సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన 20 సభ్యదేశాల శిఖరాగ్ర సమావేశాల్లో బొబ్బిలి వీణ వైభవాన్ని చాటుకోనుంది. విశాఖలో ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న జీ–20 సదస్సుకు వివిధ దేశాల నుంచి హాజరయ్యే అతిథులను గౌరవించేందుకు 200 బొబ్బిలి వీణలను అధికారులు ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు.
కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆయన చేతుల మీదుగా వీటిని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖలో ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు దేశం నలుమూలల నుంచి హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు, ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బొబ్బిలి వీణలను బహూకరించారు.
బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి ఇంటిపేరు గల కుటుంబీకులే దశాబ్దాలుగా బొబ్బిలి వీణలను తయారుచేస్తూ వస్తున్నారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా 1994వ సంవత్సరంలో సొసైటీని ఏర్పాటు చేసింది. 2002లో బొబ్బిలి పట్ణణ పరిధిలోని గొల్లపల్లిలో వీణల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది
వీణల తయారీయే ఆధారంగా ఉన్న మా కళాకారులకు టీటీడీతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంలో 200 వీణలను తయారుచేసి అందించాం. అతిథుల కోసం మా వీణలతో కచేరీ కూడా ఏర్పాటు చేయించారు. ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న మరో ప్రతిష్టాత్మక సదస్సు జీ–20 కోసం కూడా 200 వీణలకు ఆర్డర్ వచ్చింది. – సర్వసిద్ధి రామకృష్ణ, ఇన్‌చార్జి, బొబ్బిలి వీణల కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment