సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ అన్ని వర్గాల్లో ఆనందాన్ని నింపింది. ఆనందోత్సాహాలతో కుటుంబ సభ్యుల మధ్య పండగ జరుపుకున్నవారంతా స్వస్థలాల నుంచి తిరిగి పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కాగా, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నేడు (శనివారం), రేపు (ఆదివారం) ఆర్టీసీ 2 వేలకు పైగా ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండ్రోజుల పాటు ఆర్టీసీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు ప్రత్యేక సర్వీసులు నడపనుంది. మొత్తం పండగ సీజన్‌లో ఈ నెల 15 నుంచి 19 వరకు 4,200 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీని ప్రకారం పండగ ముందు 2,200 ప్రత్యేక సర్వీసులను నడపడంతో ప్రయాణికులు ఆదరించారు. ప్రైవేటు బస్సుల్ని రవాణా శాఖ కట్టడి చేయడంతో ఈ దఫా రాష్ట్ర ప్రజలకు ప్రయాణంలో ఇబ్బందులు తప్పాయి. ఇటు రైల్వే శాఖ నర్సాపూర్, కాకినాడ, విశాఖ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.
40 శాతం రాయితీతో బస్సులు కళకళ..
ఆర్టీసీ పండగ సీజన్‌లలో నడిపే ప్రత్యేక సర్వీసులకు అదనంగా 50 శాతం చార్జీలు వసూలు చేస్తుంది. తిరుగు ప్రయాణంలో సరిగా ఆక్యుపెన్సీ ఉండదని, డీజిల్ ఖర్చులకైనా బస్సు నడిపినందుకు రావాలని ఈ విధంగా 50 శాతం చార్జీలు పెంచుతారు. అయితే ఈ దఫా ఆర్టీసీ వినూత్న ప్రయోగం చేసింది. తిరిగి వచ్చేటప్పుడు ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సులో 40 శాతం రాయితీ ప్రకటించింది. దీంతో ప్రత్యేక బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగి బస్సులు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి.
ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ చేస్తే 8309887955కు ఫిర్యాదులు
ఈనెల 2వ తేదీ నుంచి 16 వరకు ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ 3,132 కేసులు నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 546 బస్సులను సీజ్ చేశారు. తిరుగు ప్రయాణంలో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అధిక చార్జీలు వసూలు చేస్తే 8309887955 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని రవాణా శాఖ తెలిపింది.
ఆర్టీసీ బస్సులు కళకళ
Published Sat, Jan 18 2020 3:51 AM | Last Updated on Sat, Jan 18 2020 8:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment