
మనపై ప్రపంచ దేశాలకు ఎన్నో ఆశలు, ఆకాంక్షలున్నాయి
పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని మోదీ వెల్లడి
భోపాల్: భారతదేశ ఆర్థిక ప్రగతి పట్ల ప్రపంచం మొత్తం ఎంతో ఆశాభావంతో ఉందని, ఇలాంటి పరిణామం మన దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత్ నుంచి సామాన్య ప్రజలతోపాటు ఆర్థికవేత్తలు, ప్రపంచ దేశాలు, సంస్థలు ఎంతో ఆశిస్తున్నాయని అన్నారు. మనపై ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నాయని తెలిపారు. సోమవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ‘ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్–గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2025’లో ప్రధాని మోదీ మాట్లాడారు.
ప్రపంచం భవిష్యత్తు భారత్‌లో ఉందనడంలో సందేహం లేదన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇండియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచబ్యాంక్ సైతం ఆశాభావం వ్యక్తం చేసిందని గుర్తుచేశారు.
‘సోలార్ పవర్‌లో ఇండియా సూపర్ పవర్’ అని వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి సంస్థ ప్రశంసించిందని తెలిపారు. చాలా దేశాలు కేవలం మాటలకు పరిమితం అవుతుండగా, ఇండియా మాత్రం కార్యరంగంలోకి దిగి, ఫలితాలు సాధించి చూపుతోందని స్పష్టంచేశారు. అంతర్జాతీయంగా ఏరోస్పేస్ సంస్థలకు మన దేశమే అతిపెద్ద సరఫరాదారుగా మారిందన్నారు. రాబోయే కొన్నేళ్లలో టెక్స్‌టైల్, టూరిజం, టెక్నాలజీ వంటి రంగాల్లో యువతకు కోట్లాది ఉద్యోగాలు దక్కబోతున్నాయని వివరించారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో దూసుకెళ్తున్నాం
గత దశాబ్ద కాలంలో ఇంధన రంగంలో మునుపెన్నడూ లేని ప్రగతి సాధించామని ప్రధానమంత్రి మోదీ వివరించారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో ముందుకు దూసుకెళ్తున్నామని చెప్పారు. పదేళ్లలో పునరుత్పాదక ఇంధన రంగంలో 70 బిలియన్ డాలర్ల(రూ.6 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చాయన్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో గత ఏడాది 10 లక్షలకుపైగా ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో పెట్టుబడులకు అద్బుతమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వీటిని సది్వనియోగం చేసుకోవాలని దేశ విదేశీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలో మధ్యప్రదేశ్ ముందంజలో ఉందని తెలిపారు. రాష్ట్రం అతిపెద్ద తయారీ కేంద్రంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి వివరించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన 18 నూతన విధాన నిర్ణయాలను మోదీ ఆవిష్కరించారు.
విద్యార్థుల కోసమే
ఆలస్యంగా వచ్చా భోపాల్‌లో పెట్టుబడిదారుల సదస్సుకు ప్రధాని మోదీ కొంత ఆలస్యంగా హాజరయ్యారు. దీనిపై ఆయన సదస్సులో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ఈ రోజు పది, పన్నెండో తరగతుల విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయని చెప్పారు. రాజ్‌భవన్ నుంచి తాను బయలుదేరే సమయానికే వారు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉందని తెలిపారు. తాను బయటకు వస్తే రోడ్లపై ట్రాఫిక్ నిలిపివేస్తారు కాబట్టి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో దాదాపు 15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరానని వెల్లడించారు. తన వల్ల విద్యార్థులు నష్టపోవడాన్ని తాను భరించలేనన్నారు. వారు సరైన సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment