gangireddulu
-
అయ్యవారికి దండం పెట్టు..
వేలేరు: సంక్రాంతి పండుగ వచ్చిందంటే గంగిరెద్దుల వారికి పండుగే. బసవన్న కాలికి, మెడకు గజ్జెల పట్టీలు కట్టి.. రంగురంగుల వస్త్రాలతో అందంగా అలంకరించి, కొమ్ములకు రంగులద్ది.. సన్నాయి ఊదుతూ.. ఊరూరా తిరుగుతూ సందడి చేస్తారు. అయితే పండుగ వేళ ఇళ్ల ఎదుట సందడి చేసే గంగిరెద్దుల ఆటలు నేటి ఆధునిక సమాజంలో కనుమరుగవుతున్నాయి. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మద్దెలగూడెం గ్రామంలో సుమారు 45 గంగిరెద్దుల వారి కుటుంబాలు నివసిస్తున్నాయి.వీరికి గంగిరెద్దుల ఆటనే ప్రధాన వృత్తి. తాతల కాలం నుంచి అదే వృత్తిని నమ్ముకుని జీవనాన్ని గడుపుతున్నారు. వీరికి అంతో ఇంతో ఆదాయం వచ్చేది సంక్రాంతి పండుగ సమయంలోనే. మిగతా సమయంలో గంగిరెద్దుల ఆటతో వచ్చే ఆదాయం సరిపోక బతుకుదెరువు కష్టమై కూలి పనులు చేస్తున్నారు. అలాగే ఎవరైనా చనిపోతే దశదినకర్మ సమయంలో వెళ్లి ఆటలు ఆడిస్తూ ఉంటారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ జీవితాల్లో వెలుగులు రావడం లేదని వారు వాపోతున్నారు.ప్రభుత్వం ఆదుకోవాలి.. తాతల కాలం నుంచి గంగిరెద్దులను ఆడిస్తూనే బతుకుతున్నాం. మాకు ఏ ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు అందలేదు. ఎన్నికలప్పుడు నాయకులు ఓట్లు వేయించుకోవడానికే మా దగ్గరికి వస్తారు. తర్వాత మా ఇళ్లవైపు కన్నెత్తి చూడరు. మా గంగిరెద్దుల కుటుంబాలకు 25 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చింది. ఇప్పుడు అవి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వమైనా మాకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి ఆదుకోవాలి. – బత్తుల మల్లయ్యకులవృత్తే జీవనాధారం..కులవృత్తిలో భాగంగా నా భర్త గంగిరెద్దులను ఆడిస్తాడు. సంక్రాంతికి గంగిరెద్దులను ఆడించడంతో పండుగ ఖర్చులు వస్తాయి. గ్రామాల్లో ఎవరైనా చనిపోతే దశదినకర్మ వద్దకు వెళ్లి గంగిరెద్దులను ఆడిస్తుంటారు. మిగతా సమయాల్లో కూలి, ఇతరత్రా పనులు చేసుకుంటూ పిల్లలను సాదుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ లేదు. – ఆవుదొడ్డి దుర్గమ్మ -
వచ్చాడు బసవన్న
ఉదయం పూట చెట్ల కొమ్మలపై మంచుపూలు స్వాగతం పలుకుతుండగా సన్నాయి రాగం మధురంగా వినిపిస్తుంది. చేగంట మోగుతుండగా బసవన్న పాట వినిపిస్తుంది... ‘డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా/ఉరుకుతూ రారన్న రారన్న బసవన్నా/అమ్మవారికి దండం బెట్టు అయ్యగారికి దండం బెట్టు/రారా బసవన్నా... రారా బసవన్నా....’గంగిరెద్దులు ఊళ్లోకి అడుగు పెడితే ఊరికి సంక్రాంతి కళ సంపూర్ణంగా వచ్చినట్లే. విశేషం ఏమిటంటే... గంగిరెద్దుల ముందు పెద్దలు చిన్న పిల్లలై పోతారు. ‘దీవించు బసవన్నా’ అంటూ పిల్లలు పెద్దలై భక్తిపారవశ్యంతో మొక్కుతారు. కాలం ముందుకు వెళుతున్న కొద్దీ ఎన్నో కళలు వెనక్కి పోతూ చరిత్రలో కలిసిపోయాయి. అయితే గంగిరెద్దుల ఆట అలా కాదు. కాలంతో పాటు నిలుస్తోంది. ‘ఇది మన కాలం ఆట’ అనిపిస్తోంది...కొత్త కాలానికి... కొత్త చరణాలుకాలంతో పాటు బసవన్న పాటలోకి కొత్త చరణాలు వస్తుంటాయి. సందర్భాన్ని బట్టి ఆ పాటలో చరణాలు భాగం అవుతుంటాయి. ఒక ఊళ్లో... సంక్రాంతి సెలవులకు వచ్చిన పిల్లాడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అది ఎన్నో సంవత్సరాల చేదు జ్ఞాపకం అయినా సరే, ఊళ్లో సంక్రాంతి రోజు ప్రతి ఇల్లు పండగ కళతో కళకళలాడినట్లు ఆ ఇల్లు కనిపించదు. జ్ఞాపకాల దుఃఖభారంతో కనిపిస్తుంది. ఆ భారం నుంచి ఆ ఇంటి వాళ్లను తప్పించడానికి బసవడు ఆడుతాడు పాడుతాడు. ‘నవ్వించు బసవన్న నవ్వించు/అమ్మ వారికి దండం పెట్టి నవ్వించు/అయ్యవారికి దండం పెట్టి నవ్వించు/ వాళ్లు హాయిగా ఉండేలా దీవించు..ఆ దీవెన ఎంతో పవర్‌పుల్.పండగపూట బసవన్న ఇంటిముందుకు రాగానే బియ్యం లేదా పాత బట్టలతో రావడం ఒక విషయం అయితే... భవిష్యత్ వాణి అడగడం, ఆశీర్వాదం ఒక మరో విషయం. గంగిరెద్దులాయన సంచిలో బియ్యం పోస్తు ‘మా అబ్బాయికి ఈ సంవత్సరమన్నా ఉద్యోగం వస్తుందా బసవన్నా’ అని అడుగుతుంది ఒక అమ్మ, ‘అవును’ అన్నట్లు తల ఆడిస్తుంది. ‘మా తల్లే’ అని కంటినిండా సంతోషంతో గంగిరెద్దు కాళ్లు మొక్కుతుంది ఆ అమ్మ. గంగిరెద్దుల ఆటలో విశేషం ఏమిటంటే, తెలుగు ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన ప్రత్యేతలు ఉన్నాయి. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా మందస ప్రాంతంలో గంగిరెద్దుల వారి పాటల్లో తత్వం ధ్వనిస్తుంది. సామాజిక విశ్లేషణ ఉంటుంది. ఉదా: ‘దేవా! ఏమి జరుగుతున్నది ప్రపంచం/అహో! ఏం చిత్రంగున్నదీ ప్రపంచం/ పసుపురాత తగ్గిపోయి....΄పౌడరు రాతలెక్కువాయె’...సంక్రాంతి రోజుల్లో బసవన్నల విన్యాసాలకు ప్రత్యేకంగా రంగస్థలం అక్కర్లేదు. ఊళ్లోకి అడుగుపెడితే... అణువణువూ ఆ కళకు రంగస్థలమే. మనసంతా ఉల్లాసమే. తరతరాల నుంచి ప్రతి తరానికి దివ్యమై అనుభవమే.– బోణం గణేష్, సాక్షి, అమరావతి -
Photo Feature: పండగొచ్చింది పద బసవా..!
మకర సంక్రాంతి వేళ పల్లెలతో పాటు పట్టణాలు కూడా సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ముచ్చటగా మూన్నాళ్లు చేసే పండుగకు బసవయ్యలతో గంగిరెద్దోళ్లు కూడా సిద్ధమయ్యారు. పీ..పీ ఊదుతూ గంగిరెద్దును పట్టుకొని ఇంటింటికీ వెళ్లి ఇచ్చింది తీసుకెళ్తుంటారు. హైటెక్ యుగంలోనూ బసవయ్యలను దైవంగా భావిస్తూ తమ కులవృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు . – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
సంక్రాంతి సంబరాలు షురూ.. గిరి పల్లెల్లో మొదలైన సందడి
బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): సంక్రాంతి.. ఇది ఒక పండుగ మాత్రమే కాదు. ఎన్నెన్నో అనుభూతులు, మరెన్నో మేళవింపులు... భావోద్వేగాలు... ఒక మాటలో చెప్పాలంటే ఏడాదికి సరిపోయే ఎన్నో అద్భుతమైన తీపి జ్ఞాపకాల సంబరం. అలాంటి పండుగ రెండు వారాల్లో రాబోతుంది. అయితే అంతకన్నా ముందే పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆట పాటలతో హోరెత్తించారు. సంక్రాంతి అనగానే వెంటనే గుర్తుకు వచ్చేవి భోగిమంటలు.. సంప్రదాయ పంచెకట్లు, పట్టు పరికిణీలు, గంగిరెడ్లు, డూడూ బసవన్నలు, సన్నాయి వాయిద్యాలు, రంగురంగుల ముగ్గులు, ఎడ్ల పందేలు, కోడి పందేలు, జానపదాలు, సరదాలు, షికార్లు ఇలా అనేక రకమైన కళలు, సాంస్కృతిక మైమరపుల కలబోతే సంక్రాంతి. సంక్రాంతి పండుగలో సాంస్కృతిక శోభను అదిమి పట్టుకునే విధంగా బుట్టాయగూడెం మండలంలోని తెల్లంవారిగూడెం పాఠశాలలో సంక్రాంతి సంబరాలను ఉపాధ్యాయులు నిర్వహించారు. హరిలో రంగ హరి అంటూ హరిదాసు సందడి, భోగిమంటలు, గొబ్బెమ్మలతో ముగ్గులు, రోలులో పిండి కొట్టే సాంప్రదాయం ఇలా అన్ని ఉట్టిపడేలా ఏర్పాటు చేసి ముందుగానే సంక్రాంతి సందడిని తీసుకువచ్చారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. సరదాలు తెచ్చిందే తుమ్మెద... అంటూ సాగే పాటకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సైతం నృత్యాలు చేశారు. అదేవిధంగా భోగి తెచ్చే భోగం అనే పాటకు కూడా విద్యార్థులతో పాటు బాలరాజు నృత్యం చేసి అందరినీ అలరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పండగను ఆనందోల్సాహాలతో జరుపుకున్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు సంక్రాంతి, జానపద పాటలకు నృత్యాలు విద్యార్థినులను ఉత్సాహపరిచారు. (క్లిక్ చేయండి: ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి) -
సన్నాయి ఊదలేం.. బసవన్నను ఆడించలేం
సన్నాయి, మేళతాళాలతో ఓ రాముడూ అమ్మగారికి నమస్కరించు.. అయ్యగారికి దండం పెట్టూ.. సీతమ్మా వచ్చి రాముడు పక్కన నిలబడు... లక్ష్మణా రాముడు పక్కన నిలబడు... హనుమంతూ పల్టీలు కొట్టు ఇలా ఇంటి ముంగిట వాకిట ముగ్గులలో గొబ్బెమ్మల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ బసవన్నలను ఆడిస్తూ అందరినీ ఆహ్లాదపరుస్తారు గంగిరెద్దుల వాళ్లు. సంక్రాంతి వచ్చిందంటే వీరికి మూడు నెలలు పండగే. గజ్జెలు కట్టి.. రంగురంగుల వస్త్రాలతో బసవన్నలను అలంకరించి ఊరూరా తిరుగుతూ సందడి చేస్తారు. వీరి జీవనాన్ని ఒక్కసారి పరికిస్తే మనసును బాధించే ఎన్నో కష్టాలు మన ముందు ఉంచుతారు. వారి మదిని ఒక్కసారి తడితే వారి భవిష్యత్ అందర్నీ కలచివేయక మానదు. సంప్రదాయ బద్ధంగా వస్తున్న కళను వదులుకోలేక.. భారమైనా జీవితాన్ని ఈడ్చుకుంటూ వస్తున్నారు. ఉన్న ఊరు వదిలి వందల కిలోమీటర్లు వచ్చి ఊరికి దూరంగా ఉన్న ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకుని బతుకు బండి లాగుతున్న వీరిని చూస్తే గుండె బరువెక్కక మానదు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా వారి జీవన విధానాన్ని తెలుసుకుందామని నగరంలోని ముంగమూరుడొంక వెళ్లాం. అక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లో చిన్న చిన్న గుడారాలు వేసుకుని పిల్లాజెల్లాతో నివాసం ఉంటున్నారు. సుమారు 60 నుంచి 80 గుడారాలు కనిపించాయి. అక్కడున్న వారిలో పెద్దాయన బత్తుల సబ్బయ్యను కలిశాం. ‘సంప్రదాయంగా వస్తున్న ఈ కళకు ఆదరణ తగ్గిపోయింది. ఇన్నాళ్లు బసవన్నలను పట్టుకుని అందంగా సింగారించి ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేసే వాళ్లం. అలసిపోయాం. మాతో పాటు గంగిరెద్దులు కూడా అడుగులు వేయలేని పరిస్థితి. ఇక అందరం ప్రత్యామ్నాయ వృత్తులకు పోయి కడుపు నింపుకుంటున్నాం. సంకురాత్రి వచ్చిందంటే నాలుగు డబ్బులు కనిపిస్తాయి. అవి కూడా బసవన్నల పోషణకు సరిపోతాయి. మా పిల్లలు వేరే పనులకు వెళ్లి తెచ్చిన డబ్బుతో మా కడుపులు నిండుతాయి..’ అంటూ చెమర్చిన కళ్లతో చెప్పుకొచ్చాడు సుబ్బయ్య. ‘ఏడాదిలో రెండుమూడు నెలలు మాత్రమే ఉపాధి ఉండటంతో మిగతా ఏడాది అంతా గంగిరెద్దుల పోషణ గగనమవుతోంది. రానురాను సంప్రదాయ కళకు ప్రోత్సాహం కూడా సన్నగిల్లుతోంది. ఆచారాన్ని పోగొట్టలేక భారమైనా ఈడ్చుకొస్తున్నాం’ అని అంటున్నారాయన. సుమారు రూ.10 వేలు ఖర్చు చేసి గంగిరెద్దులను సింగారిస్తాం. రెండు నెలల పాటు ఊరూరా తిరిగితే దయగల మహానుభావులు చేసే దానధర్మాలతో వచ్చిన డబ్బుతో కాలం వెళ్లిపోతుంది. కొంత మంది దానం చేసిన దుస్తులను సైతం బసవన్నల అలంకరణకే వాడుకుంటాం. దాదాపు 40 ఏళ్ల పాటు గంగిరెద్దులతో తిరిగా. ఇప్పుడు ఆరోగ్యం సహకరించడంలేదు. వైద్యానికి ఆర్థికంగా ఇబ్బంది ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నా. మాయావిడ తెల్లవారుజామునే బజారుకెళ్లి పండ్లు తీసుకొస్తది. వాటిని సైకిల్ రిక్షాపై వేసుకుని ఒంగోలు నగర వీధుల్లో తిరుగుతూ విక్రయిస్తున్నా. మా పిల్లలు కూడా 8వ తరగతి వరకూ చదువుకుని వేరే పనులకు వెళ్తున్నారు. మాకు సొంత గూడు అంటూ ఏమీ లేదు. ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకున్నాం. ఈ స్థలం మాది.. ఖాళీ చేయండి అంటే వేరే ప్రాంతానికి పోతాం అంటున్నాడు సుబ్బయ్య. గంగిరెద్దుల తరం వారికి ప్రకాశం జిల్లా పెట్టింది పేరు. జిల్లాలోని తర్లుపాడు మండలం నాగళ్లముడుపు గ్రామంలో ప్రధాన ఆచారంగా దాదాపు 500 కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నాయి. అదేవిధంగా వెలిగండ్ల మండలం గణేశునిపల్లె గ్రామంలోనూ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. వీరిని ఆధారం చేసుకుని గుంటూరు జిల్లా వినుకొండ దగ్గర ఉప్పరపాలెం, నెల్లూరు జిల్లా కొల్లపూడి, కంటేపల్లి, మనుబోలు గ్రామాల్లో ఆచారాన్ని కొనసాగిస్తున్న వారూ ఉన్నారు. పోషణ గగనం కావడంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు. రకరకాల వ్యాపకాలతో జీవనోపాధి పొందుతున్నారు. నాలుగు నెలలు శిక్షణ... వీరి ఆచారం ప్రకారం రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీత అని పేర్లు పెట్టుకుంటారు. కొత్తగా తీసుకొచ్చిన గిత్తలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తారు. వాటికి ఆట, పాట నేర్పిస్తారు. కాళ్లు ఆడించడం.. చేతులు తొక్కడం.. నమస్కారాలు చేయడం వంటి అంశాల్లో నాలుగు నెలల పాటు తర్ఫీదు ఇస్తారు. రాముడూ ఇలా వచ్చి బాబుగారికి సలాం చేయి అంటే బసవన్నలు చేయాల్సిందే. కొత్తగా వచ్చిన గిత్తలు బెదరకుండా చూసుకుంటూనే రంగంలోకి దింపుతారు. పలిగాపులో (నోట్లో తలపెట్టడం) కూడా శిక్షణ ఇస్తారు. ఒంటి నిండా రంగురంగుల దుస్తులతో వీటిని అలంకరించడంతో మండుటెండల్లో ఇవి ఇబ్బంది పడతాయి. కొన్ని పొగరు గిత్తలైతే శివాలు ఎత్తుతాయి. కులపెద్దలదే తీర్పు... ఎవరైనా తప్పు చేస్తే ముందుగా వీరి కులంలోని పెద్దలు పంచాయితీ చేస్తారు. తప్పు చేశారని రుజువైతే వారే శిక్షవేస్తారు. వారి తీర్పు శిరోధార్యం. అక్కడ కూడా న్యాయం జరగకపోతే పోలీస్స్టేషన్లకు వెళ్తారు. డిగ్రీ, ఇంజినీరింగ్ చదువులు... గంగిరెద్దుల వంశానికి చెందిన కొందరు వాటికి ఆటపాటలు నేర్పి సంక్రాంతి పండుగ నెలల్లో ప్రతి ఇంటి ముందు ప్రత్యేక అలంకరణలతో డూ..డూ బసవన్నలు చేసే విన్యాసాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. మరికొందరు ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు రాక దుకాణాల్లో, ఫ్యాక్టరీల్లో చిన్న, చిన్న పనులు చేసుకుని పొట్టపోసుకుంటున్నారు. చాలా మంది ఐదారు తరగతుల వరకూ చదువుకుని ఆర్థిక ఇబ్బందులతో ముందుకు వెళ్లలేక కూలి పనులకు వెళ్తున్నారు. మా కష్టాలు గుర్తించండి... సంకురేత్రి నెల మొదలు శివరాత్రి వరకూ గంగిరెద్దులతో ఇంటింటా తిరుగుతూ బసవన్నలతో సందడి చేస్తాం. మా ఆచారం ప్రకారం అందరం ఆరు నెలలు పట్నంలో ఉంటాం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో పెళ్లిలకు మేళాలు వాయిస్తాం. ఇతర పనులకు వెళ్తాం. నాలుగు డబ్బులు సంపాదించుకుని తిరిగి వినాయక చవితికిగానీ, దసరాకుగానీ సొంతూళ్లకు వెళ్లిపోతాం. అక్కడ పొలం పనులు చేసుకుంటాం. గంగిరెద్దులకు పొలంలో వచ్చిన జొన్న, వరిగడ్డి ఆహారంగా పెడతాం. డిసెంబర్ మొదటి వారంలో పట్టణాలకు చేరుకుని సంకురేత్రికి ఎద్దులను ఆడించుకుంటూ జీవనం సాగిస్తాం. కొంత మంది కూలి పనులకెళ్తారు. నేనూ, నా కుటుంబ సభ్యులు (నలుగురు) రెండు బృందాలుగా విడిపోయి రోజంతా తిరిగితే రూ.1,000 నుంచి రూ.1,500 వస్తాయి. అందులో గంగిరెద్దులకు ఆహారం పోతే మాకు అంతంత మాత్రమే మిగులుతుంది. ఆవు కంటతడి పెడితే ఇంటికి మంచిది కాదు. వాటిని కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటాం. గంగిరెద్దులను ఏదైనా ఉత్సవాలకు తీసుకెళ్తే అక్కడ కచ్చితంగా సీతారాముల కల్యాణం ఉండి తీరాల్సిందే. అన్ని జాతుల వారికి కాలనీలు ఉన్నాయి. మాకు మాత్రం ఎక్కడా లేవు. పేర్నమిట్ట దగ్గర స్థలాలు ఇస్తే బాగుంటుంది. పాలకులు మా కష్టాలను గుర్తించండి. – బి.వీరయ్య, ఒంగోలు -
‘రాముడూ.. మేమెలా బతకాలిరా...’
సాక్షి, ఒంగోలు: మూడు కుటుంబాలకు జీవనాధారం ఆ గంగిరెద్దు. కుటుంబంలో ఒకరిగా ఉండే ఆ ఎద్దుకు ముద్దుగా వారు పెట్టుకున్న పేరు రాముడు. కాస్త గడ్డి వేస్తే తన కడుపు నింపుకొంటూ.. ఏడేళ్లుగా మూడు లంబాడీ కుటుంబాల ఆకలి తీరుస్తోంది. ఎవరు చెయ్యెత్తినా ఆగి విశ్వాసాన్ని ప్రదర్శించేది. అయితే ఏమైందోగానీ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో హఠాత్తుగా ‘రాముడు’ మరణించాడు. దీంతో యజమాని వీరయ్యతో పాటు మూడు కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యారు. 33వ డివిజన్ కార్పొరేటర్ నియంతారెడ్డి, పెద్దిరెడ్డి భాస్కరరెడ్డి ద్వారా సమాచారం అందుకున్న పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జేడీ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాలిచ్చే జంతువులు చనిపోయినపుడు మాత్రమే పరిహారం అందుతుందన్నారు. అయితే ఎద్దు మరణంతో మూడు కుటుంబాలకు జీవనాధారం పోయిన నేపథ్యంలో పరిహారం వచ్చేందుకు కృషి చేస్తానని హాబీ ఇచ్చారు. గుండెపోటు వల్లే ఎద్దు మరణించిందని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. గంగిరెద్దు అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ సిబ్బందికి కమిషనర్ వెంకటేశ్వరరావు సూచించారు. చదవండి: (Egg Prices: కొండెక్కిన కోడిగుడ్డు.. సామాన్యుల బెంబేలు) -
గంగిరెద్దు ఆట
-
నవ్యక్రాంతి.. తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి
సాధారణంగా మనం పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాము. కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాము. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాము కనుకే ప్రతి సంవత్సరం తిథులతో సంబంధం లేకుండా పుష్యమాసంలో జనవరి నెలలో 13, 14, 15, 16 తేదీలలోనే ఈ పండుగ వస్తుంది. తెలుగువారి పెద్ద పండుగలలో ఒకటైన సంక్రాంతిని భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాము. కనుమ మర్నాడు ముక్కనుమగా కూడా పండుగ చేస్తాము. మన సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధి పరిచే ఎన్నో అంశాలతో కూడిన పండుగ సంక్రాంతి. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదుల సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ ఇది. సంక్రాంతి నాడు కొత్త అల్లుళ్ళతో బంధుమిత్రులతో ఇల్లు, మనసు ఆనందంతో కళకళలాడుతుంది. కనుమ నాడు ఇంతటి పాడి పంట ఇంటికి రావటానికి కారణమైన గోవులను, వృషభాలను అలంకరించి, పూజించి, చక్కటి దాణా వేసి, ఆనందింప జేస్తారు. ప్రతి సంక్రమణం పవిత్రమైనదే. ప్రతి సంక్రమణంలోనూ పితృ తర్పణాలివ్వాలి. విశేషంగా మకర సంక్రమణ కాలంలో మకర సంక్రమణ స్నానం చెయ్యాలి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి పండుగ రోజున తప్పక పితృ తర్పణాలివ్వాలి, పితృదేవతలను స్తుతించాలి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు గడలు, గుమ్మడి పండు మొదలైనవి దానమివ్వాలి. ఈ కాలంలో చేసే గోదానం వల్ల స్వర్గవాసం కలుగుతుందని చెప్తారు. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే ధనుర్మాసమంతా ఆడవారు తెల్లవారుజామునే లేచి ఇళ్ళ ముందు కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, గోమయంతో గొబ్బెమ్మలు పెడతారు. సంక్రాంతినాడు ఇంటి ముందు కళ్ళాపి చల్లి, అందమైన పెద్ద రంగవల్లులను తీర్చిదిద్దుతారు. వాటిమీద గొబ్బెమ్మలు పెట్టి, గుమ్మిడి పూలతో, బంతి పూలతో అలంకరించి, చుట్టూరా రేగుపళ్ళు, చెరుకు ముక్కలు వేసి, మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా, చుట్టూరా ఉన్న గొబ్బెమ్మలను ఆమె చెలికత్తెలుగా భావన చేసి, పసుపు కుంకుమలతో పూజించి, హారతిస్తారు. సంక్రాంతి రోజున గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. డోలు, సన్నాయి వాయిస్తూ ఉంటే, వాటికి అనుగుణంగా గంగిరెద్దులు నర్తిస్తాయి. ‘అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు‘, అంటుంటే గంగిరెద్దులు మోకాళ్ళ మీద కూర్చుని లేవటం, ‘డూడూ డూడూ బసవన్నా‘ అంటుంటే, తలలూపుతూ విన్యాసాలు చెయ్యటం కన్నుల పండుగగా ఉంటుంది. అందరూ గంగిరెద్దును సాక్షాత్తుగా బసవన్నగా భావించి నూతన వస్త్రాలు కప్పుతారు. సన్నాయి వాద్యకారులకు డబ్బులిస్తారు, ధాన్యాన్నిస్తారు. వృషభం ధర్మ దేవతకు ప్రతీక. ఉదయమే శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడే హరిదాసు తలపైన రాగి అక్షయపాత్రను కదలకుండా పెట్టుకుని, రెండు చేతులతో చిరుతలు పట్టుకుని వాయిస్తూ, నుదుటిన తిరునామం పెట్టుకుని, కాళ్ళకు కంచు గజ్జెలు కట్టుకుని, అవి ఘల్లు ఘల్లుమంటుండగా ‘హరిలొ రంగ హరీ‘ అంటూ గానం చేస్తూ, చిందులు వేస్తూ వస్తాడు. అలాగే చిందులేస్తూ, హరినామం గానం చేస్తూ, తంబూరా మీటుతూ సాతాని జియ్యరు కూడా వస్తాడు. ప్రజలు సంతోషంగా సాక్షాత్తుగా శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. వారిరువురికీ సంభావనలిచ్చి సత్కరిస్తారు. ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు‘ అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోస్యం చెప్పటానికి ఇంటింటి ముందుకు బుడబుక్కలవాళ్లు వస్తారు. ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదుటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ‘హర హర మహాదేవ‘ అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమ దేవర వస్తాడు. వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిచ్చి సంభావిస్తూ మన సంస్కృతిని సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీను. సంక్రాంతికి ఆంధ్రులు తమ ఇళ్ళల్లో బొమ్మలకొలువును ఏర్పాటు చేసి, బొమ్మలకు ప్రతీకగా పరమాత్మను ప్రార్ధిస్తారు. బొమ్మలకు హారతిస్తారు, పేరంటం చేస్తారు. పిల్లలకు పప్పు బెల్లాలు, నువ్వులుండలు ఇస్తారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో కోడిపందాలు, గొర్రెపొట్టేళ్ళ పందాలు, కొన్ని ప్రాంతాల్లో జల్లెకట్టు వంటివి ఆడి ఆనందిస్తారు. పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పిల్లలు, యువకులు అత్యంత ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేసి ఆనందిస్తారు. సాధారణంగా అందరూ సంక్రాంతి పండుగకు ముందు రోజు అరిశలు, చక్కిలాలు, నువ్వులుండలు, పాలకాయలు, జంతికలు వంటివి చేస్తారు. పండుగ రోజున పరమాన్నం, బొబ్బట్లు, పులిహోర లాంటివి చేస్తారు. అన్నింటినీ దైవానికి నివేదించి, బంధువులకు, ఇంటి చుట్టుపక్కల వారికి, ఇంట్లో పనిచేసే వారికి పంచిపెడతారు. మనకు పాడిపంటలనిచ్చే గోవులను, ఎద్దులను కనుమనాడు పూజిస్తారు. పుడమి తల్లిని పూజిస్తారు. ‘కనుమనాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుంది’ అంటారు కనుక కనుమ నాడు గారెలు, ఆవడలు తప్పకుండా భుజిస్తారు. ఈ విధంగా పుడమికీ, ప్రకృతికీ, మానవులకూ, గోవృషభాలకూ ఉన్న సంబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ మన మకర సంక్రాంతి పండుగ. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజిక పరంగా అత్యధిక శాతం మంది జరుపుకునే గొప్ప పండుగ ‘నవ్య సంక్రాంతి పండుగ‘. పెద్ద పండగ ఎలా అయింది? సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి మారటం వలన ప్రకృతిలో కూడా ప్రతి నెల స్పష్టమైన మార్పును సంతరించుకుంటుంది. ఈ మార్పు మానవ జీవితంపైన మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ మకర రాశిలో ప్రవేశించటాన్నే ఎందుకు పెద్ద పండుగ గా జరుపుకుంటున్నాము అంటే, దానికి అనేక కారణాలున్నాయి. అప్పటి వరకు ఉన్న చలి మకర సంక్రమణంతో తగ్గుముఖం పడుతుంది. వెలుగు ఎక్కువగా ఉండే దీర్ఘమైన పగళ్ళకూ, సుందరమైన, ఆహ్లాదకరమైన వసంత కాల ఆగమనానికి నాంది కాగల ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభ మవుతుంది. దక్షిణాయనంలో పగళ్ళు తక్కువ, రాత్రిళ్ళు ఎక్కువ ఉంటాయి. ఉత్తరాయణంలో పగళ్ళు ఎక్కువ, రాత్రిళ్ళు తక్కువ ఉంటాయి. ప్రకృతిలో ఇది గొప్ప మార్పు. ఆనందకరమైన, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని కలిగించే మార్పు. మన ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి కాలం. అందువల్ల కూడా ఉత్తరాయణం అత్యంత పవిత్రమైన కాలం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. దక్షిణాయనం సాధనా కాలం, ఉపాసనా కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి సూర్యుని రథ గమనంలో మార్పు వల్ల ఎండ వేడిమి నెమ్మదిగా పెరగటం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం ప్రారంభమవగానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఉత్తరాయణంలోనే మనం ఉపనయనాలు, వివాహాది శుభ కార్యాలను జరిపిస్తాము. కనుకే ఉత్తరాయణం ప్రారంభంలో వచ్చే మకర సంక్రమణాన్ని ‘సంక్రాంతి పండుగ‘గా జరుపుకుంటున్నాము. పెద్దలకు తర్పణలు విడుచుకునే పర్వదినం ఇది. వెలుగుకు, జ్ఞానానికి సూచకమైన ‘మకర సంక్రాంతి’ మనకు పెద్ద పండుగ. ‘సం’ అంటే ‘సమ్యక్’ – మంచి, చక్కని. ‘క్రాంతి’ అంటే మార్పు. సమ్యక్ క్రాంతి – సంక్రాంతి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే – ‘చేరటం’ అని అర్థం. మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే శ్రీ సూర్య భగవానుడు ముందున్న రాశి నుండి తరువాత రాశి లోనికి ప్రవేశించటమే సంక్రాంతి. – డా. తంగిరాల విశాలాక్షి, విశ్రాంత సంస్కృత ఆచార్యులు -
‘బసవన్న’ ఆశలు సంక్రాంతి పైనే
సాక్షి, పాల్వంచ(ఖమ్మం): సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు మూడురోజుల ముందునుంచే ఎక్కడ ఉన్న డూడూ బసవన్నలు గ్రామాల్లో సందడి చేస్తాయి. ఈ పండుగ గంగిరెద్దులను ఆడించేవారి జీవితాల్లో కొంత కాంతిని నింపి మూడు రోజుల ముందే ప్రారంభం కావడంతో పల్లెల్లో పండగశోభ సంతరించుకుంటుంది. కరోనా ప్రభావంతో గంగిరేద్దుల జీవితాల్లో ప్రభావం చూపిందని చెప్పవచ్చు. వేకువజామున చలిలో గంగిరెద్దులతో ఇంటింట తిరిగడం కనపిస్తుంది. గంగిరెద్దులు ఆడిచేవారికి పండగే ఆధారపడి ఉంటాయి. పండగ సందర్భంగా ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇస్తారు. ఇలా పండగ పూర్తి అయ్యేనాటికి వచ్చిన ఆధాయంతో ఆరునెలలపాటు సంతోషంగా కుటుంబం అంతాగడుపుతారు. తర్వాత కూలీపనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంటారు. చిన్నప్పటి నుంచే శిక్షణ గంగిరెద్దులు విన్యాసాలు చేసే విధంగా వారు చిన్నప్పటి నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ గంగిరెద్దులను నమ్ముకుని అనేక కుటుంబాలు పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ మండలంలో జీవనం సాగిస్తున్నాయి. తాత ముత్తాతల నుంచి గంగిరెద్దులను ఆడించుకుంటు జీవనం సాగిస్తున్నారు. ఎలాంటి వ్యవసాయ భూములు, ఇళ్లు, కనీసం రేషన్‌కార్డులు లేవని వాపోతున్నారు. సంక్రాంతి పండగ తోపాటు ఎవ్వరైన పెద్దవాళ్లు కాలం చేస్తే పదవ రోజున ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని గంగిరెద్దులతో విన్యాసాలు చేయించి పరుగులు పెట్టిస్తారు. ఇలా బసవన్నల ఆడించుకుంటుంటే దయగణాలు అంతో ఇంతో దానంచేస్తే వచ్చిన వాటితోనే జీవనంసాగిస్తున్నామని గంగిరెద్దులను ఆడించే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు, పింఛన్లు అందజేయాలని వారు వేడుకుంటున్నారు. చదవండి: ఉద్యోగంలోకి తీసుకోలేదని ఆత్మహత్యాయత్నం -
సంక్రాంతి: గంగిరెద్దులతో మాట్లాడగల నేర్పరులు
ఇంటి ముందు రంగవల్లి ఉండడం అందమే.. కానీ దాని ముందు బసవన్న నిలుచుంటే అదీ కళ. ఆడబిడ్డ పుట్టింటికి రావడం ఆనందమే.. అంతకుముందు బసవన్న గడపలో అడుగు పెడితే ఆ సంబరానికో పరిపూర్ణత. ధనుర్మాసపు వేకువలన్నీ తిరుప్పావై ప్రవచనాలవే.. వాటి మధ్యలో ఓ నాదస్వరం గుమ్మం మీదుగా చెవిని తాకితే అదీ పండగ సీజన్‌కు అసలైన సూచిక. మకర సంక్రాంతి పూట పూర్వీకులకు నైవేద్య సమర్పణ ఆనవాయితీనే.. కానీ ఇంటి ముందు ఓ పెద్దాయన వారి పేర్లను వీధంతా వినబడేలా లయబద్ధంగా పాడితే అదీ అసలైన నివాళి. ఇలా గంగిరెద్దుల వారు సిక్కోలు బతుకులో భాగం. దశాబ్దాలుగా అరుదైన కళను పరిరక్షిస్తున్నారు. అలాంటి వారు నివాసం ఉండే ఊరు భైరిసారంగపురం. మందస: ఒకటి కాదు రెండు కాదు మందసకు రెండు వందల కిలోమీటర్ల అవతల.. సింహాద్రి అప్పన్న కొలువైన కొండ కింద ఊళ్లలోని మనుషులు వారు. గంగిరెద్దులతో మాట్లాడగల నేర్పరులు. వాటిని ఆడించగల సమర్థులు. అనాదిగా సంచార జీవులు కావడంతో ఓ శాశ్వత చిరునామా కోసం వెతుకుతుంటే వారికి దొరికిన ఒకానొక ఊరు మందస మండలంలోని భైరి సారంగపురం. అరవై ఏళ్ల కిందట వలస వచ్చి గుడిసెలు వేసుకుని బతుకులు ప్రారంభించిన ఆ కళాకారులు ఇప్పుడు సిక్కోలు కళాజీవన స్రవంతిలో ఓ భాగం. అరుదైన, అంతరించిపోతున్న గంగిరెద్దుల కళలను బతికిస్తున్న ఈ గంగిరెద్దుల వారు సంక్రాంతి సీజన్లో ప్రతి ఇంటికీ వచ్చే అతిథులు. గంగిరెద్దులకు శిక్షణ ఇవ్వడం, వాటిని ఊరూరా తిప్పడం చాలా ఆసక్తికరం. రానురాను ఈ కుటుంబాల వారు ఉద్యోగం, ఉపాధి వైపు వెళ్లిపోవడంతో ఇప్పుడు కొందరే మిగిలారు. వారే ఇప్పుడు ఈ కళను బతికిస్తున్నారు. ఆరు నెలల శిక్షణ.. ► గ్రామాల్లో భక్తులు సింహాద్రి అప్పన్నను మొక్కుకుని తమ పశువుల శాలలో పుట్టిన దూడలను కానీ లేదంటే కొనుగోలు చేసి గానీ ఈ గంగిరెద్దుల వారికి అందజేస్తారు. ►వీరు ఆ మూగజీవాలను బాగా మచ్చిక చేసుకుని ఎంతో శ్రమించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తాము చెప్పినట్లు వినేలా సిద్ధం చేస్తారు. ►తౌడు, ఉలవలు, నువ్వులు, తెలగపిండి, పెసర, మినుము పొట్టు తదితర వాటితో దాణా ఇచ్చి, ముందుగా ఒక ఏడాది పాటు ప్రతి రోజూ శిక్షణ ఇస్తారు. ►సంక్రాంతి మూడు రోజుల పాటు తమకు ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్ర కారం సన్నాయి, డోలు, గంగిరెద్దులను చక్కగా అలంకరించి, గ్రామాల్లోని ఇంటింటికీ తిరుగుతారు. గ్రామస్తులు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. అదేవిధంగా గంగిరెద్దులతో వివిధ విన్యాసాలు చేయిస్తారు. ► గ్రామాల్లో గంగిరెద్దుల వారికి ధాన్యం, బియ్యం, డబ్బును అందిస్తారు. వస్త్రాలు కూడా కొంతమంది సమర్పిస్తారు. ► మరణించిన తమ పెద్దల ఆత్మలకు శాంతి కలగాలని ‘భత్యం’ అందిస్తే గంగిరెద్దుల కులస్తులు పెద్దల పేరున పొగుడుతారు. కొందరే మిగిలారు.. జిల్లాలో సుమారు 250 మంది వరకు గంగిరెద్దులను ఆడిస్తూ జీవనం సాగిస్తున్నారు. భైరిసారంగపురం, చింతాడ, చిన్నదూగాం, పెంటిభద్ర, జగన్నాథపురం, గుండుబెల్లిపేట, కొన్నానపేట తదితర గ్రామాల్లో ఎక్కువగా ఈ కులస్తులు ఉన్నారు. భైరిసారంగపురంలో ప్రస్తుతం సూరయ్య, పోలయ్య, విశ్వనాథం తదితరులు గంగిరెద్దులతో విన్యాసాలను ఎంతో చక్కగా చేయిస్తున్నారు. ‘అల వైకుంఠపురం’ సినిమాలో ‘సిత్తరాల సిరపడు..’ పాట పాడిన బాడ సూరన్నది కూడా ఇదే వృత్తి. ధనుర్మాసం ప్రారంభం నుంచి గంగిరెద్దులతో గ్రామాల్లో తిరిగే వీరంతా ముఠాకు వెళ్లి గంథం అమావాస్య(ఏప్రిల్) సింహ్రాది అప్పన్న ఉత్సవాలకు తిరిగి వస్తారు. నాలుగు నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తారు. ఏటా కార్తీక మాసంలో సింహాద్రి అప్పన్నను దర్శించుకుంటారు. ఆదరణ తగ్గుతోంది.. గంగిరెద్దుల కళకు ఆదరణ తగ్గుతోంది. ఏడాదిలో ఆరు నెలలు ఎద్దులకు శిక్షణ ఇస్తాం. మిగిలిన ఆరు నెలలు గంగిరెద్దులను తీసుకుని ఊళ్లకు వెళ్తాం. ఇదే మాకు కులవృత్తి. గతంలో ఈ వృత్తిని నమ్ముకుని 120 కుటుంబాలు ఉండేవి. ప్రస్తుతం 30 కుటుంబాలు మాత్రమే ఈ వృత్తిని నమ్ముకున్నాయి. – యడ్ల విశ్వనాథం, జిల్లా ఉపాధ్యక్షుడు, గంగిరెద్దుల కుల సంక్షేమ సంఘం కళాకారులుగా గుర్తించాలి.. కులవృత్తినే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నాం. గంగిరెద్దుల విన్యాసాలకు ప్రాధాన్యత తగ్గుతోంది. మాలో నిరక్ష్యరాస్యులే ఎక్కువ. కళాకారులుగా గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. – బాడ సూరన్న, జానపద కళాకారుడు, భైరిసారంగపురం శ్రమతో కూడిన శిక్షణ.. ఎద్దులను ప్రత్యేకంగా అలంకరిస్తాం. వీటికి ముందుగా ఏడాది పాటు శిక్షణ ఇచ్చి, తర్వాత కూడా శిక్షణ కొనసాగిస్తాం. బసవన్న పోషణకు వారానికి రూ.500 నుంచి రూ.600 వరకు ఖర్చవుతుంది. – వై.పోలయ్య, భైరిసారంగపురం -
గంగిరెద్దులకు క్యూఆర్ కోడ్.. నిర్మలా సీతారామన్ ఆసక్తికర వీడియో
ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. వివిధ రకాల బిల్లుల చెల్లింపులు మరింత సులభతరం అయ్యాయి. అంతా డిజిటల్ చెల్లింపులు అయిపోయాయి. ఇక భారత్‌లో డిజిటల్ పేమెంట్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతిచోటా నగదుకు బదులు ఫోన్లోని యాప్స్ ద్వారానే పే చేసేస్తున్నారు. ఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ట్రాన్సక్షన్స్కే మొగ్గు చూపుతున్నారు. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఇది దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎలా మార్పు తీసుకొచ్చిందనే దానికి అద్దం పడుతోంది. చదవండి: కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ పండుగ సమయంలో ఇంటింటికీ తిరిగే గంగిరెద్దులను ఆడించే వారు కూడా డిజిటల్ రూపంలో భిక్షాటన చేస్తున్న వీడియోను మంత్రి ట్విటర్లో షేర్ చేస్తూ.. డిజిటల్ విప్లవం జానపద కళాకారుల వైపుకు కూడా చేరుకుందని ఆమె తెలిపారు. 30 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో.. ఓ ఇంటి ముందుకు వచ్చిన గందిరెద్దుపై క్యూఆర్ కోడ్ ట్యగా్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేస్తాడు. ఈ వీడియోను పోస్టు చేస్తూ..‘గంగరెద్దలాటకు చెందిన వీడియో ఇది. డిజిటల్ చెల్లింపు విప్లవం జానపద కళాకారులకు చేరువైంది. ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో గంగిరెద్దులవాళ్లు సంక్రాంతి వంటి పండుగల సమయంలో ఎద్దులకు పలమాలలు వేసి ఇంటింటికి వెళ్లి నాదస్వారం వాయిస్తూ భిక్ష తీసుకుంటారు.’ అని పేర్కొన్నారు. Recd a video of a Gangireddulata, where alms are given thru a QR code! India’s #digitalpayment revolution, reaching folk artists. In AP + Telangana, Gangireddulavallu dress up old oxen no longer helpful on farms, walk door to door during fests, performing with their nadaswarams pic.twitter.com/8rgAsRBP5v — Nirmala Sitharaman (@nsitharaman) November 4, 2021 -
గంగిరెద్దులు వస్తున్నాయి?
సాక్షి,మహబూబాబాద్/కరీమాబాద్: ‘‘సంక్రాంతి మొన్ననే పోయింది కదా.. ఊళ్లోకి ఇప్పుడెందుకు గంగిరెద్దులు వస్తున్నాయి’’అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామావు ఎద్దేవా చేశారు. పాలేరులో పంటలు నష్టపోయిన రైతులను ఓదార్చడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకుల నాటకాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. బుధవారం వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల్లో మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహబూబాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్.. ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షమే ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం, గృహాలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి రైతుబంధు పథకం కింద ఎకరానికి పెట్టుబడి సాయంగా రూ.8 వేలు ఇస్తామన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక విస్మరించిందన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం 2,630 తండాలను పంచాయతీలుగా చేశామని వివరించారు. రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ వరంగల్ శివారులోని మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అథారిటీ, ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ఆపరేటర్స్లతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. వరంగల్‌లో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మాస్టర్ ప్లాన్‌పై ఆయన సమీక్షించారు. ఇండస్ట్రియల్ కారిడార్, టూరిజం, టెక్స్టైల్ పార్కు, ఉద్యోగ కల్పనను దృష్టిలో ఉంచుకుని 9 నెలలుగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరానికి ఔటర్ రింగ్‌రోడ్డుతోపాటు ఇన్నర్ రింగ్‌రోడ్డు కూడా ఉండాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్‌లో మాదిరిగా అర్బన్ ల్యాండ్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 500 ఎకరాల మేర ల్యాండ్‌పుల్లింగ్ చేయాలని మంత్రి సూచించారు. పిక్ ఆఫ్ ది డే షేక్‌హ్యాండ్ ఇచ్చిన పోలీస్ జాగిలం ట్విట్టర్లో పోస్టు చేసిన మంత్రి కేటీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసు బందోబస్తులో భాగంగా వచ్చిన శునకం ఆయన్ని ఆకట్టుకుంది. ‘కుడా’కార్యాలయంలో జరిగిన సమీక్షలో పాల్గొనేందుకు సమావేశ మందిరంలోకి వెళ్తుండగా అక్కడే ఉన్న శునకం.. మంత్రికి సెల్యూట్ చేసింది. ఆ వెంటనే షేక్‌హ్యాండ్ ఇచ్చింది. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు ఈ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు. పర్యటన అనంతరం మంత్రి తన ట్విట్టర్లో ఆ ఫొటోను పోస్టు చేస్తూ ‘మై ఫేవరేట్ పిక్ ఆఫ్ ది డే ఫ్రం వరంగల్, రాన్ ఇంటూ స్వీటీ, ఈ పోలీస్ కెనీన్ హూ ఆఫర్డ్ ఏ వార్మ్ హ్యాండ్‌షేక్’అంటూ కామెంట్ రాశారు. -
అయ్యవారికి దండం పెట్టు
అచ్చంపేట: తెలుగు వారి పండగలలో సంక్రాంతి పండుగకు ప్రాధాన్యత ఉంది. సంప్రదాయం, సంస్కతికి అద్దం పట్టే పండుగ సంక్రాంతి. ఆరుకాలం శ్రమించి పండించిన పంటలు చేతికందే సమయంలో ఈ పండగ రావడంతో గ్రామీణ ప్రాతంలోని రైతులు ఇళ్లలలో ఆనందం వెల్లు విరుస్తుంది. తెలుగు వారి లోగిళ్లలో రంగు రంగుల హరివిల్లు వెలసిన ముగ్గులు, వాటిపై పసుపు, కుంకుమతో గొబ్బిళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ముగ్గుల్లో గరక పోచలు, రేగుపళ్లు, నవధాన్యాల మరో అలంకరణ. ఈ నేపథ్యంలో గంగిరెద్దుల విన్యాసాలు సంక్రాంతికే ప్రత్యేకమని చెప్పొచ్చు. అయ్య గారికి దండం పెట్టు.. అమ్మ గారికి దండం పెట్టు.. అంటూ చెప్పే యాజమాని సూచనలకు అనుగుణంగా తల ఊపే బసవన్నలు కొత్త వస్త్రాల అలంకరణలో ఆకట్టుకుంటాయి. తగ్గిన ఆదరణ.. అచ్చంపేట పట్టణంలో 22 గంగిరెద్దుల కుటుంబాలు ఉన్నాయి. వీరు పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామం నుంచి 25 ఏళ్ల క్రితం ఇక్కడి వచ్చి స్థిరపడ్డారు. ఇప్పటి ఈ కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరి కుటుంబాల్లో ఇప్పటి వరకు పెద్ద చదువులు చదివిన వారు కూడా లేరు. పెళ్లిళ్ల సీజన్ హైదరాబాద్ నుంచి పిలుపు వస్తే వాయిద్యం వెళ్లడమే తప్ప మిగతా రోజుల్లో ఏ పనికీ వెళ్లారు. గ్రామాల్లో ఎవరైనా కాలం చేసినప్పుడు కూడా వీరు గంగిరెద్దు సాయంతో ఉపాధి పొందుతున్నారు. ఊరూరా తిరిగి వచ్చిన డబ్బుతో పొట్టపోసుకుంటున్నారు. నియోజకవర్గంలోని అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల, పదర, వంగూరు, చారకొండ, పెద్దకొత్తపల్లి మండలాల్లో నిత్యం పర్యటించి ఉదయం,రాత్రివేళ గంగిరేద్దు ఆటతో జీవనం సాగిస్తున్నారు. అయితే, దీనికి ఆదరణ తగ్గిందని పెద్ద సవారి, పెద్ద నర్సింహ, నిరంజన్ చెబుతున్నారు. రాత్రివేళ గతంలో గంగిరెద్దు ఆట చూసేందుకు బాగా వచ్చేవారని ఇప్పుడు పాతకాలం నాటి మనఘులు మాత్రమే వస్తున్నారని చెప్పారు. వ్యవసాయ కాలంలో కల్లాల వద్దకు వెళ్లితే గింజలు పెట్టేవారు కాగా, ఇప్పుడు ఐదో, పదో డబ్బు ఇస్తున్నారని తెలిపారు. -
ఆకట్టుకుంటున్న బసవన్నలు
పూర్ణానందంపేట : పుష్కర యాత్రికులను భవానీ ఘాట్ వద్ద డూడూ... బసవన్నలు ఆకట్టుకుంటున్నాయి. స్నానాలు ఆచరించి వచ్చే భక్తులు బసవన్నల వద్ద తమ పిత్రుదేవతలను పొగిడించుకుని వాటికి కానుకలు సమర్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంత యాత్రికులకు పెద్దగా ఆకట్టుకోకపోయినా నగరాల నుంచి వచ్చే భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పిండప్రధానాలు చేసిన తరువాత బసవన్నలతో పొగిడిస్తే తమ తాతముత్తతాలు సంతోషిస్తారని భక్తులు విశ్వసిస్తారు. బసవన్నలను వాటి యజమానులు అందంగా ముస్తాబుచేసి ఘాట్ల వద్ద భక్తులను ఆకట్టుకునేలా ప్రయత్నం చేస్తున్నారు.