
టీడీపీ సరికొత్త నాటకం
గాదె తమ వాడంటూ మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు
ఎన్నికల్లో అధికారికంగా రఘువర్మకు టీడీపీ మద్దతు
కూటమి పార్టీ గుర్తులు, అధినేతల ఫొటోలతో ప్రకటనలు
సీఎం చంద్రబాబు, పవన్, లోకేశ్ ఆదేశాలతోనే అభ్యర్థిగా వర్మ పేరు ఖరారు
స్వయంగా ప్రకటించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
పోలింగ్ రోజు ఓటింగ్‌ను పరిశీలించిన కూటమి ఎమ్మెల్యేలు
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కొత్త రాగం
రఘువర్మ, గాదె ఇద్దరూ తమ వాళ్లేనంటూ వ్యాఖ్యలు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ, అధ్యాపక ఆచార్య మిత్రులకు విజ్ఞప్తి అంటూ.. తెలుగుదేశం, జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలంటూ ఈ నెల 26వ తేదీన అంటే పోలింగ్‌కు ముందు రోజున ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో చంద్రబాబు, పవన్‌తో పాటు లోకేశ్, పల్లా శ్రీనివాసరావు ఫోటోలు... ఆ పార్టీల గుర్తులతో భారీ ప్రకటనలు!!పాకలపాటిని గెలిపించండి అంటూ విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ, ఎమ్మెల్సీ చిరంజీవిలతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే గంటా స్పష్టంగా ఆ పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
‘రఘువర్మకే కూటమి మద్దతు’ అని విశాఖ టీడీపీ కార్యాలయంలో ఫిబ్రవరి 19వ తేదీన నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంగా ప్రకటించారు. సమావేశంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి, ఎమ్మెల్సీ చిరంజీవి కూడా పాల్గొన్నారు.
ఇవే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు అధికారికంగా రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పటమే కాకుండా ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి సమావేశాలు ఏర్పాటు చేశారు. తీరా ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ మంత్రి అచ్చెన్న కొత్త రాగం అందుకున్నారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము రఘువర్మ, గాదె శ్రీనివాసులునాయుడుకు మద్దతు ఇచ్చామన్నట్టు మాట్లాడారు. ‘‘మూడు జిల్లాల కార్యకర్తలందరికీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి.... స్పష్టంగా మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీనివాసులు నాయుడుకు వేయమని చెప్పారు. ఎవరు గెలిచినా మన వాళ్లేనని అన్నారు. ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీలో టీడీపీ ఓడిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ గెలుపును తమ ఖాతాలో వేసుకునేందుకు అచ్చెన్న ప్రయత్నం మొదలు పెట్టారు.
బుట్టలో వేసుకునే యత్నం...!
వాస్తవానికి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం నుంచీ గాదె శ్రీనివాసులు నాయుడుకే మెజార్టీ ఓట్లు పోలయ్యాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఉపాధ్యాయులు బుద్ది చెప్పారన్న అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా స్పష్టంగా వ్యక్తమవుతోంది. అటు సోషల్ మీడియాలోనూ, ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ తెలుగుదేశం, జనసేన పార్టీల తీరును ప్రజలు గట్టిగా వ్యతిరేకించారనే విషయం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది.
ఈ నేపథ్యంలో దీనిని డైవర్ట్ చేసే ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గాదె గెలుపు దిశగా వెళుతున్న సమయంలో ... నేరుగా ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఒక పోలీసు అధికారి ఫోన్ ద్వారా గాదెతో మాట్లాడినట్టు చెబుతున్నారు.
రఘువర్మ విజయానికి పనిచేయాలని పిలుపునిస్తున్న మంత్రి శ్రీనివాస్, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు, టీడీపీ ఎమ్మెల్యే అదితి తదితరులు
రఘువర్మకు అధికారికంగా మద్దతు ఇచ్చినప్పటికీ... మీకు రెండో ప్రాధాన్యత ఓటు వేయమని ఆదేశించామని... గాదె కూడా మనవాడే అని పార్టీ నేతలతో తాను చెప్పినట్టు సీఎం చంద్రబాబు వివరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్న గాదె తమ వాడేనని.... గెలిచిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారో చూడాలంటూ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment