తాడేపల్లిగూడెం: మా నవులకు శాస్త్రాలు, పంచాంగాలు, ఉన్నట్టే కోళ్లకు ప్రత్యే క పంచాంగం ఉంది. బరిలో ఏ రంగు కోడి గెలుస్తుంది? ఏ రంగు కోడి ఓడిపోతుంది? ఇవన్నీ కుక్కుట శాస్త్రంలో ఉంటాయి. పందేలు వేసే వారికి కుక్కుట శాస్త్రం ఒక ఆయుధమని పందేల ఔత్సాహికులు చెబుతూ ఉంటారు. కాబట్టి కుక్కుట శాస్త్రం ప్రకారం ఈ సంక్రాంతి ఏయే రకాల కోడి పుంజులు బరిలో గెలుస్తాయనే అంచనాలు వేస్తున్నారు.
కోడిపుంజును సంస్కృతంలో కుక్కుటం అంటారు. రాచరికాల కాలంలో పౌరుషాలకు చిహ్నంగా కోడి పందేలు సాగేవి. ప్రస్తుత రోజుల్లో సంప్రదాయాల్లో భాగంగా సంక్రాంతికి కోడిపందేలు జరగడం ఆనవాయితీగా మారింది. పందేల మోజు నేపథ్యంలో పుంజుల పెంపకం దగ్గర నుంచి పందేల వరకూ ప్రజల విశ్వాసాల మాదిరిగానే కోడి పందేలలో పంచాంగం, నక్షత్రాల ప్రభావం పడింది. దీన్ని నుంచి వచ్చిందే కుక్కుట శాస్త్రం. ఈ శాస్త్రంలో కోడి ఈకల రంగును కొట్టి పుంజుల పేర్లను వర్గీకరించారు.
నక్షత్రాలకు అనుగుణంగా గెలుపోటములు
ఈ ఏడాది సంక్రాంతిలో ముఖ్యంగా మూడు రోజుల నక్షత్రాలను పరిశీలిస్తే భోగి రోజున ధనిష్ట నక్షత్రానికి పసుపు రంగు డేగ, సంక్రాతికి శతభిషం కాకి, కనుమ పూర్వాభాద్ర నెమలి రంగు కోళ్లు విజయం సాధించే అవకాశం ఉందని పందెంరాయుళ్లు చెబుతున్నారు.
దిశలకు అనుగుణంగా పందేలు
ఆదివారం ఉత్తర దిశ, సోమవారం దక్షిణ దిశ, మంగళవారం తూర్పు ముఖంగా పందేలు వేస్తే విజయం సాధిస్తాయని పందెంరాయుళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బరిలోకి పెరూ పుంజులు
దేశవాళీ పందేలకు ఈసారి బరిలో పెరూ జాతి పుంజులు దింపుతున్నారు. భారతీయ పుంజులతో పెరూ పెట్టలను సంకరపర్చి ఓ జాతిని అభివృద్ధి చేశారు. ఇవే పెరూ పుంజులుగా ప్రాచుర్యం పొందాయి. పుంజులకు ఈ సారి నాస్తా లడ్డు పేరిట ఆయుర్వేద గుళికలు ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment