
తాడేపల్లి: ద్వారకాతిరుమల మండలంలోని సీహెచ్ పోతేపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్‌రావు(రాజబాబు) మృతిపై ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు, సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. రాజబాబు మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.
రాజబాబు శనివారం రాత్రి మృతి చెందారు. ఇటీవల బాత్‌రూమ్‌లో కాలుజారి పడిపోవడంతో ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. కొద్దిరోజుల పాటు లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన, శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యులు వారం రోజుల క్రితం ఆయన కాలికి శస్త్రచికిత్స చేశారు.
ఈ నెల 12న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వాల్సి ఉండగా, అదే రోజు ఉదయం 11.30 గంటల సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు వెంటిలేటర్ సాయంతో వైద్యం చేస్తూ వచ్చారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. రాజబాబు మృతి చెందడంతో మండలంలోని పార్టీ శ్రేణులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment