సంక్రాంతి ముగ్గులకు అనేక ప్రత్యేకతలు
పంటలు ఇంటికొచ్చే వేళ క్రిమికీటకాలు
దరి చేరకుండా ముగ్గులు, గొబ్బెమ్మలు
మరోపక్క ఇంటింటా పిండివంటల ఘుమఘుమలు
సమైక్య జీవనానికి ప్రతీకగా వంటల తయారీ
ఖమ్మం గాందీచౌక్: సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ. సంక్రాంతి ముగ్గుకు విశిష్టత ఉంది.పూర్వికుల నుంచి ఆ ఆనవాయితీ కొనసాగుతోంది. పంటలు ఇళ్లకు చేరే వేళ ఇంటి అలంకరణ, వాకిళ్లు శుభ్రం చేసుకోవటం, ఆవుపేడతో కల్లాపు చల్లడం, వాకిళ్లలో పెద్దపెద్ద ముగ్గులు వేసుకోవడం ప్రతీ కుటుంబం సంక్రాంతికి నెల ముందు నుంచే మొదలుపెడతారు. ఇలా ఇళ్ల అలంకరణ, ఇంటి ముందు ముగ్గులు వేయడం వెనుక ఆరోగ్యం, ఆధ్యాత్మికత దాగి ఉంది.
పంటలకు ప్రతిరూపంగా..
పంటలు ఇళ్లకు చేరే వేళ ప్రతిరూపంగా సంక్రాంతి నిలుస్తుంది. ఇళ్లన్నీ పంటలతో నిండుగా ఉన్న వేళ ఆనందాలను పంచుకోవడం కోసం ఇళ్లను అలంకరిస్తారు. ఇళ్లనే కాక పశువుల పాకలను శుభ్రం చేయడం, ఇంటి గుమ్మాలను బంతి, చామంతి పూలమాలలతో అలంకరించడంతోపాటు మహిళలు ఆనందాలను పంచుకుంటూ ఇంటి ఎదుట ముగ్గులు వేస్తారు.
ముగ్గులు, గొబ్బెమ్మల వెనుక ఆరోగ్యం
ధనుర్మాసం నెల పాటు సాగే పండుగ సంక్రాంతి. ఈ పండుగ వేళ పంటలు ఇంటికి చేరతాయి. ప్రధానంగా ధాన్యం ఇళ్లకు చేరుతుంది. పొలాల్లో ఉన్న క్రిమి కీటకాలు పంటలతో పాటే ఇళ్లకు చేరే అవకాశం ఉంటుంది. తద్వారా కుటుంబాలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం పొంచి ఉన్నట్టే. అలా క్రిమికీటకాలు ఇళ్లకు చేరకుండా పూర్వికుల నుంచి ఓ ఆచారం కొనసాగుతోంది.
ఇళ్లను శుభ్రం చేసుకోవటంతో పాటు గుమ్మాలను పూలతో అలంకరించుకోవడం, వాకిళ్లను ఆవు పేడతో కూడిన కల్లాపు చల్లుకోవడం ఈ ఆనవాయితీలో భాగం. వాకిళ్లలో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గుల్లో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. ఆవుపేడతో కల్లాపు చల్లి ముగ్గుల్లో పెట్టే గొబ్బెమ్మలు పంటలతో వచ్చే క్రిమి కీటకాలు ఇళ్లలోకి చేరకుండా నిలువరిస్తాయి. అందుకే ఆవుపేడతో కల్లాపు చల్లడం, గొబ్బెమ్మలు పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం.
నక్షత్రాల ప్రత్యేకతను తెలిపేలా..
ఆకాశంలో నక్షత్రాల ప్రత్యేకతను చుక్కల ముగ్గులు తెలుపుతాయి. ఆకాశంలో చుక్కలను కలుపుతూ కూటమి ఉంటుంది. గొరుకొయ్యలు, సప్తరుషి మండలం వంటివి ఉండి ఇవన్నీ ఒకదాన్ని ఒకటి కలుపు తూ ఉంటాయి. వాటి నుంచి వచ్చినవే చుక్కల ముగ్గులు. వసుదేవుడంతటి వాడు ఈ ముగ్గులోకి లాగబడతాడని చరిత్ర. ఎంతటి వాడినైనా ముగ్గులోకి లాగటం అనే నానుడి దీన్ని నుంచే పుట్టింది.
ఆధ్యాత్మికం కూడా..
ముగ్గుల వెనుక ఆధ్యాత్మికత సైతం దాగి ఉంది. చుక్కలతో మారేడు దళం, పద్మం, అష్టదళ పద్మం, నాగవల్లి, తాబేలు, కూర్మం, వంటి దశావతారాలకు సంబంధించిన ముగ్గులు ఇందులో భాగమే. వీటితోపాటు రథం ముగ్గులు, మల్లె పందిరి, పూజా సంబంధిత ఆధ్యాత్మిక ముగ్గులు వేయడం ఆనవాయితీ.
దిక్కులకు సూచిక
ధనుర్మాస సమయంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనం వైపునకు మారతాడు. సంక్రాంతి సమయంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. దీనికి సూచికగా కూడా ముగ్గులు వేస్తారు. రథం ముగ్గు ఇందులో భాగంగా ప్రతీ ఇంటా వేస్తారు. పండుగ రోజున సూర్యుడు ఇంటికి వస్తున్నట్టుగా రథం ఇంటి ముఖద్వారం వైపు వేయడం, కనుమ రోజున సూర్యుడు ఉత్తరం దిశగా రథం ఇంటి నుంచి బయటకు వెళుతున్న దిక్కుగా వేయడం ఆచారం.
వైకుంఠ ఏకాదశి పండుగలో కూడా ఈ ప్రత్యేకత ఉంటుంది. ధనుర్మాస చివరి సమయంలో వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు. ఈ సమయంలో స్వర్గద్వారాలు(తలుపులు) తెరుచుకుంటాయని నమ్మకం. ఆ సమయాన్ని తెలిపే విధంగా ముగ్గులు వేస్తూ మహిళలు ఆధ్యాత్మికతను చాటుతారు. సంక్రాంతి ముగ్గులకు ఆరోగ్యం, ఆధ్యాత్మికత మేళవింపు ఉండడంతో మహిళలు ఇప్పటికీ ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment