Makar Sankranti 2024: సంక్రాంతి వైభవాన్ని కనుమా! | Sakshi Special Story About Makar Sankranti 2024 | Sakshi
Sakshi News home page

Makar Sankranti 2024: సంక్రాంతి వైభవాన్ని కనుమా!

Published Mon, Jan 15 2024 6:14 AM | Last Updated on Mon, Jan 15 2024 1:07 PM

Sakshi Special Story About Makar Sankranti 2024

భారతీయులు అందులోనూ దాక్షిణాత్యులు, ముఖ్యంగా తెలుగువారు సంక్రాంతిని ఎంతో వైభవోపేతంగా చేసుకుంటారు. ఆడపడుచులు, అల్లుళ్లతో సహా సంక్రాంతికి మాత్రం తమ స్వగ్రామాలకి చేరుకుంటారు అందరు. సంక్రాంతి వైభవం అంతా పల్లెలలో చూడాలి.

సంక్రాంతి పండుగ సమయానికి పంటలు ఇంటికి వచ్చి రైతులు, వ్యవసాయ కూలీలు గ్రామంలో ఉన్న అందరు కూడా పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా కంటికి ఇంపుగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ΄పొలం పనులు పూర్తి అయి కాస్త విశ్రాంతి తీసుకునే వీలుండటంతో సందడి, సంబరాలు. తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమిని, రైతులను, కూలీలను, పాలేర్లను, పశువులను, పక్షులను అన్నింటికి కృతజ్ఞతను తెలియచేయటం, తమ సంపదను సాటివారితో బంధుమిత్రులతో పంచుకోవటం ఈ వేడుకల్లో కనపడుతుంది.

భారతీయులు చాంద్రమానంతో పాటు కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. అటువంటి వాటిల్లో ప్రధానమైనది మకరసంక్రమణం. మకరసంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటి వరకు దక్షిణదిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్ళుతుంది. అందుకే ఆ రోజు నుండి ఆరునెలలు ఉత్తరాయణం అంటారు. అప్పటికి ఆరునెలలనుండి దక్షిణాయనం. ఈ పుణ్య సమయంలో చేయవలసిన విధులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని సంక్రాంతి సంబరాల్లో మేళవించటం జరిగింది.  

► విధులు
అంతరిక్షంలో జరిగే ఖగోళవిశేషాల ననుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనుషులు చేయవలసిన పనులను పండుగ విధులుగా చెప్పటం మన ఋషుల ఘనత. అవి మనిషి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగాను ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞాన్ని అందించేవిగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి ఎదగటానికి సహాయం చేసేవిగా ఉంటాయి. మన పండుగలు బహుళార్థసాధక ప్రణాళికలు. అన్నింటిని సమీకరించి ఎప్పుడేం చెయ్యాలో చక్కగా చె΄్పారు.
                              

► పెద్దపండగ
సంక్రాతిని పెద్దపండగ అంటారు. చాలా పెద్ద ఎత్తున చేసుకోవటంతో పాటు ఎక్కువ రోజులు చేసుకుంటారు. సంక్రమణం జరిగే రోజు పండుగ, ముందురోజు భోగి, మూడవరోజు కనుము. నాలుగవ రోజు ముక్కనుము. నిజానికి పండుగ వాతావరణం నెలరోజుల ముందు నుండే నెలకొంటుంది.

► నెల పట్టటం
సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15వ తేదీ కాని, 16 వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14వ తేదీ వరకు కాని, 15 వ తేదీ వరకు కాని ఉండే ధనుర్మాసం అంతా ప్రత్యేకంగానే కనపడుతుంది. దీనిని ‘నెలపట్టటం’ అని అంటారు. అంటే ఈ నెల అంతా ఒక ప్రత్యేక మైన పద్ధతిని పాటిస్తామని చెప్పటం.

ఇళ్ల ముందు ఆవుపేడ కళ్ళాపిలో అందంగా తీర్చి దిద్దిన రంగవల్లికలు, ఆకాశంలో నుండి క్రిందికి దిగి వచ్చినట్టు కనపడే చుక్కల ముగ్గుల మధ్యలో కంటికింపుగా దర్శనమిచ్చే గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల పైన అలంకరించ బడి పలకరించే బంతి, చేమంతి, గుమ్మడిపూలు, వాటిని తొక్క కుండా ‘హరిలో రంగ హరి’ అంటు అందరిని తన మధురగానంతో మేలుకొలుపుతున్న హరిదాసులు, వారు వెళ్ళగానే ‘అయ్యగారికీ దండం పెట్టు, అమ్మగారికీ దండం పెట్టు’ అంటు గంగిరెద్దుల నాడించేవారు, జంగంవారు, బుడబుక్కలవారు ...... తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించే ఎంతోమంది జానపద కళాకారులు – అదొక కలకలం, అదొక కళావిలాసం.

ఈ నెల అంతా విశిష్టాద్వైత సంప్రదాయాన్ననుసరించే వారు తిరు΄్పావై లేక శ్రీవ్రతం లేక స్నానవ్రతం అనే దాన్ని ఆచరిస్తారు.ద్వాపరయుగం చివరలో గోపికలు ఆచరించిన ఈ వ్రతాన్ని గోదాదేవి ఆచరించి శ్రీరంగనాథుని వివాహం చేసుకుని ఆయనలో సశరీరంగా లీనమయింది. వైష్ణవదేవాలయాల్లో తెల్లవారుజామునే కృష్ణుని అర్చించి బాలభోగంగా నివేదించిన ప్రసాదాన్ని తెల్లవారక ముందే పంచిపెడతారు. ప్రకృతిలో భాగమైన సర్వజీవులు స్త్రీలు. వారు పరమపురుషుని చేరుకోవటం కోసం చేసే సాధన మధురభక్తి మార్గం. దానికి ప్రతీక అయిన గోదాదేవి చేసిన వ్రతాన్ని ఈ నెలరోజులు సాధకులు, భక్తులు అందరు ఆచరిస్తారు. ఆండాళు తల్లి ఆ రోజుల్లో గోపికలుగా భావించుకున్న తన చెలులను వ్రతం చెయ్యటానికి స్నానం చేద్దాం రమ్మని మేలు కొలుపుతుంది. ఇప్పుడు ఆపని హరిదాసులు చేస్తున్నారు.

► సంక్రాంతి
అసలు ప్రధానమైనది సంక్రాంతి, అంటే సంక్రమణం జరిగే రోజు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు. ఈ పుణ్య కాలంలో దానాలు, తర్పణాలు ్రపాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం.

గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం, పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయని వారు ఈ రోజు చేస్తారు. అసలు మూడు రోజులు పేరంటం చేసే వారున్నారు. దక్షిణాయణం పూర్తి అయి పితృదేవతలు తమ స్థానాలకి వెడితే మళ్ళీ ఆరునెలల వరకు రారు కనుక వారికి కృతజ్ఞతా పూర్వకంగా తర్పణాలు ఇస్తారు. కొంతమంది కనుము నాడు తర్పణాలిస్తారు.

► కనుము
తమ ఇంటికి పంట వచ్చి ఆనందంగా ఉండటానికి కారణభూతమైన భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి కూడా తమ కృతజ్ఞతలని తెలియ చేయటం ఈ పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి, పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె΄పొటేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు.

పాలేళ్ళకి ఈరోజు సెలవు. వాళ్ళని కూడా తలంటు పోసుకోమని కొత్తబట్టలిచ్చి పిండి వంటలతో భోజనాలు పెడతారు. సంవత్సరమంతా వ్యవసాయంలో తమకు సహాయం చేసిన వారి పట్ల కతజ్ఞత చూపటం నేర్పుతుంది ఈ సంప్రదాయం. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది.

ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పక్షులు వచ్చి తమ పంట పాడుచేయకుండా ఉండేందుకు, పురుగులని తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను ఆవిష్కరించేందుకు వరి కంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ్రపాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’, ‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’ అనే సామెతలు కనుముకి పితదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి.       

► ముక్కనుము
ముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలిసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని  మాంసాహారం తినటానికి కేటాయిస్తారు.
ఒక పండుగ, అందులోనూ ప్రధానమైన పండుగను చేసుకోవటంలో ఎన్ని అంశాలను మిళితం చేసి, వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించే విధంగా  ప్రయోజనాత్మకంగా రూ΄పొందించారో మన పెద్దలు!   

– డా. ఎన్‌.అనంతలక్ష్మి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement