పనితీరు బావుంటే డ్రైవర్‌ పోస్టు | Driver Post if Performance is good | Sakshi
Sakshi News home page

పనితీరు బావుంటే డ్రైవర్‌ పోస్టు

Published Mon, May 20 2019 1:49 AM | Last Updated on Mon, May 20 2019 1:49 AM

Driver Post if Performance is good - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అస్తవ్యస్థ డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అద్దె బస్సు డ్రైవర్ల ను దారిలో పెట్టేందుకు రవాణా శాఖ చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం అద్దె బస్సులను తగ్గించే పరిస్థితి లేనందున తప్పక వాటిని కొనసాగించాల్సిన పరిస్థితి. దీంతో వాటిని నడుపుతున్న డ్రైవర్లను గాడిలో పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గత కొన్నిరోజులుగా అద్దె బస్సులు వరసగా ప్రమాదాలకు గురవుతుండటంతో నిర్లక్ష్యంగా బస్సులు నడిపే వారి పై చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతోపాటు, వారికి తాయిలం ప్రకటిస్తే పరివర్తన వస్తుందన్న అధికారుల సూచనకూ సానుకూలంగా స్పందించారు.

వారికి ఉద్యోగ భద్రత కల్పించటమే సమస్యకు పరిష్కారంగా అధికారులు భావిస్తున్నారు. అద్దె బస్సులకు డ్రైవర్లుగా పనిచేస్తున్నవారిలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా డ్రైవింగ్‌ చేసే వారిని భవిష్యత్‌లో ఆర్టీసీ రెగ్యులర్‌ డ్రైవర్లుగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్ల నియామకాలు చేపట్టినప్పుడు, మెరుగైన పనితీరు కనబరిచిన అద్దె బస్సు డ్రైవర్లకు వెయిటేజీ మార్కుల రూపంలో ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తు న్నారు. 2012 తర్వాత ఆర్టీసీ డ్రైవర్లను నియమించలేదు. దీంతో దాదాపు 2 వేల డ్రైవర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్ల కొరతతో అధికారులు అద్దె బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తోంది. గతంలో మొత్తం ఆర్టీసీ బస్సుల్లో కేవలం 15 శాతం మాత్రమే ఉన్న వాటిని 20 శాతానికి పెంచేశారు.

అద్దె బస్సు డ్రైవర్లకు వేతనాలు తక్కువగా ఉండటంతో నైపుణ్యం ఉన్న డ్రైవర్లు రావటం లేదు. దీంతో ఆటో, లారీ, ట్రాక్టర్‌ డ్రైవర్లు బస్సులు నడపడంతో ప్రమాదాలకు కారణమవుతోంది. దీంతో డ్రైవర్ల నియామకం చేపట్టేలా శాఖ యోచిస్తోంది. దీంతో అద్దె బస్సులను భద్రంగా నడిపిన డ్రైవర్లకు వెయిటేజీ ఇచ్చి రెగ్యులర్‌ డ్రైవర్లు్లగా నియమించుకోవాలనే ఆలోచనను అధికారులు మంత్రి ముందుంచారు. దీని సాధ్యాసాధ్యాలు చూసి నివేదిక ఇవ్వమని ఆయన ఆదేశించారు. అద్దె బస్సు డ్రైవర్లకు ఈ సంకేతం చేరితే ఆర్టీసీ ఉద్యోగం వస్తుందన్న ఆలోచనతో బస్సులను భద్రంగా నడిపే అవకాశం ఉంటుందనేది అధికారుల యోచన.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement