![RTC not arranging special buses for Mahakumbh Mela](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/kkk.jpg.webp?itok=jkSbNfCQ)
మహా కుంభమేళాకు రైళ్లు, బస్సులు ఏవీ?
ప్రమాదకర రీతిలో భక్తుల ఆధ్యాత్మిక యాత్ర
రద్దీ మేరకు అందుబాటులో లేని రైళ్లు
ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయని ఆర్టీసీ
సామర్థ్యం లేని ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్న జనం
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక యాత్ర విషాదభరితంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళాకు తరలి వెళ్తున్నారు. కానీ డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేవు. ఇటు తెలంగాణ ఆర్టీసీ కానీ, అటు ఏపీఎస్‌ఆర్టీసీ కానీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయలేదు. భక్తులు మధ్యతరగతి, సామాన్యప్రజలకు ఏ మాత్రం అందనంతగా విమానచార్జీలు భారీగా పెరిగాయి.
ఈ నేపథ్యంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి రావాలని కోరుకుంటున్న జనం తోచిన మార్గంలో వెళ్తున్నారు. సామర్థ్యం లేని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. నాచారం (హైదరాబాద్) నుంచి యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాకు మినీబస్సులో వెళ్లిన ఏడుగురు భక్తులు తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొని మరణించిన ఉదంతం ఆందోళన రేపుతోంది.
ప్రయాణికుల రద్దీ కారణంగా ఒకవైపు రహదారులు వందలకొద్దీ కిలోమీటర్లతో కిక్కిరిసిపోతుండగా, మరోవైపు మినీబస్సులు, మ్యాక్సీక్యాబ్‌లు వంటి చిన్న వాహనాల్లో ఎక్కువమంది ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.
అరకొర రైళ్లు...: ప్రయాణికుల రద్దీ మేరకు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కానీ అరకొర రైళ్లు అందుబాటులో ఉన్నాయి. పైగా సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్, గోరఖ్‌పూర్, లక్నో, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో జనవరి నాటికే బుకింగ్ నిలిచిపోయింది. వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్టు 200 దాటింది.
మరిన్ని అదనపు రైళ్లు నడిపితే తప్ప తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు ప్రయాణం చేయడం సాధ్యం కాదు. సాధారణంగా సంక్రాంతి, దసరా వంటి పండుగలు, మేడారం వంటి జాతరలకు ఆర్టీసీ వేలకొద్దీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. కానీ ఈ కుంభమేళాకు లక్షలాది మంది తరలి వెళ్తున్నట్లు తెలిసి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయకపోవడం శోచనీయం.
ప్రైవేట్ ట్రావెల్స్ నిలువుదోపిడీ
ప్రతిసారీ పండుగ ప్రయాణాన్ని సొమ్ము చేసుకొనే ప్రైవేట్ ట్రావెల్స్, టూరిస్ట్ సంస్థలు మహాకుంభమేళా భక్తులను కూడా వదలకుండా నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఫిట్‌నెస్ ఉన్నా లేకున్నా పెద్దఎత్తున వాహనాలను నడుపుతున్నాయి.
30 నుంచి 40 మంది ప్రయాణం చేసే ప్రైవేట్ బస్సులతోపాటు, 14 నుంచి 20 మంది వరకు ప్రయాణం చేసే సామర్థ్యం ఉన్న మినీ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, ఇతరత్రా వాహనాలను ఎడాపెడా రోడ్డెక్కిస్తున్నాయి. ప్యాకేజీల పేరుతో ఒక్కో ప్రయాణికుడి వద్ద రూ. 25,000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణంగా సుదీర్ఘమైన ప్రయాణం చేసే వాహనాల్లో ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలి.
ప్రతి 8 గంటలకు ఒకసారి విధులు మార్చుకోవాలి. కానీ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న వాహనాలు చాలావరకు ఒక డ్రైవర్‌తోనే బయలుదేరుతున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు సుమారు 1,136 కి.మీ. దూరం నిరాటంకంగా వాహనాలను నడపడం వల్ల డ్రైవర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment