పల్లెల్లో కనిపించని గంగిరెద్దుల ఆటలు
ఆధునిక సమాజంలో ఆదరణ కరువు
ఇబ్బందుల్లో గంగిరెద్దులవారి బతుకులు
వేలేరు: సంక్రాంతి పండుగ వచ్చిందంటే గంగిరెద్దుల వారికి పండుగే. బసవన్న కాలికి, మెడకు గజ్జెల పట్టీలు కట్టి.. రంగురంగుల వస్త్రాలతో అందంగా అలంకరించి, కొమ్ములకు రంగులద్ది.. సన్నాయి ఊదుతూ.. ఊరూరా తిరుగుతూ సందడి చేస్తారు. అయితే పండుగ వేళ ఇళ్ల ఎదుట సందడి చేసే గంగిరెద్దుల ఆటలు నేటి ఆధునిక సమాజంలో కనుమరుగవుతున్నాయి. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మద్దెలగూడెం గ్రామంలో సుమారు 45 గంగిరెద్దుల వారి కుటుంబాలు నివసిస్తున్నాయి.
వీరికి గంగిరెద్దుల ఆటనే ప్రధాన వృత్తి. తాతల కాలం నుంచి అదే వృత్తిని నమ్ముకుని జీవనాన్ని గడుపుతున్నారు. వీరికి అంతో ఇంతో ఆదాయం వచ్చేది సంక్రాంతి పండుగ సమయంలోనే. మిగతా సమయంలో గంగిరెద్దుల ఆటతో వచ్చే ఆదాయం సరిపోక బతుకుదెరువు కష్టమై కూలి పనులు చేస్తున్నారు. అలాగే ఎవరైనా చనిపోతే దశదినకర్మ సమయంలో వెళ్లి ఆటలు ఆడిస్తూ ఉంటారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ జీవితాల్లో వెలుగులు రావడం లేదని వారు వాపోతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి..
తాతల కాలం నుంచి గంగిరెద్దులను ఆడిస్తూనే బతుకుతున్నాం. మాకు ఏ ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు అందలేదు. ఎన్నికలప్పుడు నాయకులు ఓట్లు వేయించుకోవడానికే మా దగ్గరికి వస్తారు. తర్వాత మా ఇళ్లవైపు కన్నెత్తి చూడరు. మా గంగిరెద్దుల కుటుంబాలకు 25 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చింది. ఇప్పుడు అవి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వమైనా మాకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి ఆదుకోవాలి. – బత్తుల మల్లయ్య
కులవృత్తే జీవనాధారం..
కులవృత్తిలో భాగంగా నా భర్త గంగిరెద్దులను ఆడిస్తాడు. సంక్రాంతికి గంగిరెద్దులను ఆడించడంతో పండుగ ఖర్చులు వస్తాయి. గ్రామాల్లో ఎవరైనా చనిపోతే దశదినకర్మ వద్దకు వెళ్లి గంగిరెద్దులను ఆడిస్తుంటారు. మిగతా సమయాల్లో కూలి, ఇతరత్రా పనులు చేసుకుంటూ పిల్లలను సాదుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ లేదు. – ఆవుదొడ్డి దుర్గమ్మ
Comments
Please login to add a commentAdd a comment