దౌర్జన్యాలు.. దొంగ ఓట్లు | TDP Leaders of Misconduct in MLC Elections: Andhra pradesh | Sakshi
Sakshi News home page

దౌర్జన్యాలు.. దొంగ ఓట్లు

Published Fri, Feb 28 2025 4:52 AM | Last Updated on Fri, Feb 28 2025 4:52 AM

TDP Leaders of Misconduct in MLC Elections: Andhra pradesh

పిఠాపురంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీడీపీ నేత

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీల నేతల అక్రమాలు 

పోలింగ్‌ బూత్‌లోనే ఓటర్లకు డబ్బుల పంపిణీ

ఉత్తరాంధ్రలోనూ అదే తీరు.. గుడ్లప్పగించి చోద్యం చూసిన పోలీసులు.. పల్నాడులో పీడీఎఫ్‌ ఏజెంట్లను తరిమేసిన వైనం 

పెదవేగిలో పీడీఎఫ్‌ ఏజెంట్‌పై కూటమి నేతల దాడి 

పోలింగ్‌ కొనసాగుతుండగా బూత్‌ల వద్ద కూటమి నేతల ప్రచారం  

బాపట్ల మున్సిపల్‌ పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో యథేచ్ఛగా రిగ్గింగు.. అడ్డుకున్న సీఐటీయూ నేత.. పోలీసుల ఎదుటే పీడీఎఫ్‌ నేతలపై దాడి 

భట్టిప్రోలులోనూ పీడీఎఫ్‌ ఏజెంట్‌పై టీడీపీ నేతల దాడి 

పీవీపాలెం, అడవులదీవి, బాపట్ల, రేపల్లె ప్రాంతాల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బూత్‌ల వద్ద టీడీపీ ఎమ్మెల్యేల హల్‌చల్‌ 

చివరిలో గుంపులుగా వెళ్లిన దొంగ ఓట్ల బ్యాచ్‌లు.. 

ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గంలో 92.40 శాతం..

ఉభయగోదావరి, కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో 60 శాతం దాటిన పోలింగ్‌  

కేవలం ఎనిమిది నెలల్లోనే ప్రజా వ్యతిరేకత.. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలుకు నోచుకోకపోవడానికి తోడు డీఎస్సీ ప్రకటించక పోవడం, గ్రూప్‌–2 అభ్యర్థులతో ఆటలాడుకోవడం.. తదితర కారణాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. దీంతో ఎలాగైనా సరే గెలవాలని సర్కారు పెద్దలు బరితెగించారు. వీరి కనుసైగతో పోలింగ్‌ బూత్‌లలోనే డబ్బులు పంచడం ఒక ఎత్తు అయితే.. బెదిరింపులు, దౌర్జన్యాలు, దొంగ ఓట్లు, ఏజెంట్లను తరిమేయడం మరో ఎత్తు. ఫలితంగా ఏకపక్ష పోలింగ్, రిగ్గింగ్‌. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదివరకెన్నడూ లేని నయా సంస్కృతి ఇది.

సాక్షి, అమరావతి/పిఠాపురం/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, విశాఖపట్నం/గుంటూరు ఎడ్యుకేషన్‌ : రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని కూటమి పార్టీలు రెచ్చిపోయాయి. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గం, ఉభయగోదావరి, కృష్ణ–గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని బరితెగించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదివరకెన్నడూ లేని రీతిలో యథేచ్ఛగా ఓటర్లను ప్రలోభపెట్టడానికి యత్నించాయి.

ప్రత్యర్థి అభ్యర్థుల ఏజెంట్లను పలు చోట్ల తీవ్రంగా బెదిరించి తరిమేశారు. ఏకపక్షంగా పోలింగ్‌ జరిపించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నియోజకవర్గంలో ‘ఓటుకు నోటు’ అంటూ వెదజల్లారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాలలోని 96, 97, 98 పోలింగ్‌ బూత్‌ల పక్కనే టీడీపీ నేతలు తిష్ట వేసి కూర్చున్నారు.

ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు డబ్బులు పంచారు. ‘డబ్బులు తీసుకోండి.. కూటమి అభ్యర్థికి ఓటు వేయండి’ అని కోరడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పక్కనే ఉన్న మున్సిపల్‌ కల్యాణ మండపంలో మండల టీడీపీ అధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్‌.. వచ్చిన ప్రతి ఓటరు వద్ద ఓటరు స్లిప్‌ తీసుకుని, సరి చూసి మరీ ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేశారు.

ఈ దృశ్యాలు టీవీ చానళ్లలో కూడా ప్రసారం కావడంతో రెవెన్యూ అధికారులు వారికి సమాచారం ఇచ్చి.. అక్కడికి వెళ్లారు. ఆలోపే టీడీపీ నేతలు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పాలన అంటూ చెప్పుకొస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఇలాకాలోనే ప్రజాస్వామ్యం ఇలా ఖూనీ కావడం చర్చనీయాంశమైంది. పోలింగ్‌ బూత్‌కు అతి సమీపంలో బహిరంగంగా డబ్బులు పంచినా ఎన్నికల అధికారులు, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడం దారుణం అని విమర్శలు వెల్లువెత్తాయి.  

లింగపాలెంలో దొంగ ఓట్లు
ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు పోలింగ్‌ కేంద్రాల వద్దకు పసుపు చొక్కాలు వేసుకువచ్చి డబ్బులు పంపిణీ చేశారు. పీడీఎఫ్‌ ఏజెంట్లపై దాడి చేశారు. చివరి రెండు గంటల్లో దొంగ ఓట్లు వేయించారు. పెదవేగి బూత్‌ నంబర్‌ 327లో పీడీఎఫ్‌ ఏజెంట్‌ గేదెల శివకుమార్‌పై కూటమి అభ్యర్థులు దాడి చేశారు.

లింగపాలెం మండలంలోని శింగగూడెం హైస్కూల్లో ఏర్పాటు చేసిన 277, 278 బూత్‌లలో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. అక్కడ పీడీఎఫ్‌ ఏజెంట్‌ సూర్యకిరణ్‌ను బెదిరించి మొబైల్‌ లాక్కుని బయటకు గెంటేశారు. హైదరాబాద్, బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల వివరాలను తీసుకుని చివరి నిమిషంలో ఓట్లు వేశారు. దీంతో మొత్తంగా మధ్యాహ్నం 2 గంటల సమయానికి 45.29 శాతం పోలింగ్‌ నమోదు కాగా, సాయంత్రం 4 గంటలకు 69.50 శాతం నమోదైంది. కేవలం 2 గంటల వ్యవధిలో 24.21 శాతం ఓటింగ్‌ పెరిగిందంటే దొంగ ఓట్ల వల్లేనని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశ్నించారని దౌర్జన్యం.. దాడులు
ఓటమి భయంతో బెంబేలెత్తిన అధికార పార్టీ నాయకులు బాపట్ల జిల్లాలో పలుచోట్ల దౌర్జన్యానికి దిగారు. రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. చాలాచోట్ల పీడీఎఫ్‌ పోలింగ్‌ ఏజెంట్లను బయటకు లాగే ప్రయత్నం చేశారు. యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. అడ్డుకున్న పీడీఎఫ్‌ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. బాపట్లలోని మున్సిపల్‌ పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో ఉదయం నుంచి అధికార పార్టీ నేతలు యథేఛ్చగా దొంగ ఓట్లు వేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులతో కలిసి పలుమార్లు పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి ఇష్టానుసారం దొంగ ఓట్లు వేశారు. టీడీపీ మహిళా నేత పోలింగ్‌ కేంద్రంలో మకాంవేసి దొంగ ఓట్ల వ్యవహారాన్ని పర్యవేక్షించారు.

సాయంత్రం నాలుగు గంటల సమయంలో పోలీసుల సహకారంతో పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి స్థానిక టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడి మిగిలిన ఓట్లు వేసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌కుమార్‌ వారిని అడ్డుకున్నారు. పోలింగ్‌ సమయం ముగిశాక టీడీపీ వారిని లోపలికి ఎలా అనుమతిస్తారంటూ పోలీసు అధికారులను నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావులతోపాటు మరికొందరు కలిసి పీడీఎఫ్‌ నాయకుడు అనిల్‌కుమార్‌పై దాడి చేశారు. 

ఇంత జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేదు. భట్టిప్రోలులో పీడీఎఫ్‌ ఏజెంట్‌ లింగం శ్రీనుపై టీడీపీ నాయకులు దాడిæచేసి కొట్టారు. కూటమి అభ్యర్థి ఆలపాటికి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను లింగం శ్రీను నిలదీశారు. దీంతో టీడీపీ వారు ఆయనపై దాడి చేశారు. ఆ తర్వాత దౌర్జన్యంగా ఓట్లు వేసుకున్నారు.

చుండూరులో కూటమి నేతలు దౌర్జన్యానికి దిగారు. పీడీఎఫ్‌ ఏజెంట్లను బయటకు లాగి రిగ్గింగు చేసేందుకు పలుమార్లు యత్నించారు. దీనిని పీడీఎఫ్‌ నేతలు అడ్డుకున్నారు. బాపట్ల, పిట్టలవానిపాలెం, అడవులదీవి, రేపల్లె, వేమూరుతోపాటు పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు పీడీఎఫ్‌ ఏజెంట్లను బయటకు పంపి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని పీడీఎఫ్‌ నేతలు ఆరోపించారు.

మా ఏజెంట్లను బూత్‌ల నుంచి వెళ్లగొట్టారు: లక్ష్మణరావు 
కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి భయంతో అక్రమాలకు తెగబడిందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావు ఆరోపించారు. గురువారం పోలింగ్‌ ముగిసిన అనంతరం గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లాలో అనేక చోట్ల తమ ఏజెంట్లను బయటకు పంపేశారని, వెల్దుర్తిలో పీడీఎఫ్‌ తరఫున నియమించిన ఏజెంట్‌ను అనుమతించలేదని అన్నారు.

దుర్గిలో ఏజెంట్‌ను బయటకు పంపడంతోపాటు బెల్లంకొండ ఏజెంట్‌ను అరెస్టు చేశారని చెప్పారు. ఇలా అనేక చోట్ల అధికార బలంతో తమ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు బూత్‌లలోకి ప్రవేశించి, హడావుడి సృష్టించారని, చీఫ్‌ ఏజెంట్లు, అభ్యర్థులు మినహా ఎమ్మె ల్యేలకు బూత్‌లలోకి వెళ్లేందుకు ఎటువంటి అధికారం లేద న్నారు. దొంగ ఓట్లు వేసేందుకు ముందుగానే పథకాన్ని సిద్ధం చేసుకున్న అధికార పార్టీ దానిని అమలు పర్చిందని ఆరోపించారు.

తెనాలిలోని కోగంటి శివయ్య మున్సిపల్‌ పాఠశాలతో పాటు అమరావతి, పెదకూరపాడు, పల్నాడు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దొంగ ఓట్లకు తెగబడిందన్నారు. సాధారణంగా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్‌ నమోదు కావడం సహజమేనని, పూర్తి వివరాలు వచ్చిన తరువాతే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. పల్నాడులోని పలు బూత్‌లలో 90 శాతం పోలింగ్‌ జరిగినట్లు నమోదైతే, అది కచ్చితంగా దొంగ ఓట్లు వేయించినట్లేనని స్పష్టం చేశారు.    పోలైన ఓట్లు, తదితర పూర్తి వివరాలు వచ్చిన తరువాత,  రీ పోలింగ్‌ కోసం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తామని చెప్పారు.  

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గం, ఉభయగోదావరి, కృష్ణ–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ జరిగింది. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గంలో సాయంత్రం నాలుగు గంటలకు 92.40 శాతంకుపైగా పోలింగ్‌ నమోదు కాగా, ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవర్గంలో 63.28 శాతం, కృష్ణ–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో 65.58 శాతం పోలింగ్‌ నమోదైంది.

నాలుగు గంటలు దాటిన తర్వాత కూడా లైన్లో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించడానికి అనుమతించడంతో తుది పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల సంఘం శుక్రవారం అధికారికంగా ప్రకటించనుంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీలో అత్యధిక మంది ఉండటంతో ఓటర్లు ముఖ్యంగా కొత్తగా నమోదు చేసుకున్న యువ ఓటర్లు ఓటు వేసే సమయంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. 

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అత్యధికంగా 35 మంది, ఉమ్మడి కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 25 మంది పోటీలో ఉండటంతో అభ్యర్థులకు ప్రాధాన్యతా నంబర్లు కేటాయించి బ్యాలెట్‌ పేపర్‌ మడత పెట్టి బ్యాలెట్‌ బ్యాక్స్‌లో వేయడానికి అయిదు నుంచి పది నిమిషాల సమయం తీసుకుంది.

దీంతో పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు క్యూలో చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. కొంత మంది ఓటర్లు తమకు నచ్చిన వ్యక్తి ఎదుట ప్రాధాన్య ఓటు సంఖ్య కాకుండా టిక్కులు పెట్టడంతో చెల్లని ఓట్లు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉండవల్లిలోని పోలింగ్‌ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నిరంతర పర్యవేక్షణ
పోలింగ్‌ సజావుగా నిర్వహించడానికి 6,287 మంది పోలీస్, 8,515 మంది పోలింగ్‌ సిబ్బందితో ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను లైవ్‌ వెబ్‌ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయడమే కాకుండా సచివాలయంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ పర్యవేక్షించారు. విజయవాడలోని పటమట హైస్కూల్, గుంటూరు జిల్లా ఉండవల్లిలోని పోలింగ్‌ కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.

పోలింగ్‌ ముగిసిన తర్వాత పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్‌ బాక్సులను కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్‌ స్థానం బ్యాలెట్‌ బాక్సులను ఏలూరు సీఆర్‌ రెడ్డి కళాశాల, కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్స్‌ బ్యాలెట్‌ బాక్సులను గుంటూరు ఏసీ కాలేజీ, శ్రీకాకుళం –విజయనగరం – విశాఖ టీచర్ల బ్యాలెట్‌ బాక్సులను ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పోలీస్‌ సిబ్బందితో నిరంతర నిఘాను ఏర్పాటు చేశారు. మార్చి 3న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపులో 70 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement