డ్రైవింగ్ స్కూళ్లే అడ్డాలు
సాక్షి,సిటీబ్యూరో : రవాణాశాఖలోని పౌరసేవలను పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన ఆన్లైన్ లక్ష్యం నీరుగారుతోంది.లర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్స్ లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు తదితర కార్యకలాపాలను వినియోగదారులు ఆన్లైన్లో నమోదు చేసుకొని మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పౌరసేవలను పొందేందుకు ఏర్పాటు చేసిన ఈ సదుపాయం యదావిధిగా మధ్యవర్తులు, దళారుల అక్రమార్జనకు ఊతంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎలాంటి గుర్తింపు,అనుమతి లేకుండా అడ్డగోలుగా వెలిసిన డ్రైవింగ్ స్కూళ్లు దళారులకు అడ్డాలుగా మారాయి. ఆన్లైన్లో స్లాట్‌లు నమోదు చేయడం మొదలు వినియోగదారులకు డ్రైవింగ్ లైసెన్స్ చేతికి వచ్చే వరకు ఈ నకిలీ స్కూళ్లే తతంగం నడిస్తున్నాయి. ఏజెంట్‌లు, డ్రైవింగ్ స్కూళ్లు,ఆర్టీఏ అధికారులు ఒక వ్యవస్థీకృతమైన సంస్థగా ఏర్పడి ఈ అక్రమదందాకు పాల్పడుతున్నారు.
ప్రహసనంగా ఆన్లైన్..
మధ్యవర్తుల ప్రమేయాన్ని నిరోధించే లక్ష్యంతో రవాణాశాఖ ప్రతిష్టాత్మకంగా ఆన్లైన్ సేవలను అమలులోకి తెచ్చించిది. సుమారు 63 రకాల పౌరసేవల కోసం వినియోగదారులు ఈ సేవ కేంద్రాల్లో, ఆన్లైన్ సెంటర్‌లో స్లాట్ నమోదు చేసుకొని నిర్ణీత తేదీ, సమయం ప్రకారం ఆర్టీఏను సంప్రదించాలి, అయితే దళారులు వినియోగదారులతో బేరమాడుకొని రంగంలోకి దిగుతున్నారు. ఆన్లైన్లో స్లాట్ నమోదు చేయడం నుంచి పౌరసేవలు పూర్తయ్యే వరకు వినియోగదారుల నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. ఇందుకు అక్రమార్జనే ధ్యేయంగా వెలసినడ్రైవింగ్ స్కూళ్లు అడ్డాలుగా మారుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీఏ గుర్తింపు పొందిన స్కూళ్లు 2500 వరకు ఉండగా ఎలాంటి అనుమతి లేని, దళారులు తమ కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసుకున్నవి 6 వేలకు పైగా ఉన్నట్లు అంచనా. డ్రైవింగ్ స్కూళ్లపై ఆర్టీఏ నిఘా, నియంత్రణ లేకపోవడంతో ఇవి పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇలాంటి డ్రైవింగ్ స్కూళ్లనే రాచమార్గంగా ఎంచుకున్న కొందరు ఎంవీఐలు,ఆర్టీఓలు రహదారి భద్రతా చట్టాలను, ప్రమాణాలను గాలికొదిలి విచ్చలవిడిగా లైసెన్స్ లు ఇచ్చేస్తున్నారు.
కొరవడుతున్న నియంత్రణ ....
గ్రేటర్‌లోని కొండాపూర్, మేడ్చల్, ఉప్పల్, నాగోల్ డ్రైవింగ్, ఇబ్రహీంపట్నం టెస్ట్ కేంద్రాల నుంచి వాహనదారులకు రవాణాశాఖ డ్రైవింగ్ లైసెన్స్ లను అందజేస్తోంది. వీటితో పాటు ఖైరతాబాద్, అత్తాపూర్, మెహదీపట్నం, సికింద్రాబాద్, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్, కూకట్‌పల్లి, తదితర కార్యాలయాల్లో లెర్నింగ్ లైసెన్స్ లు ఇస్తారు. నిబంధనల ప్రకారం కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేవాళ్లు స్థానిక ఆర్టీఓ కేంద్రం నుంచి లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. అనంతరం డ్రైవింగ్‌లో నాణ్యమైన శిక్షణ తీసుకొని శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లకు వెళ్లాలి.కానీ ఈ నిబంధనల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోవడం లేదు.లెర్నింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో స్లాట్ నమోదు చేయడం నుంచి పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ల వరకు అభ్యర్ధుల శిక్షణ , నైపుణ్యంతో నిమిత్తం లేకుండా ఈ నకిలీ డ్రైవింగ్ స్కూళ్ల సిఫార్సు మేరకు అధికారులు లైసెన్సులు ఇచ్చేస్తున్నారు.
ఇలా దోపిడీ...
ఆర్టీఏ నిబంధనల మేరకు రూ.60 చెల్లించి ఎల్‌ఎల్‌ఆర్ తీసుకోవచ్చు. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం చెల్లించవలసిన ఫీజు రూ.465లు. కానీ డ్రైవింగ్ స్కూళ్లు వాహనదారుల నుంచి రూ.5000 నుంచి రూ.7000 ల వరకు వసూలు చేస్తున్నాయి. అన్నీ తామే పూర్తి చేస్తామంటూ వాహనదారులపై నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి.నెల రోజుల వ్యవధిలోనే లైసెన్స్ఇప్పిస్తామని మోసానికి పాల్పడుతున్నాయి. ఐటీఐ పూర్తి చేసి,డ్రైవింగ్‌లో అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే శిక్షణ ఇవ్వాలనే నిబంధన కానీ, ప్రతి ఐదేళ్లకోసారి స్కూళ్లు తమ అనుమతులను పునరుద్ధరించుకోవాలనే నిబంధనలు, డ్రైవింగ్ పై సైద్ధాంతిక శిక్షణనిచ్చే తరగతి గదుల నిబంధన గాలికి వదిలేసి డ్రైవింగ్ స్కూళ్ల పేరిట దళారులుగా మాత్రమే పని చేస్తున్నాయి.