
గుంటూరు, సాక్షి: కూటమి పాలనలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ చేస్తున్న అరాచకాలను, అఘాయిత్యాలను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. మళ్లీ పగడ విప్పిన ఫ్యాక్షన్ రాజకీయానికి.. తాజాగా రాప్తాడులో బలైన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య ఉదంతంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏపీలో చట్టబద్ధపాలన లేదు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలమీద, నాయకులమీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు అధికారపార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేని పరిస్థితులు నెలకొన్నాయి. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన.
.. రామగిరి మండల ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది. రామగిరిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల(TDP Atrocities) దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించారు. అయినా పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ పైగా వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం.
లింగమయ్య కుటుంబానికి అండగా..
.. కురబ లింగమయ్య(Kuruba Lingamaiah) హత్యను ఖండిస్తున్నా. అధికారపార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. వారి దాడులను వ్యతిరేకించినందుకు వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ బీసీ కార్యకర్తను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారు. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. కురుబ లింగమయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు.
ఇదీ చదవండి: హత్య చేయించి పరామర్శకు వస్తారా?.. టీడీపీ ఎంపీకి చేదు అనుభవం