
విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు ఏడాది పాలనలోనే దారుణమైన పరిస్థితులు.. అదీ ఆలయాల్లో చూడాల్సి వస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సింహాచలంలో గోడ కూలిపోయి ఏడుగురు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఇలాగే చేశారు. నాడు తిరుపతిలో జరిగిన తోపులాటలో ఆరుగురు చనిపోయారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో ఈ ప్రభుత్వానికి తెలీదా?. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించారు. కనీస సౌకర్యాలు కూడా లేవని భక్తులు చెబుతున్నారు.

ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. రెండు రోజుల కిందట పూర్తి చేశారు. పదడుగుల ఎత్తు.. డెబ్బై అడుగుల పొడవుతో గోడ కట్టారు. కనీసం ఎటువంటి టెండర్లు లేకుండా ఈ గోడ పని పూర్తి చేశారు. దాదాపుగా సంవత్సరం అయ్యింది చంద్రబాబు అధికారంలోకి వచ్చి. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకి తెలియదా?. జరుగుతుందని తెలిసి కూడా ముందే గోడ కట్టే కార్యక్రమం చేపట్టలేకపోయారు?. ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు. మంత్రుల కమిటీ ఏం చేసిందసలు?. కాంక్రీట్ గోడతో కట్టాల్సిన చోట.. ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించారు. కనీసం నాణ్యంగా ఆ గోడను ఎందుకు నిర్మించలేకపోయారు?. వర్షం పడిందని తెలుసు. చందనోత్సవం సందర్భంగా ప్రతీసారి వర్షం పడుతుందని తెలుసు. అయినా రెండు రోజుల కిందట కట్టిన ఆ గోడ పక్కనే క్యూ లైన్ పెట్టారు.

చంద్రబాబు ఏడాది పాలనలో దారుణాలు చూడాల్సి వస్తోంది. రాజకీయాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు. తొక్కిసలాట ఘటనలో ఏడుగురిని బలిగొన్నారు. తిరుమల గోశాలలో గోవులు కూడా చనిపోయాయి. కాశినాయన గుడిని బుల్డోజర్లతో కూల్చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఆలయంలో తాబేళ్లు మృతి చెందాయి. అంతకు ముందు గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్నారు. ఇన్ని జరుగుతున్నా చర్యలు లేవు. ఎందుకంటే అన్నింటిలోనూ చంద్రబాబే దోషి. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఈ ఘటనలోనూ నిందను మాపైకి నెట్టే యత్నం చేశారు. కానీ, వాళ్ల హయాంలో.. అదీ రెండు రోజుల కిందటే ఆ గోడ కట్టిందని తేలింది. అయినా చంద్రబాబులో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించడం లేదు.

ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి. మొక్కుబడిగా రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. జగన్ వస్తున్నాడనే ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం తప్పిదం కాబట్టి పరిహారం పెంచి ఇవ్వాలి. మా ప్రభుత్వంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే.. బాధ్యతగా అధిక పరిహారం చెల్లించాం. ఈ బాధిత కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం వచ్చాక ఆ పని తప్పకుండా చేస్తాం’’ అని వైఎస్ జగన్ ప్రకటించారు. కానీ, బాధ్యులపైనా కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి పునరావృతం కావని చంద్రబాబుకి వైఎస్ జగన్ హితవు పలికారు.