
కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు.
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో పేదలంతా సంతోషంగా చదువుకోగలిగారని.. నేడు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగిందని. టీడీపీ కార్యకర్తలు ట్వీట్ చేస్తేనే మంత్రి లోకేష్ స్పందిస్తున్నారు’’ అని మేరుగు నాగార్జున మండిపడ్డారు.
‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక 11 లక్షల మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వారెవరూ లోకేష్‌కి కనపడటం లేదా?. నారా లోకేష్ ట్విట్టర్ కింగ్‌గా మారిపోయారు. జగన్‌ని కంసుడు మామ అంటూ ట్వీట్ చేసిన లోకేష్.. వాస్తవాలు తెలుసుకోవాలి.
..త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున రిలీజ్ చేయాలి. ఇప్పటికే రూ.2,800 కోట్లు బకాయిలు పడ్డారు. మేము గట్టిగా ఆందోళనలు చేస్తే రూ.700 కోట్లు రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. విద్యార్థులు కూలి పనులకు వెళ్లే పరిస్థితిని తెచ్చారు. యూనివర్సిటీలను సైతం నిర్వీర్యం చేశారు. పేదల చదువులపై చంద్రబాబుకు మనసు లేదు’’ అని మేరుగు ఆగ్రహం వ్యక్తం చేశారు.
