
సాక్షి,తాడేపల్లి: సింహాచలం ఘటన ఎంతో బాధాకరమని.. దేవుడి పేరుతో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే వీరి పాపాలు పరాకాష్టకు చేరుకున్నాయనిపిస్తోందంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడి పేరుతో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నారని.. చంద్రబాబు ఎప్పుడు అడుగుపెట్టినా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయని లక్ష్మీపార్వతి అన్నారు.
‘‘తనను తాను నాస్తికుడిగా చంద్రబాబు ఎప్పుడో చెప్పాడు. ఇలాంటి వన్నీ చూసినప్పుడు ప్రత్యక్షంగా ప్రకృతి ప్రకోపిస్తోంది. 2014లో 40 ఆలయాలను కూలగొట్టించింది చంద్రబాబే.. అయినా చంద్రబాబు గొప్పవాడని బీజేపీ వెనకేసుకొస్తోంది. వైఎస్ జగన్ కులమతాలకు అతీతంగా పాలన అందించారు. అది నచ్చక జగన్‌పై బురద చల్లారు. తన మనుషులతో ఆలయాలపై దాడులు చేయించి జగన్‌పై నెట్టేశారు. తిరుపతి లడ్డూని రాజకీయాలకు వాడుకుని మహాపాపం చేశారు. లడ్డూని అపవిత్రం చేయాలని చంద్రబాబు, పవన్ ఎంతో ప్రయత్నం చేశారు’’ అని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు
‘‘దేవుడు ఇలాంటి వన్నీ చూస్తూ ఉంటాడు. ఇన్నేళ్ల చరిత్రలో తిరుపతిలో తొక్కిసలాట ఏనాడైనా జరిగిందా?. గోదావరి పుష్కరాల తొక్కిసలాట.. తిరుపతి తొక్కిసలాట.. గోవుల మృతి ఇవన్నీ చంద్రబాబు సమయంలోనే జరుగుతాయి. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు.. మా దోపిడీ మాకు ముఖ్యం అనేలా ఈ ప్రభుత్వ తీరు ఉంది. మూడు రోజుల క్రితం గోడకట్టడమేంటి?. ముందే కట్టొచ్చుకదా. వీళ్లలాంటి అవినీతి పరులకే పనులు అప్పగించారు.. అందుకే ఇలా జరిగింది’’ అని లక్ష్మీపార్వతి ఆరోపించారు.

‘‘అర్హత లేని వాళ్లు అందలం ఎక్కితే ఇలాంటివే జరుగుతాయి. బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం అందించాలి. తిరుమతి తొక్కిసలాట విచారణ ఏమైంది?. చంద్రబాబు నీ జీవితం ఇంకెప్పుడూ మారదా?. నీ మార్గంలోనే నీ కొడుకును తీసుకెళ్లాలనుకుంటున్నావా?. ప్రజలు ఏమీ చేయలేనప్పుడు ప్రకృతి తిరగబడుతుంది. పవన్ సనాతన వేషాలు ఇప్పటికైనా మానుకో.. చంద్రబాబు అతని కొడుకు వంటి వాళ్లు అధికారంలో ఉంటే ప్రజలకు రక్షణ ఉండదు. ఎన్నికల ముందు చిన్న చిన్న రోడ్లలో మీటింగ్‌లు పెట్టి ప్రజల చావుకు కారణమయ్యారు. చంద్రబాబు అంటేనే మనుషులను చంపడమా?. ఈకుల, మత పిచ్చేంటి... చంద్రబాబు ఒక్కరోజైనా మనిషిగా బ్రతకండి. చంద్రబాబు,పవన్ అడుగుపెట్టిన నాటి నుంచి ఇలాంటి అపశ్రుతులే చోటుచేసుకుంటున్నాయి’’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.