
ఒక సీటు కోసం టీడీపీ ఈ స్థాయికి దిగజారింది
సోషల్ మీడియాలో దుష్ప్రచారం బాగా నష్టం చేసింది
‘సాక్షి’తో పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లతో గెలిచిందని ఆ ఎన్నికలో ఓటమి పాలైన పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఒక సీటు కోసం ఈ స్థాయికి టీడీపీ దిగజారిపోతుందని ఊహించలేదన్నారు. మంగళవారం ‘సాక్షి ప్రతినిధి’తో లక్ష్మణరావు మాట్లాడుతూ.. దొంగ ఓట్లు గణనీయంగా పని చేశాయన్నారు.
ఆలపాటి పేరుకు ముందు వేసిన ఒకటి అనే అంకె దాదాపు 50కిపైగా బ్యాలెట్ పత్రాలపై ఒకేలా కనబడిందని, ఈ ఓట్లన్నీ ఒక్కరే వేసినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో 91 శాతం, దాచేపల్లిలో 88 శాతం, వినుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 80% కంటే ఎక్కువ ఓట్ల శాతం నమోదయ్యాయన్నారు. గుంటూరు జిల్లా తెనాలి, కృష్ణా జిల్లాలోని పలుచోట్ల, ఏలూరు జిల్లాలోని కైకలూరు, నూజివీడులలో దొంగ ఓట్లు, బ్యూత్ క్యాప్చరింగ్‌లు జరిగాయని ఆరోపించారు. నూజివీడులో ముందు రోజున ఓటర్లకు వాల్‌క్లాక్‌లు పంపిణీ చేసిన సంగతి గుర్తు చేశారు.
రిగ్గింగ్‌కు పాల్పడ్డారు
పలు పోలింగ్ బూత్‌లలో టీడీపీ అభ్యర్థి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని లక్ష్మణరావు ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో పీడీఎఫ్ తరఫున ఏజెంట్‌ను కూడా కూర్చొనివ్వలేదని చెప్పారు. దుర్గిలో గంటలోపే ఏజెంట్‌ను బయటకు నెట్టేశారన్నారు. బెల్లంకొండలో ఏజెంట్‌ను బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారని, తాను అమరావతి పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు ఆ కేంద్రం గేటు వద్ద 200 మంది టీడీపీ నేతలు టెంట్‌లో ఉన్నారని, వారంతా యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారని పేర్కొన్నారు.
అనేకచోట్ల ఎమ్మెల్యేలు బూత్‌లలోకి వెళ్లి అక్కడ చాలా సమయం గడిపి ఓటింగ్‌ను ప్రభావితం చేశారన్నారు. ఎన్నికలు సజావుగా జరగలేదని, అధికార పార్టీ తన పరపతిని ఉపయోగించి ఓటింగ్‌ను ప్రభావితం చేసిందన్నారు. జరిగిన అక్రమాలపై ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు చెప్పారు. ఎన్నికల సంఘం స్పందించలేదన్నారు. డిగ్రీ చదవని వారిని కూడా పెద్దఎత్తున ఓటర్లుగా నమోదు చేయించారన్నారు.
భారీ ఎత్తున దొంగ ఓట్లు సైతం వేయించారన్నారు. ఓటువేసే సమయంలో గుర్తింపు కార్డు చూపించకుండానే ఓటర్లను లోపలికి అనుమతించారని ఆరోపించారు. పెనమలూరు వద్ద ఒకే పేరుతో 42 ఓట్లు, మరోచోట ఒకే పేరుతో 10 ఓట్లు నమోదయ్యాయని గుర్తు చేశారు. తెనాలిలోని కోగంటి శివయ్య స్కూల్ వద్ద కూడా ఇదేవిధంగా జరిగిందని, దీనిపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారనన్నారు.
ఒక ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రానికి వెళితే ఓ సీఐ ‘సర్.. మీరు వెళ్లండి. ఇక్కడ అంతా మేం చూసుకుంటాం’ అని చెప్పిన విషయాన్ని రికార్డు చేసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అనైతికంగా సోషల్ మీడియాలో చివరి నాలుగు రోజులు విపరీతమైన దుష్ప్రచారం చేశారని లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment