మూడొందల ఏళ్లుగా సంగీతాన్ని పలికిస్తున్న బొబ్బిలి వీణలు
అంతర్జాతీయంగా భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న విపంచి
అమెరికా మాజీ ప్రధాని బిల్‌క్లింటన్ మెచి్చన వీణ కూడా ఇదే
తాజాగా అంబానీ ఇంట వివాహ వేడుకల్లో మెరిసిన వీణ
సాక్షి, అమరావతి: తెలుగునాట వీణ అంటే అంతా బొబ్బిలి వైపే చూస్తారు. అక్కడ తయారయ్యే వీణల ప్రత్యేకత అలాంటిది మరి. వీణ ధ్వని, స్పష్టత ఎక్కువగా ఉండేలా తీగలు నిర్మించడం వల్ల బొబ్బిలి వీణలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. తంజావూరు లాంటి సంప్రదాయ వీణల తయారీకి మూడు రకాల చెక్కలు వినియోగిస్తే.. బొబ్బిలి వీణలను పనస చెక్కలతో రూపొందించడం మరో ప్రత్యేకత.
ఇవన్నీ కలగలిపి బొబ్బిలి వీణలకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ మహోత్సవంలో తెలుగు వీణాగానం అలరించింది. వీణా విద్వాంసురాలు శ్రీవాణికి దక్కిన అరుదైన గౌరవంతో మరోసారి దేశవ్యాప్తంగా బొబ్బిలి వీణపై చర్చ మొదలైంది.
ఇదీ ప్రస్థానం..
17వ శతాబ్దంలో బొబ్బిలి రాజ్య వ్యవస్థాపకుడైన పెద్దరాయుడికి కళలపై ఉన్న మక్కువ బొబ్బిలిలో వీణల తయారీకి బీజం వేసిందని చెబుతారు. తన సంస్థానంలో సిద్ధహస్తులైన ఇద్దరు వడ్రంగులను మైసూరు పంపించి.. అక్కడి వీణల తయారీ నేర్చుకోవాలని పెద్దరాయుడు సూచించారు. ఆయన సూచనలతో అక్కడికి వెళ్లి వచి్చన వారితో బొబ్బిలి వీణల తయారీ మొదలైంది. నాటి మైసూరు సంస్థానంలోని తంజావూరులో ఈ వీణల తయారీ గురించి తెలుసుకున్న సర్వసిద్ధి అచ్చెన్న బొబ్బిలి తిరిగి వచ్చాక ఇక్కడ తయారుచేసిన వీణలు మంచి ఆదరణ పొందాయి.
ఆ వీణల వాయిద్యం నేర్చుకుని బొబ్బిలి రాజులు ఎంతో మురిసిపోయినట్టు చెబుతారు. ఆ తర్వాత విజయనగర ఆస్థానం సహా అనేక మంది రాజులు కూడా బొబ్బిలి వీణల కొనుగోలుకు సిద్ధం కావడంతో ఆదరణ పెరిగింది. క్రమంగా బొబ్బిలి వీణలకు దేశవ్యాప్త గుర్తింపు వచి్చంది. ఈమని శంకర శాస్త్రి వంటి ఎందరో వైణిక విద్వాంసులు బొబ్బిలి వీణలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. వీణావాదన సంగీత ద్వయం వాసా కృష్ణమూర్తి, వాసా సాంబమూర్తి 1850 ప్రాంతంలో బొబ్బిలి వీణలపైనే వాయించడం ద్వారా వాటికి వన్నెతెచ్చారు.
ఇప్పటికీ 40 మంది తయారీదారులు
విజయనగరం జిల్లా బొబ్బిలిలోని గొల్లపల్లి వీణల కేంద్రంలో సర్వసిద్ధి వర్గానికి చెందిన దా దాపు 40 మంది కళాకారులు వీణలను తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు పలు పుణ్యక్షేత్రాలకు వందల సంఖ్యలో వీణలు సరఫరా అవుతుంటాయి. లేపాక్షి సంస్థ వీణలు కొనుగోలు చేసి పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయిస్తోంది. దాదాపు 14 రకాల ఆకారాలతో గిఫ్ట్ వీణలను కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. నూజివీడులోనూ వీణలు తయారు చేస్తున్నారు. 120 ఏళ్లుగా వంశపారం పర్యంగా నూజివీడు వీణ ఆదరణ పొందుతోంది.
అధికారిక పర్యటనలకు వచ్చే ఉన్నతాధికారులు, ప్రముఖులకు, కళాకారులకు, ప్రజా ప్రతినిధులకు జ్ఞాపికగా ఇచ్చేందుకు వీణను వినియోగిస్తున్నారు. అలా 2000 సంవత్సరంలో మన రాష్ట్రానికి వచి్చన అప్పటి అమెరికా ప్రధాని బిల్ క్లింటన్ బొబ్బిలి వీణల తయారీ గురించి తెలుసుకుని అచ్చెరువొందారు. వీణల తయారీలో ఉత్తమ వృత్తి కళాకారునిగా రాష్ట్రపతి అవార్డు అందుకున్న సర్వసిద్ది వీరన్నను వైట్‌హౌస్‌కు రావలసిందిగా ఆహా్వనించారు. ఎంతో చరిత్ర కలిగిన బొబ్బిలి వీణకు 1980లో జాతీయ అవార్డు లభించగా.. 2011లో జియోగ్రాఫికల్ గుర్తింపు లభించింది.
ఎన్నో ప్రత్యేకతల సమాహారం
వీణ ప్రముఖంగా కర్ణాటక సంగీత కచేరీలలో వినియోగిస్తారు. దీనిని ఉత్తరాదిన రుద్రవీణగా.. దక్షిణాదిలో సరస్వతీ వీణగా.. మధ్య భారతంలో విచిత్ర వీణగా పిలుచుకుంటారు. వీణలో ముఖ్యంగా కుండ, దండి, యాళి (పౌరాణిక జంతువు మెడ ఆకారం), సొరకాయ బుర్ర అనే భాగాలుంటాయి. వీణల్లో చాలా రకాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో తయారమ్యే సరస్వతి వీణ, మయూరీ వీణ, మీరా వీణ, డ్రాగన్ వీణ, విపంచి వీణ, శంఖం వీణ, గోటు వీణ, మధుర వీణ, మశ్చ వీణ ప్రసిద్ది చెందాయి.
పనస చెట్టు కర్ర వీణసారె వీణ తయారీలో ప్రధానమైన భాగం. ఇది తేలికగా ఉండటమే కాకుండా మంచి ధ్వని పలికిస్తుంది. దృఢత్వం, మన్నిక, తేమని తట్టుకోగలగడం వల్ల దీన్ని విరివిగా వాడతారు. మైసూరు, తంజావూరు వీణలను మూడు కొయ్య ముక్కలను కలిపి తయారు చేసేవారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఏకాండీ కొయ్యముక్క (ఒకే చెక్క ప్రత్యామ్నాయ బొబ్బిలి వీణ ముక్క) తోనే వీణను తయారు చేస్తారు.
గిట్టుబాటు కావడం లేదు
ప్రస్తుత వీణల ధరలు గిట్టుబాటు కావడం లేదు. కలప, ఇతర ముడి సరుకుల ధరలు బాగా పెరిగాయి. వీణల ధరలు పెంచేందుకు హస్తకళల అభివృద్ధి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. అక్కడి నుంచి అనుమతులు వస్తే పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – ఎస్.రామకృష్ణ, బొబ్బిలి వీణల కేంద్రం ఇన్‌చార్జి
కలప కొరత వేధిస్తోంది
వీణల తయారీకి వాడే పనస కలపకు గిరాకీ ఎక్కువగా ఉంది. పనస కలప అయితేనే వీణలు నచి్చన ఆకృతుల్లో తయారు చేసేందుకు అనువుగా ఉంటాయి. మా కళాకారులందరికీ ప్రభుత్వం కలపను సబ్సిడీపై సరఫరా చేయాలి. – పెదపాటి కిరణ్, వీణల తయారీదారు
ఏడాదంతా పని దొరుకుతోంది
వీణల కేంద్రంలో మాకు గౌరవప్రదమైన పని ఏడాది పొడవునా దొరుకుతోంది. విశ్వవ్యాప్తమైన బొబ్బిలి వీణల కళాకారులుగా మంచి పేరు పొందడం ఆనందంగా ఉంది. – సర్వసిద్ధి చైతన్య, వీణల తయారీదారు
Comments
Please login to add a commentAdd a comment