ప్రైవేటు ట్రావెల్స్‌ అగడాలు మళ్లీ మొదటికి! | Private travels cargo shipment against the rules | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ట్రావెల్స్‌ అగడాలు మళ్లీ మొదటికి!

Published Sat, Jul 28 2018 3:12 AM | Last Updated on Sat, Jul 28 2018 5:25 AM

Private travels cargo shipment against the rules - Sakshi

రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్‌ అక్రమాలు మళ్లీ జోరందుకున్నాయి. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు పొందిస్టేజి క్యారియర్లుగా దూసుకెళ్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కార్గో రవాణా, ఒకే పర్మిట్‌తో మరికొన్ని బస్సుల్ని తిప్పి రహదారి పన్ను ఎగ్గొడుతున్నా.. రవాణా శాఖ చోద్యం చూస్తోందన్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. గత ఆర్నెల్ల కాలంలో వీటిపై రవాణా శాఖ ఒక్క కేసూ నమోదు చేయకపోవడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. దీంతో ఆర్టీసీ బస్టాండ్ల ఎదుటే టికెట్‌ కౌంటర్లు, పికప్‌ పాయింట్లు ఏర్పాటుచేసి మరీ ప్రైవేట్‌ యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి.    – సాక్షి, అమరావతి


491-  రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సుల సంఖ్య
50 - వీటిలో స్లీపర్‌ బస్సుల సంఖ్య
750 -  ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సులు
600 - వీటిలో 2 ప్లస్‌ వన్‌ బెర్తులున్న బస్సులు
70,000 - ఈ బస్సుల్లో ప్రతిరోజూ ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య

ప్రైవేటు ట్రావెల్స్‌ అక్రమాలతో ఆర్టీసీ ఏటా రూ.2,700 కోట్లు ఆదాయం పోగొట్టుకుంటోందని గతంలో సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ప్రైవేటు ట్రావెల్స్‌ను అడ్డుకోలేమని ఇటీవలే ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య చెప్పడాన్ని చూస్తే సర్కారు ప్రైవేటు ట్రావెల్స్‌ అక్రమాలను ఏ విధంగా కొమ్ము కాస్తోందో అర్ధమవుతోంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రైవేటు బస్సులను అడ్డుకునేందుకు, వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం పలు కమిటీలు ఏర్పాటుచేసింది. అంతేకాక,  వీటి ఆగడాల నిరోధానికి ప్రత్యేకంగా మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించినా ఆ తర్వాత పట్టించుకున్న దాఖలాల్లేవు.

నాడు వద్దన్నదే నేడు ముద్దు
ఇదిలా ఉంటే.. అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్లు చేయించి తమ రాష్ట్రం మీదుగాగానీ.. తమ రాష్ట్రం నుంచి గానీ తిప్పడంలేదని అక్కడ ప్రభుత్వం ఏకంగా ప్రైవేట్‌ బస్సుల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లను గతంలో రద్దుచేసిన సంగతి తెలిసిందే. కానీ, ఆ బస్సుల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి అనుమతించారు. మరోవైపు.. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు మితిమీరిన వేగంతో వెళ్లేందుకు డ్రైవర్లు కొంత మోతాదులో మద్యం సేవించాలని ప్రైవేటు ఆపరేటర్లే ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం ఉంది.

ఈ ప్రచారానికి ఊతమిస్తూ ఇటీవలే ప్రైవేటు ట్రావెల్స్‌ డ్రైవర్లు పలువురు మద్యం తాగి పోలీసులకు పట్టుబడ్డారు. గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పోలీసుల తనిఖీల్లో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ డ్రైవరు మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తనిఖీల్లో వెల్లడైంది. అలాగే, జాతీయ రహదారులపై టోల్‌గేట్లలో బ్రీత్‌ ఎనలైజర్లతో తనిఖీలు చేయాలి. ఇందుకు ప్రభుత్వం గతేడాది రూ.10 కోట్లతో వాటిని కొనుగోలు చేసింది. కానీ, అధికారులు తనిఖీలు చేయకుండా ప్రైవేటు బస్సులను వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

కార్మిక చట్టాలూ గాలికి..
ఇదిలా ఉంటే.. ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు డ్రైవర్ల సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నాయి. డ్రైవర్లకు కనీస సదుపాయాలు కల్పించడంలేదు. ప్రైవేటు ఆపరేటర్లు మోటారు వాహన కార్మికుల చట్టం అమలుచేస్తున్నారా? లేదా? అన్నది కార్మిక శాఖ కనీసం పరిశీలించడం లేదు. గతేడాది ఫిబ్రవరిలో కృష్ణా జిల్లాలో దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైన తర్వాతే రవాణా శాఖ డ్రైవర్ల పనివేళలు, రెండో డ్రైవరు నిబంధనపై మొక్కుబడిగా ఆదేశాలిచ్చిందే తప్ప వాటి అమలును పట్టించుకున్న పాపాన పోలేదు.


నిబంధనలకు విరుద్ధంగా కార్గో రవాణా
రవాణా చెక్‌పోస్టుల్లో ప్రతీ వాహనాన్ని ఆ శాఖాధికారులు విధిగా తనిఖీ చేయాలి. ముఖ్యంగా ప్రయాణీకుల్ని తరలించే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై ఓ కన్నేయాలి. సామర్థ్యానికి మించి వాహనం ఉందో లేదో పరిశీలించాలి. కానీ, అటువంటిదేమీ జరగకపోవడంతో దాదాపు 15 సంస్థలు ప్రయాణీకుల మాటున చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం తదితర నగరాల నుంచి పెద్దఎత్తున అక్రమంగా సరుకు తరలిస్తున్నారు.

ఇటీవలే గుంటూరులో ఓ ప్రైవేటు బస్సులో 50 కేజీల వెండి, ఫర్నీచర్‌ సామాగ్రి రవాణా అధికారులకు దొరకడం ఇందుకు ఉదాహరణ. గతంలోనూ ప్రైవేటు బస్సుల్లో బాణాసంచా తరలించడంతో అగ్ని ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలున్నాయి. అయినా ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలను బేఖాతరు చేస్తూ జీరో వ్యాపారానికి తోడ్పాటునందిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement