aptf
-
ఎన్నికల విధుల్లో పక్షపాతం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ విధులు పురమాయించడంలో సంబంధిత అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. జిల్లాలో ఎన్నికల విధుల బాధ్యతల పురమాయింపు నిక్ సెంటర్ కోఆర్డినేటర్ శర్మ పరిధిలో ఉంటుంది. అయితే ఆయన ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి మినహాయింపు ఇవ్వాల్సిన అంధులు, వికలాంగులు తదితరులకు ఎలక్షన్ డ్యూటీ వేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఒక్కో పోలింగ్ బూత్‌లో పోలింగ్ అధికారి, మరో ఐదుగురు ఉద్యోగులను నియమించాల్సి ఉండగా సిబ్బంది కొరత చూపుతూ పోలింగ్ అధికారి, మరో నలుగురు ఉద్యోగులను మాత్రమే వేయటంతో పనిఒత్తిడి తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో 3,411 పోలింగ్ స్టేషన్లు జిల్లాలో 3,411 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో విధులు నిర్వహిం చేందుకు 16 మంది నోడల్ అధికారులను, 15 మంది రిటర్నింగ్ అధికారులను, 48 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను 334 మంది సెక్టార్ అధికారులను, 3,411 మంది పాటు బూత్ స్థాయి అధికారులను నియమించారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు నలుగురు ఉద్యోగులను నియమించారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఒక్కో పోలింగ్ స్టేషన్లో సుమారు 1,450 మంది ఓటర్లు రెండు ఓట్లు వేస్తారు. అంటే ఒక్కో పోలింగ్ స్టేషన్లో 2,900 ఓట్లు పడనున్నాయి. విధి నిర్వహణ మరింత కష్టమౌతుందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు మరో ఉద్యోగిని నియమించాలని కోరుతున్నారు. గంట కూడా విరామం లేకుండా.. అధికారులు చెప్పిన దాని ప్రకారం పోలింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులు కనీసం భోజనానికి కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వారు నిర్విరామంగా పనిచేయాల్సి ఉంటుంది. నిక్ సెంటర్ కోఆర్డినేటర్‌పై ఉద్యోగుల ఆగ్రహం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అంధులకు, వికలాంగులకు, గర్భిణులకు, 6 నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఎన్నికల విధులు వేయకూడదు. కానీ నిక్ సెంటర్ కోఆర్డినేటర్ శర్మ మాత్రం తన ఇష్టానుసారం విధులు వేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల విధులు కేటాయించిన వారిలో పై కేటగిరీల ఉద్యోగులు కూడా ఉన్నారు. దీనిపై సదరు అధికారిని ప్రశ్నిస్తే సిబ్బంది కొరత ఉన్నందున వారికి కూడా విధులు కేటాయించక తప్పడం లేదని అంటున్నారని వాపోతున్నారు. అన్ని అవయవాలూ సక్రమంగా ఉండి పూర్తి ఆరోగ్యంగా, వయసులో ఉన్న ఉద్యోగులు కూడా కొంతమందికి ఎన్నికల విధులు పడలేదని తెలుసుకుని ఇతర ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల విధుల నుంచి తప్పించుకోవాలనుకున్న ఉద్యోగులు సదరు అధికారిని నేరుగా కలిస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఆయనను వ్యక్తిగతంగా కలిసిన వారిలో సుమారు 500 మందికి ఎన్నికల విధులు పడలేదంటున్నారు. నిబంధనల మేరకు సడలింపు ఉన్న వారికి డ్యూటీ పడితే వారు కలెక్టర్‌ను కలిసి మినహాయింపు కోరవచ్చు. సడలింపు ఉన్నవారికి విధులు వేయరాదు నిబంధనల ప్రకారం ఎలక్షన్ డ్యూటీకి సడలింపు వర్తించే వారికి ఎట్టి పరిస్థితిలోనూ డ్యూటీ వేయకూడదు. వారికి డ్యూటీ వేయడం, తిరిగి వారు కలెక్టర్‌ను కలిసి తమ ఇబ్బంది చెప్పుకోవడం సమయం తీసుకునే ప్రక్రియ. ఈ నెల 28 లోపు వారికి కలెక్టర్ అందుబాటులో లేకపోతే ఆ తేదీన వారికి నియోజకవర్గాలు కూడా కేటాయించేస్తారు. అప్పుడు సడలింపు ఇవ్వడం అస్సలు కుదరదు. – షేక్ సాబ్జి, రాష్ట్ర అధ్యక్షుడు, యూటీఎఫ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలి రెండు ఎన్నికలూ ఒకేసారి ఉన్నప్పుడు సిబ్బందిని పెంచాల్సి ఉంది. సిబ్బంది కొరత ఉందని కొద్దిమందిని మాత్రమే నియమిస్తే వారిపై పనిభారం అధికమౌతుంది. అలాంటప్పుడు ప్రభుత్వమే జీతాలు ఇచ్చే కాంట్రాక్టు లెక్చరర్లు, విద్యా వలంటీర్లు, ఆశ వర్కర్లు, ఐఈఆర్పీ టీచర్లు వంటి వారిని కూడా ఎన్నికల విధుల్లోకి తీసుకుంటే, ఎన్నికలు సజావుగా ముగించవచ్చు. – గుగులోతు కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
– ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రఘురామిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఉపాధ్యాయ భవనంలో బుధవారం ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పీవీ మాధవ అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రఘురామిరెడ్డి మాట్లాడారు. టీచర్ల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ వి«ధానం రద్దు చేయాలన్నారు. బదిలీల్లో ప్రతిభ ఆధారిత పాయింట్లను తొలగించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగవరప్రసాద్ మాట్లాడుతూ క్రమబద్ధీకరణ పేరుతో పెద్ద ఎత్తున పాఠశాలలు మూసివేతకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఉప విద్యాశాఖ అధికారులుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పూర్వ ప్రధానకార్యదర్శి పరమేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన 10 నెలల పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నరసింహుడు మాట్లాడుతూ నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని సమీక్షించాలన్నారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు పీవీ మాధవ, ప్రధానకార్యదర్శి డి.ప్రభాకర్, గౌరవాధ్యక్షులు రామచంద్ర మాట్లాడుతూ మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు, అరియర్స్ చెల్లించాలన్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సబ్‌కమిటీ సభ్యులు అశోక్‌కుమార్, ముత్యాలప్ప, డేనియల్, సిరాజుద్దీన్, శ్రీనివాసులు, గాయిత్రి, నరసింహారెడ్డి, ప్రేమావతమ్మ, చంద్రకళ,హనుమప్ప, గోపాల్‌నాయుడు పాల్గొన్నారు. --- -
విద్యాసమస్యలపై సమగ్ర చర్చ జరగాలి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యాసమస్యలపై సమగ్ర చర్చ జరగాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పాత జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఏపీటీఎఫ్(1938) జిల్లా విద్యా వైజ్ఞానిక సభలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21 నుంచి 23 వరకు విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక మహాసభలకు జిల్లా నుంచి విద్యారంగ నిపుణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, నూతన విద్యావిధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, సీపీఎస్, తదితర అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. డాక్టర్ సీవీ సుబ్రహ్మణ్యం, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హదయరాజు, నాయకులు తిరుపతిరెడ్డి, శివరామిరెడ్డి, జుల్ఫీకర్ అలీ, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ పండిట్లను అప్‌గ్రేడ్ చేయాలి
మచిలీపట్నం : ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పండిట్లు, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లే పురపాలక సంఘ పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్లు, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు జి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ము నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 200 మందికిపైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో తొలివిడతగా పీఈటీ, పండిట్ పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించటం అభినందనీయమన్నారు. ఇదే విధానాన్ని పురపాలక సంఘ పాఠశాలల్లో అమలు చేయాలని కోరారు. సక్సెస్ పాఠశాలల్లో పురపాలక సంఘ పాఠశాలలు ఉన్నాయని వారు గుర్తుచేశారు. రాష్టోపాధ్యాయ సంఘం మచిలీపట్నంశాఖ అధ్యక్షుడు యువీ రాధాకృష్ణమూర్తి జీవో నెంబరు 144ను పురపాలక సంఘాల్లో అమలు చేయాలని ఒక ప్రకటనలో కోరారు. -
ఉద్యమ స్ఫూర్తి సన్నగిల్లుతోంది
ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. కోట్లు కుమ్మరించడం ప్రజాస్వామ్యానికి విఘాతం విద్యారంగాన్ని శాసిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రఘురామిరెడ్డి గుంటూరులో ముగిసిన ఏపీటీఎఫ్ రాష్ట్ర మహాసభలు గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల్లో ఉద్యమస్ఫూర్తి సన్నగిల్లుతోందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రఘురామిరెడ్డి పేర్కొన్నారు. గుంటూరు నగరం లాడ్జి సెంటర్లోని ఎల్ఈఎం ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగిన ఏపీటీఎఫ్ రాష్ట్ర 18వ విద్యా, వైజ్ఞానిక రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రై వేటు విద్యాసంస్థల ధాటికి ప్రభుత్వ విద్యారంగం కుదేలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యారంగాన్ని శాసిస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం సాధారణ ఎన్నికల మాదిరిగా రూ. కోట్లాది ఖర్చు చేయాల్సి విధంగా మారిపోయాయని, ఇది ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేసే విషయమన్నారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయడం తగదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం లక్షా 70 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్‌తో రాబోయే పదేళ్ళలో వారి సంఖ్య 50 వేలకు తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఉద్యమాలే ఊపిరిగా కొనసాగుతున్న ఏపీటీఎఫ్ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు ఉద్యమబాటలో పయనించాలని పిలుపునిచ్చారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. పాండురంగ వరప్రసాద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంతో భవిష్యత్‌లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే పరిస్థితి ఉండబోదని అన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తొమ్మిది బిల్లులను సిద్ధం చేస్తోందని, ఇదే జరిగితే విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రై వేటు పరమయ్యే ప్రమాదముందన్నారు. ఈసందర్భంగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి పరమేశ్వరరావు, ఉపాధ్యక్షులు శ్యాం సుందర్ రెడ్డి, సీహెచ్ మంజుల, కార్యదర్శులు బాలకష్ణ, సరస్వతి, ఉపాధ్యాయ పత్రిక సంపాదకులు జిలానీ, జిల్లా అధ్యక్షుడు కె. బసవ లింగారావు, ప్రధాన కార్యదర్శి ఎస్డీ చాంద్ బాషా, వివిధ జిల్లాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఏపీటీఎఫ్ విద్యా వైజ్ఞానిక రాష్ట్ర మహాసభలు
-
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీవీ ప్రసాద్ విమర్శించారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లాశాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్లు గడుస్తున్నా పీఆర్సీ, డీఏ బకాయిలు లేకుండా తాత్సారం చేయడం దారుణం అన్నారు. జిల్లా విద్యాశాఖ పీఎస్, ఏపీజీఎల్ఐ రిమ్స్‌లలో ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని లేకుంటే ఆయా కార్యాలయాల వద్ద ధర్నాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు శేఖర్ మాట్లాడారు. సీపీఎస్ రద్దుకు పర్యటనలు.. ఉద్యోగులను భూతంలా పట్టి పీడిస్తున్న సీపీఎస్ రద్దుకై జిల్లావ్యాప్తంగా పర్యటనలు చేసి ఎమ్మెల్యే, ఎంపీలకు వినతిపత్రాలిస్తామన్నారు. అలాగే ఈ విషయాన్ని శాసనసభలో తీర్మానం చేయాలన్న కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామన్నారు. 19న మైదుకూరు 21న బద్వేల్ , 23న రాజంపేట, 25న కడప నియోజకవర్గంలో పర్యటించి వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి పద్మజ, ఇతర నాయకులు వీరప్రసాద్, ఈశ్వరచంద్ర, వీరాంజులరెడ్డి, కాశీం, నాగిరెడ్డి, వెంకటసుబ్బయ్య, ఓబులేసు, వేంకటేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పాఠశాలల మూసివేత ప్రజా వ్యతిరేకం’
శ్రీకాకుళం: విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చూపి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను మూతవేయడం ప్రజా వ్యతిరేక చర్యగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సన్నశెట్టి రాజశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 5,690 ప్రాథమిక పాఠశాలల్లో 19 కంటే తక్కువగా విద్యార్థులున్నార న్న నెపంతో విద్యాశాఖ మూసివేత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. 4,102 ఆర్సీ నెంబరుతో ఈ నెల 13వ తేదీన పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శికి పాఠశాల విద్యా సంచాలకులు ప్రతిపాదనలను పంపడం పట్ల ఏపీటీఎఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. స్థానిక ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పాఠశాల విద్యలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత దశలతో మూడంచెలుగా సాగుతోందని, ప్రాథమికోన్నత దశను రద్దుచేసి రెండంచెల విధానంతో కొనసాగించాలన్న అధికారుల ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16వ తేదీన విద్యాశాఖ మంత్రితో నిర్వహించనున్న సమావేశంలో తమ వైఖరిని ఏపీటీఎఫ్ పక్షాన విరవించి బడుల మూతను నివారించే కృషిని సాగిస్తామన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ఎదుట అదే రోజు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ భాగస్వామ్య సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాకు తరలిరావాలని రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఏపీటీఎఫ్ జిల్లాశాఖ అధ్యక్షుడు టి.చలపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కవిటి పాపారావు, గురుగుబెల్లి బాలాజీరావు, వానా కామేశ్వరరావు, బి.నవీన్, బి.రవి, ఎం.తులసీరావు, పి.బాలాజీరావు, పి.అనంతరావు, జగన్నాథం, బోర వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలపై దశలవారీ పోరు
ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సదాశివరావు బొబ్బిలి రూరల్ : విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై దశలవారీ పోరుకు సిద్ధం కావాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.సదాశివరావు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీవో హోంలో బుధవారం ఏపీటీఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఏపీటీఎఫ్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా సదాశివరావు మాట్లాడుతూ ప్రభుత్వం సర్వీస్ రూల్స్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ఖాళీల భర్తీ ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా నేటివరకు నెరవేర్చలేదని చెప్పారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రారంభించి నాలుగేళ్లు అవుతున్నా అరకొరవసతులతో ఇబ్బంది పడుతున్నామన్నారు. పనిభారంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు మొక్కలు నాటించడం, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పడం సమంజసం కాదన్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలపై జనవరి 5, 6, 7తేదీలలో తాలూకా కేంద్రాల వద్ద, జనవరి 28న జిల్లా కేంద్రాల్లో, ఫిబ్రవరి రెండో వారం నుంచి విజయవాడలో నిరవధిక ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలల్లో పనిభారం, ఒత్తిడి తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు జేసీ రాజు, డి.వెంకటనాయుడు, బీకేఎం నాయుడు, ఎన్వీ పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారం కోరుతూ డీఈవో నిర్బంధం
ఖమ్మం, న్యూస్‌లైన్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో జిల్లా విద్యాశాఖాధికారి నిర్లక్ష్యం వహిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డిని కార్యాలయం గదిలో నిర్బంధించారు. సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చే వరకు కార్యాలయం నుంచి బయటకు వెళ్లనిచ్చేది లేదని గదిబయట ఉపాధ్యాయులు బైఠాయించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల కేడర్ వారీగా సీనియారిటీ లిస్టు ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలవారీ పదోన్నతులు నిర్వహించడంలేదని ఆరోపించారు. ఉపాధ్యాయ రిటైర్మెంట్ కేలండర్‌ను విడుదల చేయకుండా విద్యాశాఖాధికారులు తాత్సారం చేస్తున్నారన్నారు. మెడికల్ బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని, డబ్బులు ఇస్తే కాని ఫైల్ కదిలే పరిస్థితి లేదని ఆరోపించారు. ఖమ్మం నగరంలో ఎన్ఎస్పీ కాలనీలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు ఇంక్రిమెంట్ మంజూరులో జాప్యం చేస్తున్నారని, జీహెచ్ఎస్ రాజేంద్రనగర్‌లో పనిచేస్తున్న సునీతకు ఓడీ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా గార్లమండలం ఎస్జీటీ బి.విజయ్‌కుమార్ గ్యాప్ పిరియడ్ సెటిల్మెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో డీఈవోను కార్యాలయంనుంచి బయటకు వెళ్లనిచ్చేది లేదని ఉపాధ్యాయులు పట్టుపట్టారు. కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన డీఈవోను అడ్డుకున్నారు. అనంతరం ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహరరాజు డీఈవోతో చర్చలు జరిపారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. చివరకు ఈనెల 7వ తేదీన సంఘాల నాయకులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని డీఈవో హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు శాంతించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు జనార్దన్‌రాజు, రవికుమార్, ఆదినారాయణ, శేషగిరిరావు, ఎ.వెంకటేశ్వర్లు, శేఖర్‌రావు, వీరబాబు, మహేష్, రామనాధం, జగదీష్, గోపాలరావు, సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.