buttaigudem
-
సంక్రాంతి సంబరాలు షురూ.. గిరి పల్లెల్లో మొదలైన సందడి
బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): సంక్రాంతి.. ఇది ఒక పండుగ మాత్రమే కాదు. ఎన్నెన్నో అనుభూతులు, మరెన్నో మేళవింపులు... భావోద్వేగాలు... ఒక మాటలో చెప్పాలంటే ఏడాదికి సరిపోయే ఎన్నో అద్భుతమైన తీపి జ్ఞాపకాల సంబరం. అలాంటి పండుగ రెండు వారాల్లో రాబోతుంది. అయితే అంతకన్నా ముందే పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆట పాటలతో హోరెత్తించారు. సంక్రాంతి అనగానే వెంటనే గుర్తుకు వచ్చేవి భోగిమంటలు.. సంప్రదాయ పంచెకట్లు, పట్టు పరికిణీలు, గంగిరెడ్లు, డూడూ బసవన్నలు, సన్నాయి వాయిద్యాలు, రంగురంగుల ముగ్గులు, ఎడ్ల పందేలు, కోడి పందేలు, జానపదాలు, సరదాలు, షికార్లు ఇలా అనేక రకమైన కళలు, సాంస్కృతిక మైమరపుల కలబోతే సంక్రాంతి. సంక్రాంతి పండుగలో సాంస్కృతిక శోభను అదిమి పట్టుకునే విధంగా బుట్టాయగూడెం మండలంలోని తెల్లంవారిగూడెం పాఠశాలలో సంక్రాంతి సంబరాలను ఉపాధ్యాయులు నిర్వహించారు. హరిలో రంగ హరి అంటూ హరిదాసు సందడి, భోగిమంటలు, గొబ్బెమ్మలతో ముగ్గులు, రోలులో పిండి కొట్టే సాంప్రదాయం ఇలా అన్ని ఉట్టిపడేలా ఏర్పాటు చేసి ముందుగానే సంక్రాంతి సందడిని తీసుకువచ్చారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. సరదాలు తెచ్చిందే తుమ్మెద... అంటూ సాగే పాటకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సైతం నృత్యాలు చేశారు. అదేవిధంగా భోగి తెచ్చే భోగం అనే పాటకు కూడా విద్యార్థులతో పాటు బాలరాజు నృత్యం చేసి అందరినీ అలరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పండగను ఆనందోల్సాహాలతో జరుపుకున్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు సంక్రాంతి, జానపద పాటలకు నృత్యాలు విద్యార్థినులను ఉత్సాహపరిచారు. (క్లిక్ చేయండి: ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి) -
Nature Farming: సేంద్రియ సారం.. పుడమికి జీవం
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో వ్యవసాయం సాహసోపేతం. ఇక్కడ సాగుకు వర్షాలు, కొండవాగుల నీరే ఆధారం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ప్రకృతి సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. దీంతో రైతులు కూడా సేంద్రియ విధానాలపై ఆసక్తి చూపుతూ సత్ఫలితాలు పొందుతున్నారు. కేఆర్‌పురం ఐటీడీఏ, ప్రకృతి వ్యవసాయ అధికారుల చొరవతో మూడేళ్లుగా గిరిజన రైతుల్లో ప్రకృతి వ్యవసాయంపై చైతన్యం పెరిగింది. గిరిజన ప్రాంతంలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు కూరగాయలను అత్యధికంగా సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 15 వేల మందికి పైగా రైతులు సుమారు 9,400 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీటిలో 2,100 ఎకరాల్లో చిరుధాన్యాలు, 7 వేల ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో కూరగాయలు వంటివి పండిస్తున్నారు. ప్రోత్సాహం ఇలా.. గిరిజన ప్రాంతంలోని సన్న, చిన్నకారు గిరిజన రైతులను ప్రకృతి సాగు వైపు మొగ్గు చూపేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. విత్తనం నాటిన నుంచి ఎరువులు వినియోగించకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తక్కువ మోతాదులో ఎరువులు వాడుతున్న వారు, సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్న వారిని ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. ఇద్దరు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను, ఒక క్లస్టర్ కార్యకలాపాల నిర్వాహకుడు, ఎంపీఈఓ, సీఆర్పీలను నియమించి రైతులకు సాంకేతిక సలహాలను అందిస్తున్నారు. క్లస్టర్ పరిధిలో ఐదు పురుగు మందుల అవశేషాలు లేని ఎరువుల దుకాణాన్ని ఏర్పాటుచేశారు. కొందరు రైతులకు ఈ దుకాణాల బాధ్యతలను అప్పగించారు. ఇందుకు రూ.50 వేల రాయితీలపై రుణాలను కూడా అందించారు. వీరు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూనే దుకాణాల ద్వారా రైతులకు కషాయాలను, సేంద్రియ ఎరువులను తయారు చేసి అవసరమైన సామగ్రిని విక్రయించేలా ఏర్పాటుచేశారు. అలాగే 30 మంది రైతులకు ఆవుల కొనుగోలుకు రూ.10 వేల చొప్పున రాయితీలతో రుణాలను అధికారులు అందించారు. కషాయాల తయారీకి ఉపయోగపడే పరికరాలను సమకూర్చారు. అలాగే షెడ్, నైట్ నీడలో కూరగాయల సాగు చేసుకునేలా ఏర్పాట్లుచేశారు. 200 ఎకరాల్లో కూరగాయలు.. సుమారు 200 ఎకరాల్లో 250 మంది రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. పొట్ల కాయ, ఆనబకాయ, కాకరకాయ, దోసకాయలు, చిక్కుడు, బీర, వంకాయ, టమాట, బెండకాయ, గోరు చిక్కుళ్లు వంటి కూరగాయలతో పాటు గోంగూర, బచ్చలకూర, తోటకూర వంటి ఆకుకూరలను ప్రకృతి వ్యవసాయంలో రైతులు పండిస్తున్నారు. 2,100 ఎకరాల్లో సుమారు 1,800 మంది రైతులు చిరుధాన్యాల సాగు చేస్తున్నారు. 2,100 ఎకరాల్లో చిరు ధాన్యాలు జొన్నలు, గంట్లు, పెసర, మినుము, ఉలవలు, బొబ్బర్లు, పెసలతో పాటు జీలుగు, జనుము వంటి పంటలను పండిస్తున్నారు. వీటికి ఆదరణ పెరగడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం కూడా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. 7 వేల ఎకరాల్లో వరి ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకు తిరుమల, తిరుపతి దేవస్థానం వారు కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున ఈ ఏడాది 7 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే దాదాపు 2,000 ఎకరాల్లో వరి కోతలు పుర్తయ్యాయి. అయితే ఎకరానికి 400 బస్తాల దిగుబడి రావడంతో రబీలో కూడా వరి పంటలు వేసేలా రైతులు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా గిట్టుబాటు ధర కూడా మెండుగా ఉంది. విస్తరిస్తున్న సేంద్రియ సాగు ప్రకృతి సాగు ఏటా పెరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది 39,873 మంది రైతులు 78,479 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల పంటలు సాగుచేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది. రైతులకు అవగాహన పెంచి సాగును మరింత పెంచేలా కృషి చేస్తున్నాం. – పైడపల్లి లలితాసుధ, ఏపీసీఎన్ఎఫ్ డీపీఎం, ఏలూరు ప్రోత్సహిస్తున్నాం ప్రభుత్వం, ఐటీడీఏ అధికారుల సహకారం మరువలేనిది. రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. – వై.ముసలయ్య, ప్రకృతి వ్యవసాయ సబ్ డివిజనల్ యాంకర్, కేఆర్‌పురం లాభదాయకంగా ఉంది ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యవంతమైన పంటలు పండించడం ఆరోగ్యంగా ఉంది. నేను ఈ ఏడాది సుమారు రెండు ఎకరాల్లో బీర, ఆకుకూరల పంటలను సాగుచేస్తున్నాను. – సలాది కొండరాజు, గిరిజన రైతు, నిమ్మలగూడెం, బుట్టాయగూడెం మండలం -
Papikondalu: అడవి తల్లికి గూర్ఖాలుగా బేస్ క్యాంప్ సిబ్బంది
బుట్టాయగూడెం(పశ్చిమ గోదావరి జిల్లా): అరణ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ నిత్యం సవాళ్లతో సావాసం చేసే అడవి తల్లి బిడ్డలు వారు. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆ అడవిలో వణ్య ప్రాణుల సంరక్షణ, వేటగాళ్ల నుంచి విలువైన వృక్ష సంపదను రక్షించడమే వారి పని. పాపికొండల అభయారణ్యంలోని అణువణువూ జల్లెడ పట్టే బేస్ క్యాంప్ సిబ్బంది కుటుంబాలకు దూరంగా.. అడవి తల్లికి గూర్ఖాలుగా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిసున్న బేస్‌క్యాంప్ సిబ్బందిపై ప్రత్యేక కథనం.. ఐదు బేస్ క్యాంప్‌లు ఏర్పాటు పాపికొండల అభయారణ్యం ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1,012.86 చదరపు కిలోమీట్ల మేర విస్తరించింది. మొత్తం 1,01,200 హెక్టార్ల అటవీప్రాంతాన్ని 2008లో కేంద్రప్రభుత్వం జాతీయ పార్కుగా ప్రకటించింది. అటవీ సంరక్షణతో పాటు వన్యప్రాణి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మగుడి సమీపంలో ఒకటి, పోలవరం మండలం టేకూరు ప్రాంతంలో, గడ్డపల్లి సమీపంలో, పాపికొండల అభయారణ్య శివారు ప్రాంతంలో మరో రెండు బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి వాటిలో 25 మంది సిబ్బందిని నియమించారు. వీరంతా అటవీ, వన్యప్రాణి సంరక్షణ కోసం పగలూ రాత్రీ తేడాలేకుండా శ్రమిస్తున్నారు. తగ్గిన స్మగ్లింగ్ బేస్ క్యాంప్‌ల ఏర్పాటుతో అటవీప్రాంతంలో స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టింది. గతంలో స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా అటవీసంపదను తరలించేవారు. ప్రస్తుతం బేస్‌క్యాంప్‌లు ఏర్పాటు చేయడం వల్ల అక్రమ రవాణా అరికట్టారు. బేస్ క్యాంప్ సిబ్బంది రాత్రీ, పగలూ గస్తీ కాయడం వల్ల వన్యప్రాణులకు రక్షణ పెరిగిందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. రాత్రి వరకూ అడవిలో గస్తీ బేస్‌క్యాంప్ సిబ్బంది అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన మంచె లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇళ్లల్లో ఉంటారు. వంట వార్పు మొత్తం అక్కడే. అప్పుడప్పుడు ఇళ్లకు వెళ్లడం తప్ప అడవే వారికి ప్రపంచం. అడవితల్లికి అండగా ఉంటూ చెట్లు నరికివేతకు గురికాకుండా, వన్యప్రాణుల్ని సంరక్షిస్తుంటారు. ఉదయం 6 గంటలకే నిద్రలేచి వంటావార్పూ సిద్ధం చేసుకుని అడవిలోకి బయల్దేరతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అటవీప్రాంతంలో తిరుగుతూ జంతువుల కదలికలను గుర్తిస్తారు. ఒక్కోసారి రాత్రి వరకూ అటవీప్రాంతంలోనే ఉంటారు. అడవిని నరుకుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి స్మగ్లర్ల ఆటకట్టిస్తారు. అడవిలో సాయంత్రం కాగానే పూర్తిగా నిర్మానుష్యంగా మారుతుంది. చీకటి పడగానే చిరుతలు, ఎలుగుబంట్లతో పాటు పలు జంతువుల అరుపులు వినిపిస్తుంటాయి. ఒక్కోసారి అవి పక్కనుంచి వెళ్తుంటాయి. రోజూ ఎన్నో జంతువులు కనిపిస్తాయి. అయినా వాటి మధ్య ధైర్యంగా బేస్‌క్యాంప్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. బేస్‌క్యాంప్ సిబ్బందిని అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమిస్తారు. 25 కిలోమీట్ల వాకింగ్ టెస్ట్, హెల్త్ఫిట్నెస్ టెస్ట్ ద్వారా నియమిస్తారు. అడవి సింహాల్లా.. అటవీ ప్రాంతంలో బేస్ క్యాంప్ సిబ్బంది వన్యప్రాణుల మధ్య అడవి సింహాల్లా తిరుగుతుంటారు. ఒక్కోసారి రాత్రిపూట కూడా అడవికి కాపలా కాస్తారు. దీంతో స్మగ్లింగ్ తగ్గింది. పాపికొండల అభయారణ్యంలో ప్రస్తుతం 25 మంది బేస్‌క్యాంప్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, పాపికొండల వైల్డ్‌లైఫ్ మేనేజ్మెంట్ అధికారి జంతువులు కనిపిస్తే దాక్కుంటాం మేము దట్టమైన అటవీప్రాంతంలో తిరుగుతున్న సమయంలో మాకు అనేక అడవి జంతువులు కనిపిస్తాయి. ఆ సమయంలో అవి వెళ్ళిపోయే వరకూ చాటున దాక్కుంటాం. గొర్రగేదెలు, లేళ్లు, ఎలుగుబంట్లు వంటివి మాకు కనిపిస్తుంటాయి. వాటి సంరక్షణ మా బాధ్యత కనుక వాటికి కనిపించకుండా పహారా కాస్తాం. – సోయం వెంకటేశ్వరరావు, బేస్ క్యాంప్ సిబ్బంది, కొరుటూరు చేతి కర్ర, కత్తే ఆయుధం దట్టమైన అటవీప్రాంతంలో పహారా కాసే సమయంలో మా చేతిలో కర్ర, కత్తి మాత్రమే ఉంటాయి. అవే ఆయుధాలు. అవి కూడా ముళ్ల చెట్లు తొలగించడానికే తప్ప జంతువులకు హాని చేయడానికి కాదు. రాత్రీ, పగలూ తేడా లేకుండా కర్రతో శబ్దం చేస్తూ తిరుగుతుంటాం. – యండపల్లి బుచ్చన్న దొర బేస్ క్యాంప్ సిబ్బంది, సరుగుడు కష్టానికి తగ్గ జీతం ఇవ్వాలి మాలో డిగ్రీ వరకూ చదివిన వారు కూడా ఉన్నారు. మా గ్రామాలు అటవీప్రాంతంలో ఉండటం వల్ల బేస్ క్యాంప్‌లో చేరాం. ప్రస్తుతం మాకు జీతం, భోజన ఖర్చులు కలిపి నెలకు రూ. 10 వేల వరకూ ఇస్తున్నారు. మా కష్టానికి తగ్గట్లు జీతాలు పెంచాలి. అడవిలో ఉంటున్న రోజుల్లో మా భోజనానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. – కొండ్ల సుధీర్, బేస్ క్యాంప్ సిబ్బంది, పోలవరం -
సంక్షేమ శేఖరుడు.. రాజన్న
‘పోలవరం’ కోసం పరితపించారు.. డెల్టా ఆధునికీకరణకు నడుం బిగించారు.. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా జలయజ్ఞం చేపట్టారు.. ఉద్యాన వర్సిటీని స్థాపించి ఉద్యాన రైతులకు ఆసరాగా నిలిచారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుల విప్లవం తీసుకువచ్చారు.. ఆరోగ్యశ్రీ, 108లతో ప్రాణదాతగా నిలిచారు.. నీటిపారుదల, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ ‘పశ్చిమ’పై ఎనలేని ప్రేమను చూపించారు. అడుగడుగునా తన గురుతులతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. గురువారం ఆయన జయంతి సందర్భంగా మహానేతా.. అందుకో మా జోత అంటూ పశ్చిమవాసులు నివాళులర్పిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు/బుట్టాయగూడెం: పశ్చిమగోదావరి సమృద్ధిగా ఉండాలి. అన్నదాతకు సాగు కష్టాలు తీరితేనే అంతా బాగుంటుంది. అవసరాలకు పూర్తిస్థాయిలో నీరు ఇవ్వగలితే అంతా చేసినట్టే ఇది దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నమ్మినమాట. దానిని ఆచరణలో పెట్టడంతో ‘పశ్చిమ’ ముఖ చిత్రం మారేలా జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి శాశ్వతంగా తన ముద్ర ఉండేలా మేలు చేశారు. రాష్ట్ర జీవనాడి పోలవరం కోసం వైఎస్సార్ పరితపించారు. అన్ని అనుమతులూ తీసుకువచ్చి కుడి, ఎడమ కాలువలకు సంబంధించి 80 శాతానికిపైగా పనులు పూర్తి చేయించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఈస్థాయిలో పరుగులు పెట్టడానికి వైఎస్సార్ చూపిన చొరవే కారణం. తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు ఆయన చలువతోనే రూపుదిద్దుకున్నాయి. ఏలూరుకు తమ్మిలేరు వరద నుంచి శాశ్వత పరిష్కారం చూపారు. 2005లో రూ.17 కోట్లతో మరమ్మతులకు నిధులు మంజూరు చేసి శాశ్వత ప్రాతిపదికన రూ.90 కోట్లతో తమ్మిలేరు కరకట్టను పరిపుష్టి చేశారు. ఏజెన్సీలోని కొండ కాలువలపై హైలెవెల్ బ్రిడ్జిని రూ.25 కోట్లతో అభివృద్ధి చేశారు. నరసాపురం వద్ద వశిష్ట వంతెన నిర్మాణానికి రూ.194 కోట్ల నిధులు మంజూరు చేసినా ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ వంతెనను కలగా మిగిల్చాయి. జిల్లాకు అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకువచ్చి లేసుపార్కును అభివృద్ధి చేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి వద్ద గోదావరి ఏటిగట్టుకు రూ.20 కోట్లతో రివిట్మెంట్ నిర్మించడానికి చొరవ చూపడంతో ఆ ప్రాంత ప్రజలు ముంపు నుంచి బయటపడ్డారు. జిల్లాలో అర్హులైన పేదలకు 30 వేల ఎకరాలు భూ పంపిణీ చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. ఉచిత విద్యుత్ అందించడంతో పాటు ఒకే దఫాలో రైతులకు రుణమాఫీ చేసి రైతు బాంధవుడిగా నిలిచిపోయారు. గిరిజనులకు పట్టాలు జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్నకారు రైతులకు సుమారు 30 వేల ఎకరాల పోడు భూములకు గాను వైఎస్సార్ పట్టాలిచ్చారు. గిరిజన ప్రాంతంలోని సుమారు 1,700 మంది గిరిజన పోడు భూమి రైతులకు 6,500 ఎకరాలకు పట్టాలను అందించడంతో పాటు భూములను సాగులోకి తీసుకువచ్చేలా బోర్లు వేయించి విద్యుత్ సదుపాయం కల్పించారు. ఉద్యాన’ వెలుగులు తాడేపల్లిగూడెంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఉద్యాన సాగు అభివృద్ధితో పాటు యువతకు విద్యావకాశాలు కల్పించేలా ఆయన తీసుకున్న చొరవ చిరస్మరణీయం. పోగొండ జలాలు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పోగొండ రిజర్వాయర్ నిర్మాణం పూర్తికావడంలో వైఎస్సార్ చొరవ ఉంది. ప్రస్తుతం సుమారు 7,600 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందంటే అది ఆయన చలువే. -
మోకాళ్లపై గుడి మెట్లెక్కిన బాలరాజు
సాక్షి, బుట్టాయగూడెం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోగ్యం మెరుగుపడి త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ తల్లి గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మోకాళ్లపై నడుస్తూ మెట్లెక్కి మొక్కు చెల్లించుకున్నారు. ఇటీవల హత్యాయత్నంలో గాయపడిన వైఎస్.జగన్ త్వరగా కోలుకోవాలని ఈ పూజలు చేసినట్లు బాలరాజు చెప్పారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైఎస్ జగన్‌ని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. కోట్లాది మంది అభిమానులు ఆయన వెంట ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ని ప్రజలు అఖండ ఆధిక్యంతో గెలిపిస్తారని చెప్పారు. రాబోయే రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కుంజా భూమయ్య, జోడి దుర్గాప్రసాద్, మాజీ సర్పంచ్ కోర్సా కన్నపరాజు, పెద్దిరెడ్డి మూర్తి, బొల్లిగిరి, మహమ్మద్ ఇక్బాల్, మహమ్మద్ నక్తర్, తెల్లం స్వామి, తెల్లం వెంకయ్య, మడివి బుచ్చయ్య, పట్ల గంగాదేవి, పసుపులేటి మధు పాల్గొన్నారు. -
గిరిజన అభ్యర్థులకు శిక్షణ
బుట్టాయగూడెం : బుట్టాయగూడెం మండలం కేఆర్ పురం ఐటీడీఏలో గిరిజన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పీవో ఎస్.షణ్మోహన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఏడీ / సీఏఎం అభ్యర్థులకు బుధవారం నుంచి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 19 నుంచి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. సీఏడీ/ సీఏఎం శిక్షణకు అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణలై వయసు 18 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. కానిస్టేబుల్ శిక్షణకు ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలని, 18 నుంచి 26 ఏళ్ల వయసు ఉండాలని తెలిపారు. శిక్షణ కాలం రెండు నెలలు ఉంటుందని పేర్కొన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆధార్ కార్డు, దరఖాస్తు చేసుకున్న రసీదు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో శిక్షణకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 99595 36789, 89856 17583, 94933 20944లో సంప్రదించాలని కోరారు. -
బాధిత విద్యార్థినిలకు జిల్లా ఎస్పీ పరామర్శ
ఏలూరు : ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధిత విద్యార్థినులకు జిల్లా ఎస్పీ రఘురాంరెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులపై నిర్భయ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం సాంఘీక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో విద్యార్థినులతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న విషయం తెలిసిందే. మాట్రిన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు . ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
విద్యార్థినులతో బలవంతంగా వ్యభిచారం
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం సాంఘీక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో ఘోరం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినుల చేత వంట మనిషి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మాట్రిన్ జానకుమారి ఫిర్యాదు చేయటంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలు పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్కూల్‌కు వెళ్లిన విద్యార్థినిలు అదృశ్యం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలోని స్థానిక ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు మంగళవారం అదృశ్యమైయ్యారు. దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ... పోలీసులను ఆశ్రయించారు. నిన్న ఉదయం స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులు సాయంత్రానికి ఇంటికి చేరలేదని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా పోలీసులు విచారణ చేపట్టారు.