
కొయ్యలగూడెం/రాజానగరం: సంక్రాంతి రోజుల్లో కొత్త అల్లుళ్లకు చేసే మర్యాద అంతా ఇంతా కాదు. ఈ విషయంలో గోదారోళ్లకు పెట్టింది పేరు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం, రాజవరం గ్రామానికి చెందిన కాకి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతుల కుమార్తె జ్యోత్స్నకు విజయవాడకు చెందిన చీమకుర్తి శ్రీమన్నారాయణ, దీప్తి కుమారుడు లోకేశ్ సాయితో ఇటీవల వివాహం జరిగింది. సంక్రాంతికి కొత్త అల్లుడిని 225 రకాల తినుబండారాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగను ఇంత సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.
150 రకాలతో..
తూర్పు గోదావరి జిల్లా రాజానగరానికి చెందిన చవ్వా నాగ వెంకట శివాజీ సంక్రాంతి పండగకు వచ్చిన అల్లుడు రిషీంద్రకు అత్తమామలు సునీతరాణి, శివాజీ 150 రకాలతో ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేశారు.