
గుంటూరు, సాక్షి: కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం(Red Book Constitution)తో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రశ్నించే స్వరం ఉండకూడదనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. అయితే ప్రతి చర్యకు ప్రతి చర్య తప్పక ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారాయన. గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తమకే కావాలని చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అధికార అహంకారం చూపుతున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికలు మొన్ననే 57 చోట్ల జరిగాయి. గెలిచే వాతావరణం లేక 7 చోట్ల ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారు. 50 చోట్ల ఎన్నిక జరిగితే 39 చోట్ల వైఎస్సార్‌సీపీనే గెలిచింది. పార్టీ శ్రేణులు, నాయకులు తెగింపుతో గట్టిగా నిలబడి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు మన పార్టీ కేడర్‌ను ఏమీ చేయలేకపోయారు.
.. అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ(YSRCP) స్వీప్ చేసింది. అలాంటి చోట్ల బలం లేకపోయినా చంద్రబాబు అధికార అహంకారం చూపారు. పోలీసులను వాచ్‌మెన్లకంటే ఘోరంగా వాడుకున్నారు. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలో 10కి 9 చోట్ల గెలిచాం. మరి అక్కడ గెలవాల్సింది వైఎస్సార్‌సీపీ కదా?. అక్కడ ఎన్నికను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలకు భద్రత ఇవ్వాల్సింది పోయి, పోలీసులే ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు చేశారు.
రామగిరి ఎస్సై(Ramagiri SI) ఎంపీటీసీల వాహనం ఎక్కాడు. వీడియో కాల్‌లో ఎమ్మెల్యేతోనూ, ఎమ్మెల్యే కుమారుడితోనూ బెదిరించారు. టీడీపీకి అనుకూలంగా ఓటేయమని బెదిరించారు. మన పార్టీ ఎంపీటీసీలు ఎన్నిక సమయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వేరే మండల కేంద్రానికి తీసుకెళ్లి బైండోవర్ చేసే కార్యక్రమం చేశారు. దీనికి వ్యతిరేకంగా ధర్నాచేస్తే మన పార్టీ జిల్లా అధ్యక్షురాలి మీద, ఇన్‌ఛార్జిమీద కేసులు పెట్టారు. దీని తర్వాత మన పార్టీ తరఫున యాక్టివ్‌గా ఉన్న లింగమయ్యను హత్యచేశారు. ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది? అని జగన్ ప్రశ్నించారు.
ప్రజలు ప్రశ్నిస్తారని చంద్రబాబుగారు, ఆయన పార్టీ దారుణాలకు దిగుతోంది. ప్రశ్నించే స్వరం ఉండకూడదని రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. కానీ, ప్రతి చర్యకు, ప్రతి చర్య ఉంటుంది. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడితే.. అంతే వేగంతో అది పైకి లేస్తుంది. ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారు. ఏపీ, తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చే తీర్పులు చూశాం. ఈపక్కన ప్రజలు తంతే.. ఆ పక్కన పడతారు. చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి అని ఉమ్మడి కర్నూలు కేడర్‌ను ఉద్దేశించి వైఎస్ జగన్ అన్నారు.