Makar Sankranti 2024
-
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 62,649 భక్తులు దర్శించుకున్నారు. అందులో 24,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.74 కోట్లుగా లెక్క తేలింది. -
పల్లెకు బైబై.. పట్నం దారిలో కిటకిటలాడుతున్న బస్సులు, రైళ్లు
సాక్షి, విజయవాడ: సంక్రాంతి సెలవులు ముగియడంతో పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో ఏపీకి తరలి వెళ్లిన వారంతా రిటర్న్ అవుతున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై హైదరాబాద్ వైపు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వేలాది వాహనాల్లో ప్రజలు పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు. చౌటుప్పల్ వద్ద పంతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి వద్ద కొర్లపాడ్ టోల్ ప్లాజాల వద్ద రద్దీకి అనుగుణంగా బూత్‌ల సంఖ్యను పెంచారు. మరోపక్క ఏపీలో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. కాకినాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు బస్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ట్రావెల్స్ బస్సులైతే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇదీచదవండి.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ట్రాఫిక్ ఆంక్షలివే -
Jallikattu 2024 Latest Images: చిత్తూరులో ఉత్సాహంగా ‘జల్లికట్టు’ పోటీలు (ఫొటోలు)
-
Kodi Pandalu In AP Photos: సంక్రాంతి సంబరాల్లో జోరుగా సాగిన కోడి పందేలు.. కోలాహలం (ఫొటోలు)
-
కూతురికి సంక్రాంతి కానుక ఇచ్చేందుకు ..70 ఏళ్ల తండ్రి ఏకంగా..!
దేశమంతా సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఒక్కోచోటు ఒక్కో తీరులో వేడుకలు అంబరాన్ని అంటేలా ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు చాలా వినూత్నంగా ఉంటాయి. ఈ పండుగ సందర్భంగా కూతూరికి అల్లుడికి బట్టలు పెట్టడం, కానుకలు ఇవ్వడం వంటివి చేస్తారు. అలానే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ తండ్రి కూతురికి సంక్రాంతి కానుక ఇచ్చేందుకు ఎంత పెద్ద సాహసం చేశాడో వింటే షాకవ్వుతారు. అక్కడ చెరుకు గడలతో పాయసం వండుతారు. అందుకని 70 ఏళ్ల వయసులో ఉన్న ఈ తండ్రి 14 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి మరీ సంక్రాతి కానుక అందించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే..తమిళనాడు రాష్ట్రం పుదు కొట్టై ప్రాంతానికి చెందిన చెల్లాదురై వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తుంటాడు. ఇతడి కూతురు పేరు సుందర పాల్. ఈమెకు 2006లో వివాహం జరిగింది. వివాహం జరిగి 10 సంవత్సరాల వరకు ఆమెకు పిల్లలు కలగలేదు. 2016లో ఆమె గర్భం దాల్చింది. ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇక అప్పటినుంచి చెల్లదురై ఆనందానికి అవధులు లేవు. అప్పటినుంచి తన కూతురి ఇంటికి ప్రతి సంక్రాంతికి చెల్లాదురై వెళ్లి..ఆమెకు, ఆమె పిల్లలకు ఏదో ఒక కానుక ఇచ్చి వస్తుంటారు. అక్కడ సంక్రాంతి పండుగను భారీగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా కొత్త పంటలు ఇంటికి రావడంతో అక్కడ చెరకు గడలతో పాయసం వండుకోవడం అనేది ఆచారం. అయితే ఈ సంక్రాంతికి తన కూతురు, మనవరాళ్ల కోసం చెల్లాదురై సాహసం చేశారు. పుదుకొట్టై ప్రాంతంలో ఉంటున్న తన కూతురి కోసం చెరుకు గడల గుత్తిని తలపై పెట్టుకుని 14 కిలోమీటర్ల పాటు ప్రయాణించి ఆమె ఇంటికి వెళ్లారు. చెరుకు గడలు ఆమెకు ఇచ్చారు. మనవరాళ్లకు కొత్త దుస్తులు కొనిచ్చారు. అయితే ఇలా చెల్లాదురై తలపై చెరుకు గడలు పెట్టుకొని సైకిల్ తొక్కుతున్న వీడియోను ఓ యువకుడు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. #WATCH | Pudukkottai, Tamil Nadu: An elderly man carried a bunch of sugarcane on his head and rode a bicycle for 14 kilometres to give it as a Pongal gift to his daughter. People watched him with surprise and cheered for him on his way pic.twitter.com/gvxQPGjXz1 — ANI (@ANI) January 14, 2024 (చదవండి: శాండ్విచ్ బ్యాగ్ ధర వింటే షాకవ్వడం ఖాయం!) -
సంక్రాంతి కోడిపందేల్లో బుల్లెట్ గెలుచుకున్న కోడిపుంజు
భీమవరం: సంక్రాంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సంప్రదాయ కోడి పందేలు మూడో రోజూ జోరుగా సాగాయి. జిల్లాలోని భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట నియోజకవర్గాల్లో రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు కోడిపందేలు నిర్వహించారు. పందేలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పందేల బరులు కిటకిటలాడాయి. కోడి పందేలతో పాటు గుండాట, పేకాట వంటి జూదాలు కూడా విచ్చలవిడిగా సాగాయి. కోడిపందేల బరులు వద్ద జూదాలు ఏర్పాటుకు నిర్వాహకులు వేలం పాటలు నిర్వహించగా, పెద్ద బరుల వద్ద జూదాల నిర్వహణకు అధిక మొత్తంలో పాటలు పాడినట్లు తెలుస్తోంది. కాళ్ల, తణుకు, ఆకివీడు, యలమంచిలి, ఇరగవరం, అత్తిలి, వీరవాసరం, ఉండి తదితర మండలాల్లో రూ.కోట్లలో బెట్టింగ్‌లు సాగాయి. నగదు లెక్కింపునకు ప్రత్యేకంగా కౌంటింగ్ మెషీన్లు ఏర్పాటు చేయడం గమనార్హం. పగలు, రాత్రి తేడా లేకుండా.. రాత్రి సమయంలో సైతం కోడి పందేలు, జూదాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఫ్లడ్లైట్స్ ఏర్పాటు చేయడమేగాక పందేలను స్పష్టంగా చూడడానికి కొన్ని చోట్ల ఎల్ఈడీ టీవీలు సైతం ఏర్పాటు చేశారు. కాళ్ల మండలంలో బౌన్సర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక రక్షణ కంచెలను ఏర్పాటు చేశారు. వీక్షించే వారిని అనుమతించడానికి వారి చేతులకు ప్రత్యేక ట్యాగ్లు వేశారు. బారులు తీరిన కార్లు : కోడి పందేల బరులు వద్ద భారీ సంఖ్యలో చిన్నకార్లు, మోటారు సైకిళ్లు బారులు తీరాయి. పందేల ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అక్కడే భోజనాలతోపాటు అన్ని రకాల తినిబండారాలు అందుబాటులో ఉండడంతో పందెంరాయుళ్లు, వీక్షకులు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోడూరు మండలం కవిటం వద్ద నిర్వహించిన కోడి పందేల శిబిరం వద్ద జూదగాళ్లు విశ్రాంతి తీసుకోడానికి ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచారు. వ్యక్తికి తీవ్ర గాయం ఉండి గ్రామంలోని పెదపుల్లేరు రోడ్డులో నిర్వహించిన కోడిపందేల శిబిరం వద్ద పందేలు తిల కిస్తున్న చంటిరాజు అనే వ్యక్తి కాలికి కోడి కత్తి ప్రమాదవశాత్తు తగిలి తీవ్ర గాయం కావడంతో అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అలాగే భీమవరం మండలం తాడేరు గ్రామం వద్ద కోడిపందేల శిబిరం వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి తలకు తీవ్ర గాయమైంది. విజేతలకు ద్విచక్రవాహనాలు పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామం వద్ద నిర్వహించిన కోడిపందేల్లో ఎక్కువ పందేలు గెలిచిన శృంగవృక్షం గ్రామానికి చెందిన బబ్లు అనే వ్యక్తి బుల్లెట్ మోటారు సైకిల్ గెలుచుకోగా మరో ఇద్దరు విజేతలకు నిర్వాహకులు స్కూటీలను బహుమతులుగా అందజేశారు. -
మందు, ముక్కతో కనుమ మజా
జిల్లాలో సంక్రాంతి శోభ నెలకొంది. తెలుగు వారి ముఖ్యమైన పండగల్లో ఒకటైన సంక్రాంతి ఇంటింటా కొత్తకాంతులు తెచ్చింది. కొత్త అల్లుళ్లు, బంధువుల రాక, పిండి వంటల ఘుమఘుమలతో ప్రతి ఇల్లూ సందడిగా మారిండి. సంక్రాంతి మూడు రోజులూ ప్రజలు పెద్ద పండగను ఉత్సాహంగా జరుపుకున్నారు. నగరంలో స్థిరపడ్డ పలువురు సొంతూళ్లకు చేరుకుని.. అయిన వారి మధ్య వేడుకగా పండగను జరుపుకున్నారు. సింథియా: ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఆఫ్ స్టాప్ (ఆపరేషన్స్)గా రియర్ అడ్మిరల్ శంతను ఝా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శంతను ఝూ తన కెరీర్లో ఆరు ఫ్రంట్‌లైన్ ఫ్రిగేట్స్, డిస్ట్రాయర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విరాట్‌ను నావిగేట్ చేసి నావిగేషన్ అండ్ స్పెష్టలిస్ట్‌గా అనుభవాన్ని సంపాదించారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, భారతీయ నౌకాదళ నౌకలు నిశాంక్, కోరా, సహ్యాద్రిలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విజయవంతమైన కమాండ్లు చేశారు. ఆయన మద్రాస్ యూనివర్సిటీ నుంచి డిఫెన్స్ స్టడీస్, లండన్‌లోని ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజీ కింగ్స్ కాలేజీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. సాక్షి, విశాఖపట్నం: కనుమ పండగను విశాఖ వాసులు మజా చేశారు. మందు, ముక్కలతో బాగా ఎంజాయ్ చేశారు. భోగి, సంక్రాంతి రెండు రోజులు మాంసాహారాన్ని ముట్టరు. ఆ తర్వాత రోజున వచ్చే కనుమకు మాంసాహార ప్రియులు నాన్‌వెజ్‌ను ఆరగించడం రివాజుగా భావిస్తారు. ఇక మందుబాబులు మామూలు రోజులకంటే కనుమ నాడు మరింతగా మద్యాన్ని సేవిస్తారు. అందుకే అలాంటి కనుమ పండుగ ఎప్పుడు వస్తుందా? అంటూ కళ్లప్పగించి ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది కనుమను జనం ఘనంగానే జరుపుకున్నారు. ఉదయం నుంచి మాంసం, మద్యం కొనుగోళ్లపైనే దృష్టి సారించారు. తెల్లారేసరికే మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. కొందరు తెలివిగా సంక్రాంతికి ముందే మందుబాటిళ్లను కొనుగోలు చేసి జాగ్రత్త పడ్డారు. మద్యం ప్రియులు మరికొంతమంది స్నేహితులతో కలిసి మందు, ముక్కలతో మునిగి తేలారు. కొందరు ఇళ్లకు దూరంగా వెళ్లి పార్టీలు చేసుకున్నారు. ఇక కనుమ అంటే మద్యంతో పాటు మాంసం విక్రయాలదే అగ్రస్థానం. సాధారణ రోజుల్లోకంటే కనుమ పండుగ రోజున వీటి అమ్మకాలు రెండు రెట్లకు పైగానే జరుగుతాయి. బ్రాయిలర్ చికెన్‌కంటే నాటు కోడి మాంసం రుచిగా ఉంటుందన్న భావనతో కాస్త స్థోమత ఉన్న వారు దీన్ని కొనుగోలు చేస్తుంటారు. మంగళవారం విశాఖలో బ్రాయిలర్ చికెన్‌కంటే నాటు (దేశవాళీ) కోడి మాంసం మూడున్నర రెట్లు అధికంగా పలికింది. బ్రాయిలర్ చికెన్ కిలో రూ.230 ఉంటే నాటు కోడి మాంసం రూ.800కు విక్రయించారు. మూడు రోజుల కిందట కిలో నాటు కోడి మాంసం రూ.600– 650 ఉండగా మంగళవారం అది రూ.800కి పెంచారు. కిలో రూ.190 ఉండే బ్రాయిలర్ చికెన్ రూ.40 పెరిగి రూ.230కి పెరిగింది. ఇక మటన్ కిలో రూ.800 నుంచి 900కి ఎగబాకింది. ఇలా వీటన్నిటిపై కిలోకు రూ.100–150 వరకు పెరిగినా తగ్గేదే లే అంటూ కొనుగోళ్లు చేశారు. విశాఖలో కనుమ నాడు 1,500కు పైగా దుకాణాల ద్వారా సుమారు ఐదు లక్షల కిలోల బ్రాయిలర్ చికెన్, 50 వేల కిలోల నాటు కోడి మాంసం, మరో 50 వేల కిలోల మటన్ అమ్ముడైందని మార్కెట్ వర్గాల అంచనా. మొత్తం మీద కనుమ పండుగ సందర్భంగా విశాఖలో రూ.11 కోట్ల బ్రాయిలర్ చికెన్, రూ.4 కోట్ల నాటు కోడి మాంసం, మరో రూ.4.5 కోట్ల విలువైన మటన్ అమ్మకాలు జరిగాయని అనధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. సినిమాలు.. షికార్లు.. మందుబాబులు, మాంసాహారులు కనుమను తమదైన రీతిలో ఎంజాయ్ చేయగా ఇతరులు సినిమాలు, షికార్లకు ప్రాధాన్యమిచ్చారు. ప్రేక్షకులతో నగరంలోని సినిమా హాళ్లు కిక్కిరిసి కనిపించాయి. పలువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పర్యాటక ప్రదేశాలకు, సాగరతీరంలోని బీచ్‌లకు వెళ్లి చాలాసేపు అక్కడే ఆనందంగా గడిపారు. ఎదురుగా ఎగసి పడుతున్న కెరటాలతో సయ్యాటలాడుతూ పిల్లాపాపలతో కేరింతలు కొట్టారు. భారీగా పోటెత్తిన సందర్శకులతో బీచ్‌లన్నీ కళకళలాడాయి. ఇంకొందరు సాగరతీరంలో పతంగులను ఎగురవేసి సంబరపడ్డారు. ఇలా కనుమ పండుగను నగరవాసులు తనివి తీరా ఆస్వాదించారు. -
కొత్త అల్లుళ్లకు బాహుబలి విందు
కొయ్యలగూడెం/రాజానగరం: సంక్రాంతి రోజుల్లో కొత్త అల్లుళ్లకు చేసే మర్యాద అంతా ఇంతా కాదు. ఈ విషయంలో గోదారోళ్లకు పెట్టింది పేరు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం, రాజవరం గ్రామానికి చెందిన కాకి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతుల కుమార్తె జ్యోత్స్నకు విజయవాడకు చెందిన చీమకుర్తి శ్రీమన్నారాయణ, దీప్తి కుమారుడు లోకేశ్ సాయితో ఇటీవల వివాహం జరిగింది. సంక్రాంతికి కొత్త అల్లుడిని 225 రకాల తినుబండారాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగను ఇంత సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. 150 రకాలతో.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరానికి చెందిన చవ్వా నాగ వెంకట శివాజీ సంక్రాంతి పండగకు వచ్చిన అల్లుడు రిషీంద్రకు అత్తమామలు సునీతరాణి, శివాజీ 150 రకాలతో ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. -
సంక్రాంతి కోసం ఖండాలు దాటొచ్చారు..
పెద్దపల్లిరూరల్: సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని బ్రిటన్ నుంచి పెద్దపల్లికి వచ్చారు దరియా–అరుణ్ దంపతులు. ఉద్యోగ నిమిత్తం బ్రిటన్ వెళ్లిన అరుణ్ అక్కడ పోలెండ్ దేశస్తురాలు దరియాను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి పెద్దపల్లిలో ఉండే తల్లిదండ్రులు రాంరెడ్డి–రోహిణిల వద్దకు వచ్చాడు. భోగి పండుగ రోజు ఆదివారం అత్త రోహిణి ముగ్గులు వేయగా, కోడలు దరియా వాటిపై గొబ్బెమ్మలను ఉంచింది. అనంతరం స్థానిక కోదండ రామాలయంలో గోదాదేవిరంగనాథులస్వామి కల్యాణాన్ని వీక్షించడం ఆనందంగా ఉందని తెలిపింది. కల్యాణోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ఫొటోలు దిగారు. -
Celebrities Sankranti Celebrations Pics: పండుగ వేళ అగ్రతారల సందడి ఇలా.. (ఫొటోలు)
-
కొత్త అల్లుడికి వందల రకాల నోరూరించే వంటకాలు
-
ఊరూరా ఘనంగా సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
కనుమ విశిష్టత..ఆ రోజు ప్రయాణాలు ఎందుకు చెయ్యరంటే..
సంక్రాంతి తర్వాతి రోజు వచ్చే పండుగ కనుమ. ఈ రోజున పశువులను ఎందుకు పూజిస్తారు?. పైగా ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణాలు చెయ్యరు ఎందుకు?. తదితరాల గురించి తెలుసుకుందాం! సంక్రాంతి వేడుకల్లో ఈ మూడవ రోజును పశువులకు కృతజ్ఞతలు తెలపడానికి కేటాయిస్తారు. కాబట్టి ఇది కనుమ పండుగ. నిజానికి వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్న పశువులను రైతులు తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు. కాబట్టి ఈ కనుమ పండుగను 'పశువుల పండుగ' అని కూడా సంబోధిస్తుంటారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ పండుగను ఎంతో ప్రత్యేకంగా ఓ వేడుకలా జరుపుతుంటారు. ఈ రోజు పశువులను అందంగా అలంకరించి పూజలు చేస్తారు. కొందరైతే కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాల మీద పట్టుబట్టలు, కాళ్లకి గజ్జలు, మెడలో పూలదండలు.. ఇలా చక్కగా అలంకరిస్తారు. పశువులతో పాటూ పక్షులను కూడా ఆదరించే సంప్రదాయం ఉంది. అందుకే ధాన్యపు కంకులను ఇంటి చూర్లకు వేలాడదీస్తారు. వాటికోసం ఇంటి చుట్టూ చేరిన చిన్న చిన్నపిట్టలు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంగణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. పంట చేతికందేందుకు సహాయపడిన వారిందరికీ ఈ రోజున కొత్త బట్టలు కూడా పెడతారు. ఇక కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తోంది. మాంసాహారులు కాని వారు, గారెలతో (మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక ఇది శాకాహారులకు మాంసంగా ఉపయోగ పడుతోంది.) సంతృప్తి పడతారు. ఆ రోజు ప్రయాణాలు ఎందుకు చెయ్యరంటే.. సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ. దీంతో ప్రతీ లోగిలి బంధువులతో కళకళాలాడుతూ కన్నుల పండుగగా ఉంటుంది. అందువల్ల ఈ మూడో రోజు ఎవరిళ్లకు వాళ్లు ప్రయాణం కావడం వల్ల చాలా ఆనందాన్ని మిస్ అవుతారనే ఉద్దేశ్యంతో బహుశా కనుమ రోజు ప్రయాణం చేయొద్దని చెబుతుంటారు పెద్దలు. ఈ కారణంతోనే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే సామెత వచ్చి ఉండొచ్చు. మరికొందరైతే ఇలా పెద్దలు చెప్పారంటే దాని వెనుక ఏదో ఆంతర్యం ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదీగాక ఈ కనుమ రోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెళ్లిన పని పూర్తికాదని, ఆటంకాలు తప్పవని నమ్మకం కూడా ప్రబలంగా ఉంది. అందువల్లే చాలామంది కనమ రోజున ప్రయాణాలు ఎట్టిపరిస్థితుల్లో చెయ్యరు. (చదవండి: సంక్రాంతి వైభవాన్ని కనుమా!) -
సలార్, దేవర సహా అవన్నీ నెట్‌ఫ్లిక్స్‌లోనే.. కానీ ఆ ఒక్కటే..
సంక్రాంతి పండగ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్రియులపై వరాల జల్లు కురిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ పండగ పేరిట పలు సినిమాల అప్డేట్లను వరుస పెట్టి వదులుతోంది. సలార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దేవర, బడ్డీ తదితర చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో రానున్నట్లు ప్రకటించింది. బాలయ్య 109వ చిత్రం, కార్తికేయ కొత్త సినిమా సహా ఇంకా టైటిల్ ఖరారు కాని చిత్రాల పోస్టర్లు వదులుతూ అవి థియేటర్లో రిలీజైన కొంతకాలానికే అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. సందీప్ స్థానంలో అల్లు శిరీష్ అయితే ఇందులో ఆసక్తి గొలుపుతున్న మూవీ బడ్డీ. నిజానికి ఈ సినిమా పేరు వినగానే ఇది తమిళంలో వచ్చిన టెడ్డీ చిత్రానికి రీమేక్ అనుకున్నారంతా! కానీ హీరో సందీప్ కిషన్ ఇది రీమేక్ కాదని అప్పట్లోనే క్లారిటీ ఇచ్చాడు. థియేటర్లో రిలీజైన తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించాడు. ఇది గతేడాది ముచ్చట. కట్ చేస్తే సడన్‌గా ఈ సినిమాలోకి అల్లు శిరీష్ వచ్చాడు, సందీప్ కిషన్ సైడైపోయాడు!దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాతలు అందరూ పాతవారే! గతేడాది, ఇప్పుడు సేమ్ క్యాప్షన్.. పోస్టర్ మారిందంతే సంక్రాంతి సందర్భంగా అల్లు శిరీష్ 'బడ్డీ' పోస్టర్‌ను రిలీజ్ చేసింది నెట్‌ఫ్లిక్స్. పోయిన సంవత్సరం పెట్టిన క్యాప్షన్‌ను యథాతథంగా పెట్టేసింది. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్, ఆ తర్వాత ఓటీటీలోకి రాబోతుందని, ఈ ఏడాదిలోనే స్ట్రీమింగ్ ఉంటుందని ప్రకటించింది. ఇది చూసిన జనాలు నవ్వాపుకుంటున్నారు. పోయిన ఏడాది కూడా ఇదే మాట చెప్పావ్, జరగలేదు.. మరి ఈసారైనా ఈ మూవీ రిలీజ్ ఉంటుందా? లేదా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఆంటోని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజవుతుందో చూడాలి! Get your guns and spy gear out for SVCC37! 🔫 🔍#SVCC37 is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/MPhOChK1cY — Netflix India South (@Netflix_INSouth) January 15, 2024 https://t.co/mX5PhE4Kg1 Last year 😅 — Tamilmemes3.0 (@tamilmemes30) January 15, 2024 చదవండి: సంక్రాంతి రేసులో ఏడుసార్లు.. ఎన్ని హిట్సో తెలుసా? -
Happy Pongal 2024: సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన సినీ తారలు (ఫోటోలు)
-
సంక్రాంతి సెంటిమెంట్.. మహేశ్‌కు కలిసొచ్చిందా?
పండగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. సెలబ్రిటీలకైతే మరీనూ.. ముఖ్యంగా సంక్రాంతి పండగకు తమ సినిమా రిలీజ్ చేయాలని తహతహలాడిపోతుంటారు. హీరోలు, దర్శకనిర్మాతలు సినిమా మొదలుపెట్టకముందే సంక్రాంతికి విడుదల చేస్తామంటూ ముందే కర్ఛీఫ్ వేసుకుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. చాలామంది పండగపూట ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకుంటారు. పైగా సెలవులు కూడా కలిసొస్తాయి. దీంతో పండగ సమయంలో రిలీజ్ చేస్తే కథలో కొన్నిలోటుపాట్లు ఉన్నా మినిమమ్ వసూళ్లు అయినా వస్తాయి. మిగతా సినిమాలతో పోటీ లేకుంటే విజయం తథ్యం. కథ అద్భుతంగా ఉంటే మాత్రం ఆ సినిమాకు తిరుగులేదంతే! సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు కూడా సంక్రాంతి అంటే సెంటిమెంట్. అలా ఇప్పటివరకు మహేశ్ బాబు నుంచి ఎన్ని సినిమాలు ఈ పండక్కి రిలీజయ్యాయో చూద్దాం.. టక్కరి దొంగ మహేశ్‌బాబు హీరోగా నటించిన ఈ మూవీ 2002లో జనవరి 12న విడుదలైంది. డైరెక్టర్ జయంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లిసా రాయ్, బిపాసా బసు హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ చిత్రం ఐదు నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఒక్కడు గుణశేఖర్ డైరెక్షన్లో మహేశ్ నటించిన చిత్రం ఒక్కడు. 2003లో సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో భూమిక హీరోయిన్గా నటించింది. బిజినెస్మెన్ పోకిరి తర్వాత మహేశ్‌బాబు- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం బిజినెస్మెన్. 2012లో సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టింది. మహేశ్ పంచ్ డైలాగ్స్‌కు బాక్సాఫీస్ షేకైపోయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మహేశ్‌బాబు, వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013 జనవరి 11న రిలీజైంది. ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు తెగ నచ్చేసిన ఈ మూవీ నాలుగు నంది అవార్డులు సైతం అందుకుంది. 1 నేనొక్కడినే మహేశ్‌బాబు చేసిన ప్రయోగాత్మక చిత్రం 1 నేనొక్కడినే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సరిగ్గా పదేళ్ల క్రితం అంటే 2014లో విడుదలైంది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని జనాలు ఆదరించలేదు. సరిలేరు నీకెవ్వరు అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేశ్‌బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. 2022లో సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో మహేశ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ పడినట్లైంది. గుంటూరు కారం ఈ ఏడాది కూడా సంక్రాంతినే నమ్ముకున్నాడు మహేశ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ నటించిన మాస్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజుల్లోనే ఈ మూవీ వంద కోట్ల మైలురాయిని దాటేసింది. కానీ గుంటూరు కారం మూవీకి మిశ్రమ స్పందన వస్తోంది. మరి లాంగ్‌రన్‌లో ఈ సినిమా హిట్‌గా నిలుస్తుందో? లేదో చూడాలి! చదవండి: ఆఫీసుల చుట్టూ తిరిగా.. అవమానించారు.. భరించలేక వెళ్లిపోదామనుకున్నా! -
పిండివంటలతో హ్యాపీహ్యపీ సంక్రాంతి (ఫోటోలు)
-
సై అంటున్న కోడి పుంజులు..
అమలాపురం టౌన్/సాక్షి నెట్వర్క్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి కోడి పందేలు ఆదివారం మొదలయ్యాయి. పండగ మూడు రోజులూ జరిగే ఈ పందేలను వీక్షించేందుకు, రూ.వేలు, రూ.లక్షల్లో కాసేందుకు వేలాదిగా తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 80 బరులు ఏర్పాటైనట్టు సమాచారం. వీటిలో దాదాపు రూ.20 కోట్ల మేర పందేల రూపంలో చేతులు మారతాయని అంచనా వేస్తున్నారు. తొలి రోజే రూ.6 కోట్ల వరకూ పందేలు జరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉద్యోగాలు, వ్యాపారాలతో స్థిరపడిన వారందరూ కార్లలో సొంతూళ్లకు వచ్చి మరీ కోడి పందేలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. బరుల వద్దకు మోటార్ సైకిళ్లు, కార్లలో అధిక సంఖ్యలో వస్తున్నారు. పలుచోట్ల బరుల వద్ద గుండాటలు కూడా ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వీటిని పోలీసులు అడ్డుకున్నారు. ►డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో భారీ బరి ఏర్పాటైంది. ఇక్కడ రూ.కోట్లలో పందేలు కాస్తున్నారు. మండల కేంద్రమైన మలికిపురంలో కూడా భారీ బరి ఏర్పాటు చేశారు. లక్కవరం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, అల్లవరం, అమలాపురం రూరల్ మండలం కామనగరువు, ఇందుపల్లిలో సైతం పెద్ద బరులు ఏర్పాటయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిర్వాహకులు క్రికెట్ పోటీలను తలపించే రీతిలో కోడి పందేలు సాగిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి, బారికేడ్లు, ఎల్ఈడీ స్క్రీన్లతో బరులు ఏర్పాటు చేసి మరీ పందేలు నిర్వహించారు. ►తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అనపర్తి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. నల్లజర్ల మండలంలో పోలీసులు గుండాటకు ఎక్కడా అనుమతించలేదు. ఇక్కడ మధ్యాహ్నం తర్వాతే పందేలు ప్రారంభించారు. ఎక్కడా మునుపటి ఉత్సాహం కనపడలేదు. తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు ఉదయం కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ మండలంలోని మలకపల్లిలో ఏర్పాటు చేసిన బరి వద్ద బౌన్సర్లను పెట్టి మరీ పందేలు నిర్వహించారు. నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోని 25 బరుల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ►కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెం, మేడపాడులో భారీ ఎత్తున పందేలు జరిగాయి. ఉండూరు, పులిమేరు, అచ్చంపేటల్లో కూడా బరులు ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ సర్పవరం, గైగోలుపాడు తదితర చోట్ల కోడి పందేలపై పోలీసులు దాడి చేశారు. డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, సీఐ వైఆర్కే శ్రీనివాస్ తదితరులు సిబ్బందితో వెళ్లి గుండాట బోర్డులను తొలగించి, పందేలు నిర్వహిస్తున్న వారిని హెచ్చరించారు. కరప మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. -
పచ్చా పొంగలి... పాలా పొంగలి... పొంగలో పొంగలి!
గొబ్బియాళ్లో గొబ్బియని పాడారమ్మ కంచి వరదరాజులే గొబ్బియాళో గొబ్బియాళో పతిని పార్వతినీ దలసి పరమ గొబ్బి తట్టారే గొబ్బియాళో గొబ్బియల్లో భామలందరు గూడి భజన గొబ్బి తట్టరే గొబ్బియల్లో గొబ్బియల్లో భామలందరూ గూడి బాయినీళ్ళకు పోయిరే గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియని పాడారమ్మ కంచి వరదరాజులే గొబ్బియల్లో డిసెంబరు 15 లేదా 16 మొదలు జనవరి 14 లేదా 15 వరకుఉండే నెల తిరుపతి ప్రాంతంలో పండగ నెల. ధనుర్మాసం, మార్గళి మాసం అని కూడా అంటారు. ఈ మాసం చాలా పవిత్రమైంది. ఈ నెల మొత్తం పొద్దున్నే ఇంటి ముందర కళ్లాపి చల్లి ముగ్గు వేసి పేడతో చిన్న చిన్న ముద్దలు చేసి, గుమ్మడి పువ్వు పెట్టి గొబ్బెమ్మలు బేసిసంఖ్యలో పెడతారు. ఈ గొబ్బెమ్మల్ని తర్వాత గోడమీదనో లేక కాలు తగలడానికి అవకాశం లేని చోటో పిడకలు తట్టి ఎండ బెడతారు. ప్రతిరోజు ఆడవారు రాత్రి పూట గాని లేదా వీలు చూసుకొని పగటి పూట గాని గొబ్బి తట్టుతూ గొబ్బి పాటలు పాడుకుంటారు. ఒకపుడు పెండ్లి కావలసిన వారు మాత్రమే పాడేవారని అంటారు కాని ఇపుడు అందరూ పాడుతున్నారు. గొబ్బి పాటల్లో గొబ్బెమ్మను మేల్కొల్పి, నిద్రబుచ్చే పాటలు ఉండేవి. గొబ్బియాళ్లో, గొబ్బియల్లో అని పాట పాదానికి ముందు చివర, లేదా పాదాంతంలో లేదా ఆ పదమేలేకుండా పాడే గొబ్బిపాటలు మార్గళి మాసంలో మార్మోగుతుండేవి. వందలకొద్దీ ఉండిన ఈ పాటలు కనుమరుగవుతున్నాయి. ఈ నెలలో ఆడవారు పోటీలు పడి ముగ్గుపిండి ముగ్గులు, రుబ్బిన బియ్యపు పిండితో వేసే ముగ్గులు పెట్టేవారు. చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు కూడా ఉంటాయి. ముగ్గులతో పాటు ఎర్రమట్టి (కాషాయ రంగు) పట్టీలు గీసేవారు. సంక్రాంతి నాలుగు రోజుల పండగ– భోగి, పెద్ద పండగ, పశువుల పండగ, కనుమ పండగ (ఊరిని బట్టి పండగ పేర్లు, రోజులు మారవచ్చు). తెల్లవారు జామున వేసే భోగి మంటల్లో పాత లేదా పనికిరాని పనిముట్లు, గంపలు, చేటలు, చింకి చాపలు, ఒక నెల ముందు నుంచి సేకరించి భద్రపర్చిన తుట్లు లేదా కంపతో పాటు వేస్తారు. పొద్దున్నే భోగిలోనే అండాలు పెట్టి నీళ్లు కాచి, ఆ నీళ్లతో తలంటు స్నానాలు చేసేవారు. ఇంటిలోని నులక మంచాలు, పనిముట్లు ఆ వేడి నీళ్లతోనే కడిగేవారు. ఇది మాంసాహారం (తినేవారికి) తప్పనిసరి. రెండో రోజు పెద్దపండగ. పూర్తిగా శాకాహారం (కొన్ని కులాల్లో మద్యం, మాంసాహారం కూడా) ఉంటుంది. ఇల్లంతా అలికి పిండి ముగ్గులు వేసి, ఎర్రమట్టి పట్టీలు గీసి, రంగులద్ది, గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టి అలంకరించుకొనేవారు. ఒకనాడు పడమటింటిలో నైరుతి మూల గోడకు చిన్న చతురస్రాకారంలో ఆకులు నలిపి పచ్చగా రుద్ది దానిమీద పసుపుబొట్లు పెట్టేవారు. ఇది పేరంటాలుకీ, పెద్దలకూ పెట్టుకొనే స్థలం. అదే ఇంటిలో వాయవ్య మూల దేవుళ్ల పటాలు ఉండేవి. చనిపోయిన వారికి బట్టలు పెట్టి, మూడు తరాల వారికి తర్పణాలు వదిలి, బేసి సంఖ్యలో అరటి విస్తర్లు వేసి, పలురకాల వంటలతో, అవిశాకు, గుమ్మడి పొరుటు తప్పనిసరిగా వడ్డించి, నైవేద్యం ఇచ్చి కొనియాడే పండగ ఈ పెద్దపండగ. పెద్దపండగ రోజు అన్నం కన్నా కూరలు ఎక్కువ తినాలన్న నమ్మకం ఉంది. రాత్రి మిగిలిన కూరలన్నింటిని రాత్రి కుంపటి మీద ఉంచి ఆ కలగూర మర్నాడు కూరగా వాడుకునేవారు. గొబ్బి తట్టుతూ పాడే పాటలతో (బాణీ, పాటల్లో కూడా బతుకమ్మ పాట లతో సామ్యం చూడవచ్చు) ఊరు సంగీతాత్మక లోకంగా మారి పొయ్యేది. గొబ్బిపాటలు పాడడానికి ఇదే చివరి రోజు. మర్నాడు పశువుల పండగ. తెల్లవారు జామున పొద్దు మొలవ డానికి ముందే తూర్పు దిక్కున పడమటి ముఖంగా కొత్త పొయ్యి పెట్టి మూడు పొంగళ్లు – పెద్ద పొంగలి, సూర్య పొంగలి, గొబ్బి పొంగలి – పెట్టేవారు. పొంగు వచ్చేటపుడు ‘పచ్చా పొంగలి పాలా పొంగలి పొంగలో పొంగలి’ అంటారు. తూర్పు లేదా ఉత్తరం వైపు పొంగితే మంచిదన్న నమ్మకం. తెల్లవారేటప్పటికి ఎద్దుల్ని కడిగి, కొమ్ములకు రంగులు పూసి నల్లేరు, తంగేడు ఆకులు పూలతోదండలు కట్టి అలంకరిస్తారు. ఆ రోజు దొడ్డిలోని పేడనంతా ఒక కువ్వగ పోసి దాని మీద నల్లేరు, తంగేడు వేసి సింగారిస్తారు. పెద్ద పొంగలిలోని అన్నాన్ని విస్తరిలో, పొంగిన నీటిని చెంబులో పేడ కువ్వ ముందర పెట్టి పూజిస్తారు. ఆ విస్తరిలోని అన్నంలో పసుపు కుంకుమ (ఒకప్పుడు పసుపు సున్నం) కల్పి దాన్ని ఇంటి పైన, దొడ్డిలో, ఇంకా పొలంలో కూడా ‘పొలో పొలో’ అంటూ పొలి చల్లు తారు. ఇంకొకరు పొంగటి నీటిని అదే సమయంలో ‘పొంగలో పొంగలి’ అంటూ అనుసరిస్తారు. సూర్యపొంగలి పెట్టి సూర్యుడికి నైవేద్యం, గొబ్బి పొంగటి కూడు పెట్టి గొబ్బెమ్మను పూజిస్తారు. గొబ్బెమ్మకు ఇది చివరి రోజు. నాలుగో రోజు గ్రామదేవతకు పొంగళ్లు పెడతారు. రాత్రి ‘ఊరు మెరవణి’ ఉంటుంది (ఇది కొన్ని ఊర్లలో మాత్రమే). ఈ నెల మొత్తం పవిత్రం కనుక శుచీ శుభ్రతకు పెద్ద పీట.పండగకు ఇంటిల్లిపాదికీ, పెద్దలకూ, కొత్త అల్లుళ్లకు కూడా కొత్త బట్టలు. మొత్తం మీద ఈ నెల అంతా సంక్లిష్టంగా, భిన్న అంశాలతో కూడుకొని ఉంటుందని చెప్పవచ్చు.ఇదే నెలలో ఉత్తర కేరళ ప్రాంతంలో ‘ధనుర్మాసత్తిల్ తిరువాదిర ... తిరువాదిర’ అంటూ ధనుర్మాసంలోని ఆరుద్ర నక్షత్రం రోజున తెల్లవారు జామునే నదికి వెళ్లి స్నానం చేసి ఉపవాసాలతో పూజలతో తమ భర్త చిరాయువుగా ఉండాలని కోరుకొంటూ ఆచరించే వ్రతం ఒకటి ఉంది. తెల్లవారు జామున చేసే స్నానం ఒక వారం ముందు నుంచే ప్రారంభిస్తారు. చాలా సాంగ్యాలున్నాయి. తిరువా దిర సమ యంలో ప్రతి ఇంటిలోనూ ఉయ్యాలలు కట్టి ఊగడం కూడా ఒక ఆచారం. అలాగే కొంతమంది సర్ప కావు – పాముల పొదల్లకు కూడా పోతారు. ఆ రోజున తమ భర్త చిరాయువుగా ఉండాలని 108 తమలపాకుల తాంబూలం కూడా సేవిస్తారు. ఆడి (ఆషాఢం) మాసంలో భార్యాభర్తలు కలిస్తే ఎండాకాలంలో, పండగ నెలలో కలిస్తే వర్షాకాలంలో ప్రసవం ఉండడానికి అవకాశం ఉంది. ఆ రెండు కాలాలు కూడా పుట్టిన బిడ్డకు – బహుశా వాతావరణ మార్పు వల్ల – మంచిది కాదన్న సందేశం పండగనెల పీడనెల అనీ, ధనుర్మాసం శూన్యమాసం అనీ, ఈ నెలలో ఏ పనీ చేయరాదని, ప్రతీకాత్మకంగా దానికి సంబంధించిన అంశాల్ని ప్రత్య క్షంగా, పరోక్షంగా ప్రచారంలో పెట్టారని అన్పిస్తుంది. -
సంక్రాంతికి ముగ్గులు వేయడంలో దాగున్న ప్రాశస్త్యం ఏంటీ?
'సంక్రాంతి వచ్చింది తుమ్మెద' 'సరదాలు తెచ్చింది తుమ్మెదా'.. అన్న పాటలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడ ఉన్నవాళ్లు కష్టపడి మరి తమ సొంతూళ్లకి వచ్చేస్తారు. ఎంత ఖర్చు పెట్టి అయినా పండుగకి ఊరు వెళ్లి పోవాల్సిందే. అక్కడ ఉండే సందడే వేరు. ముఖ్యంగా కోడిపందాలు, పిండి వంటలతో ఊరు ఊరంతా సందడి సందిడిగా ఉంటుంది. ఈ పండుగల్లో మంచి ఆకర్షణగా కనిపించేవి ముగ్గులు. వచ్చిరాని పడుచులు సైతం ఏదో రకంగా ముగ్గు వేసి శభాష్ అనిపించుకోవాలని తెగ ఆరాట పడిపోతుంటారు. అసలు ఈ నాలుగు రోజుల పండుగల్లో కచ్చితంగా రకరకాల రంగవల్లులతో ముగ్గులు పెడతారు ఎందుకని? దీని వెనుక దాగున్న రహస్యం ఏంటీ? వాస్తవానికి సాధారణ రోజుల్లో కూడా ఇంటి ముందు ముగ్గులు వేస్తాం. ఇలా ముగ్గులతో వాకిళ్లను అందంగా అలంకరిస్తే ఇంటికి శ్రేయస్సును తెస్తాయని పెద్దల నమ్మకం. పైగా లక్ష్మీ దేవిని ముచ్చటపడి ఇంట్లోకి వస్తుందని, ఆమె అనుగ్రహం లభిస్తుందని పురాణ వచనం. ముగ్గు ప్రాముఖ్యత.. హిందూసంప్రదాయంలో ముగ్గులకు అధిక ప్రాధాన్యం ఉంది. ముగ్గులు వేయడానికి ఎంతో చారిత్రక సంబంధం కూడా ఉంది. ముగ్గుల్లో తామర పువ్వు, పూల ఆకారాలు, నెమళ్లు, మామిడి పండ్లు, చేపల చిహ్నాలు ఎక్కువగా ఉంటాయి. రంగురంగుల ముగ్గులను చూసినప్పుడు ప్రశాంతత, దైవిక శక్తుల ఉనికిని అనుభవిస్తారు. ఇంట్లోకి దేవతలను స్వాగతించడానికి, ప్రజలను ఆశీర్వదించడానికి దేవతల చిత్రాలను, లక్ష్మీ దేవి పాద చిహ్నాలను గీస్తారు. అలాగే అతిథులను స్వాగతించడానికి కూడా ఇలా ముగ్గులు వేస్తారు. అయితే చరిత్ర మాత్రం చెడున అరికట్టి మంచి చేకూరాలనే ఉద్దేశ్యంతో తెల్లటి బియ్యపిండితో ముగ్గు వేస్తారని చెబుతోంది. ఇది శరీరానికి మంచి ఫిట్నెస్ లాంటిది కూడా.. ఓర్పును నేర్పే కళ… ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్ల ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి. భోగి నాడు వేసే ముగ్గు ఇష్టంతో కూడిన కష్టం! పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు. శాస్త్రీయ కారణాలు.. చుక్కలను కలిపే వక్ర నమూనాలు విశ్వంలోని అనంతమైన స్వభావాన్ని సూచిస్తాయి. ఇటువంటి నమూనాలు ధ్వని వేవ్ హార్మోనిక్స్‌ను పోలి ఉంటాయి. వీటిని చూస్తే డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో సహా అనేక రుగ్మతలు దరిచేరకుండా మనసు ఆహ్లాదభరితంగా ప్రశాంతంగా ఉంటుంది. తెలియకుండానే మనసులో ఓ ఆధ్యాత్మకి భావన వస్తుంది. విశ్వకవి రవీంద్రుడు సైతం ముగ్గు గురించి ప్రస్తావించారు! అంతేకాదండోయ్ రవీంద్రనాథ్ ఠాగోర్ 1919 లో రాసిన 'బంగ్లర్ బ్రత' అనే పుస్తకంలో వ్రతం, పూజ విధానాలలో 'అల్పన' (ముగ్గు) గురించి ప్రస్తావించారు. లక్ష్మీకాంత్ ఝా అరిపన్' మిథిల జానపద సంస్కృతి గురించి రాసిన రచనలలో రంగోలి ప్రస్తావన తెచ్చారు. ఇక ఈ ముగ్గులు వేయడం అనేది కేవలం దక్షిణాదికే పరిమితం కాదని భారతదేశం అంతటా ఈ ముగ్గులు వేయడం అనేది వారి సంస్కృతిలో భాగం అని పరిశోధకులు కూడా పేర్కొన్నారు. అంతేగాదు కామశాస్త్రంలో ప్రస్తావించిన 64 కళల్లో నృత్యం, సంగీతం, తలపాగాలు చుట్టడం, పూల మాలలు అల్లడం, వంటలు, అల్లికలతో పాటు ముగ్గులు వేయడాన్ని కూడా ఒక కళగా పేర్కొన్నారని చెప్పారు. అంతటి ప్రాశస్యం గల ఈ ముగ్గులను రకరకాల రంగవల్లులతో తీర్చిదిద్ది కలర్ఫుల్గా జోయ్ఫుల్ చేసుకోండి ఈ సంక్రాంతి పండుగని. (చదవండి: భోగి రోజే గోదా కళ్యాణం.. చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు?) . -
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే..!
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే.రాత్రిపవలూ పండుగే. అదీ మూడు,నాలుగు రోజుల పాటు సాగుతుంది.అన్ని రకాల అభిరుచులవారికి, అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని నింపే పండుగ సంక్రాంతి. నిజం చెప్పాలంటే? ఏ పండుగ శోభ చూడాలన్నా, పల్లెల్లోనే చూడాలి.మరీ ముఖ్యంగా సంక్రాంతి పల్లెసీమల పండుగ. పేరుకు మూడు రోజులైనా, ముక్కనుము వరకూ నాలుగురోజులపాటు అన్ని సీమల్లోనూ బోలెడు విందు వినోదాలు సందడి చేస్తాయి. సంక్రాంతి అంటే సంక్రమణం, అంటే మార్పు.మారడం అని అర్ధం. పల్లెటూర్లలో 'సంకురాత్తిరి' అని అంటారు.దాదాపు అన్ని మాండలీకాలలోనూ ఇదే మాట వినపడుతుంటుంది. పల్లెల్లో జీవించేవారికి,కనీసం బాల్యమైనా కొన్నేళ్లు పల్లెటూరులో గడిపినవారికి ఈ పండుగ బాగా అర్ధమవుతుంది. పట్టణాల్లో, నగరాల్లో,విదేశాల్లో జీవించేవారు సైతం పిల్లలను తీసుకొని తమ పల్లెలకు వెళ్ళడం సరదా. రవాణా సౌకర్యాలు బాగా పెరిగిన నేపథ్యంలో,ఈ సరదా ఈమధ్య బాగా పెరుగుతోంది. జనం రాకతో పల్లెలు నేడు కూడా కళకళలాడుతున్నాయి. ఇది మంచి పరిణామం. సూర్యుడు... మేషం మొదలైన 12రాశులలో క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం 'సంక్రాంతి'. సంవత్సరానికి 12సంక్రాంతులు ఉంటాయి. పుష్యమాసంలో,హేమంత రుతువులో చల్లగాలులు వీస్తూ, మంచు కురిసే వేళలలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది 'మకర సంక్రాంతి'. దీనికే అత్యంత ప్రాముఖ్యతనిచ్చి, పండుగలు జరుపుకుంటాం. సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెడతాడు.తెలుగువారితో పాటు తమిళులు ఈ పండుగను బాగా జరుపుకుంటారు. భోగి,సంక్రాంతి,కనుమ, ముక్కనుమగా నాలుగురోజుల పాటు జరుపుకుంటాం. కనుమ,ముక్కనుమను మాంసాహార ప్రియులకు గొప్ప వేడుకగా నిలుస్తుంది. రైతులకు పంట చేతికొచ్చే కాలమిది. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరికి, నాలుగు రూపాయలు మిగిలినప్పుడే రైతుకు నిజమైన పండుగ.గిట్టుబాటు ఎట్లా ఉన్నా? పంట చేతికి వచ్చిన అనందంతోనూ రైతు పండుగ చేసుకుంటాడు. ప్రతి రైతు కుటుంబంలో అనందం నింపడం ప్రభుత్వాల బాధ్యత. అది తీరేది ఎన్నడో?? "పండుగలు అందరి ఇంటికీ వస్తాయి,కానీ,ఎందుకో మా ఇంటికి రావు!" అన్నాడు ఒక పేద కవి. ప్రతి పౌరుడు అనందంగా జీవించిన ప్రతిరోజూ పండుగే. "గరీబీ హటావో " అనే నినాదాన్ని ఎన్నో ఏళ్ళ క్రితం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వినిపించారు. ఇప్పటికీ పేదరికం తగ్గకపోగా, డబ్బున్నవాడికి -లేనివాడికి మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది.ఈ పరిణామం దేశ శాంతికి,సోదరత్వానికి మంచిది కాదు. కొనుగోలు శక్తి గతంలో కంటే నేడు కొందరిలో పెరిగినా,దారిద్ర్య రేఖకు దిగువనే ఇంకా చాలామంది వున్నారు. అందరి వైభవమే దేశ వైభవం. అది ఇప్పటికైనా గుర్తెరిగి పాలకులు నడుచుకోవాలి. ఈ పండుగ వేళల్లో నిత్యావసర ధరలు 50శాతం పెరిగాయనే వార్తలు వస్తున్నాయి.పేదవాడు, దిగువ,మధ్యతరగతి వాళ్లు పండుగ ఎట్లా జరుపుకుంటారు?సొంతఊర్లకు వెళ్లాలంటే బస్సులు, విమానాల టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రతి పండుగ సమయాల్లో ఇదే తీరు నడుస్తోంది. ఏలినవారు శుభాకాంక్షలు చెప్పడం కాదు,ఈ ధరలను నియంత్రణ చెయ్యాలి.ఈ చీకటి కోణాలు పక్కన పెట్టి,పండుగ వెలుగుల్లోకి వెళదాం. పల్లెసీమల్లో బుడబుక్కలవాళ్లు, పగటి వేషధారులు,వివిధ రూపాల్లో జానపద కళాకారులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. ముగ్గులు,గొబ్బెమ్మలతో వీధులు మెరిసిపోతూ ఉంటాయి. భోగి ముందు రోజు నుంచి రాత్రి వేళల్లో వేసే మంటల దగ్గర చలికాచుకోవడం గొప్ప అనుభూతి. రేగిపండ్ల శోభ చూచి తీరాల్సిందే. కోడి పందాలు,ఎడ్లబండ్ల పందాలు పోటాపోటీగా సాగుతాయి. కోడి పందాలకు పలనాడు ఒకప్పుడు చరిత్ర సృష్టించింది. యుద్ధాలే జరిగాయి.ఇప్పటికీ కోడి పందాలు జరుగుతూనే వున్నాయి.గోదావరి జిల్లాల్లో కొన్నేళ్ల నుంచి కోడి పందాలు బాగా పెరిగాయి.ఎద్దుల బండి పోటీలు పలనాడు,ప్రకాశం,రాయలసీమ జిల్లాల్లో ఒకప్పుడు చాలా బాగా జరిగేవి.'ఒంగోలు గిత్త 'కు ప్రపంచంలోనే ఎంతో ఖ్యాతి వచ్చింది. ఈ ఖ్యాతి తగ్గుముఖం పట్టిన కాలంలో నేడు మనం జీవిస్తున్నాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో శారీరక పరిశ్రమకు, వ్యాయామానికి,ధ్యాన, యోగ సాధనకు చాలా అనువైన కాలం.ఉత్తరాయణాన్ని ఎంతో పుణ్యకాలంగా భారతీయులు భావిస్తారు.అందుకే,భీష్ముడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత ప్రాణాలు వదిలేశాడు. యోగ మార్గంలో ప్రాణాలను వదిలే సాధన ఇప్పటికీ ఉంది. ఇంతటి పుణ్యకాలంలో,వారి వారి శక్తి మేరకు దానధర్మాలు చేయడం చాలా మంచిది. మన భరతభూమిపై ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సంస్కృతి ఉంది. కలియుగంలోని ప్రధాన ధర్మం దానం చేయడంగా పెద్దలు చెబుతారు. బొమ్మలకొలువులు, చెరుకుగడలు,పసుపుపారాణులు , తాంబూలాలు ఎటు చూచినా కనిపిస్తాయి. అరిసెలు,బొబ్బట్లు, జంతికలు,గారెలు,చక్కినాలు గురించి చెప్పక్కర్లేదు. గంగిరెద్దులు, డోలు సన్నాయిలు, డూడూ బసవన్నలు చేసే సందడి చూడాల్సిందే. తిరునామం తీర్చి, కాళ్లకు గజ్జెలు కట్టి,చేతిలో తాళం మోతలతో,హరిలో రంగ హరీ! అంటూ హరిదాసులు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటే, పిల్లాజెల్లా తన్మయులైపోతారు. ఇటువంటి ఎన్నో వినోదాలు, ఆనంద దృశ్యాలు సంక్రాంతి పండుగ వేళల్లో కనువిందు, విన పసందు చేస్తాయి. జీవహింసగా భావించి కోడి పందాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఉత్తర భారతదేశంలో మకర్ సంక్రాంతి లేదా లోరీని జరుపుకుంటారు. ఆదిశంకరాచార్యుడు సంక్రాంతి నాడే సన్యాస దీక్ష తీసుకున్నారని చెబుతారు. వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, సంక్రాతి పండుగనాడు గోదాకళ్యాణం జరుపుకుని, వ్రతం సంపూర్ణమైనట్లుగా భావిస్తారు. అనాదిగా,పల్లెలు పునాదిగా జరుపుకుంటున్న సంక్రాంతి వేడుకలు ఆనందానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు. అందరికీ భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
పండుగ వేళ ఈ స్వీట్స్ లేకపోతే ఎలా..? (ఫోటోలు)
-
Tirumala: సర్వదర్శనానికి 16 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. సర్వదర్శనం కోసం 16 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం 86,107 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 29,849 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.31 కోట్లుగా లెక్క తేలింది. ఇక ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి పండుగను వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఆలయ మహద్వారం ముందు ఆలయ అధికారులు, సిబ్బంది భోగి మంటలు వేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు కూడా పాల్గొన్నారు. -
సంక్రాంతిని 'పెద్ద పండుగ' అని ఎందుకు పిలుస్తారు?
భోగభాగ్యల భోగి పండుగను చిన్నా పెద్ద అంతా ఆనందంగా జరుపుకున్నారు. ఇక తరువాత రోజే అసలైన పండుగ 'సంక్రాంతి'. ఈ పండుగ రోజు ఉండే హడావిడి అంతా ఇంత కాదు. పైగా ఈ పండుగను పెద్దల పండుగ లేదా పెద్ద పంగ అని అంటారు. ఈ రోజు నవ్వులతో చేసిన వంటకాలను తప్పకుండా తింటారు. నాలుగు రోజులు పండుగల్లో ఈ సంక్రాంతి మాత్రమే ఎలా పెద్ద పండుగ అయ్యింది?. ఇన్ని సంక్రమణాలు ఉండగా ఈ సంక్రమణానికి ఎందుకంత విశిష్టత? నెలకు ఒక రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం కలిపి 12 రాశుల్లో సంచరిస్తాడు. రాశిమారిన ప్రతిసారీ సంక్రమణం అంటారు. కానీ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు. అదే సంక్రాంతి పండుగ. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన అధ్యాయం మొదలు కాబోతుందనే దానికి సంకేతం. అలాగే దక్షిణదిక్కువైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తరదిక్కులో సంచరిస్తుంటాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. ఈ సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. సంక్రాంతి ఎలా పెద్ద పండుగంటే.. సంక్రాంతి పండుగ సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు. ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకుని తినరు. ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు. అందుకే ఆ బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు తయారు చేస్తారు. ఇలా చేస్తే పిండివంటలు చేసుకున్నట్లు కూడా ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ పొంగల్ అని పిలుస్తారు. పంట చేతికందించిన దేవుడికి ధన్యవాదాలు తెలిపేందుకు ఇలా నైవేద్యం సమర్పిస్తారు. ఈ పండుగలో ముఖ్యంగా ప్రకృతిని పూజించడంతోపాటు పశువులను కూడా పూజిస్తుంటారు. అలాగే సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా ప్రతి పదార్థంలో నువ్వులు ఉంటాయి. సూర్య భగవానుడికి సమర్పించే నీటిలోనూ నువ్వులు వేస్తారు. సంక్రాంతి సమయంలో నువ్వుల వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు అప్పటి వరకు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. దీని వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటి నుంచి తట్టుకునేలా శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు నువ్వులను కచ్చితంగా తీసుకోవాలని మన పెద్దలు నియమం ఏర్పాటు చేశారు. ఈ రోజునే పెద్దలకు తర్పణాలు.. సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణాలు వదలడం తప్పనిసరిగా చేస్తారు. ఉత్తరాయణ కాలం మొదలైన ఆరోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని పితృదేవతలకి స్వర్గ ప్రాప్తి లభించడం కోసం ఇలా చేస్తారు. ఈరోజు పెద్దలని స్మరించుకుంటూ వారిని సంతోష పెట్టే విధంగా వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఇది పెద్దల పండుగ లేదా పెద్దల పండుగ అయ్యింది. కొత్త అల్లుళ్ల సందడి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకం. కొత్తగా పెళ్ళైన కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచి తమ ఆతిధ్యంతో ఔరా! అనిపిస్తారు. కొత్త అల్లుళ్ల రాకతో ఇల్లు కళకళాడిపోతాయి. మరదళ్ళు బావలని సరదాగా ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక మహిళలు ఇళ్ల ముందు పెద్ద పెద్ద రంగవల్లులు వేసి మురిసిపోతారు. గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ పాటలు పాడుకుంటూ డాన్స్ వేస్తారు. పల్లెటూరులో అయితే ఏ వీధిలో చూసినా కన్నె పిల్లలు పరికిణీలు కట్టి పూల జడలు వేసుకుని అందంగా ముస్తాబై తిరుగుతూ సందడి చేస్తారు. కోడి పందేలు, ఎడ్ల పోటీలు.. గోదావరి జిల్లాల్లో కోడిపందేలతో ఫుల్ జోష్‌తో పండుగ జరుగుతుంది. వీటిని చూసేందుకు దూరప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తారు. పూర్వకాలంలో దీన్ని యుద్ధనీతిని గెలిపించే పందెంగా భావించేవారు. అంతేగాదు ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారట. ఆ తర్వాత అదే కాలక్రమేణ ఓ సరదా జూదంలా మారింది. ఈ పండుగ రోజు కొన్ని ప్రాంతాల్లో ఈ కోడిపందేలు కచ్చితంగా జరుగుతాయి. మరికొన్ని చోట్ల ఈ రోజు ఎండ్ల పోటీలు నిర్వహిస్తారు. గాలిపటాలు ఎగరువేసేది కూడా. కొన్ని చోట్ల ఈ సంక్రాంతి పండుగను పతంగులు పండుగగా జరుపుకుంటారు. ఆ రోజు చిన్నా పెద్దా అని తేడా లేకుండా గాలి పటాలు ఎగరేస్తూ ఆనందిస్తారు. దీంతో ఆకాశంలో రంగు రంగుల గాలి పటాలు ఎగురుతూ కనువిందు చేస్తాయి. మరీ ఇన్ని విశేషాలు ఉన్న సంక్రాంతి పెద్ద పండగే కదా! -
Makar Sankranti 2024: సంక్రాంతి వైభవాన్ని కనుమా!
భారతీయులు అందులోనూ దాక్షిణాత్యులు, ముఖ్యంగా తెలుగువారు సంక్రాంతిని ఎంతో వైభవోపేతంగా చేసుకుంటారు. ఆడపడుచులు, అల్లుళ్లతో సహా సంక్రాంతికి మాత్రం తమ స్వగ్రామాలకి చేరుకుంటారు అందరు. సంక్రాంతి వైభవం అంతా పల్లెలలో చూడాలి. సంక్రాంతి పండుగ సమయానికి పంటలు ఇంటికి వచ్చి రైతులు, వ్యవసాయ కూలీలు గ్రామంలో ఉన్న అందరు కూడా పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా కంటికి ఇంపుగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ΄పొలం పనులు పూర్తి అయి కాస్త విశ్రాంతి తీసుకునే వీలుండటంతో సందడి, సంబరాలు. తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమిని, రైతులను, కూలీలను, పాలేర్లను, పశువులను, పక్షులను అన్నింటికి కృతజ్ఞతను తెలియచేయటం, తమ సంపదను సాటివారితో బంధుమిత్రులతో పంచుకోవటం ఈ వేడుకల్లో కనపడుతుంది. భారతీయులు చాంద్రమానంతో పాటు కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. అటువంటి వాటిల్లో ప్రధానమైనది మకరసంక్రమణం. మకరసంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటి వరకు దక్షిణదిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్ళుతుంది. అందుకే ఆ రోజు నుండి ఆరునెలలు ఉత్తరాయణం అంటారు. అప్పటికి ఆరునెలలనుండి దక్షిణాయనం. ఈ పుణ్య సమయంలో చేయవలసిన విధులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని సంక్రాంతి సంబరాల్లో మేళవించటం జరిగింది. ► విధులు అంతరిక్షంలో జరిగే ఖగోళవిశేషాల ననుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనుషులు చేయవలసిన పనులను పండుగ విధులుగా చెప్పటం మన ఋషుల ఘనత. అవి మనిషి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగాను ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞాన్ని అందించేవిగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి ఎదగటానికి సహాయం చేసేవిగా ఉంటాయి. మన పండుగలు బహుళార్థసాధక ప్రణాళికలు. అన్నింటిని సమీకరించి ఎప్పుడేం చెయ్యాలో చక్కగా చె΄్పారు. ► పెద్దపండగ సంక్రాతిని పెద్దపండగ అంటారు. చాలా పెద్ద ఎత్తున చేసుకోవటంతో పాటు ఎక్కువ రోజులు చేసుకుంటారు. సంక్రమణం జరిగే రోజు పండుగ, ముందురోజు భోగి, మూడవరోజు కనుము. నాలుగవ రోజు ముక్కనుము. నిజానికి పండుగ వాతావరణం నెలరోజుల ముందు నుండే నెలకొంటుంది. ► నెల పట్టటం సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15వ తేదీ కాని, 16 వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14వ తేదీ వరకు కాని, 15 వ తేదీ వరకు కాని ఉండే ధనుర్మాసం అంతా ప్రత్యేకంగానే కనపడుతుంది. దీనిని ‘నెలపట్టటం’ అని అంటారు. అంటే ఈ నెల అంతా ఒక ప్రత్యేక మైన పద్ధతిని పాటిస్తామని చెప్పటం. ఇళ్ల ముందు ఆవుపేడ కళ్ళాపిలో అందంగా తీర్చి దిద్దిన రంగవల్లికలు, ఆకాశంలో నుండి క్రిందికి దిగి వచ్చినట్టు కనపడే చుక్కల ముగ్గుల మధ్యలో కంటికింపుగా దర్శనమిచ్చే గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల పైన అలంకరించ బడి పలకరించే బంతి, చేమంతి, గుమ్మడిపూలు, వాటిని తొక్క కుండా ‘హరిలో రంగ హరి’ అంటు అందరిని తన మధురగానంతో మేలుకొలుపుతున్న హరిదాసులు, వారు వెళ్ళగానే ‘అయ్యగారికీ దండం పెట్టు, అమ్మగారికీ దండం పెట్టు’ అంటు గంగిరెద్దుల నాడించేవారు, జంగంవారు, బుడబుక్కలవారు ...... తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించే ఎంతోమంది జానపద కళాకారులు – అదొక కలకలం, అదొక కళావిలాసం. ఈ నెల అంతా విశిష్టాద్వైత సంప్రదాయాన్ననుసరించే వారు తిరు΄్పావై లేక శ్రీవ్రతం లేక స్నానవ్రతం అనే దాన్ని ఆచరిస్తారు.ద్వాపరయుగం చివరలో గోపికలు ఆచరించిన ఈ వ్రతాన్ని గోదాదేవి ఆచరించి శ్రీరంగనాథుని వివాహం చేసుకుని ఆయనలో సశరీరంగా లీనమయింది. వైష్ణవదేవాలయాల్లో తెల్లవారుజామునే కృష్ణుని అర్చించి బాలభోగంగా నివేదించిన ప్రసాదాన్ని తెల్లవారక ముందే పంచిపెడతారు. ప్రకృతిలో భాగమైన సర్వజీవులు స్త్రీలు. వారు పరమపురుషుని చేరుకోవటం కోసం చేసే సాధన మధురభక్తి మార్గం. దానికి ప్రతీక అయిన గోదాదేవి చేసిన వ్రతాన్ని ఈ నెలరోజులు సాధకులు, భక్తులు అందరు ఆచరిస్తారు. ఆండాళు తల్లి ఆ రోజుల్లో గోపికలుగా భావించుకున్న తన చెలులను వ్రతం చెయ్యటానికి స్నానం చేద్దాం రమ్మని మేలు కొలుపుతుంది. ఇప్పుడు ఆపని హరిదాసులు చేస్తున్నారు. ► సంక్రాంతి అసలు ప్రధానమైనది సంక్రాంతి, అంటే సంక్రమణం జరిగే రోజు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు. ఈ పుణ్య కాలంలో దానాలు, తర్పణాలు ్రపాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం, పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయని వారు ఈ రోజు చేస్తారు. అసలు మూడు రోజులు పేరంటం చేసే వారున్నారు. దక్షిణాయణం పూర్తి అయి పితృదేవతలు తమ స్థానాలకి వెడితే మళ్ళీ ఆరునెలల వరకు రారు కనుక వారికి కృతజ్ఞతా పూర్వకంగా తర్పణాలు ఇస్తారు. కొంతమంది కనుము నాడు తర్పణాలిస్తారు. ► కనుము తమ ఇంటికి పంట వచ్చి ఆనందంగా ఉండటానికి కారణభూతమైన భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి కూడా తమ కృతజ్ఞతలని తెలియ చేయటం ఈ పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి, పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె΄పొటేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. పాలేళ్ళకి ఈరోజు సెలవు. వాళ్ళని కూడా తలంటు పోసుకోమని కొత్తబట్టలిచ్చి పిండి వంటలతో భోజనాలు పెడతారు. సంవత్సరమంతా వ్యవసాయంలో తమకు సహాయం చేసిన వారి పట్ల కతజ్ఞత చూపటం నేర్పుతుంది ఈ సంప్రదాయం. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పక్షులు వచ్చి తమ పంట పాడుచేయకుండా ఉండేందుకు, పురుగులని తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను ఆవిష్కరించేందుకు వరి కంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ్రపాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’, ‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’ అనే సామెతలు కనుముకి పితదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. ► ముక్కనుము ముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలిసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. ఒక పండుగ, అందులోనూ ప్రధానమైన పండుగను చేసుకోవటంలో ఎన్ని అంశాలను మిళితం చేసి, వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించే విధంగా ప్రయోజనాత్మకంగా రూ΄పొందించారో మన పెద్దలు! – డా. ఎన్.అనంతలక్ష్మి -
ఆంధ్ర సంక్రాంతి బరిలో తెలంగాణ పందెం కోడి..
పహాడీషరీఫ్: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడి పందేల కోసం తెలంగాణ కోడి పుంజులు కదనరంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. రెండు నెలల ముందు నుంచే ప్రత్యేక తర్ఫీదు పొందిన పుంజులు ఎప్పుడెప్పుడు బరిలోకి దిగాలా అని కాళ్లు దువ్వుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడి పందేలకు.. హైదరాబాద్ పాత నగర శివారు ప్రాంతాలకు విడదీయరాని బంధం ఉంది. పరువు, ప్రతిష్టలే లక్ష్యంగా పందేలు కాసేవారు విజేతగా నిలిచే సత్తా ఉన్న కోడిపుంజుల వైపు మొగ్గు చూపుతున్నారు. కంటికి నచ్చిన మేలుజాతి పుంజుకు రూ.50 వేల వరకు కూడా వెచ్చించేందుకు వెనుకాడడం లేదు. జల్పల్లి మున్సిపల్ పరిధిలో పందెం కోళ్ల కూతలు వినిపిస్తున్నాయి. అల్లారుముద్దుగా.. ఎర్రకుంట, షాహిన్‌నగర్, కొత్తపేట, సలాల పరిసరాల్లో కుస్తీ పోటీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పహిల్వాన్లు మూగ జీవాలను కూడా అంతే మక్కువతో పెంచుతారు. ఈ క్రమంలోనే కాకి, డేగ, నెమలి, అస్లీ తదితర మేలు జాతి కోడి పుంజులను అదే రీతిలో పెంచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏటా సంక్రాంతి బరిలో దించుతుంటారు. ఇలా ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున జరిగే కోడి పందేలకు ఇక్కడి నుంచి కోళ్లను ఎగుమతి చేయడం పరిపాటిగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి పోటీలకు కాలు దువ్వే పందెంరాయుళ్లకు ఇక్కడి పుంజులు పంట పండించడం విశేషం. వ్యాయామం సైతం సంక్రాంతి పండుగకు రెండు నెలల ముందు నుంచే ఈ కోడి పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. సాధారణంగానే నిత్యం వీటికి పౌష్టికాహారంతో పాటు వ్యాయామం చేయించే యజమానులు పండుగ బరి కోసం మరింత తర్ఫీదునిస్తారు. పందేనికి అన్ని రకాల సిద్ధమైన కోడి పుంజులను కొనుగోలు చేసేందుకు పందెం రాయుళ్లు పక్షం రోజుల నుంచే పహిల్వాన్లతో టచ్‌లో ఉంటారు. పందెంలో కచ్చితంగా నెగ్గుతామనే నమ్మకంతో వీరి వద్ద నచ్చిన పుంజును కొనుగోలు చేస్తుంటారు. పరిమిత సంఖ్యలో పుంజులను పెంచి ఎంతో దగ్గరి వ్యక్తులకు మాత్రమే ఇక్కడ విక్రయిస్తుంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వీరు పెంచే కోడి పుంజులకు విటమిన్లతో కూడిన బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తారు. బాదం, పిస్తా, అక్రోడ్, కీమా, రాగులు, ఉడికించిన గుడ్ల (తెలుపు భాగం)ను ఇస్తుంటారు. ముఖ్యంగా ప్రతిరోజు నైపుణ్యం కలిగిన కోచ్‌లతో రెండు పూటలా మసాజ్‌లు చేయిస్తారు. పరిగెత్తించడంతోపాటు ఈత కూడా కొట్టిస్తారు. కోళ్లకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీటికి ప్రత్యేకమైన ఎన్క్లోజర్ల మాదిరిగా చిన్న చిన్న గూళ్లను ఏర్పాటు చేసి మినీ జూపార్కును తలపించేలా మూగ జీవాల పెంపకంలో పహిల్వాన్ల కుటుంబాలు నిమగ్నమయ్యాయి. మూగ జీవాలపై ఉన్న ప్రేమతో మాత్రమే తాము కోళ్లను పెంచుతున్నాము తప్ప తమది వ్యాపార దృక్పథం కాదని పహిల్వాన్లు పేర్కొంటున్నారు. -
సంబరంగా సంక్రాంతి వేడుక
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గంగిరెద్దులకు సారెను సమర్పించడం, భోగిమంటలు, గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, హరిదాసుల కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలతో వేడుకలు కన్నులపండువగా జరిగాయి. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాలను చక్కగా పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. నవరత్నాలతో ముఖ్యమంత్రి ప్రతిఇంటికీ సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, మెడికల్ కాలేజీ, నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తీర్చిదిద్ధిన స్కూల్ భవనం, పాల కేంద్రం నమూనాలు వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తూ.. ముత్యాల ముగ్గులు, రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, ధాన్యాగారాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు ఇలా అచ్చం అసలు సిసలైన గ్రామీణ వాతావరణ ప్రతిబింబించేలా, మన సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిసేలా.. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వంలో గ్రామ స్వరాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. సీఎం దంపతులను మంత్రముగ్థుల్ని చేసేలా ఆ ప్రాంతం శోభాయమానంగా అలంకరించారు. ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు ఏర్పాటుచేసిన శిలాతోరణం అందరినీ ఆకట్టుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో భోగి మంటలు వెలిగిస్తున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఇక ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో హాజరైన సీఎం జగన్ దంపతులను వేదపండితులు నుదుట తిలకం దిద్ది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం.. వారిరువురూ భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. హరిదాసుకు స్వయంపాకం, సారె సమర్పించారు. అలాగే, గోశాలలోని గోవులకు పూజచేసి వాటిని నిమురుతూ కొద్దిసేపు అక్కడ గడిపారు. గంగిరెద్దులకు, తులసి చెట్టుకు పూజలు చేశారు. గ్రామీణ సంక్రాంతి వేడుకల్లో ప్రధానంగా కనిపించే వివిధ కళాకారులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. అంతేకాక.. తెలుగింటి సంక్రాంతి పిండివంటలను ముఖ్యమంత్రి దంపతులు రుచి చూశారు. అనంతరం.. కలియుగ దైవమైన శ్రీహరికి పూజలు నిర్వహించటం, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు ఏర్పాటుచేసిన వందేళ్ల క్రితం నాటి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ నమూనా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ దంపతులు పూలమాల వేసి నివాళులరి్పంచారు. అనంతరం.. అక్కడున్న మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను పలకరిస్తూ ముందుకు కదిలారు. తొలుత.. కాణిపాక వినాయక విగ్రహానికి సీఎం జగన్ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. తర్వాత.. కనకదుర్గమ్మకు.. అనంతరం శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదపండితుల ఆశీర్వాదం స్వీకరించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎంకు కంకణం కట్టగా.. వేదపండితులు అందించిన మరో కంకణాన్ని భారతమ్మకు ముఖ్యమంత్రి జగన్ కట్టారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. ప్రముఖ సినీ నేపథ్యగాయని గోపిక పూర్ణిమ, ప్రముఖ గాయని శ్రీలలిత పాటల కార్యక్రమం శ్రవణపేయంగా సాగింది. అలాగే, సినీ రంగానికి చెందిన ప్రముఖ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ రాఘవ, కౌండిన్య, మెహర్, మానస్, చందు, రమేష్, హరేరాము, మహేష్, భాను తదితరుల లైవ్ పెర్ఫామెన్స్.. ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారులు రిత్విక్ వెంకట్, చార్మి, చిన్నారి కేతనరెడ్డి నాట్య ప్రదర్శన.. నీలకంఠం మిమిక్రీ, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉదయ్ బృందంచే సంక్రాంతి ప్రత్యేక గీతాల నృత్యం, మాస్టర్ భువనేష్ ప్రత్యేక గీతాలు.. వీటితో పాటు ప్రముఖ సినీగేయ రచయిత, సంగీత దర్శకులు విశ్వ.. ప్రముఖ సినీ మరియు ప్రజా గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, ప్రజా రచయితలు మానుకోట ప్రసాద్, మాట్ల తిరుపతి, గాయకులు గద్దర్ నర్సిరెడ్డి, తేలు విజయల కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కృష్ణవేణి మల్లావఝుల వ్యవహరించారు. చివర్లో వీరందరిని సీఎం జగన్ దంపతులు సత్కరించి, మెమొంటోలు అందజేశారు. అంతేకాక.. ప్రాంగణంలో ఉన్న అందరితో సీఎం జగన్ దంపతులు ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చెవిరెడ్డికి సీఎం అభినందనలు.. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా.. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలా.. చక్కని ఏర్పాట్లతో, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. విజయానందాలతో అడుగులు ముందుకేయాలి.. సీఎం జగన్ ట్వీట్ ఊరూ వాడా ఒక్కటై.. బంధుమిత్రులు ఏకమై.. అంబరమంత సంబరంగా జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకుని.. సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటూ ఆదివారం ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తెలిపారు. -
పెద్దజాతి కోడిపుంజులకు కేరాఫ్ శివపల్లి
ఎలిగేడు: పందెంకోడి అ‘ధర’హో అనిపిస్తోంది. మేలుజాతి కోడిపుంజులకు భలేగిరాకీ ఉంటోంది. ఒకప్పుడు కోడిపందేలకు కేరాఫ్‌గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామం ఇప్పుడు కోడి పుంజుల పెంపకానికి నిలయంగా మారింది. శివపల్లిలో పెద్దజాతి కోడిపుంజులు ఇంటింటా పెంచుతుండడంతో కొనుగోలు చేసేందుకు జిల్లాతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు. దీంతో ఒకప్పుడు కోడి పందేలు నిర్వహించిన గ్రామానికి చెందిన వారు ఇప్పుడు మేలుజాతి కోడిపుంజులు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. మేలుజాతి కోడిపుంజు కిలోకు రూ.2వేల నుంచి రూ.10వేల వరకు పలుకుతున్నాయి. పెద్దవాటికి రూ.15వేల వరకు వెచ్చిస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన కోడిపుంజులు మహారాష్ట్ర ,ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు ప్రాంతాలకు తరలించి కోడిపందేలకు వినియోగిస్తారని చెబుతున్నారు. -
సెల్ మాయ.. పల్లె పరాయి!
ఏడుకొండల.. వెంకటరమణ తిరుపతికొండలు.. తిరిగినవాడ తిరుమనిరేకులు.. దిద్దినవాడ హరిలో రంగ హరి.. అయ్యవారికి దండంపెట్టు అమ్మవారికి దండంపెట్టు పిల్లపాపలు సల్లంగుండని గొడ్డుగోదలు సంపదనివ్వని పెట్టరా బసవన్న దండంబెట్టు సిరిసిల్ల: ఈ పాటలు.. ఆ మాటలు.. పల్లెతల్లి ఒడిలో లీలగా వినిపిస్తున్నాయి. పాడేది హరిదాసు. మాట్లాడేది గంగిరెద్దాయన. పట్టణాలకు చదువుల కోసం, కొలువుల కోసం వెళ్లిన వాళ్లు పల్లెకు చేరారు. కానీ మనసు విప్పి మాట్లాడుకునుడే లేదు. సెల్‌ఫోన్ చేతికొచ్చాక ప్రపంచాన్ని అరచేతిలోనే చూస్తుండ్రు. పక్కింటి వాళ్లతో మాట్లాడే సమయం లేదు. ఆనాటి ఆప్యాయతలు లేవు. అనురాగాలు కానరావు. పండగ వచ్చిందంటే నాకు ఎంతో సంబురం. ఎక్కడెక్కడో ఉండే నా వాళ్లంతా నా దరికి చేరుతారు. వాళ్లను చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. నా ఒడిలో బతికే వాళ్లకు ఒకప్పుడు చేతినిండా పని. ఇంటి నిండా ధాన్యం. ఊరు సుట్టూ వాగులు, కాలువలు. తుకాలు పోసి.. పొలాలు దున్నతూ.. నాట్లు వేస్తూ.. ఉషారుగా ఉండేవారు. బోగి మంటలు.. భోగభాగ్యాలతో కళకళలాడే పల్లెల్లో మునుపటి సందడి కనుమరుగైంది. ముచ్చట్లు మరిచిపోయిండ్రు పల్లెలకు చేరిన పట్నమోళ్లు సెల్ఫోన్లతోనే ఆడవట్టిరి. నాటి ముచ్చట్లు లేవు.. మంచీ చెడు అర్సుకునే ధ్యాసే లేదు. వాట్సాప్‌లలో మెస్సేజ్‌లు.. ఫేస్‌బుక్కుల్లోనే పలకరింపులు. సంక్రాంతికి చలి సంకలెత్తనిత్తలేదు. ఒకప్పుడు గండ్రపేగులు కట్టుకొని, గొంగడిబొంతలు సుట్టుకుని గజగజ వణుక్కుంట నాగండ్లు కడుదురు. మరీ ఇప్పుడు కాలం మారింది. అన్ని పనులు ట్రాక్టరే చేస్తుంది. మాగికాలం నాట్ల పనికిపోతే మంచి కూలి వస్తుంది. కానీ పైసలకు లెక్కలేదు, మనుషులకు విలువ లేదు. హరిదాసులు ఏమైరి ఒకప్పుడు సంకురాత్రి అంటేనే గంగిరెద్దుల ఆట లు, హరిదాసుల పాటలు. ఇంటింటికీ తిరిగి ధాన్యమడుక్కుందురు.గిప్పుడు వాళ్ల తిరుగుడు లేదు.. మనం పెట్టుల్లేదు. ఒకప్పుడైతే కాలుపెట్ట సందులేకుండా ఇంటినిండ ధాన్యం ఉండేది. గొబ్బెమ్మలు చేసే పెండ నుంచి అరిసెలు చేసే బెల్లం దాకా అన్నీ కొనుడేనాయె. ఇక నవధాన్యాలు, రేగుపండ్లు.. జీడిపండ్లంటరా.. ఎన్నడో దేవునికి ముట్టినయి. కడపల మీద పిజ్జాలు.. బర్గర్లు పెట్టే కాలమొచ్చింది. సకినాలు ఎటుపాయే సంకురాత్రి అనంగనే సకినాలు గుర్తుకొత్తయి. కుంచెడు బియ్యం నానబోసి దంచి.. తవ్వెడు నువ్వులు.. చారెడు ఓమ గలిపి సకినాలు వొత్తే నెల్లాల్ల గాసమైతుండే. గారప్పులు.. అరిసెలు.. మురుకులు.. ఎన్నెన్ని పిండివంటలో. పల్లీలు.. నువ్వులు.. బబ్బెర్లు.. పెసర్లు.. అన్ని మన పొలంల పండినయే. మరిప్పుడు చేసుడు బందాయే.. ఆన్లైన్ బుకింగ్లాయే. అంతా మాయలాగే.. పొద్దు పొడిసినా పొగమంచు పోకపోతుండే. చలిమంటలు ఏసుకుని పడుసు పోరగాండ్లు, నడివయసోళ్లు.. ముసలోళ్లు కూసుందురు. ఊరు ముచ్చట్లు పెడుదురు. కోడిపుంజు కోసుకుని వాసన బియ్యంతో బిర్యానేసుకుంటే కమ్మటి వాసన. ఇప్పుడు పారంకోడి కూర రుచి లేదు.. వాసన అసలే లేదు. వానాకాలం పోయింది. సలికాలం.. ఎండ కాలమాయె. ఊరు పచ్చదనాన్ని కోల్పోయే. నా పొలిమేరలోకి సెల్‌టవర్లు వచ్చి మనుషులను దూరం చేసే. పండగన్న మాటే కానీ.. రైతు ముఖంల ఆ నవ్వేలేదు. రైతు సల్లంగుంటే సబ్బండ వర్ణాలకు పనుంటుండే. కులవృత్తి నమ్ముకున్నోళ్ల నుంచి గంగిరెద్దు, హరిదాసు వరకు అందరికీ గాసం దొరికేది. ఇప్పుడు అందరూ ఒకే చోట ఉన్నా మనసువిప్పి మాట్లాడుకునుడు లేదు. అంతా సెల్‌ఫోన్ మాయ. నా మనసులోని బాధను చెప్పిన. పండుగ పూట నా వేదన విన్నందుకు అందరికీ వందనాలు. ఇగ ఉంట బిడ్డ. బంగారు కాలంబోయింది.. బంగారమస్సోంటి మనుషులు పోయిండ్రు.. ఇంక రానురాను ఎంతగతికుందో.. ఇట్లు మీ అందరి క్షేమం కోరే పల్లెతల్లి -
ఆఫ్రికాలో ఉద్యోగం.. ఎక్కడున్నా పండగకు ఇంటికొస్తే ఆ ఆనందమే వేరు
దర్శి: ఎక్కడున్నా పండగకు ఇంటికొస్తే ఆ ఆనందమే వేరు. బంధువులు, స్నేహితులతో కలిసి గడిపే ఆ క్షణాలు ఎన్నటికీ మరువలేని తీపి గురుతులు..!! దర్శి మండలం తూర్పు వీరాయపాలేనికి చెందిన ముప్పరాజు వెంకట రవి ఏడేళ్లుగా ఆఫ్రికా ఖండంలోని జాంబియా దేశంలో లుసాకా కాప్టెల్ సిటీలో ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్స్ ఆపరేషనల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏటా డిసెంబర్ నెలాఖరులో వచ్చి సంక్రాంతి పండగకు బంధువులతో ఆనందంగా గడిపి వెళ్తుంటారు. తాను ఎన్నారై అని మరచిపోయి పిండి దంచడం, పిండి వంటకాల తయారీలో సహాయం చేయడం లాంటి పనుల్లో నిమగ్నమై పండగ వాతావరణాన్ని ఆశ్వాదిస్తున్నారు. స్నేహితులు, బంధువులకు ఆఫ్రికా నుంచి బహుమతులు తీసుకువచ్చి ఇస్తుంటారు. అంతే కాదు తమ పొలంలో పంటలను పరిశీలించి సూచనలు సలహాలు ఇస్తుంటారు. ప్రభుత్వ పనితీరు బాగుంది: ముప్పరాజు వెంకటరవి మాది కమ్మ సామాజిక వర్గం. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో భూ ఆక్రమణలు జరిగాయి. మా గ్రామంలో రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. జన్మభూమి కమిటీలు ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేశాయి. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేవు. కక్ష సాధింపులు లేవు. వలంటీర్లు అందరికీ పథకాలు అందిస్తున్నారు. మా గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా పండగ చేసుకుంటున్నాం. చంద్రబాబు హయాంలో వర్షాలు లేక, పంటలు పండక విదేశాల్లో ఉద్యోగానికి వెళ్లా. ప్రస్తుతం రైతుల పరిస్ధితి బాగానే ఉంది. నేను ఉద్యోగంలో బాగానే స్ధిరపడ్డాను. ఇక్కడకు వచ్చినప్పుడు వ్యవసాయంపై మక్కువతో మా పొలాలు కూడా చూసుకుంటుంటా. సంక్రాంతి తర్వాత ఆఫ్రికా వెళ్లి మళ్లీ ఏడాదికి వస్తా. -
HYD: ఇద్దరి ప్రాణం తీసిన గాలిపటాలు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండగ పూట గాలిపటాల సరదా రాజధాని నగరంలో ఇద్దరి ప్రాణాలు తీసింది. రోడ్డుపై వెళుతూ చైనా మాంజా దారం తగిలి ఆర్మీ లో డ్రైవర్‌గా పని చేసే కోటేశ్వేర్ రెడ్డి మృతి చెందాడు. మరో ఘటనలో గాలిపటం ఎగురవేస్తూ అల్వాల్ పీఎస్‌లో పనిచేసే ఏఎస్సై కుమారుడు ఆకాష్ ఇంటిపై నుంచి కిందపడి మరణించాడు. దీంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. శనివారం సాయంత్రం ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తున్న సమయంలో లంగర్‌హౌజ్‌స్ ఫ్లైఓవర్‌పై అడ్డుగా ఉన్న చైనా మాంజా మెడకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డ కోటేశ్వర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కోటేశ్వర్‌రెడ్డి స్వస్థలం విశాఖపట్నం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేరే ఘటనలో గాలిపటం ఎగురవేస్తూ, ప్రమాదవశాత్తు భవనం పైనుండి పడి ఆకాష్(20) అనే యువకుడు మృతి చెందాడు. పేట్ బహీరాబాద్‌లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పండుగ రోజు కుమారుడు మృతి చెందడంతో ఆకాష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సహచర ఉద్యోగి కుమారుడు మృతి చెందడంతో అల్వాల్ పోలీసుస్టేషన్‌లోలోనూ విషాద చాయలు అలుముకున్నాయి. ఇదీచదవండి.. తెలంగాణలో హత్యా రాజకీయాలు చెల్లవు: కేటీఆర్ -
సంక్రాంతి స్పెషల్: 'పందెం కోడి' వామ్మో ఇంత రేటా?
‘ఎత్తర కోడి తిప్పర మీసం’ అని సంక్రాంతి వస్తే బరిలోకి దిగుతారు పందెం రాయుళ్లు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి కోళ్ల పందేలు జరపడం ఆనవాయితీ. అయితే పోటీలో గెలిచేందుకు కోళ్లను సాకే తీరు అంతే వినూత్నం. ఈ సంవత్సరం సంక్రాంతి పుంజు ఒక్కోటి రెండున్నర లక్షలు పలుకుతోంది. పందెం కోళ్ల కబుర్లకోసం నెటిజన్లు చెవి కోసుకుంటున్నారు కూడా. మగకోళ్లు మాత్రమే ఎందుకు కొట్టుకుంటాయి? ఆడకోళ్లు సమర్థమైన కోడి పుంజునే ఎంచుకుంటాయి కాబట్టి. ఇతర మగకోళ్లను తరిమికొట్టి ఆడకోళ్లకు చేరువ కావాలి కాబట్టి. ఆడకోళ్లను, వాటి గుడ్లను రక్షించడానికి శక్తి కావాలి కాబట్టి. క్రీస్తు పూర్వం నుంచే కోడి పందాలు ప్రపంచదేశాల్లో ఉన్నాయి. మన దేశంలో కూడా ఉన్నాయి. కుమారస్వామి పతాకంపై కూడా కోడిపుంజు ఉంటుంది. కోడి పుంజులకు వాటి ఈకల రంగును బట్టి, జాతిని బట్టి రకరకాల పేర్లు ఉంటాయి. కాకి, డేగ, నెమలి, పింగళి, పూల, మైల, కౌజు, సేతు, సేవల, నల్లబోర, ఎర్రపొడ.. ఇలా. కోడి పందేల పండితులు, పెంచే ఆసాములు దూరం నుంచి చూసి కూడా ఏ పుంజు ఏ జాతికి చెందిందో చెప్పేయగలరు. పందేల వేళ దేని మీద దేన్ని వదలాలో ఒక లెక్క ఉంటుంది. కోడి పుంజుల పంచాంగం, జాతకాలు ఉంటాయంటే నమ్ముతారా మీరు? ఉన్నాయి. కుక్కుట శాస్త్రమే ఉంది. పల్నాటి యుద్ధం కోడి పందేల ఆనవాయితీని మరవనీకుండా చేస్తూనే ఉంది. కోడి పందేల కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూసే వారు.. కోడి పందేల సమయంలోనే సంవత్సరానికి సరిపడా ఆదాయం గడించేవారు గోదావరి జిల్లాల్లో ఉన్నారు. పందెం కోళ్లను పెంచి అమ్ముతారు. ప్రస్తుతం ఒక్కో కోడి రెండున్నర లక్షల ధర పలుకుతోంది. ఇవి బాగా పోరాడటానికి గతంలో ఏం చేసేవారోగాని ఇప్పుడు వయాగ్రా, శిలాజిత్ వంటివి కూడా పెడుతున్నారని తాజా వార్తలు. లోకల్ బ్రీడ్స్లో మోసాలు ఉంటాయని థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్ నుంచి కూడా పుంజులను తెప్పించుకుంటున్నారు. అయితే అదంత సులువు కాదు. కోడి పందేలకు తర్ఫీదు ఇచ్చే గురువులు వేరే ఉంటారు. వీరు అక్టోబర్ నుంచి పుంజులకు శిక్షణ మొదలెట్టి జనవరికి పూర్తి చేస్తారు. వీటికి తినిపించే తిండి అమోఘం కాబట్టి వీటి రుచి అమోఘమని ఓడిన వాటిని ఎగరేసుకుపోయేవారూ ఉన్నారు. థాయ్‌లాండ్‌లో ఇలాంటి పోటీల్లో ఓడిన కోడిని 20 లక్షలకు కూడా కొన్న సందర్భాలున్నాయి. ఈసారి మనవాళ్లు ఎంతకు కొంటారో చూడాలి. ఇవి చదవండి: మొగలిపువ్వంటీ మొగుడ్నీయవే : నాలుగు రోజుల ముచ్చట -
సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు
సాక్షి, అమరావతి: ముత్యాల ముగ్గులు, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్‌కు ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలుత సీఎం వైఎస్ జగన్, భారతమ్మ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం బసవన్నలకు సారెను సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమంలో వారిరువురూ పాల్గొన్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఏర్పాటుచేశారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై..అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని. సుఖ సంతోషాలతో..విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై..అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాలతో..విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర… — YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2024 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మొగలిపువ్వంటీ మొగుడ్నీయవే : నాలుగు రోజుల ముచ్చట
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంబరంగా జరపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు...కొత్త అల్లుళ్లు ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. దక్షిణ భారతదేశంలో పొంగల్‌ను నాలుగు రోజుల పాటు జరుపు కుంటారు, నాలుగు రోజుల ఈ వేడుకలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత. సంక్రాంతి సంబరాల్లో తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు.ఈ భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే భోగి: భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలు తొలిగిపోవాలంటూ అగ్ని దేవుడికి భోగి మంట సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకోవడమే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. తెల్లవారుఝామున నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తారు తద్వారా చీడ పీడలు దోషాలు, తొలగిపోతాయని విశ్వాసం. భోగి అంటేనే భోగి మంటలు కదా. పాతకు బై ..బై... కొత్తకు ఆహ్వానం ఆవు పేడతో చేసిన పిడకలతో తెల్లవారుఝామునే భోగి మంటలు వేయడం అలవాటు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు. ఈ ఆవు పిడకలను రకరకా పేర్లతో పిలుచుకుంటారు. ఇంకా మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు. పాతను వదిలిపెట్టి, సరికొత్తమార్గంలోకి పయనించాలనేదే దీనర్ధం పరమార్థం. ముఖ్యంగా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో.. కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ. అలాగే భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. సాయంత్రం ఇంట్లోని చిన్న పిల్లలకు ముచ్చటగా భోగి పళ్లు పోసి, పేరంటాళ్లను పిలుచుకొని వేడుక చేసుకుంటారు. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంవైపు, మకర రాశిలోకి అడుగుపెట్టిన సందర్భమే సంక్రాంతి సూర్యుడి పండుగ. ఏడాదిలో వచ్చే తొలి పండుగు. ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు చెబుతారు. సంక్రాంతికి పుణ్య దినం సందర్భంగా అడిగిన వారికి కాదనకుండా యధాశక్తి దానధర్మాలు చేయాలని భావిస్తారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు రైతుల ఇళ్లకు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలతో ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. అందుకే సంక్రాంతి రోజు మట్టి కుండలో కొత్త బియ్యం, బెల్లం,చెరకు కలిపి పొంగల్ చేస్తారు. ఈ పాలు ఎంత పొంగిపొర్లితే.. అంత సమృద్ధి , శ్రేయస్సును అని నమ్ముతారు. అంతేనా సంక్రాంతి ఈ పండుగ కొత్తబట్టలు కావాల్సిందే. ఇంకా పెద్దలకు నైవేద్యాలు, పితృతర్పణ లాంటివి ప్రధానంగా చెప్పుకోవాలి. శని దోషాలు తొలగిపోవాలని, నల్లనువ్వులతో సూర్యుడికి పూజలు, పితృదేవతలందరికీ తర్పణలిస్తుంటారు. ఇక పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, నువ్వుండలు, సున్నుండలులాంటి స్వీట్లతోపాటు, జంతికలు చక్రాలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి. సంక్రాంతి అంటే ముగ్గూ ముచ్చట సంక్రాంతికి ముందే నెల పెట్టడం అని ముగ్గులు . ప్రతీ ఇల్లూ రంగు రంగుల రంగువల్లలతో కొత్త పెళ్లి కూతురులా ముస్తాబవుతుంది. పల్లెల్లో అయితే ఎవరుఎంత పెద్ద ముగ్గు పెడితే అంత గొప్ప అన్నట్టు. దీనిపై బాపూ లాంటి గీతకారులు కార్లూన్లు వేశారంటేనే అర్థం చేసుకోవచ్చు సంక్రాంతిలో ముగ్గుల హడావిడి. గోదావరి జిల్లాల్లో గొబ్బెమ్మలతో కన్నెపిల్లలు, చిన్న పిల్లల ముచ్చట చూసి తీరాల్సిందే. ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మకి గుమ్మడి, మందార, బంతి, చామంతి పూలు పెట్టి పసుపూ కుంకాలతో అలంకరించి, తోటి స్నేహితులను పిలుచుకుని పాడుతూ వాటి చుట్టూ పాటలు పాడతారు. సుబ్బీ గొబ్బెమ్మా! మల్లెపువ్వంటీ మరదల్నివ్వవే, చామంతిపూవంటి చెల్లెల్నివ్వవే, మొగలీ పూవంటి మొగుణ్ణివ్వవే” అంటూ అమ్మాయిలు గొబ్బెమ్మలాడతారు. ఈ నెల రోజులూ గొబ్బెమ్మల సందడి ఉంటుంది. హరిలో రంగ హరీ అంటూ హరిదాసులు, గంగిరెద్దులు, కోడి పందాలు, జానపదుల జావళి సంక్రాంతి పండుగ. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా అందంగా తలలూపుతూ చేసే నృత్యాలు..అబ్బో.. ఈ దృశ్యాలన్నీ చాలా రమణీయంగా ఉంటాయి. మూడో రోజు కనుమ: దీన్నే పశువుల పండుగ అని అంటారు. పశుపక్ష్యాదులకి గౌరవాన్ని సూచించే పండుగ వ్యవసాయ ఆధారమైన పల్లెల్లో పశువులే గొప్ప సంపద. రైతుకు ఎంతో ఆదరువు. చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. మెడలో గల్లుగల్లుమనే మువ్వల పట్టీలు పశువులకు చక్కగా అలకరించుకుంటారు. అందరూ కలిసి భోజనాలు చేస్తారు. గాలిపటాలు ఎగురవేస్తూ సరదాగా గడుపుతారు ముక్కనుమ:నాలుగో రోజైన ముక్కనుమ సంక్రాంతికి ముగింపు అనిచెప్పవవచ్చు. శాకాహారులు వివిధకూరగాయలో ముక్కల పులుసు చేసుకుంటూ, మాంసాహారులు నాన్‌వెజ్ వంటకాలతో విందు చేసుకుంటారు. ముక్కనమను తమిళులు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును కరినాళ్ అని పిలుస్తారు. పేరేదైనా.. సంబరం ఒకటే! ఆచారాలు, సాంప్రదాయాలు కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంతో జరుపుకునే పండుగు సంక్రాంతి. పశ్చిమ బెంగాల్లో పౌషా సంక్రాంతి, తమిళనాడులో పొంగల్, అస్సాంలో బిహు, గుజరాత్‌లోని ఉత్తరాయణ్, పంజాబ్‌లోని లోహ్రీ, అస్సాంలోని మాగ్ బిహు ఉత్సవాలు జరుపుకుంటారు. -
కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ ముగ్గు!
అయోధ్యలో భవ్య రామమందిరం జనవరి 22న ప్రారంభవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ దైన శైలిలో తమ భక్తి భావాన్ని చాటుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో పంథాలో అసాధ్యకరమైన పనులతో తమ భక్తి శక్తిని చాటుతూ విస్తుపోయేలే చేస్తున్నారు. ఆ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఇంకొద్ది రోజుల్లో జరగనుండగా ఒక వైపు నుంచి అయోధ్యకు ఎంతో విలువైన కానుకలు వస్తున్నాయి. దీంతోపాటు రామ అన్న పేరుకి శక్తి ఏంటో తెలిసేలా ఒక్కో విశేషం రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తోంది. ఇలాంటి వింతలు, విచిత్రాలు చేస్తుంటే ఆ లీలా స్వరూపుడే ఇలా తన భక్తులచే అసాధ్యమైన వాటిని చేయించుకుంటున్నాడా అన్నంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అలాంటి అనితర సాధ్యకరమైన ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అదేంటో వింటే మాత్రం ఆశ్చర్యపోవడం ఖాయం. బీహార్‌లోని దర్భంగాకు చెందిన మోనికా గుప్తా అనే అమ్మాయి కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ వేసింది. అదికూడా రామ మందిరాన్ని ముగ్గు రూపంలో వేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రామ భక్తితో ఎంతటి అసాధ్యమైన కార్యాన్ని అయినా సాధించొచ్చు అని నిరూపించింది మోనికా. ఆమె కళ్లకు గంతలు కట్టుకుని ఏ మాత్రం తడబడకుండా చాలా చాకచక్యంగా పెట్టింది. మాములుగా గీసినా.. ఎన్నో సార్లు చెరిపి.. చెరిపి..గీస్తాం అలాంటిది. చూడకుండా ముగ్గు వేయడం అంటే మాటలు కాదు. కానీ జనవరి 22న అయెధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆమె బిహార్ నుంచి అయోధ్యకు వచ్చి మరీ ఇలా అసాధ్యకరమైన రీతీలో ముగ్గు వేయడం విశేషం. ఈ మేరకు మౌనిక మాట్లాడుతూ.. తాను ఎంఎస్సీ చదువుతున్నట్లు పేర్కొంది. తనకున్న ధ్యానం చేసే అలవాటు కారణంగానే ఇంతలా సునాయాసంగా చూడకుండా ముగ్గు వేయగలిగానని చెప్పుకొచ్చింది. ఈ ఘనత సాధించగలిగేందుకు కారణం తాను తల్లి వద్ద విన్నా మహాభారత గాథేనని చెబుతోంది. ఆ ఇతిహాసంలో దృతరాష్ట్రుడికి కళ్లకు కనిపించేలా సంజయుడు వివరించిన కౌరవులు పాండవుల యుద్ధ ఘట్టం. అలాగే మత్సయంత్రాన్ని చేధించటంలో అర్జునుడు కనబర్చిన ప్రతిభ పాటవలు తనను ఇలాంటి ఘనత సాధించేందుకు ప్రేరణ ఇచ్చాయని చెప్పుకొచ్చింది. ఇలా కళ్లకు గంతలు కట్టుకుని రంగోలీలు వేయడాన్ని నాలుగేళ్ల ప్రాయం నుంచే ప్రారంభించానని, ఏడేళ్లు వచ్చేటప్పటికీ ధ్యాన సాధనతో దానిపై పూర్తిగా పట్టు సాధించగలిగానని చెప్పింది. ఇలా చూడకుండా మనోనేత్రంతో గీయ గలిగే సామర్థ్యాన్ని సిక్త్స్ సెన్స్ యాక్టివేషన్ లేదా థర్డ్ ఐ యాక్టివేషన్‌గా అభివర్ణించింది మౌనిక. కాగా ఈ రామమందిర ప్రారంభోత్సవానికి ఎంతో మంది ప్రముఖులు, సెలబ్రెటీలు హాజరుకానున్నారు. (చదవండి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి! ) -
ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగ. గ్రామానికి నూతన శోభను తెచ్చే పండుగ. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ. పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన పాడిపంటల పండుగ. తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ. భోగి మంటలు.. రంగ వల్లులు.. హరిదాసుల కీర్తనలు. గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు. రైతు లోగిళ్ళలో ధాన్యం రాసులు.. పిండి వంటల ఘుమఘుమలు. బంధు మిత్రుల సందళ్ళతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి. మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లోనే ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు, గవర్నమెంటు బడి, గవర్నమెంటు ఆసుపత్రిలో నాడు-నేడు, ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు, బ్రాడ్ బ్యాండ్ సదుపాయంతో అక్కడే కడుతున్న డిజిటల్ లైబ్రరీలు, ఒక్క రూపాయి కూడా లంచం, వివక్ష లేకుండా ప్రజలకు అందిన రూ. 2.46 లక్షల కోట్ల డీబీటీ... ఇంటింటికీ, ప్రతి పేద సామాజికవర్గానికి చరిత్రలో ఎన్నడూలేనంతగా అందిన లబ్ధి...ఇవన్నీ పల్లెలు మళ్ళీ కళకళలాడేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇంటింటా, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి మారుమూల పల్లెలోనూ, ప్రతి ఒక్క సామాజికవర్గంలోనూ... నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలం అన్న భరోసా ఇవ్వగలిగితేనే ఇంటింటా సంక్రాంతి అని నమ్ముతూ ఆచరిస్తున్న ప్రభుత్వంగా... రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
'ఊరికి బంధువులొస్తున్నారు'.. కానుకలతో కాచుకోండి..!
'సంక్రాంతి పండగ వస్తే ఊర్లోకి పాత బంధువులొస్తారు. పండిన పంట నుంచి హక్కుగా తమ భాగం తీసుకుపోతారు. హరిదాసులు, గంగిరెద్దుల వారు, కొమ్మదాసరులు, జంగం దేవరలు, పిట్టల దొరలు, గారడీ వాళ్లు.. వీరందరికీ సంక్రాంతి వస్తే సంవత్సరానికి సరిపడా సాయం. సాటివారికి సాయం చేయడమే సంక్రాంతి'. సంక్రాంతి అనగానే ఊళ్లోకి బంధువులే కాదు డూడూ బసవన్నలు కూడా వస్తారు. సంక్రాంతి అంటే తిని, తేన్చి, సంబరాలు చేసుకునే పండగ మాత్రమే కాదు... రైతు సౌభాగ్యానికీ పల్లె సౌభాగ్యానికీ సహకారం అందించిన అన్ని వర్గాల వారికీ పంపకాలు చేసే పండగ కూడా. సంక్రాంతి పండగ సమయంలో ఇంటికి పుట్ల కొద్దీ చేరిన ధాన్యం నుంచి రైతు తనకు సేవ చేసిన, సాయం చేసిన వర్గాల వారికి భాగం ఇస్తాడు. ‘మేర’ పంచుతాడు. పాలేర్లకి, సేద్యగాళ్లకి. పనివాళ్లకి వడ్లు పోస్తాడు. కొందరికి కొత్తబట్టలు పెడతాడు. అయితే వీరు కాకుండా ఊరి మీద హక్కుగా తమ వాటా కోసం వచ్చే సంప్రదాయ వృత్తికళకారులు వచ్చి ఊరిలో ఆడి, పాడి వినోదం పంచి తమ వడ్లు మూట గట్టుకుని పోతారు. శ్రీమద్రమా రమణ... ‘సద్గురుని కృపచే తారతమ్యము తరచి గనుమన్నా.. ధరణి లోపల మూఢమతులకు దొరుకుటకు బహు దుర్లభమ్మిది’.. అని పాడుతూ గురు కటాక్షం వలనే భక్తిని, ముక్తిని చేరుకోవాలని బోధిస్తూ వీధివీధిన తిరుగుతూ సంక్రాంతి శోభను తెస్తాడు హరిదాసు. పండగ రోజుల్లో దానికి ముందు ధనుర్మాసంలో హరిదాసు తిరగని ఊరు, వీధి ఎంతో బోసిపోతాయి. నెత్తిన అక్షయపాత్ర, భుజాన తంబూర, చేతిలో చిడతలతో ‘శ్రీమద్రమా రమణ గోవిందా’ అంటూ భిక్ష స్వీకరించా ‘కృష్ణార్పణం’ అంటూ మనం సంపాదించిన దానిలో కొంత పేదలకు అర్పణం చేయడం ద్వారా దేవునికి సమర్పణం చేసిన పుణ్యం పొందాలని సూచిస్తాడు హరిదాసు. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి వీధి వాకిట్లో హరిదాసు కోసం గృహిణులు కాచుకుని ఉండేవారు. ఇప్పుడు పై అంతస్తుల్లో, అపార్ట్మెంట్ బాల్కనీల్లో నుంచి చూస్తూ కిందకు దిగడానికి బద్దకిస్తున్నారు. హరిదాసు అక్షయ΄ాత్రలో జారవిడిచే కాసిన్ని బియ్యం మన ఇంటి సంపదను అక్షయపాత్రగా మారుస్తాయి. డూడూ బసవన్నలు ‘గంగిరెద్దులా తల ఊపకు’ అని అంటారు గాని దైవచిత్తానికి తల ఊపుతూ భారం అంతా నీదే అనుకోవడానికి మించిన వేరే సుఖం ఏముంటుంది? డూడూలు కొట్టే బసవన్నను యజమాని ముద్దుగా చూసుకున్నట్టే జీవుణ్ణి దేవుడు ముద్దుగా చూసుకుంటారు. గంగిరెద్దులు ఇంటి ముందుకొచ్చి సన్నాయి పాట వినిపిస్తే ఆ కళే వేరు. రంగు రంగుల పాతబట్టలు ఇస్తే అవి బసవడి మూపురం మీదకు చేరుతాయి. కాసులిస్తే గంగిరెద్దులవాడి నల్లకోటు జేబులో చేరుతాయి. కాసిన్ని డబ్బులు ఎక్కువిస్తే గంగిరెద్దులు విన్యాసం చేస్తాయి. యజమాని ఛాతీ మీద సుతారంగా గిట్టలు ఆడిస్తాయి. బుడబుడలు... కొమ్మదాసరులు ‘అంబ పలుకు జగదంబ పలుకు’ అంటూ డమరుకం వాయిస్తూ బుడబుక్కల వాళ్ళు వస్తారు సంక్రాంతికి. తలపాగా, కోటు, గొడుగు చేతబూని శుభాల భవిష్యత్తును చెబుతూ భిక్ష స్వీకరిస్తారు. వారు వేగంగా వాయించే డమరుకం గొప్ప శబ్ద విన్యాసం సృష్టిస్తుంది. వీరికి డబ్బు. వడ్లు, పాతబట్టలు ఇవ్వాల్సిందే. ఇక ఊరికి ఒకప్పుడు కొమ్మదాసరులు వచ్చేవారు. వీరు ఊరి మధ్యలోని చెట్టు కొమ్మెక్కి కూచుని కింద గుడ్డ పరిచి వచ్చేపోయేవారి మీద వ్యాఖ్యానం వినిపిస్తుండేవారు. తగిన సొమ్ము ముట్టజెప్తేనే దిగేవారు. కొయ్య తుపాకీతో పిట్టల దొరలు వస్తారు పెద్ద పెద్ద వాళ్లతో కలిసి తిరగాలనుకునే సామాన్యుడి కలలకు మాటల మలాం పూస్తారు. ‘మేము స్నానం చేసిన సబ్బు నీళ్లతో పేద దేశాల వాళ్లు డ్యాములు కట్టుకున్నారు’ అంటారు. ‘మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకిందని చెత్తకుప్పలో పడేశాం’ అంటారు. ‘మోదీ గారు పిలిచి పాకిస్తాన్ మీద యుద్ధానికి పొమ్మని ఆర్రూపాయలు అడ్మాన్సు ఇచ్చారు’ అంటారు. దుబాయ్ షేకుతో టిఫిని తిని అమెరికా ప్రెసిడెంట్‌తో లంచ్‌కు కూచోపోబోతున్నాం అంటారు. తర్వాత శంఖం ఊదుతూ జంగం దేవరలు వస్తారు. గారడీ వాళ్లు, కనికట్టు ప్రదర్శించేవాళ్లు.. వరుస కడతారు. రైతు ఎవరినీ కాదనడు. అందరినీ ఆదరిస్తాడు. ఇక సాయంత్రమైతే ఊళ్లో పాట కచేరీలు, డాన్సు ప్రోగ్రాములు ఉంటాయి. రకరకాల కళాకారులు దిగుతారు. సినిమా నాటకాలు ఒకప్పుడు వేసేవారు. సినిమాలు కూడా వేసేవారు. సంక్రాంతి సందేశం... సామూహిక ఉత్సవం. జీవితం సాటి మనుషులతో కలిసి మెలిసి సాగాలని చెప్తుంది. ఉన్నది పంచుకుని తినాలని చెప్తుంది. శ్రమ చేసి సమృద్ధితో జీవించమని చెబుతుంది. నలుగురూ కలిసి ప్రకృతి వనరులను ఫలవంతం చేసుకుని నలుగురూ వృద్ధి కావాలని కోరడమే సంక్రాంతి. ఇవి చదవండి: Makar Sankranti 2024: పతంగులు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా? -
సత్తెనపల్లిలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
-
సంక్రాంతికి పతంగులు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా?
సంక్రాంతి సంబరం అంటే చుట్టాలు పక్కాలు, అరిసెలు, స్వీట్లు, భోగి పళ్లు, గంగిరెద్దులు, గొబ్బెమ్మల ముచ్చటే కాదు. వీటన్నింటికి మించి మరో పండుగ కూడా ఉంది. అసలు సంక్రాంతి అంటేనే చాలా ప్రదేశాల్లో పతంగుల పండుగ. , రెండు నెలల ముందు నుంచి పిల్లలు, పెద్దలు గాలి పటాలను ఎగుర వేస్తారు. ఎవరికి నచ్చిన సైజులు, ఆకారాల్లో రకరకాల గాలి పటాలను ఎగురవేస్తూ ఆనందంలో మునిగి తేలతారు. ఆకాశంలో ఎటు చూసినా పట్ట పగలే నక్షత్రాలొచ్చాయా అన్నట్టు గాలిపటాలు దర్శనిమిస్తాయి. తెలంగాణా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పతంగులు గురవేయడాన్ని పండగలా నిర్వహిస్తారు సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగురవేస్తారు..? చరిత్ర ఏమిటి..? ఎక్కడి నుంచి మొదలైంది? తొలి రోజుల్లో వీటిని ఆత్మరక్షణకు, సమాచారాన్ని పంపించడం కోసం ఉపయోగించేవారట. దాదాపు 2 వేల సంవత్సరాల కిందట చైనాలో వీటిని తయారు చేశారట. సిగ్నలింగ్, మిలటరీ ఆపరేషన్స్‌లోనూ వీటిని వినియోగించారు. చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు. మకర సంక్రాంతికి శీతాకాలం ముగిసి వసంత రుతువు ప్రారంభానికి సూచికగా చూస్తారు గాలిపటాలను పగటిపూట ఎగరవేయడంలో ఒక ఆరోగ్యపరమైన కారణం కూడా ఉంది. పతంగులు ఎగురవేయడం అనేది దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పడానికి ఒక మార్గం అని కొందరు విశ్వసిస్తారు. గాలిపటాలు ఎగరేసేటపుడు ఎక్కువ సమయం మన బాడీ సన్లెటై్కి ఎక్స్పోజ్ అవుతుంది. అంతేకాదు లేలేత సూర్యకిరణాల్లో విటమిన్ డి లభిస్తుంది. సూర్యుడి లేతకిరణాలు చర్మంపై పడితే చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే చలిగాలుల వల్ల కలిగే అనేక అంటువ్యాధులు, అనారోగ్యాలతో పోరాడేందుకు ఎంతో సహాయ పడుతుంది.ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం కంటిచూపును మెరుగు పరుస్తుందని చైనీయుల విశ్వాసం. తల పైకి ఎత్తి చూసేటపుడు నోరు కొద్దిగా తెరచు కుంటుందని, అది శరీరానికి శక్తిని ఇస్తుందని కూడా వారు నమ్ముతారు. మొదట్లో వీటిని ఆత్మరక్షణకు, సమాచారాన్ని పంపించడం కోసం ఉపయోగించేవారట. ఆ తర్వాత సిగ్నలింగ్, మిలటరీ ఆపరేషన్స్‌లోనూ వీటిని వినియోగించారు. ఒకప్పటి గాలిపటాలు మందంగా, దీర్ఘచతురస్రాకారంలో ఉండేవి. క్రీస్తుపూర్వం 206లో చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు. దుర్మార్గుడైన రాజును ఓడించేందుకు వచ్చిన ఆలోచనే తొలి గాలిపటం. ఇందులో భాగంగా కోటలోకి సొరంగాన్ని తవ్వాలనేది హేన్ చక్రవర్తి ప్లాన్. అలా ఒక పతంగ్‌ను తయారు చేసి దానికి దారం కట్టి ఎగరవేశాడు. ఆ దారం ఆధారంగానే, సొరంగం తవ్వి సైనికులను పంపి కోటను వశం చేసుకున్నాడని చెబుతారు. ఈ నియమాలు తెలుసా? పతంగులు ఎగురవేసేటపుడు కొన్ని నిబంధనలు కూడా పాటించాలి. ఇది ఆయా దేశాలని బట్టి ఉంటాయి. థాయ్‌లాండ్‌లో పతంగులు ఎగురవేయాలంటే 78 రకాల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. బెర్లిన్ గోడపై నుంచి అవతలికి వెళ్ళే అవకాశం ఉండడంతో భారీ గాలిపటాలను ఎగురవేయడంపై తూర్పు జర్మనీలో నిషేధం విధించారు. జపాన్‌లో కొన్ని గాలిపటాల బరువు కొన్ని కిలోల వరకు ఉంటుందట. -
కోళ్లకూ ఉందో పంచాంగం
తాడేపల్లిగూడెం: మా నవులకు శాస్త్రాలు, పంచాంగాలు, ఉన్నట్టే కోళ్లకు ప్రత్యే క పంచాంగం ఉంది. బరిలో ఏ రంగు కోడి గెలుస్తుంది? ఏ రంగు కోడి ఓడిపోతుంది? ఇవన్నీ కుక్కుట శాస్త్రంలో ఉంటాయి. పందేలు వేసే వారికి కుక్కుట శాస్త్రం ఒక ఆయుధమని పందేల ఔత్సాహికులు చెబుతూ ఉంటారు. కాబట్టి కుక్కుట శాస్త్రం ప్రకారం ఈ సంక్రాంతి ఏయే రకాల కోడి పుంజులు బరిలో గెలుస్తాయనే అంచనాలు వేస్తున్నారు. కోడిపుంజును సంస్కృతంలో కుక్కుటం అంటారు. రాచరికాల కాలంలో పౌరుషాలకు చిహ్నంగా కోడి పందేలు సాగేవి. ప్రస్తుత రోజుల్లో సంప్రదాయాల్లో భాగంగా సంక్రాంతికి కోడిపందేలు జరగడం ఆనవాయితీగా మారింది. పందేల మోజు నేపథ్యంలో పుంజుల పెంపకం దగ్గర నుంచి పందేల వరకూ ప్రజల విశ్వాసాల మాదిరిగానే కోడి పందేలలో పంచాంగం, నక్షత్రాల ప్రభావం పడింది. దీన్ని నుంచి వచ్చిందే కుక్కుట శాస్త్రం. ఈ శాస్త్రంలో కోడి ఈకల రంగును కొట్టి పుంజుల పేర్లను వర్గీకరించారు. నక్షత్రాలకు అనుగుణంగా గెలుపోటములు ఈ ఏడాది సంక్రాంతిలో ముఖ్యంగా మూడు రోజుల నక్షత్రాలను పరిశీలిస్తే భోగి రోజున ధనిష్ట నక్షత్రానికి పసుపు రంగు డేగ, సంక్రాతికి శతభిషం కాకి, కనుమ పూర్వాభాద్ర నెమలి రంగు కోళ్లు విజయం సాధించే అవకాశం ఉందని పందెంరాయుళ్లు చెబుతున్నారు. దిశలకు అనుగుణంగా పందేలు ఆదివారం ఉత్తర దిశ, సోమవారం దక్షిణ దిశ, మంగళవారం తూర్పు ముఖంగా పందేలు వేస్తే విజయం సాధిస్తాయని పందెంరాయుళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బరిలోకి పెరూ పుంజులు దేశవాళీ పందేలకు ఈసారి బరిలో పెరూ జాతి పుంజులు దింపుతున్నారు. భారతీయ పుంజులతో పెరూ పెట్టలను సంకరపర్చి ఓ జాతిని అభివృద్ధి చేశారు. ఇవే పెరూ పుంజులుగా ప్రాచుర్యం పొందాయి. పుంజులకు ఈ సారి నాస్తా లడ్డు పేరిట ఆయుర్వేద గుళికలు ఇస్తున్నారు. -
రామలక్ష్మి సిగ్గుపడింది.. ఎందుకో?
పండక్కి తాతగారి ఊరికొచ్చిన రామలక్ష్మి పెరట్లో ఒక్కో పువ్వూ తెంచి వోనీలో వేసుకుంటోంది. చూడమ్మీ ముల్లు గుచ్ఛీగలవు అన్నాడు అప్పుడే వచ్చిన నాగరాజు. మీ ఊళ్ళో మందారాలకు కూడా ముళ్లుంతా యేటి అంది కొంటెగా చూస్తూ... చెస్.. గుంటకు పోత్రం తగ్గలేదు అని మనసులో అనుకుంటూనే ఎప్పుడొచ్చినారు... ఏటి సేత్తన్నావు అన్నాడు. బీఎస్సి నర్సింగ్ అయింది.. ఎసోదాలో చేస్తన్నా అంది.. మరి నన్నేం అడగవా అన్నాడు నాగరాజు.. అడగక్కర్లే మందారాలకు ముల్లుంతాయని అన్నావంతే నువ్వు బీకామ్ ఫిజిక్స్ అని అర్థమైంది అంది మళ్ళీ ... దీనికి ఐడ్రాబాడ్ ఎళ్ళింతర్వాత తెలివెక్కువైంది అనుకుంటుండగానే ఎవుల్తోనే మాటలూ అంటూ తల్లి నాగమణి వచ్చింది. ఎవులో తెలీదే అమ్మా అంది రామలక్ష్మి.. అంతలోనే నాగరాజును చూస్తూ... ఒరే నువ్వా నాగీ ఎలాగున్నావు.. యేటి సేత్తన్నావు అంది... దీంతో వీడికి కాస్త మద్దతు దొరికినట్లై.. బాప్పా బాగున్నా.. మొన్నే వచ్చినాం.. ఇజివాడలో ఉంతన్నాం ... నన్ను బీకామ్ సేసి రొయ్యల కంపినీలో మేనేజరుగా చేస్తన్ను అన్నాడు గర్వంగా.. ఇంతలో రామలక్ష్మి వచ్చి... అమ్మా ఎవరి అంది కళ్ళతోనే... చిన్నప్పుడు గొర్రిపిల్ల తగిలికొస్తే కోలగూట్లో దాగుందామని దూరిపోయి అందులో ఉన్న పిల్లల బేపికి దొరికిపోనాడని అప్పుడు చెప్పినాను కదా... ఆడే ఈడు అంది నాగమణి.. పాపం నాగరాజు మళ్ళీ దెబ్బతినేశాడు.. సెండాలం.. ఇంత సెండాలం ఇంట్రడక్షన్ ఏందీ అనుకుంటూనే రామలక్ష్మిని చూశాడు.. కళ్ళతోనే నవ్వింది.. సరే బాప్పా వెళ్తాను అని కదిలి ఆరేడు అడుగులు వేయగానే నాగీ అని పిలిచింది నాగమణి ... బప్పా అంటూ వెనక్కి తిరిగాడు వాడి చూపులు ఆవిడ భుజాలను దాటుకుంటూ వెనకాల నిలబడిన రామలక్ష్మిని చేరుకున్నాయి.. ఈలోపే.. నాగీ రేపు బోగీ నాడు అమ్మను నాన్నను రమ్మను మాట్లాడాలి అంది... సరే బాప్పా అంటూ వాడు కదిలాడు.. వాడి వెనకాలే రామలక్ష్మి చూపులు.. కూడా ఫాలో అయ్యాయి.. మర్నాడు నాగరాజు నాన్న నారాయణ తల్లి రాజ్యం వచ్చారు.. వస్తూనే... పలకరింపులు అయ్యాక నాగమణి మొదలెట్టింది.. మరేట్రా అన్నియ్యా మన రామలక్ష్మికి నాగరాజుకు సేసిద్ధుమా .. ఎలాగూ సిన్నప్పుటునుంచి ఒనేసిన సంబంధమే కదా.. కొత్తగా అనుకునేది ఏముందీ అంది.. నారాయణ అలాగేలేవే మణీ చూద్దుము అన్నాడు... రాజ్యం కాస్త మాటకారి.. ఎక్కడా మాటపడనివ్వదు .... తన భర్త నారాయణ అమాయకుడని.. ఆయన్ను ఎవరైనా మోసం చేసేయగలరని.. తానూ అలాకాదని.. బాగా తెలివైనదాన్నని,.. ఇంట్లో తనదే పెద్దరికం ఉండాలని కోరుకునే తత్త్వం.. అందుకే నారాయణ చూద్దుము లేవే అనగానే ఏటీ సూసేది... అప్పుడెప్పుడో అనుకున్నాం కదాని ఇప్పుడు సేసెత్తమా... మంచీ సెడ్డా ఉండవా అంది... నేను దిగితే సీన్ మొత్తం మారిపోద్ది అనే కమాండింగ్ ఆమె మాటల్లో స్పష్టమైంది. ఉంటాయుంటాయి ఎందుకుండవు వదినా మూడు లచ్చల కట్నం.. వీరో వోండా ఇస్తాం.. పిల్లడికి ఒక తులం సైను ... ఇక పెళ్లయ్యాక సారి సీరెలు ఉండనే ఉంతాయి కదా అంది నాగమణి.. ఉంటాయమ్మా ఎందుకుండవు.. అందరికీ ఉంటాయి.. ఎవరిళ్ళలో లేవూ అంటూ రాజ్యం మళ్ళీ లైన్లోకి వచ్చింది.. అమ్మ వాలకం చూస్తుంటే రామలక్ష్మిని మిస్సైపోతానేమోనని ఓ వైపు నాగరాజు కళ్ళలో చిన్న భయం.. మా అన్న కూతురు మంగ కూడా బీటెక్ చేసింది.. కట్నం ఐదు లచ్చలు ఇస్తామని కూడా వదిన మాట్లాడింది అంటూ రాజ్యం తమవాడి మార్కెట్ రేటు బయటపెట్టింది.. ఆమ్మో.. అంత ఇవ్వకపోతే రామలక్ష్మి దక్కదేమో అని నాగరాజు అందోళన... ఈలోపే రామలక్ష్మి వచ్చి.. పోన్లేమ్మా నా జీతం డబ్బులున్నాయి కదా కొంత సర్దుబాటు చేద్దాం అని చెప్పడం ద్వారా నాగరాజును మిస్ చేసుకునే ఉద్దేశ్యం లేదని తేల్చేసింది.. అమ్మనీ గుంటా తెలివైందే... . అని మనసులో అనుకుంటూనే కళ్ళతోనే రామలక్ష్మి కళ్ళకు దండం పెట్టేశాడు.. సరే ఐతే రేపిల్లుండి మంచిరోజు చూసి మాటనుకుందాం అన్నది రాజ్యం ధీమాగా .. మరి పండక్కి కొత్తకోడలికి కోక గట్రా పెడితే .... అంది నాగమణి కాస్త సందేహిస్తూ... ఆ చూద్దాంలే అని రాజ్యం అంటుండగానే అమ్మా నేను నీకు తెచ్చిన మూడు చీరల్లో ఆ అరిటాకు రంగు చీర ఇచ్చేయ్... రాముకు బావుంటుంది అనేశాడు ఆగలేక నాగరాజు.. బయటకు చెప్పకపోయినా రామలక్ష్మి మనసులోనే నాగరాజును వాటేసుకుని సిగ్గులమొగ్గయింది.. అమ్మనీ గుంటడా అప్పుడే ఇలా తయారయ్యావా అంది రాజ్యం.. పోన్లే వదినా .. పిల్లలకు ఇష్టమే కదా.. మరెందుకు మాటలూ అనేసింది.. నాగమణి.. మొత్తానికి పండక్కి వచ్చిన రెండు కుటుంబాలు ఇలా సంబంధం కుదుర్చుకున్నాయి.. ఇలాంటి సంఘటనలు.. సన్నివేశాలు.. ఎన్నో.. ఎన్నెన్నో.. వాటన్నిటికీ సంక్రాంతి ఒక వేదిక.. మధ్యతరగతి వాళ్లకు సంక్రాంతి ఒక వేడుక. -గాంధీ, విజయనగరం -
వాకిళ్లు కళ కళ..
సంక్రాంతి వచ్చిందంటే ప్రతి వాకిలి ముగ్గులతో మురిసిపోతుంది. తెల్లటి చుక్కలు మల్లెల్లా ఇంటిముందు వికసిస్తాయి. రంగులు పూసుకొని ముస్తాబవుతాయి. స్త్రీలు తెల్లవారుజాము నుంచి ఓపిగ్గా వీటిని తీర్చుదిద్దుతారు. నిలువు చుక్కలు, అడ్డ చుక్కల మధ్య మెలి తిరుగుతూ రేఖలు కదులుతాయి. ఈ ముగ్గుల వెనుక చాలా విశేషాలున్నాయి. శుభాలూ ఉన్నాయి. బోసి వాకిలిని ముగ్గుతో ఎందుకు కళను నింపాలో తెలుసుకుందాం. సంవత్సరమంతా ఇంటి వాకిలి ముందు సుద్దముక్కతో అమ్మ గీసే ముగ్గు వేరు. సంక్రాంతి రాగానే వేసే ముగ్గు వేరు. సంక్రాంతి పండగ నెలంతా ఇంటిముందు పెద్ద ముగ్గులు పడతాయి. తెల్లగీతలతో ఒక్కోసారి, రంగులతో నిండి ఒక్కోసారి. పండగ నెల వస్తే వీధిలోని స్త్రీలంతా తెల్లవారు జామున లేచి ఇంటి ముందు పెద్ద ముగ్గును వేయడానికి ఇష్టపడతారు. కాని అది ఒక నిమిషంతో అయ్యేదా? వాకిలి చిమ్ముకోవాలి, కళ్లాపి చల్లుకోవాలి, తర్వాత చుక్కలు పెట్టాలి, చుక్కలు కలపాలి, రంగులు అద్దాలి.. యోగా అంటారు గాని ఇంతకు మించిన యోగా లేదు. ఇంతకు మించిన వ్యాయామమూ లేదు. ముగ్గు పెట్టాక ఇంటికి ఇంతకు మించిన కళ లేదు. మనకు ఉంది... మరి క్రిమి కీటకాలకు? సంక్రాంతికి పంట చేతికొస్తుంది. కొత్త బియ్యం ఇంట చేరుతాయి. గాదెలు నిండుతాయి. వడ్ల బస్తాలున్న ఇల్లు సమృద్ధిగా కనిపిస్తుంది. కాని పండించింది మనమే తింటే ఎలా? క్రిమి కీటకాదులకు? ముగ్గు ఒక పంపకం. ముగ్గు ఒక దానం. ముగ్గు ఒక సంతర్పణ. ఎందుకంటే ముగ్గును బియ్యం పిండితో వేస్తారు. బియ్యం సమృద్ధిగా ఉన్నప్పుడు బియ్యం పిండితో పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి కొదవేముంది? ఆ పిండి ముగ్గు వేస్తే ఆ పిండిని చీమలు, క్రిములు, కీటకాలు ఆరగిస్తాయి. అలా ప్రకృతిని సంతృప్తి పరిచిన ఇంటిని ప్రకృతి కాచుకుంటుంది. శుభం జరుగుతుంది. ముగ్గు ఆడవాళ్ల సొంతం భారతీయ సంస్కృతిలో హరప్పా, మొహెంజోదారో కాలం నాటి నుంచే అంటే క్రీ.పూ 2000 కాలం నుంచే ముగ్గులు ఉన్నట్టు ఆధారాలున్నాయి. తమిళనాడులో ముగ్గుకు విశేష ఆదరణ ఉంది. ఉత్తరాదిలో ముగ్గును ‘రంగోలి’ అంటారు. తెలుగువారి సంస్కృతిలో ముగ్గు ఉందనడానికి సాహిత్య తార్కాణాలున్నాయి. కాకతీయుల గాథను తెలిపే ‘క్రీడాభిరామం’లో ‘చందంబున గలయంపి చల్లినారు.. మ్రుగ్గులిడినారు’ అని ఒక పద్యంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్త మాల్యద’లో ‘బలువన్నె మ్రుగ్గుబెట్టి’ అని ఒక పద్యంలో రాశాడు. అయితే తొలి రోజుల్లో పురుషుల కళగా ఉన్న ముగ్గు క్రమేపి స్త్రీల కళగా మారింది. స్త్రీని ఇంటి పట్టునే ఉంచడం వల్ల, వంటకు, పూజకు, భక్తి గీతాలకు మాత్రమే అనుమతించడం వల్ల, చాలాకాలం ఇతర లలిత కళలకు దూరంగా ఉంచడం వల్ల ‘ఎవరి కంట పడకుండా’ ఇంటి పట్టున సాధన చేసుకునే ముగ్గు మీద ఎవరికీ అభ్యంతరం లేక΄ోయింది. దాంతో స్త్రీలు తమ సృజనాత్మకతను ముగ్గుల్లో చూపారు. ముగ్గుల వల్ల కొద్దో గొప్పో లెక్కలు తెలియడం, ధ్యాస నిలవడం, వేసుకున్న ముగ్గును చూసి సంతృప్తి చెందడం ఆడవాళ్లకు వీలయ్యింది. అంతేకాదు తెల్లవారు జామున స్త్రీలు లేచి వీధి మొత్తాన్ని పలకరించుకుంటూ మానవ సంబంధాలు పెంచుకునే వీలు చిక్కింది. కష్టసుఖాలు మాట్లాడుకునే వీలు కూడా. మనం వేసిన ముగ్గున మరుసటి రోజున మనమే చెరిపిపేయడంలో ఎప్పటికప్పుడు జీవితాన్ని కొత్తగా మొదలెట్టాలన్న భావన, గతం గతః అనుకునే తాత్త్వికత ఏర్పడతాయి. ఇప్పటి కాలంలో కూడా ముగ్గుల్లో మగవాళ్లకు ప్రవేశం లేకపోవడం గమనార్హం. రకరకాల ముగ్గులు ముగ్గుల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటి చుక్కలను బట్టి, రూ΄ాలను బట్టి ఆధ్యాత్మిక, ధార్మిక వ్యాఖ్యానాలు ఉంటాయి. తొమ్మిది చుక్కల ముగ్గు నవగ్రహాలకు ప్రతీక అని, చుక్కలు లేకుండా రెండు అడ్డగీతలు గీసి ఖండించుకునే త్రికోణాలతో వేసే ముగ్గు కుండలినికి గుర్తు అని అంటారు. అలాగే పురాణాలను తెలిపే, అవతారాలను సూచించే ముగ్గులు ఉంటాయి. రాను రాను ఈ ముగ్గులు సందేశాత్మకంగా కూడా మారాయి. దేశభక్తిని తెలిపే నాయకుల బొమ్మలు, జాతీయ పతాకాలు ముగ్గుల్లో చేరాయి. ఒక్కోసారి నిరసనలకు, నినాదాలకు కూడా వేదికలయ్యాయి. ముగ్గు ప్రథమ లక్ష్యం పారిశుద్ధత. ఇంటిముంగిలిని శుభ్రం చేసుకుని వేస్తారు కాబట్టి ఆ రోజుల్లోకాని ఈ రోజుల్లోకాని సగం రోగకారకాలు ఇంట్లో రాకుండా ఉంటాయి. అయితే రాను రాను స్త్రీలు బద్దకించి ఆధునికత పేరుతో స్టిక్కర్ ముగ్గులతో సరి పెట్టడం కనిపిస్తోంది. చిటికెన వేళ్ల మధ్య ముగ్గు ఎంత ధారగా వేయడం వస్తుందో అంత నైపుణ్యం వచ్చినట్టు. ముగ్గు వేయడంలో నైపుణ్యం వస్తే జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో కూడా నైపుణ్యం వస్తుంది. సంక్రాంతిని బ్రహ్మాండమైన ముగ్గులతో స్వాగతం చెపుదాం. -
సంప్రదాయ ఘుమఘుమలు
సాక్షి, భీమవరం: స్వీట్లలో వైరెటీలు ఎన్నొచ్చినా సంక్రాంతి వస్తోందంటే తెలుగునాట ప్రతి ఇల్లు సంప్రదాయ పిండి వంటలతో ఘుమఘుమలాడుతుంటుంది. సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో గృహిణులంతా సున్నుండలు, పోకుండలు, అరిసెలు, కజ్జికాయలు, జంతికలు, చల్లగుత్తులు వంటి పిండి వంటల తయారీలో బిజీ అయిపోయారు. కోవా, కలకండ, డ్రైఫ్రూట్స్ పోకుండలు, కజ్జికాయలు వంటి ఆధునిక పిండి వంటలు సైతం సంక్రాంతి వంటకాల్లో చేరి మరింత మాధుర్యాన్ని అందిస్తున్నాయి. పేద, ధనిక తారతమ్యం లేకుండా పల్లెల్లో ప్రతి ఇంటా పిండివంటల తయారీకి ప్రాధాన్యమిస్తారు. స్థోమత మేరకు జంతికలు, సున్నండలు, బెల్లం ఉండలు, చల్లగుత్తులు, పోకుండలు, రవ్వ లడ్డూలు, పొంగడాలు, అరిసెలు, మైసూర్‌పాక్, కారపు బూందీ తదితర వైరెటీలు చేస్తుంటారు. కొత్తగా వివాహం జరిగిన ఇళ్లలో పిండి వంటల తయారీ మరింత సందడిగా ఉంటుంది. పండుగకు వచ్చే కొత్త అల్లుళ్ల కోసం ఎన్నో రకాల వంటలు సిద్ధం చేస్తుంటారు. దూరప్రాంతాల నుంచి పండుగకు వచ్చిన తమ కుటుంబ సభ్యులు, బంధువులకు తిరిగి వెళ్లే సమయంలో వాటిని అందిస్తుంటారు. కొందరు దేశ విదేశాల్లో ఉన్న తమ వారికి ప్రత్యేకంగా పిండి వంటలు తయారుచేసి పంపుతుంటారు. ఆర్డర్లే.. ఆర్డర్లు : ఇళ్ల వద్ద పిండి వంటలు తయారు చేసుకునే తీరిక లేక స్వీట్స్ షాపుల్లో కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పట్టణాల్లో పెరుగుతోంది. ఏడాది పొడవునా బెంగాలీ, కలకండ, కోవా, కాజూ పేస్ట్ తదితర వైరెటీ స్వీట్స్ తయారుచేసే స్వీట్స్షాపుల నిర్వాహకులు సంక్రాంతి పండుగల్లో సంప్రదాయ పిండి వంటల తయారీకి ప్రాధాన్యమిస్తున్నారు. పోకుండలు, కజ్జికాయలు, కోవా, కలకండ, డ్రైఫ్రూట్స్ బూరెలతో సంప్రదాయ పిండి వంటల్లో ఆధునికతను జోడిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం తదితర చోట్ల పేరొందిన స్వీట్స్ షాపులతోపాటు చిన్న షాపుల్లోనూ సంక్రాంతి పిండి వంటల తయారీ ఎక్కువగా కనిపిస్తోంది. గ్రామాల్లో కేటరింగ్ నిర్వాహకులు, స్వీట్స్ తయారీదారులకు పెద్దఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. భీమవరం మండలం చినఅమిరం, కాళ్ల మండలం కోపల్లె, ఆకివీడు మండలం ఐ.భీమవరం, సిద్ధాపురం, యలమంచిలి మండలం కలగంపూడి తదితర చోట్ల ఇళ్ల వద్ద మహిళలు సంక్రాంతి పిండి వంటల తయారీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. చెరువులు, హేచరీలు, వివిధ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి పండుగ కానుకగా ఇచ్చేందుకు స్వీట్స్ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని తయారీదారులు అంటున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయని, సంక్రాంతి రోజుల్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సంక్రాంతి పిండి వంటల వ్యాపారం జరుగుతోందంటున్నారు. జిల్లాలో రూ.12 కోట్లకు పైనే వ్యాపారం జరుగుతుందని అంచనా. ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి సంక్రాంతి పండుగలకు గతంతో పోలిస్తే ఇళ్ల వద్ద తయారీ తగ్గింది. ఈ ఏడాది ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి. స్థానికంగానే కాకుండా దూరప్రాంతాల నుంచి ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి. – ఉద్దర్రాజు సీతాదేవి, ఐ.భీమవరం, ఆకివీడు మండలం సంప్రదాయ పిండి వంటలకు డిమాండ్ సంక్రాంతి సీజన్ కావడంతో జంతికలు, సున్నుండలు, అరిసెలు తదితర సంప్రదాయ పిండి వంటల్ని అధికంగా అడుగుతున్నారు. అందుకే వాటి తయారీకి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. – వత్సవాయి ఆశ, కలగంపూడి, యలమంచిలి మండలం -
ఊరూరా.. నోరూరేలా..
సాక్షి అమలాపురం: ఆత్రేయపురం పూతరేకులు.. అవిడి పాలకోవ.. తాపేశ్వరం కాజా.. పెరుమలాపురం పాకం గారెలు.. కాకినాడ గొట్టం కాజా... అల్లవరం చెకోడీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి జిల్లాలో పిండి వంటలకు, స్వీట్ షాపులకు జాతీయ స్థాయిలో పేరుంది. అతిథి మర్యాదలకు చిరునామాగా నిలిచే తూర్పున సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ ప్రత్యేక స్వీట్, హాట్లకు అదనంగా సంప్రదాయ పిండి వంటలు తోడవుతాయి. కరకరలాడే జంతికలు, నోటిలో కరిగిపోయే వెన్నప్పాలు, నమిలే కొద్దీ మాధుర్యాన్నిచ్చే పొంగడాలు, పంటికి పనిచెప్పే చక్కిడాలు, నోటిని తీపిచేసే కజ్జికాయలు, నేతి సువాసనలతో నోరూరించే సున్నుండలు, కమ్మనైన అరిసెలు తదితర సంప్రదాయ వంటలతో ఉమ్మడి జిల్లా ఘుమఘుమలాడాల్సిందే. పిండి వంటలకు ప్రత్యేకత సంక్రాంతి పండగ అంటేనే ఎన్నో సందడులు. వాటిలో పిండి వంటలు ప్రత్యేకం. విద్య, ఉద్యోగం, వ్యాపారాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన సొంతవారు.. కొత్త అల్లుళ్లు.. వారితో పాటు అతిథులు వచ్చే సమయం ఆసన్నం కావడంతో ఉమ్మడి జిల్లాలో ఎటు చూసినా సందడే సందడే. ప్రతి ఇంటి వద్ద సంప్రదాయ పిండి వంటల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఇంట పిండివంటల తయారీ మొదలైంది. అరిసెలు, మినప సున్నుండలు, గోధుమ సున్నండలు, బెల్లం మిఠాయి, పానీలు, గోరుమిఠాయి, జంతికలు, చల్ల గుత్తులు, పోకుండలు, రవ్వ లడ్డూలు, మైసూర్ పాకం, కారబూందీ, మురుకులు, అప్పడాలు, తదితర పిండివంటలు అన్నిచోట్ల చేయడం కనిపిస్తోంది. వీటితో పాటు కోనసీమ ప్రాంతంలో పానీలు, ఇలంబికాయలు, కొబ్బరి నౌజు, కొబ్బరి గారెలు, ఉండలు, మెట్ట ప్రాంతంలో వెన్నప్పాలు, గోరుమిటీలు ఎక్కువగా చేస్తుంటారు. ఎక్కువ పిండి వంటలు చేసి పండగ కోసం దూరప్రాంతాల నుంచి వచ్చిన తమ కుటుంబ సభ్యులు తిరిగి వెళ్లే సమయంలో వాటినందిస్తుంటారు. ఇరుగు పొరుగు వారు పిండివంటలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆప్యాయతలను పంచుకుంటారు. స్వీట్స్ షాపుల్లోనూ.. పిండి వంటలు తయారు చేసుకునే తీరిక లేక వాటి కోసం స్వీట్ షాపులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏడాది పొడవునా బెంగాళీ, కలకండ, కోవా, కాజూ పేస్ట్ స్వీట్స్, ఆగ్రా మిక్చర్ తదితర హాట్ రకాలను తయారు చేసే స్వీట్‌షాపుల నిర్వాహకులు పెద్ద పండగ కోసం సంప్రదాయ పిండివంటలను సిద్ధం చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, మండపేట, తాపేశ్వరం, కొత్తపేట, తుని వంటి ప్రాంతాల్లో స్వీట్ల తయారీలో పేరొందిన పెద్ద సంస్థలతో పాటు చిన్న దుకాణాల్లో వీటి తయారీ ఎక్కువగా కనిపిస్తోంది. ఆయా తయారీ సంస్థల వద్ద సంక్రాంతి సమయంలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి మరీ విక్రయాలు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో సంక్రాంతి పిండి వంటలు విక్రయాలు ఆన్‌లైన్‌లోనూ జోరుగా సాగుతున్నాయి. -
మకర సంక్రాంతి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి!
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అతి ముఖ్యమైన పండుగు, భోగి, మకర సంక్రాంతి, కనుమ మూడు రోజులను విశేషంగా భావిస్తున్నారు. ఈ ఏడాది 2024 జనవరి 15 మకర సంక్రాంతి జరుపుకుంటున్నారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కాలాన్ని సూర్య చంద్ర, నక్షత్రాల ఆధారంగా లెక్కిస్తారు.అలా సూర్య భగవానుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించిన పుణ్యసమయమే మకర సంక్రాంతి. మకర సంక్రాంతి నాడు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ రోజు చేసే దానం అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. సకల శుభాలు కలగాలంటే ఖచ్చితంగా ఈ బియ్యం, కిచిడీ, బెల్లం, నల్ల నువ్వులు, దుప్పట్లు దానం చేయాలని కూడా చెబుతారు. పితృదేవతలకు తర్పణం సంక్రాంతి రోజు సూర్యునికి అర్ఘ్యం, నైవేద్యం సమర్పించడం ద్వారా కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చని పండితులు చెబుతారు. అలాగే సంక్రాంతి రోజున నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వస్త్రాలు దానం చేస్తే విశేష ఫలము లభిస్తుందలకేవలం మకర సంక్రాంతి రోజు పితృ దేవతలకు నువ్వులతో తర్పణాలు వదలుతారు కూడా. నూతన వస్త్రములను దానం చేయాలి. సత్యనారాయణ వ్రతం మకర సంక్రాంతి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా విశేషం. సంక్రాంతి రోజున నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వస్త్రములు వంటివి దానము చేసినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలము లభిస్తుందని పండితులు మాట. ప్రత్యేకంగా నువ్వులు దానం,పూజ సంక్రాంతి రోజున తన ఇంటికి వచ్చిన తండ్రి సూర్య భగవానుడికి శని దేవుడు నల్ల నువ్వులతో స్వాగతం పలుకుతాడని, దీనికి మెచ్చిన సూర్యుడు ఈ రోజు తనను నువ్వు పూజించిన వారికి సకల సంతోషాలు కలుగుతాయని దీవించాడని పురాణాలు చెబుతున్నాయి. దీంతో మరక సంక్రాంతి రోజు సూర్యుడికి పూజలు చేయడంతోపాటు, నల్లనువ్వులు కలిపిన నీటిని సూర్యుడికి సమర్పించాలి. అలాగే శనికి ప్రీతికరమైన నల్లనువ్వులను ధారపోసినా, నదానమిచ్చినా శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని, ఏలిన నాటి శని దోషాలు తొలగి జీవితంలో వెలుగులు ప్రసరిస్తాయట. ఈ రోజు నెయ్యి దానం చేయడం వల్ల అన్ని రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే జాతకంలో సూర్యుడు-గురు గ్రహ స్థానం బలపడుతుంది. సంక్రాంతి నాడు బెల్లం దానం చేస్తారు. అటుకులు బెల్లం కలిపి దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంకా ఈ రోజు మినపపప్పు, బియ్యంతో చేసిన ఖిచ్డీని దానం చేస్తారు. ఫలితంగ మనుషుల జాతకంలో సూర్యుడు, చంద్రుడు , బృహస్పతి స్థానం బలంగా ఉంటుందని చెబుతారు. -
క్రంచీ..క్రంచీ ఎల్లు చిక్కీ: చాలా సింపుల్‌గా, చక చకా !
సంక్రాంతి అంటేనే స్వీట్ల పండుగ. అరిసెలు, పూతరేకులు, కొబ్బరి బూరెలు, కరకజ్జ, జంతికలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే. అయితే వీటికి సమయంతోపాటు, నైపుణ్యం కూడా కావాలి. అందుకే చాలా తేలిగ్గా, తక్కువ సమయంలో, చాలా తక్కువ పదార్థాలతో చేసుకునే స్వీట్ గురించి తెలుసుకుందాం. ఎల్లు చిక్కీ. అంటే నువ్వులు ( తెల్లవి, నల్లవి) బెల్లంతో కలిపి తయారుచేసుకునే రుచికరమైన , క్రిస్పీ స్వీట్. ఎల్లు అంటే తమిళంలో నువ్వులు అని అర్థం. నువ్వుల చిక్కిని ఎల్లు మిట్టై, నువ్వుల బర్ఫీ,టిల్ చిక్కి అని కూడా అంటారు. ఇందులో జీరో షుగర్ , జీరో ఆయిల్ అన్ని వయసుల వారికి పర్ఫెక్ట్గా హ్యాపీగా తినవచ్చు ముఖ్యంగా నువ్వులు పెరుగుతున్న పిల్లలకు మంచి శక్తిని ఇస్తాయి. వృద్ధులు, మహిళల ఆరోగ్యం కోసం ఎల్లు చిక్కీని నెలకోసారి చేసుకుని రోజూ కనీసం ఒక్క పట్టీ అయినా తినాలి. కావలసిన పదార్థాలు నువ్వులు – పావు కేజీ; బెల్లం – పావు కేజీ; నెయ్యి –కొంచెం ఎలా చేసుకోవాలి? నువ్వులను మందపాటి పెనంలో వేసి సన్నమంట మీద వేయించాలి. చిటపట పేలడం మొదలు పెట్టిన తర్వాత కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అపుడు స్టవ్ ఆపేసి పెనం పక్కన పెట్టి చల్లారనివ్వాలి. మరొక పాత్రలో బెల్లంతోపాటు, కొద్దిగి నీళ్లు వేసుకుని, మరిగేవరకు మీడియం మంట మీద ఉంచాలి. కరిగిన తర్వాత మంట తగ్గించి పాకం వచ్చే వరకు ఉడికించాలి. పాకం వచ్చిన తర్వాత అందులో నువ్వులు, నెయ్యి వేసి కలపాలి. ఒక వెడల్పాటి ప్లేట్‌కు నెయ్యి రాసి బెల్లం, నువ్వుల మిశ్రమాన్ని వేసి పూరీల కర్రతో అంతటా ఒకేమందం వచ్చేటట్లు వత్తాలి. వేడి తగ్గిన తర్వాత చాకుతో ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి వేరు చేసి గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకుంటే నాలుగు వారాల పాటు నిల్వ ఉంటాయి. వేరుశెనగలను కూడా కలుపుకొని కూడా కావాలంటే లడ్డూల్లా కూడా తయారు చేసుకోవచ్చు. వీటిల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పెద్దగా నెయ్యి అవసరం పడదు. ఎల్లు చిక్కీ లాభాలు ఫైబర్ కంటెంట్ ఎక్కువ మలబద్దకాన్ని నివారిస్తుంది, వాపులను తగ్గిస్తుంది పొత్తికడుపు కొవ్వును కరిగిస్తుంది. ఎనర్జీ బూస్టర్, జీర్ణ ఆరోగ్యం -
TS: సంక్రాంతికి 4వేల స్పెషల్ బస్సులు
హైదరాబాద్, సాక్షి: సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం 4 వేల ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. శుక్రవారం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నేతృత్వంలో TSRTC అధికారులతో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహాలక్ష్మీ స్కీమ్ కింద ఉచిత ప్రయాణం.. ఈ బస్సులకూ వర్తించేలా ఈ సందర్భంగా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా 4 వేల 484 బస్సులు అదనపు బస్సులు నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. ఇందులో 626 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. జవనరి 7 నుంచి 15వ తేదీ దాకా ఈ బస్సులు నడవనున్నాయి. బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని.. సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయని తెలిపారాయన. అలాగే.. సంక్రాంతి పండగకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతుందని స్పష్టత ఇచ్చింది. ఈ సమీక్షలో ఈడీలు, జిల్లాల రీజినల్ మేనేజర్లు పాల్గొన్నారు. -
రంజుగా.. రారాజులా పెరిగి...కట్ చేస్తే..!
జనవరి వచ్చిందంటే చాలు సంక్రాంతి హడావిడి మొదలవుతుంది. పుట్టింటికి ఎపుడు పోదామా అని కొత్త పెళ్లి కూతుళ్లు ఎదురుచూస్తూ ఉంటారు. అటు కొత్త అల్లుళ్ళ మంచీ మర్యాదకోసం అత్తగారిళ్లు సిద్ధమవుతుంటాయి. రకరకాల పిండివంటల తయారీలో మునిగిపోతారు మహిళలు. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు అబ్బో.. సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎంత నిర్బంధం, ఆంక్షలున్నా కోడి పందాల సందడి మాత్రం మామూలుగా ఉండదు. సంక్రాంతి పండుగ మూడ్రోజుల పాటు కోస్తాకుర్రాళ్లలో కోడి పందాల జోష్ రేంజే వేరు. గతంలో సరాదాగా సాగిన ఈ వ్యవహారం ఇపుడు కోట్లాది రూపాయల వ్యాపారంగా మారిపోయింది. ఈ కోడి పందాల కథా కమామిష్షు ఏంటో ఒకసారి చూద్దాం. కోడి పందాలు, పందెం కోళ్లు కోడిపందెం అంటే.. స్పెషల్‌గా పెంచిపోషించిన, శిక్షణ ఇచ్చిన రెండు కోడి పుంజులు హోరాహోరీగా పోట్లాడుకోవడం. ఊపిరి ఆగేదాకా కాలు దూసి పోరాడటం. కాళ్లకు కట్టిన పదునైన కత్తులు దిగుతున్నా.. రక్త మోడుతున్నా వెన్ను చూపకూడదు. విజయమో వీర స్వర్గమో అన్నట్టు అయితే ప్రత్యర్థిని పడగొట్టాలి.. లేదంటే తన ప్రాణం పోవాలి. అదీ పందెం. కోడి పుంజులకు శిక్షణ ఇంత పకడ్బందీగా పందెం సాగాలి అంటూ ఏంతో కొంత ట్రైనింగ్ ఉండాలిగా. ప్రత్యర్థికి దీటుగా బలిష్టంగా ఉండాలిగా. అందుకే మరి పందెంకోళ్లకు ప్రత్యేక శిక్షణతోపాటు బలవర్ధక ఆహారాన్ని కూడా అందిస్తారు. అయితే ఇందులో పందేనికి పనికి వచ్చే పుంజు(మగకోళ్లను) గుర్తించడం ఒక కళ. ఇక్కడే తొలి అడుగు పడుతుంది. ఈకల రంగుని బట్టి కోడిపుంజు రకాలను, జాతులను గుర్తిస్తారు. నల్ల ఈకలున్న పుంజును “కాకి” అని, తెల్లని ఈకలు ఉంటే దానిని “సేతు” అని, మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటే దానిని “పర్ల” అని, నల్లగా ఉండి, రెండు మూడు ఈకలు ఉన్న పుంజును కొక్కి రాయి అని దీనికి పెద్ద పురాణమే ఉంది. ముఖ్యంగా ఈకలు మొత్తం ఎర్రగా ఉంటే డేగ అని, రెక్కల పై లేదా వీపుపై పసుపు రంగు ఈకలు ఉంటే దానిని “నెమలి” అని పిలుస్తారు. ఇంకా మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో సమానంగా ఉంటే దానిని “కౌజు” అని పూల, నల్లబోర, ఎర్రపొడ, గేరువా లాంటివి ఇందులో ఉన్నాయి. డేగ, నెమలి, కాకి కోడి పందేలకు సంబంధించి డేగ, కాకి, నెమలి రకాలు పాపులర్. ఇలా తమకు నచ్చిన పందెం కోళ్లను గుర్తించి, వాటిని ప్రత్యేక షెడ్లలో సకల సదుపాయాలతో పెంచుతారు. ఉదయం లేచింది మొదలు వ్యాయామం, తైలాలతో మసాజ్‌లు, దాణా దాకా అన్నీ రాచమర్యాదలే. రోజుకు రెండు పూటలా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించిన అనంతరం పిస్తా, బాదం, జీడి పప్పు అక్రూట్ లాంటి డ్రైఫూట్స్ తినిపిస్తారు. మధ్యాహ్నం , సాయంత్రం తృణధాన్యాల, డ్రై ఫ్రూట్స్‌తో దాణా పెడతారు.అంతేకాదు కొద్దిగా మద్యాన్ని కూడా పోస్తారట. దీంతో పౌరుషానికి ప్రతీకగా, పందేనికి సిద్ధం అన్నట్టు తయారవుతాయి. కుక్కుట శాస్త్రం (కోళ్ల పంచాంగం) మనుషులకు పంచాంగం ఉన్నట్టు కోళ్లకూ ఉంది మరి. అదే కుక్కుట శాస్త్రం. కోడిని సంస్కృతంలో కుక్కుట అంటారు అలా ఈ కోళ్ల పంచాంగానికి కుక్కుట శాస్త్రం అని పేరు వచ్చింది. తిధి, వార,నక్షత్రాలు, కోళ్లపై గెలుపోటముల ప్రభావం చూపుతాయని నమ్ముతారు. కుక్కుట శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలు వివిధ రకాల కోడిపుంజులపై వివిధ రకాల్లో ప్రభావం చూపుతాయట. వారం, తిధి, దిశ,నక్షత్ర బలంతోపాటు, తమ జాతకం బలానికి, కోడి జాతక బలంకూడా తోడైతే ఇక గెలుపు మాదేనని నమ్ముతారు పందెం రాయుళ్లు. చివరకు మిగిలేది చుట్టూ వేలాదిమంది గుమిగూడగా, యుద్ధ క్షేత్రంలోకి దిగుతాయి. యజమాని పట్ల విశ్వాసంతో, బాస్ నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్నట్టు రంగంలోకి దిగుతాయి. రక్తం చిందించి మరీ పోరాడతాయి. ఈ క్రమంలో నెగ్గితే..వైభోగం. లేదంటే పరలోకం. అప్పటిదాకా రాజభోగాలు అనుభవించి, నేనే రాజు అన్నట్టుగా ఎదిగిన పుంజు కాస్తా.. చివరికి మందులోకి నంజులాగానో, అల్లుడుగారికి విందుగానో మారిపోతుంది.