
సాక్షి, గుంటూరు: విశాఖ జిల్లా స్థానిక సంస్ధల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శాసనమండలి ప్రతిపక్షనేతగా ఎంపిక చేసినట్లు పార్టీ కేంద్రకార్యాలయం ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బొత్సకు ఆయన అభినందలు తెలిపారు.
విశాఖ జిల్లాలో జరిగిన స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. జడ్పీటీసీలు, ఎంపీటీసీల సహా స్థానిక సంస్థల సభ్యులందరూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు నాయకత్వంపై విధేయత, విశ్వాసంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి బొత్సను గెలిపించారన్నారు. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ గతిలేక అభ్యర్థులను కూడా పెట్టలేకపోయిందన్నారు.

ప్రస్తుతం పార్టీ కార్యాలయ బాధ్యతలతో పాటు శాసనమండలిలో ప్రతిపక్షనేతగా బాధ్యతలు నిర్వహిస్తున్న తాను.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శాసనమండలి ప్రతిపక్షనేతగా బొత్స సత్యనారాయణను నియమించాలని అధ్యక్షుడు ముందు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ విషయంలో మరలా తనను ఆలోచించుకోమని చెప్పినప్పటికీ.. సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణనే నియమించాలని కోరామన్నారు. ఈ నేపథ్యంలో తమ అభ్యర్ధనను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆమోదించారని అప్పిరెడ్డి తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తాను వైఎస్ జగన్ వెంటే ఉంటూ.. క్రమశిక్షణ కల్గిన కార్యకర్తల్లాగే పని చేశాన్నారు. తాను గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా వైఎస్ జగన్ వలనే నియమితుడయ్యానన్నారు. ఎమ్మెల్సీ పదవి కూడా ఆయన వలనే వచ్చిందన్నారు. అలాంటి అవకాశాలు వస్తూనే ఉంటాయని.. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పని చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment