ఖమ్మం, న్యూస్‌లైన్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో జిల్లా విద్యాశాఖాధికారి నిర్లక్ష్యం వహిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డిని కార్యాలయం గదిలో నిర్బంధించారు. సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చే వరకు కార్యాలయం నుంచి బయటకు వెళ్లనిచ్చేది లేదని గదిబయట ఉపాధ్యాయులు బైఠాయించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల కేడర్ వారీగా సీనియారిటీ లిస్టు ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలవారీ పదోన్నతులు నిర్వహించడంలేదని ఆరోపించారు. ఉపాధ్యాయ రిటైర్‌మెంట్ కేలండర్‌ను విడుదల చేయకుండా విద్యాశాఖాధికారులు తాత్సారం చేస్తున్నారన్నారు. మెడికల్ బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని, డబ్బులు ఇస్తే కాని ఫైల్ కదిలే పరిస్థితి లేదని ఆరోపించారు.
ఖమ్మం నగరంలో ఎన్‌ఎస్‌పీ కాలనీలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు ఇంక్రిమెంట్ మంజూరులో జాప్యం చేస్తున్నారని, జీహెచ్‌ఎస్ రాజేంద్రనగర్‌లో పనిచేస్తున్న సునీతకు ఓడీ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా గార్లమండలం ఎస్‌జీటీ బి.విజయ్‌కుమార్ గ్యాప్ పిరియడ్ సెటిల్‌మెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో డీఈవోను కార్యాలయంనుంచి బయటకు వెళ్లనిచ్చేది లేదని ఉపాధ్యాయులు పట్టుపట్టారు. కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన డీఈవోను అడ్డుకున్నారు. అనంతరం ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహరరాజు డీఈవోతో చర్చలు జరిపారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. చివరకు ఈనెల 7వ తేదీన సంఘాల నాయకులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని డీఈవో హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు శాంతించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు జనార్దన్‌రాజు, రవికుమార్, ఆదినారాయణ, శేషగిరిరావు, ఎ.వెంకటేశ్వర్లు, శేఖర్‌రావు, వీరబాబు, మహేష్, రామనాధం, జగదీష్, గోపాలరావు, సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోరుతూ డీఈవో నిర్బంధం
Published Sat, Jan 4 2014 5:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement