ఉదయం పూట చెట్ల కొమ్మలపై మంచుపూలు స్వాగతం పలుకుతుండగా సన్నాయి రాగం మధురంగా వినిపిస్తుంది. చేగంట మోగుతుండగా బసవన్న పాట వినిపిస్తుంది... ‘డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా/ఉరుకుతూ రారన్న రారన్న బసవన్నా/అమ్మవారికి దండం బెట్టు అయ్యగారికి దండం బెట్టు/రారా బసవన్నా... రారా బసవన్నా....’
గంగిరెద్దులు ఊళ్లోకి అడుగు పెడితే ఊరికి సంక్రాంతి కళ సంపూర్ణంగా వచ్చినట్లే. విశేషం ఏమిటంటే... గంగిరెద్దుల ముందు పెద్దలు చిన్న పిల్లలై పోతారు. ‘దీవించు బసవన్నా’ అంటూ పిల్లలు పెద్దలై భక్తిపారవశ్యంతో మొక్కుతారు. కాలం ముందుకు వెళుతున్న కొద్దీ ఎన్నో కళలు వెనక్కి పోతూ చరిత్రలో కలిసిపోయాయి. అయితే గంగిరెద్దుల ఆట అలా కాదు. కాలంతో పాటు నిలుస్తోంది. ‘ఇది మన కాలం ఆట’ అనిపిస్తోంది...
కొత్త కాలానికి... కొత్త చరణాలు
కాలంతో పాటు బసవన్న పాటలోకి కొత్త చరణాలు వస్తుంటాయి. సందర్భాన్ని బట్టి ఆ పాటలో చరణాలు భాగం అవుతుంటాయి. ఒక ఊళ్లో... సంక్రాంతి సెలవులకు వచ్చిన పిల్లాడు బైక్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అది ఎన్నో సంవత్సరాల చేదు జ్ఞాపకం అయినా సరే, ఊళ్లో సంక్రాంతి రోజు ప్రతి ఇల్లు పండగ కళతో కళకళలాడినట్లు ఆ ఇల్లు కనిపించదు. జ్ఞాపకాల దుఃఖభారంతో కనిపిస్తుంది. ఆ భారం నుంచి ఆ ఇంటి వాళ్లను తప్పించడానికి బసవడు ఆడుతాడు పాడుతాడు. ‘నవ్వించు బసవన్న నవ్వించు/అమ్మ వారికి దండం పెట్టి నవ్వించు/అయ్యవారికి దండం పెట్టి నవ్వించు/ వాళ్లు హాయిగా ఉండేలా దీవించు..ఆ దీవెన ఎంతో పవర్‌పుల్.
పండగపూట బసవన్న ఇంటిముందుకు రాగానే బియ్యం లేదా పాత బట్టలతో రావడం ఒక విషయం అయితే... భవిష్యత్ వాణి అడగడం, ఆశీర్వాదం ఒక మరో విషయం. గంగిరెద్దులాయన సంచిలో బియ్యం పోస్తు ‘మా అబ్బాయికి ఈ సంవత్సరమన్నా ఉద్యోగం వస్తుందా బసవన్నా’ అని అడుగుతుంది ఒక అమ్మ, ‘అవును’ అన్నట్లు తల ఆడిస్తుంది. ‘మా తల్లే’ అని కంటినిండా సంతోషంతో గంగిరెద్దు కాళ్లు మొక్కుతుంది ఆ అమ్మ.
గంగిరెద్దుల ఆటలో విశేషం ఏమిటంటే, తెలుగు ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన ప్రత్యేతలు ఉన్నాయి. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా మందస ప్రాంతంలో గంగిరెద్దుల వారి పాటల్లో తత్వం ధ్వనిస్తుంది. సామాజిక విశ్లేషణ ఉంటుంది. ఉదా: ‘దేవా! ఏమి జరుగుతున్నది ప్రపంచం/అహో! ఏం చిత్రంగున్నదీ ప్రపంచం/ పసుపురాత తగ్గిపోయి....΄పౌడరు రాతలెక్కువాయె’...సంక్రాంతి రోజుల్లో బసవన్నల విన్యాసాలకు ప్రత్యేకంగా రంగస్థలం అక్కర్లేదు. ఊళ్లోకి అడుగుపెడితే... అణువణువూ ఆ కళకు రంగస్థలమే. మనసంతా ఉల్లాసమే. తరతరాల నుంచి ప్రతి తరానికి దివ్యమై అనుభవమే.
– బోణం గణేష్, సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment