
- వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం
- హెలికాఫ్టర్ విండ్‌షీల్డ్ ధ్వంసంపై అనుమానాలు
- కుట్రపూరితంగానే పోలీస్ భద్రతను తొలగించారా?
- వైఎస్ జగన్ భద్రతపై ప్రతిసారీ ఇదే నిర్లక్ష్యం
- మండిపడ్డ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో తాజా ఘటనే సాక్ష్యమని వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో రోజురోజుకీ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. తాము జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనకు సంబంధించి రెండు రోజులు ముందుగానే సమాచారమిచ్చామని, ఈ ప్రభుత్వం ఏ విధంగా పాలన చేస్తుందో అర్థమవుతుందని మండిపడ్డారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘ హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. రామగిరిలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండ్ షీల్డ్ విరిగిపోయింది. ఇది మీ వైఫల్యం కాదా.. అసలు హెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం పైన అనేక అనుమానాలున్నాయ్.
వైఎస్ జగన్‌కు భద్రతను తగ్గించారు
దేశంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన నేత జగన్‌మోహన్‌రెడ్డి. పోలీసులు కనీస భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ భద్రత కుదించారు. ఆయన ఇంటివద్ద భద్రత కుదించారు. జగన్ పర్యటనల్లో సరైన భద్రత కల్పించడం లేదు. కూటమి నేతల ఆదేశాల మేరకే పోలీసులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయ్... పోతుంటాయ్ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. కానీ ఏపీలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు
మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది. కూటమి నేతల మాటలు విని తప్పులు చేసే వారిని విడిచిపెట్టం. ఇటీవల జగన్ పర్యటనల్లో భద్రత లోపం తేటతెల్లమైంది. మా కార్యకర్తలే రోప్ పార్టీగా మారి జగన్‌కు భద్రత కల్పించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యయుతమైన పాలన ఏపీలో కొనసాగడం లేదు వైఎస్సార్‌సీపీ వారిపై దాడులు జరుగుతున్నాయ్.. జగన్ భద్రత పై కేంద్రం జోక్యం చేసుకోవాలి. జగన్‌కు సరైన భద్రత కల్పించాలి.

అభిమానుల ముసుగులో అసాంఘికశక్తులు
హెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం పైన అనేక అనుమానాలున్నాయ్. మా పార్టీ కార్యకర్తల ముసుగులో ప్రత్యర్ధి పార్టీ వర్గీయులే ఈ పని చేసుంటారని మాకు అనుమానం జగన్ భద్రత పై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకమైన బాధ్యత తీసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. పోలీసులు నిస్పక్షపాతంగా పనిచేస్తే శాంతిభద్రతలు ఎందుకు లోపిస్తాయి. మేం పోలీసులందరినీ అనడం లేదు
పచ్చచొక్కాలేసుకున్న అధికారుల గురించి మాత్రమే మేం మాట్లాడుతున్నాం. తప్పుచేసిన వారిని మాత్రమే మేం చట్టం ముందు నిలబెడతామంటున్నాం. తప్పుచేసిన వారు తప్పించుకుపోలేరు గుర్తుంచుకోండి’ అంటూ హెచ్చరించారు లేళ్ల అప్పిరెడ్డి
ఇది చదవండి: