సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీఏలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది.మరి కొద్ది రోజుల బదిలీల ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో వివిధ కేటగిరీల్లో పని చేసే ఉద్యోగులు ఆప్షన్ల ఎంపికలో తలమునకలయ్యారు. ఈ నెల 7, 9 తేదీల్లో రెండు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించి 15 నాటికి బదిలీలను పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీల జాబితాలో ఉన్న ఉద్యోగులంతా తమకు నచ్చిన స్థానాల కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో పని చేస్తున్న పలువురు అధికారులు హైదరాబాద్‌లోనే ఉండేందుకు పావులు కదుపుతున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకే తమ బదిలీ పరిమితం కావాలని కోరుకుంటున్నారు.
మరోవైపు వివిధ జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులు సైతం బదిలీపై హైదరాబాద్‌కే రావాలని కోరుకుంటుండటంతో రవాణాశాఖలో బదిలీల అంశం ఆసక్తికరంగా మారింది. ఆప్షన్ల ఎంపికలోనూ పలువురు ఈ మూడు జిల్లాలకే ప్రాధాన్యతనిచ్చారు. పరిపాలనా అధికారులు, సీనియర్ అసిస్టెంట్‌లు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, జూనియర్ అసిస్టెంట్‌లు, తదితర కేటగిరీల్లో సుమారు 125 పోస్టులు ఉన్నాయి. బదిలీకి 2 ఏళ్ల కాలపరిమితిని కనీస అర్హతగాను, 5 ఏళ్లను గరిష్టంగానూ ప్రభుత్వం నిర్ధేశించిన సంగతి తెలిసిందే. ఒకే చోట 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బదిలీ తప్పనిసరి కావడంతో హైదరాబాద్‌కే పరిమితయ్యేలా ఎవరి స్థాయిలో వారు ప్రయత్నిస్తున్నారు.
మెడికల్ సర్టిఫికెట్‌ల కోసం పోటీ....
ఈ క్రమంలో మరో రెండు, మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్న కొందరు సీనియర్లు మెడికల్ సర్టిఫికెట్‌ల కోసం వైద్యులను ఆశ్రయిస్తున్నారు. దూరప్రాంతాల్లో పని చేయలేని అశక్తతను, తాము ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను ధృవీకరించే సర్టిఫికెట్‌లతో అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఒక్క ఆరో జోన్ పరిధిలోనే 30 మందికి పైగా పరిపాలనా విభాగానికి చెందిన ఉద్యోగులు, మరో 10 మంది హెడ్‌కానిస్టేబుళ్లు బదిలీ కావలసి ఉంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో బదిలీ అయ్యే జూనియర్ అసిస్టెంట్‌లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. జోనల్ స్థాయి బదిలీలు తప్పనిసరైన వారు పొరుగు జిల్లాలకు వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. ‘‘ గత 10 ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్నాను. మరో 2 ఏళ్లలో రిటైర్ అవుతాను. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాను.
ఈ పరిస్థితుల్లో ఎక్కడికో వెళ్లడం పనిష్‌మెంట్ వంటిదే..’’ అని నగరంలోని ఒక ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పని చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీల పట్ల విముఖత చూపుతున్న మరి కొందరు ఉద్యోగులు పిల్లల చదువులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘ పిల్లలను స్కూళ్లలో చేర్పించాం. ఫీజులు కట్టాం. యూనిఫాంలు, బుక్స్ తీసుకున్నాం, క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో మరో చోటుకు ఎలా వెళ్లగలం. ఏప్రిల్, మే నెలల్లోనే బదిలీలు పూర్తి చేసి ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా...’’ అని అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
ఉద్యోగసంఘాల నాయకులకు
ఊరట దక్కేనా...
మరోవైపు ఉద్యోగ సంఘాల నాయకులు సైతం బదిలీల పట్ల ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది హైదరాబాద్‌కే పరిమితయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగ సం ఘంలో గత ఆరేళ్లుగా ఒకేవిధమైన బాధ్యతల్లో ఉ న్నవారిని మాత్రం వారు కోరుకున్న చోటనే వి ధులు నిర్వహించేందుకు అనుమతించాలని నిర్ణయించారు. మరి కొందరు ఏదో ఒక విధంగా ఉద్యోగసంఘాల నేతల నుంచి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో నగరంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో బదిలీలే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
పారదర్శకంగా బదిలీలు...
బదిలీలను పారదర్శకంగా నిర్వహించేందుకు రవాణాశాఖలో మొట్టమొదటిసారి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ చైర్మన్‌గా మరో ఇద్దరు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. గతంలో జోనల్ స్థాయి బదిలీలకు సంబంధిత జోనల్ ఇన్‌చార్జి అధికారికే బాధ్యతలు ఉండేవి. ఇందుకు విరుద్దంగా ఈ సారి కమిటీయే అన్ని రకాల బదిలీలను చేపడుతుంది. ఈ క్రమంలో ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా పూర్తిస్థాయిలో పారదర్శకంగా బదిలీలను పూర్తి చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఈ విషయంలో ఉద్యోగులు నిశ్చింతగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment