భోగి మంటల చుట్టూ విద్యార్థినులతో కలసి నృత్యాలు చేస్తున్న ఎమ్మెల్యే బాలరాజు, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు
బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): సంక్రాంతి.. ఇది ఒక పండుగ మాత్రమే కాదు. ఎన్నెన్నో అనుభూతులు, మరెన్నో మేళవింపులు... భావోద్వేగాలు... ఒక మాటలో చెప్పాలంటే ఏడాదికి సరిపోయే ఎన్నో అద్భుతమైన తీపి జ్ఞాపకాల సంబరం. అలాంటి పండుగ రెండు వారాల్లో రాబోతుంది. అయితే అంతకన్నా ముందే పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆట పాటలతో హోరెత్తించారు.
సంక్రాంతి అనగానే వెంటనే గుర్తుకు వచ్చేవి భోగిమంటలు.. సంప్రదాయ పంచెకట్లు, పట్టు పరికిణీలు, గంగిరెడ్లు, డూడూ బసవన్నలు, సన్నాయి వాయిద్యాలు, రంగురంగుల ముగ్గులు, ఎడ్ల పందేలు, కోడి పందేలు, జానపదాలు, సరదాలు, షికార్లు ఇలా అనేక రకమైన కళలు, సాంస్కృతిక మైమరపుల కలబోతే సంక్రాంతి. సంక్రాంతి పండుగలో సాంస్కృతిక శోభను అదిమి పట్టుకునే విధంగా బుట్టాయగూడెం మండలంలోని తెల్లంవారిగూడెం పాఠశాలలో సంక్రాంతి సంబరాలను ఉపాధ్యాయులు నిర్వహించారు. హరిలో రంగ హరి అంటూ హరిదాసు సందడి, భోగిమంటలు, గొబ్బెమ్మలతో ముగ్గులు, రోలులో పిండి కొట్టే సాంప్రదాయం ఇలా అన్ని ఉట్టిపడేలా ఏర్పాటు చేసి ముందుగానే సంక్రాంతి సందడిని తీసుకువచ్చారు.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెద
సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. సరదాలు తెచ్చిందే తుమ్మెద... అంటూ సాగే పాటకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సైతం నృత్యాలు చేశారు. అదేవిధంగా భోగి తెచ్చే భోగం అనే పాటకు కూడా విద్యార్థులతో పాటు బాలరాజు నృత్యం చేసి అందరినీ అలరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పండగను ఆనందోల్సాహాలతో జరుపుకున్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు సంక్రాంతి, జానపద పాటలకు నృత్యాలు విద్యార్థినులను ఉత్సాహపరిచారు. (క్లిక్ చేయండి: ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి)
Comments
Please login to add a commentAdd a comment