపర కార్యక్రమాలు బాగా పెరిగాయి. కొత్తగా జనావాసాలు వేగంగా విస్తరించాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అక్కడ భూసేకరణ కూడా కష్టంగా మారింది. దాంతో ఈ రోడ్డును కలపకుండా.. దానికి దూరంగా రూపొందించిన అలైన్మెంట్ వైపే మొగ్గుచూపినట్టు తెలిసింది. దీనితో రోడ్డు ప్రతిపాదిత పొడవు కూడా పెరిగిపోయింది. భారీగా పెరుగుతున్న అంచనా వ్యయం.. రీజనల్ రింగురోడ్డును తొలుత ప్రతిపాదించినప్పుడు మొత్తంగా రూ.19 వేల కోట్లతో పూర్తి చేయవచ్చనే అంచనా వేశారు. కానీ ప్రాజెక్టు జాప్యం అవుతున్న కొద్దీ.. ఆ మార్గం వెంట ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెంది, భూముల ధరలు విపరీతంగా పెరగటంతో ఖర్చు రెట్టింపవుతోంది. ఏడాదిన్నర క్రితం ఉత్తర భాగానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ బడ్జెట్‌ను ఖరారు చేసింది. ఈ భాగం 158.65 కిలోమీటర్ల నిడివికి రూ.13,200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. కానీ ప్రక్రియ ముందుకు సాగలేదు. నిర్మాణ పనులు మరో ఏడాది తర్వాత గానీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించటం లేదు. అప్పటికి ఉత్తర భాగం వ్యయ అంచనా రూ.16 వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇక తాజాగా అలైన్మెంట్ ఖరారు దశకు చేరిన దక్షిణ భాగానికి నిర్మాణ వ్యయం రూ.18 వేల కోట్లుగా అంచనా వేశారు. జాప్యం జరిగితే ఇది కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. అంటే మొత్తంగా రీజనల్ రింగురోడ్డు నిర్మాణ వ్యయం రూ.35 వేల కోట్లను దాటుతుందని అధికారవర్గాలు అంటున్నాయి. మొత్తం రీజనల్ రింగ్ రోడ్డు లెక్క ఇదీ.. ఉత్తర భాగం 158.65 కిలోమీటర్లు (ఖరారైనది) దక్షిణ భాగం 189.43 కిలోమీటర్లు (అంచనా) మొత్తం పొడవు 348.08 కిలోమీటర్లు (అంచనా) సేకరించే భూమి సుమారు 4,500 హెక్టార్లు భూసేకరణ వ్యయం అంచనా రూ.14,500 కోట్లు (భూముల ధరలు పెరిగేకొద్దీ మారుతుంది) నిర్మాణ పనులకు అయ్యే వ్యయ అంచనా రూ.19,500 కోట్లు (జాప్యం జరిగినకొద్దీ పెరిగే అవకాశం ఉంది) -
చెక్ పోస్టుల వద్ద అవినీతికి అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: ‘సరుకు రవాణా వాహనాలు రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశిస్తే చాలు.. అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద నిలపాలి.. అనుమతులు తీసుకోవాలి.. అందుకోసం లంచాలు ఇవ్వాలి’. ఇదీ దశాబ్దాలుగా సరిహద్దుల్లో కనిపించే సాధారణ దృశ్యం. ఇటువంటివాటికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద లంచాల బెడదను శాశ్వతంగా నిర్మూలించింది. రవాణా శాఖ అందించే అన్ని రకాల సేవలు, అనుమతుల జారీని ఆన్లైన్ విధానంలోకి మార్చింది. అంతేకాదు రాష్ట్రంలోని 15 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను శాశ్వతంగా తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అనుమతులన్నీ ఆన్లైన్లోనే.. రాష్ట్రంలో దశాబ్దాల నుంచి 15 రవాణా శాఖ చెక్ పోస్టులున్నాయి. వాటిలో 13 రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. మిగిలిన రెండింటిలో ఒకటి తిరుపతి జిల్లా రేణిగుంటలోనూ, మరొకటి కాకినాడ జిల్లా తేటగుంటలోను ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ప్రవేశించే వాహనాల నుంచి పన్ను వసూలు, తాత్కాలిక పర్మిట్ జారీలతోపాటు మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనలను అరికట్టేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఈ అనుమతుల జారీ పేరుతో అక్కడి సిబ్బంది లంచాలు డిమాండ్ చేయడం సర్వసాధారణంగా మారింది. దీంతో ఈ విధానాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద అందించే సేవలు, అనుమతులను గతేడాది జూలై నుంచి ఆన్లైన్ ద్వారా జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడంతో రవాణా శాఖ కార్యాలయాలు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్దకు వచ్చే వాహనదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సులభంగా, పారదర్శకంగా అనుమతులు జారీ అవుతున్నాయి. ఆన్లైన్ విధానం లేని 2022–23లో వివిధ అనుమతుల జారీ కింద మొత్తం రూ.51.64 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాక 2023 జూలై నుంచి 2024 ఫిబ్రవరి వరకు వివిధ అనుమతుల జారీ కింద రూ.62.82 కోట్లు రావడం గమనార్హం. గతంలో అధికారిక అనుమతులు లేకుండా లంచాలు తీసుకుని మరీ వాహనాల ప్రవేశానికి అనుమతించేవారన్నది స్పష్టమవుతోంది. ఆన్లైన్ విధానం సరుకు రవాణా వాహనదారులకు సౌలభ్యంగా ఉండటంతోపాటు ప్రభుత్వ ఖజానాకు రాబడిని పెంచింది. ప్రయోజనాలు ఇవీ... ♦ సరుకు రవాణా వాహనాలను ఇక రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతుల కోసం నిలపాల్సిన అవసరం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ♦ ప్రస్తుతం సరుకు రవాణా వాహనాలు సగటున గంటకు 35 కి.మీ.మేర ప్రయాణిస్తున్నాయి. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు తొలగించడంతో సగటున గంటకు 55 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ♦ ప్రస్తుతం దేశంలో సరుకు రవాణా వాహనాలు రోజుకు సగటున 360 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో రోజుకు సగటున 1,200 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు తొలగించడంతో రాష్ట్రంలో రోజుకు సగటున 550 కి.మీ. దూరం ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుంది. దీంతో త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడంతోపాటు సరుకు రవాణా వ్యయం తగ్గుతుంది. -
ఏడుగురు డీటీసీలను బదిలీ చేసిన ప్రభుత్వం
-
రవాణా శాఖ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆదాయానికి మించి ఆస్తులు?
కర్నూలు: రవాణా శాఖ నంద్యాల కార్యాలయ పరిపాలన అధికారి(ఏఓ) సువర్ణ కుమారి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో ఆరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కర్నూలు కేంద్రీయ విద్యాలయానికి ఎదురుగా ఉన్న ధనలక్ష్మి నగర్లో ఆమె నివాసం ఉంటున్నారు. ఈమె సోదరుడు వరప్రసాద్ హైదరాబాద్, చెల్లెలు సుభాషిణి కర్నూలులోని రాగమయూరి, మరో సోదరి మార్కాపురంలో నివసిస్తున్నారు. వీరి ఇళ్లతో పాటు నంద్యాల ఆఫీసు, బనగానపల్లె (ఆర్టీఓ ఏజెంట్ రాజేంద్ర) ఇంట్లో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి గురువారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి నేతృత్వంలో సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, వంశీనాథ్, శ్రీనివాసరెడ్డి, ఇంతియాజ్, అపర్ణ, కృష్ణయ్య తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు. ఆమె నివాసముంటున్న ఇంట్లో దాదాపు రూ.10 లక్షల నగదు, 15 బ్యాంకు ఖాతాలు, భారీగా బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. ధనలక్ష్మి నగర్లో జి 1 ఇంటితో పాటు కర్నూలు ఆంధ్రా బ్యాంకులో లాకర్, ఆరు ప్రాంతాల్లో విలువైన ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. 2005లో రవాణా శాఖలో ఈమె స్టెనోగా విధుల్లో చేరారు. ఎక్కువ కాలం కర్నూలు డీటీసీ కార్యాలయంలో పనిచేశారు. ఈమెకు ఉన్న ఆస్తులు సక్రమమైనవా, అక్రమంగా సంపాదించారా అనే కోణంలో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉన్నట్లు డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు. -
కార్ల అమ్మకాలు రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఆటోల విక్రయాల్లోనూ వృద్ధి నెలకొంది. తద్వారా గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు పోల్చి చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయంలో 8.40 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు చూస్తే జాతీయ సగటును మించి రాష్ట్రంలో వృద్ధి చోటు చేసుకుంది. అలాగే ఇదే కాలానికి జాతీయ సగటును మించి రాష్ట్రంలో కార్ల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఇక ఆటోల అమ్మకాల్లో ఏకంగా 795.28 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు రవాణా ఆదాయం రూ.1,448.35 కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.1,570.07 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా గూడ్స్ వాహనాల అమ్మకాలు పడిపోగా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇతర రాష్ట్రాల్లో విధానాలపై అధ్యయనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో బాగుంటే వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. వాహనాల పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేíÙస్తున్నాం. కొనుగోలుదారులను ప్రోత్సహించేలా సంస్కరణలపై దృష్టి సారించాం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోళ్లు పెరిగాయి. రవాణా ఆదాయంలోనూ వృద్ధి నమోదవుతోంది. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ -
బస్సు నడిపిన పువ్వాడ..
ఇల్లెందు: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కాసేపు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా మారారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్ డిపోను మంత్రి ప్రారంభించారు. అనంతరం డ్రైవర్ సీట్లో కూర్చుని బస్సును కాసేపు నడిపారు. అంతకుముందు జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఖమ్మం సభలో రైతుల గురించి మాట్లాడారని, ఆయనకు ఆ అర్హత లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల రైతులు దేశ రాజధానిలో ఎన్నో రోజులు ఆందోళన చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, అలాంటి వారు రైతుల గురించి మాట్లాడడమా? అని ప్రశ్నించారు. ఆ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఇక డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులు
సాక్షి, అమరావతి: ఇక నుంచి పేపర్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, పేపర్ ఆర్సీ కార్డులుండవు. పేపర్ రహిత డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల దిశగా రాష్ట్ర రవాణా శాఖ ముందడుగు వేసింది. డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ప్రింట్ చేసి జారీ చేసే పాత విధానానికి స్వస్తి పలికింది. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ కార్డుల జారీ విధానానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా రవాణా శాఖ కీలక విధాన నిర్ణయం తీసుకుంది. డిజి లాకర్ /ఎం–పరివాహన్లోఇవి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా రవాణా శాఖ ప్రింటింగ్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను అందిస్తోంది. ఇందుకోసం దరఖాస్తుతో పాటు ఒక్కో కార్డుకు రూ.200 ఫీజు, రూ.35 పోస్టల్ చార్జీలు వసూలు చేస్తోంది. అయితే ఈ విధానానికి శుక్రవారం నుంచి రవాణా శాఖ ముగింపు పలికింది. దాదాపు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న 25 లక్షలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ప్రింటింగ్‌లో జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవలే రూ.33.39 కోట్లు కేటాయించింది. ఇక శనివారం నుంచి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల విధానం అమల్లోకి రానుంది. ఇక నుంచి దరఖాస్తుతో కార్డు కోసం రూ.200, పోస్టల్ చార్జీలకు రూ.35 వసూలు చేయరు. దరఖాస్తులను పరిశీలించి తగిన ప్రక్రియ అనంతరం డిజిటల్ విధానంలోనే వీటిని జారీ చేస్తారు. ప్రత్యేకంగా ఎం–పరివాహన్, డిజి లాకర్లో అందుబాటులో ఉంచుతారు. వాహనదారులు, దరఖాస్తుదారులు వాటిని డౌన్లోడ్ చేసుకుని తమ మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ అధికారులు అడిగితే ఆ డిజిటల్ ఫార్మాట్లో ఉన్న కార్డులను చూపితే సరిపోతుంది. మొబైల్ ఫోన్లు వాడనివారు ఆ కార్డులను ప్రింట్ తీసుకుని కూడా తమతో ఉంచుకోవచ్చు. వాటిని చూపినా అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. ఇక నుంచి రవాణా శాఖ జారీ చేసే అన్ని డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచుతారు. వాహనదారులకు సౌలభ్యం డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల జారీ విధానం వాహనదారులకు సౌలభ్యంగా ఉంటుంది. వారి నుంచి కార్డుల కోసం ఫీజులు కూడా వసూలు చేయం. అవసరమైన అన్ని కార్డులు డిజిలాకర్ విధానంలో మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకుంటే చాలు. – ఎంకే సిన్హా, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ -
నికర ఇన్వాయిస్ ధరను బట్టే లైఫ్ ట్యాక్స్
సాక్షి, అమరావతి: మోటారు కార్ల కొనుగోలు సమయంలో విధించే జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్).. వాహన నికర ఇన్వాయిస్ ధర (పన్నులు కలపక ముందు నిర్ణయించిన ధర) ఆధారంగానే ఉండాలని హైకోర్టు తెలిపింది. అంతేకానీ.. వాహన ఎక్స్ షోరూమ్ ధర (పన్నులన్నీ కలిపి నిర్ణయించిన ధర) ఆధారంగా కాదని స్పష్టం చేసింది. ఏపీ మోటారు వాహనాల ట్యాక్సేషన్ చట్టంలోని 6వ షెడ్యూల్ ప్రకారం లైఫ్ ట్యాక్స్‌ను వాహన ధర ఆధారంగానే వసూలు చేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఇద్దరు వాహనదారుల నుంచి అధికంగా వసూలు చేసిన లైఫ్ ట్యాక్స్ మొత్తాన్ని నాలుగు వారాల్లో వారికి వాపసు ఇవ్వాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. తాను కొనుగోలు చేసిన హ్యుందాయ్ వెన్యూ కారుకు వాహన ధర మీద కాకుండా నికర ఇన్వాయిస్ ధర మీద 14 శాతం పన్నును చట్టవిరుద్ధంగా వసూలు చేశారని విజయవాడకు చెందిన తలశిల సౌజన్య 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన నుంచి అదనంగా వసూలు చేసిన రూ.52,168 తిరిగి వాపసు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని విన్నవించారు. అలాగే ఇదే రీతిలో తన నుంచి అదనంగా వసూలు చేసిన రూ.1.16 లక్షలను వాపసు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విజయవాడకు చెందిన వల్లూరు పవన్ చంద్ 2021లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ సుజాత ఇటీవల తుది విచారణ జరిపారు. వాహన ధరపైనే లైఫ్ ట్యాక్స్.. రవాణా శాఖ తరఫు న్యాయవాది కోనపల్లి నర్సిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. లైఫ్ ట్యాక్స్‌ను వాహన ధరపైనే నిర్ణయిస్తారన్నారు. వాహన ధర అంటే డీలర్‌కు వాహన కొనుగోలుదారు చెల్లించే మొత్తమని.. ఇందులో జీఎస్టీ, సెస్ వంటివి కలిపి ఉంటాయని తెలిపారు. అందువల్ల పన్నులు కలిపిన మొత్తం మీదనే లైఫ్ ట్యాక్స్ విధించామన్నారు. ఇలా చేయడం ఎంత మాత్రం చట్టవిరుద్ధం కాదన్నారు. అంతేకాకుండా 1994లో రవాణా శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం వాహన ధర అంటే అన్ని పన్నులతో కలిపి చెల్లించే మొత్తమన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ల తరఫు న్యాయవాది చక్రవర్తి వాదనలతో ఏకీభవించారు. లైఫ్ ట్యాక్స్‌ను వాహన నికర ఇన్వాయిస్ ధర ఆధారంగానే వసూలు చేయాలని తేల్చిచెప్పారు. ఎక్స్‌షోరూం ధర వాహన ధర కాదు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎమ్మార్కే చక్రవర్తి వాదనలు వినిపిస్తూ.. వాహన ధర అంటే వాహనదారు డీలర్‌కు చెల్లించే మొత్తమన్నారు. ఈ ధర ఆధారంగానే డీలర్.. వాహనదారుకు వాహనాన్ని బదలాయిస్తారని తెలిపారు. అంతేతప్ప పన్నులన్నింటితో కలిపి చెల్లించే ఎక్స్ షోరూం ధర ఎంతమాత్రం వాహన ధర కాదన్నారు. హ్యుందాయ్ వెన్యూ ఇన్వాయిస్ ధర రూ.8,60,853 అని తెలిపారు. నిబంధనల ప్రకారం.. రూ.10 లక్షలకన్నా తక్కువ విలువ చేసే వాహనానికి 12 శాతం మాత్రమే లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీని ప్రకారం రూ.8.60 లక్షలకు 12 శాతం లెక్కన రూ.1,03,302 లైఫ్ ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుందని నివేదించారు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో ఎక్స్‌షోరూం ధరను రూ.11,10,500గా పేర్కొంటూ.. వాహన ధర రూ.10 లక్షలకు మించింది కాబట్టి 14 శాతం పన్ను చెల్లించాలని పిటిషనర్‌తో బలవంతంగా రూ.1,55,470ను లైఫ్ ట్యాక్గా కట్టించుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. తద్వారా రూ.52168 అదనంగా వసూలు చేశారన్నారు. అలాగే రెండో పిటిషనర్ వల్లూరు పవన్ చంద్‌కు చెందిన బీఎండబ్ల్యూ కారు విషయంలో కూడా ఇలాగే జరిగిందన్నారు. ఇన్వాయిస్ ధరపై కాకుండా ఎక్స్‌షోరూమ్ ధరపై 14 శాతం పన్ను వసూలు చేశారని తెలిపారు. ఇలా పవన్ చంద్ నుంచి రూ.1.16 లక్షలు అదనంగా పన్ను కట్టించుకున్నారని వివరించారు. -
అవినీతికి తావివ్వద్దు
పౌరులకు సేవలు అందించడంలో అత్యంత పారదర్శకత ఉండాలి. అవినీతిపై ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపై ఏసీబీ నంబర్లను ఆయా కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా హోర్డింగ్స్ తరహాలో ప్రదర్శించాలి. మానవ ప్రమేయాన్ని తగ్గించి, పారదర్శకతను పెంచే సాంకేతిక విధానాలపై అధ్యయనం చేసి.. వాటిని అమల్లోకి తీసుకు రావడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. అప్పుడే ప్రజలకు సత్వరం మంచి సేవలు అందుతాయి. ఉద్యోగుల్లో సమర్థత పెరగడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయమూ పెరుగుతుంది. వచ్చే సమీక్షా సమావేశం నాటికి మంచి మార్పులు కనిపించాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వ శాఖ లోనూ అవినీతికి తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రిజిస్ట్రేషన్లు, టౌన్ ప్లానింగ్ విభాగాలు, మండల కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు సహా అన్ని చోట్ల కూడా అవినీతికి ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి నిరోధక శాఖను మరింత క్రియాశీలకంగా ఉంచాలని సూచించారు. ఆదాయార్జన శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆదాయాలనుఆర్జించే శాఖల యంత్రాంగంలో మెరుగైన విధానాలు అమలు చేయడం ద్వారా సమర్థత పెంచాలని ఆదేశించారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. తద్వారా లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యంగా చక్కటి సేవలు అందుతాయని, ఆదాయాలు పెరుగుతాయని తెలిపారు. వీటన్నింటిపై అధ్యయనం చేసి, వచ్చే సమీక్షా సమావేశంలో తనకు నివేదించాలన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలను నివారించడానికి, వాటి పంపిణీని అడ్డుకోవడానికి అధికారులు మరింతగా దృష్టి సారించాలని చెప్పారు. ఇందులో భాగంగా యూనివర్సిటీలు, కాలేజీలు, విద్యా సంస్థల వద్ద కచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్ ఉండేలా హోర్డింగ్స్ ఉంచాలని, డ్రగ్స్ నివారణ కార్యక్రమాలు, టోల్ ఫ్రీ నంబర్ పనితీరుపై ప్రతి జిల్లాలో ప్రతి 15 రోజులకోసారి మాక్ డ్రిల్ చేపట్టాలని ఆదేశించారు. రవాణా శాఖలో మెరుగైన విధానాలు తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ సందర్భంగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర లక్ష్యాలు చేరుకున్నామనే విషయాన్ని, ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించుకున్న లక్ష్యాలను వివిధ శాఖలకు చెందిన అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో వృద్ధి ♦ గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనితీరు కనపరిచిందని ఆ శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో ఏపీ ఉందన్నారు. కర్ణాటకలో 27.51 శాతం, మహారాష్ట్రలో 24.4 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 25.29 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. ♦ 2022–23లో రాష్ట్రంలో వాణిజ్య పన్నుల ఆదాయం రూ.51,481 కోట్లుగా 93.24 శాతం లక్ష్యాన్ని చేరుకుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.60,191 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ♦ లీకేజీలను అరికట్టి, సమగ్ర పర్యవేక్షణ ద్వారా లక్ష్యాన్ని చేరుకునే మార్గాలపై దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, శాఖలతో సమన్వయం, ఎగవేతల పట్ల అప్రమత్తత, సమర్థతను పెంచుకునే పద్ధతుల ద్వారా పని తీరును మెరుగు పరుచుకుంటున్నామన్నారు. ♦ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ధి చెందినట్టుగా ఆ శాఖ అధికారులు తెలిపారు. ఏడాదికేడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూ వస్తోందన్నారు. 2018–19లో ఈ శాఖ ఆదాయం రూ.4,725 కోట్లు కాగా, 202–223 నాటికి రూ.8071 కోట్లకు చేరిందని తెలిపారు. గనుల ఆదాయంలో 26 శాతం వృద్ధి ♦ గత ఏడాదితో పోల్చితే గనుల ఆదాయంలో 26 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు వివరించారు. గనులు ఖనిజాల శాఖలో 2022–23లో రూ.4,500 కోట్లు లక్ష్యం కాగా, రూ.4,756 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ ఆర్థిక ఏడాది రూ.6 వేల కోట్ల మేరకు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తగ్గిన లిక్కర్, బీరు వినియోగం 2018–19తో పోలిస్తే 2022–23లో లిక్కర్, బీరు వినియోగం 12.61 శాతం తగ్గుముఖం. 2018–19లో 384.3 లక్షల కేసుల లిక్కర్ వినియోగం. 2022–2౩లో 335.9 లక్షల కేసుల లిక్కర్ వినియోగం. 2018–19లో 277.1 లక్షల కేసుల బీరు వినియోగం. 2022–23లో 116.7 లక్షల కేసులు బీరు వినియోగం. 2018–19తో పోలిస్తే 2022–23లో 57.87 శాతం తక్కువగా బీరు వినియోగం. ♦ రవాణా శాఖలో 2022–23లో ఆదాయం రూ.4,294.12 కోట్లు వచ్చిందని, తద్వారా 95.42 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. 2018–19లో రూ.3,224.98 కోట్ల ఆదాయం ఉండగా, 2023–24 లో రూ.6,999.42 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ♦ ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం (ఎక్సైజ్) నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, స్పెషల్ సీఎస్‌లు నీరబ్‌కుమార్ ప్రసాద్, రజత్ భార్గవ, భూగర్భ గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా, రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, పీసీసీఎఫ్ వై.మధుసూదన్‌రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి గుల్జార్, రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, పురపాలక శాఖ కమిషనర్ కోటేశ్వరరావు, స్టాంప్, రిజిస్ట్రేషన్స్ కమిషనర్ రామకృష్ణ, సేల్స్ టాక్స్ స్పెషల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్, అడిషనల్ డీజీలు ఎన్.సంజయ్, రవిశంకర్ అయ్యన్నార్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, మైన్స్ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
స్క్రాప్‌గా మార్చి.. కొత్త ఆటోలు తెచ్చి..!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో కాలంచెల్లిన ఆటోరిక్షాలను స్క్రాప్‌గా మార్చి ఆ పర్మిట్లపై కొత్త ఆటోలను తీసుకొనే విధానంపై ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తేసేందుకు రవాణాశాఖ సిద్ధమైంది. పాత పర్మిట్లపై కొత్త ఆటోలు పొందే విషయంలో భారీ అక్రమాలు జరిగాయంటూ గతంలో ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ విధానం అమలును నిలిపివేస్తూ గతేడాది డిసెంబర్లో రవాణాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. కానీ ఇప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలతో మళ్లీ పాత పద్ధతిని అమల్లోకి తెస్తున్నట్లు మరో ఆదేశాన్ని జారీచేసి దాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. వేలల్లో అక్రమాలు... కాలంచెల్లిన ఆటో రిక్షాలను తుక్కుగా మార్చి ఆ పర్మిట్ల ఆధారంగా కొత్త ఆటోలు తీసుకొనే పద్ధతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాన్ని తీసుకోకపోవడాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు బ్రోకర్లు, రవాణా శాఖ అధికారుల అండదండలతో భారీ అక్రమాలకు తెరలేపారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిజానికి తుక్కుగా మార్చిన ఆటోరిక్షా ఛాసిస్‌ను మూడు ముక్కలు చేయాల్సి ఉంటుంది. కానీ దాన్ని తుక్కుగా మార్చినట్లు రికార్డుల్లో చూపుతూ తక్కువ ధరలకు ఆ ఆటోను మరొకరికి విక్రయించే వారన్నది ఆరోపణ. అటు పాత ఆటో పర్మిట్ లేకుండా తిరుగుతుండగా దాని పర్మిట్‌తో మరో కొత్త ఆటో రోడ్డెక్కేదని ఫిర్యాదుల సారాంశం. అలా దాదాపు 8 వేల వరకు ఆటోలు అక్రమంగా తిరుగుతున్నాయంటూ కొన్ని ఆటో సంఘాలు కూడా ఫిర్యాదు చేశాయి. ఆ ఫిర్యాదుల ఒత్తిడితో అధికారులు ఆ పద్ధతిని నిలిపేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్క్రాప్ పాలసీని అమలులోకి తెస్తామంటూ అప్పట్లో అధికారులు చెప్పారని యూనియన్ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఆ విధానమంటూ లేకుండానే పాత పద్ధతిని పునరుద్ధరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో వేల సంఖ్యలో ఆటోరిక్షాలు అక్రమంగా తిరిగేందుకు అవకాశం కల్పించిన అధికారులపై చర్యలు తీసుకోకుండా పాత పద్ధతిని పునరుద్ధరిస్తున్నారంటూ ఆటోరిక్షా యూనియన్ నేత దయానంద్ తాజాగా లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. అయితే ‘పాత పద్ధతినే పునరుద్ధరిస్తున్నప్పటికీ తుక్కుగా మార్చిన ఆటోరిక్షా ఫొటోలను తీయాలని, ఆటో ఛాసీస్ను మూడు ముక్కలు చేయాలని, ఆ వివరాలు పొందుపరచాలని నిబంధన లు విధించాము, వాటిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశాము’ అంటూ ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
సిబిల్ స్కోర్ తరహాలోనే.. డ్రైవింగ్‌కూ స్కోర్! కేంద్రం కీలక నిర్ణయం?
సిబిల్ స్కోర్ తరహాలోనే డ్రైవింగ్‌కూ స్కోరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే బ్యాంకులు అంత సులువుగా రుణాలు ఇస్తాయి. అలాగే డ్రైవింగ్ స్కోర్ ఎక్కువ ఉంటే వాహనాల బీమా, కొత్త వాహనాల కొనుగోలులో రాయితీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. రహదారి భద్రతలో భాగంగా కేంద్రం ఈ వినూత్న విధానాన్ని తెరపైకి తెచ్చింది. త్వరలోనే దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించింది. – సాక్షి, అమరావతి ప్రమాదాలను తగ్గించేలా.. దేశంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం 2021లో దేశంలో 4.12 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 1.53 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 3.84 లక్షల మంది గాయపడ్డారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే 70 శాతం ప్రమాదాలు జరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రహదారి భద్రత లక్ష్యాలు సాధించాలంటే డ్రైవర్లకు తగిన అవగాహన కల్పించడం.. వారిని నియంత్రించడం ప్రధానమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ క్రమశిక్షణను ఎప్పటికప్పుడు అంచనా వేసే వ్యవస్థను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ‘రహదారి భద్రతా ప్రణాళిక 2.0’ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దేశంలో డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారంతా దీని పరిధిలోకి వస్తారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర భారీ వాహనాల డ్రైవర్ల క్రమశిక్షణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానాలు, రోడ్డు ప్రమాదాలకు కారణమైన సందర్భాలు, పోలీసులు నమోదు చేసిన కేసులు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా డ్రైవింగ్ క్రమశిక్షణకు స్కోర్ ఇస్తారు. స్కోర్ ఆధారంగా ప్రోత్సాహకాలు డ్రైవింగ్ క్రమశిక్షణ స్కోర్ బాగున్నవారికి వాహన బీమాలో రాయితీలిస్తారు. స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే బీమా ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా ధరలో రాయితీ ఇస్తారు. వీటిపై కేంద్ర రవాణా శాఖ వాహనాల తయారీ కంపెనీలు, బీమా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని ఢిల్లీలో అమలు చేయాలని భావిస్తున్నారు. లోటుపాట్లను సరిదిద్దుకుని 2025 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఏడీఏఎస్ ఏర్పాటు.. రెండో దశలో కార్లు, ఎస్‌యూవీలు, ఇతర భారీ వాహనాల్లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం(ఏడీఏఎస్)ను ఏర్పాటు చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడే ఏడీఏఎస్ వ్యవస్థ కోసం కాస్త అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొనుగోలు చేసిన వాహనాల యజమానులు కూడా ఏడీఏఎస్ను తమ వాహనాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇది డ్రైవర్ నావిగేషన్‌కు సహకరిస్తుంది. అలాగే డ్రైవింగ్ సీటులో ఎవరు ఉన్నారో రికార్డు చేస్తుంది. తద్వారా క్రమశిక్షణారహితంగా వాహనం నడిపినప్పుడు, ప్రమాదానికి గురైనప్పుడు ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఏడీఏఎస్ను ఇప్పటికే విద్యుత్ వాహనాల్లో ప్రవేశపెట్టారు. త్వరలో పెట్రోల్, డీజీల్ వాహనాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏడీఏఎస్ సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని డ్రైవింగ్ క్రమశిక్షణ స్కోర్‌ను నిర్ణయిస్తారు. -
వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు భలే క్రేజ్.. ఒక్కరోజే 31 లక్షల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ పెరిగింది. వాహనదారులకు ఇష్టమైన నంబర్‌తో పాటు, లక్కీ నంబర్, పుట్టిన తేదీ, కలిసి వచ్చే నంబర్‌తో గుర్తింపు దక్కాలని చూస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టి తమకు కావాల్సిన నంబర్లను వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. సాధార ణంగా వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రవాణా శాఖకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంటే.. ఫాన్సీ నంబర్ల ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. తాజాగా ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. ప్రతి సిరీస్‌లో ఎంతో డిమాండ్ ఉండే ఆల్‌నైన్ ఈసారి కూడా అ‘ధర’హో అనిపించింది. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ‘టీఎస్ 09 ఎఫ్‌జడ్ 9999’ నెంబర్‌కు ప్రీమియర్ ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రూ.9,50,999 చెల్లించి సొంతం చేసుకుంది. అలాగే ‘టీఎస్ 09 జీఏ 0001’ నెంబర్ కోసం రాజేశ్వరి స్కిన్ అండ్ ఎయిర్క్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ వేలంలో రూ.7,25,199 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీఎస్09 జీఏ 0009’ నెంబర్ కోసం ఎం.వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2.20,111 చెలించింది. ‘టీఎస్09 జీఏ 0007’ నెంబర్ కోసం స్నేహ కైనెటిక్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,35,007 చెల్లించి నెంబర్‌ను దక్కించుకుంది. ‘టీఎస్ 09 జీఏ 0003’ నెంబర్ కోసం ధని కన్సల్టేషన్స్ ఎల్ఎల్పీ రూ.1,35,000 చెల్లించి సొంతం చేసుకుంది. ప్రత్యేక నెంబర్లపైన శుక్రవారం ఒక్క రోజే రూ.31,66,464 లభించినట్లు హైదరాబాద్ జేటీసీ పాండురంగ్‌నాయక్ తెలిపారు. -
త్వరలో ఆర్టీసీ ‘జీవా’జలం!
సాక్షి, హైదరాబాద్: సొంతంగా మంచినీటిని తయారు చేసి బస్టాండ్లలో విక్రయించడంతోపాటు మార్కెట్లోకి కూడా విడుదల చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆకట్టుకునే రీతిలో మంచినీటి సీసా డిజైన్‌ను రూపొందించింది. దీనికి ప్రకాశం, కాంతి అన్న అర్ధంలో వినియోగించే జీవా (జెడ్‌ఐవీఏ) అన్న పేరును ఖరారు చేసింది. దీనికి జీవం అన్న మరో అర్థం కూడా ఉండటం విశేషం. ‘స్ప్రింగ్ ఆఫ్ లైఫ్’అన్న ట్యాగ్‌ను దీనికి జతచేసింది. మరో వారం పది రోజుల్లో ఈ బ్రాండ్ మంచినీటిని ఆర్టీసీ విడుదల చేస్తోంది. తొలుత అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో వీటిని అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత క్రమంగా విస్తరించాలని నిర్ణయించింది. నకిలీలను నియంత్రించి.. ఆర్టీసీ బస్టాండ్లలో ఉండే దుకాణాల్లో మంచినీటి సీసాల విక్రయం విరివిగా సాగుతుంది. అదే వేసవిలో అయితే వాటి వినియోగం చాలా ఎక్కువ. దీంతో దుకాణదారులు రూ.20కి విక్రయించాల్సిన లీటరు నీటి సీసాను రూ.25–30కి అమ్ముతుంటారు. బ్రాండెడ్ పేర్లను పోలిన ‘నకిలీ’కంపెనీ నీళ్లు విక్రయిస్తుంటారు. ఇటీవలే వీటిని నియంత్రించిన ఆర్టీసీ ఇప్పుడు బ్రాండెడ్, ఐఎస్ఐ అధీకృత లోకల్ కంపెనీ నీళ్లు మాత్రమే అందుబాటులో ఉండేలా చేయగలిగింది. ఈ తరుణంలోనే తనే సొంతంగా నీటి విక్రయాలను ప్రారంభించాలన్న ఆలోచనను సాకారం చేసుకుంటోంది. పేటెంట్ కోసం దరఖాస్తు ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా అరలీటరు నీటి సీసాలను అందిస్తోంది. ఇందుకోసం ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక కార్యాలయాలు, ఇతర అవసరాలకు కూడా భారీగా ప్యాకేజ్డ్ నీటిని కొంటోంది. ఇందుకు సాలీనా రూ.5.15 కోట్ల ఖర్చును చూపుతోంది. ఇంత భారీ ఖర్చును తనే పెట్టుబడిగా మార్చుకుంటే సొంతంగా నీటిని మార్కెట్లోకి తేవచ్చన్న యోచనతో రెండు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీలు ఆకర్షణీయ సీసాల్లో నాణ్యమైన నీటిని నింపి ఆర్టీసీకి అందజేస్తాయి. వాటిని ఆర్టీసీ మార్కెటింగ్ చేసుకుంటుంది. ఇలా ఇతర కంపెనీల ధరలతో సమంగా లీటరు నీటికి రూ.20 ధరను ఖరారు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా అందించేందుకు అర లీటరు సీసాలను అందుబాటులో ఉంచుతారు. బస్టాండ్లలోని దుకాణాల్లో మాత్రం లీటరు పరిమాణంలోని నీటి సీసాలను ఉంచుతారు. కాగా జీవా పేరుతో తెస్తున్న ఈ బాటిళ్లకు ‘స్ప్రింగ్ ఆఫ్ లైఫ్’అన్న ట్యాగ్‌లను పెట్టింది. పేరుకు, బాటిల్ డిజైన్‌కు ఆర్టీసీ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్టు తెలిసింది. ఆర్టీసీ బస్టాండ్లతోపాటు మార్కెట్లోనూ ఈ సీసాలను అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పుడు ఒప్పందం మేరకు వేరే కంపెనీ నీటిని కొనేందుకు చేస్తున్న రూ.5 కోట్ల ఖర్చును లేకుండా చేసుకోవటంతోపాటు సాలీనా కనీసం రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు ఆదాయం పొందాలని భావిస్తోంది. -
జేసీ బ్రదర్స్‌కు ఈడీ షాక్
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. బీఎస్ 3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ బ్రదర్స్‌కు చెందిన రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ రోడ్‌లైన్స్, జటాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆయన వ్యాపార భాగస్వామి సి.గోపాల్‌రెడ్డి కుటుంబానికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. రూ.6.31 కోట్ల నగదు, బ్యాంకులో మరికొంత నగదు, బంగారు ఆభరణాలతోపాటు రూ.15.79 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. టీడీపీ సీనియర్ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి కుటుంబాలు సుప్రీం కోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా దర్జాగా అక్రమ దందాకు పాల్పడ్డాయి. బీఎస్ 3 వాహనాలను సుప్రీం కోర్టు నిషేధించింది. అయినా జేసీ కుటుంబం అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన 154 బీఎస్ 3 మోడల్ బస్సులు, లారీలను తుక్కు పేరుతో కొన్నది. జటాధర ఇండస్ట్రీస్ పేరున 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి అండ్ కో పేరున 104 వాహనాలను కొన్నారు. నిబంధనల ప్రకారం బీఎస్ 3 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయరు. దాంతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి, వాటిని బీఎస్ 4 వాహనాలుగా ఆ పత్రాల్లో పేర్కొన్నారు. అనంతరం ఫోర్జరీ పత్రాలతో నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించి, ఎన్వోసీ పొందారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే ఆ బస్సులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు, తెలంగాణలో 33, కర్ణాటకలో 15, తమిళనాడులో ఒకటి, ఛత్తీస్‌గఢ్‌లో ఒక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నారు. మరో మూడు వాహనాలు ఎక్కడ ఉన్నాయన్నది తెలియలేదు. ఆ వాహనాల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. అంతేకాదు ఆ వాహనాల్లో కొన్నింటిని అక్రమంగా ఇతర రాష్ట్రాల్లోని వారికి విక్రయించేశారు. అలా విక్రయించాలంటే పోలీసుల నుంచి ఎన్వోసీ పొందాలి. కానీ స్థానిక పోలీసు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్వోసీలు సృష్టించి మరీ అమ్మేశారు. వాటిని కొన్న వారు తాము మోసపోయామని గుర్తించి అనంతపురంలోని రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారించిన అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు 2020 జూన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డితో పాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్‌పై విడుదల అయ్యారు. వాహనాల బీమాలోనూ ఫోర్జరీకి పాల్పడ్డట్టు దర్యాప్తులో వెల్లడైంది. సమగ్ర సమాచారం కోసం పోలీసులు ‘నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎన్ఐసీ)’ రికార్డులను పరిశీలించగా, బీమా పత్రాలన్నీ నకిలీవని వెల్లడైంది. జేసీ కుటుంబం అక్రమాలపై ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని సూచిస్తూ రాష్ట్ర రవాణా శాఖ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. సమగ్ర దర్యాప్తు కోసం ఈడీని రంగంలోకి దింపింది. కొన్ని నెలల క్రితం ఈడీ అధికారులు అనంతపురం రవాణా శాఖ అధికారుల నుంచి ఆధారాలు, కీలక పత్రాలను తీసుకున్నారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి, సి.గోపాల్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో, అనంతపురం జిల్లా తాడిపత్రితోపాటు హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మరిన్ని కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి ఫోన్లను కూడా జప్తు చేశారు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు, ఫోర్జరీ ఎన్వోసీలతో వాహనాల కొనుగోలు, అమ్మకాల వెనుక భారీగా నల్లధనం చేతులు మారినట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. మనీ లాండరింగ్ చట్టాలను ఉల్లంఘించిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డిలను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో ఇటీవల విచారించారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసిన ఈడీ అధికారులు జేసీ బ్రదర్స్ కుటుంబానికి చెందిన రూ.22.10కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అశోక్ లేలాండ్లో కొందరి పాత్రపైనా ఈడీ ఆరా బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక అశోక్ లేలాండ్ కంపెనీ పాత్ర ఉండొచ్చని ఈడీ భావిస్తోంది. ఆ కంపెనీకి చెందిన కొందరి సహకారంతోనే ఈ దందా సాగించినట్టు ప్రాథమికంగా గుర్తించింది. దాంతో అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులను కూడా విచారించాలని ఈడీ నిర్ణయించింది. -
గ్రానైట్ దందాపై కన్నెర్ర
అధిక లోడుతో గ్రానైట్‌ను రవాణా చేస్తున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు కన్నెర్ర చేశారు. జిల్లా వ్యాప్తంగా కొద్దిరోజులుగా పోలీస్, విజిలెన్స్ శాఖల అధికారుల సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్‌ను తరలిస్తూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. దీంతో అధికారులు పలు వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.20 లక్షలకు పైగా అపరాధ రుసుం వసూలు చేశారు. తనిఖీల్లో కొన్ని వాహనాలు మాత్రమే పట్టుబడుతుండగా అధికారుల కళ్లుగప్పి వెళ్లిపోతున్న పరిస్థితి కూడా ఉంది. నెల్లూరు(టౌన్): మన రాష్ట్రంలో లభించే గ్రానైట్‌కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీమకుర్తి, గురుజేపల్లి, బల్లికురువ, శ్రీకాకుళం టెక్కలి, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి నెల్లూరు మీదుగా కృష్ణపట్నం, చెన్నై, హొసూరు, బెంగళూరు ప్రాంతాలకు నిత్యం 200కు పైగా గ్రానైట్ వాహనాలు వెళ్తుంటాయి. వాటిలో అధికశాతం ఓవర్ లోడుతో ఉంటాయి. గ్రానైట్‌ను ఎక్కువగా 22 చక్రాల లారీలు రవాణా చేస్తుంటాయి. ఒక్కో దాంట్లో 57.750 టన్నుల సరుకు మాత్రమే రవాణా చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు యజమానులు 90 నుంచి 100 టన్నుల వరకు రవాణా చేయిస్తుంటారు. అధిక లోడు కారణంగా వాహనం అదుపులో ఉండదని అధికారులు చెబుతున్నారు. కాగా తనిఖీల్లో ఓవర్ లోడు ఉన్నట్లు గుర్తిస్తే ప్రాథమికంగా రూ.20 వేలు, దీంతోపాటు వాహన పరిమితికి మించి అధికంగా ఉంటే ఒక్కో టన్నుకు రూ.2,000 చొప్పున అపరాధ రుసుం విధిస్తున్నారు. తనిఖీల సమయంలో రోడ్డుపై వాహనాన్ని ఆపి డ్రైవర్ కనిపించకుండా వెళ్తే దానికి రూ.40 వేలు ఫైన్ వేస్తున్నారు. ఆ వాహనాన్ని ఫొటో తీసి రవాణా శాఖ వెబ్సైట్లో ఉంచుతారు. అక్కడే కేసులు రాస్తే.. అధిక లోడుతో వస్తున్న వాహనాలు అవి మొదలయ్యే పాయింట్లలోనే కేసులు నమోదు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల్లూరులో ఆపి తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుండడంతో యజమానులు దుర్భాషలాడుతున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిస్తున్నారని చెబుతున్నారు. కాగా అధిక లోడుతో తిరుగుతున్న గ్రావెల్, మట్టి, ఇసుక తదితర వాహనాలపై కూడా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. వాటిపై కూడా కేసులు నమోదు చేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. దెబ్బతింటున్న రోడ్లు అధిక లోడుతో వాహనాలు వెళ్తుండడంతో జాతీయ, రాష్ట్ర రహదారులు దెబ్బతింటున్నాయి. దీనికితోడు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులే చెబుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలపై నేషనల్ హైవే అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో అధిక లోడు గ్రానైట్ వాహనాల వల్లే రహదారులు దెబ్బతినడంతోపాటు ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్రానికి నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి నెల్లూరు జిల్లా వరకు యాక్సిడెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇక్కడ అధిక లోడు వాహనాలను అరికడితే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు నివేదించారు. తనిఖీలు ముమ్మరం జిల్లా మీదుగా అధిక లోడుతో వెళ్తున్న వాహనాలపై కొద్దిరోజులుగా రవాణా శాఖ, పోలీసు, విజిలెన్స్ శాఖ అధికారులు సమన్వయంతో తనిఖీలను ముమ్మరం చేశారు. అయితే పట్టుబడుతున్న వాహనాల సంఖ్య బాగా తక్కువగా ఉంటోంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో 234 వాహనాలను పట్టుకుని రూ.కోటికి పైగా అపరాధ రుసుము విధించి వసూలు చేశారు. వాటిలో అధిక శాతం గ్రానైట్ లారీలే ఉన్నాయి. అధిక లోడు వాహనాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించి కేసులు నమోదు చేస్తే సర్కారుకి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుంటాం ఓవర్‌లోడుతో వెళ్లే వా హనాలపై ప్రత్యేక దృష్టి సారించాం. జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.1.38 కోట్ల లక్ష్యాన్ని విధించింది. దీనిని చేరుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు మా వంతు కృషి చేస్తాం. – బి.చందర్, ఉపరవాణా కమిషనర్, నెల్లూరు