విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై దశలవారీ పోరుకు సిద్ధం కావాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.సదాశివరావు పిలుపునిచ్చారు.
ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సదాశివరావు
బొబ్బిలి రూరల్ : విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై దశలవారీ పోరుకు సిద్ధం కావాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.సదాశివరావు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీవో హోంలో బుధవారం ఏపీటీఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఏపీటీఎఫ్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా సదాశివరావు మాట్లాడుతూ ప్రభుత్వం సర్వీస్ రూల్స్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ఖాళీల భర్తీ ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా నేటివరకు నెరవేర్చలేదని చెప్పారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రారంభించి నాలుగేళ్లు అవుతున్నా అరకొరవసతులతో ఇబ్బంది పడుతున్నామన్నారు.
పనిభారంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు మొక్కలు నాటించడం, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పడం సమంజసం కాదన్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలపై జనవరి 5, 6, 7తేదీలలో తాలూకా కేంద్రాల వద్ద, జనవరి 28న జిల్లా కేంద్రాల్లో, ఫిబ్రవరి రెండో వారం నుంచి విజయవాడలో నిరవధిక ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలల్లో పనిభారం, ఒత్తిడి తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు జేసీ రాజు, డి.వెంకటనాయుడు, బీకేఎం నాయుడు, ఎన్‌వీ పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.