sankranti festival
-
‘తాగు.. తిను.. ఊగు.. సంక్రాంతి పేరుతో కూటమి సర్కార్ దోపిడీ’
సాక్షి, విజయవాడ: సంక్రాంతిని కూటమి ప్రభుత్వం దోచుకుందని.. దోపిడీకి ఏ మార్గాన్ని వదలడం లేదంటూ వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్(Pothina Mahesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సంక్రాంతి(Sankranti)ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించారు. సంక్రాంతి సంబరాలను క్యాసినో స్థాయికి తీసుకెళ్లారు. పాఠశాలలను కూడా జూద కేంద్రాలుగా మార్చేశారు’’ అని దుయ్యబట్టారు.‘‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోడి పందాల బరుల ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వేల కోట్లు సంపాదించారు. మద్యాన్ని ఏరులై పారించారు. రికార్డింగ్ డాన్స్‌లు చేయించారు. పండుగను అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకున్నారు. పేదలు ఈ సంక్రాంతి పండుగకు దూరమయ్యారు. తాగు... తిను.. ఊగు అనే కొత్త నినాదాన్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది’’ అంటూ పోతిన మహేష్ ధ్వజమెత్తారు.‘‘సంక్రాంతి సంబరాలను ఆర్గనైజింగ్ క్రైమ్‌గా మార్చేశారు. జూదం అధికారికమే అనేలా కూటమి అనుమతులిచ్చింది. ఐపీఎల్ మాదిరి కోడి ప్రీమియర్ లీగ్‌లు పెట్టారు. పనులు చేసుకోవద్దు.. వ్యసనాలకు అలవాటు పడండని చంద్రబాబు ప్రజలకు చెప్పదలచుకున్నారా సమాధానం చెప్పాలి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘురామకృష్ణంరాజు కోడి పందాల్లో పాల్గొన్నారు. మహిళా బౌన్సర్లను పెట్టి విష సంస్కృతి తెచ్చారు. మైనర్లు సైతం గుండాట, పేకాట ఆడారు. కోడి పందాలు ఆడుకోవచ్చని అనుమతులుచ్చారా.. హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలి’’ అని మహేష్ నిలదీశారు.‘‘భీమవరంలో క్యాసినో సెంటర్ పెట్టారు. కుక్కుట శాస్త్రం ప్రకారం రూ.కోటి 25 లక్షలతో ముహూర్తం పెట్టి ఆడించారు. చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి. కోడి పందాల బరులకు టీడీపీ, జనసేన ట్యాక్స్ కట్టించుకున్నారు. స్కూళ్లలో కోళ్ల పందాలు పెట్టి విద్యార్ధులకు ఏం సందేశం ఇస్తారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. గోదావరి జిల్లాలకు ధీటుగా కృష్ణాజిల్లాలో 320కి పైగా కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు’’ అని మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు...ఇదేం పాలన అని జనం చంద్రబాబు, పవన్‌ను తిట్టుకుంటున్నారు. వైఎస్ జగన్‌ను అనవసరంగా వదులుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విజనరీ ఎవరని ప్రజల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రాన్ని కోడి పందాలు.. పేకాటకు కేరాఫ్‌గా మార్చాలనుకుంటున్నారా చంద్రబాబు?. అశ్లీల నృత్యాలేనా పర్యాటకం అభివృద్ధి అంటే. ఇదేనా చంద్రబాబు మీ విజన్ 2047 అంటే. కోడి పందాలను ప్రమోట్ చేసిన ఒక్క సెలబ్రిటీ మీదనైనా కేసు పెట్టారా?. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను చంద్రబాబు, పనన్ సర్వ నాశనం చేస్తున్నారు.ఇదీ చదవండి: పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు?..పేకాట, కోడి పందాలు.. అశ్లీల నృత్యాలు చూడాలంటే ఏపీకి వెళ్లాలని పొరుగు రాష్ట్రాల్లోని ప్రజలు అనుకుంటున్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు కట్టిన జగన్ అసలైన విజనరీ. ఉపాధి అవకాశాలు కల్పించలేమని పవన్ చెప్పిన కొద్దిసేపటికే ఇద్దరు యువకులు చనిపోయారు. ఇద్దరి చావుకు కారణమైన పవన్‌పై కేసు పెట్టాలా వద్దా?. పవన్ పదే పదే సనాతన ధర్మం.. సంస్కృతి అంటున్నారు. కోడి పందాలు, పేకాట, గుండాట ఆడటమే ధర్మమా?..అశ్లీల నృత్యాలే మన సంస్కృతా... పవన్ సమాధానం చెప్పాలి. ఇటీవల పవన్ సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అడిగేవాడు లేక జనసేన కార్యకర్తలు బరితెగించారు. నేషనల్ హైవేపై టోల్ గేట్ పెట్టడమేంటి?. కోడి పందాలు నిర్వహించినందుకు పవన్ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయలేదు. పార్టీలో చేర్చుకున్న భూకబ్జాదారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నలు గుప్పించారు. -
వెళ్ళొస్తా సుజాతా.. సంక్రాంతి సిత్రాలు
పండగ అయిపోయింది.. భీమవరం నుంచి భార్య రేవతి.. పిల్లలు భరత్.. భావనతో కలిసి పార్వతీపురం పండక్కి వెళ్లిన శ్రీకాంత్ మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యాడు.. బస్సులు ఎక్కలేని పరిస్ధితి.. ఏదోలా సంచులు అందుకుని తల్లి, నలుగురు ఎక్కేశారు. లక్కీగా బొబ్బిలిలో సీట్ దొరికింది.. కిటికీ పక్కన శ్రీకాంత్ కూర్చోగా ఆ పక్కనే తల్లి ముగ్గురు సర్దుకున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉన్న శ్రీకాంత్ చిన్ననాటి మిత్రుల్లాంటి వాళ్ళు.. బంధువుల గెటప్పుల్లో ఉన్న అంతర్గత విలన్లు.. సొంతవాళ్ల ముసుగులో ఉన్న పరాయివాళ్లతోనూ గడిపిన సంఘటనలు.. కళ్ళ ముందు గిర్రున తిరిగాయి.భోగినాడు రాత్రి తాను తెచ్చిన ఫుల్ బాటిల్ ఇంకా మంచింగ్ కోసం వెయ్యి పట్టుకెళ్లిన బావ శ్రీను తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కల్లంలో సిట్టింగ్ వేశాడు. పిల్లలను ఊళ్ళో అటు ఇటు తిప్పి మొత్తానికి మనోళ్ల సిట్టింగ్ స్పాట్ దగ్గరకు వెతుక్కుని వెళ్లిన శ్రీకాంత్ కు వాళ్ళ మాటలు వినబడ్డాయి. ఒరేయ్.. ఆ శ్రీకాంత్ గాడు మహా ముదుర్రా.. అక్కడ ఎన్నెన్ని చేస్తున్నాడో ఏందో.. బాగా సంపాదించాడు. మొత్తానికి ఏదో ఉందిరా అంటున్నాడు బావ శ్రీను పెగ్గు కలుపుతూ.. అదేం లేదులేరా.. పదిహేనేళ్లుగా భార్యా భర్త అక్కడ పంజేస్తున్నారు. పైగా వాడు జాగ్రత్తపరుడు.. వ్యసనాల్లేవు.. అందుకే పదో పరకో దాచుకున్నాడు అన్నాడు ఇంకో బ్రదర్ నాగరాజు.అదేం లేదురా వాడు ఏదో చేస్తున్నాడు.. నాకు అనుమానమే.. లేకుంటే ఇంత ఎక్కువ ధర ఉన్న మందు మనకు ఎందుకు ఇస్తాడు.. వాడికి ఉబ్బర్న వచ్చింది కాబట్టే ఇచ్చాడు.. బావ శ్రీను ముక్తాయింపు ఇచ్చాడు. శ్రీకాంత్ కు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ ముందు బాటిల్ ను బట్టల మాటున బ్యాగులో తాను రేవతిని ఎంతలా ఒప్పించాల్సి వచ్చిందో.. దేవుడికి చూపే బట్టల్లో అది వద్దని తానూ ఎంతలా వాదించిందో గుర్తొచ్చి శ్రీకాంత్ ఇంకక్కడ ఉండలేక భారమైన మనసుతో చల్లగా అక్కణ్ణుంచి జారుకున్నాడు.చీరలు పెట్టే సమయంలో పెద్దక్క భవాని చేసిన కామెంట్లు మళ్లోసారి జ్ఞాపకం వచ్చాయి. చూసావా అమ్మా.. వాడి పెళ్ళానికి మంచిది కొన్నాడు.. మనకు ఏదో ఆఫర్లో వచ్చిన గుడ్డ ముక్కలు కొని పడేసాడు అంటూ పొయ్యిదగ్గర మాట్లాడుకున్న మాటలు తన చెవిన పడ్డాయి. అదేం లేదులేవే అని సర్ది చెప్పాల్సిన తల్లి వరాహలమ్మ కూడా.. వాడు పెళ్ళైన రోజునుంచే మారిపోయాడు కధేటి.. అనడం శ్రీకాంత్ ను మరింత బాధించింది. కానీ భవానికి చీర సెలక్షన్ కోసం రేవతి ఎన్ని షాపులు తిరిగిందీ.. దానికి మ్యాచింగ్ గాజులు.. జాకెట్ ముక్కలను ఎలా విశ్లేషించి సెలెక్ట్ చేసిందీ శ్రీకాంత్ కు గుర్తొచ్చింది. ఎవరికీ అవతలి వారి కష్టం పట్టదు.. తమ సౌఖ్యం మాత్రమే ముఖ్యం.. అందులో తల్లీ చెల్లీ కూడా మినహాయింపు కాదని తెలిసొచ్చింది. అయినా వాళ్ళను ఏమీ అనలేక తమాయించుకున్నడుఓహ్.. ఎవరికీ ఎంత చేసినా అందులో లోపాలు వెతకడమే కాకుండా అవహేళన చేయడమే నైజంగా ఉన్న బంధువులను సంతోషపరచడం ఇసుక నుంచి నూనెను పిండటం లాంటిదే అని శ్రీకాంత్ కు వందోసారి తెలిసొచ్చింది. కానీ సంప్రదాయలపేరిట.. నకిలీ అనుబంధాల మాటున వాటిని భరిస్తూ వస్తున్నాడు. ఇంతలో రేవతి యాండీ ఇదేటి.. ఈ షర్ట్ మనం కొనలేదు కదా.. ఇదేక్కడిది అంది కవర్లోంచి తీస్తూ.. అర్రే చూసేసిందా అని నాలుక్కరుచుకున్న శ్రీకాంత్.. ఓహ్.. అదా.. అదా.. మా క్లాస్మేట్ టైలర్ రమణగాడు కుట్టి ఇచ్చాడులే అని డైవర్ట్ చేశాడు.కానీ సంక్రాంతి నాడు సాయంత్రం టెంట్ కింద పిల్లలంతా డాన్సులు చేస్తుంటే అక్క కూతురు సుమిత్ర వచ్చి మామయ్యా సుజాత బాప్ప రమ్మంది .. ఆ రామ్మందిరం పక్కనే ఉంది అని చెప్పేసి తుర్రుమంది. సుజాత.. ఒకనాటి నెచ్చెలి.. డిగ్రీ వరకు క్లాస్మేట్. ఎన్నెన్ని ఊసులు.. ఎన్నెన్ని బాసలు.. ఎక్కడా ఇద్దరం గీత దాటింది లేదు.. పెళ్లి చేసుకున్నాకే అన్నీ అనుకున్నాం.. కానీ విధి ఆమెను తన మేన బావకిచ్చి పెళ్ళిచేసింది.నేను ఏం చేయలేక.. అసలు ఎందుకు బతకాలో తెలియక.. అలా ఊరొదిలి వెళ్ళిపోయా.. తరువాత సుజాత పంచాయతీరాజ్‌లో ఉద్యోగం తెచ్చుకుని ఊళ్ళోనే ఉంది. ఊరొచ్చిన ప్రతీసారీ దూరం నుంచి చూడటం.. కన్నీళ్లతో ప్రేమను చూపడం.. అంతే ఉండేది.. కానీ ఈసారి ఎందుకో సుజాతను చూడాలనిపించింది.. తనే పిలిచింది.. గోడ పక్కకు వెళ్ళగానే... ఇలారా అంటూ పిలిచింది. ఏదేదో మాట్లాడాలనుకున్నాను కానీ నోరు పెగల్లేదు.. మాట రాలేదు.. తనకూ నాకూ మధ్య నిశ్శబ్దమే మాట్లాడింది. ఆ నిశ్శబ్దంలో ఎన్నో భావాలూ.. బాసలూ.. నీకోసం చొక్కా తీసుకున్నాను.. అంటూ ఇచ్చింది.. వణుకుతున్న చేత్తో తీసుకున్నాను.. అదే ఈ చొక్కా.. చూస్తుంటే దానిలో క్రీనీడ మధ్య నీడలా కనిపించిన సుజాత మొహం గుర్తొచ్చింది... దాన్ని ప్రేమగా ఒళ్ళోకి తీసుకున్నాను.. మొత్తం సంక్రాంతి ఎపిసోడ్లో నాకు నచ్చింది.. ఇష్టమైన ఘట్టం ఏదైనా ఉందంటే.. ఆ రెండు నిముషాల నిశ్శబ్ద సంభాషణ మాత్రమే. -సిమ్మాదిరప్పన్న. -
సంక్రాంతికి ఇంటికొచ్చిన అల్లుడికి 470 వంటకాలు
సంక్రాంతి పండుగకు అల్లుళ్లకు మర్యాదల్లో తాము తగ్గేదేలే అని చెబుతున్నారు ఉమ్మడి గోదావరి జిల్లా వాసులు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వందనపు వెంకటేశ్వరరావు దంపతులు తమ అల్లుడికి 452 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. అలాగే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కుక్కుల వెంకటేశ్వరరావు దంపతులు తమ అల్లుడికి 270 రకాల పిండి వంటలతో మెగా విందు ఏర్పాటు చేశారు. – మామిడికుదురు/జంగారెడ్డిగూడెం120 రకాల వంటలతో కొత్త అల్లుడికి భోజనం!పెళ్లి అయిన తర్వాత తొలిసారి సంక్రాంతికి వచ్చిన అల్లుడికి అత్తామామలు 120 రకాల వంటకాలతో భోజనం పెట్టి సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన నందిగామ భాస్కరరావు – సుజాత రెండో కుమార్తె మధుశ్రీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సుధాపల్లికి చెందిన కొనకళ్ల సందీప్‌తో వివాహం జరిగింది. కొత్త దంపతులు సంక్రాంతి పండుగకు వైరా వచ్చారు. ఈ సందర్భంగా భాస్కరరావు దంపతులు తమ అల్లుడు, కుమార్తెకు వివిధ రకాల పిండివంటలు, ఇతర వంటకాలు కలిపి 120 రకాలతో భోజనం వడ్డించడం విశేషం.చదవండి: వెళ్ళొస్తా సుజాతా.. సంక్రాంతి సిత్రాలు -
ఫ్యామిలీతో అనసూయ సంక్రాంతి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
కోడిపందాలో లేడీ బౌన్సర్..!
-
ఆనందం.. ఆరోగ్యం ఇవ్వాలి..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగిన ఈ సంబరాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. మోదీకి కిషన్‌రెడ్డి కుటుంబస భ్యులతోపాటు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి తదితరులు స్వాగతం పలికారు. నేరుగా తులసికోట వద్దకు చేరుకొని అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయి ద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య భోగి మంటలు వెలిగించారు.గంగిరె ద్దులకు వృషభ పూజ చేశారు. అక్కడి నుంచి సంప్రదాయ, జానపద కళాకారుల నృత్యా లు, డప్పు చప్పుళ్ల మధ్య సభాస్థలి వరకు మోదీకి స్వాగతం పలికారు. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దిన వేదికపై ప్రధాని మోదీ జ్యోతి వెలిగించారు. ప్రముఖ గాయని సునీత శ్లోకం అలపించగా, ఢిల్లీ నా ట్య అకాడమీ బృందం నృత్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇది సంస్కృతి, సమృద్ధి, పునరుద్ధరణ వేడుక: మోదీ సంక్రాంతి పండుగ సంస్కృతి, పునరుద్ధర ణల వేడుక అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘నా మంత్రివర్గ సహచరుడు జి.కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు హాజరయ్యాను. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా చూసి ఆనందించాను. ఇది మన సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయాలల్లో అంతర్భాగ మైన కృతజ్ఞత, సమృద్ధి, పునరుద్ధరణల వేడుక. సంక్రాంతి అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతోపాటు రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి అందాలని కోరుకుంటున్నాను’అంటూ ట్వీట్ ముగించారు. సంకాంత్రి అంటే రైతుల పండుగ: కిషన్రెడ్డిసంక్రాంతి అంటేనే రైతులు..గ్రామాల పండుగ అని కిషన్‌రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో తొలిసారిగా తన అధికార నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించానని తెలిపారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రులు, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్, గజేంద్రసింగ్ షెకావత్, జ్యోతిరాధిత్య సింథియా, మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, సతీష్‌చంద్ర దూబే, శ్రీనివాస్‌వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు కె.లక్ష్మణ్, అనురాగ్ ఠాకూర్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, గోడెం నగేష్, బాలశౌరి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే.అరుణతోపాటు, తెలంగాణ, ఏపీకి చెందిన బీజేపీ నేతలు, డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, క్రీడాకారిణి పీవీ.సింధు, మంగ్లీ సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లె కన్నీరు పెడుతోందో..
సాక్షి, రాజమహేంద్రవరం/చాగల్లు: సంక్రాంతి వస్తోందంటే గోదావరి వాసుల అతిథి మర్యాదలే గుర్తుకొస్తాయి. గోదారోళ్లా మజాకా అనిపిస్తారు. అందుకే ఎక్కడున్నా ఈ పెద్ద పండగకు వారం నుంచి మూడు రోజుల ముందే స్వగ్రామాలకు వచ్చేస్తారు. ఆటపాటలు, కోడి పందేలు, బావామరదళ్ల అల్లర్లతో అసలు తగ్గేదేలే అన్నట్టుగా సంబరంగా ఈ పండగ నిర్వహించుకుంటారు. నచ్చిన వంటకాలు చేసుకుంటారు. కుటుంబమంతా ఒక్కచోటకు చేరి సంతోషంగా గడుపుతారు. కొత్త అల్లుళ్లకు పదుల సంఖ్య వంటలు వండి విందుభోజనం పెడతారు. గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న సంక్రాంతి సందడి ఈ ఏడాది ఆశించిన మేర కనిపించడం లేదు.గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాల అమలుతో ప్రజల వద్ద పుష్కలంగా డబ్బులుండేవి. వేడినీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టుగా.. జనం కష్టపడి సంపాదించుకున్నదానికి ప్రభుత్వం అందించే సొమ్ము తోడయ్యేది. ఫలితంగా గత ఏడాది సంక్రాంతి పండగను ప్రజలు ఎంతో సంబరంగా నిర్వహించుకున్నారు. కానీ, ఈ ఏడాది ఆ సందడి కానరావడం లేదు. కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు నిలిచిపోవడం.. వరుస విపత్తులతో ఖరీఫ్ పంటలు దెబ్బ తినడం.. ఆర్థిక సమస్యలు.. పెరిగిన ధరలు వంటి కారణాలతో ప్రజల వద్ద డబ్బు లేకుండా పోయింది. దీంతో ఈ ఏడాది దాదాపు ఏ వ్యాపారమూ ఆశించిన మేర జరగడం లేదు. గ్రామీణ ప్రజల్లో పండగ జోష్ కూడా కనిపించడం లేదు. ఊనగట్ల.. పండగ కనబడటంలే.. మూడు గ్రామాలకు వ్యాపార కేంద్రంగా ఉన్న ఊనగట్ల జనాభా 7,500. గ్రామంలో 5,300 మంది ఓటర్లున్నారు. ఉదయం 9 గంటల సమయంలో ‘సాక్షి’ బృందం ఆ గ్రామంలోకి అడుగు పెట్టింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ విస్తృతంగా పర్యటించింది. కనబడిన ప్రతి ఒక్కరినీ పలకరించింది. గత ఏడాది ఈపాటికే గ్రామంలో కొద్ది రోజుల ముందే సంక్రాంతి సందడి కనిపించేది. కానీ ఈసారి భోగి పండగ ముందు రోజు కూడా వీధుల్లో సంక్రాంతి ముగ్గులు, ఇళ్లల్లో బంధువుల సందడి కనిపించలేదు. గొబ్బెమ్మల కోలాహలమే లేదు. దుకాణాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. నిత్యావసరాల ధరలు పెరగడంతో పిండివంటలు వెతికినా దొరకని పరిస్థితి. అదేమని గ్రామస్తులను ఆరా తీస్తే అసలు విషయం వెల్లడైంది. ‘గత ఏడాదే నయం. చేతి నిండా డబ్బుండేది. పండగ ధూం ధాంగా చేసుకునే వాళ్లం’ అంటూ నిట్టూర్చారు.వైఎస్సార్ సీపీ హయాంలో రూ.51.07 కోట్ల మేర సంక్షేమం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేసింది. ఈ క్రమంలో ఊనగట్ల గ్రామానికి 33 పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ , పరోక్ష చెల్లింపుల విధానంలో ఏకంగా రూ.51.07 కోట్ల మేర లబ్ధి చేకూరింది. డీబీటీ ద్వారా రూ.33,70,37,857, నాన్ డీబీటీ ద్వారా మరో రూ.14,28,32,390 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఇవి కాకుండా నాడు – నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి చేపట్టారు. ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించారు. ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకే చేర్చారు. అమ్మ ఒడి, పింఛన్లు, చేయూత, జగనన్న విద్యా, వసతి దీవెన వంటి అనేక పథకాలతో ఆర్థిక ఆసరా కల్పించారు. పండగ సమయానికి ఏదో ఒక పథకం కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారు. దీంతో అప్పట్లో సంక్రాంతి పండగను సంతోషంగా నిర్వహించుకునే వారమని పలువురు ‘సాక్షి’కి చెప్పారు. వైఎస్సార్ సీపీ హయాంలో గ్రామాభివృద్ధి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి కృషి చేశాం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాం. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా గ్రామానికి రూ.51.07 కోట్ల లబ్ధి చేకూర్చాం. రూ.1.30 కోట్లతో పాఠశాలలు అభివృద్ధి చేశాం. రూ.80 లక్షలతో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ భవన నిర్మాణాలు చేపట్టాం. రూ.2.20 కోట్లు వెచ్చించి పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాం. 204 ఇళ్ల నిర్మాణాలకు నాంది పలికాం. రూ.1.03 కోట్లతో ఊనగట్ల – అమ్ముగుంట రోడ్డు పనులు నిర్వహించాం. రూ.50 లక్షలతో ఊనగట్ల – కలవలపల్లి రోడ్డు నిర్మాణం చేపట్టాం. ప్రస్తుతం పథకాలేవీ అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – మట్టా వెంకట్రావు, ఊనగట్ల,సర్పంచ్ -
మనసే కోవెలగా..
అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లాలోని గ్రామాల్లో ఆధ్యాత్మిక సందడి వెల్లివిరుస్తోంది. భక్తి పారవశ్యం మానసిక ప్రశాంతత చేకూరుస్తోంది. సనాతన సంప్రదాయాలకు మళ్లీ పెద్దపీట వేస్తూ దేవుని పూజలతో తన్మయత్వం పొందుతున్నారు భక్తులు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ధనుర్మాసం పూజల్లో నిమగ్నం అవుతున్నారు. పెద్ద పండుగ ముందు పల్లెలన్నీ హరినామ సంకీర్తనతో మార్మోగిపోతున్నాయి. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేలుకొలుపు కార్యక్రమాలు అన్ని గ్రామాలకు విస్తరిస్తున్నాయి. చలికాలం వచ్చిందంటే కాసింత వెచ్చని ఎండ వచ్చే వరకూ నిద్ర లేవని వారు సైతం హరినామ సంకీర్తనలో మమేకం అవుతున్నారు. అచ్యుతాపురం మండలంలోని జగ్గన్నపేటలో ఐదేళ్ల క్రిందట ప్రారంభమైన మేలుకొలుపులు ఇప్పుడు మండలంలోని 12 గ్రామాలకు పైగా విస్తరించింది.తిమ్మరాజుపేట, హరిపాలెం, జగన్నాథపురం, కొండకర్ల, ఎర్రవరం, ఉప్పవరం, చీమలాపల్లి, దుప్పుతూరు, దోసూరు, గండివానిపాలెం, నరేంద్రంపురం గ్రామాల్లో మేలుకొలుపులు నెలగంట కొట్టిన రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్తరాయనంలో 6 నెలల పాటు దేవతలు సంచరించే సమయంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు దేవుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మకం. మేలుకొలుపు కార్యక్రమం వల్ల తెల్లవారుజాము నుంచే భక్తులు లేచి పుణ్య స్నానాలు ఆచరించి హరినామ సంకీర్తన చేస్తున్నారు. అయ్యప్ప మాలధారులు స్వామి సన్నిధికి వెళ్లిన తర్వాత మళ్లీ భక్తితత్వంలో కొనసాగేందుకు మేలుకొలుపులు ఉపయోగపడుతున్నాయని సమరసత సేవా ఫౌండేషన్ యలమంచిలి డివిజన్ ధర్మ ప్రచారకులు కొల్లి అప్పారావు చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మానసిక ప్రశాంతత, ఉల్లాసం లభిస్తోందని భక్తులు పేర్కొనడం గమనార్హం.హరిదాసుల సందడినెలగంట పెట్టిన రోజు నుంచి గ్రామాల్లో హరిదాసుల సందడి మొదలయ్యింది. అక్షయ పాత్రను తలపై పెట్టుకొని హరినామస్మరణతో వీధుల్లో సంచరిస్తూ ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతున్నారు. గంగిరెద్దుల సందడి, గాలిపటాలతో చిన్నారుల కోలాహలం, ముగ్గుల పోటీల్లో మహిళల కళా కౌశలం ఊరూరా ప్రతిఫలిస్తోంది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏకాదశి రోజున నగర సంకీర్తన, వారం వారం భజనలు, పౌర్ణమి రోజున సామూహిక హారతి, సత్సంగం, కార్తీక పౌర్ణమి రోజున వెన్నెలలో పాలను మరిగించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల్లో మహిళలు కీర్తనలు, కోలాటాలు నేర్చుకొని దేవాలయాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇది కూడా వారిలో భక్తి భావం పెంపొందించడంతోపాటు, శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడుతోంది. ఈ చిత్రంలో కూరగాయల వ్యాపారం చేస్తున్న వ్యక్తి పేరు చిలకా నారాయణ. 30 ఏళ్లుగా ఊనగట్ల వారపు సంతలో కూరగాయలు విక్రయిస్తున్నాడు. గత ఏడాది ఇదే సమయానికి రూ.40 వేల వరకూ వ్యాపారం చేశాడు. ప్రస్తుతం కొనేవారు లేకపోవడంతో రూ.10 వేలు కూడా దాటని దుస్థితి నెలకొందని వాపోతున్నాడు. ప్రజల వద్ద డబ్బులు లేకపోవడంతో కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన చెందుతున్నాడు.నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం ఊనగట్లలోని వారపు సంత. మూడు గ్రామాల పరిధిలోని సుమారు 10 వేల మంది ప్రజలకు ఈ సంతే ప్రధానం. ప్రతి ఆదివారం నిర్వహించే ఈ సంతకు వచ్చి ఆయా గ్రామాల ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేస్తారు. గత ఏడాది ఇదే సమయానికి ఈ సంత కొనుగోలుదారులతో కిటకిటలాడేది. ప్రస్తుతం జనం లేక వెలవెలబోతోంది.అతని పేరు రవి. విజయనగరం పట్టణంలోని వీటీ అగ్రహరంలో ఉంటున్నాడు. కూటమి ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ ఇస్తుందంటే కుటుంబ ఆర్థిక భారం తగ్గుతుందని సంబరపడ్డాడు. పథకం అమలు తరువాత రెండుసార్లు గ్యాస్ సిలిండర్ విడిపించారు. ఒక్క దానికి కూడా నగదు జమ కాలేదు. మొదటి సిలిండర్‌కు నగదు జమ కాలేదని విజయనగరం జిల్లా పౌర సరఫరాల శాఖ, గ్యాస్ ఏజెన్సీ, బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఈకైవేసీ చేయించమంటే చేయించారు. అయినా నగదు జమ కాలేదు. -
చచ్చినా.. తగ్గేదే లే!
సాక్షి, భీమవరం: తెలుగు నేలపై సంక్రాంతి సీజన్ అంటే పందెంకోళ్ల పౌరుషం గుర్తొస్తుంది. పందెంలో గెలిచినా.. ఓడినా మాంసాహార ప్రియులు పుంజులను లొట్టలేసుకుని లాగిస్తుంటారు. పందెంలో ఓడిపోయిన, చనిపోయిన పుంజును తూర్పు గోదావరి జిల్లాలో ‘కోస’ అని పశ్చిమ గోదావరిలో ‘కోజ’ అని వ్యవహరిస్తారు. వీటి మాంసానికి ఎంతో డిమాండ్ ఉంది. ఏనుగు చచ్చినా బతికినా విలువ తగ్గదన్నట్టు పందెం పుంజైనా, పోరాటంలో మరణించిన ‘కోజ’ అయినా ధర వేలల్లో ఉంటుంది. బరువును బట్టి ఇవి రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతాయి.పుష్టికరమైన ఆహారం..పందెం కోడిని మేపినట్లు మేపామనే సామెతను బట్టి పందెం పుంజులను ఎంత శ్రద్ధగా పెంచుతారో అర్థం చేసుకోవచ్చు. శక్తి కోసం నాటు పుంజులకు ఉడకబెట్టిన మటన్, డ్రై ఫ్రూట్స్, కోడి గుడ్లు, వెల్లుల్లి లాంటి బలవర్థకమైన ఆహారాన్ని నెలల తరబడి అందిస్తారు. శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగిరేందుకు వాటితో ఈత, నడక వ్యాయామాలు చేయిస్తారు. ప్రత్యేకంగా పెంచిన ఈ తరహా పుంజులు రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో ధర పలికితే మిగిలినవి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటాయి. ప్రత్యేకమైన రుచి.. పందెంకోళ్లను మటన్, బాదం, జీడిపప్పు, పిస్తా లాంటి ఖరీదైన మేతతో పుష్టిగా మేపి వ్యాయామాలు చేయించడం వల్ల వాటి శరీరంలో కొవ్వు లేకుండా కండ ఎక్కువగా ఉంటుంది. పందెంలో ప్రత్యర్థి పుంజుపై గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డిన సమయంలో రక్తం మరింత వేడెక్కి ప్రత్యేకమైన రుచి వస్తుందని మాంసాహార ప్రియుల నమ్మకం. అందుకోసమే ఎంత ఖరీదైనా వెనుకాడకుండా వీటిని కొనుగోలు చేసి ఆరగిస్తారు. బంధుమిత్రులకు వండి పెట్టి.. కొందరు పందేలరాయుళ్లు ‘కోజ’లను తమ వెంట తీసుకెళ్లిపోతే మరి కొందరు బరి బయటే అమ్మేస్తుంటారు. పుంజు బరువును బట్టి ధర పలుకుతుంది. ప్రత్యేకంగా వీటిని నిప్పులపై కాల్పించుకుని దగ్గరుండి కావాల్సిన సైజుల్లో ముక్కలు కొట్టించి మాంసాన్ని తీసుకువెళుతుంటారు. వీటిని కొనేందుకే కొందరు బరుల వద్దకు వస్తుంటారంటే అతిశయోక్తి కాదు. పందెం పూర్తి కాగానే పరుగులు తీస్తుంటారు.పండుగ నాడు ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు ‘కోజ’ పుంజులను వండి పెట్టి ఆనందంగా గడుపుతారు. తెలిసిన వారికి మాంసాన్ని పంపేందుకు ఆసక్తి చూపుతారు. పందెం అనంతరం ‘కోజ’ను తమకే ఇవ్వాలని పందేలరాయుళ్లకు ముందుగానే చెబుతారు. ‘పెద్దలకు’ కానుకగా.. సంక్రాంతి సమయంలో సామాన్యులే కాకుండా కొందరు నాయకులు, ఉద్యోగులు సైతం తమ పైవారికి ‘కోజ’లను కానుకగా పంపించి ప్రసన్నం చేసుకుంటారు. పందేల నిర్వాహకులు ఒక్కో బరి నుంచి 25కిపైగా ‘కోజ’లను సేకరించి రాజకీయ నాయకులతో పాటు పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, అగ్నిమాపక శాఖ అధికారులకు పంపిస్తుంటారు. స్టేషన్ మామూళ్ల విషయాన్ని పక్కనపెడితే తమకు ఎన్ని ‘కోజ’లు పంపాలో పోలీసులు ముందే ఇండెంట్ పెడతారని పందేలరాయుళ్లు అంటుంటారు. కోట్లు కురిపిస్తున్న ‘కోజ’ ‘కోజ’ల రూపంలో పండుగ మూడు రోజులూ ఒక్కొక్క బరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్దా కలిపి దాదాపు 80 కోడిపందేల బరులు ఏర్పాటు కానుండగా ‘కోజ’లపై రూ.5 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. -
సంక్రాంతి వచ్చెనట సందడి తెచ్చెనట!
మంచుకు తడిసిన ముద్దబంతులు... ముగ్గులు... పూలు విచ్చుకున్న గుమ్మడి పాదులు... కళ్లాపిలు.... వంట గదుల్లో తీపీ కారాల ఘుమఘుమలు...కొత్త బట్టలు... కొత్త అల్లుళ్ల దర్పాలు...పిల్లల కేరింతలు... ఓపలేని తెంపరితనాలుసంక్రాంతి అంటే సందడే సందడి.మరి మేమేం తక్కువ అంటున్నారు సినిమా తారలు.మా సంక్రాంతిని వినుమా అని ముందుకొచ్చారు.రచయిత్రులు ఊసుల ముత్యాల మాలలు తెచ్చారు.‘ఫ్యామిలీ’ అంతా సరదాగా ఉండే సంబరవేళ ఇది.ప్రతిరోజూ ఇలాగే పండగలా సాగాలని కోరుకుంటూసంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.ఇన్పుట్స్ : సాక్షి సినిమా, ఫ్యామిలీ బ్యూరోమన పండుగలను ఎన్నో అంశాలను మిళితం చేసి ప్రయోజనాత్మకంగా రూపొందించారు మన పెద్దలు. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా పండుగ విధులుగా చెప్పి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగా వాటిని రూపొందించారు. మన పండుగల్లో ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞానాలు మిళితమై ఉంటాయి. తెలుగువారి ప్రధానమైన పండుగ సంక్రాంతిలో కూడా అంతే! ప్రధానంగా చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు సౌరమానాన్ని పాటించే ముఖ్యమైన సందర్భం ఇది. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15 కాని, 16వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14 కాని, 15 వ తేదీ వరకు కాని ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఆ రోజు నుండి సూర్యుడు తన గమన దిశని దక్షిణం నుండి ఉత్తరానికి మార్చుకుంటాడు కనుక మకర సంక్రమణానికిప్రాధాన్యం. ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. బొమ్మల కొలువుపెట్టుకునే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అసలు ప్రధానమైనది సంక్రాంతి. ఈ పుణ్యకాలంలో దానాలు, తర్పణాలుప్రాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం,పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయనివారు ఈ రోజు చేస్తారు. అసలు మూడురోజులు పేరంటం చేసే వారున్నారు. సంక్రాంతి మరునాడు కనుము. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి,పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె పొట్టేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. నాగలి, బండి మొదలైన వాటిని కూడా పూజిస్తారు. ఇప్పుడు ట్రాక్టర్లకి పూజ చేస్తున్నారు. భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి, వ్యవసాయ పనిముట్లకి కూడా తమ కృతజ్ఞతలని తెలియచేయటం పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవమర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పంటను పాడుచేసే పురుగులని తిని సహాయం చేసినందుకు పక్షులకోసం వరికంకులను తెచ్చి కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’,‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’,‘కనుము నాడు మినుము తినాలి’ అనే సామెతలు కనుముకి పితృదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. మొత్తం నెల రోజులు విస్తరించి, నాలుగు రోజుల ప్రధానంగా ఉన్న పెద్ద పండగ సంక్రాంతి తెలుగువారికి ఎంతో ఇష్టమైన వేడుక. – డా. ఎన్.అనంతలక్ష్మిముక్కనుముముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. సంక్రాంతికి అందరూ తమ గ్రామాలకి చేరుకుంటారు. అల్లుళ్లు, ముఖ్యంగా కొత్త అల్లుళ్లు తప్పనిసరి. నెల రోజులు విస్తరించి, నాలుగు రోజులు ప్రధానంగా ఉండే సంక్రాంతి పెద్దపండుగ. పెద్దల పండుగ కూడా. పెద్ద ఎత్తున చేసుకునే పండుగ కూడా.థీమ్‌తో బొమ్మల కొలువుసంక్రాంతికి ప్రతియేటా ఐదు రోజులు బొమ్మలు కొలువు పెడుతుంటాం. చిన్నప్పటి నుంచి నాకున్న సరదా ఇది. నేను, మా అమ్మాయి, మనవరాలు కలిసి రకరకాల బొమ్మలను, వాటి అలంకరణను స్వయంగా చేస్తాం. ప్రతి ఏటా ఒక థీమ్‌ను ఎంచుకుంటాం. అందకు పేపర్, క్లే, అట్టలు, పూసలు, క్లాత్స్.. ఎంచుకుంటాం. ఈ సారి ఉమెన్ పవర్ అనే థీమ్‌తో నవదుర్గలు పెట్టాం. అమ్మ వార్ల బొమ్మలు ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయి. గుడిలాగా అలంకారం చేశాం. గుడికి అమ్మాయిలు వస్తున్నట్టు, పేపర్లతో అమ్మాయిల బొమ్మలను చేశాం. తిరుపతి చందనం బొమ్మల సేకరణ కూడా ఉంది. ఆ బొమ్మలతో కైలాసం అనుకుంటే శివపార్వతులుగా, తిరుపతి అనుకుంటే వెంకటేశ్వరస్వామి, పద్మావతి... ఇలా థీమ్‌కు తగ్గట్టు అలంకరణ కూడా మారుస్తాం. ఈ బొమ్మల కొలువుకు మా బంధువులను, స్నేహితులను పిలుస్తుంటాం. ఎవరైనా అడిగితే వాళ్లు వచ్చేవరకు ఉంచుతాం. – శీలా సుభద్రాదేవి, రచయిత్రిపండగ వైభోగం చూతము రారండి– రోహిణితమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న రోహిణి అనకాపల్లి అమ్మాయి అనే విషయం చాలామందికి తెలియదు. అయిదేళ్ల వయసులో చెన్నైకి వెళ్లిపోయినా... అనకాపల్లి ఆమెతోనే ఉంది. అనకాపల్లిలో సంక్రాంతి జ్ఞాపకాలు భద్రంగా ఉన్నాయి. నటి, స్క్రీన్ రైటర్, పాటల రచయిత్రి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి మొల్లెటి... ‘సంక్రాంతి ఇష్టమైన పండగ’ అంటుంది, ఆనాటి పండగ వైభోగాన్ని గుర్తు చేసుకుంటుంది.నా చిన్నప్పుడు .. సంక్రాంతికి స్కూల్‌కి సెలవులు ఇచ్చేవారు. అదో ఆనందం. అలాగే కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్లు. ఇంట్లో చక్కగా పిండి వంటలు చేసి పెట్టేవాళ్లు. ఫుల్లుగా తినేవాళ్లం. మాది అనకాపల్లి. నాకు ఐదేళ్లప్పుడు చెన్నై వెళ్లిపోయాం. సో... నాకు ఊహ తెలిశాక జరుపుకున్న పండగలన్నీ చెన్నైకి సంబంధించినవే.సంక్రాంతికి నెల ముందే నెల గంట పడతారు. అప్పట్నుంచి రోజూ ముగ్గులు పెట్టేవాళ్లం. అయితే ఎవరి ముగ్గు వారిది అన్నట్లు కాకుండా మా ముగ్గుకి ఇంకొకరు రంగులు వేయడం, మేం వెళ్లి వాళ్ల ముగ్గులకు రంగులు వేయడం... ఫైనల్లీ ఎవరి ముగ్గు బాగుందో చూసుకోవడం... అవన్నీ బాగుండేది. నేను రథం ముగ్గు వేసేదాన్ని. ఇక సంక్రాంతి అప్పుడు గంగిరెద్దుల సందడి, హరిదాసులను చూడడం భలేగా అనిపించేది. సంక్రాంతి నాకు ఇష్టమైన పండగ. ఎందుకంటే మనకు అన్నం పెట్టే రైతుల పండగ అది. వారికి కృతజ్ఞత తెలపాలనుకుంటాను. రైతుల విలువ పిల్లలకు చెప్పాలి. ఏమీ చెప్పకుండా పండగ చేసుకుంటే ఇది కూడా ఓ వేడుక అనుకుంటారు... అంతే. అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో పిల్లలకి చెప్పాలి. అర్థం తెలిసినప్పుడు ఇంకాస్త ఇన్ వాల్వ్ అవుతారు.ఇప్పుడు పండగలు జరుపుకునే తీరు మారింది. వీలైనంత వైభవంగా చేయాలని కొందరు అనుకుంటారు. అయితే ఎంత గ్రాండ్‌గా చేసుకుంటున్నామని కాదు... అర్థం తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా అనేది ముఖ్యం. తాహతుకి మించి ఖర్చుపెట్టి పండగ చేసుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.సంక్రాంతి అంటే నాకు గుర్తొచ్చే మరో విషయం చెరుకులు. చాలా బాగా తినేవాళ్లం. ఇప్పుడూ తింటుంటాను. అయితే ఒకప్పటి చెరుకులు చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పటి జనరేషన్ చెరుకులు తింటున్నారో లేదో తెలియడం లేదు. షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. అయితే చెరుకు కొరుక్కుని తింటే పళ్లకి కూడా మంచిది. మన పాత వంటకాలు, పాత పద్ధతులన్నీ మంచివే. ఇలా పండగలప్పుడు వాటి గురించి చెప్పడం, ఆ వంటకాలు తినిపించడం చేయాలి.నెల్నాళ్లూ ఊరంతా అరిసెల వాసనపండగ మూడు రోజులు కాదు మాకు నెల రోజులూ ఉండేది. వ్యవసాయం, గోపోషణ సమృద్ధిగా ఉండటం వల్ల నెల ముందు నుంచే ధాన్యం ఇల్లు చేరుతుండేది. నెల గంటు పెట్టగానే పీట ముగ్గులు వేసేవారు. వాటిల్లో గొబ్బిళ్లు పెట్టేవారు. రోజూ గొబ్బిళ్లు పెట్టి, వాటిని పిడకలు కొట్టేవారు. ఆ గొబ్బి పిడకలన్నీ పోగేసి, భోగిరోజున కర్రలు, పిడకలతోనే భోగి మంట వేసేవాళ్లు. మామూలు పిడకల వాసన వేరు, భోగి మంట వాసన వేరు. ప్రధాన సెలబ్రేషన్ అంటే ముగ్గు. బొమ్మల కొలువు పెట్టేవాళ్లం. అందరిళ్లకు పేరంటాలకు వెళ్లేవాళ్లం. ఊరంతా అరిసెల వాసన వస్తుండేది. కొత్త అటుకులు కూడా పట్టేవారు. చెరుకు గడలు, రేగుపళ్లు, తేగలు, పిల్లల ఆటలతో సందడిగా ఉండేది. బంతిపూల కోసం అక్టోబర్‌లో మొక్కలు వేసేవాళ్లం. అవి సంక్రాంతికి పూసేవి. కనుమ నాడు గోవులను అలంకరించి, దండం పెట్టుకునే వాళ్లం. చేసుకున్న పిండి వంటలు పంచుకునేవాళ్లం. హరిదాసులకు, గంగిరెద్దుల వాళ్లకు ధాన్యాన్ని ఇచ్చేవాళ్లం. ఇప్పటికీ పండగలను పల్లెలే సజీవంగా ఉంచుతున్నాయి. పట్టణాల్లో మాత్రం కొన్నేళ్లుగా టీవీల్లోనే సంక్రాంతి సంబరాలను చూస్తున్నాం. – రమారావి, కథకురాలు, ఆధ్యాత్మికవేత్తనా జీవితంలో సంక్రాంతి చాలా స్పెషల్– మీనాక్షీ చౌదరి‘ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు’ అనేది మన అచ్చ తెలుగు సామెత. తెలుగుతనం ఉట్టిపడే పేరున్న మీనాక్షీ చౌదరి తెలుగు అమ్మాయి కాదు. ఉత్తరాది అమ్మాయి మీనాక్షీ చౌదరి కాస్త బాపు బొమ్మలాంటి తెలుగింటి అమ్మాయిగా మారడానికి మూడు సంవత్సరాల కాలం చాలదా! మీనాక్షీ నటి మాత్రమే కాదు స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ (2018) కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమా తో తెలుగు తెరకు సైలెంట్‌గా పరిచయం అయిన చౌదరి ‘హిట్: ది సెకండ్ కేస్’తో హిట్ కొట్టింది. సూపర్‌హిట్ సినిమా ‘లక్కీభాస్కర్’ లో సుమతిగా సుపరిచితురాలైంది. కొందరికి కొన్ని పండగలు ప్రత్యేకమైనవి. సెంటిమెంట్‌తో కూడుకున్నవి. మీనాక్షీ చౌదరికి కూడా సరదాల పండగ సంక్రాంతి ప్రత్యేకమైనది. సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఈ హరియాణ అందాల రాశి చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు ఇవి.మాది హర్యానా రాష్ట్రంలోని పంచకుల. మూడేళ్లుగా నేను హైదరాబాద్‌లో ఉంటూ తెలుగు సినిమాల్లో పని చేస్తున్నాను కాబట్టి సంక్రాంతి పండగ గురించి నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జనవరిలో ఒక సెలబ్రేషన్ (సంక్రాంతి) ఉంది. సంక్రాంతి–సినిమా అనేది ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ . సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అన్నది సినిమాల రిలీజ్‌కి, సెలబ్రేషన్స్ కి చాలా మంచి సమయం. కుటుంబమంతా కలిసి సందడిగా పూజలు చేసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అది నాక్కూడా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉంటుంది. గాలిపటాలంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఎగరేయడంలో నేను చాలా బ్యాడ్ (నవ్వుతూ). అయినా, మా ఫ్రెండ్స్‌తో కలిసి మా ఊర్లోనూ, హైదరాబాద్‌లోనూ ఎగరేసేందుకు ప్రయత్నిస్తుంటాను. హైదరాబాద్‌లో ప్రతి ఏటా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గాలిపటాలు ఎగరేయడం అన్నది కూడా ఒక ఆటే. సంక్రాంతి టు సంక్రాంతి2024 నాకు చాలా సంతోషంగా, గ్రేట్‌ఫుల్‌గా గడిచింది. గత ఏడాది మంచి సినిమాలు, మంచి కథలు, పాత్రలు, మంచి టీమ్‌తో పని చేయడంతో నా కల నిజం అయినట్లు అనిపించింది. 2025 కూడా అలాగే ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నాను. చూస్తుంటే సంక్రాంతి టు సంక్రాంతి వరకు ఓ సర్కిల్లా అనిపిస్తోంది. నా జీవితం లో కూడా సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకంటే గత ఏడాది నేను నటించిన ‘గుంటూరు కారం’ వచ్చింది.. ఈ ఏడాది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలవుతోంది! అందుకే చాలా సంతోషంగా... ఎగ్జయిటింగ్‌గా ఉంది.ముగ్గుల లోకంలోకి– దివి వాఢత్యాదివి పదహారు అణాల తెలుగు అమ్మాయి. ఎం.టెక్ అమ్మాయి దివి మోడలింగ్‌లోకి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. ‘బిగ్‌బాస్4’తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. హీరోయిన్గా చేసినా, పెద్ద సినిమాలో చిన్న పాత్ర వేసినా తనదైన మార్కును సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలలో మెరిసినా, నాన్–గ్లామరస్ పాత్రలలో కనిపించినాతనదైన గ్రామర్ ఎక్కడీకి పోదు! మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లుగానే... మహా పండగ సంక్రాంతి కోసం ఎదురు చూడడం దివికి ఇష్టం. సంక్రాంతి వస్తే చాలు... ఆమెకు రెక్కలు వస్తాయి. సరాసరి వెళ్లి విజయవాడలో వాలిపోతుంది. పండగ సంతోషాన్ని సొంతం చేసుకుంటుంది. భోగిమంటల వెలుగు నుంచి గగనసీమలో గాలిపటాల వయ్యారాల వరకు దివి చెప్పే సంక్రాంతి కబుర్లు...మాది హైదరాబాదే అయినా, నేను పుట్టింది విజయవాడలో. ఊహ తెలిసినప్పటి నుంచి సంక్రాంతి వచ్చిందంటే చాలు, విజయవాడలోని మా అమ్మమ్మగారి ఇంట్లో వాలిపోతా. వారం ముందు నుంచే మా ఇంట్లో పండుగ సందడి మొదలయ్యేది. మా మామయ్యలు, పిన్నులు, చుట్టాలందరితో కలసి గారెలు, అరిసెలు ఇలా ఇతర పిండి వంటలు చేసుకుని, ఇరుగు పొరుగు వారికి ఇచ్చుకుంటాం. పండుగ రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకునేవాళ్లం. తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేసి, ముగ్గులు పెడతాం. అమ్మమ్మ పూజ చే స్తే, మేమంతా పక్కనే కూర్చొని, దేవుడికి దండం పెట్టుకునేవాళ్లం. కానీ ఆ రోజుల్ని ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా. ఏది ఏమైనా సంక్రాంతికి కచ్చితంగా ఊరెళతాను. ఆ మూడు రోజుల పాటు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో కలసి పండుగ చేసుకోవటం నాకు చాలా ఇష్టం. సాయంత్రం స్నేహితులతో కలసి సరదాగా గాలిపటాలు ఎగరేస్తా. ఇప్పుడు నటిగా ఎదుగుతున్న సమయంలో సంక్రాంతి జరుపుకోవటం మరింత ఆనందంగా ఉంది. ఊరెళితే చాలు, అందరూ ఇంటికొచ్చి మరీ పలకరిస్తుంటారు. వారందరినీ చూసినప్పుడు నాపై నాకే తెలియని విశ్వాసం వస్తుంది. చివరగా సంక్రాంతికి ప్రత్యేకించి గోల్స్ లేవు కాని, అందరినీ సంతోషంగా ఉంచుతూ, నేను సంతోషంగా ఉంటే చాలు. ఇక నన్ను బాధించే వ్యక్తులకు, విషయాలకు చాలా దూరంగా ఉంటా. ఇంటర్వ్యూ: శిరీష చల్లపల్లిమర్చిపోలేని పండుగ– అంజలి‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో సీత ఎవరండీ? అచ్చం మన పక్కింటి అమ్మాయి. మన బంధువుల అమ్మాయి. తన సహజనటనతో ‘సీత’ పాత్రకు నిండుతనం తెచ్చిన అంజలికి... ‘మాది రాజోలండీ’ అని చెప్పుకోవడం అంటే ఇష్టం. మూలాలు మరవని వారికి జ్ఞాపకాల కొరత ఉంటుందా! కోనసీమ పల్లె ఒడిలో పెరిగిన అంజలి జ్ఞాపకాల దారిలో వెళుతుంటే....మనం కూడా ఆ దారిలో వెళుతున్నట్లుగానే, పల్లె సంక్రాంతిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంటుంది! ఒకటా ... రెండా... పండగకు సంబంధించిన ఎన్నో విషయాలను నాన్‌స్టాప్‌గా చెబుతుంది. అంజలి చెప్పే కోనసీమ సంక్రాంతి ముచ్చట్లు తెలుసుకుందాం...చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే తెలుగమ్మాయిలందరికీ నటి అంజలి ఓ స్ఫూర్తి. మనందరి అమ్మాయి.. తెలుగమ్మాయి.. ఈ పెద్ద పండుగను ఎలా జరుపుకుంటుందంటే...కోనసీమజిల్లా రాజోలు మా ఊరు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.. అందరికీ వారం ముందు నుంచి పండుగ మొదలయితే, మాకు నెల ముందు నుంచే ఇంకా చెప్పాలంటే పండుగయిన తర్వాతి రోజే.. వచ్చే సంక్రాంతి కోసం ఏర్పాట్లు చేస్తుంటాం. మా తాతయ్య సుబ్బారావుగారు పండుగలంటే అందరూ కలసి చేసుకోవాలని చెప్పేవారు. అందుకే, చిన్నప్పటి నుంచే నాకు అదే అలవాటు. మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందరూ వస్తే ఇల్లు మొత్తం నిండిపోయేది. అయినా సరే, ఏ పండుగైనా అందరం కలసే జరుపుకుంటాం. ఇంట్లోనూ పొలాల్లోనూ ఘనంగా పూజలు నిర్వహిస్తాం. చిన్నప్పుడు కజిన్స్ అందరం కలసి ఉదయాన్నే భోగి మంటలు వేయటానికి, అందులో ఏమేం వేయాలో అనే విషయాల గురించి వారం ముందు నుంచే మాట్లాడుకునేవాళ్లం. తాతయ్య పిండివంటలన్నీ చేయించేవారు. అందుకే, ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూసేదాన్ని. కాని, సిటీకి వచ్చాక అంత ఎంజాయ్మెంట్ లేదు. చిన్నతనంలో మా పెద్దవాళ్లు ముగ్గు వేస్తే, మేము రంగులు వేసి, ఈ ముగ్గు వేసింది మేమే అని గర్వంగా చెప్పుకుని తిరిగేవాళ్లం. అందుకే, ముగ్గుల పోటీల్లో నేనెప్పుడూ పాల్గొనలేదు. గాలిపటాన్ని కూడా ఎవరైనా పైకి ఎగరేసిన తర్వాత ఆ దారాన్ని తీసుకుని నేనే ఎగరేశా అని చెప్పుకుంటా. అందుకే, సంక్రాంతి నాకు మరచిపోలేని పండుగ.నిండుగా పొంగితే అంతటా సమృద్ధిసంక్రాంతి పండగ అనగానే తెల్లవారకుండానే పెద్దలు పిల్లల్ని నిద్రలేపడం, చలికి వణుకుతూ ముసుగుతన్ని మళ్లీ పడుకోవడం ఇప్పటికీ గుర్తు వస్తుంటుంది. సందడంతా ఆడపిల్లలదే. ముగ్గులు వేయడం, వాటిల్లో గొబ్బెమ్మలు పెట్టి, నవధాన్యాలు, రేగుపళ్లు వేసేవాళ్లం. ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఆవు పిడకల మీద మట్టి గురిగలు పెట్టి, పాలు పొంగించేవాళ్లం. ఎటువైపు పాలు పొంగితే అటువేపు సస్యశ్యామలం అవుతుందని నమ్మకం. నిండుగా పొంగితే అంతటా సమృద్ధి. మిగిలిన గురుగుల్లోని ప్రసాదాన్ని అలాగే తీసుకెళ్లి లోపలి గదుల్లో మూలకు పెట్టేవారు ఎలుకల కోసం. సాధారణ రోజుల్లో ఎలుకలు గింజలు, బట్టలు కొట్టేస్తున్నాయని వాటిని తరిమేవారు. అలాంటిది సంక్రాంతికి మాత్రం, బయట పక్షులతోపాటు ఇంట్లో ఎలుకలకు కూడా ఇలా ఆహారం పెట్టేవాళ్లు. ముగ్గులు పెట్టడంలో ఇప్పడూ పోటీపడే అమ్మాయిలను చూస్తున్నాను. మేం ఉండేది వనపర్తిలో. అప్పటి మాదిరిగానే ఇప్పడూ జరుపుకుంటున్నాం. – పోల్కంపల్లి శాంతాదేవి, రచయిత్రి -
బరిలో ఉరకలు వేసే ఉత్సాహం
చోడవరం: ధాన్య, ధన రాశులతో తులతూగుతూ రైతులు ఆనందంగా ఉన్న రోజుల్లో వచ్చే సంక్రాంతి పండగ ఎన్నో సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలకు నెలవుగా ఉంటుంది. ఎన్నో పల్లె సంప్రదాయాలు కనుమరుగవుతున్నప్పటికీ ఇప్పటికీ పల్లె క్రీడలు కొన్ని జనాన్ని అలరిస్తూనే ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఎడ్లబళ్ల పోటీఉ, కోడిపందాలు, గుర్రాల పరుగు పోటీలు పల్లెల్లో సంక్రాంతి శోభను ఇనుమడింపజేస్తాయి. కోడిపందాలపై నిషేధం విధించడంతో సంక్రాంతి పండగంతా ఎడ్ల బళ్ల పరుగు పోటీల వైపే ఆసక్తిగా చూస్తుంది. కనుమ పండగ నుంచి ప్రారంభమయ్యే ఈ ఎడ్ల బళ్ల పోటీలు తీర్ధాలు, గ్రామదేవల పండగల సందర్భంగా కూడా నిర్వహిస్తారు. పెద్దపండగ వచ్చిందంటే ఎడ్లబళ్ల పోటీల కోసం జనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడ్లబళ్ల పోటీలు ప్రధానంగా చోడవరం, మాడుగుల పరిసర మండలాలైన దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ, వూడుగుల, సబ్బవరం, చోడవరం, బుచ్చెయ్యపేట, రోలుగుంట, రావికమతం మండలాల్లో జరిగేవి. క్రమేణా రాంబిల్లి, అచ్యుతాపురం, యలమంచిలి, నక్కపల్లి, కశింకోట, అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, కోటవురట్ల తదితర మండలాలకు విస్తరించాయి.కొందరైతే ప్రత్యేకంగా ఈ సంక్రాంతిలో ఎడ్ల బళ్ల పోటీల కోసమే ఒంగోలు, మైసూర్‌తో పలు మేలుజాతి ఎడ్లను లక్షలాది రూపాయలు ఖర్చుచేసి మరీ కొనుగోలు చేసి వాటికి శిక్షణ ఇస్తారు. హింస, జూదానికి తావు లేకుండా కేవలం ఆటవిడుపుగా ఉల్లాసంగా ప్రతి ఒక్కరిలోనూ ఆనందాన్ని నింపే విధంగా గెలుపే లక్ష్యంగా పోటీ ప్రతిష్టతో నిర్వహించే ఈ ఎడ్ల బళ్ల పరుగుల పోటీలు క్రీడాస్ఫూర్తితో జరుగుతాయి. అందుకే ఈ పోటీలకు ప్రజల నుంచి విశేష స్పందన ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ పోటీల సమయానికి సందర్శకులు చేరుకుని ఉత్సాహంగా పోటీలను తిలకిస్తారు. పోటీలు ఇలా... పందెంలో పాల్గొనే ఎడ్ల (జత)ను ఎంట్రీల ప్రకారం వరుస నంబర్లు వేసి తేలికపాటి ఎడ్లబళ్లకు ఎద్దులను బూసి పరుగెత్తిస్తారు. ఒక్కో బండి నిర్వహణకు ఇద్దరు వునుషులు ఉంటారు. ఏ ఎడ్లబండి తక్కువ సమయంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకొని తిరిగి వస్తుందో ఆ ఎద్దులు విజయం సాధించినట్టుగా పరిగణిస్తారు. కొన్ని ప్రదేశాల్లో నాలుగైదు ఎడ్లబళ్లను ఒకేసారి మైదానంలో ఉంచి పరుగుల పోటీ నిర్వహిస్తారు. ఈ తరహా పోటీలు తక్కువగా ఉండగా ఒక్కో బండి పరుగుతీసే పోటీలే ఎక్కువగా జరుగుతుంటాయి. పోటీలో గెలుపొందిన ఎద్దులకు ముందుగా నిర్ధేశించిన పారితోషకాన్ని బహుమతిగా ఇస్తారు. పోటీలో పాల్గొనే ఎడ్లబళ్లు వుంచి వయస్సులో మేలుజాతి హుషారైన ఎద్దులను ఈ పోటీలకు దించుతారు. పందెం సమయంలో బండి బోల్తా పడినా ఎద్దులకు గానీ ఎవరికీ పెద్దగా ప్రమాదం కలగజేయకుండా ఉండే తేలికపాటి బళ్లను ఉపాయోగిస్తారు. ఈ పోటీల కోసం తేలికగా ఉండి ప్రత్యేకంగా బేరింగ్లు వేసిన చక్రాలను ఈ బళ్లకు ఏర్పాటు చేస్తారు. ఒక వేళ పోటీల్లో బండి బోల్తా పడినా వెంటనే నిర్వాహకుడు బండి తిరిగి లేపి పరుగు తీసే విధంగా అత్యంత తేలిగ్గా బండి తయారు చేస్తారు. పోటీలకు ఆటస్థలం రైతుతో ముడిపడి నిత్యం రైతుతోనే కలిసి ఉండే ఎడ్లబండితోఎద్దులు పరుగెత్తే ఈ పోటీలో పాఠశాలల్లోను, ఆట స్థలాల్లోను నిర్వహించరు. ఎద్దులు, రైతులు నిత్యం కలియతిరిగే పంట పొలాల్లోనే ఈ పోటీలు నిర్వహిస్తారు. జనవరి నెల ప్రారంభానికి ఖరీఫ్ వరిపంట కోతలు పూర్తవ్వడంతో చాలా పొలాల్లో సంక్రాంతి పండగ జరిగే వరకు ఏ పంట వేయరు. దీంతో కోతలు జరిగిపోయి ఖాళీగా ఉన్న పొలాలను నిర్దేశించిన లక్ష్యం మేర పొలాల మడుల మధ్య ఉన్న గట్లను తొలగించి ఎడ్లపందాలు నిర్వహిస్తారు. కొన్ని గ్రామాల్లో సమీపంలో నీరులేని సాగునీటి చెరువుల్లో కూడా నిర్వహిస్తారు. రైతులంతా పిల్లా పాపలతో ఉరకలెత్తుతున్న ఎడ్లను తిలకించి వాటికి మరింత ప్రోత్సాహం ఇస్తూ చప్పట్లు కొడుతూ ప్రదర్వనను ఆస్వాదిస్తారు. పోటీలు నిర్వహించే టప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగా అన్ని ఏర్పాట్లు నిర్వాహకులు చేస్తారు. ఎన్నో బహుమతులు గెలుచుకున్నా... నేను పొలం పనులతో పాటు ఎడ్ల బళ్ల పోటీలపై ప్రధానంగా దృష్టి పెట్టి మేలు జాతి ఎద్దులను పెంచుతున్నాను. నా దగ్గర రెండు జతల మేలు జాతి ఎద్దులు ఉన్నాయి. వీటి పెంపకానికి రోజూ భారీగానే ఖర్చవుతుంది. ఏటా జరిగే పందాల్లో 80 నుంచి 110 వరకు పోటీల్లో నా ఎద్దులు ఎక్కువసార్లు మొదటి బహుమతులు తెచ్చాయి. జిల్లా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరితోపాటు రాష్ట్ర స్థాయి పోటీల్లో సైతం నా ఎద్దులు బహుమతులు గెలుచుకున్నాయి. గతేడాది తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో వరుసగా మొదటి, రెండో బహుమతులు గెలుచుకున్నాయి. –లెక్కల సత్తిబాబు, లెక్కలవానిపాలెం, చోడవరంపెంపకంలో జాగ్రత్తలు వ్యవసాయంలో నాతో కలిసి జీవించే ఎద్దులు పోటీల్లో పరుగులు తీస్తుంటే ఆ ఆనందం చెప్పలేను. రూ.లక్షా 60వేలుపెట్టి ఎద్దులు కొన్నాను. వీటి పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటాను. మంచి పోషాకాహారంతోపాటు పరిసరాల పరిశుభ్రత కూడా చాలా అవసరం. ఇప్పటి వరకు అనేక పందాల్లో బహుమతులు సాధించాను. ఈ ఏడాది మరిన్ని పోటీలు గెలవాలని ఉత్సాహంగా ఉన్నాను. –ముమ్మిన రామకృష్ణ, ఎడ్లపెంపకందారుడు, నర్సయ్యపేట -
ఎలాగైనా వెళ్లాల్సిందే
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్ : సంక్రాంతి పండుగ వేళ...ప్రయాణాలు సాగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా మహానగరం పల్లెబాట పట్టింది. వారం రోజులుగా సుమారు 30 లక్షల మందికి పైగా నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లినట్టు అంచనా. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. సొంత వాహనాల్లోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. సుమారు 8 లక్షల మందికి పైగా రైళ్లలో తరలివెళ్లినట్టు అధికారులు అంచనా వేశారు.ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఏపీ వైపు వెళ్లే బస్సులను కూకట్పల్లి, మియాపూర్, అమీర్‌పేట, లక్డీకాఫల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ మీదుగా నడిపారు. వరంగల్ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్కే పరిమితం చేశారు.కొన్నింటిని సాగర్‌రోడ్డు, బీఎన్‌రెడ్డినగర్, హయత్‌నగర్ వరకు పరిమితం చేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో కలిపి 12 లక్షల మందికి పైగా వెళ్లారు. హైవేలన్నీ వాహనాలతో నిండుగా..: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం కూడా రద్దీ కొన సాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ బస్టాండ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి రాత్రి 7 గంటల వరకు 65 వేల వాహనాలు వెళ్లాయి. నల్లగొండ జిల్లాలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు 30 వేల వాహనాలు వెళ్లాయి.హెదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా నుంచి సాధారణ రోజుల్లో 30వేల వరకు వాహనాలు రాకపోకలు సాగించగా, ఆదివారం 70 వేలకు పైగా వాహనాలు వెళ్లాయి. ఫాస్టాగ్ స్కానింగ్ ఆలస్యం కావడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు మల్టిజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. -
రోగ్యం... ధ్యాత్మికం
ఖమ్మం గాందీచౌక్: సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ. సంక్రాంతి ముగ్గుకు విశిష్టత ఉంది.పూర్వికుల నుంచి ఆ ఆనవాయితీ కొనసాగుతోంది. పంటలు ఇళ్లకు చేరే వేళ ఇంటి అలంకరణ, వాకిళ్లు శుభ్రం చేసుకోవటం, ఆవుపేడతో కల్లాపు చల్లడం, వాకిళ్లలో పెద్దపెద్ద ముగ్గులు వేసుకోవడం ప్రతీ కుటుంబం సంక్రాంతికి నెల ముందు నుంచే మొదలుపెడతారు. ఇలా ఇళ్ల అలంకరణ, ఇంటి ముందు ముగ్గులు వేయడం వెనుక ఆరోగ్యం, ఆధ్యాత్మికత దాగి ఉంది. పంటలకు ప్రతిరూపంగా..పంటలు ఇళ్లకు చేరే వేళ ప్రతిరూపంగా సంక్రాంతి నిలుస్తుంది. ఇళ్లన్నీ పంటలతో నిండుగా ఉన్న వేళ ఆనందాలను పంచుకోవడం కోసం ఇళ్లను అలంకరిస్తారు. ఇళ్లనే కాక పశువుల పాకలను శుభ్రం చేయడం, ఇంటి గుమ్మాలను బంతి, చామంతి పూలమాలలతో అలంకరించడంతోపాటు మహిళలు ఆనందాలను పంచుకుంటూ ఇంటి ఎదుట ముగ్గులు వేస్తారు.ముగ్గులు, గొబ్బెమ్మల వెనుక ఆరోగ్యంధనుర్మాసం నెల పాటు సాగే పండుగ సంక్రాంతి. ఈ పండుగ వేళ పంటలు ఇంటికి చేరతాయి. ప్రధానంగా ధాన్యం ఇళ్లకు చేరుతుంది. పొలాల్లో ఉన్న క్రిమి కీటకాలు పంటలతో పాటే ఇళ్లకు చేరే అవకాశం ఉంటుంది. తద్వారా కుటుంబాలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం పొంచి ఉన్నట్టే. అలా క్రిమికీటకాలు ఇళ్లకు చేరకుండా పూర్వికుల నుంచి ఓ ఆచారం కొనసాగుతోంది.ఇళ్లను శుభ్రం చేసుకోవటంతో పాటు గుమ్మాలను పూలతో అలంకరించుకోవడం, వాకిళ్లను ఆవు పేడతో కూడిన కల్లాపు చల్లుకోవడం ఈ ఆనవాయితీలో భాగం. వాకిళ్లలో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గుల్లో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. ఆవుపేడతో కల్లాపు చల్లి ముగ్గుల్లో పెట్టే గొబ్బెమ్మలు పంటలతో వచ్చే క్రిమి కీటకాలు ఇళ్లలోకి చేరకుండా నిలువరిస్తాయి. అందుకే ఆవుపేడతో కల్లాపు చల్లడం, గొబ్బెమ్మలు పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. నక్షత్రాల ప్రత్యేకతను తెలిపేలా..ఆకాశంలో నక్షత్రాల ప్రత్యేకతను చుక్కల ముగ్గులు తెలుపుతాయి. ఆకాశంలో చుక్కలను కలుపుతూ కూటమి ఉంటుంది. గొరుకొయ్యలు, సప్తరుషి మండలం వంటివి ఉండి ఇవన్నీ ఒకదాన్ని ఒకటి కలుపు తూ ఉంటాయి. వాటి నుంచి వచ్చినవే చుక్కల ముగ్గులు. వసుదేవుడంతటి వాడు ఈ ముగ్గులోకి లాగబడతాడని చరిత్ర. ఎంతటి వాడినైనా ముగ్గులోకి లాగటం అనే నానుడి దీన్ని నుంచే పుట్టింది. ఆధ్యాత్మికం కూడా.. ముగ్గుల వెనుక ఆధ్యాత్మికత సైతం దాగి ఉంది. చుక్కలతో మారేడు దళం, పద్మం, అష్టదళ పద్మం, నాగవల్లి, తాబేలు, కూర్మం, వంటి దశావతారాలకు సంబంధించిన ముగ్గులు ఇందులో భాగమే. వీటితోపాటు రథం ముగ్గులు, మల్లె పందిరి, పూజా సంబంధిత ఆధ్యాత్మిక ముగ్గులు వేయడం ఆనవాయితీ. దిక్కులకు సూచికధనుర్మాస సమయంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనం వైపునకు మారతాడు. సంక్రాంతి సమయంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. దీనికి సూచికగా కూడా ముగ్గులు వేస్తారు. రథం ముగ్గు ఇందులో భాగంగా ప్రతీ ఇంటా వేస్తారు. పండుగ రోజున సూర్యుడు ఇంటికి వస్తున్నట్టుగా రథం ఇంటి ముఖద్వారం వైపు వేయడం, కనుమ రోజున సూర్యుడు ఉత్తరం దిశగా రథం ఇంటి నుంచి బయటకు వెళుతున్న దిక్కుగా వేయడం ఆచారం.వైకుంఠ ఏకాదశి పండుగలో కూడా ఈ ప్రత్యేకత ఉంటుంది. ధనుర్మాస చివరి సమయంలో వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు. ఈ సమయంలో స్వర్గద్వారాలు(తలుపులు) తెరుచుకుంటాయని నమ్మకం. ఆ సమయాన్ని తెలిపే విధంగా ముగ్గులు వేస్తూ మహిళలు ఆధ్యాత్మికతను చాటుతారు. సంక్రాంతి ముగ్గులకు ఆరోగ్యం, ఆధ్యాత్మికత మేళవింపు ఉండడంతో మహిళలు ఇప్పటికీ ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. -
అయ్యవారికి దండం పెట్టు..
వేలేరు: సంక్రాంతి పండుగ వచ్చిందంటే గంగిరెద్దుల వారికి పండుగే. బసవన్న కాలికి, మెడకు గజ్జెల పట్టీలు కట్టి.. రంగురంగుల వస్త్రాలతో అందంగా అలంకరించి, కొమ్ములకు రంగులద్ది.. సన్నాయి ఊదుతూ.. ఊరూరా తిరుగుతూ సందడి చేస్తారు. అయితే పండుగ వేళ ఇళ్ల ఎదుట సందడి చేసే గంగిరెద్దుల ఆటలు నేటి ఆధునిక సమాజంలో కనుమరుగవుతున్నాయి. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మద్దెలగూడెం గ్రామంలో సుమారు 45 గంగిరెద్దుల వారి కుటుంబాలు నివసిస్తున్నాయి.వీరికి గంగిరెద్దుల ఆటనే ప్రధాన వృత్తి. తాతల కాలం నుంచి అదే వృత్తిని నమ్ముకుని జీవనాన్ని గడుపుతున్నారు. వీరికి అంతో ఇంతో ఆదాయం వచ్చేది సంక్రాంతి పండుగ సమయంలోనే. మిగతా సమయంలో గంగిరెద్దుల ఆటతో వచ్చే ఆదాయం సరిపోక బతుకుదెరువు కష్టమై కూలి పనులు చేస్తున్నారు. అలాగే ఎవరైనా చనిపోతే దశదినకర్మ సమయంలో వెళ్లి ఆటలు ఆడిస్తూ ఉంటారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ జీవితాల్లో వెలుగులు రావడం లేదని వారు వాపోతున్నారు.ప్రభుత్వం ఆదుకోవాలి.. తాతల కాలం నుంచి గంగిరెద్దులను ఆడిస్తూనే బతుకుతున్నాం. మాకు ఏ ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు అందలేదు. ఎన్నికలప్పుడు నాయకులు ఓట్లు వేయించుకోవడానికే మా దగ్గరికి వస్తారు. తర్వాత మా ఇళ్లవైపు కన్నెత్తి చూడరు. మా గంగిరెద్దుల కుటుంబాలకు 25 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చింది. ఇప్పుడు అవి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వమైనా మాకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి ఆదుకోవాలి. – బత్తుల మల్లయ్యకులవృత్తే జీవనాధారం..కులవృత్తిలో భాగంగా నా భర్త గంగిరెద్దులను ఆడిస్తాడు. సంక్రాంతికి గంగిరెద్దులను ఆడించడంతో పండుగ ఖర్చులు వస్తాయి. గ్రామాల్లో ఎవరైనా చనిపోతే దశదినకర్మ వద్దకు వెళ్లి గంగిరెద్దులను ఆడిస్తుంటారు. మిగతా సమయాల్లో కూలి, ఇతరత్రా పనులు చేసుకుంటూ పిల్లలను సాదుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ లేదు. – ఆవుదొడ్డి దుర్గమ్మ -
ప.గో జిల్లాలో సంక్రాంతి సంబరాల పేరుతో కూటమి నేతల బరితెగింపు
-
ఏపీలో కనిపించని సంక్రాంతి సంబరాలు
-
సందళ్ల సంక్రాంతి
మనకు ఎన్ని పండుగలు ఉన్నా, సంక్రాంతి పండుగ ప్రత్యేకమైనది. సంక్రాంతి అంటేనే సందడి అనేంతగా తెలుగునాట సంక్రాంతి సంబరాలు ప్రసిద్ధి పొందాయి. సూర్యుడు మకరరాశిలోకి అడుగుపెట్టే సందర్భంగా మకర సంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయనం మొదలవుతుంది. ఉత్తరాయనాన్ని పుణ్యకాలంగా భావిస్తారు. అందువల్ల మకర సంక్రాంతిని తెలుగునాటనే కాకుండా, దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. సంక్రాంతి వేడుకలు జరుపుకోవడంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో పద్ధతి. సంక్రాంతికి ముందురోజున భోగి మంటలు వేయడం, సంక్రాంతి రోజుల్లో ముంగిళ్లలో ముగ్గులు వేయడం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. మకర సంక్రాంతి సందర్భంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కనిపించే సంక్రాంతి సందళ్ల గురించి తెలుసుకుందాం.సంక్రాంతి రోజుల్లో తెలుగునాట ఊరూరా ముంగిళ్లు గొబ్బెమ్మలను తీర్చిదిద్దిన ముగ్గులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. గంగిరెద్దుల గంటల సవ్వడులు, బుడబుక్కల వాయిద్యాల ధ్వనులు, హరిదాసుల హరినామ సంకీర్తనలు వినిపిస్తాయి. కొన్నిచోట్ల కోడిపందేల కోలాహలాలు, ఇంకొన్ని చోట్ల నింగిని తాకే పతంగుల రంగులు కనువిందు చేస్తాయి. కొన్నిచోట్ల ఆడపడుచులు సంక్రాంతి సందర్భంగా ఇళ్లల్లో బొమ్మల కొలువులు కూడా పెడతారు. మకర సంక్రాంతి వేడుకలను సాధారణంగా మూడు రోజులు, ఒక్కోచోట నాలుగు రోజులు కూడా జరుపుకొంటారు. మకర సంక్రాంతికి ముందురోజు భోగి పండుగ, సంక్రాంతి మరునాడు కనుమ పండుగ, కనుమ మరునాడు ముక్కనుమ జరుపుకొంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోనూ సంక్రాంతి వేడుకలను దాదాపు ఒకేరీతిలో అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు. సంక్రాంతి ప్రధానంగా వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ. పంటల కోతలు పూర్తయ్యాక వచ్చే పండుగ ఇది. సంక్రాంతి నాటికి రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడుతుంటాయి. మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. ఇంటికి ధాన్యలక్ష్మి చేరుకునే రోజుల్లో వస్తుంది కాబట్టి, సంక్రాంతి లక్ష్మి అని, పౌష్యలక్ష్మి అని అంటారు. ‘వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి’ అంటూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతారు. నెల్లాళ్లు రంగవల్లుల వేడుకమకర సంక్రాంతికి నెల్లాళ్లు ముందు వచ్చే ధనుస్సంక్రాంతి నుంచి ముంగిళ్లలో నెల్లాళ్ల పాటు రంగవల్లుల వేడుక సాగుతుంది. ఇళ్ల ముందు రకరకాల రంగవల్లులను తీర్చిదిద్ది వాటిని గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. అష్టదళ పద్మం, నాగబంధం, మారేడు దళాలు, శివుడి త్రినేత్రాలు, పెళ్లిపీటల ముగ్గు వంటి సంప్రదాయ ముగ్గులతో పాటు రకరకాల ముగ్గులను తీర్చిదిద్దుతారు. ధనుస్సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు సాగే నెల్లాళ్లను సౌరమానం ప్రకారం ధనుర్మాసం అంటారు. ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో తిరుప్పావై పాశురాలను పఠిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు. కట్టుపొంగలి, చక్కెరపొంగలి వంటి వంటకాలను నైవేద్యంగా పెడతారు. భోగి పండుగ రోజున ఆలయాల్లో గోదా కల్యాణం వేడుకలను నిర్వహిస్తారు. చివరి రోజున రథం ముగ్గు వేస్తారు. దీనిని దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి పయనం సాగించిన సూర్యుని రథంగా భావిస్తారు.భోగ భాగ్యాల భోగిపూర్వం విష్ణుచిత్తుడు అనే విష్ణుభక్తుడు ఉండేవాడు. విష్ణుచిత్తుడికి ఒకనాడు తులసివనంలో ఒక పసిబిడ్డ దొరికింది. విష్ణుచిత్తుడు ఆమెను కుమార్తెగా స్వీకరించి పెంచాడు. ఆమె గోదాదేవి. చిన్ననాటి నుంచి శ్రీరంగనాథుడిని ఆరాధించేది. శ్రీరంగనాథుడు ఆమెను మకర సంక్రాంతికి ముందు ధనుర్మాసం చివరి రోజున పెళ్లాడాడు. ఆమెను భోగభాగ్యాలతో ముంచెత్తాడు. రంగనాథుని పెళ్లాడటంతో గోదాదేవి కైవల్య భోగాన్ని పొందిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. గోదా రంగనాథుల పరిణయానికి, భోగభాగ్యాలకు ప్రతీకగా భోగి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. భోగి రోజున ఇంట్లోని చిన్నపిల్లలకు రేగుపండ్లు, చెరకు ముక్కలతో భోగిపండ్లు పోసి, పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. హేమంత రుతువులో చలితీవ్రత ఎక్కువగా ఉండేరోజుల్లో ఈ పండుగ వస్తుంది కాబట్టి, భోగిపండుగ రోజున వేకువ జామున ఇళ్ల ముంగిట గాని, వీథి చివరన గాని పెద్దపెద్ద భోగిమంటలు వేస్తారు. భోగిమంటల్లో పిడకల దండలు, ఎండిపోయిన తాటాకులు, పెద్దపెద్ద కర్రదుంగలు, పాత వస్తువులు వేస్తారు. రైతులు భోగిరోజున కోతలు పూర్తయిన తమ పొలాలను కొంత నీటితో తడుపుతారు. దీనిని ‘భోగి పులక’ అంటారు. భోగి రోజు నుంచి గాలిపటాల సందడి కూడా మొదలవుతుంది. సిరుల వేడుక సంక్రాంతి«రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడే రోజుల్లో వచ్చే సిరుల పండుగ మకర సంక్రాంతి. ఈ రోజు పాలు పొంగించి, కొత్తబియ్యంతో పాయసం వండుతారు. పితృదేవతలను పూజించి, పితృతర్పణాలు విడుస్తారు. శ్రీకృష్ణుడు ఇదేరోజున గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి, ఇంద్రుడు కురిపించిన రాళ్లవాన నుంచి యాదవులను కాపాడాడని, ఇంద్రునికి గర్వభంగం చేశాడని పురాణాల కథనం. ఈరోజున ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడిని పూజిస్తారు. సంక్రాంతి రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు ఫలితం ఉంటుందనే నమ్మకం ఉండటంతో ఈరోజున విరివిగా దాన ధర్మాలు చేస్తారు. ఇళ్లకు వచ్చే హరిదాసులకు, బుడబుక్కల వాళ్లకు, గంగిరెద్దులను ఆడించేవాళ్లకు యథాశక్తి ధన ధాన్యాలను దానం చేస్తారు. సంక్రాంతి రోజున డబ్బు, ధాన్యం మాత్రమే కాకుండా, విసనకర్రలు, వస్త్రాలు, నువ్వులు, చెరకు, పండ్లు, కూరగాయలు వంటివి కూడా దానం చేస్తారు. సంక్రాంతి రోజున చేసే గోదానం విశేష ఫలితం ఇస్తుందని చెబుతారు. అందువల్ల సంపన్న గృహస్థులు సంక్రాంతి రోజున గోదానాలు కూడా చేస్తారు. పశువుల పండుగ కనుమమకర సంక్రాంతి మరునాడు కనుమ పండుగ జరుపుకొంటారు. పొలం పనుల్లో ఏడాది పొడవునా చేదోడు వాదోడుగా నిలిచిన పశువులను అలంకరించి, వాటికి ఇష్టమైన మేతను పుష్టిగా పెడతారు. కనుమ రోజున మాంసాహారులు రకరకాల మాంసాహార వంటకాలతో విందుభోజనాలు చేస్తారు. మనకు కనుమ నాడు మినుము తినాలని సామెత ఉంది. మాంసాహారం తినని శాకాహారులు మాంసకృత్తులు పుష్కలంగా ఉండే మినుములతో తయారుచేసే గారెలు, ఆవడలు వంటి వంటకాలను ఆరగిస్తారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం సంప్రదాయంగా వస్తోంది.ముగింపు ముక్కనుమసంక్రాంతి వేడుకల్లో మొదటి మూడు రోజుల్లోనూ నిర్దిష్టంగా పాటించవలసిన సంప్రదాయ నియమాలు ఉన్నాయి గాని, నాలుగో రోజైన ముక్కనుమకు ప్రత్యేక నియమాలేవీ లేవు. కొందరు మాంసాహారులు కనుమనాడు మాంసాహారం తినరు. వారు ముక్కనుమ రోజున మాంసాహార విందులు చేసుకుంటారు. ముక్కనుమ రోజున నవవధువులు సావిత్రి గౌరీవ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని బొమ్మల నోము అంటారు. నోము పూర్తయ్యాక, పూజలో ఉంచిన బొమ్మలను నిమజ్జనం చేస్తారు. ముమ్మతాల పండుగమకర సంక్రాంతి హిందువుల పండుగ మాత్రమే కాదు, ఇది ముమ్మతాల పండుగ. హిందువులతో పాటు జైనులు, సిక్కులు కూడా మకర సంక్రాంతి పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. జైన ఆగమం ప్రకారం ఈ దేశాన్ని పాలించిన భరత చక్రవర్తి మకర సంక్రాంతి రోజున అయోధ్యలో సూర్యుడిని చూసినప్పుడు, ఆయనకు సూర్యుడిలో ‘జిన’ దర్శనం లభించింది. వెంటనే ఆయన జినాలయాన్ని దర్శించుకున్నప్పుడు, ఆ ఆలయ ద్వారం అయోధ్య నగరానికి అభిముఖంగా ఉందట! జైన మతం ప్రకారం ఇంద్రియాలను జయించిన ఆధ్యాత్మిక విజేతను ‘జిన’ అంటారు. మకర సంక్రాంతిని పర్వదినంగా జరుపుకొనే జైనులు, ఆరోజున జైన ఆలయాలను దర్శించుకుని, ప్రార్థనలు జరుపుతారు. ఆలయాల వద్ద, తమ తమ నివాసాల వద్ద విరివిగా దానాలు చేస్తారు.సిక్కులు మకర సంక్రాంతిని ‘మాఘి’ పేరుతో జరుపుకొంటారు. సిక్కుల గురువైన గురు గోబింద్‌సింగ్ అనుచరుల్లో నలభైమంది 1705లో సంక్రాంతి రోజున జరిగిన ముక్తసర్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల సిక్కులు సంక్రాంతిని ఆ నలభై మంది అమరవీరుల స్మారకదినంగా పాటిస్తారు. ముక్తసర్‌లోని గురుద్వారాలో ఉన్న తటాక జలాల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. పంజాబ్, హరియాణా, జమ్ము, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి ముందు రోజును ‘లోహ్రీ’ పండుగగా జరుపుకొంటారు. లోహ్రీ సందర్భంగా వీథుల్లో భోగిమంటల మాదిరిగానే భారీగా చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో ఆనందం పంచుకుంటారు. హిమాచల్ ప్రజలు సంక్రాంతి వేడుకల్లో అగ్నిదేవుడికి ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.పతంగుల పండుగసంక్రాంతి సందర్భంగా పతంగులను ఎగురవేసే సంప్రదాయం మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉంది. గుజరాత్లో పతంగుల సందడి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. గుజరాతీలు ధనుర్మాసం నెల్లాళ్లూ గాలిపటాలను ఎగురవేస్తారు. పలుచోట్ల గాలిపటాల పోటీలు కూడా నిర్వహిస్తారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ సంక్రాంతి రోజుల్లో గాలిపటాల సందడి కనిపిస్తుంది. కర్ణాటక పర్యాటక శాఖ గోకర్ణ, కార్వార్ తదితర బీచ్‌లలో గాలిపటాల వేడుకలను కొన్నేళ్లుగా నిర్వహిస్తోంది. సూర్యభగవానుడికి కృతజ్ఞత తెలుపుకోవడానికే గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం పుట్టిందని చెబుతారు. చారిత్రకంగా చూసుకుంటే, మొఘల్‌ల కాలం నుంచి మన దేశంలో గాలిపటాలను ఎగురవేయడం వినోదక్రీడగా మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి.కోడి పందేలుకోడి పందేలు మన దేశంలో పురాతన వినోద క్రీడ. చట్టపరమైన నిషేధాలు ఉన్నా, నేటికీ ఏటా సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు విరివిగా జరుగుతూనే ఉన్నాయి. కోడి పందేల కారణంగానే పలనాటి యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే! దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ కోడి పందేల ఆచారం ఉన్నా, తెలుగునాట కోడి పందేలు మరింత ఎక్కువగా జరుగుతాయి. కోడి పందేల్లో గెలుపు సాధించడం కోసం పూర్వీకులు ఏకంగా ‘కుక్కుట శాస్త్రం’ రాశారంటే, కోడిపందేల పట్ల జనాల మక్కువ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో కోడి పందేలు ఎక్కువగా జరిగేవి. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు పెందేల కోసం మేలిరకం కోడిపుంజులను పెంచుతుంటారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, తణుకు తదితర పట్టణాలు పందెంకోళ్లకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై ఏళ్ల కిందట ఆయిల్ పామ్ సాగు మొదలైనప్పటి నుంచి ఇక్కడ కూడా పందెం కోళ్ల పెంపకం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలోనే పందెంకోళ్లు చౌకగా లభిస్తుండటంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా పందెంరాయుళ్లు పుంజులను కొనేందుకు అశ్వారావుపేట, దమ్మపేట వంటి చోట్ల బారులు తీరుతుండటం విశేషం. పందెం కోళ్ల పెంపకం, వాటి శిక్షణ కోసం కోళ్ల పెంపకందారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. సంక్రాంతికి ఏటా కోట్లాది రూపాయల్లో కోడి పందేలు జరుగుతాయి. పందెం కొళ్లకు లక్షల్లో ధరలు పలుకుతాయి. పొరుగు దేశాల్లో సంక్రాంతిమన పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లోనూ మకర సంక్రాంతి వేడుకలను జరుపుకొంటారు. బంగ్లాదేశ్‌లోని బెంగాలీ హిందువులు సంక్రాంతి ముందురోజు భోగిమంటలు వేసి, బాణసంచా కాలుస్తారు. సంక్రాంతి రోజున పితృదేవతలకు పూజలు చేస్తారు. పండుగ రోజుల్లో ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు. ఈ సందర్భంగా బంధుమిత్రులతో కలసి వినోదంగా పాచికలాట ఆడతారు. ఈ రోజుల్లో సమీపంలోని చెరువులకు, నదులకు వెళ్లి చేపలను వేటాడతారు. పండుగ రోజుల్లో ఎవరికి పెద్దచేపలు చిక్కుతాయో వారికి ఏడాదంతా అదృష్టం బాగుంటుందని నమ్ముతారు. నేపాల్ ప్రజలు మకర సంక్రాంతిని ‘మాఘే సంక్రాంతి’గా జరుపుకొంటారు. థారు, మగర్ సహా వివిధ స్థానిక తెగల ప్రజలు తమ తమ సంప్రదాయ రీతుల్లో ఘనంగా వేడుకలు జరుపుకొంటారు. దేవాలయాల వద్దకు చేరుకుని, సంప్రదాయ నృత్యగానాలను ప్రదర్శిస్తారు. పాకిస్తాన్‌లోని సింధీ ప్రజలు మకర సంక్రాంతిని ‘తిర్మూరి’ పేరుతో జరుపుకొంటారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు పుట్టింటి నుంచి నువ్వులతో తయారు చేసిన పిండివంటలను పంపుతారు. శ్రీలంక ప్రజలు తమిళనాడులో మాదిరిగానే ‘పొంగల్’ వేడుకలు జరుపుకొంటారు. ఇన్పుట్స్: దాళా రమేష్‌బాబు, గుంటూరు తాండ్ర కృష్ణగోవింద్, కొత్తగూడెం ఫొటోలు: షేక్ రియాజ్ -
పల్లెకు చలో.. రద్దీగా రహదారులు..
-
నల భీముల ‘వంట’ పండింది
కేవలం నాలుగు రోజులు వంట పని. ఉదయం సుమారు 500 మందికి టిఫిన్.. 1,500 నుంచి 2 వేల మందికి నాన్ వెజ్ వంటకాలతో మధ్యాహ్న, రాత్రి భోజనం.. సాయంత్రం స్నాక్స్. ఇవన్నీ చేయడానికి ఆరేడుగురు వంట మేస్త్రీలు, మాస్టర్లు, మహిళలు సహా పదిమందికి పైగా సహాయకులు. రోజుకు కనీసం రూ.50 వేల చొప్పున సంక్రాంతి పండుగ మొత్తం రూ.2 లక్షలకు మించి వెచ్చించే తరుణమిది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి–మాదలవారిగూడెం సమీపంలో కోడి పందేల బరివద్ద ఏర్పాట్ల కోసం ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన వారితో కుదుర్చుకున్న ఒప్పందమిది.సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: వంటల్లో చేయితిరిగిన నలభీములకు సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటవుతున్న బరుల వద్ద పైతరహా ఒప్పందాలు జరిగాయి. సంప్రదాయ పిండి వంటలు, తీపి పదార్థాలు చేయడంలోనూ అనుభవజ్ఞుల పంట పండుతోంది. నాన్ వెజ్ వంటకాల్లో ప్రావీణ్యం ఉన్న ఒక్కో వంట మాస్టర్‌కు రోజుకు రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు సమకూరుతోంది. నగరాలు, పట్టణాల్లోని హోటళ్లలో పనిచేస్తున్న మాస్టర్లు కొందరు స్వస్థలాలకు వెళ్లి వస్తామంటూ తాత్కాలిక ఒప్పందాలు కుదుర్చుకుని వెళుతున్నారని ఆయా హోటళ్ల నిర్వాహకులు, యజమానులు చెబుతున్నారు.కొత్త అల్లుళ్లు, బంధుమిత్రుల కోససంక్రాంతికి ఇంటికొచ్చిన కొత్త అల్లుళ్లు, బంధువులు, స్నేహితులకు వివిధ రకా ల విందు భోజనాలు ఏర్పాటు చేయా లని సంపన్నవర్గాల వారు తహతహ లాడుతుంటారు. అల్లుళ్లకు మర్యాదలు చేయడంలో గోదారోళ్ల స్టైలే వేరు. కృష్ణా, గుంటూరు వాళ్లదీ అదే తీరు. వందల రకాలు వడ్డించడం వారికొక సరదా. గతేడాది ఏలూరు జిల్లాలో కొత్త అల్లుడికి 379 రకాల పదార్థాలు వడ్డించిన కుటుంబం వార్తల్లో నిలిచింది. వంద రకాలకు పైగా స్వీట్లు, నలభై రకాలకు మించి స్నాక్స్, నలభై రకాల కూరలు, ఇరవై రకాల చట్నీలు.. ఇలా విభిన్న పదార్థాలు విస్తరిలో వడ్డించి తమ ప్రేమాభిమానా లను చాటుకున్నారు.ఇలాంటివి పలు చోట్ల చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చా యి. మటన్, చికెన్, రొయ్యలు, పీతలు, కొరమీను, మెత్తళ్లు, నల్లసందువా తది తర చేపలతో వెరైటీలు చేయగలిగిన వారిని సంపన్న కుటుంబాల వారు రోజుకు లేదా గుంపగుత్తగా రూ.వేలల్లో చెల్లించి నియమించుకుంటున్నారు. వా రం నుంచి పక్షం రోజుల వరకు ఇళ్లల్లోనే ఉండి కావాల్సిన వెరైటీ వంటలు చేయా ల్సి ఉంటుంది. రోజుకు వేతనం రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లిస్తున్నా రని, సహాయకుడికి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు చెల్లిస్తారని పాల కొల్లుకు చెందిన కేటరింగ్ నిర్వాహకుడు మజ్జి శ్రీనివాస్ వివరించారు.దమ్ చేయడం తెలిస్తే..మటన్, బికెన్ దమ్ బిర్యానీ చేయడంలో ఆరితేరిన వారికి మంచి డిమాండ్ ఉందని విజయవాడలో పలు హోటళ్లు నిర్వ హిస్తున్న మనోహర్ ‘సాక్షి’కి చెప్పారు. ఏదైనా ఒక ఈవెంట్ కోసం 2 వేల మందికి స్పెషల్స్ చేయడానికి మాస్టర్ రూ.6 వేల నుంచి రూ.7 వేలు తీసుకుంటారని, సంఖ్య అంతకు మించితే మరో మాస్టర్‌కు అంతే మొత్తం చెల్లించాల్సి వస్తుంది. మాస్టర్లకు, వారి సహాయకులకు వసతి, భోజనం, రవాణా వసతి అదనం. వివాహాలు, ఈవెంట్ల కోసం రెండు రకాల వెరైటీ స్వీట్స్ చేసే వారికి కూడా మంచి డిమాండ్ ఉందని వివరించారు.ఇందుపల్లి వంటవారు ప్రత్యేకంవంటలు చేయడంలో కృష్ణా జిల్లా ఇందుపల్లి వారికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కృష్ణాతో పాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల వారు కూడా ముఖ్య కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇందుపల్లి వంటలకు ప్రాధా న్యమిచ్చి పిలిపించుకుంటారు. సంక్రాంతి సందర్భంగా అనేక ప్రాంతాల వారి నుంచి పిలుపులు వచ్చాయని ఇందుపల్లి ఎంపీటీసీ సభ్యుడు, వంట మేస్త్రీ అయిన కూరాకుల వెంకట్రామయ్య తెలిపారు. తమ బృందం కూడా నాలుగు రోజుల వంటలకు ఒప్పందం కుదుర్చు కుందన్నారు. అలాగే పాలకొల్లు బంగారుచెరువు గట్టు ప్రాంతంలో దాదాపు వంద మంది వరకు కేటరింగ్ నిర్వాహకులు ఉన్నారు. ఇప్పటికే వీరిలో చాలామంది సంక్రాంతి కోడి పందేల బరులు, సంపన్నుల ఇళ్లు, అతిథి గృహాలు, విల్లాల వద్ద ప్రత్యేక వంటలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్లిపోయారు.⇒ కాకినాడ జిల్లా వేళంగి గ్రామం కూడా వంట మేస్త్రీలకు ప్రసిద్ధి. ఇక్కడ 150 మందికి పైగానే వంట మేస్త్రీలు ఉంటారు. రాష్ట్రంలోని నలుమూలలకు వెళ్లి విభిన్న రకాల వంటలు వండి వడ్డిస్తుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వీరికీ డిమాండ్ ఎక్కువగా ఉంది.⇒ భీమవరం సమీపంలోని చినఅమిరంలో ఆర్డర్లపై పిండి వంటలు తయారుచేసే వారున్నారు. ఎన్ని వెరైటీలు కావాలన్నా సమయానికి అందజేస్తారు. కాళ్ల మండపం కోపల్లె, తణుకు మండలం వేల్పూరు గ్రామాల్లో పిండి వంటలు తయారు చేసే మహిళలు ఎక్కువ. సంక్రాంతి రోజుల్లో ఆర్డర్లపై దేశ విదేశాల నుంచి వచ్చిన వారికి పిండి వంటలు సిద్ధం చేసి ఇస్తుంటారు.⇒ వంటలు చేయడంలో ఆరితేరిన మేస్త్రీలు, సహాయకులకు ఇంతగా డిమాండ్ పెరగడానికి మరో కారణం కూడా ఉంది. ప్రావీణ్యమున్న పలువురు పండుగ సమయంలో తమ కుటుంబీకులు, స్నేహితులతో గడపడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎంత డబ్బులు ఇస్తామన్నా వంట పనికి వెళ్లరు. దీంతో పనికి సిద్ధపడేవారు కొద్దిరోజులకే జాక్‌పాట్ కొట్టినట్టే. -
సంక్రాంతి ముందే సలసల
సాక్షి, హైదరాబాద్: సంకాంత్రి పండుగ సామాన్యుడికి భారమైంది. పట్టణం నుంచి పల్లె వరకు ప్రజలంతా నిత్యావసర ధరలను చూసి భయపడిపోతున్నారు. పల్లెల్లోని రైతులకు పిండివంటలకు అవసరమైన బియ్యం సొంత పొలాల నుంచే వచ్చినా.. సకినాలు, గారెలకు కావాల్సిన నువ్వులు, వాము(వంద గ్రాములకు రూ. 40), శనగలు, వేరుశనగ వంటి పప్పు, నూనె ధాన్యాల ధరలు భారీగా ఉన్నాయి. పండుగకు తప్పదనే ధోరణితో ఉన్న దాంట్లోనే పొదుపు పాటిస్తూ నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని బేగంబజార్ వంటి ప్రధాన మార్కెట్లలో కొనుగోళ్లు తగ్గాయి. పెరిగిన ధరలతోపాటు నగరవాసులు ఊళ్లకు వెళ్లడం కూడా అందుకు కారణంగా చెబుతున్నారు. రాష్ట్రంలో డబ్బు సర్క్యులేషన్ కూడా ఆశించిన స్థాయిలో లేనందున కూడా గిరాకీలు తగ్గినట్టు చెబుతున్నారు. చేతినిండా పనిలేని కారణంగా ఆశించిన మేర డబ్బు ఆడడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.కాగుతున్న నూనెలు..సంక్రాంతి వస్తుందంటే వారం రోజుల ముందు నుంచే ఇళ్లలో పిండి వంటలు ఘుమఘుమలాడేవి. ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు పిండి వంటలకు దూరమవుతున్నారు. నాలుగు నెలల్లోనే నూనె లీటర్ ధర రూ.10 నుంచి రూ.15 వరకు, పప్పు ధాన్యాల ధరలు 10 శాతంకు పైగా పెరిగాయి. ఈ తేడా గత ఆగస్టు నెలతో పోలిస్తే రూ. 25 నుంచి రూ.30 వరకు ఉంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న యుద్ధ వాతావరణంతోపాటు నూనెల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచడంతో పామాయిల్ లీటర్ ధర ఒక్కసారిగా రూ.94 నుంచి రూ.129కి చేరింది. సన్‌ఫ్లవర్ నూనె లీటరుకు రూ.145 నుంచి రూ.150 వరకు, పల్లీ నూనె లీటరుకు రూ.160కి పైగా, రైస్ బ్రాండ్ రూ.147 నుంచి రూ.160 ఉన్నాయి. నెలరోజుల క్రితం నూనె ధరలు ఇంకొంచెం అధికంగా ఉండగా, జనవరి మొదటివారంలో కొంత మేర తగ్గాయి. ఉడకనంటున్న పప్పు పిండి వంటలు చేసుకోవడానికి పప్పు ధాన్యాలే ముఖ్యం. ఏ పప్పు ముట్టుకున్నా వాటి ధరలు నిప్పుల్లా కాలుతున్నాయి. ప్రస్తుతం శనగపప్పు కిలోకు రూ.100, నువ్వులు రూ. 170, బెల్లం రూ. 70, గోధుమ పిండి ప్యాకెట్ రూ. 60గా ఉంది. కాగా కందిపప్పు, పెసరపప్పు ధరలు ఈనెల మొదటి వారం నుంచి కొంత తగ్గుముఖం పట్టడం కొంత ఊరట. కందిపప్పు రూ.158, మినప గుండ్లు రూ. 164, పెసరపప్పు రూ. 120కి తగ్గాయి.కొత్త బియ్యం రూ. 60, పాతబియ్యం రూ.70 పైనే ఉండగా, మొన్నటి వానాకాలం సీజన్లో పండిన పంటకు సంబంధించిన నాణ్యమైన బియ్యం ధర మాత్రమే కిలో రూ. 60 కన్నా తక్కువగా ఉంది. జైశ్రీరాం, తెలంగాణ సోనా, హెచ్ఎంటీ, బీపీటీ వంటి సన్నబియ్యం ధర పాతవైతే కిలో రూ.70 వరకు పలుకుతోంది. నాణ్యమైన వెల్లుల్లి ధర కిలో రూ. 450 నుంచి రూ. 500 వరకు ఉంది. ఇంత మొత్తంలో చెల్లించి సామాన్యులు వెల్లుల్లి కొనలేకపోతున్నారు. ఉల్లిగడ్డ ధరలు తగ్గుముఖం పట్టినట్టు చెబుతున్నా, హైదరాబాద్‌లో కిలో రూ. 50కి తక్కువగా లేదు. ఇతర కూరగాయ రేట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.ఈ ఫొటోలో కనిపిస్తున్నది జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఓ కిరాణాకొట్టు. సరుకుల కోసం పండుగ వేళ దుకాణంలోకి వస్తున్న వినియోగదారులు సగం సంబరం–సగం కష్టం అన్నట్టుగా కనిపిస్తున్నారు. ఒకవైపు పిల్లలు పండుగకు వస్తున్న సంతోషం, మరోవైపు ధరలు పెరిగిన అసంతృప్తి వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సంక్రాంతికి తమ వద్దకు వచ్చే కస్టమర్లలో చాలామంది సంతోషంగా సరుకులను తీసుకుపోవడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఖరీదు చేస్తున్నారని దుకాణ యజమాని చెప్పారు.పండుగల సమయంలో హెచ్చుతగ్గులు సహజమేధరల హెచ్చుతగ్గులకు జాతీయ, అంతర్జాతీయ అంశాలతోపాటు వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది. నూనెలు, పప్పుల ధరల గత కొంతకాలంగా పెరిగాయి. పండుగల సమయంలో నిత్యా వసర వస్తువుల ధరల్లో 5 నుంచి 10 శాతం హెచ్చుతగ్గులు సహజమే. కొన్నేళ్లుగా పండుగలు వచ్చినప్పుడు హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో సందడి తగ్గింది. నగరవాసులు సొంతూర్లకు వెళుతుండడంతో బేగంబజార్ దుకాణాల్లో గిరాకీ ఉండడం లేదు. – జీవన్ భాటి, కిరాణ మర్చంట్స్ అసోసియేషన్, బేగంబజార్ -
ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడే బాదుడు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన తొలి సంక్రాంతికి ‘ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం.. ప్రైవేట్ సర్వీసులు కూడా ఆర్టీసీతో సమానంగా టికెట్ రేట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం..’ ఇది సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పదే పదే మీడియాలో చెబుతున్న మాట.. కానీ, వాస్తవం ఏమిటంటే.. ప్రైవేట్ బస్సుల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండాపోయింది. ఆన్లైన్లో ధరలను మూడు, నాలుగింతలు పెంచేసి నిలువు దోపిడీ చేసేస్తున్నారు. పైగా.. టికెట్లను బ్లాక్‌చేసి కృత్రిమ కొరత సృష్టించి రూ.వందల కోట్ల భారీ దోపిడీకి స్కెచ్ వేశారు.ఎందుకంటే పండుగ రద్దీకి తగ్గట్లుగా ఆర్డీసీ బస్సు సర్వీసుల్లేవు. దీంతో మధ్యతరగతి, పేద వర్గాలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే దిక్కయ్యాయి. ఇదే అదనుగా రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ ప్రజల ఉత్సాహాన్ని నీరుగార్చేస్తోంది. చార్జీలను ఏకంగా మూడు నాలుగు రెట్లు పెంచేసి ఎడాపెడా దోచేస్తోంది. అయినా ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోంది. ఎందుకంటే రవాణా శాఖలో ఓ కీలక నేతకు ఈ సిండికేట్ ముందుగానే రూ.50 కోట్లకు పైగా ముడుపులు అందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా.. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకం తక్కువ. ఒకవేళ ఉన్నా వారు డబ్బులు తీసుకుని టికెట్ బుక్చేసినట్లు మెసేజ్ ఇస్తున్నారు. అందులో వ్యూహాత్మకంగా టికెట్ ధర పేర్కొనడంలేదు. కానీ, ఆన్లైన్లో మాత్రం పెంచిన ధరలను ప్రదర్శిస్తున్నారు. మూడు, నాలుగురెట్లు అధికంగా చార్జీలు..ఏటా సంక్రాంతికి దాదాపు 75 లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారని అంచనా. వీరిలో సొంత వాహనాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 35 లక్షల మంది ప్రయాణిస్తారు. మిగిలిన దాదాపు 40 లక్షల మందికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే దిక్కు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ది ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది. ఈ నేపథ్యంలో.. తమ సర్వీసుల్లో జనవరి 11 నుంచి 18 వరకు రానూపోనూ టికెట్లను జనవరి 1 నాటికే బ్లాక్ చేసేశాయి. ఆ తర్వాత చార్జీలను ఏకంగా మూడు నాలుగు రెట్లు పెంచేశాయి. ఉదా.. ⇒ సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి విశాఖపట్నానికి నాన్ ఏసీ బస్సు రూ.750, ఏసీ బస్సు రూ.1,200, స్లీపర్ బస్సు రూ.1,500 టికెట్ వసూలుచేసేవారు. కానీ, ఈ పండుగ సీజన్లో నాన్ ఏసీ బస్సు రూ.2 వేలు, ఏసీ బస్సు రూ.3 వేలు, ఏసీ స్లీపర్ బస్సు రూ.5 వేలు వరకు అమాంతంగా పెంచేశారు. ఇక విజయనగరం, శ్రీకాకుళం వెళ్లేందుకైతే మరో రూ.500 వరకు అదనంగా చెల్లించాలి. ⇒ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సాధారణ రోజుల్లో ఏసీ బస్సులో రూ.వెయ్యి వసూలుచేసేవారు. ఇప్పుడు దానిని రూ.2,500కు పెంచేశారు. ⇒ విజయవాడ నుంచి రాయలసీమలోని కడప, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలకు సాధారణ రోజుల్లో ఏసీ బస్సు రూ.1,200 చార్జీ ఉండగా, ప్రస్తుతం రూ.3,500 నుంచి రూ.4వేల వరకు పెంచేయడం గమనార్హం. ⇒ కాకినాడ, రాజమహేంద్రవరం తదితర జిల్లా కేంద్రాలకు కూడా చార్జీలను ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ భారీగా పెంచేసింది. ⇒ ఇక సాధారణ రోజుల్లో హైదరాబాదు నుంచి నెల్లూరుకు ఏసీ స్లీపర్ 1,500 ఉంటే ఇప్పుడు రూ.3వేల వరకు ఉంది. నాన్–ఏసీ స్లీపర్ ధర రూ.1,000 నుంచి రూ.2,500కు పెరిగింది. అదే నాన్–ఏసీ బస్సు అయితే రూ.850 ఉన్న దానిని రూ.2 వేల వరకు పెంచారు. ⇒ బెంగుళూరు నుంచి నెల్లూరుకు ఏసీ స్లీపర్ సాధారణ రోజుల్లో రూ.1,000 ఉంటే ప్రస్తుతం రూ.2,500 వరకు ఉంది. అదే నాన్–ఏసీ స్లీపర్‌కు రూ.900 నుంచి రూ.2వేలు, నాన్–ఏసీకి రూ.800 నుంచి రూ.1,700 వరకు పెంచారు.⇒ గుంటూరు నుంచి హైదరాబాద్‌కు మామూలు రోజుల్లో నాన్ ఏసీ బస్సుకు రూ.450, ఏసీ బస్సుకు రూ.500, స్లీపర్ ఏసీ బస్సుకు రూ.650–750, హైదరాబాద్ నుంచి గుంటూరుకు నాన్ఏసీ రూ.500, ఏసీ రూ.550, స్లీపర్ ఏసీ రూ.600–రూ.700 రూపాయలు.. కానీ, పండుగ సీజన్‌తో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.1,000 నుంచి రూ.2,000 వరకు రేటును పెంచేశారు. ⇒ అదే బెంగళూరుకు ఆర్టీసీలో రూ.900 నుంచి రూ.18 వందల వరకూ ధర ఉండగా, ప్రైవేట్ ట్రావెల్స్ రూ.2 వేల నుంచి రూ.2 వేల వరకూ వసూలుచేస్తున్నారు. ఈ రేట్లను అధికారికంగా వెబ్సైట్లలో పెట్టి మరీ అమ్ముతున్నారు. రూ.1,200 కోట్ల దోపిడీ..దాదాపు 40 లక్షల మంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారానే ప్రయాణించనుండటం సిండికేట్ దోపిడీకి మార్గం సుగమమైంది. సగటున ఒక్కో టికెట్‌పై సరాసరిన రూ.1,500 వరకు అదనపు బాదుడుకు పాల్పడుతోంది. ఇలా 40 లక్షల మంది రానూపోనూ ప్రయాణం అంటే 80 లక్షల మంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనే ప్రయాణించాలి. ఆ ప్రకారం రూ.1,200 కోట్లు దోపిడీకి ప్రైవేట్ బస్సుల ముఠా పాల్పడుతోంది.⇒ ఈమె పేరు బొత్స పద్మప్రియ. శ్రీకాకుళానికి చెందిన విద్యార్థిని. హైదరాబాద్‌లో ఓ పరీక్ష రాసేందుకు వెళ్లాల్సి వచ్చింది. ఇటువైపు నుంచి రైలు టికెట్ దొరికింది. కానీ, తిరుగు ప్రయాణానికి దొరకలేదు. దీంతో.. 20 రోజుల ముందే ప్రైవేట్ ట్రావెల్స్‌లో టికెట్ బుక్ చేసుకుంది. అయినా ఆ ట్రావెల్స్ ఆపరేటర్ సంక్రాంతి సీజన్ పేరుతో రూ.4,220.95 చార్జీ అని, జీఎస్టీ పేరుతో మరో రూ.780 వసూలుచేశారు. విచిత్రమేమిటంటే టికెట్లో జీఎస్టీ కోసం మినహాయించిన మొత్తాన్ని చూపించలేదు. ముందు బుక్ చేయకపోతే నా పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో అని పద్మప్రియ వాపోయింది.కీలక నేతకు ముడుపుల మేత?ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ అమాంతంగా చార్జీలు పెంచేసి దోపిడీకి పాల్పడుతున్నా రవాణా శాఖ యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడంలేదన్నది అందరి అనుమానం. కానీ, అసలు విషయం ఏమిటంటే.. ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు రాయలసీమకు చెందిన రవాణా శాఖ కీలక నేతే పచ్చజెండా ఊపారు. ఎందుకంటే.. ట్రావెల్స్ సిండికేట్ ముందుగానే ఆయనతో డీల్ కుదుర్చుకుంది. విజయవాడలోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఓ కీలక అధికారి, ఆ కీలక నేత పేషీలోని ఓ ముఖ్య ఉద్యోగే ఈ డీల్‌లో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. అందుకే.. వీటివైపు కన్నెత్తి చూడడంలేదు.చార్జీలను అమాంతంగా పెంచేశారు..సంక్రాంతి పేరుతో ప్రైవేట్ బస్సుల్లో చార్జీలను అమాంతంగా పెంచేశారు. కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి సొంతూరు వచ్చి వెళ్లాలంటే చార్జీలకు రూ.25 వేలు అవుతోంది. సరిపడా బస్సులను ప్రభుత్వం ఏర్పాటుచేయకపోవడం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెంచిన చార్జీలను వెబ్సైట్లో పెడుతున్నా, ప్రభుత్వం స్పందించడంలేదు. – కార్తీక్ రామిరెడ్డి, నెల్లూరువిమాన టికెట్ ధరలకూ రెక్కలు..గన్నవరం: సంక్రాంతి సందర్భంగా విమాన టికెట్ల ధరలకూ రెక్కాలొచ్చాయి. సాధారణ రోజులతో పోల్చితే ఈనెల 11, 12, 13 తేదీల్లో ఈ ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు భారీగా పెరిగాయి. ప్రయాణికుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉండే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చే విమానాల్లో ధరల దరువు ఎక్కువగా ఉంది. రైళ్లు, బస్సులు టికెట్లు దొరక్కపోవడంతో పండక్కి స్వగ్రామాలకు వచ్చే ప్రజలు ప్రత్యామ్నాయంగా విమాన ప్రయాణంపై మొగ్గు చూపుతున్నారు. దీంతో విమాన టికెట్ ధరలు కొండెక్కాయి.ముఖ్యంగా.. బెంగళూరు నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో రూ.3,500 నుంచి రూ.3,750 ఉండే విమాన టికెట్ ధరలు ఈ మూడు రోజులు రూ.13,350 నుంచి రూ.16,058 వరకు పలుకుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే విమానాల టికెట్ ధరలు సాధారణ రోజుల్లో రూ.3 వేల లోపు ఉండగా ప్రస్తుతం రూ.11,615 నుంచి రూ.16,716 వరకు పెరిగాయి. ఇక న్యూఢిల్లీ–విజయవాడ మధ్య టికెట్ ధర రూ.6,500 నుంచి రూ. 20,986కు చేరుకోవడం గమనర్హం. అలాగే, చెన్నై నుంచి విజయవాడకు టికెట్ ధర నాలుగు రేట్లు పెరిగి రూ. 13,407కు, ముంబై నుంచి విజయవాడకు రూ.4 వేలులోపు ఉండే టికెట్ ధర రూ. 11,975కు చేరింది. పండుగ తర్వాత కూడా ఈ ధరలు దాదాపు ఇలాగే ఉండే అవకాశముందని ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
పండుగ ముందే ధరల దడ
సంకాంత్రి పండుగ ముందే నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రజలు మండిపడుతున్నారు. సగం సరుకులు కూడా కొనలేకపోతున్నామని వాపోతున్నారు. –సాక్షి, నెట్వర్క్సరుకుల ధరలు భారీగా పెరిగాయి..గతేడాదితో పోలిస్తే బియ్యం. గోధుమ పిండి, వంటనూనెలు, బెల్లం, చక్కెర, నెయ్యి వంటి వాటి ధరలు భారీగా పెరిగాయి. నూనె ధరలు మరికాస్త పెరిగాయి. వంట నూనెల కొనుగోళ్లు తగ్గాయి. ధరలు పెరగటం వల్ల ప్రజలు పిండివంటలు తగ్గించారు. సామాన్య ప్రజలు అయితే పండుగ సరుకులు కొనటానికి వెనకాడుతున్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది లాభాలు తగ్గాయి. తెచ్చిన ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తున్నాం – కుసుమ తారాబాయి, తిలక్‌రోడ్డు, వరంగల్అన్ని రకాల పిండివంటలు చేసుకోలేకపోయాం..సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుపుకుంటాం. పాఠశాల లకు సెలవులు రావడంతో మూడు రోజులముందే బంధువులు ఇంటికి వచ్చారు. వారు వచ్చేలోపే అన్ని సిద్ధం చేసి ఉంచాలనే ఆలోచనతో పిండివంటల తయారీలో మునిగిపోయాం. సరుకుల ధరలు పెరగడంతో అన్ని రకాల పిండివంటలు చేయలేకపోతున్నాం. – బి.రమేష్, ఫోర్ట్ రోడ్డు, వరంగల్నిత్యావసర ధరలు తగ్గించాలి..పండుగ చేసుకోవాలనుకుంటు న్నా.. పెరిగిన ధరలతో ఏమి కొనేటట్టు లేదు. ప్రస్తుతం వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టడంతో ఆశించినంతగా చేతిలో ఆదాయం లేకపోవడంతో కూడా గ్రామాల్లో పండుగ వాతావరణం కళ తప్పింది. ప్రభుత్వం నిత్యావసర ధరలను అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. – గొట్టిముక్కల సాంబరాజు, వేలేరు, హనుమకొండ జిల్లాగిరాకీ లేదు, సరుకులు తేలే.. రోజుకు 7 నుంచి 8 ట్రిప్పులు నడిచే ఆటో ఇప్పుడు జీరో టికెట్ వల్ల సగానికి పడిపోయింది. ఫైనాన్స్‌కు సరిపోయే డబ్బులు కూడా వస్తలేవు. సంక్రాంతి పండుగకు నాలుగు రోజుల ముందుగానే బిజీగా ఉండాల్సిన సమయంలో గిరాకీ లేక కాలక్షేపం చేస్తున్న. ఒకప్పుడు అన్నీ ఖర్చులు పోను రోజుకు రూ.1,200, రూ.1,400 వచ్చేవి.. ఇప్పుడు రూ.400 మిగలడం లేదు. గత ఏడాది పండుగతో పోల్చితే, ఈసారి ఏమాత్రం లాభం లేదు. ఇంట్లో కనీసం సరుకులు కూడా తేలేదు. – కె.ప్రభాకర్, ఆటోడ్రైవర్, జనగామపండుగ గిరాకీ ఈసారి అంతంత మాత్రమే..సంక్రాంతి పండుగ వాతావరణం పల్లెల్లో అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. కిరాణా షాపుల్లో గిరాకీ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి తక్కువే. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు కూడా పిండి వంటలపై ఆసక్తిని తగ్గించుకున్నారు. అరకొరగా చేసుకుంటున్నారు. దీంతో గిరాకీ మామూలుగానే ఉంటుంది. – కొయ్యడ రవీందర్, ఓ మార్ట్ యాజమాని, వేలేరుసగానికి పడిపోయిందిసంక్రాంతి సీజన్లో రోజుకు రూ.70 వేల వరకు సరుకులు అమ్మేది. ఈ ఏడాది పండుగ సీజన్లో రోజుకు రూ. 35 వేల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. గతంతో పోల్చితే ధరలు పెరగడం ఒక కారణం అయితే మాల్స్, సూపర్ మార్కెట్లతోపాటు ఆన్‌లైన్‌తో మా గిరాకీ పూర్తిగా పడిపోయింది. - చంద్రశేఖర్, కిరాణా షాప్ యజమాని, సిద్దిపేటధరలు పెరిగిపోయాయి....నిత్యావసర సరుకుల ధరలు భాగా పెరిగి పోయాయి. దీంతో ఖర్చు ఎక్కువైంది. పప్పులు, నూనెలకు ధరలు పెరగడంతో పిండివంటలు చేసుకోవాలంటేనే భయమేస్తుంది. మాది పెద్ద కుటుంబం...మా పిల్లల కోసం సంక్రాంతికి అప్పాలు చేయాలి. ఇతర ఖర్చులు తగ్గించుకొని గతేడాది కంటే తక్కువగా అప్పాలు చేసుకుంటున్నాం. – చంద్రకళ, సిద్దిపేట -
నగర వాసులు పల్లె బాట.. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
-
భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
-
విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)